4, ఆగస్టు 2021, బుధవారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-10)

 

                                                                                ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-10)

ఊటీకి వచ్చి ఐదు రోజులు గడిచినై. వాళ్ళు బస చేసింది అందమైన హోటల్. అందులో గడ్డి నేల మీద వేసున్న బెంచి మీద కూర్చుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసింది అంజలి. సూది ఆకుల చెట్లు, తడుముకు వెడుతున్న మేఘాలు అంటూ ప్రతీదీ కవిత్వంలా ఉన్నది. కానీ, మనసులోనే ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు. దేనినో పోగొట్టుకున్నట్టు అనిపించింది.

అంజలి అలా సుధీర్ జ్ఞాపకాలతో ఉన్నదనుకుంటే, తల్లి రోహిని కూడా అలాగే ఉన్నట్టు అనిపించింది. ఏ కారణం చేతనో 'నాన్నా' అని పిలిచి ఆయనతో ప్రేమగా ఉండలేకపోయింది. ఊటీలో చాలా చోట్లకు తీసుకు వెళ్ళారు. సరస్సులో పడవ ప్రయాణం చేసేటప్పుడు కానీ, సూది ఆకుల చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు గానీ...ఎందుకనో ఒక కుటుంబంగా వచ్చినట్టు ఆమెకు అనిపించలేదు.

అమ్మ వచ్చి పక్కన కూర్చుంది.

" అంజలీ ఇక్కడ ఎక్కువ చలి వేస్తోంది కదా?"

"అవును"

"ఎందుకలా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా అలా మొహం పెట్టుకుని కూర్చున్నావు?"

"నా మొహమే అంతేనమ్మా"

"అంజలీ...ఏమిటి అదొలా మాట్లాడుతున్నావు? నీకు ఏమైంది?"

"ఏమీలేదమ్మా...మీరు ఉత్సాహంగా ఉన్నారు కదా? నాకు అది చాలు"

మౌనం వహించింది రోహిని. ముందులాగా ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేక పోతున్నారు. కళ్ళకు కనబడని తెర, మధ్యలో అడ్డుపడ్డట్టు అనిపించింది. రోజులు గడచిన కొద్దీ సరిపోతుందిలే అనుకుంది.

మరుసటి రోజు ప్రొద్దున్న హడావడి పడుతూ వచ్చిన నాన్న "మనం ఇప్పుడే ఊరికి తిరిగి వెడుతున్నాం" అని చెప్పి తొందర తొందరగా హోటల్ ఖాలీ చేసి బయలుదేరాము. ఆయన మొహం కొంచం 'సీరియస్ గా ఉన్నది. ఏమిటి విషయం అని వీళ్ళూ అడగలేదు...ఆయనా చెప్పలేదు.

ఇంటికి వచ్చేశారు.

" రోహినీ...నువ్వు షాకయ్యే విషయం ఒకటి చెప్పబోతాను. మనసును దృఢపరుచుకో" అన్నారు.

అంజలి అదిరి పడ్డది."ఏం బాంబు వేయబోతారో తెలియటం లేదే?" తనలోనే అనుకున్న అంజలి, తండ్రి దగ్గరగా వెళ్ళి నిలబడి--

"అమ్మ ఏ విధమైన షాకునూ భరించలేదు. ఇది మీకు ఇదివరకే చెప్పేశాను. అలాంటప్పుడు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు?" అన్నది కోపంగా.

నువ్వు చెప్పింది న్యాయమేనమ్మా. కానీ, నేను ఈ విషయాన్ని ఆమెతో చెప్పలేదనుకో...అది చాలా పెద్ద తప్పు అవుతుందే? అప్పుడు నా మీదే కదా ఆ తప్పు కూడా పడుతుంది. అందువలన చెప్పేస్తాను. నువ్వు మీ అమ్మ పక్కనే ఉండు"

వినటానికి రెడీ అయ్యింది.

" రోహినీ...మీ నాన్న బాపిరాజు చనిపోయారట. ఆయన సీరియస్ గా ఉన్నారని నాకు సమాచారం వచ్చింది. అందుకనే వెంటనే మిమ్మల్ని తీసుకుని వచ్చాశాను. ఈ రోజు ప్రొద్దున్నే ఆయన చనిపోయారట" అన్నారు.

"మా నాన్న...మా నాన్న చనిపోయారా? ఎలా? ఏం జరిగింది? మీకు ఎవరు చెప్పారు"

"మీ నాన్నగారి ఆఫీసులో పనిచేస్తున్న ఒకడు నాకు తెలుసు. అతనే ఫోన్ చేసి చెప్పాడు. ఆయనకూ వయసైంది కదా?"

"నేను ఆయన్ని చూడాలి. ఇన్ని సంవత్సరాలు చూడకుండానే ఉండిపోయాను. ఆయన నన్ను క్షమించలేదు. చచ్చిపోయిన తరువాతైనా ఆయన శరీరాన్ని చివరిగా ఒక సారి చూసేస్తానే? నన్ను పిలుచుకు వెళ్ళండి"

అమ్మా అక్కడికంతా నువ్వు వెళ్ళొద్దు. అక్కడ మిమ్మల్ని అవమాన పరుస్తారు. అది చూస్తూ నేను మౌనంగా ఉండలేను" అన్నది అంజలి.

మీ ఇంట్లోనే ఉంచారట. పెద్ద వ్యాపారవేత్త కదా? అందువల్ల 'టీవీ ఛానల్స్ నుండి మనుషులు వచ్చుంటారు"

"అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు!" అన్నది అంజలి గట్టిగా.

"నువ్వు కాముగా ఉండమ్మాయ్. లోకం తెలియని పిల్లవి. పాపం మీ అమ్మ...చూడాలని ఆశపడుతోంది. నేనే ఆవిడ్ని తీసుకు వెడదాం అనుకుంటున్నా. బయలుదేరండి వెళ్ళి వచ్చేద్దాం"

"అంజలి ఎందుకండి? మనల్నే లోపలకు పంపుతారో...పంపరో?"

"వాళ్ళ తాతయ్యను అంజలి కూడా చూడనీ...మనల్ని ఎలా లోపలకు పంపరో చూస్తాను. నీకూ హక్కు ఉంది. అది వాళ్ళు కాదనలేరు" అన్నతను, వాళ్ళను బయలుదేరమని బలవంతం చేశాడు.

అమ్మ చూడాలని ఇష్ట పడటానికి ఆశపడుతున్నా, ఆమె ఆత్మ గౌరవం ఆమెను వద్దు అని చెప్పటాన్ని అర్ధం చేసుకుంది. కానీ నాన్న వదల లేదు. ముగ్గురూ చిన్న కారులో వెళ్ళి  దిగారు.

దగ్గర దగ్గర 25 సంవత్సరాల తరువాత తన పుట్టింటిలోకి అడుగు పెట్టింది రోహిని. వార్త ఇంకా బయటకు పూర్తిగా వెళ్ళకపోవటం వలనో ఏమో పెద్దగా జనం లేరు. ఒకాయన మాత్రమే వచ్చారు.

దఢ దఢ మని కొట్టుకుంటున్న గుండెను నొక్కి పట్టుకుని ఇంటిలోపలకు వెళ్ళింది. ఎందులోనూ మార్పు లేదు. హాలులో నాన్న గారి దేహం ను ఒక గాజు పెట్టెలో ఉంచారు. కాళ్ళ దగ్గర కొన్ని పూలమాలలూ, పూల వలయాలు ఉన్నాయి.

మొహం చూసిన వెంటనే ఏడుపు పొంగుకు వచ్చింది.

"నాన్నా...నేను రోహినిని వచ్చాను నాన్నా. చివరి వరకు నన్ను చూడకుండానే ఉండిపోయారే? నా జ్ఞాపకం మీకు రానే లేదా? మీరు నన్ను క్షమించనే లేదా?" అంటూ భోరున ఏడ్చింది.

అంజలి సైలెంటుగా పక్కన నిలబడింది. 'అమ్మ ఏడుస్తూ తన దుఃఖాన్ని చల్లార్చుకోనీ' అని మాట్లాడుకుండా చూస్తూ ఉండిపోయింది. హరికృష్ణ...రాని కన్నీటిని తుడుచుకుంటూ నటించాడు.

గొంతు విని ఇద్దరు సహోదరలూ లోపల నుండి వచ్చారు. వాళ్ళను చూసింది రోహిని.

"జగనన్నయ్యా... నరసు అన్నయ్యా...నన్ను గుర్తు పట్టారా? నేను మీ చెల్లెలు రోహినిని" అన్నది వణుకుతున్న కఠంతో.

"రోహినీ...నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇదెవరు?" అన్నాడు జగన్నాధం, అంజలిని చూపిస్తూ.

"ఏంటన్నయ్యా అలా అడిగావు? ఇది నా కూతురు అంజలి. అంజలిదేవి అని మన అమ్మ పేరు పెట్టాను"

పెద్దన్నయ్య దగ్గరకు వచ్చి అంజలి తలమీద చేతులు వేసి తన ప్రేమను చూపించాడు.  ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు.

"అన్నయ్యా...నాన్నకు ఏమైంది?"

"ఏమీ లేదమ్మా...వయసు 82 దాటింది కదా? నిద్రలోనే పోయారు"

"అదొచ్చి అన్నయ్యా...నాన్న ఎప్పుడైనా నా గురించి అడిగారా?"

ఇద్దరన్నయ్యలూ లేదని తల ఊపారు.

"లేదు రోహినీ...చివరి వరకు ఆయన వైరాగ్యంగానే బ్రతికారు. కానీ, ఆయన మనసులో నీ జ్ఞాపకాలు ఎప్పుడూ ఉండేవి. మాకు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడూ సరి, పిల్లలు పుట్టినప్పుడూ సరి...అందరితో సంతోషంగా మాట్లాడతారు. కాసేపైన తరువాత ఒంటరిగా వెళ్ళి నిలబడే వారు. ఆయన కళ్ళు తడిసుంటాయి. పాపం...ఆయన వేదన పడని రోజు లేదు

నేరం చేసిన కారణంగా సిగ్గుతో తల వంచుకుంది రోహిని.

"అన్నయ్యా...మీ పిల్లలను ఒకసారి పిలవండి...ఒకసారి చూసి వెళ్ళిపోతాను" అన్నది.

"మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో నీకూ హక్కు ఉంది. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండ వచ్చు" అంటూ దగ్గరకు వచ్చాడు హరికృష్ణ.

అన్నదమ్ములిద్దరి మొహాలూ మారినై.

"ఓహో...గొడవ పెట్టుకోవటానికే వచ్చారా? నువ్వు మారనే లేదా హరికృష్ణా? ఇప్పుడు నీకేం కావాలి?"

ఇదిగో ఇక్కడున్నదే ఇది మీ చెల్లెలు. మీ నాన్నకు న్యాయంగా పుట్టిన బిడ్డ. ఇప్పుడు చట్టంలో...'కూతుర్లకూ ఆస్తిలో సరిసమం వాటా ఉంది అనే చట్టం ఉంది. అందువలన ఆమె భాగం ఇవ్వండి. అది అడగటానికే వచ్చాము"

అంజలికి 'ఛీ' అనిపించింది 'దీనికోసమే పిలుచుకు వచ్చారా? డబ్బు పిచ్చి పట్టిన మనిషి అని అనుకుంది.

"రోహినీ...నువ్వు చెప్పి నీ భర్త ఇలా మాట్లాడుతున్నారా?లేక తానుగా మాట్లాడుతున్నాడా  అనేది తెలియటం లేదు. ఏది ఏమైనా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది" అన్న జగన్నాధం, తమ్ముడు వైపు తిరిగి----

"నరసూ...ఆ కాగితం తీసుకురా" అన్నాడు. నరసింహం లోపలకు వెళ్ళాడు. 

"రోహినీ...నువ్వు తొందరపడి పెళ్ళి చేసుకున్నావు. కానీ నాన్న దాన్ని మరిచిపోలేదు. నీ భర్త వలన మాకు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వస్తుందని నాన్నకు అప్పుడే అనిపించింది. అందువలన ఇరవై సంవత్సరాలకు ముందే నిన్ను తన కూతురు కాదని రాసేసి, దాన్ని రిజిస్టర్ కూడా చేయించి ఉంచారు. ఆ రిలీజ్ పత్రాన్నే తెమ్మని చెప్పాను" అని చెప్పగానే పత్రంతో వచ్చాడు నరసింహం.

"ఇదిగో...ఇది చదివి చూడు" అని ఇచ్చారు.

దాన్ని రోహిని తీసుకునే లోపు తానే తీసుకుని అందరికీ వినబడేటట్టు గట్టిగా చదివాడు హరికృష్ణ. దాని సారాంశం ఇదే! 

నా కూతురు రోహినిని నా అన్ని ఆస్తులూ, నగలూ, డబ్బూ వీటన్నిటి నుండి తొలగించి ఉంచుతున్నాను. నేను చనిపోయిన తరువాత కూడా ఆమెకు దేని మీదా హక్కులేదు. ఆస్తులలో నా ఇద్దరి కొడుకులకే హక్కు ఉంది. వాళ్ళుగా  ఇష్టపడి రోహినికి ఏదైనా ఇస్తే దాన్ని నేను అడ్డుకోవటం లేదు. ఇది నా పూర్తి మనసుతోనూ, పూర్తి తెలివితోనూ, పూర్తి జ్ఞానముతోనూ రాస్తున్నాను"

కొంతసేపు మౌనం చోటు చేసుకుంది.

"ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను మన్నించలేదు. ఇప్పుడైనా నన్ను మన్నించు నాన్నా" అని వెక్కి వెక్కి ఏడ్చింది రోహిని.

"అమ్మా...వెళదాం రా. చాలా మంది రావటం మొదలుపెట్టారు. అందరూ మనల్నే వేడుక చూస్తున్నారు. కష్టంగా ఉంది. రామ్మా...వెళదాం" అంటూ తల్లి చెయ్యి పుచ్చుకుంది అంజలి. రోహిని కూడా బయలుదేరింది.

"ఉండు రోహినీ...నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు"

"ఏమిటది?"

"మీ నాన్న రాసిన రిలీజ్ పత్రంలో మీ అన్నయ్యలు ఇష్టపడి నీకు ఏదైనా ఇస్తే అది నేను అడ్డుకోనూ అని ఉన్నదే? మీ నాన్నకు ఊరి బయట ఈశాన్య వైపు దగ్గర దగ్గర నాలుగు ఎకరాల స్థలం ఉండేది. దాన్ని అడుగు. వాళ్ళు ఇవ్వనంటారా ఏమిటి?" అన్నాడు హరికృష్ణ.

అంతసేపు కట్టుబాటులో ఉంచుకున్న కోపం బయటకు వచ్చింది రోహినికి.

మీకు గౌరవ మర్యాదలే లేవా? నాన్న నా దగ్గరున్న కూతురనే హక్కునే తీశేశారు. ఆ తరువాత వాళ్ళకు ఏదుంటే నాకేం. నేనేమన్నా బిచ్చగత్తెని అని అనుకున్నారా? నేను మా అన్నయ్యల దగ్గర చేయి జాపను. నాకూ ఏ ఆస్తీ వద్దూ, ఏమీ వద్దు"

"సార్ ఆమె ఏదో దుఃఖంలో మాట్లాడుతోంది. అది పెద్దగా తీసుకోకండి. మీరు, దీనికి ఏమివ్వాలని ఆశపడుతున్నారో అది ఇవ్వండి" అన్నాడు,  ఇకిలించుకుంటూ.

"ఓహో...దీనికొసమే వచ్చారా? ఇప్పుడు అర్ధమవుతోంది మీ ఉద్దేశ్యం! చావు ఇంట్లో కూడా డబ్బూ, ఆస్తి అని అడుగుతున్నారు...మీరు మనుష్యులేనా? మిమ్మల్నందరినీ మార్చలేము? వెళ్ళండి బయటకు" అని అరిచాడు నరసింహం.

అంతకంటే ఓర్చుకోలేక రోహిని, అంజలి ఇద్దరూ గబగబా బయటకు వచ్చారు -- 'ఇంకాసేపు ఇక్కడుంటే మెడ పట్టుకుని బయటకు గెంటినా గెంటుతారు అని అనిపించి హరికృష్ణ కూడా వేరే దారిలేక వచ్చి ఎక్కిన తరువాత...కారు బయలుదేరింది.

                                                                                                                   Continued...PART-11

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి