18, నవంబర్ 2019, సోమవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-4



                                   ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                        (PART-4)


సరిగ్గా నాలుగు గంటలకు అందరూ పెళ్ళి చూపుల ఇంటికి చేరుకున్నారు. అత్తయ్య అంతస్తుకు తగిన ఆస్తి పరుల ఇళ్ళే! అమ్మాయి చాలా అందంగా ఉన్నది. మంచి చదువు. నాగరీకంగా అందరితో గలగల మని మాట్లాడుతూ కలిసిమెలిసి పోయింది. అనవసరమైన సిగ్గును వదిలిపెట్టింది.

వరుణ్ అదృష్టవంతుడే!

"ఏరా...అమ్మాయి ఎలాగుంది?" అత్తయ్య అడిగింది.

"సూపర్!"

"అయితే ఓకే చెప్పేద్దామా?"

"అన్నయ్య దగ్గర అడిగావా?"

"వాడికేం తెలుసు?"

మంచి కుటుంబమే...ఓకే చెప్పేయి" కిరణ్ చెప్పాడు...అత్తయ్య సంప్రదాయంగా తొమలపాకులు-వక్క మార్చుకుని బయలుదేరటానికి సిద్దమయ్యింది.

సంతోషంగా ఇంటికి బయలుదేరారు.

"ఇళ్ళు చాలా బాగుంది కదూ?"

"టిఫెను కూడా చాలా బాగుంది"-వరుణ్ అమాయకంగా చెప్పటంతో...కిరణ్, ప్రతిమ 'గొల్లు మని నవ్వారు.

"పెళ్ళివారింటి టిఫెను వరకు వెళ్ళిపోయావే! అవునమ్మా...వదిన పేరేమిటో చెప్పనేలేదే?"

"వదినా....?"

తల్లి మొహం చిట్లించి కిరణ్ ను చూసింది.

"మరి...అన్నయ్య పెళ్ళాం వదినే కదా?"

"ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న ఇది? ఆ అమ్మాయిని చూసింది నీకు...వాడికి కాదు...! వదినను చూడాలని నీకు ఆశగా ఉంటే...వెనక్కి తిరిగి చూడు. ఇదిగో ఉన్నది...మీ వదిన"
అత్తయ్య ప్రతిమను చూపించగా...కిరణ్ అదిరిపడ్డాడు. ప్రతిమకు తల తిరిగింది. ఏదో పెద్ద శిఖరంపై నుండి తలకిందలుగా పడుతునట్టు అనిపించింది ప్రతిమకు.

"నా పెళ్ళి కోసం అమ్మాయిని చూడటానికి వెడుతున్నట్టు నాతో ఒక్క మాటకూడా చెప్పలేదేమ్మా? అన్నయ్య కోసం చూడటానికి వెడుతున్నామని అనుకున్నాను…..ఏం అన్నయ్యా నీకు తెలుసా ఈ అమ్మాయిని ఎవరికోసం చూడటానికి వెడుతున్నామో?"

"తెలియదురా! అమ్మ బయలుదేరు అన్నది. బయలుదేరాను"

"ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఇరకాటంలో పెడుతున్నావు?"

"ఇలా చూడరా కిరణ్. వాడికి ప్రతిమనే పెళ్ళాం అని మేము ఎప్పుడో నిర్ణయం చేశాశాం. సమయం వచ్చినప్పుడు చెపితే చాలు అనుకున్నాము. అయినా కూడా మీ నాన్న దాన్ని 'కోడలు పిల్లా...' అనే కదా పిలుస్తారు. అప్పుడే మీఇద్దరికీ ఇది అర్ధం అయ్యుంటుందని  అనుకున్నాను"

"నాకు ఇప్పుడు పెళ్ళి వద్దమ్మా"......విసుగ్గా చెప్పాడు కిరణ్.

"ఏమిట్రా చెబుతున్నావు? ఆ అమ్మాయికి ఏం తక్కువ? నీకు తగిన పిల్లనే కదా చూశాము. జల్లెడ వేసి వెతికేము తెలుసా...ఈ అమ్మయిని కనుక్కోవటానికి? ఈ అమ్మాయి కంటే నీకు సరిపోయే ఇంకో అమ్మాయి ఈ బూమ్మీదే ఉండదు...చెప్పేశాను" 

"నువ్వు ఏం చెప్పినా నాకు వద్దమ్మా?"

"ఎందుకని...అమెరికాలో ఏ అమ్మాయినైనా చూసి పెట్టుకున్నావా? 'ప్రేమా గీమా' అనే అసహ్యం ఏదైనా ఉన్నదా?"

"అలాంటిదేమీ లేదు!"

"మరైతే ఏమిటి నీ ప్రాబ్లం?"

"నా వల్ల కారణాలు చెప్పటం కుదరదు. పెళ్ళి వద్దంటే వద్దు...వదిలేయ్..."

"ఒప్పు తాంబూళాలు మార్చుకున్నాము కదరా కిరణ్. ఇప్పుడు కాదంటే...నా పరువు, మర్యాద అంతా పోతుంది"

"నా సంతోషం కంటే నీకు నీ పరువు, మర్యాదే ముఖ్యమా?"

"ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నీ సంతోషానికి భంగం వస్తుందని అనుకుంటున్నావంటే....నువ్వు ఈ పెళ్ళి వద్దూ అని చెప్పటానికి వేరే ఏదో అర్ధం ఉన్నది. ఎమిటది? నిజం చెప్పు!"

"ఒక్క పుచ్చు కారణం కూడా లేదు. మళ్ళీ అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నా. అక్కడ నాకు ఉద్యోగం రెడీగా ఉన్నది. ఆ ఉద్యోగంలో చేరుదామా...వద్దా అనే కన్ ఫ్యూషన్ లో ఉన్నాను. రెండు రోజుల క్రితమే చేరుదాం అని నిర్ణయం తీసుకున్నాను. అప్లికేషన్ ఫారం కూడా పూర్తి చేసి ఇచ్చాశాను. ఈ టైములో పెళ్ళి ఎందుకని వద్దంటున్నాను"

“సరే...వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం తరువాత పెళ్ళి పెట్టుకుందామని చెబితే సరిపోతుంది. ఆ అమ్మాయి కూడా న్యూ యార్కులో ఏదో పనికోసం ట్రై చేస్తోంది. చాలావరకు ఆ ఉద్యోగం దొరుకుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు కదా"

"ఇలా చూడమ్మా...ఆ అమ్మాయిని నా వదినగా అనుకునే చూశాను. ఇక ఆ అమ్మాయిని నా భార్యగా అనుకొలేను. అలా కాదు, నా పరువు, మర్యాదా కాపాడుకోవలసిందే అని నువ్వనుకుంటే అన్నయ్యకి ఆ అమ్మాయిని కట్టిపెట్టు. నువ్వు చెప్పే వాటన్నిటికీ తల ఊపే వ్యక్తి వాడే"

కారు ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగింది.

కిరన్ గబగబా మేడ మీదకు వెళ్ళిపోగా...అక్కడ మౌనం చోటు చేసుకుంది.

అమ్మా, నాన్నలు ఒకర్ని ఒకరు చూసుకున్నారు!   

                                                                                   (ఇంకా ఉంది)...PART-5

*********************************************************************************                           

16, నవంబర్ 2019, శనివారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-3



                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                            (PART-3)


విమానం గంట ఆలశ్యంగా రావటం వలన అందరూ ఇంటికి వచ్చి చేరేటప్పటికి మధ్యాహ్నము మూడు గంటలు అయ్యింది.

ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియలేదు కానీ, ఈ కొన్ని గంటలు ఒక్కొక్క యుగంలా గడిచినై. ప్రతిమకి 'చ...'అనిపించింది. వాకిటి వైపు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. హారతి కలిపి ఉంచుకుని విసుగ్గా కూర్చుంది. కొంత సమయం తరువాత కారు శబ్ధం వినబడగా...లోపల నుండి పరిగెతుకుని వచ్చింది.

కారులో నుండి దిగేటప్పుడే ఎవరికీ తెలియకుండా ఆమెను చూసి గబుక్కున కన్నుకొట్టాడు కిరణ్. 'అరె బాబోయ్...మనిషి ఎంతగా మారిపోయాడు!ఇంతకు ముందే మంచి రంగు. ఒక సంవత్సరం అమెరికాలో ఉండటంతో ఇంకొచం ఎరుపెక్కి, వొళ్ళు చేసి, బుగ్గలు పెరిగి, పెదవుల మీద చిలిపితనం మాత్రం తగ్గనే లేదు.

ప్రతిమ ఒక్క నిమిషం కళ్ళార్పకుండా అతన్నే చూసింది. అత్తయ్య హారతి తీసి, ఇంటి ముందు వేసిన ముగ్గులో పోయడానికి వెళ్ళింది. వరుణ్ 'లగేజీ’లను లోపలకు తీసుకు వచ్చి ఉంచాడు.

"ఏయ్ జిడ్డు మొహమా...నన్ను మింగేయకు? కొంచం వదిలి పెట్టుంచు..."

కిరణ్ చిన్నగా చెప్పి చటుక్కున ప్రతిమ భుజాల దగ్గర గిల్లి లోపలకు వెళ్ళాడు. ప్రతిమ మొహం సిగ్గుతో ఎర్రబడగా నవ్వుకుంటూ భుజాన్ని రాసుకుంటూ అతని వెనుకే వెళ్ళింది.

ప్రయాణ బడలిక తీరటంకోసం అతను స్నానం చేసి వచ్చే లోపు అత్తయ్యా, ప్రతిమ...చల్లారిపోయిన వంటకాలను వేడి చేసి భోజనం కంచాలు పెట్టారు.

అమెరికా నివాసం గురించి అతను కథలు కథలుగా చెబుతుంటే...అది వింటూ భొజనం చేశారు.

"అది సరేనమ్మా...ఇక్కడెంటమ్మా విశేషం? అన్నయ్యకి పెళ్ళి సంబంధం చూశారా...లేదా?"

"వాడికీ చూశేశాను; నీకూ చూశేశాను. రేపు మనిషిని రమ్మన్నాను...ముహూర్తం రోజులు చూడాలని"

కిరణ్ ఓరకంటితో ప్రతిమను చూసి ఎవరికీ తెలియ కుండా నవ్వాడు.

"నేను వదినని చూడొద్దా?"

"నువ్వు చూస్తావురా! నిశ్చయ తాంబూళాలకు ముహూర్తం రోజు ఖాయం చేసుకుని చెబుతాను. తరువాత చూద్దువుగాని...ఇద్దరు కోడళ్ల గురించి అంతవరకు సస్పెన్స్ గా ఉండనీ"

అత్తయ్య నవ్వుతూ లేచి చేతులు కడుక్కోవటానికి వెళ్ళింది!

నిద్ర రాకపోవడంతో ఏదో ఒక పుస్తకం చదువుకుంటోంది ప్రతిమ. వచ్చిన దగ్గర నుండి కిరణ్ తో ఒంటరిగా మాట్లాడలేకపోయింది. మారి మారి అతని గదిలో ఎవరో ఒకరు అతనితో ఉంటూనే ఉన్నారు. అతనైనా ఏదైన సాకుబోకు పెట్టుకుని ఆమెతో మాట్లాడతాడని చూస్తే అతనూ రాలేదు. ప్రతిమకు విసుగు పుట్టింది.

పుస్తకాన్ని మూసేసి విసిరి క్రింద పడేసింది. లైటు ఆపేసి పడుకుంది. పొట్టమీద ఏదో పడటంతో...భయపడి చీర దులుపుకుంటూ హడావిడిగా లేచి లైటు వేసింది. చిన్న రాయి! కిటికీ బయట నవ్వుతో కిరణ్ నిలబడున్నాడు. వెంటనే ఆమె మొహం వికసించింది. గది తలుపు తెరిచింది. చెతిలో ఒక పార్సల్ తో లోపలకు వచ్చాడు అతను.

"ఏయ్ జిడ్డు మొహమా...ఇంకా నిద్రపోలేదా?"

"లేదు కొతి మొహమా"

"దెబ్బలు తింటావు!"

"దెబ్బ కొట్టు..." అంటూ చెంప చూపించింది ప్రతిమ. ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వచ్చాడు కిరణ్.

"అదే కదా చూశాను!"-గబుక్కున వెనక్కి జరిగింది.

"ఇదేమిటి పార్సల్?"

"నీకొసమే! అమ్మకి తెలిసి కొన్నది రెండు చీరలు. తెలియకుండా కొన్నది ఇవన్నీ..."

"ఏవన్నీ...?"

"విప్పి చూడు"

ప్రతిమ పార్సల్ తీసుకుని విప్పింది...లోపల ముత్యం, పగడాలు అమర్చిన అందమైన హారం సెట్టు. సెంటు బాటిల్....ఫేస్ క్రీమ్, పౌడర్, సోపు!

"జిడ్డు మొహానికి ఇవన్నీ ఎందుకు?" అడిగింది ప్రతిమ.

"జిడ్డు వాసనను కప్పి పుచ్చటానికే. లేకపోతే దగ్గరకు రాగలమా?"

"చీచీ...పో! నిన్ను దగ్గరకు రమ్మని ఎవరు పిలిచారు?"

"ఇదిగో చూడూ! ఇకమీదట నన్ను 'నిన్ను…నువ్వూ...రా...పో...'అని అనకూడదు. నేను నీ భర్త కాబోతున్నాను. తాలి కట్టేవాడిని గౌరవించాలి.

'ఏమండి...రండి...వెళ్ళండి’ అనే పిలవాలి. లేకపోతే నోటిని లాగిపెట్టి కుట్టేస్తాను"

“అలాగాండీ? సరే...వెళ్ళండి. నేను నిద్ర పోవాలి"

ప్రతిమ అతన్ని పట్టుకుని తోసింది.

"నేను కూడా నిద్ర పోవాలి. నువ్వొస్తే ఇద్దరం కలిసే నిద్రపోవచ్చు" అన్నాడు.

"ఓ...కలిసే నిద్రపోవచ్చే! ఒక్క నిమిషం...ఎందుకైనా మంచిది అత్తయ్య దగ్గర ఒక మాట చెప్పి నిద్రపోదాం"

"భయపెడుతున్నావ్ నువ్వు! ఉండు ఉండు...పెళ్ళైన తరువాత నాతో కలిసి నిద్ర పోవటానికి అమ్మే నిన్ను పంపిస్తుంది చూడు, అప్పుడు చూసుకుంటా నీ సంగతి!’ చూపుడు వేలును ఆడిస్తూ చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. ప్రతిమ నవ్వుతూ గది తలుపు మూసి గొళ్ళేం పెట్టింది. అతను ఇచ్చిన వస్తువులను ఆశగా మరొసారి చూసి, బీరువాలో పెట్టి తాళం వేసింది.

మరుసటి రోజు ప్రొద్దున. ప్రతిమ కిందకు దిగి వస్తున్నప్పుడు, ప్రతిమ అత్తయ్య ఎవరితోనో 'టెలి ఫోను'లో మాట్లాడుతోంది.

"అవును...ఈ రోజు నాలుగు నుంచి ఐదు గంటల లోపు వచ్చేస్తాం. ఆ ఆ...అబ్బాయి వచ్చాశాడు. సరే...మిగిలినవన్నీ తరువాత మాట్లాడుకుందాం"

ప్రతిమ అత్తయ్య రిసివర్ పెట్టేసి, సోఫాలో కూర్చోనున్న భర్త దగ్గరకు వచ్చి కూర్చుంది.

"అమ్మాయిని చూసుకోవటానికి ఈ రోజే వస్తామని చెప్పేశాను"

“వాళ్ళ దగ్గర చెప్పింది అలా ఉంచు. అబ్బాయి దగ్గర చెప్పావా?"

"ఇప్పుడే చెబుతానండి… అయినా వాడేమన్నా వద్దని చెబుతాడా ఏమిటి? నా కొడుకు గురించి నాకు తెలియదా?"

"సరే...అయితే పువ్వులూ, పళ్ళూ, తొమలపాకులు-వక్క కొని రెడీగా ఉంచుకో. సరిగ్గా మూడింటికి ఇక్కడ్నుంచి బయలుదేరుదాం. నేను కొట్టుకు వెళ్ళి రెండింటికల్లా వచ్చేస్తాను"

ప్రతిమ మామయ్య కొట్టుకు బయలుదేరారు. ప్రతిమ మళ్ళీ మేడపైకి వెళ్ళింది. శబ్ధం చేయకుండా కిరణ్ రూములోకి దూరింది. 'షేవింగ్' చేసుకుని సువాసనతో స్నానం చేయడానికి వెడుతున్న అతను, ఆమెను చూసిన వెంటనే చిన్నగా ఈల వేసి నిలబడ్డాడు.

"రావే నా దొండపండూ! ఏమిటి విషయం?"

"నాకు జోస్యం చూడటం వచ్చని నీకు తెలుసా?"

"ఇది ఎండాకాలం కూడా కాదు. ఏమైంది నీకు...?"

"కావాలంటే ఒక విషయం చెబుతాను...నిజమో కాదో చూస్తావా?"

"ఏమిటది?"

"నువ్వు ఈ రోజు నాలుగు గంటలకు ఒక చోటుకు వెళ్ళబోతున్నావు! నీ జాతకం ప్రకారం నీకు చిన్న ప్రయాణం ఉన్నది చూస్తావా?"

"ఎక్కడికి వెళ్ళబోతానో చెప్పవా ప్లీజ్"

"నీకు వదిన రాబోతోంది. ఆమెను చూడటానికి వెళ్ళబోతున్నావు!"

కిరణ్ ప్రతిమను చిరునవ్వుతో చూసి "నాకూ జోస్యం చూడటం తెలుసు" అన్నాడు.

"అవునా?" కిరణ్ని ఆశ్చర్యంతో చూసింది ప్రతిమ.

"ఇప్పుడు టైమెంత?"

"ఎనిమిదిన్నర"

"సరే! నా జాతక చక్రం ప్రకారం...ఇదిగో సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకు ఒక కన్నె పిల్లను గట్టిగా పట్టుకుని నూట ఎనిమిది ముద్దులు ఇస్తానని ఉన్నది. ఎంత కరెక్టుగా ఉందో! సరిగ్గా ఎనిమిదిన్నరకు నువ్వొచ్చి నిలబడ్డావు! ఒకటి...రెండూ...మూడూ లెక్క పెట్టటం వచ్చా? నూట ఎనిమిదికి ఎక్కువ వెళ్ళకూడదు. దగ్గరకు రా..."

కిరణ్ ప్రతిమను దగ్గరకు లాకున్నాడు….ప్రతిమ అతన్ని తొసేసి ఎరుపెక్కిన మొహంతో పరుగు తీసింది.

***************************************************************************************************                               ఇంకా ఉంది.....Continued in: PART-4

14, నవంబర్ 2019, గురువారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-2



                                        ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                          (PART-2)


"ప్రతిమా..."

కింద నుండి అత్తయ్య పిలుస్తున్న కేక వినబడింది...తన జ్ఞాపకాలను చెరుపుకుని హడావిడిగా క్రిందకు వెళ్ళింది.

"మేడ మీద ఏంచేస్తున్నావు? వంటలొ నాకు కొంచం సహాయపడకూడదా? ఈ కొబ్బరిని మిక్సీలో వేసి పాలు తీసివ్వు. ఈ రోజు కిరణ్ వస్తాడని తెలియదా? మరెందుకు అంతసేపు నిద్ర?"

ప్రతిమ కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి, మిక్సీ ఆన్ చేసింది. కిరణ్ కి ఇష్టమైన వంటకాలు తయారవుతున్నాయి.

"అరెరే...ముఖ్యమైనది కొనడం మర్చిపోయాను... వరుణ్ని పిలవ్వా ఒక్క నిమిషం!"

ప్రతిమ వరుణ్ని తీసుకు వచ్చింది.

"అప్పడాలు, చిప్స్ మర్చిపోయాను వరుణ్. వెళ్ళి కొనుకొచ్చేస్తావా"

వరుణ్ కొట్టుకు బయలుదేరాడు. రెండు రోజులుగా అతన్ని మాటిమాటికీ మార్కెట్టుకు పంపించింది అత్తయ్య.

పాపం వరుణ్! మరిచిపోయి కూడా తన తల్లిని ఎదిరించి మాట్లాడడు. తల్లి అంటే 'భయమా…మర్యాదా?' అనేది అతనికి మాత్రమే తెలుసు.

‘వరుణ్ కి అంతగా సామర్థ్యం చాలదు!' అనేది అత్తయ్య నమ్మకం. ఒక బి.ఏ డిగ్రీ చదవటానికి అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చదువులో అంతంతమాత్రమే! మామయ్య నాంపల్లి లో ఒక ‘రెడీ మేడ్’ బట్టల కొట్టు నడుపుతున్నారు. ఆ కొట్టును ఇప్పుడు వరుణ్ చూసుకుంటున్నాడు. మూడు వందల రూపాయలు ఖరీదైన డ్రస్సును ఎవరైనా రెండు వందలకు అడిగితే...పాపం అనుకుని ఇచ్చేసి తండ్రి దగ్గర తిట్లు తింటాడు. అందుకని అతన్ని నమ్మి షాపును అతని ఒక్కడిపైన వదిలిపెట్టడు అతని తండ్రి.

"నువ్వు క్యాష్ లో ఉండు...చాలు. వ్యాపారానికి ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు..." అని చెప్పేశారు.

షాపుకు కావలసిన స్టాకు కొనడానికే ఆయనకు సమయం సరిపోతుంది. వరుణ్ కు రుచిగా తినడం తెలుసు. అది వదిలితే షాపు చూసుకోవటం, లెక్కలు చూడటం. రాత్రి లేటుగానే ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే స్నానం, భోజనం, నిద్ర. ఇదే అతని జీవిత చక్రం. గత రెండు రోజులుగా భర్తను షాపును చూసుకోవటానికి పంపించి, కొడుకు వరుణ్ని ఇంట్లో పనులకు వాడుకుంటోంది అత్తయ్య. ఆమె ఎన్ని సార్లు మార్కెట్టుకు పంపించినా విసుక్కోకుండా వెళ్ళొస్తాడు వరుణ్.

కిరణ్, వరుణ్ కి పూర్తి విరుద్దం. చదువు, 'గలగల’ మని మాట్లాడటం, గట్టి నిర్ణయాలు, సరదా గుణం, చిలిపితనం, ఎత్తు-రంగు-గంభీరం అన్నిట్లోనూ కొంచం ఎక్కువే! అత్తయ యొక్క ముద్దుల బిడ్డ. ప్రతిమ యొక్క ప్రియమైన ప్రేమికుడు. 'కంప్యూటర్ ఇంజనీర్’. దానికి తగిన పెద్ద చదువుకోసమే అమెరికా వెళ్ళాడు. వరుణ్ కి సంబంధాలు చూడమని అమ్మ దగ్గర సనుగుతూ ఉంటాడు కిరణ్.

"రాను రానూ నీ వంట బాగుండటం లేదమ్మా. ఒక వదిన వచ్చి వండితే మార్పుగా ఉంటుందమ్మా...?"

అమ్మను గేలి చేస్తూ...ఆమె ముఖంలో మార్పు తెప్పిస్తాడు.

"వదిన కావాలా వదిన..." కళ్ళు పెద్దవి చేసి కిరణ్ ని కోపంగా చూసింది ప్రతిమ.

"అలా కోపంగా చూడకు. అప్పుడే కదా మన 'లైను క్లియర్’ అవుతుంది. నేను అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే మన పెళ్ళే. అ తరువాత చూడు ఈ జిడ్డు మొహాన్ని ఎన్ని కష్టాలు పెడతానో..."

ప్రతిమ తనలో తానే నవ్వుకుంది.

ప్రతిమ తల్లితండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎనిమిది ఏళ్ళ వయసులోనే అనాధాగా నిలబడ్డ ప్రతిమను తీసుకు వచ్చి పెంచింది ఈ మేనత్త. ఈ రోజు వరకు ప్రతిమకు ఎటువంటి లోటూ చేయలేదు. ప్రతిమ డిగ్రీ పూర్తి చేసి నెల రోజులు అవుతోంది. రిజల్ట్స్ రావాలి.

"కిరణ్ అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇద్దరి కొడుకులకూ పెళ్ళిళ్ళు చేశేయాలి" అని ఒక రోజు మామయ్యతో చెబుతున్నది అత్తయ్య. మామయ్య ప్రతిమను "కోడలు పిల్లా..." అనే పిలుస్తున్నారు.

ఆయన అలా పిలుస్తుంటే ప్రతిమకు చాలా సంతోషంగా ఉండేది. దాని గురించి కిరణ్ కి వెంటనే తెలియపరిచింది. సమాధానంగా మామూలుగా ఎప్పుడూ ప్రతిమను ఏడిపిస్తూ పంపేలాగానే ఒక ఈ-మైల్ పంపించాడు.

“నిన్ను కోడలు పిల్లా అని నాన్న పిలవటం నాకు సంతోషంగానే ఉన్నది. సినిమాలలో హీరోయిన్ ను దూరంచేసుకున్న హీరో, ఆమెను బొమ్మగా గీసి పాడుతాడే...అదేలాగా నేను నిన్ను బొమ్మగా గీశాను. ఆశ్చర్యపోయాను. నీ మొహం అంత న్యాచురల్ గా వచ్చింది. ఈ ఈ-మైల్ చివర్లో నేను గీసిన నీ బొమ్మను ఇమేజ్ గా పెట్టాను. ఎలా ఉన్నదో చెప్పు”

వెంటనే ప్రతిమ ఆ ఈ-మైల్ చివరికి వెళ్ళి చూసింది. అక్కడ పళ్ళు ఇకిలిస్తూ ఒక కోతి బొమ్మ గీసుండటం చూడటంతో...పళ్ళు కొరుక్కుంది ప్రతిమ.

‘నేను కోతి లాగా ఉన్నానా?’......ఆ మరు క్షణం కిరణ్ కి ప్రత్యుత్తరం పంపింది.

'నువ్వు గీసేవని చెబుతూ పంపిన బొమ్మను చూశాను. చాలా బాగుంది. కానీ, అందులో ఒక చిన్న తప్పు చేశావు. బొమ్మలో నా మొహం గీయటానికి బదులు నీ మొహం గీసుకున్నావు. వాళ్ళ మొహం వాళ్ళు గీసుకోవటం కష్టమైన పనే. అది నువ్వు చాలా ఈజీగా చేశావు. కంగ్రాట్స్"

'మార్చి మార్చి ఇద్దరం ఒకరి మీద ఒకరు వ్యంగ్యంగా గేలి చేసుకోవటం ఆనందంగానే ఉన్నది. పెళ్ళి తరువాత కూడా ఇలా గేలి చేసుకుంటే అంతే! సమయమంతా దీనికే సరిపోతుంది’ ప్రతిమ తనలో తానే నవ్వుకుంది.

అత్తయ్య వంట ముగించుకుని మళ్ళీ స్నానానికి వెళ్ళింది. 'ఏర్ పోర్టుకు వెళ్ళాలే! నేనూ మీతో రానా అత్తయ్యా?' అని అడగాలని ప్రతిమ ఆశపడుతున్నా, 'నువ్వెందుకు?' అని అత్తయ్య వద్దని చెబితే అసహ్యంగా ఉంటుంది కనుక అడగలేదు. 'రమ్మని పిలిస్తే వెల్దాం' అని అనుకున్నది. కానీ, రమ్మని పిలవలేదు. ఎప్పుడూలాగానే వరుణ్ కారు తొలగా అత్తయ మాత్రం వెళ్ళింది.

"మామయ్యకు 'ఫోన్’ చేసి మధ్యాహ్నము కొట్టు మూసేసి వచ్చేయమని చెప్పానని చెప్పు..." అని వెళ్ళేటప్పుడు ప్రతిమకు ఆర్డర్ వేశేసి వెళ్ళింది.

****************************************************************************************************
                                   ఇంకా ఉంది.....Continued in: PART-3

12, నవంబర్ 2019, మంగళవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-1



                                   ప్రేమ సుడిగుండం...(సీరియల్)
                                                          (PART-1)

కళ్ళు తెరిచిన వెంటనే కిరణ్ జ్ఞాపకాలే వచ్చినై ప్రతిమకు.

ప్రతిమ కిటికీలో నుండి కనబడుతున్న మామిడి చెట్టును చూసింది. పదేళ్ళ కిరణ్ జారిపోతున్న నిక్కర్ను పైకి లాక్కుంటూ ఆ మామిడి చెట్టును ఎక్కుతున్నట్టు ప్రతిమ అంతరంగ కళ్ళకు కనబడింది...చిరునవ్వుతో లేచింది ప్రతిమ.

ఆ రోజు కిరణ్ జన్మ నక్షత్రం. క్రింద వంటింట్లో ప్రతిమ మేనత్త రామలక్ష్మి పాయసం రెడీ చేస్తోంది. అమెరికాలో మొదటి సంవత్సరం చదువు ముగించుకుని కిరణ్ ఇండియాకి తిరిగి వస్తున్నాడు. ఇంకో మూడు గంటలలో అతను వచ్చే విమానం హైదరాబాద్ నేలను తాకుతుంది. ఆ తరువాత మరో గంటలో అతని కారు ఆ ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది.

వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? అమ్మతో అరగంట సేపు మాట్లాడి, హడావిడి పడుతూ మేడమీదకు వచ్చి ప్రతిమతో గొడవపడతాడు. ఆమెను ఏడిపించకపోతే అతనికి రోజులు గడవవు.

అమెరికా వెళ్ళే ముందు కూడా ఆమెను ఏడిపించాడు.

"వారానికి రెండు సార్లు ఫోన్ చెసి మాట్లాడు కిరణ్"

"ఎందుకమ్మా...ఫోనులో కూడా నీ సుత్తి వినాలనా? నీ దగ్గర నుండి తప్పించుకోవటానికే కదా సముద్రాలు దాటి దూరంగా వెడుతున్నాను. ‘నో...ఫోన్’, ‘నో...ఈమైల్’!"

"ఉత్తుత్తి మాటలు చెప్పకు. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు"

“ఇక్కడున్నప్పుడు వేరే నాధి లేక నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ, ఇకమీదట అలా జరగుతుందా? అయ్యగారు ఎక్కడికి వెడుతున్నారో తెలుసుగా? అమెరికా! నీకంటే స్మార్టుగా ఉండే అమ్మాయులు నా చుట్టూ తిరుగుతారు. వాళ్ళతో మాట్లాడటానికే సమయం చాలదట. అవన్నీ వదులుకుని పనిగట్టుకుని పాత మనిషితో ఫోన్ చేసి మాట్లాడాలా?"

"ఎవర్ని చూసి పాత మనిషి అంటున్నావు?"

"నిన్ను చూసే!"

"నువ్వెలా అమెరికా వెల్తావో చూస్తాను!"

"ఫ్లయిట్ లోనే వెల్తాను. టెర్రస్ పైకి వెళ్ళి చూడు. వీలైతే పై నుండి చేతులూపుతా"

"నిన్నూ..." అంటూ చెయి పైకెత్తి ముద్దుగా కిరణ్ చేతిపై ఒక దెబ్బ వేసింది ప్రతిమ.

"ఈ జిడ్డు మొహాన్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నాకు వద్దు బాబూ! నువ్వు కావాలంటే చూడు ప్రతిమా....అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు జాలీగా ఆ ఊరి అమ్మాయితో వస్తాను”

“అక్కర్లేకపోతే పోవయ్యా! ఈ జిడ్డు మొహానికి కూడా ఒకడు దొరుకుతాడు"

"దొరుకుతాడంటావా! నాకు నమ్మకం లేదు! అలా ఎవరూ దొరకకపోతే చెప్పు...పోతేపోనీ పాపం అనుకుని ఒకళ్ళకి ఇద్దరుగా నేనే నిన్ను చేసుకుంటా. నా అంతఃపురంలో చిన్న మహారాణిగా ఉండిపో!"

ప్రతిమ మొహం ఎరుపెక్కి కళ్ళల్లో నీరు కారింది...గబుక్కున లేచి పరుగుతీసింది. ఆమె వెనుకే నవ్వుతూ వెంటపడ్డాడు కిరణ్.

ఆ రోజు ప్రతిమ కిరణ్ తోపాటు ఏర్ పోర్టుకు కూడా వెళ్ళలేదు. అంత కోపం. అతనూ రమ్మని పిలువలేదు. అత్తయ్య, ఆమె పెద్ద కొడుకు వరుణ్ ఎక్కిన తరువాత కారు వేగంగా బయలుదేరింది. మేడ మీదున్న కిటిలో నుండి ఏడుపు, బాధతో చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు కిటికీని విడిచిపెట్టి రాలేదు.

"ప్రతిమా..." వరుణ్ గొంతు వినబడగానే వెనక్కి తిరిగింది ప్రతిమ.

"కిరణ్ దీన్ని నీ దగ్గర ఇమ్మని చెప్పాడు" అంటూ చిన్న పార్సల్ ను ప్రతిమ ముందుకు జాపాడు.

"ఏమిటిది?"

"నాకెలా తెలుస్తుంది?"

వరుణ్ పార్సల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు.

తలుపుకు గొళ్ళేం పెట్టి ఆదుర్దాపడుతూ పార్సల్ విప్పింది. అందులో నుండి కాగితాలు మాత్రమే వస్తున్నాయి. కాగితాలు పూర్తిగా తీసిన తరువాత అక్కడొక చిన్న పెట్టె ఉన్నది. పెట్టె తెరిస్తే అందులో చిన్న ఆముదం బాటిల్ ఉన్నది. దాని క్రింద ఒక కాగితంలో ప్రేమతో అని రాసుంది.

ప్రతిమ కడుపు పట్టుకుని నోరు నొప్పి పుట్టేంతవరకు నవ్వుకుంది. పొలమారి కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.

రెండు రోజుల తరువాత కిరణ్ దగ్గర నుండి ఈ-మైల్ వచ్చింది.

"హాయ్...నా జిడ్డు మొహమా!" అని మొదలుపెట్టి “ఎవరైనా ఒక అమెరికా అమ్మాయిని పట్టుకుందామని చూస్తే, ఎవరి మొహం చూసినా వాళ్ళలో నీ మొహం కనబడి తగలడుతోందే...ఏం చేయను? ఇక్కడికీ వస్తోందే ఈ జిడ్డు మొహం...ఎందుకు అని ఆలొచించాను? ‘నీ మనసులో ఉన్నది...నీతోనే ఉంటుంది’ అని ఎవరో చెబుతున్న ఫీలింగ్…సరే కానీ అని వదిలేశా. నా తలరాత నువ్వే. ఏం చేయగలను?"

మరు క్షణమే సమాధానం పంపింది ప్రతిమ.

"దెబ్బతిన్న టొమేటో లాంటి నీ ముఖానికి ఈ జిడ్డు మొహం దొరకటమే పెద్ద అదృష్టం. జిడ్డు కారుతున్న నూనె వెల ఎంతో తెలుసా? తెలియకుండా గేలి చేయకు! పిచ్చి పిచ్చి ఆలొచనలు మాని చదువు మీద ధ్యాస పెట్టి చదువు ముగించి, ఊరికి వచ్చే దారి చూడు. మన పెళ్ళి జరగనీ. ఆ తరువాత తెలుస్తుంది ఈ జిడ్డు మొహం మహాత్యం!"

ఆ తరువాత పరీక్షలూ, క్లాసులూ అంటూ ఆమెతో మాట్లాడలేకపోయాడు కిరణ్!

                                            ****************************

ఇంకా ఉంది.....Continued in: PART-2

8, నవంబర్ 2019, శుక్రవారం

భవిష్యత్ లో అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్....(ఆసక్తి)




                             భవిష్యత్ లో అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్


స్టెమ్ సెల్స్ = మూలకణాలు.

పాడైపోయిన (వ్యాధికి గురైన లేక బాగుచేయలేని) అవయవాలతో బాధపడే వారిని, అవయవ మార్పిడి వలన మాత్రమే బ్రతికించగలమని వైద్యశాస్త్రం ప్రచారం చేస్తున్నప్పటి నుండి అవయవ దానాలు చేసే వారి సంఖ్య కనీసంగా పెరిగిందనేది నిజం. అవయవ దానాలిచ్చిన వారి అవయవాలను అమర్చుకుని చావు నుంచి బయటపడి ఆనందంగా జీవితం కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు.


అలాగే మూలకణాలతో అనారొగ్యానికి చెక్ పెట్టవచ్చునని వైద్యశాస్త్రం తెలియజేయడంతో మూలకణాలను బద్రపరుచుకునే వారి సంఖ్య మరియూ మూలకణాలను దానం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అవయవ మార్పడికంటే మూలకణాలతో చేసే వైద్యమే ఖచ్చితమైన విజయాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేయడంతో మూలకణాలు బద్రపరిచే బ్యాంకులు కూడా ఎక్కువవుతున్నాయి.

మానవ శరీరం కణాల నిర్మితం. కణాలతో ఏర్పడిన కణజాలం వివిధ శరీర అవయవాలుగా రూపాంతరం చెందుతుంది. అయితే శరీర కణాలన్నీ మూలకణాలు కావు. రెండు నిర్ధిష్ట లక్షణాలున్న జీవకణాలను మాత్రమే మూలకణాలంటారు. వీటికి ఉన్న విశిష్టత ఏమిటంటే శరీరంలోని వేర్వేరు కణాలుగా (చరమ, ఎముక, కండరం తదితరాలు) మారగల సామర్ధ్యం ఈ కణాలకు ఉంటుంది. సమస్యాత్మక కణం అవయవాలుగా, కణజాలాల అభివృద్దికి మూలం ఈ మూల కణాలు. అసాధారణ పరిస్థితుల్లో లేదా ఏదైనా అవయవం లేదా కణజాలం పనిచేయని స్థితి ఏర్పడినప్పుడు మూలకణాలు ఆయా రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సంధర్భాల్లో అవయవాన్ని పూర్తిగా తయారుచేస్తాయి.


కాన్పు తరువాత గర్భాశయ ద్రవంలో, బొడ్డుతాడును అంటిపెట్టుకుని ఉండే రక్తంలో బిడ్డ తాలూకా మూలకణాలు ఎక్కువ మొతాదులో ఉంటాయి. బొడ్డుతాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. బొడ్డుతాడు రక్తంలో మూలకణాలు (హెమటోపాయనిక్ సెల్స్) చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని రక్త, జన్యు సంబంధ వ్యాధులు చికిత్సకు ఉపయోగించవచ్చు. బొడ్డు తాడును బిడ్డ నుంచి వేరు చేసిన తరువాత ఆ రక్తాన్ని సేకరిస్తారు. ప్రసవం జరిగిన ఆరు గంటల లోపు బొడ్డు తాడును, రక్తాన్ని సేకరిస్తే అందులో 98 శాతం మూలకణాలు లభిస్తాయి.

చాలా సందర్భాల్లో బిడ్డ పుట్టిన వెంటనే రెండో ఆలొచన లేకుండా బొడ్డుతాడును, రక్తాన్ని పారవేస్తారు. ఎంతో అమూల్యమైన మూలకణాలు ఉన్న రక్తాన్ని వృధా చేస్తుంటారు. మూలకణాలపై ఎన్నో పరిశోధనలు జరిగిన తరువాత శరీర భాగాలను ఉత్పత్తి చేసే శక్తి వీటికి ఉందని గుర్తించారు. బొడ్డుతాడును, అందులోని రక్తాన్ని ఎముక మూలుగ (బోన్ మేరో) మాదిరిగానే సేకరించి నిల్వ చేస్తారు. ఇలా మూలకణాలను నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో బిడ్డకు రాగల వ్యాధులకు చికిత్స, అవసరమైతే శరీరావయవాలను పరిశోధన శాలల్లో ఉత్పత్తి చేసేలా వీలు కలుగుతుంది.


మూలకనాలతో చికిత్స చేయగల వ్యాధులు.

లుకేమియాతో పాటు కొన్ని ఇతర రకాల క్యాన్సర్లు, గుండెకు సంబంధిత వ్యాధులు, మంటింగ్ టన్ వ్యాధి వంటి మెటబాలిక్ స్టొరేజ్ వ్యాధులు. అవయవ, కణజాల పునర్నిర్మాణం...రీ జనరేటివ్ మెడిసన్ లో కొత్త కణజాలాలను నిర్మించేందుకు మూలకణాలను ఉపయోగిస్తున్నారు. కిలో బరువు ఉన్న శరీర అవయవం రూపొందడానికి ఒక్క మిలియన్ మూలకణాలు అవసరం అవుతాయి. వీటిని పరిశోధనాలయాల్లో తయారుచేస్తారు. చాలా సంధర్భాలలో రోగికి సరిపోయే రక్తకణాలను గుర్తించేలోపు రోగం ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇలాంటి సంధార్భాలలో మూలకణాలు ద్వారా చికిత్స అనేది చాలా సులభం.

కాలుష్యమయమైన వాతావరణం, క్రమం తప్పిన ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్న జీవన విధానం అన్నీ కలిపి కొత్తకొత్త రోగాలు, అకాల మరణాలు...వీటన్నింటికీ వైద్య నిపుణులు ప్రత్యామ్నయ వైద్య చికిత్స విధానాలను పరిశోధిస్తున్నారు.


1960లలో ఎర్నస్ట్ ఏ.మక్కల్లో, మరియు జేయమ్స్ ఇ.టిల్ అనబడే కెనడియన్ శాస్రవేత్తలు చేసిన పరిశోధనల మూలంగా మూలకణాల రంగం ఎంతో పురోగమించింది. జపాన్ శాస్త్రవేత్త షినియా యమనాక, బ్రిటన్ శాస్త్రవేత్త జాన్ గురుడాన్ మూలకణాల పరిశోధనలో 2012 సంవత్సరం వైద్య రంగంలో నోబుల్ బహుమతికి ఎంపికయ్యారు. ఎన్నో పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తూ భవిష్యత్ అనారోగ్యాలకు చెక్ చెప్పేలా మూలకణాల నిల్వ అనేది కొనసాగుతున్నది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక్క మూలకణాల బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉంది.

మానవ శరీరావయవాలను తయారుచేయడం సాధ్యం కాదు కాబట్టి ఇతరుల నుండి సేకరించడం, లేదా మూలకణాల నుంచి ఉత్పత్తి చేయడం మాత్రమే ప్రాణాంతక వ్యాధులకు చికిత్సగా గుర్తించారు. మరి శరీరావయవాలను దానం చేయాలన్న ఆలొచన ఎంతో ఉన్నతాశయాలు ఉన్న వారిలోనే కలిగే ఆలొచన...మరి అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు మార్పిడిల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఇక మిగిలిన ఆలొచన మూలకణాల నుంచి శరీరావయవాలను ఉత్పత్తి చేయడం. అయితే ఇందుకు మూలకణాలు కావలి. నిర్ధిష్ట లక్షణాలున్న జీవకణాలను పరిశోధన శాలలో శరీర అవయవాలుగా మార్చవచ్చు. విదేశాల్లో బహు ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ విధానం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అందుబాటులోకి వస్తోంది.


గర్భం దాల్చిన స్త్రీలలో 13-28 వారాలలో పిండం ఎదుగుదల ఏర్పడుతుంది. అప్పుడు గర్భంలోని ఉమ్మునీరులో ఈ మూలకణాలు బలంగా ఉంటాయని ఈ మధ్య తెలుసుకున్నారు. అందువలన 13-28 వారాలలో గర్భంలోని ఉమ్మునీరును కొంచంగా తీసి బద్రపరచుకుంటే ఆ తరువాత అది పుట్టే బిడ్డకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. పుట్టిన బిడ్డకే కాకుండా వారి దగ్గర బంధువులకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎదుగుతున్న పిండంలోని మూలకణాలు, అన్ని రకాల ప్రత్యేక పిండ ధాతువులు గాను విభేదన చెందగలవు. ఎదిగిన జీవాలలో, మూలకణాలు మరియు పూర్వ కణాలు, దేహం ధాతువుల్లో దోషాలని చక్క దిద్దడం, నాశనం అయిపోయిన ప్రత్యేక కణాలని తిరిగి భర్తీ చేయడం వంటి పనులు చేస్తుంటాయి. ఇవికాక పునరుజ్జీవితం కాగల అవయవాలలో చచ్చిపోయిన ధాతువు స్థానంలో కొత్త ధాతువు వచ్చే సహజ ప్రక్రియలో కూడా ఈ ఎదిగిన మూలకణాలు పాత్ర వహిస్తాయి.

Images Credit: to those who took the original photos. *****************************************సమాప్తం************************************************

6, నవంబర్ 2019, బుధవారం

ఆత్మలతో మాట్లాడించే బోర్డు...(మిస్టరీ)



                               ఆత్మలతో మాట్లాడించే ఓయుజా బోర్డ్


లిపి ఫలకం, ఆత్మ బోర్డ్ మరియు మాట్లాడే పలక అని కూడా చెబుతారు. ఈ పలకను(OUIJA BOARD) ఒక ఆట వస్తువుగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ పలక, ఆడుకునే వారు తనని అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుందట. ఈ పలక మార్కెట్టులో అమ్మకానికి ఉన్నా ఈ పలకను కొనుక్కునే వారి సంఖ్య తక్కువగా ఉన్నది. దీనికి కారణం, ఈ పలకను కొనుక్కుని ఆడుకున్న వారు తమ అనుభవాలను చెప్పటం వలన. అంటే ఈ పలకతో ఆడినవారు ఆనందం కంటే బాధలే ఎక్కువ పొందారు. అందులో చాలామంది అత్యంత భయంకరమైన అనుభూతిని ఎదుర్కొన్నారు.


గూగుల్ సంస్థ 2014 లో డిసెంబర్ నెల అందించిన సమాచార జాబితాలో ఆ సంవత్సరం ఆ పలకల అమ్మకం ఎక్కువ అయిందని, ఈ పలకను తమ పిల్లలకు, స్నేహితులకు, కుటుంబీకులకు క్రిస్మస్ కానుకగా ఇవ్వటానికి కొంటున్నారని తెలిపారు. ఈ పలకల అమ్మకం ఆ సంవత్సరం ఎక్కువ అవటానికి కారణం ఆ సంవత్సరం హాలోవిన్ పండుగకు విడుదలైన ఓయూజా (Ouija) సినిమానే అని తెలిపారు. ఈ పలకను ఆటవస్తువుగా చూడొద్దని, ఈ పలకతో ఆడుకోవద్దని భూతవైద్యులు మరియు అతీత భావన (పారానార్మల్) పరిశోధకులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.


ఈ పలకకు క్షుద్ర మరియు చెడు పరిణామాలకు సంబంధం ఉన్నదని తెలిసినా వ్యాపారులు ఈ పలకను ఒక ఆట వస్తువుగా అమ్ముతున్నారని పారానార్మల్ పరిశోధకులు మరియు భూతవైద్యులు వాపోతున్నారు. "ఈ పలకతో ఆత్మలను రప్పించడం సులువే కానీ పంపించడం కష్టమని వారు చెబుతున్నారు. ఈ పలకతో చనిపోయిన తమ ప్రియమైన వారిని మాత్రమే కలుసుకుంటున్నాము అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆ పలకతో ఆడుతున్నప్పుడు ఎవరి ఆత్మ అయినా రావచ్చు. ఆ ఆత్మ మంచిది కావచ్చు లేక చెడ్డది కావచ్చు" అంటున్నారు.

"ఎవరితో మాట్లాడుతున్నామో తెలియని ఆ పలకను నేనైతే అసలు ముట్టుకోను. ఎందుకంటే ఇన్నేళ్ళ నా సేవలో ఈ పలక వలన నేను ఎన్నో భయాలకు గురి అయ్యాను" అని పారానార్మల్ పరిశోధకుడు డారెన్ ఆన్సెల్ అన్నారు. పారానార్మల్ పరిశోధకుడు డారెన్ ఆన్సెల్ తన బృందంతో కలిసి ఈ మాట్లాడే పలకతో ఎన్నో పరిశోధనలు జరిపారు. "పలకతో ఆడుకోవటానికి ఉపయోగించే ముక్కోణపు కదిలే సూచిక (planchette) ఆడుతున్న వారి సబ్-కాన్షియస్ మెదడు యొక్క కండరాల కదలికల వలన కదులుతూ ఉండచ్చు" అని ఆయన చెప్పారు. కానీ తన పరిశోధనలలో భాగంగా ఈ పలకతో ఆడిన వారిని కలుసుకున్నప్పుడు వారు వివరించిన అనుభవాల గురించి నేను వివరించలేను అని తెలిపారు. ఈ పలకతో ఆడుకున్నప్పుడు అదృశ్య మాటలు, వింత శబ్ధాలు వినబడేవి. ఆడుతున్న రూములో పలక చుట్టూ ఉన్న వస్తువులు ఎగిరిపోవడం లాంటివి జరిగాయని ఈ పలకతో ఆడుకున్నవారు తెలియపరిచారు. ఈ పలక గురించి 1100 ఏ.డి.లో చైనా చారిత్రక పత్రాలలో రాయబడి ఉంది. సాంగ్ రాజవంశం వారు ప్రత్యేక ఆచారాలతో ఆధ్యాత్మిక గురువుల పర్యవేక్షణలో ఆత్మల ప్రపంచంతో సంభాషించేవారట. జూలై-1, 1890లో ఎలీజా బాండ్ అనే వ్యాపరవేత్త లాభార్జనే లక్ష్యంగా ఈ మాట్లాడే ఆత్మ పలకను ప్రజలకు హాని చేయని ఆట పరికరంగా పరిచయం చేశాడు. మొదటి ప్రపంచ యుద్దం జరుగుతున్నప్పుడు అమెరికాకు చెందిన ఆధ్యాత్మికవేత్త పిరల్ ఉర్రన్ ఈ పలకను దైవ సంబంధమైన పరికరంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.


సైన్స్ శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక వేత్త మాటలను కఠినంగా విమర్శించారు. ముక్కోణపు కదిలే సూచిక కదలడానికి కారణం ఆడుతున్నవారి ఇడియో మోటార్ ఎఫెక్ట్ (శక్తివంతమైన భావోద్వేగాలు ఒక మనిషిలో అనుకోకుండా కన్నీళ్ళు తెప్పించడాన్ని ఇడియో మోటార్ ఎఫెక్ట్ అంటారు) వలనే కదులుతోందని చెబుతున్నారు.


మాట్లాడే ఆత్మ పలకపై ఆంగ్ల అక్షరాలు చిహ్నిత చేయబడి ఉంటాయి. 0 నుండి 9 వరకు అంకెలు ఉంటాయి. ఎస్. నో మరియు గుడ్ బై అనే మాటలు ఉంటాయి. ముక్కోణపు కదిలే సూచిక ఇవ్వబడుతుంది. ఈ పలకను ఆడటానికి ఇద్దరు కావలి. మూడో వ్యక్తి కూడా ఆడే చోట ఉండచ్చు. చిన్న వెలుతురులో ఆడితే సరైన సమాధానం దొరుకుతుంది. ఆడే ఇద్దరూ ముక్కోణపు కదిలే సూచికను ఆ పలకపై ఉంచి ఎవరితో మాట్లాడలి అనుకుంటున్నారో వారిని పిలువ వచ్చు. జవాబుగా ముక్కోణపు కదిలే సూచిక తానుగా కదులుతుంది. అది కదిలి ఏయే అక్షరాలపై ఆగుతోందో దానిని మూడో వ్యక్తి కాగితంపై రాసుకోవచ్చు. ఒక్కొక్కసారి రూములోకి వచ్చిన ఆత్మలు మాట్లాడతాయి. ఆ మాటలను అక్కడున్న అందరూ వినవచ్చు. ఆట ముగిసిన తరువాత ఖచ్చితంగా గుడ్ బై చెప్పాలట. లేకపోతే అక్కడికి వచ్చిన ఆత్మ వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుందట. చాలామంది ఈ పలకను ఆడుతున్నప్పుడు తమకు కావలసిన వారి ఆత్మలు రాకుండా, ఇంకెవరివో వస్తున్నాయని, ఆ ఆత్మలు ఆడేవారిని హింసిస్తున్నాయని చెప్పడంతో ఈ పలక ఆట ఆడుకోవటానికి తగ్గించారు. చాలా సంవత్సరాలుగా ఈ మాట్లాడే ఆత్మ పలక అమ్ముడు కాకుండా షాపులలోనే ఉండిపోవడంతో ఈ పలక అమ్మకాలు తగ్గిపోయినై. అప్పుడప్పుడు కొందరు కొని ఆడుతున్నా ఈ పలకకు గిరాకి తగ్గింది. ఈ మాట్లాడే ఆత్మ పలక ఆడవద్దు అని ప్రచారం జరుగుతూనే ఉన్నది. కానీ తిరిగి ఈ మధ్య, ముఖ్యంగా ఓయాజా సినిమా కారణంగా అమ్మకాలు పెరిగినట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది.

పరిచయం చేయబడి 125 సంవత్సరాలు అయినా మాట్లాడే ఆత్మ పలక గురించి సరైన అవగాహన ఎవరూ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇది ఇంకా మిస్టరీగానే ఉన్నది.

Images Credit: to those who took the original photos.

*********************************************సమాప్తం********************************************

4, నవంబర్ 2019, సోమవారం

మంత్రాల బావి...(మిస్టరీ)



                                                    మంత్రాల బావి


ఎస్టోనియా దేశంలోని తుహాలా అనే గ్రామంలో ఉన్నది ఈ మంత్రాల బావి.

ఎస్టోనియా, అధికారిక నామం ‘రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా’. ఉత్తర యూరప్ బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తరాన ఫిన్లాండ్, పశ్చిమాన స్వీడన్, దక్షిణాన లాట్వియా, తూర్పున రష్యా దేశాలు ఎల్లలుగా ఉన్నాయి.


తుహాలా అనే ఈ గ్రామంలో అత్యధికమైన భూగర్భ బావులు, నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహాలాలో ఉన్న ఒక బావి అత్యద్భుత ప్రకృతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్న ఈ బావి నుండి వర్షాకాలంలో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్తం ప్రాంతాన్ని వరదతో ముంచుతుంది. ఏ రెండు, మూడు సంవత్సరాలకో అలా జరుగుతుంది. కేవలం మూడు లేక నాలుగు రోజులు మాత్రమే అలా జరుగుతుంది. అందుకే ఈ బావిని మంత్రాల బావి అంటారు. వారి కథల ప్రకారం ఇద్దరు మంత్రగాళ్లు భూమి కింద యుద్దం చేసుకోవటం వలనే ఇలా బావి నుండి నీరు వచ్చి వరదగా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడు ఈ బావి మీద రెండు మండుతున్న రూపాలు కనిపిస్తాయని చెబుతారు.

'ఎస్టోనియా సహజ మంత్రశక్తి నిండిన ప్రదేశం. దానిని వివరించడం/వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ జరిగే విషాయాలు చాలా వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి’ అని అక్కడ నివసిస్తున్న 37 సంవత్సరాల Mari-Liis Roos అంటారు.


ఎప్పుడు ఆ బావిలో నుండి నీరు వస్తుందో తెలియదు కాబట్టి, అలా వచ్చినప్పుడు ఎస్టోనియాలో నివసిస్తున్న వారే గబుక్కున ఆ చోటుకు చేరుకోగలరు. ఆ వింతను చూడగలరు. మూడు, నాలుగు రోజులు మాత్రమే ఆ బావి నుండినీరు పైకి ఉబికి వస్తుంది కాబట్టి బయటి దేశాలలో ఉన్నవారు ఆ వింతను చూడటానికి ఆ సమయానికి అక్కడికి చేరుకోలేరు.

పురాతన నమ్మకాలు జానపద కథల రూపంలో ఉనికిలో ఉన్నాయి. ఆ కథల ప్రకారం మానవులు చేసిన పాపాలు ప్రకృతిలో ప్రతిధ్వనిస్తాయి. సరస్సులు ఉన్నట్టుండి మాయమవడం, అడవులు కనబడకుండా పోవడం, అక్కడున్న చెట్లు, మొక్కలూ తమని పూజించమని అడగటం జరిగేవట.

తుహాలా గ్రామం నేలంతా చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది. 15 భూగర్భ నదులు చిట్టడవిలో పారుతున్న శబ్ధం ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. కానీ కళ్ళకు కనిపించదు.ఈ రంద్రాలు ఒక్కొక్కసారి అతి పెద్దవై(ఒక గుర్రాన్ని మింగ గలిగేంత) వెంటనే కుచించుకుపోతాయి. వర్షాలు కురిసిన తరువాత భూగర్భ నీరు ఒత్తిడి తట్టుకోలేక పైకి అలా పొంగుకు వస్తున్నాయి అని జియాలజిస్టులు చెబుతున్నారు.

"చుట్టూ ఎన్నో బావులు ఉండగా, గ్రామం మొత్తం రంధ్రాలు ఉండగా, ఎందుకని ఒక్క బావిలో నుండే నీరు ఉబికి వస్తున్నది. ఆ బావి లోతు 2.5 మీటర్లే ఉన్నది. కనీసం 500 సంవత్సరాల నుండి ఈ బావిని చూడటానికి ప్రజలు వస్తున్నారని మాకు తెలుసు. ఈ బావిలో నుండి వచ్చే నీటిని తాగితే జబ్బులు నయమవుతాయి. కచ్చితంగా 100 ఏళ్ళు బ్రతుకుతారు. శాస్త్రం ఈ మధ్య వచ్చింది. శాస్త్రవేత్తలు చెప్పేది నిజమనే అనుకుందాం...'ఏదీ...గ్రామం కింద పారుతున్న 15 నదులను చూపించమనండి’” అంటూ జియాలజిస్టులు చెప్పేవాటిని అక్కడి ప్రజలు కొట్టి పారేస్తున్నారు.


'ఎక్కడైనా రోజా పువ్వులను ముక్కలు చేసి వేస్తే, అక్కడ రోజా చెట్లు మొలుస్తాయా? ఇక్కడ మొలుస్తాయని/మొలిచేవని మా పూర్వీకులు చెప్పేవారు’ ఒకప్పుడు ఆ బావి దగ్గర ప్రార్ధనలు చేసేవారు. నేల మీదున్న రంద్రాల నుండి భూమాతకు తమ కష్టాలను చెప్పుకునే వారు. యుద్దాలు మొదలై గ్రామాన్ని వివిధ రకాల ప్రజలు ఆక్రమించుకున్న తరువాత ఇక్కడున్న రంధ్రాలు మామూలు రంధ్రాలుగా, బావిని మామూలు బావిగా చూసేవారు.

2008లో ఒకసారి, తిరిగి 2010లో ఒకసారి ఆ బావిలో నుండి నీరు రావడంతో ఈ విచిత్రమైన బావిని చూడటానికి పర్యాటకులు వస్తున్నారు.


ఈ గ్రామం కింద పారుతున్నాయని చెబుతున్న కనిపించని భూగర్భ నదులను సైన్స్ పరంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే ఉంటుంది.

Images Credit: to those who took the original photos.

******************************************సమాప్తం******************************************