5, ఏప్రిల్ 2024, శుక్రవారం

బాధ్యత…(కథ)

 

                                                                                   బాధ్యత                                                                                              (కథ)

బాధ్యతలను ఎవరూ విస్మరించకూడదు. విస్మరిసే అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. బాధ్యతలను చూసి పారిపోకూడదు, ఎందుకంటే అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి

ఎవరు పనిచేసినా దాని బాధ్యత కూడా వారిదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా వారి చేత పని చేయించారని ఎవరూ చెప్పలేరు ...ఎందుకంటే ఒకరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ ఎవర్నీ బలవంత పెట్టలేరు. ఒక పని చెయ్యాలో వద్దో నిర్ణయించేది వారే ...స్వేచ్ఛతోపాటే బాధ్యత కూడా వస్తుంది. నిజానికి స్వేచ్ఛే బాధ్యత. కానీ మనసు మహామోసకారి....అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది, కానీ సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు....అలాంటి ఒక మనసు తన బాధ్యతను వదిలిపెట్టేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ, ప్రకృతి మనసుకు బాధ్యత గురించి తెలుపుతుంది....ఎలా తెలిపింది తెలుసుకోవటానికి కథను చదవండి.

***************************************************************************************************

"డాక్టర్...ఎలాగైనా నా భార్యా బిడ్డలను కాపాడండి. వారు తప్ప ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు" ఏడుస్తూ చెప్పేడు గణేష్.

చూడండి మిస్టర్.గణేష్...దానికోసమే ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం నిన్నటి నుండి క్రుషి చేస్తున్నారు. కానీ మీ భార్య ఆరొగ్యంలో కొంచం కూడా మార్పు కనిపించడంలేదు. మీ భార్య కేసును మేమంతా ఒక చాలెంజ్ గా తీసుకున్నాము. నిజానికి ఇప్పుడు జరుగుతున్నది వైద్యానికి-విధికి మధ్య యుద్దం. వైద్యం మూలంగా విధిని జయించటానికి నగరంలోని డాక్టర్లంతా ఒకటయ్యేరు. మీ భార్య కేసులో ఎటువంటి ట్రీట్ మెంట్ చేస్తే తల్లీ-బిడ్డను కాపడవచ్చుననే విషయంపై వైద్య సముదాయమే పుస్తకాలు తిరగేస్తున్నది...కాబట్టి మీరు కొంచం రిలాక్స్డ్ గా ఉండండి...మమ్మల్ని రిలాక్స్డ్ గా ఆలోచించుకోనివ్వండి. నెగటివ్ గా ఆలొచించి మీ మనసు పాడుచేసుకోకండి. తల్లీ-బిడ్డ క్షేమంగా ప్రపంచాన్ని చూస్తారని నమ్మకంగా ఉండండి" అన్నాడు డాక్టర్.

"ఎలా ఉండగలను డాక్టర్? వైద్యానికీ-విధికీ మధ్య యుద్దం జరుగుతున్నదని మీరే చెబుతున్నారే! దానికి అర్ధమేమిటి డాక్టర్? వైద్యం కంటే విధి బలంగా ఉన్నదనేగా అర్ధం...వైద్యులైన మీరే మాట చెబితే...మామూలు మనుష్యులమైన మేమంతా ఏమై పోవాలి చెప్పండి"

అందుకని మీతో అబద్దం చెప్పమంటారా? పేషంట్ల దగ్గర నిజాలు దాచకూడదనేది మా వృత్తి దర్మం. అందుకని నిజమే చెబుతున్నా...వైద్యం కంటే విధియే గొప్పది, డాక్టర్ల కంటే దేవుడే గొప్ప...మేము నిమిత్త మాత్రులమే. ఒక రోగిని రక్షించడం-తీసుకుపోవడం మా కంటే గొప్పవాడైన దేవుడే చేయగలడు...కానీ పనికి డాక్టర్లైన మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. వైద్యపరంగా ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో రోగికి అవన్నీ చేస్తూనే ఉంటాము...అయినా రోగి ఆరొగ్యంలో కొంచం కూడా మార్పు రాకపోవడమే కాకుండా అనుకోని మరికొన్ని ఆనారొగ్య పరిస్థితులు ఎదురైతే మేము మాత్రం ఏమి చెయ్యగలం"

"అందరి సంగతి నాకు తెలియదు గానీ...నాకు మాత్రం వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు డాక్టర్. వీళ్ళే నా ప్రపంచం...అందుకే అడుగుతున్నా...కాదు, కాదు వేడుకుంటున్నా...నా భార్యా బిడ్డలను ఎలాగైనా కాపాడండి"

"మీ బాధ నాకు అర్ధమయ్యింది...నేను చెప్పేది కూడా మీరు అర్ధం చేసుకోవాలి. మనుష్యులను మనుష్యులు ఎప్పుడూ వేడుకోకూడదు. మనిషి ఎప్పుడూ భగవంతుడినే వేడుకోవాలి....వెళ్ళండి...మీరు పనిలో ఉండండి...మేము మా విధులలో ఉంటాము" అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోయేడు డాక్టర్.

డాక్టర్ చెప్పింది విని "భగవంతుడా...నా భార్యాబిడ్డలను కాపాడు" అని మనసులోనే భగవంతుడిని ప్రార్ధిస్తూ భారమైన మనసుతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గణేష్.

అప్పుడే హాస్పిటల్లోకి క్యారేజీతో వచ్చిన ఒక ముసలమ్మ గణేష్ దగ్గరకు వచ్చి, అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని "ఏం నాయనా...డాక్టర్లు ఏం చెబుతున్నారు" అని అడిగింది.

గణేష్ కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా చెప్పటంలేదు బామ్మగారు... వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట" పొంగుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ చెప్పేడు గణేష్.

నువ్వేమీ బాధ పడకు నాయనా... దేముడు నీకు అన్యాయం చేయడు...నీ ఇష్ట దైవాన్ని మొక్కుకో...అంతా మంచే జరుగుతుంది. ఇదిగో నీ కోసం క్యారేజీ తెచ్చేను...కాస్త ఎంగిలిపడు" గణేష్ కి ధైర్యం చెబుతూ చెప్పింది బామ్మగారు.

"వద్దు బామ్మగారు...నాకు ఏమీ తినాలనిపించడం లేదు. నన్ను బలవంతం చేయకండి" అన్నాడు.

లోపు ల్యాబర్ వార్డ్ డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూసేడు గణేష్.

డాక్టర్ బయటకు వచ్చేడు. తిన్నగా గణేష్ దగ్గరకు వచ్చేడు. గణేష్ లేచి నిలబడ్డాడు సారీ గణేష్...తల్లీ బిడ్డలలో బిడ్డను మాత్రమే కాపడ గలిగేము" అని చెప్పేడు.

మాట విన్న గణేష్ తలపట్టుకుని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు.

****************

పదిహేను రోజుల నుండి గణేష్ తిండి-నిద్రలకు దూరమవడం వలన బాగా చిక్కిపోయేడు.

గదిలో కట్టిన గుడ్డ ఉయ్యాలలో పసి పిల్ల హాయిగా నిద్రపోతోంది.

గోడను ఆనుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చున్న గణేష్ కి ఎదురుగా ఉన్న దేవుని ఫోటో కనబడింది. మెల్లగా లేచి ఫోటోకు ఎదురుగా నిలబడ్డాడు.

నా కెందుకు ఇంత పెద్ద శిక్ష వేసేవు. నేనూ, నా భార్య ప్రతిరోజూ నీకు పూజలు చేసేమే...వారానికొకసారి నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకుని మమ్మల్ని దీవించమని, ఎవరూ లేని మాకు నీవే దిక్కు అని వేడుకున్నామే....నువ్వు మాకు తోడుగా ఉంటావనే ధైర్యంతో మేము మా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా మా జీవితాన్ని గడుపుతున్నామే...అలాంటి మాకు నువ్వెందుకింత అన్యాయం చేసేవు...నాకెందుకింత కష్టాన్ని ఇచ్చేవు...మాకు తోడుగా ఉండమని మాత్రమే నిన్ను వేడుకున్నామే తప్ప, ఇంకేమీ నిన్ను అడగలేదే? ఎలాంటి వరమూ కోరుకోలేదే? అలాంటి నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేసేవు....నా అన్న వాళ్ళందరినీ వదులుకుని, నువ్వున్నావనే నమ్మకంతో పెళ్ళి చేసుకున్న నాకు బిడ్డను వరంగా ఇచ్చి, నా భార్యను నా నుండి, పసి బిడ్డ నుండి వేరు చేసి నీ దగ్గరకు తీసుకెళ్లేవే...తల్లి లేని బిడ్డను ఎలా పెంచగలననుకున్నావు?...అది సాధ్యమేనా?..." అంటూ దేమున్ని నిలదీస్తున్న గణేష్ కి ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఏడుపు వినిపించింది.

