11, మార్చి 2024, సోమవారం

జ్ఞానోదయం: ‘ముక్తి’ (ఆద్యాత్మిక కథ-3)

 

                                                                                     జ్ఞానోదయం: ‘ముక్తి’                                                                                                                                                                   (ఆద్యాత్మిక కథ-3)

సాధువు ఒకరు ఉండేవారు. ఆయన దగ్గరకు చాలామంది వస్తారు. వాళ్ళందరికీ ఆయన చెప్పే ఉపదేశం వినే అలవాటు. అందరికీ ఆలోచన చెప్పి వూరట కల్పిస్తారు.

ఒక రోజు ఆ సాధువు దగ్గరకు ఆలొచన అడగటానికి వచ్చాడు ఒక పిసినారి.

"స్వామీ, నేను ముక్తి పొందటానికి దారి చెప్పండి..." అన్నాడు.

ఇదిగో చూడు నాయనా, ముక్తి పొందాలంటే మహాత్ములు, శాస్త్రాలూ చూపిన, ధర్మ కార్యాలను చేపట్టాలి. పేదలకు, కష్టపడే వాళ్ళకూ మరియూ ఎవరూ లేని వారికీ సహాయం చేయాలి..." అన్నారు సాధువు.

'ఈ సాధువు చెప్పినట్టు నడుచుకుంటేనే మనకు ముక్తి దొరికేటట్టు ఉంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుందే.  ఖర్చు చేస్తే నాదగ్గర ఉన్నదంతా కరిగిపోతుందే...ఏం చేయాలి?

సరే...ఆయన చెప్పిన ఉపదేశాన్ని తీసుకోలేకపోయినా కనీసం ఎంత చేయగలమో అంత చేద్దాం.  అంత వరకు ముక్తి దొరికితే చాలు...' అని నిర్ణయించుకున్నాడు.

ప్రతి రోజూ పిడికెడు బియ్యం తీసుకుని, దాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చేవాడు.

ఇలాగే చేస్తున్న అతను, కొన్ని రోజుల తరువాత తిరిగి ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు.

"ఏమయ్యా, నేను చెప్పినట్టు దానం చేస్తూ వస్తున్నావా?" అని అడిగారు సాధువు.

"అవును స్వామీ...రోజూ, మరిచిపోకుండా ఒక పిడికెడు బియ్యం దానం చేస్తూ వస్తున్నాను..." అంటూ గొప్పగా చెప్పాడు.

అది విన్న సాధువు అతన్ని పొగడతారని, అభినందిస్తారని ఎదురు చూశాడు పిసినారి.

కానీ, సాధువు ఏమీ మాట్లాడకుండా, ఆయన కూర్చున్న చెట్టు అడుగు బాగాన్ని, తన చేతి గోరుతో గీకటం మొదలు పెట్టారు.

అది చూసిన పిసినారి "ఏమిటి స్వామీ, నేను చేసిన దానం గురించి చెప్పాను...మీరు దాని గురించి ఏదీ చెప్పకుండా, చెట్టునూ గీకుతూ ఉన్నారు...?" అని సాధువును అడిగాడు.

"ఏమీ లేదయ్యా...నేను నా గోటితో ఈ చెట్టును నరుకుతున్నాను. నువ్వు కాసేపు మౌనంగా ఉండు..." అన్నారు సాధువు.

"ఏమిటండీ ఇది. చేతి గోటితో ఇంతపెద్ద చెట్టును నరకగలమా? గొడ్డలితో చెయ్యాల్సిన పనిని, మీ గోటితో ఎలా నరకగలరు..." అన్నాడు.

"ఒక పిడికెడు బియ్యాన్ని ఇచ్చేసి, నువ్వు మోక్షానికి వెళ్ళాలని, ముక్తి పొందాలని అనుకునేటప్పుడు, నా వేళ్ళ గోరుతో ఈ పెద్ద చెట్టును నరకాలని నేను అనుకోకూడదా?" అన్నారు సాధువు.

వెంటనే ఆ ఆసామి, తాను చేసిన తప్పు తెలుసుకుని స్పష్టత పొందాడు.

                                               ముక్తి పొందటం అనేది, మామూలు విషయమా?

*************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి