2, ఆగస్టు 2021, సోమవారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-9)

 

                                                                                 ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-9)

అంజలీనూ, తల్లి రోహినినూ ఇల్లు ఖాలీ చేసి హరికృష్ణతో వెల్తున్నారనే వార్త సుధీర్ కు చేరింది. అతని మనసులో పలురకాల ఆలొచనా అలలు. తన ప్రేమ గెలుస్తుందని కొంచంగా నమ్మకం తలెత్తింది. 

'ఒకవేల అంజలి వాళ్ళ నాన్నకు నేను నచ్చితే, ఆమె నాకు దొరికే ఛాన్స్ ఉంది కదా?' అని అతని మనసు లెక్క వేసింది. ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనే తహతహతో ఎలాగైనా ఆమెను ఒకసారి కలిసి మాట్లాడలేమా అని అల్లాడిపొయాడు. మర్యాద నిమిత్తం రోహినిని ఇంటికి వెళ్ళి చూశాడు.

ఆమె నుదురు చిట్లింది.

"ఏమిటయ్యా...ఏంటిలా వచ్చావు? అంజలి నిన్ను చూడదు" మొహం మీద కొట్టినట్టు చెప్పింది.

"లేదు ఆంటీ...నేను అంజలి కోసం రాలేదు. ఇల్లు ఖాలీ చెయ్యబోతున్నారని నిర్మలా ఆంటీ చెప్పింది. కానీ మీరు నా దగ్గర ఏమీ చెప్పలేదు. అందుకే ఏమిటి వివరం అని అడిగి తెలుసుకుందామని వచ్చాను..."

రోహిని గొంతు, మాట ఒక్కసారిగా మారిపోయింది "అవును బాబూ...నువ్వు మాకు కరెక్టు సమయంలో ఈ ఇల్లు ఇచ్చావు! లేకపోతే మాగతి ఏమయ్యేదో? నువ్వు సాధారణ మనిషిగా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. కానీ, అంజలి పేరు చెప్పుకుంటూ వస్తే అనుమతించను. ఆమె కూడా నన్ను కాదని ఏమీ చెయ్యదు"   

నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు కూడా మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగి వెళ్ళటానికి వచ్చాను. మీరు ఎప్పుడు ఖాలీ చేస్తున్నారు?

"రేపు...వాళ్ళ నాన్న వచ్చి మమ్మల్ని ఆయనతో తీసుకు వెడతానని చెప్పారు"

"అలాగా...చాలా సంతోషం. మీరు ఖాలీ చేసిన తరువాత ఇల్లు తాళం వేసి, తాళం చెవి నిర్మలా ఆంటీ దగ్గర ఇచ్చేయండి...నేను తీసుకుంటాను. ఏదైనా సహాయం కావాలనుకుంటే సందేహించకుండా అడగండి" అని చెప్పి వచ్చాశాడు. గుండె వేగంగా కొట్టుకుంది.

'నేనేం అంత పెద్ద తప్పు చేశాను? ఎందుకిలా కుక్కను తరిమినట్టు తరమాలి? ఇన్ని రోజుల పరిచయానికైనా అంజలి నాన్నను నాకు పరిచయం చేయచ్చు కదా? కృతజ్ఞతా భావం లేని జన్మలు! నేనేమైనా అంజలిని ఎత్తుకునా వెళ్ళబోతాను? ఆమె మాత్రం తక్కువా ఏమిటి? 'మేము ఖాలీ చెయ్యబోతాము. ఏదైనా మాట్లాడాలా...ఇదే నా నెంబర్ అని చెప్పి ఇచ్చిందా? నువ్వు మాత్రమే ఆమెను తలుచుకుని కరిగిపోతున్నావు. ఆమెకు నీ జ్ఞాపకమే లేదు

ఏవేవో ఆలొచించుకుంటూ చెట్టు కింద నిలబడున్నాడు.

"ఏమయ్యా సుధీర్...నీ అంజలి ఇల్లు ఖలీ చేస్తున్నట్టుందే?"

గొంతు విని తల తిప్పి చూశాడు. నిర్మలా ఆంటీ. చేతిలో కూరగాయల సంచీతో నిలబడుంది.

"ఆంటీ..."  

"ఏమిటి తమ్ముడూ ఆలొచిస్తున్నావు. నువ్వూ, అంజలీనూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసే" అన్నది నొక్కి చెబుతూ.

ముఖం వాడిపోయినట్టు మౌనంగా నిలబడ్డాడు.

"చాలా సంవత్సరాల తరువాత రోహిని యొక్క భర్త వచ్చారు. అంజలి, వాళ్ళ అమ్మా ఆయనతో ఉండటమే న్యాయం. నువ్వేమనుకుంటున్నావు?"

"నేనేమనుకుంటా ఆంటీ? ఇన్ని రోజులు లేని నాన్న...ఇప్పుడు సడన్ గా ఎక్కడ్నుంచి  మొలకెత్తారు? అంజలి నన్ను ఇష్టపడుతోందని  మీరు మాత్రమే చెబుతున్నారు. కానీ  ఆమె నాతో ఒక్క ముక్క గూడా దీని గురించి చెప్పలేదే? ఇప్పుడు కూడా నేను వాళ్ళింటికి వెళ్ళాను. అంజలి వాళ్ళ అమ్మ, నన్ను కొట్టి తరిమినట్టు తరిమింది. ఎందుకిలా  చేస్తున్నావని వాళ్ళ అమ్మను అంజలి అడగనే లేదే? అంతెందుకు...బయటకే రాలేదు"  

"ఇప్పుడు అంజలి ఇంట్లో లేదబ్బాయ్...స్కూలుకు వెళ్ళింది...ఉద్యోగానికి రాజీనామా చేయటానికే"

"దానికేమన్నా పిచ్చా? మంచి ఉద్యోగాన్ని ఎందుకు విడిచి పెట్టాలి?"

"నీకు విషయమే తెలియదా? ఆమె తండ్రి పెద్ద ఆస్తిపరుడుగా తిరిగి వచ్చాడు. రోహినికీ, అంజలికీ మంచి కాలం వచ్చినట్టే అనుకో"

సంతోష పడనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుకుంది అతన్ని.

"ఓ...అందుకేనా అంజలి వాళ్ళ అమ్మ కళ్లకు నేను కనిపించలేదు. ఇక పెద్ద డబ్బుగల అల్లుడ్ని చూస్తారు. ఈ పేద సుధీర్ జ్ఞాపకం ఎవరికి ఉండబోతుంది?" 

"అలా చెప్పకు నాయనా. అంజలి నిన్ను మరిచిపోలేదు. పాపం...ఆమె రెండు తలకాయలు ఉన్న చీమ లాగా కొట్టుకుంటోంది. ఒక పక్క నువ్వు...ఇంకో పక్క వాళ్ల అమ్మ... అంజలి ఏం చేస్తుంది చెప్పు?"

"ఏం ఆంటీ...నాకేం తక్కువ? నేను అనాధనే...ఒప్పుకుంటాను. పెద్ద ఆస్తిపరుడ్ని కాదు. కానీ, నా దగ్గర శ్రమ ఉందే. చదువుకోనున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి?"

"తమ్ముడూ...నిన్ను ఎవరయ్యా తక్కువ చేసి చెప్పగలరు? నాలాంటి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన వాడివే నువ్వు!  నిన్ను వద్దని చెప్పగలదా?"

"చెప్పేశేరే! నన్ను దూరంగా విసిరేసి అంజలి వెళ్ళిపోతోందే ఆంటీ.....నేనేం చేయగలిగాను? ఆమెను ఆపగలిగానా?"

"నీతో చెప్పకూడదనే అనుకున్నాను. చెప్పే తీరాలి కాబోలు. సుధీర్, రోహిని నిన్ను వద్దని చెప్పటానికి కారణం నువ్వు ఇష్టం లేక కాదు. ఇంకా చెప్పాలంటే...ఆమె నీ మీద చాలా మర్యాద పెట్టుకుంది. కానీ, ఆమెకు ఏర్పడ్డ చేదు అనుభవాల వలన తప్పుగా నిర్ణయం తీసుకుంది"

"నాకు అర్ధం కాలేదు"

చెబుతాను" అన్న ఆమె, రోహిని యొక్క పూర్తి కథ చెప్పింది.

అందువల్లనే ఆమెకు ఎవరైనా 'ప్రేమ అని చెబితే అనుమాన పడుతోంది. తన జీవితం లాగానే తన కూతురు జీవితమూ నాశనమై పోకూడదని అనుకుంటోంది. అది తప్పా...చెప్పు బాబూ?"

"లేదు ఆంటీ...నేనే వాళ్ళను తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే అంజలి  బాగుంటే చాలు"

"నీకు చాలా గొప్ప మనసు బాబూ. నేను పలు విషయాలు గురించి ఆలొచించే వాళ్ళను హరికృష్ణతో వెళ్ళమన్నాను. ఆ మనిషి వీళ్ళను బాగా చూసుకుంటే రోజులవుతున్న కొద్ది రోహిని మనసులో 'ప్రేమ మీదున్న చెడు అభిప్రాయం కొంచం కొంచం తగ్గవచ్చు కదా?  ఆ సమయం చూసి మనం వెళ్ళి అంజలిని అడుగుదాం. అప్పుడు కాదనే ఛాన్సే లేదు"

"లేదు ఆంటీ. మీరు ఆ మాట వదిలేయండి. ఇక మీదట అంజలి నాకు లేదు...వెళ్ళండి  ఆంటీ. మీ చెల్లెలు కూరల కోసం కాచుకోనుంటుంది. నా వలన మీ భొజనాలు ఆలశ్యం అవటం నాకు ఇష్టం లేదు" అని చెప్పి నడవసాగాడు. 

ఆంటీ కాయగూరల సంచీని రుక్మణీ దగ్గర ఇచ్చేసి, కరివేపాకు కోయడానికి వెళుతుండగా -- స్కూల్ నుండి వస్తోంది అంజలి.

"ఏమ్మాయ్...కొంచం ఆగు" అన్నది.

"ఏమిటి ఆంటీ?"

"నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? డబ్బు వచ్చిన తరువాత పాత ప్రేమను మర్చిపోయావా? ఎందుకు సుధీర్ను చూడలేదు?"

కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతుంటే ఆంటీని చూసింది అంజలి.

"ఏమిటి ఆంటీ...మాతో ఉంటూ అన్నీ చూసిన మీరు నన్ను అలా అడగటం న్యాయమేనా? నేను అతన్ని చూస్తే కృంగిపోతాను. అన్నిటినీ అవతలపారేసి అతనితో వెళ్ళిపోతాను. కష్టపడి మనసును అనిచి పెట్టుకున్నాను తెలుసా?"

"సరి...సరి...ఏడవకు! నేను తెలియక అడిగాను. ఇంతక ముందే చూశాను. పాపం...చాలా బాధ పడ్డాడు. నువ్వు అతన్ని చూడలేదని బాగా ఫీలయ్యాడు. మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోయావు కదా. ఇక ఇక్కడికి వస్తావా? ఒకసారి అతన్ని కలిసి మాట్లాడమ్మా. కొంచం రిలాక్స్ గా ఉంటాడు...ఏమంటావ్?" అన్న ఆంటీ దగ్గర సరే నన్నట్టు తల ఊపింది.

"నువ్విక్కడే నిలబడు. నేను అతన్ని రమ్మంటాను" అన్న మామీ కరివేపాకుతో వెళ్ళిపోయింది. రెండు నిమిషాలలో సుధీర్  తో తిరిగి వచ్చింది. అంజలిని చూసిన వెంటనే అతని కాళ్ళు ఆగిపోయినై.

చిన్న పిల్లలు ఏదో మాట్లాడుకుంటారు. మధ్యలో నేనెందుకు అడ్డుగా?'అనుకున్న ఆంటీ లోపలకు వెళ్ళింది. సుధీర్, అంజలి దగ్గరకు వచ్చాడు.

"చాలా సంతోషం అంజలి. మీ నాన్న వచ్చాసేరటగా? ఇక నీకు మంచి రోజులే"

"సుధీర్...మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. ప్రస్తుతం నా పరిస్థితి అలా ఉంది! మా అమ్మ కొసమే మిమ్మల్ని వదిలి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాను. నేను మా అమ్మకు ప్రామిస్ చేసాను. నన్ను క్షమించండి... ప్లీజ్"

"అన్నీ తెలుసు. ఆంటీ చెప్పింది. పాపం మీ అమ్మ. ఆమెకు జీవితంలో ఉన్న ఒకే ఒక పట్టు నువ్వు మాత్రమే. నువ్వు ఆమెను మోసం చేస్తే ఆమె తట్టుకోలేదు. ఇప్పటికే ఆమె చాలా బలహీనంగా ఉంది. పరవాలేదు...అన్ని ప్రేమలు విజయవంతం  అవుతున్నాయా?"

"సుధీర్, మిమ్మల్ని పెళ్ళి చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయిందే! మీరు బాగుంటారు" అన్నది అంజలి ఏడుపు స్వరంతో. 

"నేను అందుకోసం పిలవలేదు. నువ్వు ఉద్యోగం వదిలేసేవుటగా?"

"మీకు ఎవరు చెప్పేరు? నాన్న చెప్పారు ఉద్యోగం మానేయమని. ఆయనకు వ్యాపారం బాగా లాభకరంగా పోతోందట. 'ఇంకా పనిచేసి కష్ట పడకు అని చెప్పారు"

"ఉండనీ. నేను వద్దని చెప్పటం లేదు. అందుకని నువ్వు చదువుకున్న చదువును వేస్టు చెయ్యబోతావా? బి.ఎడ్. చదువు వదిలేసి వెళ్ళబోతావా?"

"లేదు. అది కంటిన్యూ చెయ్యబోతాను. మొదట అమ్మ ఆరొగ్యం బాగా మెరుగు పడాలి. మిగతావన్నీ తరువాతే"

"ఎక్కడికి వెడుతున్నారు?"

మౌలాలీలో ఇల్లు. కానీ మమ్మల్ని పిలుచుకుని ఊటీ టూర్ వెళ్ళబోతున్నారు. అక్కడ పదిహేను రోజులు ఉండబోతాము. ఆ తరువాతే తిరిగి వస్తాము. వచ్చే సోమవారం ఊటీకి బయలుదేరాలని చెప్పారు"

"చాలా మంచిది అంజలి... ఏమిట్రా ఇతను ఇలా చెబుతున్నాడే అనుకోకు. మీ నాన్నను ఒక్కసారిగా నమ్మకండి. అమ్మని ఎప్పుడూ నీ చూపులోనే ఉంచుకో. మీ నాన్న ఏదైనా టెన్షన్ పడేలాంటి విషయాన్ని అమ్మకు చెప్పి, ఆ తరువాత అమ్మకు బి.పీ ఎక్కువైతే ఆ తరువాత ఆమెను కాపాడటమే కష్టమవుతుందని డాక్టర్ చెప్పింది జ్ఞాపకముందిగా?"

"అవును. నేను జాగ్రత్తగా చూసుకుంటాను"

"సరి. నువ్వు తొందరపడి ఉద్యోగం మానేసి ఉండకూడదని అనిపిస్తోంది"

"లేదు సుధీర్. నేను ఉద్యోగాన్ని వదలలేదు. నాకూ, తొందరపడకూడదని అనిపించింది. అందువలన ఆరు నెలలు సెలవు తీసుకున్నాను. ఏదైనా దాని తరువాత నిర్ణయం తీసుకోవచ్చు అనుకున్నాను"

మంచి నిర్ణయం అంజలి. ఎక్కడికి వెళ్ళినా నీకొక స్నేహితుడున్నాడని గుర్తుంచుకో. ఏ సహాయం కావాలన్నా సంసయించుకుండా నా దగ్గర అడుగు" అన్న అతను ఆమెకు వీడ్కోలు చెప్పాడు.

అంజలి నాన్న వచ్చారు. చాలా సరదా మనిషిలాగా ఉన్నారు. అందరితోనూ కలగలపుగా మాట్లాడారు. సామాన్లన్నీ బండిలోకి ఎక్కించారు. తాళం చెవి తీసుకునేటప్పుడు కళ్ళంబడ నీళ్ళు పెట్టుకుంది నిర్మలా ఆంటీ.

"మమ్మల్ని మరిచిపోకు రోహినీ. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు" అంటూ వీడ్కోలు చెప్పింది.

అంజలి కళ్ళూ, సుధీర్ కళ్ళూ కలుసుకుని బయటపడ్డాయి. చాలా మాట్లాడాలి అనుకుంది. కానీ, ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. బరువెక్కిన మనసులో నుండి మాటలు రాలేదు.

కారు బయలుదేరింది. అనిచి పెట్టుకున్న కన్నీరు...బయటకు వెళ్ళిపోతాను అని భయపెడుతోంది. పెదవులను గట్టిగా అదిమి పట్టుకుని వూరికేనే తల ఆడించి బయలుదేరింది. రోహిని ఏమీ మాట్లాడలేదు.

కారు బయటి గేటును దాటేటప్పుడు ప్రాణం తనను వదిలి వెళ్ళి పోతోందని మనసు భావించగా...ఆవేదనతో నిలబడున్నాడు సుధీర్.

                                                                                                         Continued...PART-10

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి