14, నవంబర్ 2019, గురువారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-2                                        ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                          (PART-2)


"ప్రతిమా..."

కింద నుండి అత్తయ్య పిలుస్తున్న కేక వినబడింది...తన జ్ఞాపకాలను చెరుపుకుని హడావిడిగా క్రిందకు వెళ్ళింది.

"మేడ మీద ఏంచేస్తున్నావు? వంటలొ నాకు కొంచం సహాయపడకూడదా? ఈ కొబ్బరిని మిక్సీలో వేసి పాలు తీసివ్వు. ఈ రోజు కిరణ్ వస్తాడని తెలియదా? మరెందుకు అంతసేపు నిద్ర?"

ప్రతిమ కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి, మిక్సీ ఆన్ చేసింది. కిరణ్ కి ఇష్టమైన వంటకాలు తయారవుతున్నాయి.

"అరెరే...ముఖ్యమైనది కొనడం మర్చిపోయాను... వరుణ్ని పిలవ్వా ఒక్క నిమిషం!"

ప్రతిమ వరుణ్ని తీసుకు వచ్చింది.

"అప్పడాలు, చిప్స్ మర్చిపోయాను వరుణ్. వెళ్ళి కొనుకొచ్చేస్తావా"

వరుణ్ కొట్టుకు బయలుదేరాడు. రెండు రోజులుగా అతన్ని మాటిమాటికీ మార్కెట్టుకు పంపించింది అత్తయ్య.

పాపం వరుణ్! మరిచిపోయి కూడా తన తల్లిని ఎదిరించి మాట్లాడడు. తల్లి అంటే 'భయమా…మర్యాదా?' అనేది అతనికి మాత్రమే తెలుసు.

‘వరుణ్ కి అంతగా సామర్థ్యం చాలదు!' అనేది అత్తయ్య నమ్మకం. ఒక బి.ఏ డిగ్రీ చదవటానికి అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చదువులో అంతంతమాత్రమే! మామయ్య నాంపల్లి లో ఒక ‘రెడీ మేడ్’ బట్టల కొట్టు నడుపుతున్నారు. ఆ కొట్టును ఇప్పుడు వరుణ్ చూసుకుంటున్నాడు. మూడు వందల రూపాయలు ఖరీదైన డ్రస్సును ఎవరైనా రెండు వందలకు అడిగితే...పాపం అనుకుని ఇచ్చేసి తండ్రి దగ్గర తిట్లు తింటాడు. అందుకని అతన్ని నమ్మి షాపును అతని ఒక్కడిపైన వదిలిపెట్టడు అతని తండ్రి.

"నువ్వు క్యాష్ లో ఉండు...చాలు. వ్యాపారానికి ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు..." అని చెప్పేశారు.

షాపుకు కావలసిన స్టాకు కొనడానికే ఆయనకు సమయం సరిపోతుంది. వరుణ్ కు రుచిగా తినడం తెలుసు. అది వదిలితే షాపు చూసుకోవటం, లెక్కలు చూడటం. రాత్రి లేటుగానే ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే స్నానం, భోజనం, నిద్ర. ఇదే అతని జీవిత చక్రం. గత రెండు రోజులుగా భర్తను షాపును చూసుకోవటానికి పంపించి, కొడుకు వరుణ్ని ఇంట్లో పనులకు వాడుకుంటోంది అత్తయ్య. ఆమె ఎన్ని సార్లు మార్కెట్టుకు పంపించినా విసుక్కోకుండా వెళ్ళొస్తాడు వరుణ్.

కిరణ్, వరుణ్ కి పూర్తి విరుద్దం. చదువు, 'గలగల’ మని మాట్లాడటం, గట్టి నిర్ణయాలు, సరదా గుణం, చిలిపితనం, ఎత్తు-రంగు-గంభీరం అన్నిట్లోనూ కొంచం ఎక్కువే! అత్తయ యొక్క ముద్దుల బిడ్డ. ప్రతిమ యొక్క ప్రియమైన ప్రేమికుడు. 'కంప్యూటర్ ఇంజనీర్’. దానికి తగిన పెద్ద చదువుకోసమే అమెరికా వెళ్ళాడు. వరుణ్ కి సంబంధాలు చూడమని అమ్మ దగ్గర సనుగుతూ ఉంటాడు కిరణ్.

"రాను రానూ నీ వంట బాగుండటం లేదమ్మా. ఒక వదిన వచ్చి వండితే మార్పుగా ఉంటుందమ్మా...?"

అమ్మను గేలి చేస్తూ...ఆమె ముఖంలో మార్పు తెప్పిస్తాడు.

"వదిన కావాలా వదిన..." కళ్ళు పెద్దవి చేసి కిరణ్ ని కోపంగా చూసింది ప్రతిమ.

"అలా కోపంగా చూడకు. అప్పుడే కదా మన 'లైను క్లియర్’ అవుతుంది. నేను అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే మన పెళ్ళే. అ తరువాత చూడు ఈ జిడ్డు మొహాన్ని ఎన్ని కష్టాలు పెడతానో..."

ప్రతిమ తనలో తానే నవ్వుకుంది.

ప్రతిమ తల్లితండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎనిమిది ఏళ్ళ వయసులోనే అనాధాగా నిలబడ్డ ప్రతిమను తీసుకు వచ్చి పెంచింది ఈ మేనత్త. ఈ రోజు వరకు ప్రతిమకు ఎటువంటి లోటూ చేయలేదు. ప్రతిమ డిగ్రీ పూర్తి చేసి నెల రోజులు అవుతోంది. రిజల్ట్స్ రావాలి.

"కిరణ్ అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇద్దరి కొడుకులకూ పెళ్ళిళ్ళు చేశేయాలి" అని ఒక రోజు మామయ్యతో చెబుతున్నది అత్తయ్య. మామయ్య ప్రతిమను "కోడలు పిల్లా..." అనే పిలుస్తున్నారు.

ఆయన అలా పిలుస్తుంటే ప్రతిమకు చాలా సంతోషంగా ఉండేది. దాని గురించి కిరణ్ కి వెంటనే తెలియపరిచింది. సమాధానంగా మామూలుగా ఎప్పుడూ ప్రతిమను ఏడిపిస్తూ పంపేలాగానే ఒక ఈ-మైల్ పంపించాడు.

“నిన్ను కోడలు పిల్లా అని నాన్న పిలవటం నాకు సంతోషంగానే ఉన్నది. సినిమాలలో హీరోయిన్ ను దూరంచేసుకున్న హీరో, ఆమెను బొమ్మగా గీసి పాడుతాడే...అదేలాగా నేను నిన్ను బొమ్మగా గీశాను. ఆశ్చర్యపోయాను. నీ మొహం అంత న్యాచురల్ గా వచ్చింది. ఈ ఈ-మైల్ చివర్లో నేను గీసిన నీ బొమ్మను ఇమేజ్ గా పెట్టాను. ఎలా ఉన్నదో చెప్పు”

వెంటనే ప్రతిమ ఆ ఈ-మైల్ చివరికి వెళ్ళి చూసింది. అక్కడ పళ్ళు ఇకిలిస్తూ ఒక కోతి బొమ్మ గీసుండటం చూడటంతో...పళ్ళు కొరుక్కుంది ప్రతిమ.

‘నేను కోతి లాగా ఉన్నానా?’......ఆ మరు క్షణం కిరణ్ కి ప్రత్యుత్తరం పంపింది.

'నువ్వు గీసేవని చెబుతూ పంపిన బొమ్మను చూశాను. చాలా బాగుంది. కానీ, అందులో ఒక చిన్న తప్పు చేశావు. బొమ్మలో నా మొహం గీయటానికి బదులు నీ మొహం గీసుకున్నావు. వాళ్ళ మొహం వాళ్ళు గీసుకోవటం కష్టమైన పనే. అది నువ్వు చాలా ఈజీగా చేశావు. కంగ్రాట్స్"

'మార్చి మార్చి ఇద్దరం ఒకరి మీద ఒకరు వ్యంగ్యంగా గేలి చేసుకోవటం ఆనందంగానే ఉన్నది. పెళ్ళి తరువాత కూడా ఇలా గేలి చేసుకుంటే అంతే! సమయమంతా దీనికే సరిపోతుంది’ ప్రతిమ తనలో తానే నవ్వుకుంది.

అత్తయ్య వంట ముగించుకుని మళ్ళీ స్నానానికి వెళ్ళింది. 'ఏర్ పోర్టుకు వెళ్ళాలే! నేనూ మీతో రానా అత్తయ్యా?' అని అడగాలని ప్రతిమ ఆశపడుతున్నా, 'నువ్వెందుకు?' అని అత్తయ్య వద్దని చెబితే అసహ్యంగా ఉంటుంది కనుక అడగలేదు. 'రమ్మని పిలిస్తే వెల్దాం' అని అనుకున్నది. కానీ, రమ్మని పిలవలేదు. ఎప్పుడూలాగానే వరుణ్ కారు తొలగా అత్తయ మాత్రం వెళ్ళింది.

"మామయ్యకు 'ఫోన్’ చేసి మధ్యాహ్నము కొట్టు మూసేసి వచ్చేయమని చెప్పానని చెప్పు..." అని వెళ్ళేటప్పుడు ప్రతిమకు ఆర్డర్ వేశేసి వెళ్ళింది.

****************************************************************************************************
                                   ఇంకా ఉంది.....Continued in: PART-3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి