భార్య అందించిన కాఫీ
గ్లాసును ఎడం చేత్తో పుచ్చుకుని, వరాండాలో పడున్న ఆ రోజు న్యూస్ పేపర్ను కుడి చేతిలోకి
తీసుకుని సోఫాలో కూర్చోబోయాడు అనుభవ్.
"డాడీ
ఫోన్" అంటూ తండ్రి సెల్ ఫోన్ను తీసుకుని అక్కడికి వచ్చింది ఆరేళ్ళ రంజని.
"ఎవర్రా ఫోనులో?"
కూతురు అందించిన సెల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుంటూ
ముద్దుగా అడిగాడు తండ్రి అనుభవ్.
"తెలియదు
డాడీ...పేరు రాలేదు" చెప్పేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది రంజని.
"ఇంత
ప్రొద్దున్నే ఎవరు చేసుంటారు" అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అనుభవ్.
"అనుభవ్ గారు
ఉన్నారా?" ఆడ గొంతుక.
"అనుభవ్ నే
మాట్లాడుతున్నా...మీరెవరు?"
"సార్ నేను
నిమ్స్ హాస్పిటల్ నుండి నర్స్ మాలతిని మాట్లాడుతున్నాను. కౌశల్య అనే ఆవిడ చాలా
సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీరు తెలుసని, చివరిగా మిమ్మల్ను
చూడాలని ఆశపడుతున్నారు. మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి చెప్పమని అడిగారు"
".................." షాక్ లో ఉండిపోయాడు
అనుభవ్.
"హలో….లైన్లో ఉన్నారా?"
"ఆ...ఆ...లైన్లోనే
ఉన్నాను. ఇప్పుడు ఆమె పరిస్తితి ఎలా ఉంది..." బొంగురుపోతున్న కంఠాన్ని
సరిచేసుకుని అడిగాడు.
"చెప్పాను
కదండి...చాలా సీరియస్ కండిషన్"
"జబ్బేమిటో?"
"ఫోనులో
చెప్పలేను సార్...ఇక్కడికి వస్తారు కదా. అప్పుడు చెప్తాను"
"సరే ఇప్పుడే
వస్తాను"
"సార్ నిజంగా
వస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే ఇంతవరకు ఆమెను
చూడటానికి ఎవరూ రాలేదు సార్. రెండు నెలలుగా ఎవరూ రాలేదు. అందుకని
అడుగుతున్నాను"
"లేదమ్మా వస్తాను...వస్తున్నా...హాస్పిటల్
కు వచ్చి ఫోన్ చేస్తాను"
అనుభవ్ షాక్ లో
ఉన్నప్పుడే అక్కడికి వచ్చిన అతని భార్య రమ్య "హాస్పిటల్లొ ఉన్నది ఎవరండి?"
ఆదుర్దాగా అడిగింది.
"కౌశల్య...చావుబ్రతుకుల్లో
ఉన్నదట"
"నేనూ
వస్తానండీ" భర్తతో అన్నది.
అనుభవ్ మౌనంగా ఉండటంతో
రమ్య "ప్లీజ్" అంటూ ప్రాధేయ
పడింది.
అనుభవ్
భార్యతో కలిసి నిమ్స్ హాస్పిటల్ చేరుకున్నాడు. ఆ నర్సుకు
ఫోన్ చేసి వార్డు నెంబర్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు.
వార్డు ఎంట్రన్స్ లో
నిలబడున్న నర్స్ ను చూసి "నా పేరు అనుభవ్" అన్నాడు.
"రండి"
అంటూ వాళ్ళను కౌశల్య పడుకోనున్న బెడ్ దగ్గరకుతీసుకు వెళ్ళింది.
ఎముకల గూడులా పడున్న
కౌశల్యను చూసి తట్టుకోలేకపోయాడు. భర్త చెయ్యిని పుచ్చుకుంది రమ్య.
"కౌశల్యా...కౌశల్యా...చూడు
ఎవరొచ్చారో. నువ్వు ఎదురుచూస్తున్న అనుభవ్ గారు వచ్చారు" అన్నది నర్స్.
కౌశల్య కళ్ళు
తెరవలేదు.
నర్స్ కౌశల్య చేయి పుచ్చుకుని
నాడి చూసింది.
"అపస్మారక
స్థితిలో ఉన్నది సార్...కాసేపు వార్దు బయట ఉండండి సార్. కాసేపట్లో చీఫ్ డాక్టర్
వస్తారు. అప్పుడు పిలుస్తాను"
శిలలాగా అక్కడే
నిలబడిపోయిన భర్తను బలవంతంగా వార్డు బయటకు లాక్కుని వెళ్ళింది రమ్య.
వార్డ్ బయట గోడను
ఆనుకుని కూర్చుండిపోయాడు అనుభవ్. అతనికి దగ్గరగా కూర్చుంది అతని భార్య.
భర్త రెండు చేతులను
తన చేతుల్లోకి తీసుకుంది.
"చూడండి...మీరు అధైర్య పడకూడదు. ఇప్పుడే
మీరు చాలా ధైర్యంగా ఉండాలి. బెడ్ మీదున్న కౌశల్యను చూసిన తరువాత ఆమె బ్రతుకుతుందనే
నమ్మకం నాకు కలగటం లేదు"
గబుక్కున తల
పైకెత్తి భార్యను చూశాడు అనుభవ్.
"నేను నిజం
మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆమెకు అమె ఒంటరి కాదనే నమ్మకాన్ని మనం కలిగించాలి. అదే
ఆమెకు మనం ఇవ్వగలిన ఆత్మ కానుక. అమెకో కూతురు ఉన్నదని చెప్పారు. ఆ అమ్మాయిని మన
అమ్మాయిగా పెంచుతామని హామీ ఇవ్వండి. ఆమె మనసు ప్రశాంత పడుతుంది"
భార్య వైపు
ఆశ్చర్యంగా చూశాడు.
"ఏమిటండి అలా
చూస్తున్నారు. కౌశల్య చాలా గొప్ప మనిషి. ఆమె గురించి మీరు నాకు చెప్పిన రోజే ఆమెకు
ఎలాగైనా ఆమెను చూడాలని, సహాయపడాలని అనుకున్నాను...ఆ అవకాశాన్ని భగవంతుడు ఈ రోజు నాకు కల్పించాడు"
"ఈ లోకంలో ప్రతి
మనిషికీ తమకంటూ ఒకరుండాలి…ఒకరైనా ఉండాలి...అలా తనకి ఒక్కరూ
లేరనే బాధే కౌశల్యకు నరక ప్రాయంగా ఉంటుంది. ఆమె కూతురి భవిష్యత్తు గురించే ఆమె ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఇక అమె కూతురు మన కూతురని హామీ ఇవ్వండి. ఆమె హాయిగా కళ్ళు మూస్తుంది.
మనసిచ్చేందుకు. ప్రాణమిచ్చేందుకు. అదీ
ఇదీ అని కాదు. ఏదైనా ఇచ్చేందుకు, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా...! అవును. అలాంటివారు ఒకరుంటే
జీవితం ఎంత హ్యాప్పీగా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి మనిషికోసమే కౌశల్య మనసు చివరి
క్షణాల్లో ఆరాటపడుతూ ఉంటుంది. మీరున్నారనే
నమ్మకం ఆమెకు కలిగించండి. అవసరమైతే ఆమెకు చేతిలో చెయ్యి వేసి చెప్పండి. ఆవిడ
ప్రశాంతంగానైనా కళ్ళు మూస్తుంది. తన జీవితంలో ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా జీవించలేదు.
జీవితంలో మీరు బాగుండాలని ఆమెకు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుని తన జీవితాన్ని
త్యాగం చేసుకుంది. అలాంటి ఆమెకు ఈరోజు మీరిచ్చే హామీ ఆమె జీవితంలో మీరు ఆమెకు
ఇచ్చే రెండో అవకాశం. ఈ అవకాశం అమెను ఆమె చివరి క్షణాల్లో హ్యాప్పీగానూ, ప్రశాంతంగానూ ఉంచుతుంది"
"సార్....చీఫ్
డాక్టర్ వచ్చారు. మీరు రండి" మాలతి నర్స్ చెప్పటంతో భర్త చేతిని పుచ్చుకుని
వార్డుకు తీసుకు వెళ్ళింది అనుభవ్ భార్య్.
" కౌశల్య
అడుగుతున్నది వీరినే డాక్టర్ " చీఫ్ డాక్టర్ తో చెప్పింది మాలతి నర్స్.
"చూడండి ఈమెను
చూడటానికి ఇంతవరకు ఎవరూ రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. ఈమె మరికొద్ది గంటలే
ప్రాణాలతో ఉంటుంది. ఇప్పుడు మీరు గనుక రాకుండా ఉంటే మేము ఇరకాటంలో
పడేవాళ్ళం...మీరొచ్చారు, అది
మాకు రిలీఫ్ గా ఉంది"
"ఆమెను కాపాడే
అవకాశం..."
"సారీ
సార్...ఆ చాన్స్ లేనే లేదు. దానికి కారణం ఆమె జబ్బు కాదు. ఆ జబ్బు మొదలైనప్పటి
నుండి ఆమె ట్రీట్ మెంట్ సరిగ్గా తీసుకోలేదు. అదే కారణం"
"ఆమెకొచ్చిన
జబ్బు..."
"ఎయిడ్స్...చెయ్యి
దాటిపోయింది" చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్.
అనుభవ్ కళ్ళు
కన్నీళ్ళతో నిండిపోయింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీటి బొట్లు
జారి కౌశల్య చేతి మీద పడ్డాయి. అనుకోకుండా కళ్ళు తెరిచింది కౌశల్య.
కౌశల్య కళ్ళు తెరవటం
గమనించిన అనుభవ్ భార్య భర్తతో ఆ విషయం చెప్పింది. అనుభవ్ ఏమీ మాట్లాడకుండా
కౌశల్యను చూస్తూ నిలబడ్డాడు.
"మాట్లాడండి..."
భర్తతో చెప్పింది.
అనుభవ్ నోరు తెరవలేదు.
భార్య ఎన్నిసార్లు చెప్పినా అనుభవ్ మాట్లాడలేదు.
భర్త మాట్లాడలేడని
అర్ధం చేసుకున్న అతని భార్య "చెప్పండి...మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు.
చెప్పండి. నేను అనుభవ్ భార్యను. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తూ ఆయన మాట్లాడలేక
పోతున్నారు. పరవలేదు నాతో చెప్పండి...చెప్పచ్చు"
కౌశల్య ఏమీ మాట్లాడ
లేదు.
"చూడండి...
మీరంటే నాకు చాలా గౌరవం. పెళ్ళైన కొత్తల్లో మా ఆయన మీ గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని
చూడాలని,
కలుసుకోవాలని ఆయన్ని ఒత్తిడి చేశాను. ఇద్దరం కలిసి మీకొసం
చాలా చోట్ల వెతికేం. మీరు కనిపించలేదు...ఇందాక మీ గురించి తెలుసుకున్న తరువాత
ఇద్దరం కలిసే వచ్చాము. మీరు ఒంటరి వారు కాదు. ఈ మాట మా పెళ్ళి తరువాత మీతో
చెప్పాలని ఆయన ఎంతో ప్రయత్నించారు. కానీ మీరు ఈరోజు కనిపించారు. అందులోనూ ఈ స్థితిలో" అంటూ కళ్ళు
తుడుచుకుంది.
అప్పుడు అక్కడికి
ఎనిమిదేళ్ళ అమ్మాయిని తీసుకు వచ్చి నిలబెట్టింది నర్స్ మాలతి.
అమ్మాయి చెయ్యి
పుచ్చుకుని అనుభవ్ భార్య చెతిలో పెట్టింది కౌశల్య.
"బాధ పడకండి.
ఇక మీదట ఈ అమ్మాయి మా పెద్ద కూతురు. మేము చూసుకుంటాం. ఇది మా ప్రామిస్" అంటూ
కౌశల్య చేతిలో చెయ్యి వేసింది అనుభవ్ భార్య.
కౌశల్య ముఖంలో కొది
క్షణాలు ఒక తేజస్సు..ఆ తరువాత కౌశల్య చెయ్యి జారిపోయింది.
భర్తవైపు చూసింది
అనుభవ్ భార్య....అనుభవ్ గతంలోకి వెళ్ళాడని గ్రహించింది.
**************************************************************
తెల్లవారు జాము. సివానందా కాలనీ బస్స్ స్టాపింగ్. అనుభవ్ ఆదుర్దాగా నిలబడున్నాడు. 'బస్సు బయలుదేరటానికి ఇంకా పది నిమిషాలే ఉన్నది. ఇంకా ఆమె రాలేదేమిటి?' అనే ఆందోళన.
ఇతని సొంత ఊరు క్రిష్ణా జిల్లాలోని గుడివాడ. బాగా ఉన్నవారి బిడ్డ. తండ్రి చనిపోయాడు. తల్లే ఇతనికి అంతా!
చదువు అయిపోయిన తరువాత ఇతన్ని పెళ్ళి చేసుకోమని అమ్మ ఒకటే నస పెడుతోంది. కానీ 'మంచి ఉద్యోగంలో చేరిన తరువాతే పెళ్ళి' అని మొండికేసి వద్దన్నాడు.
ఎప్పటిలాగానే లాస్ట్ సీట్లో కూర్చుని ఆమె వచ్చే దారివైపే చూస్తూ ఉండిపోయాడు. బ్రేక్ ఫాస్ట్ టిఫిన్ తిని ముగించిన డ్రైవర్-కండక్టర్ ఇద్దరూ బస్సులోకి ఎక్కారు. ప్రాణం తెచ్చుకున్న బస్సు...చిన్నగా ముందుకు వెళ్లటం మొదలుపెట్టింది. అనుభవ్
మరింత ఆదుర్దాతో ఆమె వచ్చే దారినే చూస్తుండగా...అదిగో కలలో కనిపించిన ఆ దేవత ఆకాశంలో తేలుతూ వస్తున్నట్టు వచ్చింది.
ఎర్రని శరీర చాయ. లేత పచ్చ రంగు చీర. తలలో ఎర్ర గులాబి పువ్వు. కుడి చేతి భుజంపై చిన్న 'హ్యాండ్ బ్యాగ్' వేలాడుతోంది. పుస్తకాలను గుండెలకు హత్తుకుని, ఆయసపడుతూ పరిగెత్తుకొస్తున్న ఆమె అందం చూడటానికి ఈ జన్మ చాలదు అనే లాగా .....ఆమెనే చూస్తూ ఆనందపడటానికి ఆ బస్సులో ఏప్పుడూ యువకుల సేన ఒకటి కాచుకోనుంటుంది.
ఆయస పడుతూ పరిగెత్తుకోచ్చి బస్సు మెట్లపైన కాలు మోపటం ..తనని తయారుచేసిన కారణం నెరవేరిందన్న ఉత్సాహంలో వేగం పుంజుకుంది బస్సు.
ఆమె చూపులు, చివరి సీట్లవైపు తిరిగింది. దానికొసమే ఎదురుచూస్తున్నట్లు అనుభవ్ మనసు ఆనందంతో తుల్లి ఆడింది. ముఖం సంతోషంతో వెలిగిపోయింది. టయర్డ్ గా ఉన్న అనుభవ్ గుండేల మీద చెయ్యిపెట్టుకుని 'హమ్మయ్యా అనుకుంటూ తల వాల్చాడు. అది ఆమె చూసి ఆభిమానించి నవ్వుతూ తల తిప్పుకుంది.
అనుభవ్, గ్రామంలో పుట్టి పెరిగినా వాడైనా వేసుకునే డ్రస్స్, దూవ్వుకునే జుట్టు, స్టైలు, గంభీరం...అతన్ని సినిమా హీరోలా చూపిస్తుంది. స్థలాలు, పొలాలు, ఇళ్ళు అంటూ బోలడంత ఆస్తి ఉన్నా. అక్కడ తన జీవితాన్ని గ్రామంలోనే పరిమితం చేసుకోవటం ఇష్టం లేదు. చదువుకు తగినట్లు 'కంప్యూటర్ ఇంజనీర్’ఉద్యోగం వెతుక్కోసాగాడు.
అతను అనుకున్నట్లే ఒక ప్రైవెట్ కార్పోరేట్ ఐ.టి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఐదు అంకెల జీతం. ఆఫీసుకు వెళ్ళి రావటానికి కారు అంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ వస్తున్నాడు. అన్నీ పోయిన నెల కౌశల్యను చూసేంత వరకే! ఎప్పుడు ఆమెను చూశాడో, ఆ రోజు నుంచి ఆఫీసుకు కార్లో వెళ్లటం మానేసి ఇదిగో ఈ తొమ్మిది గంటల బస్సులో పయనించడం మొదలుపెట్టాడు.
ఆ రోజు నుంచి కౌశల్య బస్సు ఎక్కిన వెంటనె అనుభవ్ చూసి నవ్వటం, తిరిగి అతడు దిగాల్సిన బస్సు స్టాపింగ్ వచ్చినప్పుడు అతను దిగుతుంటే చూసి మళ్ళీ నవ్వటం...ఇదే తంతు రోజూ జరుగుతూ ఒక నెల గడిచిపోయింది.
'ఈరోజు ఎలాగైనా తన ప్రేమను చెప్పాలి. పేరు, అడ్రెస్సు, ఫోన్ నెంబరు అన్నిటిని అడిగి తెలుసుకోవాలి’ అన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకనే ఎప్పుడూ దిగే గాంధీ నగర్ కు టికెట్టు తీసుకోకుండా...ఆ బస్సు చివరి స్టాపింగ్ వరకు టికెట్టు తీసుకున్నాడు.
బస్సు గాంధీ నగర్ బస్ స్టాపింగులో ఆగగానే...కౌశల్య అతన్ని ఒకసారి తిరిగి చూసింది. కానీ, అతను దిగలేదు. అది ఆమెకు కొంచం ఆశ్చర్యం ఏర్పరచినా అది చూపించుకోకుండా, చిన్న నవ్వు నవ్వి తిరిగి మామూలుగా కూర్చుంది.
ఒక్క నిమిషం సేద తీర్చుకున్న బస్సు, తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. కొంచం దూరం వెళ్ళిన తరువాత ఆమె మళ్ళీ ఒకసారి తిరిగి చూడటం...అతను కళ్ళు ఆర్పకుండా అమెనే చూస్తుండగ! అది అర్ధం చేసుకున్న ఆమె ఎటువంటి ఆందోళన చెందకుండా ఆలొచన చేసింది.
'ఎందుకు ఈరోజు గాంధి నగర్ లో దిగకుండా కంటిన్యూ చేసి వస్తున్నాడు? ఒకవేల నన్ను ఫాలో చేస్తున్నాడో?' అని అనుకున్నది,"ఛ...ఛ...అలా ఉండదు. ఏదైనా పని ఉన్న కారణంగా రైల్వే స్టేషన్ కి కూడా వెళ్ళొచ్చు" అని అనుకుని తనని తాను సమాధాన పరుచుకుంది.
బస్సు రైలు స్టేషన్ సమీపానికి రాగానే...మళ్ళీ చూసింది. అక్కడా అతను దిగలేదు. ఆమెకు ఆందోళన పట్టుకుంది. ఆమె దిగవలసిన చోటు రాగానే, దిగటానికి సిద్దమయ్యింది. అతను కూడా అతని సీటు నుండి లేచి దిగటానికి తయారయ్యాడు. ఆమెకు వెంటనే చెమటలు పోసినై. అయినాకాని, అది బయటకు కనబడనీయ కుండా బస్సు ఆగిన తరువాత, హడావిడిగా కిందకు దిగి నడకను అతివేగం చేసింది.
ఆ నడకవేగానికి ఈడుగా వచ్చిన అతను, ఆమె దగ్గరగా వెళ్ళి "ఎక్స్ క్యూజ్ మి మేడం" అన్నాడు.
బెదిరిపోయిన ఆమె తన కళ్ళు పెద్దవి చేసి! "మీరా...ఏమిటి ఇంత దూరం...? ఎప్పుడూ గాంధీ నగర్ లో దిగేవారు, ఈరోజు ఎదైన పనుండి ఇటొచ్చారా"? అని విచారించింది.
"లేదు...మీతో కొంచం పర్సనల్ గా మాట్లాడాలి. అందుకనే..." అంటూ తడబడుతూ మాట్లాడాడు.
కౌశల్య కొంచం ఆశ్చర్యంగా, "నాతోనా...నాతో పర్సనల్ గా మాట్లాడటానికి ఏముంది?" అన్నది.
"మిమ్మల్ని కలిసిన మొదటి రోజు మీకు గుర్తుందా...? బస్సు ఎక్కటానికి మీరు వస్తున్నప్పుడు, టూ వీలర్ లో వేగంగా వస్తున్న నేను మీ మీద డాష్ కొట్టి, మీకు పెద్ద శ్రమ ఏర్పరిచాను. అందుకు క్షమించమని అడుగుదామని వచ్చాను" అని అతను చెప్పి ముగించేలోపు,
"అయ్యో...ఎందుకండి పెద్ద పెద్ద మాటలు చెప్పటం....ఆరోజు నేనే కదా వచ్చి మీ బండికి డాష్ కొట్టాను. తప్పు నా మీదే. అందుకు నేను ఆరోజే మీదగ్గర క్షమాపణలు అడిగాశానే?"
"లేదు...తప్పు నామీద కూడా ఉన్నదికదా! అందువలన 'క్షమించేను’ అని ఒక మాట చెప్పారంటే మనసుకు కొంచం నెమ్మదిగా ఉంటుంది. అందుకనే..."
అది విన్న ఆమె అబద్దమైన కోపంతో అతన్ని చూడగా, అతను కొంచం తల దించుకోగా...ఆమెకు నవ్వు వచ్చేసింది.
"సరే...సరే...మిమ్మల్ని క్షమించాను...చాలా" అన్నది.
"చాలదు...దీన్నే ఒక హోటల్లో కూర్చుని, వేడి వేడి కాఫీ తాగుతూ చెబితే కొంచం 'స్వీటుగా' ఉంటుంది కదా...?"
మాటలను మింగుతూ అన్నాడు.
అతని చేష్టలు, తనని కాఫీ తాగటానికి పిలిచి అతను ఆనందపడుతున్నది చూసి ఆమె నవ్వేసింది.
అతను కూడా ఆమెతో కలిసి నవ్వగా...రోడ్డు మీద వెడుతున్న వాళ్ళు వారిద్దరినీ అదోలాగా చూశారు.
మహాలక్ష్మి మాల్ ఎదురుగా కొత్తగా తెరిచిన కాఫీ షాప్ లోపలకు వెళ్ళి కూర్చున్నారు.
"సరే...ఏం తిందాం... చెప్పండి..." అని అనుభవ్ అడిగాడు.
"ఈ హోటల్ అంటే నాకు చాలా ఇస్టం… కానీ , నాకు కాఫీ మాత్రం చాలు"
"ఇక్కడ సాంబార్ ఇడ్లీ, సాంబార్ గారె చాలా 'ఫేమస్’. కాబట్టి ఇద్దరం చెరొక ప్లేట్ తిందాం. ఓ.కె. నా?"
"వద్దండి...ఇప్పుడు తినడం నావల్ల కాదు"
"సరే, అయితే ఇద్దరం సాంబార్ గారె మాత్రం తిందాం"
దానికి సగం మనసుతో అంగీకరించింది. 'ఆర్డర్ ఇచ్చిన తరువాత అక్కడ కాసేపు మౌనం నెలకొన్నది. అది కౌశల్యకు ఏదో లాగా అనిపించడంతో...ఆమే మౌనాన్ని ఛేధించింది.
"అవును, ఆ ఒక్క రోజు బైకులో వచ్చారు. దాని తరువాత రోజూ బస్సులో వస్తున్నారు....బైకు ఏమైంది?"
ఆ ప్రశ్నను కొంచం కూడా ఎదురుచూడని అతను, 'ఏం సమాధానం చెప్పాలి?' అని ఆలొచించాడు.
"అదొచ్చి...రెండు నెలలుగా వడ్డీ కట్టలేదు. 'ఫైనాన్ సియర్ మనిషి తీసుకు వెళ్ళిపోయాడు" అని చెప్పి తప్పించుకున్నాడు.
కౌశల్య మళ్ళీ ఒకసారి అతనివైపు అదొలా చూడగా, అతను దాన్ని అర్ధం చేసుకుని ఎక్కడో చూస్తున్నట్లు నటించాడు.
"ఎందుకని...జీతం కరెక్టుగానే తీసుకుంటున్నారు కదా...?" ఎగతాలిగా అడిగింది.
అతను సమాధానం చెప్పేలోపల, సాంబార్ గారె వచ్చేసింది. అతని సంకోచాన్ని చూసిన ఆమె "సరి...సరి...నేను 'జోక్' గా అడిగాను. తినండి" అన్నది.
ఆమె తింటున్న అందాన్ని అనుభవిస్తూ అనుభవ్ చిన్నగా నవ్వాగా, అది గమనించిన ఆమె..."ఏమిటి...?"
అనేలాగా తల ఊపి, కురులతో ప్రశ్న అడగగా 'ఏమీ లేదు’ అనే విధంగా అతనూ కళ్లను మూసి, తల ఊపి జవాబు చెప్పాడు.
సొంత ఊరు, కుటుంబ పరిస్థితి, జీతం అని తన స్వీయ చరిత్రను ఆమె దగ్గర వివరంగా చెప్పి ముగించగానే, ఇద్దరూ తినడం ముగించడం సరిగ్గా పూర్తి అయ్యింది.
అంతవరకు నిదానంగానూ, ఓర్పుగానూ అతను చెప్పిన వివరాలు విన్న ఆమె "అయ్యో...చెయ్యి ఇవ్వండి. అయితే త్వరలోనే మీకు పెళ్ళి. విందు ఆరగించే అదృష్టం నాకు దొరుకుతుంది కదా? పెళ్ళికి నన్నూ పిలుస్తారుగా?"
చిన్న పిల్లలాగా అడిగింది.
తన పెదవులను తడుపుకుని అతను ఏదో చెప్పటానికి ప్రయత్నించేలోపు "లేనా... నేను మీ పెళ్ళిలో లేనా?"
అని కొంచం ఆశ్చర్యపడ్డ ఆమె "సరే...వదలండి. నేను ఎవర్ని... మీకేమన్నా చుట్టమా, ఫ్యామిలీ మెంబర్నా?" విరక్తిగా తన చూపులను ఎటో ఉంచి మాట్లాడింది.
అది విన్న అతను కొంచం ఆందోళన చెందుతూ, నుదుటిని తుడుచూకుంటూ "అయ్యో...అది కాదండి. నేను చెప్పాలని వచ్చిన విషయమే వేరు. ప్లీజ్...కొంచం అర్ధం చేసుకోండి" అని చెబుతూ ఆమెకు దగ్గరగా జరిగాడు.
కొంచం సమాధనపడినట్లు కొంటెగా చూసింది. దాని అర్ధం తెలుసుకున్న వాడిలాగా "అవునండి...మీరు చెప్పినట్లు తరువాత నా పెళ్ళే. కానీ జరుగుతుందా...జరగదా కొంచం సందేహంగా ఉంది"
ఆమే అర్ధంకానట్లు చూడగా...అతనే మళ్ళీ మాట్లాడాడు "నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆమెనే నా భార్యగా చేసుకోవటానికి ఆశపడుతున్నాను. కాని ఆమె నన్ను ఇష్టపడుతుందో , లేదో తెలియక కాస్త కన్ ఫ్యూజన్ గా ఉన్నాను"
"వొహో...సారుకు 'లవ్'వా...? అలా చెప్పండి! అవును...ప్రేమలో ఏమిటండి కన్ ఫ్యూజన్ ఉన్నదని చెబుతున్నారు? మీకు ఏం తక్కువ? ఆస్తి, చదువు, అందం అనే అన్ని అర్హతలూ ఉన్నప్పుడు, ఎవరండి మిమ్మల్ని ఇష్టపడనని చెప్పేది? ఒకవేల అలా చెప్పే ఆమ్మాయి ఉన్నదంటే ఆమె గుడ్డిదైనా అయ్యుండాలి, లేకపోతే పిచ్చిదైన అయ్యుండాలి" అంటూ పక పక నవ్వింది. అతనూ ఆమెతో కలిసి నవ్వాడు.
కౌశల్య కొంచం సర్దుకుని,
"సరే. చెప్పండి...ఆ అదృష్టవంతురాలు ఎవరు? మీతో పనిచేస్తున్న సహ ఉద్యోగా, లేకపోతే ఒకతిగా చదువుకున్నారా, మామ కూతురా లేక అత్త కూతురా చెప్పండి...ప్లీజ్ నేను ఆగలేకపోతున్నాను!"
అతను మళ్ళీ గట్టిగా నవ్వుతూ 'లేదు...లేదు’ అనేలాగా తల ఊపాడు.
అతని నవ్వు కౌశల్యకు ఏమార్పు కలిగించింది. అదే సమయం 'నా లెక్క తప్పైపోయిందే?' అన్న ఆలొచనతోనూ...పైగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవలనే కుతూహలం ఆమె ముఖంలో ప్రశ్నార్ధక భావం తెప్పించి..."ఎవరండీ ఆమె?" అని అడిగింది.
చిన్నగా సిగ్గు పడుతూ,
"నాకు, వాళ్ళకీ సంబంధమే లేదండి! చెప్పాలంటే నేను ఆమెను చూసిందే ఒక నెల ముందే" అన్నాడు.
'ఒకవేల అతను నా గురించే చెబుతున్నాడా?'అన్నట్లు ఆమె చూడ,
అది అర్ధం చేసుకుని కళ్ళను మూసుకుని "అవునండి...అది మీరే" అంటూ చూపుడు వేలుతో ఆమెను చూపాడు.
ఆ చేష్టతో ఆమె ముఖం మారింది. ఆడువారికే సొంతమైన సిగ్గుతో ఆమె తల వంచుకుంది. అక్కడ కొంచం ప్రశాంతత చోటుచేసుకుంది.
కానీ అనుభవ్ 'నా ప్రేమను అర్ధం చేసుకుంది’ అని సంతోష పడి సిగ్గుతో తలవంచుకునే, "అవునండి! నేను ఏరోజు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశానో...అప్పుడే మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభించాను. ఇంకా చెప్పాలంటే మానసికంగా మిమ్మల్ని నా భార్యగా ఎంచుకుని, కలలో మీతో సంసారం చేయటం ప్రారంభించాను. అందుకనే ఈరోజు ఎలాగైనా మీదగ్గర నా ప్రేమ గురించి చెప్పి, నిజ జీవితంలోనూ భార్యగా చేసుకోవటానికి ఆశపడే మీ వెనుకే వచ్చాను" అని ఆపాడు.
కొంచం విరామం తరువాత,
"చెప్పండి...మీకు నచ్చిందా? నన్ను పెళ్ళి చేసుకోవటానికి మీకు ఇష్టమేనా? అని చెప్పారనుకోండి...అమ్మను రమ్మను చెప్పి, మిగిలిన విషయాలను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెబుతాను" అని చెప్పినతనికి కొంత భయమేసింది.
తలవంచుకున్న కౌశల్య తల పైకెత్తలేదు. ఆమె కళ్ళ నుండి కన్నీరు ధారగా పడి ఆమె చీరను తడిపింది. ఇప్పుడేం చేయాలి అని తడబడ్డాడు అనుభవ్. ధైర్యం తెచ్చుకుని ఆమెను సమాధన పరచాలని.
"ఏమండి, ఏమండి ప్లీజ్...నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను మన్నించండి" అని ఆమెను బుజ్జగిస్తూ నిలబడ....అది విని చీర కొంగుతో ముఖాన్ని మూసుకుని, మరీ ఎక్కువగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది.
ఆమెను సమాధన పరచటం ఎలాగో తెలియకు,
"ఏమండి నామీద కోపంగా ఉంటే రెండు దెబ్బలు కొట్టండి. కానీ దయచేసి ఏడవకండి" అన్నాడు.
కౌశల్య ఎదో నిప్పును తొక్కిన షాక్ లో నుండి తెరుకున్నట్టు...సడన్ గా ముఖాన్ని తుడుచుకుని తలపైకెత్తి,
"లేదండి...తప్పు మీ మీద లేదు. తప్పంతా నాది. అందుకే ఏడ్చాను. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు నేనేమి పెళ్ళికాని అమ్మాయిని కాదు. నాకు ఇంతకు ముందే పెళ్ళైంది. ఒక ఆడ పిల్ల ఉన్నది"
అనుభవ్ కు తల తిరుగుతున్నట్లు
అనిపించింది...ఏం చేయాలో తెలియక అలాగే కూర్చుండిపోయాడు. కౌశల్య కొంచం కూడా ఆందోళన చెందకుండా విరక్తిగా నవ్వుతూ తన కుటుంబ కథను చెప్పటం మొదలుపెట్టింది.
మా సొంత ఊరు రాజమండ్రి పక్కనున్న కోవూరు. పుట్టి పెరిగినదంతా అక్కడే. నేను ఆరో క్లాసు చదువుతున్నప్పుడే అమ్మకు పక్షవాతం వచ్చి మంచానికి అంకితమైపోయింది. అందువలన స్కూలుకు వెళ్ళే లోపు వంట పూర్తి చేసుకుని, అమ్మకు-తినిపించి బద్రతగా ఇంట్లో ఉంచి, ఇంటికి తాళం పెట్టి వెడతాను.
మాకు సొంతం అనిచెప్పుకోవటానికి ఏమీలేదు. ఊర్లో ఉన్న పూరిల్లు ఒకటే. నాన్న చాలా రోజులకు ముందే విజయవాడకు వచ్చాశారు. ఇక్కడ ఒక హోటల్లొ 'సర్వర్’ ఉద్యోగం చేశారు. దొరికిన డబ్బులో సగం మాకు పంపించేవారు. మిగిలింది తాగటానికే.
ఎలాగో ఆయన పంపే డబ్బుతోనూ, స్కూల్ లేని రోజుల్లో కూలిపనికి వెళ్ళి పదో క్లాసు పూర్తిచేశాను. కుటుంబ పేదరికాన్ని పోగొట్టేను. అంతకంటే చదువుకోవటానికి వసతి లేదు. నాకు చదువుకోవాలని లేదు. స్కూల్ కు వెళ్ళటం ఆపాశాను.
నేను వయసుకు వచ్చిన తరువాత నాన్న లో మార్పు వచ్చి కరెక్టుగా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ విధి మమ్మల్ని వదల్లేదు. ఆరునెలల తరువాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కుటుంబ భారం మళ్ళీ నాపై పడింది. నేనూ పనికి వెల్లటం మొదలుపెట్టాను.
అప్పుడే సంతోష్ అనే ఒకతన్ని మీట్ చేశాను. మళ్ళీ విధి ఆడటం మొదలుపెట్టింది. నాతో బాగా సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. నేను తీసుకు వెళ్ళే క్యారేజిని తెరిచి తినడం, నా జడను లాగడం, నాకు ఇచ్చే టీ లో ఉప్పు కలిపి ఇవ్వటం అంటూ చేసే చిలిపి పనులతో నేనూ ఆనందపడి అతనితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాను.
అతను అనాధ అనే నిజం తెలిసిన తరువాత నాకు అతనిపై ప్రేమ పుట్టింది. అతను కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడం మొదలుపెట్టాడు. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఒకరోజు గుడిలో తాలి కట్టాడు. మేము భార్యా-భర్తలుగా మా ఇంటికి వచ్చి అమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాం.
మరుసటి రోజు మా ఇద్దరినీ పనికి రావద్దని యజమాని తిరిగి పంపించాశాడు. ఆ తరువాత సంతోష్ పనికొసం చాలా చోట్లు తిరిగాడు. ఎక్కడా పని దొరకలేదు. అప్పుడు నేను రెండు నెలల గర్భిణిగా ఉన్నాను. సంతోష్ కి బందర్లో పని దొరికింది. జీవితంలో మళ్ళీ వసంతం మొదలైయ్యింది. అన్నీ నా కూతురు నివేదా పుట్టేంతవరకే.
నివేదా పుట్టి ఆరునెలలు అయినప్పుడు ఆయన రైలు ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కూతుర్ని, అమ్మను కాపాడుతూ వచ్చాను. నివేదాకు మూడేళ్ళు వచ్చినప్పడు పక్కనున్న స్కూల్లో చేర్పించాను. పని కోసం చాలా చోట్లు తిరిగాను.
ఎవరూ నాకు పని ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలా పని ఇస్తాన్నన్న వారు, నా పరిస్తితి తెలుసుకుని 'నాకు ఉంపుడుగత్తె గా ఉండటానికి ఓకేనా?' అని అడిగారు. వాళ్ళ ముఖాన ఉమ్మేసి వచ్చాశాను. కానీ, జానెడు పొట్ట ఉందే...అంతకంటే నన్ను నమ్మి రెండు జీవులు! నేనేం చేయను? మనసును చంపుకుని పడుపు వృత్తికి వెళ్ళాను" అని ఆపింది.
అతను ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుని "అవును...నేనొక వ్యభిచారిని. అందులో వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను" అన్నది.
తల మీద పిడుగు పడ్డట్టు అనిపించింది అతనికి.
హృదయం కెలికినట్లు బాధ పడుతూ నీరు నిండిన కళ్ళతో అలాగే కూర్చుండిపోయిన అతన్ని చూసి కంగారు పడిన ఆమె "అరే వదిలేయండి సార్...నేను పుట్టిన సమయం అలా ఉన్నది! దీనికొసం మీరెందుకు బాధపడతారు?"
అని చెబుతూ హాండ్ బ్యాగ్ ఓపన్ చేసి ఒక చిన్న కాగితం తీసి రాసింది.
ఆ కాగితాన్ని అతనికి ఇస్తూ "ఇదిగోండి...ఇది నా ఫోన్ నెంబర్. తెలిసో తెలియకో మీరు నా మీద ఆశపడ్డారు. ఏరోజైనా మీకు ఇష్టముంటే సిగ్గుపడకుండా ఫోన్ చేయండి. సరేనా...?" అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరింది.
మళ్ళీ అతనివైపుకు తిరిగి "సార్...నేను వ్యభిచారినే. అందుకని మీ పెళ్ళికి నన్ను పిలవకుండా వదిలేయకండి" అంటూ కళ్ళ నుండి కారిని కన్నీరును తుడుచుకుని, ఆటో పిలిచి అందులో ఎక్కి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు ఏప్పుడూ లాగానే బస్సు ఎక్కింది. ఆమె కళ్ళు అనుభవ్ ను వెతికినై. కానీ, అతను లేడు. మరుసటి రోజు...ఆ మరుసటి రోజు అంటూ ఒక వారం రోజులు గడిచిపోయింది. అతను కనబడలేదు. 'ఇతనూ అందరి మగాళ్లాలాగానే' అని మరిచిపోయింది.
******************************************
కౌశల్య చెప్పిన విషయాన్ని విన్న తరువాత తన మనసును ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టు గుండె నొప్పితో కూర్చున్న చోటు నుండి లేవలేకపోయాడు అనుభవ్. ఊహించని పరిణామంలో ఎలా స్పందించాలో అర్ధం కాక పిచ్చివాడిలా తనలో తనే మాట్లాడుకున్నాడు. అక్కడ్నుంచి కౌశల్య వెళ్ళిపోయిందని గుర్తించటానికి అరగంటకు పైనే సమయం పట్టింది. నెమ్మదిగా మామూలు స్థిలోకి వచ్చాడు. జరిగింది అర్ధం చేసుకున్నాడు. ఆఫీసుకు వెళ్ళబుద్దికాలేదు. లేచి నిలబడ్డాడు. చేతిలో కౌశల్య రాసిచ్చిన కాగితం. "ఆమెకు ఫోన్ చేద్దామా...?" ఒక్క క్షణం అతని మనసు అతన్ని ఇరకాటంలో పెట్టింది. "ఫోన్ చేసి...ఏం మాట్లాడను...? తనని తాను ప్రశ్నించుకుని తిట్టుకున్నాడు. మెల్లగా నడవటం మొదలుపెట్టాడు.
ఎప్పుడూ సాయంత్రం ఏడుగంటలకల్లా ఇంటికి వచ్చే కొడుకు రాత్రి తొమ్మిదైనా ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ అనుభవ్ తల్లి అతనికి ఫోన్ చేసింది. 'ఔట్ ఆఫ్ రీచ్' అని రిప్లై వచ్చింది. అతని ఆఫీసుకు ఫోన్ చేసింది. ఈరోజు అసలు ఆఫీసుకు రాలేదని చెప్పారు. ఆమెలో కంగారు ఎక్కువ అయ్యింది. కొడుకుకోసం వరాండాలోనే కూర్చుంది.
ఆరోజు ఇంటికి ఎలా తిరిగి వచ్చాడో అతనికే అర్ధంకాని పరిస్థితిలో ఇంట్లోకి అడుగుపెట్టాడు అనుభవ్. తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళి గొళ్లేం పెట్టుకున్నాడు.
తలడిల్లిపోయింది తల్లి. అనుభవ్, అనుభవ్ అంటూ తలుపు మీద ఎంతసేపు కొట్టినా అనుభవ్ తలుపు తెరవలేదు. భయపడిపోయిన తల్లి, కొడుకు గది తలుపు దగ్గరే కూర్చుండిపోయింది.
మరుసటి రోజు ప్రొద్దున్నే
"అమ్మా...అమ్మా..." అంటూ తనగది ముందు గోడకు చతికిలపడిపోయున్న తల్లిని లేపాడు.
"అనుభవ్...ఏమైందిరా...ఏమైందిరా నీకు" కొడుకు మొహాన్ని తడుముతూ కంగారుగా అడిగింది తల్లి.
"నేను బాగానే ఉన్నానమ్మా...నువ్వు కంగారుపడకు..."
"లేదురా నీకు ఏదో అయ్యింది. రాత్రి నిన్ను చూసిన ఎవరైనా కంగారు పడకుండా ఉండరు. ఏం జరిగిందిరా. ఈ అమ్మ దగ్గర చెప్పరా"
“రాత్రి కంటే ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా. నన్ను నమ్ము. నువ్వు ఊహించింది నిజమే. నిన్న నా మనసుకు బలమైన దెబ్బ తగిలింది. ఇంకా ఆ నొప్పి పూర్తిగా తగ్గలేదు...ఇంకో రెండు రోజులు గడిస్తే తగ్గిపోతుంది. నువ్వు కంగారు పడకు"
"ఎవరురా నీ మనసుపై అంత దెబ్బ కొట్టింది...అన్నీ నాతో చెబుతావుగా. ఇది మాత్రం ఎందుకు దాస్తున్నావు. నాకు చెప్పేతీరాలి" మొండికేసింది తల్లి.
"చెబుతానమ్మా...నీతో చెప్పకపోతే నా మనసులోని బాధ ఎలా తగ్గుతుంది. కానీ ఇప్పుడు కాదు. నువ్వెళ్ళి నీ పనులన్నీ ముగించుకురా. అప్పుడు చెబుతాను"
కొడుకు మాటలు ఆ తల్లికి కొంత ఊరట కలిగించింది.
ఆ తల్లి నీరసంగా లేచి లోపలకు వెళ్ళింది. గబగబా పనులు ముగించుకుని కొడుకు గదికి తిరిగి వచ్చింది.
తల్లికి జరిగిందంతా వివరంగా చెప్పాడు.
************************************************
ఆ రోజు ఆదివారం. అలవాటుకు భిన్నంగా కొంచం ఎక్కువసేపు నిద్ర పోయింది కౌశల్య. ప్రొద్దున తొమ్మిదింటికి లేచి అమ్మకు
కాఫీ పెట్టిచ్చి, తానూ ఒక గ్లాసు తాగింది. తరువాత, కూతురికి పాలు చల్లార్చి ఇచ్చింది. అప్పుడు సెల్ ఫోన్ మోగింది. అవతల బొంగురు గొంతుతో దయానందం మాట్లాడాడు.
"ఈ రోజు హైదరాబాద్ నుండి ఒకరు వస్తున్నారు. ఆయనకు నిన్ని బుక్ చేశాశాను. అదే హోటల్ రూం నెంబర్ ఐదు వందల ఒకటి. ఏమిటి...వచ్చేస్తావుగా...?"
"సరే...రేటు అదీ చెప్పారుగా! తరువాత మరిచిపోకుండా మన 'కండిషన్’ చెప్పావా. సాయంత్రం ఐదు గంటలకు పైన అక్కడ ఉండను" అన్నది.
“అబ్బా...ఎప్పుడూ చెప్పేదేగా. అన్నీ చెప్పాను" అన్నాడు.
"అయితే ఓ.కే! సరిగ్గా పదకుండు గంటలకు వచ్చేస్తాను"
ఆ తరువాత అవసరవసరంగా వంట ముగించి తల్లి, చెల్లికి, కూతురుకు ఇచ్చింది. స్నానం పూర్తి చేసుకుని తన అందాన్ని మరింత మెరుగుపరచుకుంది. ఆ తరువాత కూతుర్ని తీసుకువెళ్ళి పక్క వీధిలో ఉన్న 'డే క్యార్’ సెంటర్లో వదిలిపెట్టి వచ్చింది.
మళ్ళీ ఒకసారి నిలువుట్టద్దంలో చూసుకుని తనని సరి చేసుకుంది. మర్చిపోకుండా ఆ సింగిల్ ఎర్ర గులాబీని తీసి తలలో పెట్టుకుంది. 'అన్నీ ఓకే' అని అనుకున్న తరువాత హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది.
“మనింటికి ఎవరొస్తారబ్బా...ఎవరై ఉంటారు?" అనే ఎదురుచూపుతో వాకిటి తలుపు తీసింది. అక్కడ అనుభవ్ నవ్వుతూ నిలబడ్డాడు. ఆమె షాక్ అయ్యింది. అదే సమయం ఆమెకు కొంచం ఆశ్చర్యంగానూ ఉండటంతో...మాటలు రాక తడబడ్డది.
అతని తల్లి, ఆమె వెనుక మరికొంతమంది చేతుల్లో తాంబూలాల పళ్ళాలతో లోపలకు వచ్చి క్రింద కూర్చున్నారు.
అనుభవ్, సోఫాలో కూర్చున్నాడు. కౌశల్య ఏమీ మాట్లాడలేక శిలలాగా మారిపోయింది.
కానీ అనుభవ్ తల్లి,
"అరె ఏంటమ్మా...నువ్వు! అలాచూస్తూ నిలబడ్డావు...? ఏమీ భయపడకు. అన్నీ నా కొడుకు చెప్పాడు. అందుకనే నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి పద్దతి ప్రకారం అడగటానికి వచ్చాము. మనసు పాడుచేసుకోకుండా కాఫీ పెట్టి తీసుకురావమ్మ. అవును...నా వియ్యపురాలు ఎక్కడ?"
అంటూ లోపల గదిలోకి వెళ్ళింది.
అక్కడ మంచం మీద పడుకోనున్న ఆమెను ముట్టుకుని పలకరించింది. "వదిన గారూ, దేనికీ భయపడకండి. మేము మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి సంబంధం అడగటానికి వచ్చాము. ఏమిటి...మీకు ఇష్టమేగా?" అని అడగ,
నోరు వంకరపోయి మాట్లాడలేని ఆ తల్లి కళ్ళ నుండి కన్నీరు వచ్చింది. తన చేతులతో నమస్కారం పెట్టింది.
ఇదంతా చూసిన కౌశల్యకు గట్టిగా ఏడవాలనిపించింది. గదిలోకి పరిగెత్తింది. అది గమనించిన అనుభవ్ తల్లి "అయ్యయ్యో ఇదెక్కడి గోలమ్మా? ఒసేయ్ కమలా...నువ్వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకురావే" అని గుంపులోని ఒకావిడకు ఆర్డర్ వేసి హాలులోకి వచ్చింది.
"అరేయ్ అనుభవ్...ఇక్కడకి రారా. ఆ అమ్మాయి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వెళ్ళి సమాధన పరచి తీసుకురారా" అని చెప్పి కొడుకును పంపించింది.
మెల్లగా కౌశల్య ఉన్న గదిలొకి వెళ్ళాడు మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తోంది.
ఆమె భుజాలను ముటుకున్నాడు. చటుక్కున లేచి కూర్చుంది. మళ్ళీ పెద్దగా ఏడుస్తూ లేచి అతని కాళ్ళపై పడింది. దానికి అడ్డుపడి భుజాలను పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు.
ఆ సమయం ఆమె సెల్ ఫోన్ మోగింది.
దాన్ని తీయబోయిన అనుభవ్ ను అడ్డుకుంది కౌశల్య.
"వద్దు...వద్దు" అంటూ ఏదో చెప్పబోయేంతలో "నేనూ అదే చెబుతున్నా...ఇక నీకు ఆ ఫోన్ వద్దు. నీకూ నాకు ఈ ఆదివారం పెళ్ళి. అమ్మ వొప్పుకుని మూహూర్తం పెట్టించింది" అంటూ ఆమె చేతిలోని సెల్ ఫోన్ ను తీసుకోబోయాడు.
"వద్దు..వద్దు ఈ పెళ్ళి నాకొద్దు. నాకు ఇష్టం లేదు"
"కౌశల్య..." ఆశ్చర్యంగా ఆమెను చూశాడు.
"అవును...నేను పూజకు పనికిరాని పువ్వును. మీరు, మీ
అమ్మ పూజింపబడాల్సిన దేవుళ్ళు. మీ ఇళ్ళు ఒక దేవాలయం. ఆ పవిత్రమైన చోటును అమంగళం చేయలేను...ఇక మీరు వెళ్ళొచ్చు" అంటూ వాకిటివైపు చేయి చాచింది.
"కౌశల్య.." అంటూ ఏదో చెప్పబోయిన అనుభవ్ ను చూసి చేతులెత్తి దన్నం పెడుతూ "ప్లీజ్..." అంటూ మళ్ళీ వాకిలివైపు చెయ్యి చాపింది.
అనుభవ్, తల్లి, మిగిలిన వాళ్ళూ బయలుదేరి వెళ్ళిపోయారు.
ఏడుస్తూ మంచం మీద వాలి పోయింది కౌశల్య.
ఆ వారమే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది కౌశల్య.
**************సమాప్తం****************
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి