28, ఫిబ్రవరి 2023, మంగళవారం

కళ్ళల్లో ఒక వెన్నల....(సీరియల్)...(PART-3)

 

                                                                           కళ్ళల్లో ఒక వెన్నల....(సీరియల్)                                                                                                                                                              (PART-3)

పెద్ద పొట్టతో తన ముందు కూర్చోనున్న ఆమెకు బ్లడ్ ప్రషర్ పరీక్షిస్తోంది వైష్ణవీ. ఏటో చూస్తూ కూర్చోనుంది ఆమె. కళ్ళు నీరసించి పోయుండగా  -- ఎండిపోయిన దేహమూ, విచారంతో ఉన్న ఆమె ముఖం…ఆమెను చూడటానికి మనసు బాధపడింది.

“స్వేతా!”

“అమ్మా...”

“నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా?” -- జాలిగా అడిగిన వైష్ణవీను చూసి విరక్తిగా నవ్వింది ఆమె.

“ఆయనేమన్నా తప్పి పోయారా ఏమిటి? వదిలేసి పారిపోయినతను...ఎలాగమ్మా కనబడతాడు”

“ఏమిటీ?”

“అతను రాడమ్మా. రానే రాడు. వెనకబడి, వెనకబడి ఇష్టపడ్డాడమ్మా. నేనొక పిచ్చిదాన్ని! వాడు ఇష్టపడింది ఈ శరీరాన్ని అని అర్ధం చేసుకోక...నన్ను కన్నవారిని -- తోడబుట్టిన వాళ్ళనూ ఏడిపించి...అతన్ని నమ్మి వచ్చాసాను”

“ఏమిటి స్వేతా! నీలాంటి అమ్మాయలు తెలిసే ఇలాంటి తప్పు చెయొచ్చా?”

“తప్పేనమ్మా! అతని మీదున్న గుడ్డి నమ్మకం, మిగిలిన వాటిని మరిచిపోయేటట్టు  చేసింది. అతనికి నేను విసుగెత్తిపోయాను. వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు. నేనిలా కడుపులో భారంతో...జీవించటానికీ దారి తెలియక...చనిపోనూ లేక...మధ్య రోడ్డులో నిలబడున్నాను” -- ఆమె మొహాన్ని మూసుకుని ఏడవటంతో, వైష్ణవీ కళ్ళు చెమ్మగిల్లినై.

స్వేతా ముఖాన్ని జాలిగా ముట్టుకుంది. “షు! ఏడవకూడదు. ఇలా నువ్వు ఏడిస్తే...అది నీ బిడ్డనే బాధపెడుతుంది. ఏడవకమ్మా”

“నర్సమ్మా! నాకు...ఒక సహాయం చేస్తారా?”

“ఏం చేయాలి...చెప్పు!”

“దీన్ని ఇకపై...ఏం చేయలేమా అమ్మా?” -- తన కడుపు ముట్టుకుని చూపించి ఆమె అడగ -- తల్లడిల్లిపోయింది వైష్ణవీ.

“ఏయ్! ఏమిటా మాటలు?”

“నాకు ఇది వద్దమ్మా. ఇది వద్దు”

“అయ్యో! ఏమిటిది? ఇన్ని రోజులు లేనిది...ఇప్పుడేమిటి...?”

“నేను ఈ రోజు వస్తాడు...రేపొస్తాడు అని ఏదో నమ్మకంతో కాచుకోనున్నాను.  కానీ... అతను ఇక రాడు”

“ఏం?”

“వాడు...ఇంకో పెళ్ళి చేసుకున్నాడట” -- స్వేతా వెక్కి వెక్కి ఏడవగా, ఆశ్చర్యపోయింది వైష్ణవీ.

“స్వేతా! ఏం చెబుతున్నావు?”

“అవునమ్మా! ఇక మీదట వాడ్ని వెతక కూడదట. పెళ్ళి చేసుకుని, కొత్త భార్యతో వేరే ఊరికి వెళ్ళిపోయాడట”

“ఇదంతా నీకు చెప్పింది ఎవరు?”

“అతని స్నేహితుడు. నా పెళ్ళప్పుడు కూడా అతను ఉన్నాడు”

“అవునూ! మీ పెళ్ళి ఏ రిజిస్టర్ ఆఫీసులో జరిగింది?”

“అక్కడకంతా పిలుచుకు వెళ్లలేదమ్మా. రోడ్డు అంచులో ఉన్న వినాయకుడి గుడిలోకి తీసుకు వెళ్ళి తాళి కట్టాడు”

“ఏమిటి స్వేతా...ఇలానా మోసపోయేది?”

“లేదమ్మా! నేనూ అడిగాను. దానికి అతను చెప్పాడు ‘ఇంట్లో అన్నయ్యను ఉంచుకుని నేను పెళ్ళి చేసుకుని వెళ్ళి నిలబడితే మనల్ని ఎలా ఇంట్లో చేరుస్తారు? అందుకని అన్నయ్యకు పెళ్ళి జరిగేంతవరకు ఓర్చుకో. ఆ తరువాత ఇంట్లో చెప్పి, ఊరంతా పిలిచి గొప్పగా పెళ్ళి చేసుకుందాం’ అని చెప్పాడు”

“ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకు పెళ్ళి జరిగిందా?”

“తెలీదమ్మా! ఇతను వెళ్ళిపోయి నాలుగు నెలలు దాటిందమ్మా”

“నర్సమ్మా! చాలా సేపటి నుంచి కూర్చోనున్నాం? సూది వేసి పంపమ్మా” -- గదికి బయట నుండి మాట వినబడ, స్వేతాకి వేయాల్సిన టీకాను తీసింది వైష్ణవీ.

“చీరను కిందకు దించు స్వేతా! సూదివేయాలి” అంటూ మందు నింపుకుని దూదితో వచ్చింది. సూది వేసి దూదితో నొక్కింది.

“ఇలా చూడు స్వేతా! అనవసరమైన ఆలొచనలతో నీ మనసును పాడుచేసుకోకు. ఇప్పుడు మాట్లాడటానికి నాకు టైము లేదు. వచ్చే బుధవారం మళ్ళీ చెక్ అప్ కు రా. మాట్లాడదాం...సరేనా?”

“దీన్ని ఏమీ చేయలేమామ్మా?”

“ఇప్పుడు ఏడోనెల. బిడ్డ పూర్తి రూపం వచ్చేసింది. ఇప్పుడుపోయి...ఇలా అడగొచ్చా? ఇది నీ బిడ్డ స్వేతా”

“ఆ చండాలుడి విత్తనమేమ్మా”

“నీ రక్తం, ప్రాణం కలిపి పుట్టబోయే బిడ్డ! నీకు లాగానే ఉంటుంది”

“వద్దమ్మా! నాకులాగా మోసపోయే గుణంతో పుట్టి, కష్టపడకూడదు. నా కష్టం నాతోనే పోనీ. ఇది నాకు వద్దు”

“సరే...సరే. ఏడవకు. ఇప్పుడింటికెళ్ళు. వచ్చేవారం ఒక పన్నెండు గంటలకు రా. సావకాసంగా మాట్లాడుకుందాం”

“సరేనమ్మా”

“తరువాత....నీ భర్తా, నువ్వూ తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా?”

“పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో ఉన్నదమ్మా”

“అది కూడా తీసుకురా”

“దేనికమ్మా?”

“నేనూ తెలిసిన చోట వెతుకుతాను”

“ఇక ఇప్పుడు వెతికి ప్రయోజనం ఏంటమ్మా?”

“మొదట వాడు దొరకనీ. తరువాత ఏం చేయాలని ఆలొచిద్దాం. మర్చిపోకుండా ఫోటో తీసుకురా”

“సరేనమ్మా” -- చీరను సరిచేసుకుంటూ స్వేతా బయటకు వెళ్ళిపోగా తన పనిలో లీనమైపోయింది వైష్ణవీ. లంచ్ టైము వరకు కూర్చోటానికి కూడా  సమయంలేనంతగా పని.

ఎంతోమంది పేషెంట్లు...రకరకాల వ్యాధులు! పిల్లలూ, పెద్దవాళ్ళూ, మగవాళ్ళూ, ఆడవాళ్ళూ అంటూ ఎవరినీ వదిలిపెట్టని వ్యాధులు.

పేషంట్లతోనూ, మందు -- మాత్రలతోనూ పొర్లి, మధ్యాహ్నం రెండు గంటలకు పైన రెస్టు దొరికింది...కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కుని లంచ్ బాక్స్ తీసుకున్నప్పుడు, మేడ మీద నుండి ఇద్దరు నర్సులు పరిగెత్తుకు వచ్చారు.

“సిస్టర్! డాక్టర్  వెళ్ళిపోయారా?”

“ఇప్పుడే వెళ్ళారు. ఏమైంది?”

“నిన్న సాయంత్రం ఒకమ్మాయికి బిడ్డ పుట్టిందే. పేషంట్ పేరు కూడా  కామాక్షి”

“అవును! ఆమెకేమిటిప్పుడు?”

“బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది”

“ఏమిటీ?” -- హడావిడిగా లేచింది వైష్ణవీ.

“అవును సిస్టర్! బాత్ రూముకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళి, రెండు గంటలయ్యింది. తిరిగి రాలేదు. బిడ్డ బాగా ఏడుస్తోంది సిస్టర్”

“భగవంతుడా” -- లంచ్ ను అలాగే పెట్టేసి, మేడపైకి పరిగెత్తింది. మొదటి అంతస్తు పూర్తిగా ప్రసూతి వార్డు. కొత్తగా ఈ భూమి మీదకు వచ్చి దిగిన చిన్న జీవులు తల్లి ఒడులలోనూ, చేతులలోనూ సుఖంగా ఒదిగుంటే...ఆ ఒక్క బిడ్డ మాత్రం కొట్టుకుంటోంది. ఏడ్చి, ఏడ్చి గొంతు ఎండిపోవటం వలన స్వరం పూర్తిగా సన్నబోయింది.

ఒళ్ళూ, మనసూ కంపించ పరిగెత్తుకు వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుంది వైష్ణవీ. పుట్టి ఒకరోజు కూడా అవని లేత బిడ్డ. బరువు చాలా తక్కువగా ఉన్న ఆ బిడ్డ కొమ్మలు, కొమ్మలుగా ఉన్న కాళ్ళనూ, చేతులనూ ఆడిస్తూ అది ఏడుస్తున్న విధం గుండెను పిండేసింది.

“ఏమ్మా! ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది? ఏదైనా చెప్పి వెళ్ళిందా?” -- దగ్గరున్న మహిళ దగ్గర అడిగింది.

“బాత్ రూమ్’ వెళ్తున్నానమ్మా అని చెప్పింది. రానేలేదు. పాపం! బిడ్డ ఒక గంటసేపటి నుండి ఏడుస్తోంది”

“ఏమిటీ...ఒక గంటసేపటి నుంచా? అయ్యో! గొంతు ఎండి పోయుంటుందే...ఏమ్మా! ఎవరైనా ఒకళ్ళు ఈ బిడ్డకు పాలివ్వండమ్మా” -- అన్న వెంటనే వార్డు మొత్తం గప్ చిప్.

ఒకళ్ళ దగ్గర నుండీ సమాధానం లేదు

ముప్పై తల్లులు ఉండీ, ఒక్కరూ పాలు ఇవ్వాటానికి ముందుకు రాలేదు. బిడ్డ అరుపులు మాత్రం వినబడుతూ ఉండటంతో, బాధగా లేచింది.

దగ్గర నిలబడ్డ మరో నర్సును పిలిచింది. “గాయిత్రీ సిస్టర్! మెడికల్స్ కు వెళ్ళి ఒక పాల డబ్బా కొనుక్కురండి...త్వరగా”

“నర్సమ్మా! బిడ్డను ఇలా ఇవ్వండి” అన్న స్వరం వచ్చిన దిక్కు వైపు తిరిగింది. నేల తుడిచే పనిమనిషి నిలబడుంది.

“మంగమ్మా...”

“పాల డబ్బా కొనుకొచ్చి, అది కలిపి ఇచ్చేలోపు, బిడ్డకు శ్వాస అడ్డుపడుతుంది. ఇవ్వండమ్మా! నేనూ బిడ్డను కన్న దానినేగా?” -- అన్న మనిషి దగ్గర నీరు నిండిన కళ్ళతో బిడ్డను జాపింది.

మంగమ్మ నేలమీద కూర్చుని బిడ్డ ఆకలితీర్చ, ఖాలీగా ఉన్న మంచం మీద కూర్చుని నెత్తిమీద చేతులు పెట్టుకుంది వైష్ణవీ. కళ్ళవెంట ధారగా కన్నీరు.

‘గత రెండేళ్ళలో ఇది పదిహేడో బిడ్డ. అదెలా? పదినెలలు మోసి, విపరీతమైన నెప్పులు భరిస్తూ కని, ఇలా అనాధలాగా పడేసి వెళ్ళిపోతున్నారు? ఎలా కుదురుతోంది వీళ్ళ వల్ల..?’

బిడ్డ భాగ్యం లేదేనని బాధపడి, వ్రతాలు ఉండి గుడులూ, గోపురాలు చుట్టూ తిరుగుతున్న వాళ్ళ కడుపును పండించటం లేదు ఈ దేవుడు!

కానీ, కన్న బిడ్డలనే చెత్త కుప్పలాగా ఎత్తి పారేస్తున్న వారికేమో అడగకుండానే ఇస్తున్నాడే! ఇది ఏం న్యాయం?

కొద్ది క్షణాల సుఖానికి బానిసైపోయి, తప్పు దోవలో వెళ్ళి దానికైన గుర్తును అనాధలాగా ఏడిపించి వదిలేసి వెళ్ళిపోతున్నారే! పుట్టింది ఆడపిల్ల అని వెళ్ళిపోయిందా? లేక ఆమె చేసిన తప్పుకు సాక్ష్యం దొరకకూడదని తప్పించుకు పోతున్నారా?

ఎందుకని పారిపోయావు అమ్మాయ్! మీలాంటి అమ్మాయల వలన మహిళా జాతే తల వంచుకుంటోందే!

ఆడవారే దేవుడంటూ, ఓర్పులో భూదేవి అంటూ చెబుతారే! మరి ఈ రోజు ఎందుకింత దుఃఖము, వ్యథ? ఇక ఈ బిడ్డ గతి? ఎప్పుడూ లాగానే ఆశ్రమంలో అప్పగించబడుతుంది.

స్వయం కట్టుబాటు లేని ఆడదానికీ, నయవంచక మగవాడికి పుట్టిందనే ఒక కారణం కోసం...జీవితాంతం ఈ బిడ్డ అనాధ అనే బిరుదు మోసుకుంటూ జీవించే కావాలి.

దీనివల్ల మనసుగాయపడ్డ ఎందరు బిడ్డలు నేరస్తులుగా మారారో? వాళ్ళ మనో పరిస్థితి చెడిపోతుందే? దీన్నెందుకు ఎవరూ ఆలొచించరు?’

“నర్సమ్మా! ఇదిగోండి” -- మంగమ్మ జాపిన బిడ్డను చేతులు వణక తీసుకుంది. ఎక్కువసేపు ఏడ్చిన అలసటతో - కడుపు నిండిన తృప్తితో -- బద్రతైన చేతొల్లో ఉన్నామనే నమ్మకంతో -- బిడ్డ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది.

మధ్య మధ్య ఆ బిడ్డ ఎద చిన్నగా వెక్కటంతో, అది ఎంతసేపు ఏడ్చిందో నన్నది గుర్తుకు వచ్చి మళ్ళీ కన్నీళ్ళూ పెట్టుకుంది వైష్ణవీ.

ఇంతలో ఛీఫ్ డాక్టర్ కు సమాచారం అందింది. ఆయన ద్వారా మామూలుగా వచ్చే పోలీసు శాఖ, అనాధ ఆశ్రమ నిర్వాహి వచ్చే చేరినా, బిడ్డను తన ఒడిలో నుండి దింపనే లేదు వైష్ణవీ.  

ఎప్పుడూ చేసే విచారణ పూర్తి చేసారు. కొన్ని కాగితాలలో సంతకం పెట్టి -- పోలీసు అధికారితో, అనాధ ఆశ్రమం యొక్క మహిళ వైష్ణవీ దగ్గరగా వచ్చారు.

“ఎక్స్ క్యూజ్ మి సిస్టర్!”

“ఊ...” -- చటుక్కున తల ఎత్తింది. కళ్ళల్లో నీళ్ళతో నిలబడ్డ ఆమెను ఆశ్చర్యంగా చూసాడు ఇన్‌స్పెక్టర్ అశ్విన్.

అతన్ని మళ్ళీ చూడటంతో తుల్లిపడి మంచం నుండి కిందకు దిగింది వైష్ణవీ.

“ఏమైంది? ఎందుకు ఇంత కన్నీరు?” -- సన్నటి స్వరంతో అతను అడగ, జవాబు చెప్పలేక చేతిలో ఉన్న బిడ్డను చూపింది.

పుట్టిన కొద్ది నిమిషాలే అయిన బిడ్డను చూసి అతని మొహమూ వాడిపోయింది. తాను అనాధ అయిపోయాను అనేది తెలియక...చేతులను గట్టిగా మూసుకుని ఆ బిడ్డ నిద్రపోతున్న విధం అతని గుండెను అదిమింది.

గబుక్కున నిట్టూర్పు విడుస్తూనే కళ్ళతో సైగ చేసాడు.

“మ్యేడం! బిడ్డను తీసుకోండి”

“ఎస్ సార్! ఇవ్వండి సిస్టర్” -- ఆ మహిళ చేతులు జాప, నిరాకరించు మనసుతో చేతిలో ఉన్న బిడ్డను చూసింది. కళ్ళల్లో నీళ్ళు తిరగ పెదాలను కరుచుకుంటూ తనని తాను కట్టుబరచుకుంది.

నుదిటి మీద మెల్లగా ఒక ముద్దు పెట్టి, బిడ్డను ఇచ్చింది. మనసు నొప్పి పుట్టింది. గట్టిగా ఏడవాలనిపించింది.

ఎవరినీ తలెత్తి చూడకుండా వేగంగా బయటకు వచ్చి బయటవైపున్న రెస్ట్ రూముకు వెళ్ళి తలుపు వేసుకుంది.

ఆమె చేష్టలను చూసీ చూడనట్లు మామూలు ఫార్మాలిటీస్ ముగించుకుని, డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని, బయటకు వచ్చాడు అశ్విన్.

బయటకు వస్తున్నప్పుడు రెస్టు రూములో నుండి వైష్ణవీ ఏడుపు వినబడింది.

ఆ శబ్ధంలో అతని మనసు కూడా నొప్పి పుట్టింది.

                                                                                                        Continued...PART-4

***************************************************************************************************