1, ఏప్రిల్ 2024, సోమవారం

పాపానికి బహుమతి...(కథ)

 

                                                                                    పాపానికి బహుమతి                                                                                                                                                                              (కథ)

పాపం చేసిన వాళ్ళు ఎప్పుడూ శిక్ష నుండి తప్పించుకోలేరు. ఇది తెలిసున్నా, దీనిని కొంతమంది పట్టించుకోకుండా పాపం చేస్తూనే ఉంటారు. చివరకు వారు చేసిన పాపానికి శిక్షను చట్టపరంగానో, విధిపరంగానో అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందిన వాడే సుధాకర్. అతను చేసిన పాపానికి అతనికి చట్టపరంగా శిక్ష పడలేదు( చట్టపరంగా అతనికి శిక్షపడదనే ధైర్యంతోనే అతను పాపం చేస్తాడు). కానీ దేవుడు విధి రూపంలో అతనికి వేసిన శిక్ష నుండి అతను తప్పించుకోలేకపోయాడు. అతను తెలిసే చేసిన పాపానికి అతనికి పడిన శిక్ష ఒక బహుమతి.

అతను చేసిన పాపం ఏమిటి? అతనికి శిక్షగా దొరికిన బహుమతి ఏమిటి?....తెలుసుకోవాలంటే పాపానికి బహుమతి కథ చదవండి.

***************************************************************************************************

గుడివాడలో ఒక పెళ్ళి ఫంక్షన్ కు వెళ్ళటానికి భార్య సుమతితో పాటు కొత్త బస్ స్టేషన్ కు వచ్చాడు సుధాకర్.

రోజు ముహూర్తం రోజు కావడంతో బస్ స్టేషన్ ఎక్కువమంది జనంతో కిటకిటలాడుతోంది. అది సుధాకర్ కి చికాకు తెప్పించింది.

గుడివాడకు వెళ్ళే బస్సులు నిలబడే చోటుకు చేరుకున్నారు భార్యాభర్తలు. చాలాసేపటి నుండి బస్సులేదేమో అక్కడ విపరీతమైన జనం పోగై ఉన్నారు. అది సుధాకర్ చికాకును మరింత పెంచింది. "టాక్సీలో వెడదామా" అన్న ఆలొచన వచ్చింది. "అమ్మో...మామూలుగానే డబ్బులు ఎక్కువ అడుగుతారు...అందులోనూ రోజు ముహూర్తం రోజు...మామూలు కన్నా డబుల్ రేటు అడుగుతారు" అన్న మరో ఆలొచన రాగానే టాక్సీలో వెడదామనే ఆలొచన చచ్చిపోయింది.

లోపు బస్సు వచ్చింది. వెంటనే పోటీ పడి, ఒకరినొకరు తోసుకుంటూ జనం పరిగెత్తారు. సుధాకర్ కూడా అలాగే చేయవలసి వచ్చింది. జనాన్ని నెట్టుకుంటూ బస్సులోకి వెళ్ళి తనకూ, భార్యకూ సీట్లు పట్టాడు. ప్రొద్దున్నే ఎండ ఉగ్రరూపం దాల్చిందేమో సుధాకర్ చొక్కా అంతా చెమటతో తడిసిపోయింది.

నిదానంగా బస్సులోకి ఎక్కిన సుమతి భర్త పక్కనే కిటికీ పక్కన కూర్చుంది.

బస్సులో కిటకిటలాడుతున్న ప్రయాణీకుల వలన గాలి రాకపోవడం, వేడిగా ఉండటంతో బాగా ఉక్కగా ఉన్నది. సారా వాసనతో పాటూ, చెమట కంపు కలిసి రావడంతో సుధాకర్ కి కడుపులో తిప్పినట్లు అయ్యింది.

తల నిండా మళ్లె పువ్వులు పెట్టుకుని, తనకు నచ్చిన పట్టు చీర కట్టుకుని, మురిసిపోయే అందంతో తన పక్కనే కూర్చున్న భార్యను చూసి సంతోషపడే మూడ్ లో కూడా లేడు సుధాకర్.

బస్సు బయలుదేరింది. అప్పుడు బయట నుండి వచ్చిన గాలి సుధాకర్ కి కొంచం మనశ్శాంతిని ఇచ్చింది.

బస్సు కైకలూరు వచ్చి ఆగింది. అక్కడ బస్సుకోసం కాచుకుని ఉన్నవారు పోటాపోటీగా బస్సులోకి ఎక్కారు. బస్సు మరింత ఇరుకు అయ్యింది.

బస్సు బయలుదేరింది. వేడేక్కిన ఎండతో గాలి కూడా వేడేక్కడంతో కిటికీలో నుండి వేడి గాలి వీసింది. బస్సు వేగం పుంజుకోవటంతో వేడిగాలే సుధాకర్ కీ, మిగిలిన ప్రయాణీకులకూ కొంత ఊరటనిచ్చింది.

తెల్లటి మీసాలతో వయసైన ముసలాయన ఒక అందమైన రెండేళ్ళ ఆడపిల్లను ఎత్తుకుని సుధాకర్ పక్కనే నిలబడి ప్రయాణం చేస్తున్నాడు. ఒక చేత్తో పిల్లను పట్టుకుని, మరో చేత్తో బస్సు పై కడ్డీని పట్టుకుని చాలా కష్టపడుతున్నాడు. అప్పుడప్పుడు జారి సుధాకర్ భుజంపై ఒదుగుతున్నాడు. ముసలాయన పడుతున్న అవస్తను చూసి సుమతికి జాలేసింది. ఆమె తన వైపు జాలిగా చూడటం గమనించిన ముసలాయన "ఏమ్మా తల్లీ...పిల్లను కొంచం తీసుకోకూడదూ...నిలబడటానికి చాలా కష్టంగా ఉన్నది" అని సుమతిని అడిగాడు.

తలతలమని మెరిసిపోతున్న పట్టుచీరలో ఉన్నా, దాని గురించి ఆలొచించకుండా తన వైపే చూస్తున్న అందమైన పసి పిల్ల చూపులకు, ముసలాయన జాలి మాటలకు కరిగిపోయిన సుమతి ఎటువంటి ఆక్షేపణ తెలుపకుండా ముసలాయన చేతిలో ఉన్న పాపను తీసుకుంది. సుధాకర్ కూడా ఏమీ అనలేదు.

పాపకు సుమతి కొత్త మనిషైనా ఏడవకుండా సుమతి ఒడిలో కూర్చుంది. అప్పుడప్పుడు సుమతి మొహం వైపు చూసి నవ్వుతోంది. సుమతి కూడా బొద్దుగా, ముద్దుగా ఉన్న పాపను ముద్దులాడింది. పాప నిద్రలోకి జారుకోవడం గమనించిన సుమతి, పాపను ముద్దులాడడం మానేసి తానూ కూడా కళ్ళు మూసుకుంది. సుమతి కూడా నిద్రలోకి వెళ్ళింది.

తాను కూడా కాసేపు నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు సుధాకర్. వేడి గాలి అతన్ని నిద్ర పోనివ్వలేదు. సీటులో సరిగ్గా కూర్చుందా మనకున్నప్పుడు అతని కళ్ళకు తన ముందు సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్న అమ్మాయి కనబడింది. గుండె గుబేలుమంది. "వందన కాదు కదా?" అతని మనసు ఒక్క క్షణం గిలగిలా కొట్టుకుంది. కావాలనే సీట్లో నుండి లేచి చొక్క సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ అమ్మాయిని మరోసారి చూశాడు. "వందన కాదు"...హమ్మయ్య అనుకుని స్థిమితంగా సీట్లో కూర్చున్నాడు.

కానీ సుధాకర్ మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. పాత జ్ఞాపకాలు అతని మనసు నుండి బయటపడి అతని ముందు నిలబడటంతో అమాయకురాలైన వందన అతనికి గుర్తుకు వచ్చింది. ఇదేలాగా మూడేళ్ల క్రితం స్నేహుతుని పెళ్ళికి గుడివాడకు వెడుతున్నప్పుడు తాను కూర్చున్న సీటు దగ్గర అందమైన ఆడపిల్ల నిలబడింది. చోరవు తీసుకుని తన సీటులో కొంచంగా పక్కకు జరిగి, నిలబడున్న పిల్లను కూర్చోమన్నాడు. మొదట్లో కొంచం సంసయించినా నిలబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక అతని పక్కన కూర్చుంది. మెల్లగా మాట కలిపిన సుధాకర్ ఆమె పేరు వందన అని, ఆమె కూడా గుడివాడలో ఒక పెళ్ళి అటెండ్ అవడానికే వెడుతున్నదని తెలుసుకున్నాడు.

సుధాకర్ వెళ్ళిన పెళ్ళి మండంపంలోకే వందన కూడా వెళ్ళింది. వందన పెళ్ళి కూతురి స్నేహితురాలని ఆమెతో మాటలు కలిపిన సుధాకర్ తెలుసుకున్నాడు. ఆమె కూడా తానుంటున్న ఊర్లోనే ఉంటున్నట్లు కూడా తెలుసుకున్నాడు. ఆమెతో స్నేహం కోనసాగించేడు. వందనకు కూడా సుధాకర్ యొక్క మంచితనం నచ్చింది. వారిద్దరి స్నేహం ప్రేమకు దారి తీసింది. ఆమెతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో అతని మనస్సు అతన్ని వేధనకు గురిచేసింది. ఆమెను మోసం చేసినది తలచుకుని సిగ్గుపడ్డాడు. డబ్బుకూ, హోదాకూ అమ్ముడుపోయి సుమతి మెడలో తాలి కట్టాడు.

బస్సు ఒక్క ఊపుతో ఆగినందువలన సుధాకర్ ఆలొచనలకు బ్రేకు పడింది.

బస్సులోని ప్రయాణీకులలో చాలా మంది హడావిడి పడుతున్నారు. ఏమై ఉంటుందా అనుకుని బస్సుకు అటూ ఇటూ చూశాడు. దిగటానికోసం హడావిడి పడుతున్నారని గ్రహించి విసుకున్నాడు. బస్సు ఎక్కాలనుకున్నప్పుడు హడావిడి పడటంలో అర్ధం ఉన్నది.... దిగేటప్పుడు హడావిడి పడటం ఎందుకో అనుకున్నాడు. అక్కడ చాలామంది ప్రయాణీకులు దిగిపోవడంతో బస్సు చాలా వరకు ఖాలీ అయ్యింది.

సుమతిని చూశాడు సుమతి, సుమతి ఒడిలోని పాప మంచి నిద్రలో ఉన్నారు. బస్సులో హడావిడి మోతలు వాళ్లని డిస్టర్బ్ చేయలేదు. సుధాకర్ కి అప్పుడు గుర్తుకు వచ్చాడు ముసలాయన. వేనక్కి తిరిగి చూశాడు. తన పక్కన నిలబడి ప్రయాణం చేస్తూ, పిల్లను తన భార్యకు ఇచ్చిన ముసలాయన కనబడలేదు..... లోపు బస్సు మళ్ళీ బయలుదేరింది. బస్సు ఖాలీ అయ్యింది కదా...ముసలాయనకి ఎక్కడో సీటు దొరికుంటుంది" అనుకుంటూ లేచి నిలబడి చూశాడు. సుధాకర్ కి ముసలాయన కనిపించలేదు. మరోసారి ప్రతి సీటు వైపు పరీక్షగా చూశాడు. ముసలాయన కనిపించలేదు.

సుధాకర్ గుండే గుభేలు మంది. ఆందోళనతో సుమతిని లేపాడు.

" పాపను నీకిచ్చిన ముసలాయన కనబడటం లేదు" అన్నాడు.

నిద్ర మత్తులో నుండి బయట పడ్డ సుమతి "పాప నాదగ్గరుంటే ఆయనెక్కడికి పోతాడు....సీటు దొరికి ఎక్కడో కూర్చోనుంటాడు...చూడండి" అన్నది సుమతి.

"రెండు సార్లు బస్సంతా వెతికేను. ముసలాయన కనబడటంలేదు" చెప్పాడు సుధాకర్.

సుధాకర్ మాటలకు కంగు తిన్న సుమతి ఒక్కసారిగా నిద్ర మత్తులో నుండి బయట పడింది. "సరిగ్గా చూడండి" అంటూ పాపను చేతులలోకి తీసుకుని లేచి నిలబడి ఆమె కూడా బస్సును పూర్తిగా పరిశీలించింది. ముసలాయన కనబడలేదు. పాప వంక చూసింది. పాప సుమతిని చూసి నవ్వింది. "పాప మన దగ్గర ఉంటే ఆయనెలా దిగిపోతాడు" భర్తతో చెప్పింది.

"ఏమో అదే నాకూ అర్ధం కావటం లేదు"

"అయితే ఇప్పుడేం చేద్దాం" అన్నది సుమతి.

"ఉండు ఇప్పుడే వస్తాను" అంటూ లేచి, బస్సులో ఉన్న వారిని మరోసారి చూసు కుంటూ కండక్టర్ దగ్గరకు వెళ్ళాడు సుధాకర్.

"కండక్టర్" అని పిలిచాడు సుధాకర్.

"ఏమిటి సార్ చిల్లర ఇవ్వాలా...టికెట్టు ఇవ్వండి" మామూలుగా ఎప్పుడూ ప్రయాణీకులను అడిగేమాట అడిగాడు కండక్టర్.

"చిల్లర గురించి కాదు"

"మరి"

"ఇందాక గుంపులో నిలబడి ప్రయాణం చేస్తున్న ఒక ముసలాయన తన దగ్గరున్న పాపను కూర్చున్న నా భార్య దగ్గర ఇచ్చాడు. పాపతో నిలబడి ప్రయాణం చేయడం కష్టం...అందులోనూ ఆయన ముసలాయన...అందుకని నేనూ ఏమీ మాట్లాడకుండా ఉరుకున్నాను...మేము అలసిపోయుండటం వలన పడుకున్నాము. ఇప్పుడు లేచి చూస్తే పాపను ఇచ్చిన ముసలాయన కనబడటంలేదు"

"ఎక్కడన్నా కూర్చునున్నారేమో....బస్సంతా బాగా చూశారా"

చూశాను....ఎక్కడా ఆయన లేడు"

"ఏమిటి సార్...కొత్తగా ఉంది. పాపను ఇచ్చిన వాళ్ళు...పాపను మర్చిపోయి దిగిపోతారా ఏమిటి? మర్చిపోవడానికి అదేమైనా వస్తువా?"

"అదే నాకూ అర్ధం కావటం లేదు"

చూస్తే బాగా చదువుకున్న వారిలా కనబడుతున్నారుతప్పంతా మీదే సార్...ముందూ, వెనుకా తెలియని వారితో ఎందుకు ఇలాంటి విషయాలు పెట్టుకుంటారు...ఇందులో నా వల్ల ఏమీ చేయటం కుదరదు. ఇంకొద్ది సేపట్లో బస్సు గుడివాడ టౌన్లోకి వెడుతుంది, మొదటి స్టాపింగ్లో దిగండి. పక్క సందులోనే పోలీస్ స్టేషన్ ఉన్నది...జరిగింది చెప్పి పాపను వాళ్ళదగ్గర అప్పగించండి" చెప్పాడు కండక్టర్.

సుధాకర్ కి ఏమి చేయాలో అర్ధంకాక మెల్లగా తన సీటు దగ్గరకు వెళ్ళాడు. కండక్టర్ చెప్పిందంతా భార్యకు చెప్పాడు...."ఇప్పుడేం చేద్దా మండీ?' ఆందోళనతో భర్తను అడిగింది.

"కండక్టర్ చెప్పినట్లు పోలీసు స్టేషన్లో పాపను అప్పగించేద్దాం"

"సరే" అంటూ చేతిలో ఉన్న పాపను ఒకసారి చూసింది సుమతి. సుమతిని చూసి పాప అందంగా నవ్వింది. పాప నవ్వును ఆనందించే మూడ్ లో లేదు సుమతి.

బస్సు గుడివాడ టౌన్లోకి తిరిగి కొంచం దూరం వెళ్ళి ఆగింది.

"సార్...మీరు ఇక్కడ దిగిపొండి...పక్క సందులోనే పోలీస్ స్టేషన్" కండక్టర్ చెప్పడంతో భార్య సుమతితో అక్కడ దిగాడు సుధాకర్.

భార్యా భర్త లిద్దరూ కలిసి మెల్లిగా పోలీసు స్టేషన్ వైపు నడవ సాగారు. ఇంతలో సుధాకర్ జేబులోని సెల్ ఫోన్ మోగింది. జేబులోని సెల్ ఫోన్ తీసి "హలో" అన్నాడు.

"నేనే సార్...ఇందాక బస్సులో పాపను మీకిచ్చిన ముసలాయనను మాట్లాడుతున్నాను"

"మీకేమైన మతిపోయిందా...పిల్లను మాకిచ్చి మీరు దిగిపోయారు....ఎంత కంగారు పడ్డమో తెలుసా...ఇప్పుడు ఎక్కడున్నారు" అరుస్తూ మాట్లాడేడు సుధాకర్.

"నాకేమి మతిపోలేదు... పిల్లను నీకివ్వాలనే అలా చేశాను"

"ఏమిటా అర్ధంలేని మాటలు"

"అరవకు సుధాకర్...అరిస్తే నీ పరువే పోతుంది... నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవెరో నాకు తెలుసు....నేను వందన తండ్రిని. నా కూతురును ప్రేమించి, మోసం చేసి, నీ అవసరం తీర్చుకుని నా కూతుర్ని వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్ళిచేసుకున్నావే.నువ్వూ ఒక మనిషివేనా? ……ఏం జరిగిందో తెలుసా? వందన ఆత్మహత్య చేసుకుంది...బిడ్డను నా కిచ్చి ఆత్మ హత్య చేసుకుంది... ఇప్పుడు నీభార్య దగ్గరున్న బిడ్డ బిడ్డే... బిడ్డ నీ బిడ్డే....ఏలాగూ ప్రేమించిన దానిని వదిలేసి ఒక పాపం చేశావు, ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు చేసి మరో పెద్ద పాపం మూటగట్టుకున్నావు. కనీసం నీ పాపను నువ్వు పెంచి, పోషించి, పెద్దదాన్ని చేసి నువ్వు చేసిన పాపంలో కొంచమైనా తగ్గించుకో....నువ్వు చేసిన పాపానికి దేవుడిచ్చిన బహుమతిగా పాపను కంటికి రెప్పలా కాపాడు"

అలా కాదని అతి తెలివి తేటలతో పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించేవో, నీ బండారం అంతా బయటపడుతుంది. బిడ్డ ఎవరూ, బిడ్డను ఇచ్చిన  ముసలాయన ఎవరు అని ఎంక్వయరీ చేస్తారు. వాళ్ళు ఎంక్వయరీ ప్రారంభించటానికి ముందే నేనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బిడ్డ నీదేనని, నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని మొసం చేసి, గర్భవతిని చేసి, వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుని, నా కూతురు ఆత్మహత్య చేసుకోవటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు నా దగ్గర నుండి బిడ్డను తీసుకుని బిడ్డను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు, అంటూ ఎంక్వయరీను నీమీదకే తిప్పి, నిజాన్ని బయటపెట్టి, నిన్ను జైలుకు పంపిస్తాను...అప్పుడు, ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్న భార్య కూడా ఒంటరిదైపోతుంది. సంతోషంగా జీవించాలనుకున్న నీ జీవితమంతా వృధా అయిపోతుంది. నీ భార్యకు బిడ్డ గురించి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలియదు. కానీ బిడ్డను, నీ బిడ్డగా పెంచు. ఇది దేవుడిచ్చిన బహుమతిగా ఉంచుకో."  అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

సుధాకర్ పిచ్చివాడిలా నిలబడిపోయేడు.

*****************************************************సమాప్తం************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి