7, ఆగస్టు 2021, శనివారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-11)

 

                                                                                    ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-11)

ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ నాన్నపై అరవటం మొదలుపెట్టింది.

"నన్ను ఎందుకు అక్కడికి పిలుచుకు వెళ్ళి అవమానపరిచారు? నేను అడిగానా? నాకు ఆస్తి కావాలని నేను ఏ రోజైనా మీ దగ్గర చెప్పానా? ఇప్పుడే కొంచం తలనొప్పి లేకుండా జీవించటం ప్రారంభించాను. అది మీకు నచ్చలేదా?" అని ఏడ్చింది.

అంజలికి కూడా తండ్రి మీద కొపమే! గట్టిగా నాలుగు చివాట్లు పెట్టాలని అనుకుంది. నాలికను అణిచివేసింది. కానీ, ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది.

"నేను మొదటే చెప్పానే? అమ్మకు ఎటువంటి టెన్షనూ ఇవ్వకూడదని. మీరెందుకు సడన్ గా ఆస్తి గురించి మాట్లాడారు? అందువలనే అమ్మకు అవమానం" అన్నది తల్లివైపు తిరిగింది.

"అమ్మా...నువ్వేమీ బాధపడకమ్మా. వాళ్ళ బంధుత్వమూ వద్దు...వాళ్ళ ఆస్తీ వద్దు. ఉన్నది పెట్టుకుని మనం సంతోషంగా ఉందాం" అన్నది.

"వాళ్ళ బంధుత్వమే వద్దు అన్నావు సరే...కానీ, ఆస్తి ఎందుకు వద్దని చెబుతున్నావు? పావు భాగం దొరికినా కూడా కొన్ని కోట్లు వస్తుంది. దాన్ని పూర్తిగా వదిలేయగలమా?" అన్నాడు హరికృష్ణ.

చూడండి...తిరిగి తిరిగి దాని గురించి మాట్లాడటం వలన ఏ ఉపయోగమూ ఉండదు. మా నాన్న నేను కూతుర్నే కాదని రాసుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎలా ఆస్తికి హక్కురాలు అవుతాను?"

హరికృష్ణ మొహంలో కాంతి. రోహిని దగ్గరకు వచ్చాడు. ఒక కుర్చీలో కూర్చున్నాడు. అంజలినీ కూర్చోమన్నాడు.

" రోహినీ...నేనే నీ దగ్గర మాట్లాడదామనుకున్నాను. మీ నాన్న నిన్ను కూతురు కాదని ఎంత మంది సాక్షులను పెట్టుకుని పత్రం రాసినా అది డూప్లికేటు అని చెప్పొచ్చు...ఆయన తన స్వీయ ఆలొచనతో అది రాయలేదని చెప్పి వాదాడవచ్చు"

"అలాగంటే...నాకు అర్ధం కాలేదు"

"మీ అన్నయ్యల మీద కేసు పెట్టవచ్చు. నువ్వేమీ బాధపడకు. నువ్వు అడుగుతున్నది ఆస్తిలోని నీ వాటాని మాత్రమే. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు సంతకం మాత్రం పెట్టు చాలు. నాకు  తెలిసిన అడ్వకేట్ ఒకరున్నారు. ఆయన్ని రమ్మని చెప్పనా?"

"ఉండండి...ఉండండి. తొందరపడకండి! నేను ఎందుకు వాళ్ళ మీద 'కేసు పెట్టాలి?"

"అర్ధం కాలేదా? కూతుర్లకూ పుట్టింటి ఆస్తిపైన హక్కు ఉందని ఇప్పుడు చట్టం తీసుకు వచ్చారు. ఆ పాయింటును పట్టుకుని మన అడ్వకేట్ కేసును వాదాడితే మనమే తప్పక గెలుస్తాం"

మౌనంగా కూర్చోనుంది రోహిని. ఆమె మనసు ఏదేదో ఆలొచించింది.

"ఏమిటి...ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? సరే అని చెప్పు రోహినీ" అన్నాడు హరికృష్ణ.

"లేదండి. నాకు ఇందులో ఇష్టం లేదు. నన్ను అల్లారు ముద్దుగా పెంచిన మా అన్నయ్యలపైన నేను కేసు పెట్టలేను. వాళ్ళకు అక్కర్లేని దానిగా నేను అయ్యుండచ్చు. ఎందుకంటే నేను చేసిన కార్యం అలాంటిది. కానీ, నాకు వాళ్ళు కావాలి. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి. నేను దావా వేయలేను" అన్నది ఖచ్చితంగా.

అతని మొహం మారింది. ఏం జరగబోతుందో నన్న భయం అంజలిని దహించి వేస్తోంది. కష్టపడి మొహాన్ని మామూలుగా ఉంచుకుంది.

"నీకు అర్ధం కావటం లేదు రోహినీ. మనమేమీ వాళ్ళ భాగాంలోని ఆస్తిని అడగటం లేదు.  మనకు చట్టపూర్వకంగా రావాల్సిన భాగాన్నే అడగబోతున్నాం. ఎందుకంటే వాళ్ళుగా నీకు రావలసిన భాగాన్ని ఇవ్వనంటున్నారు. అందుకే కోర్టు ద్వారా అడుగుదాం అంటున్నాను. కోర్టులో కేసు పెడదాం. అది కోర్టులో హియరింగ్ కు తీసుకునే లోపు...మీ ఇంట్లోంచి సమాధానం మాట్లాడటానికి వస్తారు. ఎందుకంటే...వాళ్ళు ఆస్తిపాస్తులు లెక్కలన్నీ ఇవ్వాల్సి వస్తుందే? అది వాళ్ళు ఇష్టపడరు. అలా వాళ్ళు మనతో సమాధానం చేసుకోవటానికి వచ్చినప్పుడు పెద్ద మొత్తం అడిగి తీసుకుందాం. వాళ్ళకూ మంచిది. మనకీ లాభం. ఏమంటావు?"

"క్రిమినల్ గా చెప్పాలంటే...కేసు వేస్తామని చెప్పి, వాళ్లను బెదిరించి డబ్బు పీక్కోవాలి అంటారు. అంతే కదా? దానికి పేరు 'బ్లాక్ మైల్. నన్ను రౌడీతనం చేయమంటారా? నా వల్ల కాదు"

"నువ్విలా వాళ్ల మీద గౌరవం చూపిస్తున్నావు, కానీ వాళ్ళు నీకివ్వాల్సిన చెల్లి అనే బంధుత్వాన్ని కూడ ఇవ్వటం లేదే? తండ్రి నిన్ను కూతురు కాదన్నాడు. మనమైనా చెల్లికి కొంత ఇద్దామని అన్నయ్యలకైనా అనిపించిందా? నువ్వే అన్నయ్యా...అన్నయ్యా అని ప్రేమ కురిపిస్తున్నావు. వాళ్లకు లేదు"

"నేను ఉన్న చోట ఉండుంటే... నన్ను బంగారు పళ్లెంలో పెట్టి చూసుకోనుండే వారు. అది నేను చెడుపుకున్నానే? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళను?"

"ఏమిటే ఎప్పుడూ అదే మాట్లాడుతున్నావు? ఏదో జరిగిపోయింది...అది వదిలేయ్. పాతవాటి గురించి మాట్లాడి ఏమిటి లాభం? నువ్వు ఇంకోసారి వెళ్ళి, ఇలా ఆయన మీ మీద కేసు పెట్టమంటున్నారు. అలా చేస్తే మీ పరువే పోతుంది. అందు వల్ల ఆస్తిలో నా భాగం నాకిచ్చేయండి అని అడిగి చూడు"

అది విన్న వెంటనే అమ్మ లేచింది.

"ఏమండీ...మీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదా? నేను మంచి కుటుంబంలో పుట్టిన దానిని. నాకు పరువు, పౌరుషం ఉంది. ఇంకొసారి మా ఇంటికి వెళ్లటమో...ఆస్తి అడగడమో జరగనే జరగదు. నన్ను బలవంత పెట్టకండి" అని చెప్పి లోపలకు వెళ్ళిపోయింది.

హరికృష్ణ చూపులు ఇప్పుడు అంజలి మీద పడ్డాయి. మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు.

"అమ్మా అంజలీ. నేను చెప్పేది నువ్వైనా అర్ధం చేసుకో. ఎంత వద్దన్నా పది కోట్లు వస్తుంది. అది ఎవరైనా వద్దని చెబుతారా? నువ్వు ఒక స్కూల్లో ఉద్యోగం చేశేవే? అలాంటి స్కూలు నువ్వే మొదలు పెట్టి నడపవచ్చు. కొంచం అమ్మ దగ్గర అర్ధం అయ్యేటట్టు చెప్పమ్మా" అన్నాడు.

"ఇలా చూడండి నాన్నా. ఈ విషయంలో నేను అమ్మను బలవంతం చేయను. అది వాళ్ళ ఇల్లు...వాళ్ళ ఇష్టం. వాళ్ళను బలవంతం చేయటానికి మనకు హక్కు లేదు"

మొహమాటంతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.

ఇంకో రెండు రోజులు గడిచినై. ఎప్పుడూ చూడూ కేసు పెట్టు కేసు పెట్టు అని సనుగుతూ ఉండేవాడు హరికృష్ణ. అది రోహినికి చిత్రవధా లాగా అనిపించింది. కోపంగా అరిచింది.

"ఎందుకలా ఎప్పుడూ ఆస్తి, ఆస్తి అంటూ ప్రాణం తీస్తున్నారు? చివరగా చెబుతున్నాను...నా వల్ల వాళ్ళ మీద కేసు వేయటం జరగదు. మీ వల్ల ఏం చేయగలరో అది చేసుకోండి"

"ఏమిటే...మాటలు కోటలు దాటుతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు ఉన్నావా...చచ్చావా అని కూడా చూడలేదు. అటువంటి వాళ్ళపైన ప్రేమ పొంగుకు వస్తోంది"

"ఎం...ఇన్ని రోజులు మేము ఉన్నామా, చచ్చామా అని మీరు కూడా చూడలేదు. కనీసం కనుక్కోలేదు. దానికోసం మీ మీద కూడా కేసు వెయ్యనా? పిలిచిన వెంటనే మిమ్మల్ని మన్నించి మీతో రాలేదా?"

"నువ్వు నన్ను మన్నించావా? బాగుంది నీ న్యాయం! నువ్వే నన్ను మోసం చేసింది. నమ్మించి మోసం చేసి పైగా మాటలు కూడానా?"

ఆ పరిస్థితిలోనూ నవ్వు వచ్చింది రోహినికి.

"ఏమిటీ...నేను మిమ్మల్ని మోసం చేశానా? నమ్మించి గొంతు కోశానా? బయటకు చెప్పకండి. నవ్వి పోతారు"

"బయట చెబితే ఏం? ప్రేమించేటప్పుడు 'మా ఇంట్లో నా మీద ప్రాణం పెట్టుకున్నారు అని నువ్వు చెప్పలేదూ? నాకోసం ఏదైనా చేస్తారు అన్నావే? అది నమ్మే కదా నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. పెళ్ళి తరువాత ఏమీ ఇవ్వలేదే? అది గొంతుకోయటం కాదా?"

"నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు ఒక మాట చెప్పుంటే...అప్పుడే మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయే దాన్నే? మీరూ మోసపోయి ఉండక్కర్లేదు, నేనూ దర్జాగా జీవించే దాన్ని. ఎందుకు అది చేయలేదు?"

కోపంతో ఎరుపెక్కినై హరికృష్ణ కళ్ళు.

"ఊరకుక్కా! ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నీ పొగరు తగ్గలేదే? మీకు డబ్బు ఆశలేదు...మరి నేను పిలిచిన వెంటనే దేనికి అమ్మా కూతుర్లు నాతో వచ్చారు? బాగా తిందాం! మంచి వసతులతో జీవిద్దాం అనేగా"

ఆ మాట తల్లి కూతుర్లు ఇద్దరికీ విపరీతమైన కోపం తెప్పించింది.

"మమ్మల్ని బ్రతిమిలాడి, బుజ్జగించి రమ్మని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? మా మీద ప్రేమ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేము మిమ్మల్ని వెతకనే లేదే? ఇలాంటి మాటలన్నీ ఇక్కడ వద్దు"

"ఎందుకు పిలిచానా? మీ తాతయ్య...అదే బాపిరాజు చాలా సీరియస్ గా ఉన్నారని నాకు తెలిసింది. అప్పుడు మీరు గుర్తుకు వచ్చారు. చావాబోతున్న ముసలాడి ముందు మిమ్మల్ని తీసుకువెళ్ళి నిలబెడితే...ఆయన మీ పేరుకు ఏదైనా ఆస్తి రాసిస్తాడని లెక్క వేసేను. అందుకోసమే వచ్చి మిమ్మల్ని పిలిచాను"

ఆశ్చర్యంతో తల్లి కూతుర్లు ఇద్దరూ నోరు వెళ్లబెట్టారు.

"వెంటనే మిమ్మల్ని తీసుకు వెడితే...మీరు అనుమాన పడతారని కొన్ని రోజులు ఊటీకీ తీసుకు వెళ్ళి వచ్చేలోపే ఆ ముసలాడు ప్రాణం వదిలేడు. ఛీ...నా ప్లానంతా పాడైపోయింది. డబ్బులు ఖర్చు అయినై అంతే"

రోహిని తమాయించుకుని మెల్లగా "అయితే మీరు మా కొసం -- మా మీద ప్రేమతో రాలేదు. అంతేనా?" అని అడిగింది.

"అవును... ప్రేమ వస్తుంది...ఇది ఎలిజిబత్ మహారాణి, డబ్బులు విసిరి పారేస్తుంది. నీ మొహం కోసం ఎవరు వచ్చారు? డబ్బూ, కుటుంబం దొరుకుతాయని లెక్కవేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలలో నీలో మార్పు వచ్చి ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వు మారనే  లేదు"

"అమ్మ మాత్రమా మారలేదు. మీరు కూడా కొంచం కూడా మారనే లేదు. మా అమ్మను ఆ రోజు ఎలా మోసం చేశారో...ఈ రోజు కూడా ఆమెను అలాగే మొసం చేశారు? మీకు మనశ్శాక్షి అనేదే లేదా?"

హరికృష్ణ ఏదో మాట్లాడదామని నోరు తెరుస్తున్నప్పుడు....

"చూడండి. ఒక్క రోజు కూడా మీ మీద 'నాన్న అనే ప్రేమే వచ్చిందే లేదు. అమ్మ సంతోషంగా ఉంటుంది కదా అనుకుని మీతో రావటానికి అంగీకరించాను. ఇప్పుడు మీరు మా అమ్మను గౌరవించటం లేదే...అప్పుడు మాకూ ఈ ఇంట్లో పనిలేకుండా పోయింది. మేము ఇప్పుడే వెడతం" అన్నది కోపంగా.

ఓ...దారాళంగా వెళ్ళిపొండి. ఎప్పుడైతే ఆ నల్ల మొహం ఆస్తి తీసుకోను అని చెప్పిందో...అప్పుడే మీ ఇద్దర్నీ తరిమేసుండాలి. కానీ, నాకు కొంచం జాలి గుణం ఉంది. అందువలనే మిమ్మల్ని కూర్చోబెట్టి ఫ్రీ భోజనం పెట్టాను. ఇప్పటికీ ఏమీ పాడైపోలేదు. కేసు వేయటానికి మీ అమ్మను ఒప్పించు. మీరు ఇక్కడే ఉండొచ్చు. బాగా తినొచ్చు, రాజ భోగం అనుభవించ వచ్చు. ఏమిటి ఏమంటావ్...?".

సమాధానం ఏమీ చెప్పకుండా తల్లివైపు తిరిగింది.

"ఏమ్మా... ఇంకా ఇక్కడెందుకు నిలబడ్డవు? మనం తిండికి అలమటించా పోతున్నాము? మన దగ్గర ఏమన్నా చదువులేదా? లేక పొవటానికి వేరే చోటే లేదా? రామ్మా... వెళదాం. ఇక ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళకు. ఇతనొక మనిషి అని నమ్మి వచ్చావు చూడు...నిన్ను అనాలి" అన్నది..

రోహిని విరక్తితో చూసింది. కన్నీరు లేదు...గొణుగుడూ లేదు. ఒక బొమ్మలాగా ఎక్కడో చూస్తున్నట్టు కూర్చుంది.

'అమ్మ దుఃఖం రోజులు పోతేనే గాని తగ్గదూ అని అనుకున్న అంజలి, తమ దుస్తులను, వస్తువులను తీసుకుంది.

మొదట ఫోన్ చేసింది.

"సుధీర్...ఇంకా మీ అవుట్ హౌస్ ఇల్లు అద్దెకు ఇవ్వకుండా ఉంటే, అది ఎవరికీ ఇవ్వద్దు. నేనూ, మా అమ్మా ఇంకా కొద్దిసేపట్లో అక్కడ ఉంటాము. వివరాలేమీ అడగకండి. అక్కడికి వచ్చిన తరువాత డైరెక్టుగా చెబుతాను" అన్న ఆమె ఒక చేతిలో సూట్ కేసు,  మరో చేత్తో అమ్మను పుచ్చుకుని బయటకు వచ్చింది.

"అంజలీ...బాగా ఆలొచించుకో. ఇప్పుడు వెళితే మొత్తంగా వెళ్ళినట్లే. నేను తిరిగి కూడా చూడను. నువ్వు ఎవరైనా మామూలు జీతగాడ్ని పెళ్ళి చేసుకుని డబ్బుకు వెతుక్కోవలసిందే! కానీ, మీ అమ్మ కేసు వేస్తే...మనకు చాలా ఎక్కువ డబ్బు దొరుకుతుంది. నిన్ను విదేశీ వరుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను. బోలేడు నగలు వేస్తాను. ఏమంటావ్?"

సమాధానం ఏమీ చెప్పకుండా 'తూత్ అని అతని మొహం మీద ఉమ్మేసి, అమ్మను పిలుచుకుని బయటకు నడిచింది. రోహిని పరిస్థితి చాలా పాపంగా ఉంది. జరిగిందేదీ ఆమె జీర్ణించుకోలేకపోయింది. హరికృష్ణ పిలిచింది, తండ్రి మరణం, తిరిగి భర్త యొక్క కుట్ర అంటూ అన్నీ కలిసి ఆమె హృదయాన్ని కెలికినై. మెదడు నరాలు వణికినై. నడవలేక కళ్ళు తూలుతున్నాయి.

"అమ్మా...ఏమ్మా చేస్తోంది? ఎందుకని అదోలాగా ఉన్నావు?" అన్న కూతురు ప్రశ్న పాతాళం నుండి వినిపిస్తున్నట్టు అనిపించింది. తల పగిలిపోతుందేమోనన్నంత నొప్పి పుడుతోంది...కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటంతో అంజలి భుజాల మీద వాలింది...ఆమెను పట్టుకుంది అంజలి.

అమ్మా...నన్ను చూడమ్మా. ఇంకా కొంచం సేపు వోర్చుకో. నిన్ను హాస్పిటల్ కు తీసుకు వెడతాను" అన్న అంజలి ఆంబ్యులాన్స్ కు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చేలోపు ఏమవుతుందో నన్న భయంతో సుధీర్ కు కూడా ఫోను చేసి విషయం చెప్పింది.

రోహిని మాట్లాడలేకపోయింది. తలనొప్పి క్షణ క్షణానికీ పెరుగుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముక్కు నుండీ, నోటి నుండీ రక్తం వచ్చింది.

                                                                                             Continued...PART-12(Last Part)

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి