పార్ట్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పార్ట్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఆగస్టు 2021, శనివారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-11)

 

                                                                                    ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-11)

ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ నాన్నపై అరవటం మొదలుపెట్టింది.

"నన్ను ఎందుకు అక్కడికి పిలుచుకు వెళ్ళి అవమానపరిచారు? నేను అడిగానా? నాకు ఆస్తి కావాలని నేను ఏ రోజైనా మీ దగ్గర చెప్పానా? ఇప్పుడే కొంచం తలనొప్పి లేకుండా జీవించటం ప్రారంభించాను. అది మీకు నచ్చలేదా?" అని ఏడ్చింది.

అంజలికి కూడా తండ్రి మీద కొపమే! గట్టిగా నాలుగు చివాట్లు పెట్టాలని అనుకుంది. నాలికను అణిచివేసింది. కానీ, ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది.

"నేను మొదటే చెప్పానే? అమ్మకు ఎటువంటి టెన్షనూ ఇవ్వకూడదని. మీరెందుకు సడన్ గా ఆస్తి గురించి మాట్లాడారు? అందువలనే అమ్మకు అవమానం" అన్నది తల్లివైపు తిరిగింది.

"అమ్మా...నువ్వేమీ బాధపడకమ్మా. వాళ్ళ బంధుత్వమూ వద్దు...వాళ్ళ ఆస్తీ వద్దు. ఉన్నది పెట్టుకుని మనం సంతోషంగా ఉందాం" అన్నది.

"వాళ్ళ బంధుత్వమే వద్దు అన్నావు సరే...కానీ, ఆస్తి ఎందుకు వద్దని చెబుతున్నావు? పావు భాగం దొరికినా కూడా కొన్ని కోట్లు వస్తుంది. దాన్ని పూర్తిగా వదిలేయగలమా?" అన్నాడు హరికృష్ణ.

“చూడండి...తిరిగి తిరిగి దాని గురించి మాట్లాడటం వలన ఏ ఉపయోగమూ ఉండదు. మా నాన్న నేను కూతుర్నే కాదని రాసుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎలా ఆస్తికి హక్కురాలు అవుతాను?"

హరికృష్ణ మొహంలో కాంతి. రోహిని దగ్గరకు వచ్చాడు. ఒక కుర్చీలో కూర్చున్నాడు. అంజలినీ కూర్చోమన్నాడు.

" రోహినీ...నేనే నీ దగ్గర మాట్లాడదామనుకున్నాను. మీ నాన్న నిన్ను కూతురు కాదని ఎంత మంది సాక్షులను పెట్టుకుని పత్రం రాసినా అది డూప్లికేటు అని చెప్పొచ్చు...ఆయన తన స్వీయ ఆలొచనతో అది రాయలేదని చెప్పి వాదాడవచ్చు"

"అలాగంటే...నాకు అర్ధం కాలేదు"

"మీ అన్నయ్యల మీద కేసు పెట్టవచ్చు. నువ్వేమీ బాధపడకు. నువ్వు అడుగుతున్నది ఆస్తిలోని నీ వాటాని మాత్రమే. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు సంతకం మాత్రం పెట్టు చాలు. నాకు  తెలిసిన అడ్వకేట్ ఒకరున్నారు. ఆయన్ని రమ్మని చెప్పనా?"

"ఉండండి...ఉండండి. తొందరపడకండి! నేను ఎందుకు వాళ్ళ మీద 'కేసు’ పెట్టాలి?"

"అర్ధం కాలేదా? కూతుర్లకూ పుట్టింటి ఆస్తిపైన హక్కు ఉందని ఇప్పుడు చట్టం తీసుకు వచ్చారు. ఆ పాయింటును పట్టుకుని మన అడ్వకేట్ కేసును వాదాడితే మనమే తప్పక గెలుస్తాం"

మౌనంగా కూర్చోనుంది రోహిని. ఆమె మనసు ఏదేదో ఆలొచించింది.

"ఏమిటి...ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? సరే అని చెప్పు రోహినీ" అన్నాడు హరికృష్ణ.

"లేదండి. నాకు ఇందులో ఇష్టం లేదు. నన్ను అల్లారు ముద్దుగా పెంచిన మా అన్నయ్యలపైన నేను కేసు పెట్టలేను. వాళ్ళకు అక్కర్లేని దానిగా నేను అయ్యుండచ్చు. ఎందుకంటే నేను చేసిన కార్యం అలాంటిది. కానీ, నాకు వాళ్ళు కావాలి. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి. నేను దావా వేయలేను" అన్నది ఖచ్చితంగా.

అతని మొహం మారింది. ఏం జరగబోతుందో నన్న భయం అంజలిని దహించి వేస్తోంది. కష్టపడి మొహాన్ని మామూలుగా ఉంచుకుంది.

"నీకు అర్ధం కావటం లేదు రోహినీ. మనమేమీ వాళ్ళ భాగాంలోని ఆస్తిని అడగటం లేదు.  మనకు చట్టపూర్వకంగా రావాల్సిన భాగాన్నే అడగబోతున్నాం. ఎందుకంటే వాళ్ళుగా నీకు రావలసిన భాగాన్ని ఇవ్వనంటున్నారు. అందుకే కోర్టు ద్వారా అడుగుదాం అంటున్నాను. కోర్టులో కేసు పెడదాం. అది కోర్టులో హియరింగ్ కు తీసుకునే లోపు...మీ ఇంట్లోంచి సమాధానం మాట్లాడటానికి వస్తారు. ఎందుకంటే...వాళ్ళు ఆస్తిపాస్తులు లెక్కలన్నీ ఇవ్వాల్సి వస్తుందే? అది వాళ్ళు ఇష్టపడరు. అలా వాళ్ళు మనతో సమాధానం చేసుకోవటానికి వచ్చినప్పుడు పెద్ద మొత్తం అడిగి తీసుకుందాం. వాళ్ళకూ మంచిది. మనకీ లాభం. ఏమంటావు?"

"క్రిమినల్ గా చెప్పాలంటే...కేసు వేస్తామని చెప్పి, వాళ్లను బెదిరించి డబ్బు పీక్కోవాలి అంటారు. అంతే కదా? దానికి పేరు 'బ్లాక్ మైల్’. నన్ను రౌడీతనం చేయమంటారా? నా వల్ల కాదు"

"నువ్విలా వాళ్ల మీద గౌరవం చూపిస్తున్నావు, కానీ వాళ్ళు నీకివ్వాల్సిన చెల్లి అనే బంధుత్వాన్ని కూడ ఇవ్వటం లేదే? తండ్రి నిన్ను కూతురు కాదన్నాడు. మనమైనా చెల్లికి కొంత ఇద్దామని అన్నయ్యలకైనా అనిపించిందా? నువ్వే అన్నయ్యా...అన్నయ్యా అని ప్రేమ కురిపిస్తున్నావు. వాళ్లకు లేదు"

"నేను ఉన్న చోట ఉండుంటే... నన్ను బంగారు పళ్లెంలో పెట్టి చూసుకోనుండే వారు. అది నేను చెడుపుకున్నానే? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళను?"

"ఏమిటే ఎప్పుడూ అదే మాట్లాడుతున్నావు? ఏదో జరిగిపోయింది...అది వదిలేయ్. పాతవాటి గురించి మాట్లాడి ఏమిటి లాభం? నువ్వు ఇంకోసారి వెళ్ళి, ఇలా ఆయన మీ మీద కేసు పెట్టమంటున్నారు. అలా చేస్తే మీ పరువే పోతుంది. అందు వల్ల ఆస్తిలో నా భాగం నాకిచ్చేయండి అని అడిగి చూడు"

అది విన్న వెంటనే అమ్మ లేచింది.

"ఏమండీ...మీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదా? నేను మంచి కుటుంబంలో పుట్టిన దానిని. నాకు పరువు, పౌరుషం ఉంది. ఇంకొసారి మా ఇంటికి వెళ్లటమో...ఆస్తి అడగడమో జరగనే జరగదు. నన్ను బలవంత పెట్టకండి" అని చెప్పి లోపలకు వెళ్ళిపోయింది.

హరికృష్ణ చూపులు ఇప్పుడు అంజలి మీద పడ్డాయి. మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు.

"అమ్మా అంజలీ. నేను చెప్పేది నువ్వైనా అర్ధం చేసుకో. ఎంత వద్దన్నా పది కోట్లు వస్తుంది. అది ఎవరైనా వద్దని చెబుతారా? నువ్వు ఒక స్కూల్లో ఉద్యోగం చేశేవే? అలాంటి స్కూలు నువ్వే మొదలు పెట్టి నడపవచ్చు. కొంచం అమ్మ దగ్గర అర్ధం అయ్యేటట్టు చెప్పమ్మా" అన్నాడు.

"ఇలా చూడండి నాన్నా. ఈ విషయంలో నేను అమ్మను బలవంతం చేయను. అది వాళ్ళ ఇల్లు...వాళ్ళ ఇష్టం. వాళ్ళను బలవంతం చేయటానికి మనకు హక్కు లేదు"

మొహమాటంతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.

ఇంకో రెండు రోజులు గడిచినై. ఎప్పుడూ చూడూ కేసు పెట్టు కేసు పెట్టు అని సనుగుతూ ఉండేవాడు హరికృష్ణ. అది రోహినికి చిత్రవధా లాగా అనిపించింది. కోపంగా అరిచింది.

"ఎందుకలా ఎప్పుడూ ఆస్తి, ఆస్తి అంటూ ప్రాణం తీస్తున్నారు? చివరగా చెబుతున్నాను...నా వల్ల వాళ్ళ మీద కేసు వేయటం జరగదు. మీ వల్ల ఏం చేయగలరో అది చేసుకోండి"

"ఏమిటే...మాటలు కోటలు దాటుతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు ఉన్నావా...చచ్చావా అని కూడా చూడలేదు. అటువంటి వాళ్ళపైన ప్రేమ పొంగుకు వస్తోంది"

"ఎం...ఇన్ని రోజులు మేము ఉన్నామా, చచ్చామా అని మీరు కూడా చూడలేదు. కనీసం కనుక్కోలేదు. దానికోసం మీ మీద కూడా కేసు వెయ్యనా? పిలిచిన వెంటనే మిమ్మల్ని మన్నించి మీతో రాలేదా?"

"నువ్వు నన్ను మన్నించావా? బాగుంది నీ న్యాయం! నువ్వే నన్ను మోసం చేసింది. నమ్మించి మోసం చేసి పైగా మాటలు కూడానా?"

ఆ పరిస్థితిలోనూ నవ్వు వచ్చింది రోహినికి.

"ఏమిటీ...నేను మిమ్మల్ని మోసం చేశానా? నమ్మించి గొంతు కోశానా? బయటకు చెప్పకండి. నవ్వి పోతారు"

"బయట చెబితే ఏం? ప్రేమించేటప్పుడు 'మా ఇంట్లో నా మీద ప్రాణం పెట్టుకున్నారు’ అని నువ్వు చెప్పలేదూ? నాకోసం ఏదైనా చేస్తారు అన్నావే? అది నమ్మే కదా నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. పెళ్ళి తరువాత ఏమీ ఇవ్వలేదే? అది గొంతుకోయటం కాదా?"

"నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు ఒక మాట చెప్పుంటే...అప్పుడే మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయే దాన్నే? మీరూ మోసపోయి ఉండక్కర్లేదు, నేనూ దర్జాగా జీవించే దాన్ని. ఎందుకు అది చేయలేదు?"

కోపంతో ఎరుపెక్కినై హరికృష్ణ కళ్ళు.

"ఊరకుక్కా! ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నీ పొగరు తగ్గలేదే? మీకు డబ్బు ఆశలేదు...మరి నేను పిలిచిన వెంటనే దేనికి అమ్మా కూతుర్లు నాతో వచ్చారు? బాగా తిందాం! మంచి వసతులతో జీవిద్దాం అనేగా"

ఆ మాట తల్లి కూతుర్లు ఇద్దరికీ విపరీతమైన కోపం తెప్పించింది.

"మమ్మల్ని బ్రతిమిలాడి, బుజ్జగించి రమ్మని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? మా మీద ప్రేమ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేము మిమ్మల్ని వెతకనే లేదే? ఇలాంటి మాటలన్నీ ఇక్కడ వద్దు"

"ఎందుకు పిలిచానా? మీ తాతయ్య...అదే బాపిరాజు చాలా సీరియస్ గా ఉన్నారని నాకు తెలిసింది. అప్పుడు మీరు గుర్తుకు వచ్చారు. చావాబోతున్న ముసలాడి ముందు మిమ్మల్ని తీసుకువెళ్ళి నిలబెడితే...ఆయన మీ పేరుకు ఏదైనా ఆస్తి రాసిస్తాడని లెక్క వేసేను. అందుకోసమే వచ్చి మిమ్మల్ని పిలిచాను"

ఆశ్చర్యంతో తల్లి కూతుర్లు ఇద్దరూ నోరు వెళ్లబెట్టారు.

"వెంటనే మిమ్మల్ని తీసుకు వెడితే...మీరు అనుమాన పడతారని కొన్ని రోజులు ఊటీకీ తీసుకు వెళ్ళి వచ్చేలోపే ఆ ముసలాడు ప్రాణం వదిలేడు. ఛీ...నా ప్లానంతా పాడైపోయింది. డబ్బులు ఖర్చు అయినై అంతే"

రోహిని తమాయించుకుని మెల్లగా "అయితే మీరు మా కొసం -- మా మీద ప్రేమతో రాలేదు. అంతేనా?" అని అడిగింది.

"అవును... ప్రేమ వస్తుంది...ఇది ఎలిజిబత్ మహారాణి, డబ్బులు విసిరి పారేస్తుంది. నీ మొహం కోసం ఎవరు వచ్చారు? డబ్బూ, కుటుంబం దొరుకుతాయని లెక్కవేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలలో నీలో మార్పు వచ్చి ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వు మారనే  లేదు"

"అమ్మ మాత్రమా మారలేదు. మీరు కూడా కొంచం కూడా మారనే లేదు. మా అమ్మను ఆ రోజు ఎలా మోసం చేశారో...ఈ రోజు కూడా ఆమెను అలాగే మొసం చేశారు? మీకు మనశ్శాక్షి అనేదే లేదా?"

హరికృష్ణ ఏదో మాట్లాడదామని నోరు తెరుస్తున్నప్పుడు....

"చూడండి. ఒక్క రోజు కూడా మీ మీద 'నాన్న’ అనే ప్రేమే వచ్చిందే లేదు. అమ్మ సంతోషంగా ఉంటుంది కదా అనుకుని మీతో రావటానికి అంగీకరించాను. ఇప్పుడు మీరు మా అమ్మను గౌరవించటం లేదే...అప్పుడు మాకూ ఈ ఇంట్లో పనిలేకుండా పోయింది. మేము ఇప్పుడే వెడతం" అన్నది కోపంగా.

“ఓ...దారాళంగా వెళ్ళిపొండి. ఎప్పుడైతే ఆ నల్ల మొహం ఆస్తి తీసుకోను అని చెప్పిందో...అప్పుడే మీ ఇద్దర్నీ తరిమేసుండాలి. కానీ, నాకు కొంచం జాలి గుణం ఉంది. అందువలనే మిమ్మల్ని కూర్చోబెట్టి ఫ్రీ భోజనం పెట్టాను. ఇప్పటికీ ఏమీ పాడైపోలేదు. కేసు వేయటానికి మీ అమ్మను ఒప్పించు. మీరు ఇక్కడే ఉండొచ్చు. బాగా తినొచ్చు, రాజ భోగం అనుభవించ వచ్చు. ఏమిటి ఏమంటావ్...?".

సమాధానం ఏమీ చెప్పకుండా తల్లివైపు తిరిగింది.

"ఏమ్మా... ఇంకా ఇక్కడెందుకు నిలబడ్డవు? మనం తిండికి అలమటించా పోతున్నాము? మన దగ్గర ఏమన్నా చదువులేదా? లేక పొవటానికి వేరే చోటే లేదా? రామ్మా... వెళదాం. ఇక ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళకు. ఇతనొక మనిషి అని నమ్మి వచ్చావు చూడు...నిన్ను అనాలి" అన్నది..

రోహిని విరక్తితో చూసింది. కన్నీరు లేదు...గొణుగుడూ లేదు. ఒక బొమ్మలాగా ఎక్కడో చూస్తున్నట్టు కూర్చుంది.

'అమ్మ దుఃఖం రోజులు పోతేనే గాని తగ్గదూ’ అని అనుకున్న అంజలి, తమ దుస్తులను, వస్తువులను తీసుకుంది.

మొదట ఫోన్ చేసింది.

"సుధీర్...ఇంకా మీ అవుట్ హౌస్ ఇల్లు అద్దెకు ఇవ్వకుండా ఉంటే, అది ఎవరికీ ఇవ్వద్దు. నేనూ, మా అమ్మా ఇంకా కొద్దిసేపట్లో అక్కడ ఉంటాము. వివరాలేమీ అడగకండి. అక్కడికి వచ్చిన తరువాత డైరెక్టుగా చెబుతాను" అన్న ఆమె ఒక చేతిలో సూట్ కేసు,  మరో చేత్తో అమ్మను పుచ్చుకుని బయటకు వచ్చింది.

"అంజలీ...బాగా ఆలొచించుకో. ఇప్పుడు వెళితే మొత్తంగా వెళ్ళినట్లే. నేను తిరిగి కూడా చూడను. నువ్వు ఎవరైనా మామూలు జీతగాడ్ని పెళ్ళి చేసుకుని డబ్బుకు వెతుక్కోవలసిందే! కానీ, మీ అమ్మ ‘కేసు’ వేస్తే...మనకు చాలా ఎక్కువ డబ్బు దొరుకుతుంది. నిన్ను విదేశీ వరుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను. బోలేడు నగలు వేస్తాను. ఏమంటావ్?"

సమాధానం ఏమీ చెప్పకుండా 'తూత్’ అని అతని మొహం మీద ఉమ్మేసి, అమ్మను పిలుచుకుని బయటకు నడిచింది. రోహిని పరిస్థితి చాలా పాపంగా ఉంది. జరిగిందేదీ ఆమె జీర్ణించుకోలేకపోయింది. హరికృష్ణ పిలిచింది, తండ్రి మరణం, తిరిగి భర్త యొక్క కుట్ర అంటూ అన్నీ కలిసి ఆమె హృదయాన్ని కెలికినై. మెదడు నరాలు వణికినై. నడవలేక కళ్ళు తూలుతున్నాయి.

"అమ్మా...ఏమ్మా చేస్తోంది? ఎందుకని అదోలాగా ఉన్నావు?" అన్న కూతురు ప్రశ్న పాతాళం నుండి వినిపిస్తున్నట్టు అనిపించింది. తల పగిలిపోతుందేమోనన్నంత నొప్పి పుడుతోంది...కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటంతో అంజలి భుజాల మీద వాలింది...ఆమెను పట్టుకుంది అంజలి.

“అమ్మా...నన్ను చూడమ్మా. ఇంకా కొంచం సేపు వోర్చుకో. నిన్ను హాస్పిటల్ కు తీసుకు వెడతాను" అన్న అంజలి ఆంబ్యులాన్స్ కు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చేలోపు ఏమవుతుందో నన్న భయంతో సుధీర్ కు కూడా ఫోను చేసి విషయం చెప్పింది.

రోహిని మాట్లాడలేకపోయింది. తలనొప్పి క్షణ క్షణానికీ పెరుగుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముక్కు నుండీ, నోటి నుండీ రక్తం వచ్చింది.

                                                                                             Continued...PART-12(Last Part)

************************************************************************************************

4, ఆగస్టు 2021, బుధవారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-10)

 

                                                                                ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-10)

ఊటీకి వచ్చి ఐదు రోజులు గడిచినై. వాళ్ళు బస చేసింది అందమైన హోటల్. అందులో గడ్డి నేల మీద వేసున్న బెంచి మీద కూర్చుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసింది అంజలి. సూది ఆకుల చెట్లు, తడుముకు వెడుతున్న మేఘాలు అంటూ ప్రతీదీ కవిత్వంలా ఉన్నది. కానీ, మనసులోనే ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు. దేనినో పోగొట్టుకున్నట్టు అనిపించింది.

అంజలి అలా సుధీర్ జ్ఞాపకాలతో ఉన్నదనుకుంటే, తల్లి రోహిని కూడా అలాగే ఉన్నట్టు అనిపించింది. ఏ కారణం చేతనో 'నాన్నా' అని పిలిచి ఆయనతో ప్రేమగా ఉండలేకపోయింది. ఊటీలో చాలా చోట్లకు తీసుకు వెళ్ళారు. సరస్సులో పడవ ప్రయాణం చేసేటప్పుడు కానీ, సూది ఆకుల చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు గానీ...ఎందుకనో ఒక కుటుంబంగా వచ్చినట్టు ఆమెకు అనిపించలేదు.

అమ్మ వచ్చి పక్కన కూర్చుంది.

" అంజలీ ఇక్కడ ఎక్కువ చలి వేస్తోంది కదా?"

"అవును"

"ఎందుకలా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా అలా మొహం పెట్టుకుని కూర్చున్నావు?"

"నా మొహమే అంతేనమ్మా"

"అంజలీ...ఏమిటి అదొలా మాట్లాడుతున్నావు? నీకు ఏమైంది?"

"ఏమీలేదమ్మా...మీరు ఉత్సాహంగా ఉన్నారు కదా? నాకు అది చాలు"

మౌనం వహించింది రోహిని. ముందులాగా ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేక పోతున్నారు. కళ్ళకు కనబడని తెర, మధ్యలో అడ్డుపడ్డట్టు అనిపించింది. రోజులు గడచిన కొద్దీ సరిపోతుందిలే అనుకుంది.

మరుసటి రోజు ప్రొద్దున్న హడావడి పడుతూ వచ్చిన నాన్న "మనం ఇప్పుడే ఊరికి తిరిగి వెడుతున్నాం" అని చెప్పి తొందర తొందరగా హోటల్ ఖాలీ చేసి బయలుదేరాము. ఆయన మొహం కొంచం 'సీరియస్’ గా ఉన్నది. ఏమిటి విషయం అని వీళ్ళూ అడగలేదు...ఆయనా చెప్పలేదు.

ఇంటికి వచ్చేశారు.

" రోహినీ...నువ్వు షాకయ్యే విషయం ఒకటి చెప్పబోతాను. మనసును దృఢపరుచుకో" అన్నారు.

అంజలి అదిరి పడ్డది."ఏం బాంబు వేయబోతారో తెలియటం లేదే?" తనలోనే అనుకున్న అంజలి, తండ్రి దగ్గరగా వెళ్ళి నిలబడి--

"అమ్మ ఏ విధమైన షాకునూ భరించలేదు. ఇది మీకు ఇదివరకే చెప్పేశాను. అలాంటప్పుడు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు?" అన్నది కోపంగా.

“నువ్వు చెప్పింది న్యాయమేనమ్మా. కానీ, నేను ఈ విషయాన్ని ఆమెతో చెప్పలేదనుకో...అది చాలా పెద్ద తప్పు అవుతుందే? అప్పుడు నా మీదే కదా ఆ తప్పు కూడా పడుతుంది. అందువలన చెప్పేస్తాను. నువ్వు మీ అమ్మ పక్కనే ఉండు"

వినటానికి రెడీ అయ్యింది.

" రోహినీ...మీ నాన్న బాపిరాజు చనిపోయారట. ఆయన సీరియస్ గా ఉన్నారని నాకు సమాచారం వచ్చింది. అందుకనే వెంటనే మిమ్మల్ని తీసుకుని వచ్చాశాను. ఈ రోజు ప్రొద్దున్నే ఆయన చనిపోయారట" అన్నారు.

"మా నాన్న...మా నాన్న చనిపోయారా? ఎలా? ఏం జరిగింది? మీకు ఎవరు చెప్పారు"

"మీ నాన్నగారి ఆఫీసులో పనిచేస్తున్న ఒకడు నాకు తెలుసు. అతనే ఫోన్ చేసి చెప్పాడు. ఆయనకూ వయసైంది కదా?"

"నేను ఆయన్ని చూడాలి. ఇన్ని సంవత్సరాలు చూడకుండానే ఉండిపోయాను. ఆయన నన్ను క్షమించలేదు. చచ్చిపోయిన తరువాతైనా ఆయన శరీరాన్ని చివరిగా ఒక సారి చూసేస్తానే? నన్ను పిలుచుకు వెళ్ళండి"

“అమ్మా అక్కడికంతా నువ్వు వెళ్ళొద్దు. అక్కడ మిమ్మల్ని అవమాన పరుస్తారు. అది చూస్తూ నేను మౌనంగా ఉండలేను" అన్నది అంజలి.

“మీ ఇంట్లోనే ఉంచారట. పెద్ద వ్యాపారవేత్త కదా? అందువల్ల 'టీవీ ఛానల్స్’ నుండి మనుషులు వచ్చుంటారు"

"అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు!" అన్నది అంజలి గట్టిగా.

"నువ్వు కాముగా ఉండమ్మాయ్. లోకం తెలియని పిల్లవి. పాపం మీ అమ్మ...చూడాలని ఆశపడుతోంది. నేనే ఆవిడ్ని తీసుకు వెడదాం అనుకుంటున్నా. బయలుదేరండి వెళ్ళి వచ్చేద్దాం"

"అంజలి ఎందుకండి? మనల్నే లోపలకు పంపుతారో...పంపరో?"

"వాళ్ళ తాతయ్యను అంజలి కూడా చూడనీ...మనల్ని ఎలా లోపలకు పంపరో చూస్తాను. నీకూ హక్కు ఉంది. అది వాళ్ళు కాదనలేరు" అన్నతను, వాళ్ళను బయలుదేరమని బలవంతం చేశాడు.

అమ్మ చూడాలని ఇష్ట పడటానికి ఆశపడుతున్నా, ఆమె ఆత్మ గౌరవం ఆమెను వద్దు అని చెప్పటాన్ని అర్ధం చేసుకుంది. కానీ నాన్న వదల లేదు. ముగ్గురూ చిన్న కారులో వెళ్ళి  దిగారు.

దగ్గర దగ్గర 25 సంవత్సరాల తరువాత తన పుట్టింటిలోకి అడుగు పెట్టింది రోహిని. వార్త ఇంకా బయటకు పూర్తిగా వెళ్ళకపోవటం వలనో ఏమో పెద్దగా జనం లేరు. ఒకాయన మాత్రమే వచ్చారు.

దఢ దఢ మని కొట్టుకుంటున్న గుండెను నొక్కి పట్టుకుని ఇంటిలోపలకు వెళ్ళింది. ఎందులోనూ మార్పు లేదు. హాలులో నాన్న గారి దేహం ను ఒక గాజు పెట్టెలో ఉంచారు. కాళ్ళ దగ్గర కొన్ని పూలమాలలూ, పూల వలయాలు ఉన్నాయి.

మొహం చూసిన వెంటనే ఏడుపు పొంగుకు వచ్చింది.

"నాన్నా...నేను రోహినిని వచ్చాను నాన్నా. చివరి వరకు నన్ను చూడకుండానే ఉండిపోయారే? నా జ్ఞాపకం మీకు రానే లేదా? మీరు నన్ను క్షమించనే లేదా?" అంటూ భోరున ఏడ్చింది.

అంజలి సైలెంటుగా పక్కన నిలబడింది. 'అమ్మ ఏడుస్తూ తన దుఃఖాన్ని చల్లార్చుకోనీ' అని మాట్లాడుకుండా చూస్తూ ఉండిపోయింది. హరికృష్ణ...రాని కన్నీటిని తుడుచుకుంటూ నటించాడు.

గొంతు విని ఇద్దరు సహోదరలూ లోపల నుండి వచ్చారు. వాళ్ళను చూసింది రోహిని.

"జగనన్నయ్యా... నరసు అన్నయ్యా...నన్ను గుర్తు పట్టారా? నేను మీ చెల్లెలు రోహినిని" అన్నది వణుకుతున్న కఠంతో.

"రోహినీ...నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇదెవరు?" అన్నాడు జగన్నాధం, అంజలిని చూపిస్తూ.

"ఏంటన్నయ్యా అలా అడిగావు? ఇది నా కూతురు అంజలి. అంజలిదేవి అని మన అమ్మ పేరు పెట్టాను"

పెద్దన్నయ్య దగ్గరకు వచ్చి అంజలి తలమీద చేతులు వేసి తన ప్రేమను చూపించాడు.  ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు.

"అన్నయ్యా...నాన్నకు ఏమైంది?"

"ఏమీ లేదమ్మా...వయసు 82 దాటింది కదా? నిద్రలోనే పోయారు"

"అదొచ్చి అన్నయ్యా...నాన్న ఎప్పుడైనా నా గురించి అడిగారా?"

ఇద్దరన్నయ్యలూ లేదని తల ఊపారు.

"లేదు రోహినీ...చివరి వరకు ఆయన వైరాగ్యంగానే బ్రతికారు. కానీ, ఆయన మనసులో నీ జ్ఞాపకాలు ఎప్పుడూ ఉండేవి. మాకు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడూ సరి, పిల్లలు పుట్టినప్పుడూ సరి...అందరితో సంతోషంగా మాట్లాడతారు. కాసేపైన తరువాత ఒంటరిగా వెళ్ళి నిలబడే వారు. ఆయన కళ్ళు తడిసుంటాయి. పాపం...ఆయన వేదన పడని రోజు లేదు”

నేరం చేసిన కారణంగా సిగ్గుతో తల వంచుకుంది రోహిని.

"అన్నయ్యా...మీ పిల్లలను ఒకసారి పిలవండి...ఒకసారి చూసి వెళ్ళిపోతాను" అన్నది.

"మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో నీకూ హక్కు ఉంది. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండ వచ్చు" అంటూ దగ్గరకు వచ్చాడు హరికృష్ణ.

అన్నదమ్ములిద్దరి మొహాలూ మారినై.

"ఓహో...గొడవ పెట్టుకోవటానికే వచ్చారా? నువ్వు మారనే లేదా హరికృష్ణా? ఇప్పుడు నీకేం కావాలి?"

“ఇదిగో ఇక్కడున్నదే ఇది మీ చెల్లెలు. మీ నాన్నకు న్యాయంగా పుట్టిన బిడ్డ. ఇప్పుడు చట్టంలో...'కూతుర్లకూ ఆస్తిలో సరిసమం వాటా ఉంది’ అనే చట్టం ఉంది. అందువలన ఆమె భాగం ఇవ్వండి. అది అడగటానికే వచ్చాము"

అంజలికి 'ఛీ' అనిపించింది 'దీనికోసమే పిలుచుకు వచ్చారా? డబ్బు పిచ్చి పట్టిన మనిషి’ అని అనుకుంది.

"రోహినీ...నువ్వు చెప్పి నీ భర్త ఇలా మాట్లాడుతున్నారా?లేక తానుగా మాట్లాడుతున్నాడా  అనేది తెలియటం లేదు. ఏది ఏమైనా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది" అన్న జగన్నాధం, తమ్ముడు వైపు తిరిగి----

"నరసూ...ఆ కాగితం తీసుకురా" అన్నాడు. నరసింహం లోపలకు వెళ్ళాడు. 

"రోహినీ...నువ్వు తొందరపడి పెళ్ళి చేసుకున్నావు. కానీ నాన్న దాన్ని మరిచిపోలేదు. నీ భర్త వలన మాకు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వస్తుందని నాన్నకు అప్పుడే అనిపించింది. అందువలన ఇరవై సంవత్సరాలకు ముందే నిన్ను తన కూతురు కాదని రాసేసి, దాన్ని రిజిస్టర్ కూడా చేయించి ఉంచారు. ఆ రిలీజ్ పత్రాన్నే తెమ్మని చెప్పాను" అని చెప్పగానే పత్రంతో వచ్చాడు నరసింహం.

"ఇదిగో...ఇది చదివి చూడు" అని ఇచ్చారు.

దాన్ని రోహిని తీసుకునే లోపు తానే తీసుకుని అందరికీ వినబడేటట్టు గట్టిగా చదివాడు హరికృష్ణ. దాని సారాంశం ఇదే! 

‘నా కూతురు రోహినిని నా అన్ని ఆస్తులూ, నగలూ, డబ్బూ వీటన్నిటి నుండి తొలగించి ఉంచుతున్నాను. నేను చనిపోయిన తరువాత కూడా ఆమెకు దేని మీదా హక్కులేదు. ఆస్తులలో నా ఇద్దరి కొడుకులకే హక్కు ఉంది. వాళ్ళుగా  ఇష్టపడి రోహినికి ఏదైనా ఇస్తే దాన్ని నేను అడ్డుకోవటం లేదు. ఇది నా పూర్తి మనసుతోనూ, పూర్తి తెలివితోనూ, పూర్తి జ్ఞానముతోనూ రాస్తున్నాను"

కొంతసేపు మౌనం చోటు చేసుకుంది.

"ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను మన్నించలేదు. ఇప్పుడైనా నన్ను మన్నించు నాన్నా" అని వెక్కి వెక్కి ఏడ్చింది రోహిని.

"అమ్మా...వెళదాం రా. చాలా మంది రావటం మొదలుపెట్టారు. అందరూ మనల్నే వేడుక చూస్తున్నారు. కష్టంగా ఉంది. రామ్మా...వెళదాం" అంటూ తల్లి చెయ్యి పుచ్చుకుంది అంజలి. రోహిని కూడా బయలుదేరింది.

"ఉండు రోహినీ...నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు"

"ఏమిటది?"

"మీ నాన్న రాసిన రిలీజ్ పత్రంలో మీ అన్నయ్యలు ఇష్టపడి నీకు ఏదైనా ఇస్తే అది నేను అడ్డుకోనూ అని ఉన్నదే? మీ నాన్నకు ఊరి బయట ఈశాన్య వైపు దగ్గర దగ్గర నాలుగు ఎకరాల స్థలం ఉండేది. దాన్ని అడుగు. వాళ్ళు ఇవ్వనంటారా ఏమిటి?" అన్నాడు హరికృష్ణ.

అంతసేపు కట్టుబాటులో ఉంచుకున్న కోపం బయటకు వచ్చింది రోహినికి.

“మీకు గౌరవ మర్యాదలే లేవా? నాన్న నా దగ్గరున్న కూతురనే హక్కునే తీశేశారు. ఆ తరువాత వాళ్ళకు ఏదుంటే నాకేం. నేనేమన్నా బిచ్చగత్తెని అని అనుకున్నారా? నేను మా అన్నయ్యల దగ్గర చేయి జాపను. నాకూ ఏ ఆస్తీ వద్దూ, ఏమీ వద్దు"

"సార్ ఆమె ఏదో దుఃఖంలో మాట్లాడుతోంది. అది పెద్దగా తీసుకోకండి. మీరు, దీనికి ఏమివ్వాలని ఆశపడుతున్నారో అది ఇవ్వండి" అన్నాడు,  ఇకిలించుకుంటూ.

"ఓహో...దీనికొసమే వచ్చారా? ఇప్పుడు అర్ధమవుతోంది మీ ఉద్దేశ్యం! చావు ఇంట్లో కూడా డబ్బూ, ఆస్తి అని అడుగుతున్నారు...మీరు మనుష్యులేనా? మిమ్మల్నందరినీ మార్చలేము? వెళ్ళండి బయటకు" అని అరిచాడు నరసింహం.

అంతకంటే ఓర్చుకోలేక రోహిని, అంజలి ఇద్దరూ గబగబా బయటకు వచ్చారు -- 'ఇంకాసేపు ఇక్కడుంటే మెడ పట్టుకుని బయటకు గెంటినా గెంటుతారు’ అని అనిపించి హరికృష్ణ కూడా వేరే దారిలేక వచ్చి ఎక్కిన తరువాత...కారు బయలుదేరింది.

                                                                                                                   Continued...PART-11

***********************************************************************************************

2, ఆగస్టు 2021, సోమవారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-9)

 

                                                                                 ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-9)

అంజలీనూ, తల్లి రోహినినూ ఇల్లు ఖాలీ చేసి హరికృష్ణతో వెల్తున్నారనే వార్త సుధీర్ కు చేరింది. అతని మనసులో పలురకాల ఆలొచనా అలలు. తన ప్రేమ గెలుస్తుందని కొంచంగా నమ్మకం తలెత్తింది. 

'ఒకవేల అంజలి వాళ్ళ నాన్నకు నేను నచ్చితే, ఆమె నాకు దొరికే ఛాన్స్ ఉంది కదా?' అని అతని మనసు లెక్క వేసింది. ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనే తహతహతో ఎలాగైనా ఆమెను ఒకసారి కలిసి మాట్లాడలేమా అని అల్లాడిపొయాడు. మర్యాద నిమిత్తం రోహినిని ఇంటికి వెళ్ళి చూశాడు.

ఆమె నుదురు చిట్లింది.

"ఏమిటయ్యా...ఏంటిలా వచ్చావు? అంజలి నిన్ను చూడదు" మొహం మీద కొట్టినట్టు చెప్పింది.

"లేదు ఆంటీ...నేను అంజలి కోసం రాలేదు. ఇల్లు ఖాలీ చెయ్యబోతున్నారని నిర్మలా ఆంటీ చెప్పింది. కానీ మీరు నా దగ్గర ఏమీ చెప్పలేదు. అందుకే ఏమిటి వివరం అని అడిగి తెలుసుకుందామని వచ్చాను..."

రోహిని గొంతు, మాట ఒక్కసారిగా మారిపోయింది "అవును బాబూ...నువ్వు మాకు కరెక్టు సమయంలో ఈ ఇల్లు ఇచ్చావు! లేకపోతే మాగతి ఏమయ్యేదో? నువ్వు సాధారణ మనిషిగా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. కానీ, అంజలి పేరు చెప్పుకుంటూ వస్తే అనుమతించను. ఆమె కూడా నన్ను కాదని ఏమీ చెయ్యదు"   

“నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు కూడా మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగి వెళ్ళటానికి వచ్చాను. మీరు ఎప్పుడు ఖాలీ చేస్తున్నారు?

"రేపు...వాళ్ళ నాన్న వచ్చి మమ్మల్ని ఆయనతో తీసుకు వెడతానని చెప్పారు"

"అలాగా...చాలా సంతోషం. మీరు ఖాలీ చేసిన తరువాత ఇల్లు తాళం వేసి, తాళం చెవి నిర్మలా ఆంటీ దగ్గర ఇచ్చేయండి...నేను తీసుకుంటాను. ఏదైనా సహాయం కావాలనుకుంటే సందేహించకుండా అడగండి" అని చెప్పి వచ్చాశాడు. గుండె వేగంగా కొట్టుకుంది.

'నేనేం అంత పెద్ద తప్పు చేశాను? ఎందుకిలా కుక్కను తరిమినట్టు తరమాలి? ఇన్ని రోజుల పరిచయానికైనా అంజలి నాన్నను నాకు పరిచయం చేయచ్చు కదా? కృతజ్ఞతా భావం లేని జన్మలు! నేనేమైనా అంజలిని ఎత్తుకునా వెళ్ళబోతాను? ఆమె మాత్రం తక్కువా ఏమిటి? 'మేము ఖాలీ చెయ్యబోతాము. ఏదైనా మాట్లాడాలా...ఇదే నా నెంబర్ అని చెప్పి ఇచ్చిందా? నువ్వు మాత్రమే ఆమెను తలుచుకుని కరిగిపోతున్నావు. ఆమెకు నీ జ్ఞాపకమే లేదు’

ఏవేవో ఆలొచించుకుంటూ చెట్టు కింద నిలబడున్నాడు.

"ఏమయ్యా సుధీర్...నీ అంజలి ఇల్లు ఖలీ చేస్తున్నట్టుందే?"

గొంతు విని తల తిప్పి చూశాడు. నిర్మలా ఆంటీ. చేతిలో కూరగాయల సంచీతో నిలబడుంది.

"ఆంటీ..."  

"ఏమిటి తమ్ముడూ ఆలొచిస్తున్నావు. నువ్వూ, అంజలీనూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసే" అన్నది నొక్కి చెబుతూ.

ముఖం వాడిపోయినట్టు మౌనంగా నిలబడ్డాడు.

"చాలా సంవత్సరాల తరువాత రోహిని యొక్క భర్త వచ్చారు. అంజలి, వాళ్ళ అమ్మా ఆయనతో ఉండటమే న్యాయం. నువ్వేమనుకుంటున్నావు?"

"నేనేమనుకుంటా ఆంటీ? ఇన్ని రోజులు లేని నాన్న...ఇప్పుడు సడన్ గా ఎక్కడ్నుంచి  మొలకెత్తారు? అంజలి నన్ను ఇష్టపడుతోందని  మీరు మాత్రమే చెబుతున్నారు. కానీ  ఆమె నాతో ఒక్క ముక్క గూడా దీని గురించి చెప్పలేదే? ఇప్పుడు కూడా నేను వాళ్ళింటికి వెళ్ళాను. అంజలి వాళ్ళ అమ్మ, నన్ను కొట్టి తరిమినట్టు తరిమింది. ఎందుకిలా  చేస్తున్నావని వాళ్ళ అమ్మను అంజలి అడగనే లేదే? అంతెందుకు...బయటకే రాలేదు"  

"ఇప్పుడు అంజలి ఇంట్లో లేదబ్బాయ్...స్కూలుకు వెళ్ళింది...ఉద్యోగానికి రాజీనామా చేయటానికే"

"దానికేమన్నా పిచ్చా? మంచి ఉద్యోగాన్ని ఎందుకు విడిచి పెట్టాలి?"

"నీకు విషయమే తెలియదా? ఆమె తండ్రి పెద్ద ఆస్తిపరుడుగా తిరిగి వచ్చాడు. రోహినికీ, అంజలికీ మంచి కాలం వచ్చినట్టే అనుకో"

సంతోష పడనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుకుంది అతన్ని.

"ఓ...అందుకేనా అంజలి వాళ్ళ అమ్మ కళ్లకు నేను కనిపించలేదు. ఇక పెద్ద డబ్బుగల అల్లుడ్ని చూస్తారు. ఈ పేద సుధీర్ జ్ఞాపకం ఎవరికి ఉండబోతుంది?" 

"అలా చెప్పకు నాయనా. అంజలి నిన్ను మరిచిపోలేదు. పాపం...ఆమె రెండు తలకాయలు ఉన్న చీమ లాగా కొట్టుకుంటోంది. ఒక పక్క నువ్వు...ఇంకో పక్క వాళ్ల అమ్మ... అంజలి ఏం చేస్తుంది చెప్పు?"

"ఏం ఆంటీ...నాకేం తక్కువ? నేను అనాధనే...ఒప్పుకుంటాను. పెద్ద ఆస్తిపరుడ్ని కాదు. కానీ, నా దగ్గర శ్రమ ఉందే. చదువుకోనున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి?"

"తమ్ముడూ...నిన్ను ఎవరయ్యా తక్కువ చేసి చెప్పగలరు? నాలాంటి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన వాడివే నువ్వు!  నిన్ను వద్దని చెప్పగలదా?"

"చెప్పేశేరే! నన్ను దూరంగా విసిరేసి అంజలి వెళ్ళిపోతోందే ఆంటీ.....నేనేం చేయగలిగాను? ఆమెను ఆపగలిగానా?"

"నీతో చెప్పకూడదనే అనుకున్నాను. చెప్పే తీరాలి కాబోలు. సుధీర్, రోహిని నిన్ను వద్దని చెప్పటానికి కారణం నువ్వు ఇష్టం లేక కాదు. ఇంకా చెప్పాలంటే...ఆమె నీ మీద చాలా మర్యాద పెట్టుకుంది. కానీ, ఆమెకు ఏర్పడ్డ చేదు అనుభవాల వలన తప్పుగా నిర్ణయం తీసుకుంది"

"నాకు అర్ధం కాలేదు"

“చెబుతాను" అన్న ఆమె, రోహిని యొక్క పూర్తి కథ చెప్పింది.

“అందువల్లనే ఆమెకు ఎవరైనా 'ప్రేమ’ అని చెబితే అనుమాన పడుతోంది. తన జీవితం లాగానే తన కూతురు జీవితమూ నాశనమై పోకూడదని అనుకుంటోంది. అది తప్పా...చెప్పు బాబూ?"

"లేదు ఆంటీ...నేనే వాళ్ళను తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే అంజలి  బాగుంటే చాలు"

"నీకు చాలా గొప్ప మనసు బాబూ. నేను పలు విషయాలు గురించి ఆలొచించే వాళ్ళను హరికృష్ణతో వెళ్ళమన్నాను. ఆ మనిషి వీళ్ళను బాగా చూసుకుంటే రోజులవుతున్న కొద్ది రోహిని మనసులో 'ప్రేమ’ మీదున్న చెడు అభిప్రాయం కొంచం కొంచం తగ్గవచ్చు కదా?  ఆ సమయం చూసి మనం వెళ్ళి అంజలిని అడుగుదాం. అప్పుడు కాదనే ఛాన్సే లేదు"

"లేదు ఆంటీ. మీరు ఆ మాట వదిలేయండి. ఇక మీదట అంజలి నాకు లేదు...వెళ్ళండి  ఆంటీ. మీ చెల్లెలు కూరల కోసం కాచుకోనుంటుంది. నా వలన మీ భొజనాలు ఆలశ్యం అవటం నాకు ఇష్టం లేదు" అని చెప్పి నడవసాగాడు. 

ఆంటీ కాయగూరల సంచీని రుక్మణీ దగ్గర ఇచ్చేసి, కరివేపాకు కోయడానికి వెళుతుండగా -- స్కూల్ నుండి వస్తోంది అంజలి.

"ఏమ్మాయ్...కొంచం ఆగు" అన్నది.

"ఏమిటి ఆంటీ?"

"నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? డబ్బు వచ్చిన తరువాత పాత ప్రేమను మర్చిపోయావా? ఎందుకు సుధీర్ను చూడలేదు?"

కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతుంటే ఆంటీని చూసింది అంజలి.

"ఏమిటి ఆంటీ...మాతో ఉంటూ అన్నీ చూసిన మీరు నన్ను అలా అడగటం న్యాయమేనా? నేను అతన్ని చూస్తే కృంగిపోతాను. అన్నిటినీ అవతలపారేసి అతనితో వెళ్ళిపోతాను. కష్టపడి మనసును అనిచి పెట్టుకున్నాను తెలుసా?"

"సరి...సరి...ఏడవకు! నేను తెలియక అడిగాను. ఇంతక ముందే చూశాను. పాపం...చాలా బాధ పడ్డాడు. నువ్వు అతన్ని చూడలేదని బాగా ఫీలయ్యాడు. మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోయావు కదా. ఇక ఇక్కడికి వస్తావా? ఒకసారి అతన్ని కలిసి మాట్లాడమ్మా. కొంచం రిలాక్స్ గా ఉంటాడు...ఏమంటావ్?" అన్న ఆంటీ దగ్గర సరే నన్నట్టు తల ఊపింది.

"నువ్విక్కడే నిలబడు. నేను అతన్ని రమ్మంటాను" అన్న మామీ కరివేపాకుతో వెళ్ళిపోయింది. రెండు నిమిషాలలో సుధీర్  తో తిరిగి వచ్చింది. అంజలిని చూసిన వెంటనే అతని కాళ్ళు ఆగిపోయినై.

‘చిన్న పిల్లలు ఏదో మాట్లాడుకుంటారు. మధ్యలో నేనెందుకు అడ్డుగా?'అనుకున్న ఆంటీ లోపలకు వెళ్ళింది. సుధీర్, అంజలి దగ్గరకు వచ్చాడు.

"చాలా సంతోషం అంజలి. మీ నాన్న వచ్చాసేరటగా? ఇక నీకు మంచి రోజులే"

"సుధీర్...మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. ప్రస్తుతం నా పరిస్థితి అలా ఉంది! మా అమ్మ కొసమే మిమ్మల్ని వదిలి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాను. నేను మా అమ్మకు ప్రామిస్ చేసాను. నన్ను క్షమించండి... ప్లీజ్"

"అన్నీ తెలుసు. ఆంటీ చెప్పింది. పాపం మీ అమ్మ. ఆమెకు జీవితంలో ఉన్న ఒకే ఒక పట్టు నువ్వు మాత్రమే. నువ్వు ఆమెను మోసం చేస్తే ఆమె తట్టుకోలేదు. ఇప్పటికే ఆమె చాలా బలహీనంగా ఉంది. పరవాలేదు...అన్ని ప్రేమలు విజయవంతం  అవుతున్నాయా?"

"సుధీర్, మిమ్మల్ని పెళ్ళి చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయిందే! మీరు బాగుంటారు" అన్నది అంజలి ఏడుపు స్వరంతో. 

"నేను అందుకోసం పిలవలేదు. నువ్వు ఉద్యోగం వదిలేసేవుటగా?"

"మీకు ఎవరు చెప్పేరు? నాన్న చెప్పారు ఉద్యోగం మానేయమని. ఆయనకు వ్యాపారం బాగా లాభకరంగా పోతోందట. 'ఇంకా పనిచేసి కష్ట పడకు’ అని చెప్పారు"

"ఉండనీ. నేను వద్దని చెప్పటం లేదు. అందుకని నువ్వు చదువుకున్న చదువును వేస్టు చెయ్యబోతావా? బి.ఎడ్. చదువు వదిలేసి వెళ్ళబోతావా?"

"లేదు. అది కంటిన్యూ చెయ్యబోతాను. మొదట అమ్మ ఆరొగ్యం బాగా మెరుగు పడాలి. మిగతావన్నీ తరువాతే"

"ఎక్కడికి వెడుతున్నారు?"

“మౌలాలీలో ఇల్లు. కానీ మమ్మల్ని పిలుచుకుని ఊటీ టూర్ వెళ్ళబోతున్నారు. అక్కడ పదిహేను రోజులు ఉండబోతాము. ఆ తరువాతే తిరిగి వస్తాము. వచ్చే సోమవారం ఊటీకి బయలుదేరాలని చెప్పారు"

"చాలా మంచిది అంజలి... ఏమిట్రా ఇతను ఇలా చెబుతున్నాడే అనుకోకు. మీ నాన్నను ఒక్కసారిగా నమ్మకండి. అమ్మని ఎప్పుడూ నీ చూపులోనే ఉంచుకో. మీ నాన్న ఏదైనా టెన్షన్ పడేలాంటి విషయాన్ని అమ్మకు చెప్పి, ఆ తరువాత అమ్మకు బి.పీ ఎక్కువైతే ఆ తరువాత ఆమెను కాపాడటమే కష్టమవుతుందని డాక్టర్ చెప్పింది జ్ఞాపకముందిగా?"

"అవును. నేను జాగ్రత్తగా చూసుకుంటాను"

"సరి. నువ్వు తొందరపడి ఉద్యోగం మానేసి ఉండకూడదని అనిపిస్తోంది"

"లేదు సుధీర్. నేను ఉద్యోగాన్ని వదలలేదు. నాకూ, తొందరపడకూడదని అనిపించింది. అందువలన ఆరు నెలలు సెలవు తీసుకున్నాను. ఏదైనా దాని తరువాత నిర్ణయం తీసుకోవచ్చు అనుకున్నాను"

“మంచి నిర్ణయం అంజలి. ఎక్కడికి వెళ్ళినా నీకొక స్నేహితుడున్నాడని గుర్తుంచుకో. ఏ సహాయం కావాలన్నా సంసయించుకుండా నా దగ్గర అడుగు" అన్న అతను ఆమెకు వీడ్కోలు చెప్పాడు.

అంజలి నాన్న వచ్చారు. చాలా సరదా మనిషిలాగా ఉన్నారు. అందరితోనూ కలగలపుగా మాట్లాడారు. సామాన్లన్నీ బండిలోకి ఎక్కించారు. తాళం చెవి తీసుకునేటప్పుడు కళ్ళంబడ నీళ్ళు పెట్టుకుంది నిర్మలా ఆంటీ.

"మమ్మల్ని మరిచిపోకు రోహినీ. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు" అంటూ వీడ్కోలు చెప్పింది.

అంజలి కళ్ళూ, సుధీర్ కళ్ళూ కలుసుకుని బయటపడ్డాయి. చాలా మాట్లాడాలి అనుకుంది. కానీ, ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. బరువెక్కిన మనసులో నుండి మాటలు రాలేదు.

కారు బయలుదేరింది. అనిచి పెట్టుకున్న కన్నీరు...బయటకు వెళ్ళిపోతాను అని భయపెడుతోంది. పెదవులను గట్టిగా అదిమి పట్టుకుని వూరికేనే తల ఆడించి బయలుదేరింది. రోహిని ఏమీ మాట్లాడలేదు.

కారు బయటి గేటును దాటేటప్పుడు ప్రాణం తనను వదిలి వెళ్ళి పోతోందని మనసు భావించగా...ఆవేదనతో నిలబడున్నాడు సుధీర్.

                                                                                                         Continued...PART-10

***********************************************************************************************

31, జులై 2021, శనివారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-8)

 

                                                                            ప్రేమ కలలు                                                                                                                                                                        (సీరియల్-PART-8)

ఆ గదే సైలెంటుగా అయిపోయింది. అంజలి మాత్రం వెక్కి వెక్కి ఏడ్చే శబ్ధం మాత్రం వినబడింది.

"ఛీ...పిచ్చిపిల్లా...ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా జరిగి ముగిసి చాలా సంవత్సరాలు అయ్యింది...ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు?"

"లేదమ్మా. నువ్వు నాకోసం ఎన్ని  కష్టాలు అనుభవించేవు? అది తలుచుకుంటే..." మళ్ళీ కన్నీరు పొంగి పొర్లింది.

"సరే రోహినీ...తరువాత ఏమయ్యింది?".

"ఆ రోజు వెళ్ళినతనే. ఆ తరువాత మేమున్నామా, చచ్చిపోయామా అని తెలుసుకోవటానికి కూడా రాలేదు. ఎలాగో కష్టపడి దీన్ని పెంచి పెద్ద చేశాను. అప్పుడు మనసులోనూ, శరీరంలోనూ ఓపిక ఉండేది. దెబ్బతిని దెబ్బతిని ఉన్న హృదయం ఇప్పుడు ట్రబుల్ ఇస్తోంది"అన్నది.

“రోహినీ నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకూడదు. దీనికీ, అంజలి ప్రేమను నువ్వు అంగీకరించక పోవటానికీ ఏమిటి సంబంధం! నాకు అర్ధం కాలేదు"

"అయ్యో ఆంటీ...ఇంకా అర్ధం కాలేదా? సుధీర్, అంజలిని ప్రేమించటం లేదు. నటిస్తున్నాడు. దాన్ని పెళ్ళిచేసుకుని చిత్రవధ పెడతాడు. నాకు జరిగింది దానికి జరగకూడదు కదా? అదైనా బాగా బ్రతకనీ!"

"ఏమిటే... సుధీర్ ఎంత మంచి పిల్లాడో  తెలుసా? అతనికి ఎంత పెద్ద మనసుంటే ఈ వృద్దాశ్రమం జరుపుతాడు? అతనికి డబ్బు ఆశ ఉండుంటే పెద్ద డబ్బుగల అమ్మాయిని చూసుకోనుంటాడు గానీ అంజలిని ఎందుకు చూడటం?”

“ఆంటీ...మీరు అతనికి సపోర్టు చేసి మాట్లాడేటట్టైతే ఇక ఇక్కడికి రాకండి. నా కూతురుకు ఎవరు భర్తగా రావాలో నేను తీర్మానం చేసుకుంటాను. పెద్దవాళ్ళు మంచి మనసుతో ఏది చేసినా తప్పుగా అవదు. నేను గనుక మా నాన్న మాట వినుంటే నాకు ఈ గతి పట్టేదా?"

"అమ్మా...నువ్వు నా గురించి ఆలొచించకు. నీ విషయానికి రా. నాన్న ఇప్పుడొచ్చి మనల్ని పిలుస్తున్నారు. మనం వెళ్ళాలా...వద్దా? ఏం నిర్ణయించుకున్నావు?"

"నేను ఇంత చెప్పినా నీకు అర్ధం కాలేదా? వాడికి నా మీద ప్రేమ ఏమీలేదు. ఏదో మనసులో పెట్టుకునే పిలుస్తున్నాడు. ఒకసారి నేను వాడ్ని నమ్మి మోసపోయింది చాలదా? మళ్ళీ మళ్ళీ అవమానపడాలా?"

"అలా అనుకోవటం తప్పు రోహినీ. పలు సంవత్సరాలకు ముందు నువ్వొక తప్పు చేశావు. కానీ, ఈ రోజు వరకు దాన్ని తలచుకుని బాధ పడుతూనే ఉన్నావే? అలాగే అతను కూడా మారి ఉండొచ్చు కదా? ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు"

“వాడు ఖచ్చితంగా మారడు ఆంటీ...ఇప్పుడు నాకేంటి తక్కువ? మీరున్నారు... అంజలి ఉంది. ఇంకేం కావాలి? నేను ప్రశాంతంగా ఉండిపోతాను" 

"అమ్మా అంజలీ...వెళ్ళి కొంచం కాఫీ కలుపుకు వస్తావా. నేను మీ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉంటాను" అన్న వెంటనే అంజలి లేచి లోపలకు వెళ్ళింది. ఆమె వెళ్ళిన  వెంటనే కుర్చీని ఎత్తి మంచం పక్కగా వేసుకుంది ఆంటీ.

"రోహినీ...నేను చెబుతున్నానని తప్పుగా అనుకోకూడదు. నిన్ను నా సొంత చెల్లిగా భావించి చెబుతున్నాను" అంటూ దేనికో పిడి వేసింది.

"ఏమిటి విషయం ఆంటీ? సుధీర్ విషయమైతే నేను వినటానికి రెడీగా లేను"

"లేదు...ఇది వేరు. నేనడిగే ప్రశ్నలకు జవాబు చెబుతావా?"

"అడగండి"

"ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు అంజలికి పెళ్ళి చెయ్యాలి కదా?"

"అవును...అది 'బి.ఎడ్' చదువు పూర్తి చేసిన వెంటనే, సంబంధాలు చూడటం మొదలుపెడతాను"

"చాలా కరెక్ట్. సంబంధాలు ఎలా వెతుకుతావు? ప్రకటన ఇస్తావా...లేదు టీ.వీ లో ఎక్జిబిషన్ లో నిలబెట్టినట్టు నిలబెడతావా?"

"లేదు...లేదు. నేను మంచి పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని అతనితో చెప్పి అంజలికి తగిన వరుడ్ని చూడమంటాను"

“అది...ఇప్పుడు నువ్వు 'పాయింట్' కు వచ్చావు. మంచి పెళ్ళిళ్ళ పేరయ్య మూలంగా అయితే మంచి కుటుంబం దొరుకుతుంది. అందులో సందేహమేమీ లేదు. కానీ వరుడి ఇంటి వాళ్ళు...పిల్ల తండ్రి ఎవరు -- ఎక్కడున్నారు అని అడుగుతారే! అప్పుడెలా సమాధానం చెబుతావు? అందరి దగ్గర నువ్వు మోసపోయిన కథ చెబుతావా? వాళ్ళు అది నమ్మాలిగా?"

రోహిని సమాధానం చెప్పలేకపోయింది. ఆంటీ మళ్ళీ మొదలు పెట్టింది.

"నీకు భర్త వద్దు. అంజలికి నాన్న కావాలే? నువ్వు చిన్న వయసులో అన్ని సుఖాలను అనుభవించి, ప్రేమ కోసం అవన్నీ అవతలపారేసి వచ్చావు. కానీ, అంజలి పాపం...పుట్టిన దగ్గర నుండి పేదరికం తప్ప ఇంకేం చూసింది? ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా డబ్బుతో ఉన్నప్పుడు అది ఎందుకు కష్టపడాలి?"

ఆలొచించటం మొదలు పెట్టింది రోహిని.

"బాగా ఆలొచించి చూడు. ఈ రోజు నీ దగ్గర పెద్దగా డబ్బులేదు. అలాంటప్పుడు అతను నిన్ను వెతుక్కుంటూ ఎందుకు రావడం? చెప్పు! అతను అనుకోనుంటే ఇంకో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండి ఉండొచ్చు కదా?"

"ఆంటీ...కావాలంటే ఒక పని చేయనా? అంజలిని మాత్రం వాళ్ళ నాన్నతో పంపుతాను. నేను ఒంటరిగా ఉండిపోతాను?"

"చాలా బాగుందే...నువ్వు చెప్పేది చాలా బాగుంది. దీనికి అంజలి ఒప్పుకుంటుందా? ఎందుకింత స్వార్ధ పరురాలుగా ఉన్నావు రోహినీ?"

"ఎవరు...నేను స్వార్ధంగా ఉన్నానా? అంజలి కోసమే నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాను. దానికి పెళ్ళి చేస్తేనే నేను హాయిగా కళ్ళు మూస్తాను"

“పెద్ద వయసు మీరిన దానిలాగా మాట్లాడొద్దు. అలా నీకేమంత వయసైపోయింది. ఇక మీదట మనవుడు -- మనవరాలునో ఎత్తుకుని ముద్దాడాలి. ఇంతలో ఎందుకంత తొందర?"

“ఒక మాటకు అన్నాను ఆంటీ...అంతే"

"ఇలా చూడు రోహినీ...జీవితంలో తప్పు చేయని వారు ఎవరు? అందరం ఏదో ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోలేక కొట్టుకుంటున్నాం. పాపం మీ ఇంటాయన...ఆయన మారి వచ్చారు. ఇప్పుడు అతన్ని క్షమించి అంజలికి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వు"

"ఆయన మంచివారు కాదు. ఇదే మా నాన్న చూసిన వరుడైతే నన్ను అనాధగా వదిలేసి వెళ్ళుంటారా? చెప్పండి"

నవ్వింది ఆంటీ.

"మంచి కథ...నీకు లోకజ్ఞానమే తెలియదు. ఏం చదివేవో...ఏం ఉద్యోగం చేశావో పో"

"ఏమిటి ఆంటీ చెబుతున్నారు?"

"చూడు...నా గురించి నీకేం తెలుసు?"

"మీరు నిర్మలా ఆంటీ...మీ ఆయన చనిపోయారు. మీకు పిల్లలు లేకపోవటం వలన ఇక్కడ చేరేరు...అంతే కదా?"

“అది లోకానికి నేను చెప్పింది. నీ కథ లాగానే నా కథ కూడా. ఏమిటొక తేడా అంటే...నువ్వు ప్రేమించావు! నేను మా నాన్న చూసిన వరుడ్ని పెళ్ళి చేసుకున్నాను"

"తరువాత ఏమైంది?"

"తరువాత ఏమైందా? అంతా విధి. మొదట నాకు కొడుకు పుట్టాడు. ఆశగా శంకర్ అని పేరు పెట్టి పెంచాము. తరువాత మూడు సంవత్సరాలకు పిల్ల పుట్టింది. అప్పుడే విధి నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టింది"

"మీరేం చెబుతున్నారు?"

"నాకు పుట్టిన ఆడపిల్లకు మెదడు వ్యాప్తి లేదు అని ఆరో నెలే తెలిసిపోయింది. దానికి ఏమీ తెలియదు. పిచ్చిదానిలాగా ఉంటుంది అని డాక్టరమ్మ చెప్పింది. వైద్యం చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు అని చెప్పింది"

"అయ్యో పాపం?"

"పాపమే! కానీ ఏం చేయను...కన్నాను -- నా బిడ్డ అయ్యిందే...వదిలి పెట్టగలనా? ఇంటికి పిలుచుకు వచ్చి దాన్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాను. కానీ మా ఆయన భయపడిపోయాడు. ఆయనకు జీతం తక్కువే. ఎక్కడ తన సంపాదనంతా ఆ పిల్ల బాగోగులకే సరిపోతుందేమో నని బాధపడటం మొదలుపెట్టారు. ఆ పిల్లను అనాధ ఆశ్రమంలో వదిలిపెట్టమన్నారు" -- చెప్పటం ఆపి కళ్ళు తుడుచుకుంది ఆంటీ.

"ఛ. ఇంత రాతి మనసు కలిగిన వాళ్ళు కూడా ఉంటారా?"

"ఉన్నారే!  నన్ను బాగా బలవంతం చేశారు...ఏది ఏమైనా సరే నేను నా పిల్లను అనాధ ఆశ్రమంలో విడిచి పెట్టను అని చెప్పాను"

"అదే కరెక్ట్"

"ఏం కరక్టు. నేను నా నిర్ణయం చెప్పిన  తరువాత రెండు రోజులు కూడా ఇంట్లో లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంటికే రాలేదు. వివరాలేమీ తెలియనందువలన ఆయన ఆఫీసుకే వెళ్ళాను. ఆయన ఎక్కడో నార్త్ సైడుకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్ళారని చెప్పారు. ఇరవై ఏడేళ్ళ వయసులో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎవరి ఆదరణ లేక నిలబడ్డాను"

"మీ అమ్మా--నాన్నా?"

"అమ్మ చనిపోయింది. నాన్న అన్నయ్యతో ఉన్నారు. ఎక్కడ నేను భారంగా అయిపోతానేమోనని మా వదిన నన్ను దగ్గరకే చేర్చలేదు. ఇంకెవరున్నారు? ఏం చేయను నేను? అమ్మవారి మీద భారం మోపి వంట పనులకు వెళ్ళటం మొదలుపెట్టాను. ఈ మధ్యలో ఆ పిల్లకు ఫిట్స్ వచ్చి పదో ఏట చనిపోయింది. మనసు రాయి చేసుకుని క్యాంటీన్ మొదలుపెట్టాను. అందులో వచ్చిన సంపాదనతోనే కొడుకును సి. ఏ వరకు చదివించాను”

"అబ్బో...మీ అబ్బాయి సి.ఏ. చదివాడా?"

“అవును...చదివించటంలో నేను ఏమీ తక్కువ చేయకపోయినా...వాడే నా మీద ప్రేమను తక్కువ చేసుకున్నాడు"

"ఏమిటి ఆంటీ అలా చెబుతున్నారు"

"వాడికి మంచి సంబంధం కుదిరింది. వాడి చదువు చూసే ఒక గొప్ప ఆస్తిపరుడు అమ్మాయిని ఇచ్చాడు. నేనూ సంతోషంగా పెళ్ళి చేశాను. తరువాతే తెలిసింది. వచ్చింది నాకు కోడలు కాదు...యముడు అని"

"ఆమె మిమ్మల్ని చాలా బాధ పెట్టిందా?"

"అంతా ఇంతా కాదు? నన్ను చూస్తేనే దానికి ఇష్టముండదు. వంట మనిషి అని దానికి నిర్లక్ష్యం. నన్ను గౌరవించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 

"ఒకరోజు మా కోడలు బంధువులు ఎవరో వచ్చారు. నేను వాళ్ళింటికి వంట చేయటానికి వెళ్ళున్నాను. అది ఆయన జ్ఞాపకముంచుకుని నన్ను విచారించారు. అంతే ఏదో పరువే పోయినట్టు అరిచింది నా కోడలు"

"దేనికి?"

“ఆమె భర్త పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట. అది కూడా గొప్ప కుటుంబంలో చేరిందట. ఆమె బంధువు దగ్గర నేనే కావాలని వెళ్ళి ఆమెను అవమాన పరిచేనని, ఇంకా ఏదేదో చెప్పింది..."

"మీరు ఏం సమాధానం చెప్పారు?"

"నేనేం చెబుతాను రోహినీ. పెద్దవాళ్ళ మాటలు నిచ్చన ఎక్కుతుందా? కొన్ని రోజులు గొణుగుతూ గడిపిన ఆమె...ఏం చెప్పిందో, ఎంత చెప్పిందో తెలియదు...వాడు. అదే నా కొడుకు నన్ను ఈ వృద్దాశ్రమంలో చేర్చేస్తాను. నెల నెల డబ్బులు కడతాను. నువ్వు వసతిగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చి చేర్చి వెళ్ళిపోయాడు. ఇదంతా బయటకు తెలిస్తే అవమానం అనుకుని...భర్త చనిపోయాడు...పిల్లలు లేరు అని అబద్ధం చెప్పి ఉంచాను"

చాలాసేపు మౌనంగానే సాగింది.

"నాకు జరిగింది పెద్దలు చేసిన పెళ్లే,  ఏం జీవించాను గొప్పగా? కన్న కొడుకే నన్ను ఇక్కడ చేర్చేసి వెళ్ళిపోయాడు. దీన్నే విధి అంటారు"

"పాపం ఆంటీ మీరు. ఇంత సోకాన్ని మనసులో పెట్టుకుని తాళం వేసుకుని నవ్వి నవ్వి మాట్లాడుతున్నారు? మీ మనసు ఎవరికీ రాదు"

"నువ్వు నన్ను పొగడాలని నేను నా విషయం నీకు చెప్పలేదు. జీవితంలో కష్టాలూ, సుఖాలూ సహజం. ఇలా ఉండుంటే కష్టాలే వచ్చేవే కావని చెప్పలేము. అంతా భగవంతుడి చేతిలో ఉంది. నీ దుఃఖమే పెద్దది అని అనుకుంటున్నావు. కొంచం మిగతావారిని చూడు. ఈ ఆశ్రమంలో ఒక్కొక్కరి దగ్గర దుఃఖ కథలు చాలా ఉంటాయి. నువ్వు జరిగిపోయిన కాలం గురించి ఆలొచించి -- జరుగుతున్న కాలాన్ని వృధా చేసుకోకు" అన్నది ఆంటీ.

రోహిని ఆలొచించింది.

'ఆంటీ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు? కానీ, నా వల్ల హరికృష్ణను క్షమించటం కుదరదు’

క్షమించకపోయినా పరవాలేదు. కూతురికోసం ఆయన్ని చేర్చుకోవాలి. ఆంటీ చెప్పినట్టు రేపు అంజలి నాన్న గారి మాట వచ్చినప్పుడు ఆమె వెడుక్కి తలవంచ కూడదు. తల ఎత్తుకుని నిలబడి 'ఈయనే నా తండ్రి’ అని చెప్పాలి. దానికి హరికృష్ణను నేను చేర్చుకోవాలి.

ఒక నిర్ణయానికి వచ్చింది రోహిని.

"ఆంటీ...మీరు చెప్పింది ఆలొచించి చూశాను. మీరు చెప్పేదే కరెక్ట్.  అంజలి కోసం నేను ఆయన్ని చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంజలీ...నువ్వెళ్ళి మీ నాన్నను పిలుచుకు రామ్మా" అన్నది.

ఆనందంతో తల్లిని  కౌగలించుకుంది కూతురు.

                                                                                                       Continued...PART-9

***********************************************************************************************