ప్రేమ కలలు (సీరియల్-PART-8)
ఆ గదే సైలెంటుగా అయిపోయింది. అంజలి మాత్రం
వెక్కి వెక్కి ఏడ్చే శబ్ధం మాత్రం వినబడింది.
"ఛీ...పిచ్చిపిల్లా...ఎందుకు
ఏడుస్తున్నావు? ఇదంతా జరిగి ముగిసి చాలా
సంవత్సరాలు అయ్యింది...ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు?"
"లేదమ్మా. నువ్వు
నాకోసం ఎన్ని కష్టాలు అనుభవించేవు?
అది తలుచుకుంటే..." మళ్ళీ కన్నీరు పొంగి పొర్లింది.
"సరే రోహినీ...తరువాత ఏమయ్యింది?".
"ఆ రోజు వెళ్ళినతనే. ఆ
తరువాత మేమున్నామా, చచ్చిపోయామా అని తెలుసుకోవటానికి కూడా
రాలేదు. ఎలాగో కష్టపడి దీన్ని పెంచి పెద్ద చేశాను. అప్పుడు మనసులోనూ, శరీరంలోనూ ఓపిక ఉండేది. దెబ్బతిని దెబ్బతిని ఉన్న హృదయం ఇప్పుడు ట్రబుల్
ఇస్తోంది"అన్నది.
“రోహినీ నేను
అడుగుతున్నానని తప్పుగా అనుకోకూడదు. దీనికీ, అంజలి ప్రేమను
నువ్వు అంగీకరించక పోవటానికీ ఏమిటి సంబంధం! నాకు అర్ధం కాలేదు"
"అయ్యో ఆంటీ...ఇంకా అర్ధం కాలేదా?
సుధీర్, అంజలిని ప్రేమించటం లేదు.
నటిస్తున్నాడు. దాన్ని పెళ్ళిచేసుకుని చిత్రవధ పెడతాడు. నాకు జరిగింది దానికి
జరగకూడదు కదా? అదైనా బాగా బ్రతకనీ!"
"ఏమిటే... సుధీర్ ఎంత మంచి పిల్లాడో తెలుసా? అతనికి
ఎంత పెద్ద మనసుంటే ఈ వృద్దాశ్రమం జరుపుతాడు? అతనికి డబ్బు ఆశ
ఉండుంటే పెద్ద డబ్బుగల అమ్మాయిని చూసుకోనుంటాడు గానీ అంజలిని ఎందుకు చూడటం?”
“ఆంటీ...మీరు అతనికి
సపోర్టు చేసి మాట్లాడేటట్టైతే ఇక ఇక్కడికి రాకండి. నా కూతురుకు ఎవరు భర్తగా రావాలో
నేను తీర్మానం చేసుకుంటాను. పెద్దవాళ్ళు మంచి మనసుతో ఏది చేసినా తప్పుగా అవదు.
నేను గనుక మా నాన్న మాట వినుంటే నాకు ఈ గతి పట్టేదా?"
"అమ్మా...నువ్వు నా
గురించి ఆలొచించకు. నీ విషయానికి రా. నాన్న ఇప్పుడొచ్చి మనల్ని పిలుస్తున్నారు.
మనం వెళ్ళాలా...వద్దా? ఏం నిర్ణయించుకున్నావు?"
"నేను ఇంత చెప్పినా
నీకు అర్ధం కాలేదా? వాడికి నా మీద ప్రేమ ఏమీలేదు. ఏదో మనసులో
పెట్టుకునే పిలుస్తున్నాడు. ఒకసారి నేను వాడ్ని నమ్మి మోసపోయింది చాలదా? మళ్ళీ మళ్ళీ అవమానపడాలా?"
"అలా అనుకోవటం తప్పు రోహినీ.
పలు సంవత్సరాలకు ముందు నువ్వొక తప్పు చేశావు. కానీ, ఈ రోజు
వరకు దాన్ని తలచుకుని బాధ పడుతూనే ఉన్నావే? అలాగే అతను కూడా
మారి ఉండొచ్చు కదా? ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు"
“వాడు ఖచ్చితంగా మారడు ఆంటీ...ఇప్పుడు
నాకేంటి తక్కువ? మీరున్నారు... అంజలి ఉంది. ఇంకేం కావాలి?
నేను ప్రశాంతంగా ఉండిపోతాను"
"అమ్మా అంజలీ...వెళ్ళి కొంచం కాఫీ
కలుపుకు వస్తావా. నేను మీ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉంటాను" అన్న వెంటనే అంజలి
లేచి లోపలకు వెళ్ళింది. ఆమె వెళ్ళిన వెంటనే కుర్చీని ఎత్తి మంచం పక్కగా వేసుకుంది ఆంటీ.
"రోహినీ...నేను చెబుతున్నానని
తప్పుగా అనుకోకూడదు. నిన్ను నా సొంత చెల్లిగా భావించి చెబుతున్నాను" అంటూ
దేనికో పిడి వేసింది.
"ఏమిటి విషయం ఆంటీ?
సుధీర్ విషయమైతే నేను వినటానికి రెడీగా లేను"
"లేదు...ఇది వేరు. నేనడిగే ప్రశ్నలకు
జవాబు చెబుతావా?"
"అడగండి"
"ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు అంజలికి
పెళ్ళి చెయ్యాలి కదా?"
"అవును...అది 'బి.ఎడ్' చదువు పూర్తి చేసిన వెంటనే, సంబంధాలు చూడటం మొదలుపెడతాను"
"చాలా కరెక్ట్. సంబంధాలు ఎలా
వెతుకుతావు? ప్రకటన ఇస్తావా...లేదు
టీ.వీ లో ఎక్జిబిషన్ లో నిలబెట్టినట్టు నిలబెడతావా?"
"లేదు...లేదు. నేను
మంచి పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని అతనితో చెప్పి అంజలికి తగిన వరుడ్ని
చూడమంటాను"
“అది...ఇప్పుడు నువ్వు 'పాయింట్' కు వచ్చావు. మంచి పెళ్ళిళ్ళ పేరయ్య మూలంగా
అయితే మంచి కుటుంబం దొరుకుతుంది. అందులో సందేహమేమీ లేదు. కానీ వరుడి ఇంటి
వాళ్ళు...పిల్ల తండ్రి ఎవరు -- ఎక్కడున్నారు అని అడుగుతారే! అప్పుడెలా సమాధానం
చెబుతావు? అందరి దగ్గర నువ్వు మోసపోయిన కథ చెబుతావా? వాళ్ళు అది నమ్మాలిగా?"
రోహిని సమాధానం చెప్పలేకపోయింది. ఆంటీ
మళ్ళీ మొదలు పెట్టింది.
"నీకు భర్త వద్దు. అంజలికి నాన్న
కావాలే? నువ్వు చిన్న వయసులో అన్ని సుఖాలను
అనుభవించి, ప్రేమ కోసం అవన్నీ అవతలపారేసి వచ్చావు. కానీ,
అంజలి పాపం...పుట్టిన దగ్గర నుండి పేదరికం తప్ప ఇంకేం చూసింది?
ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా డబ్బుతో ఉన్నప్పుడు అది ఎందుకు కష్టపడాలి?"
ఆలొచించటం మొదలు పెట్టింది రోహిని.
"బాగా ఆలొచించి చూడు. ఈ రోజు నీ
దగ్గర పెద్దగా డబ్బులేదు. అలాంటప్పుడు అతను నిన్ను వెతుక్కుంటూ ఎందుకు రావడం?
చెప్పు! అతను అనుకోనుంటే ఇంకో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండి
ఉండొచ్చు కదా?"
"ఆంటీ...కావాలంటే ఒక
పని చేయనా? అంజలిని మాత్రం వాళ్ళ నాన్నతో పంపుతాను. నేను
ఒంటరిగా ఉండిపోతాను?"
"చాలా
బాగుందే...నువ్వు చెప్పేది చాలా బాగుంది. దీనికి అంజలి ఒప్పుకుంటుందా? ఎందుకింత స్వార్ధ పరురాలుగా ఉన్నావు రోహినీ?"
"ఎవరు...నేను
స్వార్ధంగా ఉన్నానా? అంజలి కోసమే నా ప్రాణాన్ని అరచేతిలో
పెట్టుకుని జీవిస్తున్నాను. దానికి పెళ్ళి చేస్తేనే నేను హాయిగా కళ్ళు
మూస్తాను"
“పెద్ద వయసు మీరిన దానిలాగా
మాట్లాడొద్దు. అలా నీకేమంత వయసైపోయింది. ఇక మీదట మనవుడు -- మనవరాలునో ఎత్తుకుని ముద్దాడాలి.
ఇంతలో ఎందుకంత తొందర?"
“ఒక మాటకు అన్నాను ఆంటీ...అంతే"
"ఇలా చూడు రోహినీ...జీవితంలో తప్పు
చేయని వారు ఎవరు? అందరం ఏదో ఒక తప్పు చేసి
దాన్ని సరిదిద్దుకోలేక కొట్టుకుంటున్నాం. పాపం మీ ఇంటాయన...ఆయన మారి వచ్చారు.
ఇప్పుడు అతన్ని క్షమించి అంజలికి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వు"
"ఆయన మంచివారు కాదు.
ఇదే మా నాన్న చూసిన వరుడైతే నన్ను అనాధగా వదిలేసి వెళ్ళుంటారా? చెప్పండి"
నవ్వింది ఆంటీ.
"మంచి కథ...నీకు లోకజ్ఞానమే తెలియదు.
ఏం చదివేవో...ఏం ఉద్యోగం చేశావో పో"
"ఏమిటి ఆంటీ చెబుతున్నారు?"
"చూడు...నా గురించి
నీకేం తెలుసు?"
"మీరు నిర్మలా ఆంటీ...మీ
ఆయన చనిపోయారు. మీకు పిల్లలు లేకపోవటం వలన ఇక్కడ చేరేరు...అంతే కదా?"
“అది లోకానికి నేను
చెప్పింది. నీ కథ లాగానే నా కథ కూడా. ఏమిటొక తేడా అంటే...నువ్వు ప్రేమించావు! నేను
మా నాన్న చూసిన వరుడ్ని పెళ్ళి చేసుకున్నాను"
"తరువాత ఏమైంది?"
"తరువాత ఏమైందా?
అంతా విధి. మొదట నాకు కొడుకు పుట్టాడు. ఆశగా శంకర్ అని పేరు పెట్టి
పెంచాము. తరువాత మూడు సంవత్సరాలకు పిల్ల పుట్టింది. అప్పుడే విధి నన్ను చూసి
నవ్వటం మొదలుపెట్టింది"
"మీరేం చెబుతున్నారు?"
"నాకు పుట్టిన
ఆడపిల్లకు మెదడు వ్యాప్తి లేదు అని ఆరో నెలే తెలిసిపోయింది. దానికి ఏమీ తెలియదు. పిచ్చిదానిలాగా
ఉంటుంది అని డాక్టరమ్మ చెప్పింది. వైద్యం చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు అని
చెప్పింది"
"అయ్యో పాపం?"
"పాపమే! కానీ ఏం
చేయను...కన్నాను -- నా బిడ్డ అయ్యిందే...వదిలి పెట్టగలనా? ఇంటికి
పిలుచుకు వచ్చి దాన్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాను. కానీ మా ఆయన భయపడిపోయాడు.
ఆయనకు జీతం తక్కువే. ఎక్కడ తన సంపాదనంతా ఆ పిల్ల బాగోగులకే సరిపోతుందేమో నని
బాధపడటం మొదలుపెట్టారు. ఆ పిల్లను అనాధ ఆశ్రమంలో వదిలిపెట్టమన్నారు" --
చెప్పటం ఆపి కళ్ళు తుడుచుకుంది ఆంటీ.
"ఛ. ఇంత రాతి మనసు
కలిగిన వాళ్ళు కూడా ఉంటారా?"
"ఉన్నారే! నన్ను బాగా బలవంతం చేశారు...ఏది ఏమైనా సరే నేను
నా పిల్లను అనాధ ఆశ్రమంలో విడిచి పెట్టను అని చెప్పాను"
"అదే కరెక్ట్"
"ఏం కరక్టు. నేను నా నిర్ణయం
చెప్పిన తరువాత రెండు రోజులు కూడా ఇంట్లో
లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంటికే రాలేదు. వివరాలేమీ తెలియనందువలన
ఆయన ఆఫీసుకే వెళ్ళాను. ఆయన ఎక్కడో నార్త్ సైడుకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని
వెళ్ళారని చెప్పారు. ఇరవై ఏడేళ్ళ వయసులో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎవరి ఆదరణ
లేక నిలబడ్డాను"
"మీ అమ్మా--నాన్నా?"
"అమ్మ చనిపోయింది.
నాన్న అన్నయ్యతో ఉన్నారు. ఎక్కడ నేను భారంగా అయిపోతానేమోనని మా వదిన నన్ను దగ్గరకే
చేర్చలేదు. ఇంకెవరున్నారు? ఏం చేయను నేను? అమ్మవారి మీద భారం మోపి వంట పనులకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఈ మధ్యలో ఆ
పిల్లకు ఫిట్స్ వచ్చి పదో ఏట చనిపోయింది. మనసు రాయి చేసుకుని క్యాంటీన్
మొదలుపెట్టాను. అందులో వచ్చిన సంపాదనతోనే కొడుకును సి. ఏ వరకు చదివించాను”
"అబ్బో...మీ అబ్బాయి
సి.ఏ. చదివాడా?"
“అవును...చదివించటంలో నేను
ఏమీ తక్కువ చేయకపోయినా...వాడే నా మీద ప్రేమను తక్కువ చేసుకున్నాడు"
"ఏమిటి ఆంటీ అలా చెబుతున్నారు"
"వాడికి మంచి సంబంధం కుదిరింది. వాడి
చదువు చూసే ఒక గొప్ప ఆస్తిపరుడు అమ్మాయిని ఇచ్చాడు. నేనూ సంతోషంగా పెళ్ళి చేశాను.
తరువాతే తెలిసింది. వచ్చింది నాకు కోడలు కాదు...యముడు అని"
"ఆమె మిమ్మల్ని చాలా బాధ పెట్టిందా?"
"అంతా ఇంతా కాదు?
నన్ను చూస్తేనే దానికి ఇష్టముండదు. వంట మనిషి అని దానికి
నిర్లక్ష్యం. నన్ను గౌరవించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
"ఒకరోజు మా కోడలు
బంధువులు ఎవరో వచ్చారు. నేను వాళ్ళింటికి వంట చేయటానికి వెళ్ళున్నాను. అది ఆయన
జ్ఞాపకముంచుకుని నన్ను విచారించారు. అంతే ఏదో పరువే పోయినట్టు అరిచింది నా
కోడలు"
"దేనికి?"
“ఆమె భర్త పెద్ద ఉద్యోగంలో
ఉన్నాడట. అది కూడా గొప్ప కుటుంబంలో చేరిందట. ఆమె బంధువు దగ్గర నేనే కావాలని వెళ్ళి
ఆమెను అవమాన పరిచేనని, ఇంకా ఏదేదో చెప్పింది..."
"మీరు ఏం సమాధానం చెప్పారు?"
"నేనేం చెబుతాను రోహినీ.
పెద్దవాళ్ళ మాటలు నిచ్చన ఎక్కుతుందా? కొన్ని రోజులు గొణుగుతూ
గడిపిన ఆమె...ఏం చెప్పిందో, ఎంత చెప్పిందో తెలియదు...వాడు.
అదే నా కొడుకు నన్ను ఈ వృద్దాశ్రమంలో చేర్చేస్తాను. నెల నెల డబ్బులు కడతాను.
నువ్వు వసతిగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చి చేర్చి వెళ్ళిపోయాడు.
ఇదంతా బయటకు తెలిస్తే అవమానం అనుకుని...భర్త చనిపోయాడు...పిల్లలు లేరు అని అబద్ధం
చెప్పి ఉంచాను"
చాలాసేపు మౌనంగానే సాగింది.
"నాకు జరిగింది పెద్దలు చేసిన పెళ్లే,
ఏం జీవించాను గొప్పగా?
కన్న కొడుకే నన్ను ఇక్కడ చేర్చేసి వెళ్ళిపోయాడు. దీన్నే విధి
అంటారు"
"పాపం ఆంటీ మీరు. ఇంత సోకాన్ని
మనసులో పెట్టుకుని తాళం వేసుకుని నవ్వి నవ్వి మాట్లాడుతున్నారు?
మీ మనసు ఎవరికీ రాదు"
"నువ్వు నన్ను పొగడాలని నేను నా
విషయం నీకు చెప్పలేదు. జీవితంలో కష్టాలూ, సుఖాలూ
సహజం. ఇలా ఉండుంటే కష్టాలే వచ్చేవే కావని చెప్పలేము. అంతా భగవంతుడి చేతిలో ఉంది.
నీ దుఃఖమే పెద్దది అని అనుకుంటున్నావు. కొంచం మిగతావారిని చూడు. ఈ ఆశ్రమంలో
ఒక్కొక్కరి దగ్గర దుఃఖ కథలు చాలా ఉంటాయి. నువ్వు జరిగిపోయిన కాలం గురించి ఆలొచించి
-- జరుగుతున్న కాలాన్ని వృధా చేసుకోకు" అన్నది ఆంటీ.
రోహిని ఆలొచించింది.
'ఆంటీ చెప్పిన దాంట్లో నిజం
లేకపోలేదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు? కానీ, నా వల్ల హరికృష్ణను క్షమించటం కుదరదు’
క్షమించకపోయినా పరవాలేదు. కూతురికోసం
ఆయన్ని చేర్చుకోవాలి. ఆంటీ చెప్పినట్టు రేపు అంజలి నాన్న గారి మాట వచ్చినప్పుడు
ఆమె వెడుక్కి తలవంచ కూడదు. తల ఎత్తుకుని నిలబడి 'ఈయనే నా తండ్రి’ అని చెప్పాలి. దానికి హరికృష్ణను
నేను చేర్చుకోవాలి.
ఒక నిర్ణయానికి వచ్చింది రోహిని.
"ఆంటీ...మీరు చెప్పింది ఆలొచించి చూశాను.
మీరు చెప్పేదే కరెక్ట్. అంజలి కోసం నేను
ఆయన్ని చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంజలీ...నువ్వెళ్ళి మీ నాన్నను పిలుచుకు
రామ్మా" అన్నది.
ఆనందంతో తల్లిని కౌగలించుకుంది కూతురు.
Continued...PART-9
***********************************************************************************************