బిడ్డ దగ్గరకు వెళ్ళేడు. బిడ్డ ఏడుపు పెద్దదయ్యింది.

తిండి-నిద్రలకు గణేష్ దూరమయ్యేడు గానీ పసిబిడ్డ రెండింటికీ దూరమవగలదా! ఆకలేసి పాలకు ఏడుస్తోందని గ్రహించేడు. ఉయ్యాలలో ఉన్న, పుట్టి పదిహేనురోజులే అయిన ఆడపిల్లను చేతులలోకి తీసుకుని, గుండెలకు హత్తుకుని, పక్కనే టేబుల్ మీద పెట్టిన పాల సీసాను తీసుకుని సీసా పీకను బిడ్డ నోటికి అందించేడు.

పుట్టిన క్షణం నుండి తల్లి పాలే తాగని బిడ్డకు సీసా పాలు పడుతుంటే అతని గుండే బాధతో గిలగిలా కొట్టుకుంది.

పాల బాటిల్లో ఒక చుక్క పాలు కూడా మిగల్చకుండా పాలు తాగిన బిడ్డను మళ్ళీ ఉయ్యాలలో పడుకోబెట్టి, ఉయ్యాలను ఊపేడు. పసికందు మెల్లగా నిద్రలోకి జారుకుంది.

అంతవరకు బిడ్డ ధ్యాసలో ఉన్న గణేష్ ని తిరిగి ఆలొచనలు చుట్టు ముట్టినై. సారి ఆలొచనలు అతన్ని పాత జ్ఞాపకాలలోకి తీసుకువెళ్ళినై.

***************************

పొట్ట కూటికోసం గ్రామం నుండి నగరానికి వచ్చేడు గణేష్.

నగరంలో రకరకాల ఉద్యోగాలకొసం ప్రయత్నించిన అతనికి చివరికి డ్రైవర్ ఉద్యోగం దొరికింది. అది కూడా ట్రావల్స్ కంపెనీలో. వాళ్ళిచ్చే జీతం అతనికి సరిపోతోంది. జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ జీవితం కోనసాగిస్తున్న అతనికి అదే ట్రావల్స్ లో క్లర్క్ గా పనిచేస్తున్న మాధవితో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. రెండు కుటుంబాల వారూ వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఊరు చివర ఉన్న ఒక చిన్న పూరిగుడిసలో అద్దెకు దిగేరు. ఇంటి యజమానురాలు డెబ్బై సంవత్సరాల ముదసలి. ఆవిడ్ని బామ్మగారు అని పిలిచేవారు. గణేష్-మాధవి దంపతులకు బామ్మగారు మాత్రమే చుట్టం.

గణేష్-మాధవి ఇద్దరూ ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుంటున్నా వాళ్ళిద్దరి సంపాదనా వాళ్ళకు సరిపోయేది కాదు. అయినా తమ ఆశలను చంపుకుని ఉన్నదాంట్లోనే జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ "మంచిరోజులు రాకుండా పోతాయా" అనుకుంటూ హాయిగా జీవించేరు. దానికి ముఖ్య కారణం మాధవి. వచ్చే సంపాదనను ఆచితూచి ఖర్చుపెడుతూ "అప్పు" అనే మాటకు చోటిచ్చేది కాదు.

ఒకసారి గణేష్ కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు, గబుక్కున కారుకు అడ్డుగా పరిగెత్తుకొచ్చిన స్కూల్ పిల్లవాడిని కాపాడటంకొసం సడన్ గా బ్రేకు వేసేడు. కారు కంట్రోల్ తప్పి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది. కారుకి, తనకి చిన్న చిన్న దెబ్బలే తగిలినా ఖర్చు మాత్రం ఎక్కువే అయ్యింది. మాధవి దాచిన డబ్బులు సరిపోక కొంత అప్పు చేయవలసి వచ్చింది. మాధవి సహాయంతో త్వరలోనే కోలుకున్న గణేష్ అప్పులను కూడా అమె సహాయంతో త్వరలోనే తీర్చి బయటపడ్డాడు.

తనకు ఎంతో పక్క బలంగా ఉండే మాధవి ఇప్పుడు లేదు. చల్లటి గాలిలా తన జీవితంలోకి వచ్చిన మాధవి తుఫానలా మాయమైపోయింది. మొదటి కానుపుకు వెళ్ళిన మాధవి మరు జన్మ ఎత్తలేదు. తన ప్రాణాన్ని బిడ్డకు ఇచ్చేసి కనబడకుండా పోయింది.

తలచుకుంటున్న కొద్దీ గణేష్ కి ఏడుపు ఎక్కువవుతోంది. మనసు భారంతోనూ, శరీరం నీరసంతోనూ ఉండటంతో గోడ పక్కనే నేల మీద పడికుండిపోయేడు.

" గణేష్" అన్నపిలుపుతో ఉలిక్కిపడి లేచేడు. ఎదురుగా పక్కింటి బామ్మగారు.

"ఏం నాయనా... ఇంకా నువ్వు నీ భార్యపోయిన బాధలోనే ఉన్నావా...బిడ్డ ఏడుస్తున్నది కూడా వినబడలేదా...ఇలా అయితే ఎలా?... బిడ్డని నువ్వు కంటికి రెప్పలా కాపాడుతావనే నమ్మకంతోనే మాధవి బిడ్డను నీకిచ్చి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు. ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుని వస్తేనే కదా నీ భార్య ఆశను నెరవేర్చ గలవు... బిడ్డనూ, పాల బాటిల్నూ, పాల పొడిని నాకిచ్చి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు. నువొచ్చేదాకా నీ బిడ్డను నేను చూసుకుంటా" అని చెప్పి గణేష్ మాటలకు ఎదురుచూడకుండా ఉయ్యాలలొ ఏడుస్తున్న పసి బిడ్డను తీసుకుని పాల బాటిల్నూ, పాల పౌడర్ ను ఒక సంచీలో వేసుకుని వెళ్ళిపోయింది.

"నిజమే...భార్యకు నొప్పులు ఎక్కువ అయిన రోజు నుండి రోజు వరకు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు...వెళ్ళాలి" అనుకున్న వెంటనే ఓపిక తెచ్చుకుని, స్నానము ముగించుకుని డ్యూటీకి బయలుదేరేడు గణేష్.

ట్రావల్స్ లో కారు తీసుకుని డ్రైవింగ్ చేస్తున్న గణేష్ కి మనసంతా బిడ్డ మీదే ఉన్నది. "బిడ్డను బామ్మగారు చూసుకుంటోందిగా" అనే ఆలొచన అతన్ని మామూలు జీవితంలోకి తెచ్చింది. కారు నడుపుతున్న అతనికి రోడ్డు మీద ఒక ముసలాయన కారుకు అడ్డంగా రోడ్డు దాటడం కనిపించింది. సడన్ బ్రేకు వేసేడు. అదృష్టం కొద్ది కారు ముసలాయన దగ్గరవరకు వచ్చి ఆగింది. ఒక్క నిమిషం తన ప్రాణం పోయి వచ్చినట్లు అయ్యింది గణేష్కి.

అక్కడి నుంచి బయలుదేరిన గణేష్ కి చేతులు కొంచం వొణకడంతో, కారును ట్రావల్స్ లో వదిలేసి మధ్యలోనే ఇంటికి వచ్చేసేడు. బామ దగ్గరున్న తన బిడ్డను తీసుకు వచ్చి గుడ్డ ఉయ్యాలలో పడుకోబెట్టేడు.

ఓపికేలేని తాను కూడా గోడకానుకుని కూర్చున్నాడు. ఆలొచనలు అతన్ని వెన్నంటినై. "ఒక వేల కారు ముసలాయనను గుద్దుంటే, జరగకూడనిది జరిగుంటే...అప్పుడు బిడ్డ గతి! ఆడబిడ్డ సమాజంలో తల్లీ-తండ్రీ లేకుండా బ్రతకగలదా?" ఆలొచిస్తున్న గణేష్ కి ఏదో పరిష్కారం దొరికినట్లు "అంతే...అలాగే చెయ్యాలి" అనిపించడంతో నిద్రలోకి జారుకున్నాడు.

******************************

"గణేష్...నీ నిర్ణయాన్ని మార్చుకో"

"మార్చుకోను...ఎవరు చెప్పినా మార్చుకోను...నేను తీసుకున్న నిర్ణయం సరైనదే"

"ఇదేనా నువ్వు నీ భార్యకు ఇచ్చే గౌరవం? నీ మీద ఎంత నమ్మకముంటే బిడ్డని నీకిచ్చి వెడుతుంది. అలాంటి భార్యను నీచమైన నీ ఆలొచనతో అవమానిస్తున్నావు!... విషయం ఎందుకు ఆలొచించవు?"

"ఎందుకు ఆలొచించలేదు...బాగానే ఆలొచించేను...బిడ్డని నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు...బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకు వెళ్ళింది భగవంతుడు. అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మొగవాడినైన నేను పసి బిడ్డను ఎలా పెంచను...అందులోనూ ఆడ పిల్ల. నేను చేసే ఉద్యోగంలో నాకు ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. అప్పుడు పిల్ల గతి ఏంకాను....అందుకే బిడ్డను భగవంతుడి దగ్గర వదిలిపెట్టేస్తాను. బిడ్డ బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు...నా కళ్లకు నా బిడ్డ కనిపించదు కాబట్టి, ఎక్కడో ఒక చోట ఆనందంగా పెరుగుతోందని సంతోషిస్తూ జీవితం గడిపేస్తాను"

ఆపు నీ పిచ్చి మాటలు. నీ బిడ్డను నువ్వే పెంచలేనప్పుడు, ఇంకెవరో బాగా పెంచుతారని ఎలా అనుకుంటున్నావు. అనాధ పిల్లలను ఎన్ని అగచాట్లకు గురి చేస్తున్నారో నువ్వెప్పుడూ వినలేదా? బిడ్డలను అనాధ ఆశ్రమాల నుండి ఎత్తుకు పోయేవారు కొందరైతే, అనాధ ఆశ్రమాలే బిడ్డలను డబ్బుకు అమ్ముకుంటున్నారని నువ్వు వినలేదా? అలాంటి బిడ్డలను ఎటువంటి నీచ కార్యాలకు ఉపయోగించుకుంటున్నారో నీకు తెలియదా? అందులోనూ ఆడపిల్ల...ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను నువ్వెప్పుడూ వినలేదా? అలాంటి గతి నీ బిడ్డకు పట్టాలని ఆశపడుతున్నావా?”

"వద్దు...వద్దు. భయంకరమైన వార్తలను చెప్పి నా మనసును పాడుచేయకు... తోడు లేకుండా ఆడపిల్లను నెనొక్కడినీ ఎలా పెంచగలను"

"నారు పోసినవాడే నీరు పోస్తాడనే సామెత నువ్వెప్పుడూ వినలేదా"

" సామెతలన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి. అంత కష్టాన్ని నాకెందుకివ్వడం... తరువాత ఎందుకు నీరుపోయడం. ఏం తప్పుచేసేనని నా భార్యను నా నుండి విడదీసేడు...సరే, నా సంగతి వదిలేద్దాం... పసిపాప ఏం తప్పు చేసింది. లోకాన్ని మధ్యే చూసిన పసిపాప చేసిన తప్పేమిటో... పసిపాపను తల్లికి ఎందుకు దూరంచేయడం...నా భార్య ఏం తప్పుచేసిందని తన దగ్గరికి తీసుకుపోయేడు"

"నువ్విప్పుడు ఎదొర్కొంటున్న కష్టాలకు భగవంతుడే కారణమని న్యాయపరచుకుంటూ వెడితే...నీకు నేనేమీ చెప్పలేను. కానీ ఒకటి మాత్రం గుర్తుచేస్తాను. బంధాలు భాధ్యతలను గుర్తుచేయటానికే ఏర్పడతాయి. బుద్ధి కర్మానుసారిణీ... అంటారు. అంటే గతజన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వ జన్మలో ఇంతకుమించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు. కానీ పైజన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి, దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జన్మలో సత్కార్యాలు చేస్తే మరుజన్మకు పుణ్యం సంపాదించుకో గలవు.. నువ్వు చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత నీదే...." .

"ఆపు నీ ఉపదేశాలు" అరుస్తూ నిద్ర నుండి గబుక్కున లేచేడు. చుట్టూ చూసేడు. "ఇంతసేపు నేను కలలోనా మాట్లాడింది" అనుకుంటూ టేబుల్ మీదున్న అలారం గడియారం వైపు చూసేడు. మధ్య రాత్రి రెండు గంటలు దాటింది...ఒకసారి ఉయ్యాలవైపు చూసి మళ్ళీ పడుకున్నాడు గణేష్.

****************************

మరుసటి రోజు ఉగాది. ఊరంతా పండుగ వాతావరణం అలుముకొంది. బిడ్డకు స్నానం చేయించి తన దగ్గరున్న పంచ తీసి బిడ్డ మీద కప్పేడు గణేష్. బిడ్డ నుదుటిపైన, బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించేడు.

"కళ్ళ వెంట నీరు కారుతుంటే నన్ను క్షమించు బంగారం. నాకు దీనికంటే వేరే మార్గం తెలియటం లేదు. తండ్రిని క్షమించు తల్లి" అంటూ ఏడ్చేడు.

చీకటి తొలగి, వెలుతురు బయటకు వస్తున్న తెల్లవారు జామున బిడ్డతో పాటు ఊరు చివరికి వెళ్లేడు గణేష్. అక్కడున్న చెత్త కుండీ వైపుకు పిల్లిలాగా మెల్లగా నడిచేడు...సన్నగా బిడ్డ ఏడుపు వినబడింది... భయపడ్డాడు. అటూ, ఇటూ చూసేడు. ఎవరూ లేరని గుర్తించి, చేతిలోని బిడ్డ ముఖంపై కప్పి ఉన్న పంచను కొంచంగా తొలగించేడు. బిడ్డ మంచి నిద్రలొ ఉన్నది..."మరి ఏడుపు వినబడిందే... దీనినే భ్రమ అంటారేమో" అనుకుంటుండగా మళ్ళీ సన్నగా బిడ్డ ఏడుపు వినబడింది. కంగారు పడ్డ గణేష్ అటు, ఇటూ చూసేడు. ఎవరూ కనిపించలేదు.

మరి ఏడుపు...ఏడ్చేది తన బిడ్డ కాదు...భ్రమ అంతకంటే కాదు" అనుకుంటూ ఆయోమయ పరిస్థితులలో ఉన్న గణేష్ కు మళ్ళీ అదే ఏడుపు వినిపించింది.

ఏడుపు చెత్త కుండీ పక్క నుంచే వస్తోందని గ్రహించిన గణేష్ మెల్లగా చెత్త కుండీలోకి తొంగి చూసేడు. లోపల ఒక గుడ్డ మూటను ఒక కుక్క నోటితో లాగుతోంది. గుడ్డ మూటంతా ఎర్రగా ఉంది.

"చీ...చీ..." అంటూ కుక్కను తరిమి కొట్టేడు. గుడ్డ మూటను చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ అదే ఏడుపు. గుడ్డ మూటలో నుండే. గబగబా గుడ్డమూటను విడదీసేడు. ఆశ్చర్యపోయేడు. అందులో అప్పుడే పుట్టిన బిడ్డ నెత్తుటి గుడ్డులాగా ఉంది. అదే గుడ్డతో బిడ్డ శరీరం తుడిచేడు. అదొక ఆడపిల్ల. నేనే గనుక బిడ్డను చూసుండకపొతే?... బిడ్డ ఇంకొద్దిసేపట్లో కుక్కకు ఆహారం అయ్యుండేది... బిడ్డను నేను చూసుండకపోతే? నా బిడ్డను కూడా..... భయంతో కంపించిపోయిన గణేష్, వొణుకుతున్న చేతులతో, తల్లి ప్రేమతో పసి బిడ్డను ఎత్తుకున్నాడు. నుదిటి మీద ముద్దు పెట్టేడు. రాత్రి కలలో కనిపించి భాద్యత గురించి చెప్పినతని మాటలు గుర్తుకు వచ్చేయి....అంతే....అతనిలో తెలియని ఆనందం చోటుచేసుకుంది.

"ఇక మీదట నాకు ఇద్దరమ్మాయలు" అనుకున్న గణేష్ కి ఏనుగంత బలం వచ్చింది. ఉగాది బహుమతిగా దొరికిన పసికూనలను రోజా పువ్వుల్లాగా మెల్లగా తన హృదయానికి హత్తుకుని, నమ్మకంతో ఇంటివైపుకు నడక సాగించేడు గణేష్.

********************************************************సమాప్తం**********************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి