దృశ్యం...(సీరియల్) PART-7
కాంచన వాళ్ళ అమ్మకు కూతుర్ని పోగొట్టుకున్న షాక్, నిజం ఏమిటో తెలియకపోవటం లాంటి క్షోభ లతో తల తిప్పటంతో ఆమె అలాగే పక్కకు ఒరిగింది.
ఆమె కొడుకు ఎల్లయ్య లబోదిబో మంటూ ఏడుపు మొదలెట్టాడు.
"అయ్యయ్యో...అమ్మా ఏమైందే నీకు?"
"తట్టుకోలేకపోతున్నానురా! నా కూతురే పోయిన తరువాత నేను బ్రితికుండి ఏం చేయను?"
“డాక్టర్ దగ్గరకు వెడదాం. రండి"
"వద్దమ్మా"
"రండి...నేను తీసుకు వెడతాను, ఎల్లయ్యా...నువ్వెళ్ళి ఆటో పిలుచుకురా"
ఐదు నిమిషాలలో ఆటో పిలుచుకు వచ్చాడు ఎల్లాయ్య.
కాంచన వాళ్ళమ్మను ఆటో ఎక్కించి ఎల్లయ్య, కమల ఇద్దరూ ఆటో ఎక్కారు.
ఆటో బయలుదేరింది.
“ఏంటమ్మా...ఏం చేస్తోంది?"
“కడుపులో తిప్పుతోంది. నావల్ల కావట్లేదు”
"క్లీనిక్ పక్కనే ఉన్నది...కొంచం ఓర్చుకోండి"
ఆటో కొంచం దూరం వెళ్ళి వెనక్కి తిరిగింది.
“ఏం...ఆటో వెళ్ళదా?"
“పారిశ్రామక వేత్త సాంబశివరావ్ గారి కొడుకు చక్రవర్తి పెళ్ళి వూరేగింపు క్రాస్ అవుతోంది”
ఆటో ఒక పక్కగా నిలబడింది.
“వేరే దార్లో వెళ్ళండి"
“మీరు చెప్పే క్లీనిక్ కి వేరే దారిలో వెడితే ఐదు కిలోమీటర్లు చుట్టాలి. నేను రానమ్మా.”
"ఎందుకలా మాట్లాడతారు...ఈమె పేషెంటు"
"చుట్టూ తిరిగి వెడితే మరో గంట పడుతుంది....కాసేపు వైట్ చేసి వెడితే పది నిమిషాలలో వెళ్ళిపోవచ్చు"
మొదట్లో నాలుగు గుర్రాలు తో ఒక బండి.
తరువాత బ్యాండు మేళం పార్టీ.
మధ్యలో బాణా సంచా పేల్చే బృందం.
ఆటోలో ఉన్న కాంచన తల్లి ఆ మోతలకు కళ్ళు తెరిచి కూర్చుంది.
“అమ్మా, ఇప్పుడు వూరేగింపుగా వస్తున్నారే...ఈ పెళ్ళికొడుకు యొక్క బిల్దింగులోని చివరి అంతస్తులోనే మన కాంచన హత్య చేయబడింది.”
“భగవంతుడా...!"
“వీళ్ళు కోటీశ్వరులమ్మా. ఎవరో చేసిన హత్యకొసం వీళ్ళు జవాబు చెప్పాల్సి వస్తోంది. ఒక పక్క పెళ్ళి."
“వీళ్ళ బిల్డింగులో ఎలా?"
“తెలియదమ్మా!"
“వీళ్ళకు కూడా అ హత్యలో భాగం ఉన్నదేమో?"
ఎల్లయ్య అడిగాడు.
“ఎలా ఎల్లయ్యా? వాళ్ళ బిల్డింగులో ఉంచి వాళ్ళే తప్పు చేస్తారా?"
వూరేగింపు వాళ్ళకు దగ్గరగా వచ్చింది!
“పెళ్ళికొడుకు అతనేనయ్యా! పేపర్లో కూడా ఫోటో వచ్చింది. వీళ్ళ బిల్డింగులోనే హత్య జరిగింది.
అందరూ అదేమాట!
“కారు వస్తోంది చూడు"
ఆటోలొ ఉన్న కాంచన తల్లి తప్ప ఆటో డ్రైవర్, ఎల్లయ్య, కమల బయటకు వచ్చి నిలబడ్డారు.
చక్రవర్తిని ఎక్కించుకుని వూరేగింపుగా వస్తున్న కారు…ఆటో దగ్గరకు వస్తోంది.
"పెళ్ళీకొడుకు...సినిమా హీరోలా ఉన్నాడయ్యా"
విమర్స.
అతన్ని గమనించిన కమల, చూపులను క్రిందకు దింపింది...అదే కారు!
అలంకరణ చేయబడ్డ విదేశీ కారు.
గుడ్లు పెద్దవి చేసి చూసింది కమల.
"ఎక్కడో చూసినట్లు ఉన్నదే?"....ఆలొచించ్చినప్పుడు ఉరుము మెరిసింది.
ఇదే కారులోనే ఒకరోజు కాంచన వీధి చివర్లో దిగింది!
ఖచ్చితంగా అదే కారు.....ఆ కారు దాటి వెళ్ళినప్పుడు పూర్తిగా చూసింది కమల.
అధిరిపడింది.
ఈ కారుకు యజమాని కోటీశ్వరడు చక్రవర్తా?
కాంచనకి, చక్రవర్తికి నా సంబంధం?
కాంచనకి అత్యంత ఖరీదైన బట్టలు, బ్యూటీ ప్రాడక్ట్స్ కొనిపెట్టింది చక్రవర్తా?
ఇతని బిల్డింగులొనే కాంచన హత్య చేయబడింది!
హత్యకు కారణం చక్రవర్తా?
మనసులో మంటలు చెలరేగినై!
ఈలోపు గుంపు కదిలి వెళ్ళిపోవటంతో రోడ్డు ఖాలీ అయ్యింది.
"రండమ్మా...!" ఆటో డ్రైవర్ పిలవటంతో కమల ఆటో ఎక్కింది.
డాక్టర్ పరిశోధన ముగిసింది.
"బీపీ బాగా ఎక్కువగా ఉంది.....ఇంజెక్షన్ చేస్తాను, మందులు ఇస్తాను. రేపొకసారి తీసుకు రండి...అప్పుడు కూడా బీ.పీ ఇలాగే ఉంటే అడ్మిట్ చేద్దాం”
అన్నిటికీ కమలానే డబ్బులు ఖర్చుపెట్టింది.
ఇంటికి వచ్చాశారు..... చెయ్యి పట్టుకుని కాంచన తల్లిని పడుకోబెట్టింది కమల.
కమల తట్టుకోలేకపోతోంది.
అక్కడ బస చేస్తున్న మిగిలిన ఆడపిల్లలు డ్యూటి ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు.
ఎల్లయ్య కమల దగ్గరకు వచ్చి "నేను రేపు ప్రొద్దున వస్తాను కమలా" అన్నాడు.
"ఎక్కడుంటారు?"........
"నా స్నేహితుడు ఒకడున్నాడు. బజార్ వీధిలోని నీలిమా మెడికల్స్ లో పనిచేస్తున్నాడు. వాడ్ని కలిసి వాడితో ఉంటా. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి"
ఆమెకు భోజనం పెట్టి, మందులు ఇచ్చి పడుకోబెట్టి బయటకు వచ్చింది కమల.
హంతకుడు చక్రవర్తేనా? అదే కారు...అతని బిల్డింగులో హత్య....ధనవంతుడు!
పోలీసులు అనుమాన పడుతున్నది కూడా ధనవంతుడినే కదా!......తెలిసి చెప్పకుండా ఉండొచ్చా?
నన్ను పట్టుకుంటే? గుచ్చి గుచ్చి అడుగుతారే పోలీసులు?
అందుకని ఒక నిజం తెలిసుండి మౌనంగా ఉండటం న్యాయమా?
హత్యచేయబడ్డది ఒక ఆడపిల్ల...కాంచన...నా స్నేహితురాలు..
కష్టాల్లో పడబోయేది చక్రవర్తిని పెళ్ళి చేసుకోబోతున్న ఒక ఆడది.
ఇద్దరు ఆడువారి కష్టాలను తెలిసున్న నేను ఒక మహిళనై ఉండి మౌనంగా ఉండొచ్చా?.....అది మహిళా లోకానికే నేను చేస్తున్న ద్రోహం కాదా?
కమల మదిలో ఏన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కారు, బిల్డింగు కారణంగా పెట్టుకుని చక్రవర్తే హంతకుడని నిర్ణయించడం కరెక్టా?
అవసరపడి నేను ఏదైనా చెబితే, అది ఎన్నో కష్టాలకు దారితీస్తుంది.
తప్పైపోతుందేమో.
కాస్త ఆలశ్యం చేస్తే.
ఆలశ్యం చేస్తే, ఆ మహిళ మెడలో తాళి కట్టేస్తాడే....అది అన్నిటికంటే పెద్ద తప్పు కాదా?
తొందరగా మనం ఒక నిర్ణయానికి రావాలి. ఒక వేల చక్రవర్తే నేరస్తుడైతే ....ఆ పెళ్ళికూతుర్ని కాపాడొచ్చు కదా.
నేను ఇప్పుడేంచేయాలి....పోలీసులకు చెబితే, నా ఫ్యూచర్ ప్రశ్నార్ధకం అవుతుంది.
నేనూ ఇందులో చిక్కుకోకూడదు, కానీ పెళ్ళికూతుర్ను కాపాడాలి. నిజం బయటకు రావాలి.
ఎలా?
కల్యాణ మండపం దగ్గరే...నడిచి వెళ్ళొచ్చు!
వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం.
సమయం ఏడున్నర గంటలు దాటింది. విందు మొదలు పెట్టుంటారు.
ముఖం కడుక్కుని, లైట్ గా మేకప్ వేసుకుని కల్యాణమండపానికి బయలుదేరింది కమల.
**************************
వూరేగింపు ముగిసి చక్రవర్తి-దీపిక జంటగా రిసెప్షన్ వేదికపైకి వచ్చారు...మండపం అంతా చప్పట్లు.
యువతీ యువకులు చప్పట్లు, ఈలలు, డాన్స్ అంటూ ఒకటే గోల చేస్తున్నారు. కొత్త సినిమా పాటలను లైట్ మ్యూజిక్ బృందం పాడుతున్నారు. రిసెప్షన్ వేదికపై వాళ్ళిద్దరూ పూలమాలలు మార్చుకుని నిలబడున్నారు. కెమేరా, వీడియో లైట్లు వాళ్ళిద్దర్నీ కాంతితో ముంచెత్తుతోంది.
మొదటగా తల్లితండ్రులతో ఫోటోలు, వీడియో తీసుకున్నారు.
దీపిక, చక్రవర్తి దూరంగా నిలబడున్న ప్రియంవదను, గౌతం నూ పిలిచారు.
ఇద్దరూ వచ్చిన తరువాత ఫోటలు, వీడియో తీసుకున్నారు.
ఇంతలో ప్రముఖ వ్యక్తులు రావటం మొదలైయింది.
జనం ఎక్కువయ్యారు.
"ప్రియా, నువ్వు నా పక్కనే ఉండు...ఎక్కడికీ వెళ్ళకే"
గెస్టులు ఇస్తున్న గిఫ్టులను తీసుకుని పక్కన పెడుతున్నాడు గౌతం.
ఆ గడ్డం ఉన్న మనిషి టిఫిన్ తిని మెల్లగా లోపలకు చొరబడి రిసెప్షన్ వేదికకు ముందున్న మొదటి వరసలో కూర్చున్నాడు.
చక్రవర్తి చూపులు అతనిపై పడ్డ మరు క్షణం చక్రవర్తి ముఖం మారింది.
అంతవరకు చక్రవర్తి ముఖంపై కనబడ్డ నవ్వు మాయమైంది.
కానీ, దాన్ని ఎవరూ గమనించలేదు.
ప్రియంవద కళ్ళు మాత్రం దేన్నో వెతుకుతూనే ఉన్నాయి.
“చ! అక్కయ్య జంటగా వచ్చి నిలబడటం కూడా అయిపోయింది”
“ఇప్పటి వరకు ఏది మాట్లాడటానికి నాకు ధైర్యం రాలేదు...ఇకపై వస్తుందా?”
రామకృష్ణ గారు, సాంబశివరావ్ గారు వస్తున్న వి.ఐ.పి లను రిసీవ్ చేసుకుంటూ హడావిడి పడుతున్నారు.
మొదటి వరుసలో కూర్చున్న గడ్డం మనిషి కళ్ళు పెళ్ళికొడుకుపైనే నిలకడగా ఉన్నాయి.
చక్రవర్తి అతన్ని చూడలేకపోతున్నాడు....చూడకుండానూ ఉండలేకపోతున్నాడు.
ఆ సమయంలోనే కమల కల్యాణ మండపంలోకి వచ్చింది.
చాక్లెట్లు, మిఠాయి, రోజా పువ్వులు తీసుకుని, సెంటు జల్లులతో తడిసి లోపలకు వెళ్ళింది.
పండ్ల రసం, వెజిటబుల్ సాలెడ్...పిల్లలూ, యువతీయువకులు తింటూ కబుర్లాడుకుంటున్నారు.
కమలకు సిగ్గూ గా ఉంది.
ఎవర్నీ తెలియదు.
నేనెందుకోచ్చాను?
ఎవరితో ఏం మాట్లాడబోతున్నాను?
అర్ధంకాలేదు!
కానీ, ఆలశ్యం చేయకూడదు. ఏదో ఒకటి చేసి తీరాలి.
మెల్లగా గుంపును తప్పించుకుంటూ మొదటి వరుసకు వెళ్ళింది. గడ్డం మనిషి పక్కనున్న కుర్చీ ఖాలీగా ఉంది.
గబుక్కున అందులో కూర్చుంది.
మెల్లగా వేదికపైన ఉన్న అందరినీ ఒకసారి చూసింది.
మొదటగా ఆమె కళ్ళు పెళ్ళి కూతురు దీపిక మీద పూర్తిగా పడింది.
అందమైన అమ్మాయి. బాగా చదువుకున్న ముఖం, తెలివిగల పిల్ల లక్షణాలు...అన్నిటికంటే ఆమె అందమైన చిరు నవ్వు.
ఈమె ఇరుక్కోబోతోందే?
వదలొచ్చా...?
ఏలాగైనా ఆమెను కాపాడే తీరాలి!
కంటి చూపు కొంచం జరిగి చక్రవర్తిపై పడింది. అతను కూడా అందంగానే ఉన్నాడు. ఎవరినైనా వసం చేసుకునే ముఖ లక్షణం...నాగు పాము కూడా అందంగానే ఉంటుంది. కాటువేస్తే మరణం!
కాంచన ప్రాణం తీసింది ఇతనే కదా?
అదే కారు!
చక్రవర్తి చూపు కమల పై పడటం తెలుసుకున్న కమల ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
చక్రవర్తి చూపు అమె మీద నుండి జరగటంలేదు.
చక్రవర్తి చూపు, పక్కన కూర్చున్న గడ్డపుమనిషి పైన ఉన్నదని కమలకు తెలియదు. అతని చూపులు తన పైనే ఉన్నాయని తప్పుగా అర్ధం చేసుకుంటోంది కమల.
"ఎందుకని నన్నే చూస్తున్నాడు?"
నేను కాంచన స్నేహితురాలని...ఒకే గదిలో కలిసి ఉంటున్నామని అతనికి తెలుసా?
కాంచన చెప్పుంటుందో?
ఎలా?
కాంచన సెల్ ఫోన్లో మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఉన్నది. ఆ ఫోటోను చక్రవర్తి చూసుంటాడా?
అందుకనే అతని చూపులు నాపైనే ఉన్నయ్యా?
నిటారుగా కూర్చుంది.....అదే పరిస్థితే!
అలాగైతే కాంచన తో తిరిగింది ఇతనేనా. అతని కారులో నుండి కాంచన ఆ రోజు దిగింది...అతని బిల్డింగులో హత్య చేయబడ్డది.
ఖచ్చితంగా ఇతనే హంతకుడు!
నా లెక్క తప్పు అవలేదు.
నేను ఇక్కడకు వచ్చింది కరెక్టే.
వచ్చింది...తినడానికా? లేదు. ఒక నిజాన్ని బయటపెట్టి ఈ అమ్మాయిని కాపాడాలి.
ఎం చేయబోతున్నాను నేను?
ఎవరితో చెబితే, నిజం అందరికీ తెలుస్తుంది?
వేగంగా ఆలొచించడంతో...వేదిక పైన, పెళ్ళి కూతురు పక్కన నిలబడి సన్నిహితంగా మాట్లాడుతున్న ప్రియంవద, కమలను ఎక్కువగా ఆకర్షించడంతో...తాను కొనుక్కొచ్చిన గిఫ్ట్ తో మెల్లగా లేచి, క్యూ లో నిలబడింది.
పెద్ద క్యూ లైన్.
కమలను అనుసరించి ఆ గడ్డపు మనిషి కూడా క్యూ లో వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా చక్రవర్తి చూపు అదే దిశలో...
ఖచ్చితంగా కాంచన నా గురించి చెప్పుంటుంది.
వదలకూడదు.
వేదికపై నిలబడున్న చక్రవర్తికి చెమట ఎక్కువైంది. అది దీపిక గమనించింది.
"ఎందుకు అంత చెమట పడుతోంది?"
"లేదు. జనం ఎక్కువైతే నాకు పడదు!"
"కూర్చుందామా?"
"వద్దు...అది బాగుండదు"
దీపిక వెనక్కు తిరిగింది.
"ప్రియా...ఆయనకు చెమట ఎక్కువగా పడుతోంది. తాగటానికి ఏదైనా తీసుకురా వా"
"ఎందుకు అంత చెమట పడుతోంది?"...ప్రియా అడుగుతున్నప్పుడు ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నాడు పోలీస్ కమీషనర్.
"పోలీస్ ను చూసిన వెంటనే తనకు తెలియకుండానే చెమట పడుతోందేమో?"
ఆలొచించిన ప్రియంవద "సరేనక్కా..." అంటూ నడిచి వెళ్ళింది.
ప్రియంవద, వేదిక దిగి బయటకు వస్తుంటే...క్యూ లో నిలబడ్డ కమల గమనించింది.
"ఈమె ముఖ్యమైన మనిషిలాగానే ఉంది. ఎవరైతే ఏముంది ఆమెతో చెప్పేసి జారుకుందాం"
క్యూ వదలి వేగంగా బయటకు వచ్చింది కమల.
Continued...PART-8
***************************************************************************************************