మంత్రాల బావి
ఎస్టోనియా దేశంలోని తుహాలా అనే గ్రామంలో ఉన్నది ఈ మంత్రాల బావి.
ఎస్టోనియా, అధికారిక నామం ‘రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా’. ఉత్తర యూరప్ బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తరాన ఫిన్లాండ్, పశ్చిమాన స్వీడన్, దక్షిణాన లాట్వియా, తూర్పున రష్యా దేశాలు ఎల్లలుగా ఉన్నాయి.
తుహాలా అనే ఈ గ్రామంలో అత్యధికమైన భూగర్భ బావులు, నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహాలాలో ఉన్న ఒక బావి అత్యద్భుత ప్రకృతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్న ఈ బావి నుండి వర్షాకాలంలో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్తం ప్రాంతాన్ని వరదతో ముంచుతుంది. ఏ రెండు, మూడు సంవత్సరాలకో అలా జరుగుతుంది. కేవలం మూడు లేక నాలుగు రోజులు మాత్రమే అలా జరుగుతుంది. అందుకే ఈ బావిని మంత్రాల బావి అంటారు.
వారి కథల ప్రకారం ఇద్దరు మంత్రగాళ్లు భూమి కింద యుద్దం చేసుకోవటం వలనే ఇలా బావి నుండి నీరు వచ్చి వరదగా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడు ఈ బావి మీద రెండు మండుతున్న రూపాలు కనిపిస్తాయని చెబుతారు.
'ఎస్టోనియా సహజ మంత్రశక్తి నిండిన ప్రదేశం. దానిని వివరించడం/వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ జరిగే విషాయాలు చాలా వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి’ అని అక్కడ నివసిస్తున్న 37 సంవత్సరాల Mari-Liis Roos అంటారు.
ఎప్పుడు ఆ బావిలో నుండి నీరు వస్తుందో తెలియదు కాబట్టి, అలా వచ్చినప్పుడు ఎస్టోనియాలో నివసిస్తున్న వారే గబుక్కున ఆ చోటుకు చేరుకోగలరు. ఆ వింతను చూడగలరు. మూడు, నాలుగు రోజులు మాత్రమే ఆ బావి నుండినీరు పైకి ఉబికి వస్తుంది కాబట్టి బయటి దేశాలలో ఉన్నవారు ఆ వింతను చూడటానికి ఆ సమయానికి అక్కడికి చేరుకోలేరు.
పురాతన నమ్మకాలు జానపద కథల రూపంలో ఉనికిలో ఉన్నాయి. ఆ కథల ప్రకారం మానవులు చేసిన పాపాలు ప్రకృతిలో ప్రతిధ్వనిస్తాయి. సరస్సులు ఉన్నట్టుండి మాయమవడం, అడవులు కనబడకుండా పోవడం, అక్కడున్న చెట్లు, మొక్కలూ తమని పూజించమని అడగటం జరిగేవట.
తుహాలా గ్రామం నేలంతా చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది. 15 భూగర్భ నదులు చిట్టడవిలో పారుతున్న శబ్ధం ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. కానీ కళ్ళకు కనిపించదు.ఈ రంద్రాలు ఒక్కొక్కసారి అతి పెద్దవై(ఒక గుర్రాన్ని మింగ గలిగేంత) వెంటనే కుచించుకుపోతాయి. వర్షాలు కురిసిన తరువాత భూగర్భ నీరు ఒత్తిడి తట్టుకోలేక పైకి అలా పొంగుకు వస్తున్నాయి అని జియాలజిస్టులు చెబుతున్నారు.
"చుట్టూ ఎన్నో బావులు ఉండగా, గ్రామం మొత్తం రంధ్రాలు ఉండగా, ఎందుకని ఒక్క బావిలో నుండే నీరు ఉబికి వస్తున్నది. ఆ బావి లోతు 2.5 మీటర్లే ఉన్నది. కనీసం 500 సంవత్సరాల నుండి ఈ బావిని చూడటానికి ప్రజలు వస్తున్నారని మాకు తెలుసు. ఈ బావిలో నుండి వచ్చే నీటిని తాగితే జబ్బులు నయమవుతాయి. కచ్చితంగా 100 ఏళ్ళు బ్రతుకుతారు. శాస్త్రం ఈ మధ్య వచ్చింది. శాస్త్రవేత్తలు చెప్పేది నిజమనే అనుకుందాం...'ఏదీ...గ్రామం కింద పారుతున్న 15 నదులను చూపించమనండి’” అంటూ జియాలజిస్టులు చెప్పేవాటిని అక్కడి ప్రజలు కొట్టి పారేస్తున్నారు.
'ఎక్కడైనా రోజా పువ్వులను ముక్కలు చేసి వేస్తే, అక్కడ రోజా చెట్లు మొలుస్తాయా? ఇక్కడ మొలుస్తాయని/మొలిచేవని మా పూర్వీకులు చెప్పేవారు’
ఒకప్పుడు ఆ బావి దగ్గర ప్రార్ధనలు చేసేవారు. నేల మీదున్న రంద్రాల నుండి భూమాతకు తమ కష్టాలను చెప్పుకునే వారు. యుద్దాలు మొదలై గ్రామాన్ని వివిధ రకాల ప్రజలు ఆక్రమించుకున్న తరువాత ఇక్కడున్న రంధ్రాలు మామూలు రంధ్రాలుగా, బావిని మామూలు బావిగా చూసేవారు.
2008లో ఒకసారి, తిరిగి 2010లో ఒకసారి ఆ బావిలో నుండి నీరు రావడంతో ఈ విచిత్రమైన బావిని చూడటానికి పర్యాటకులు వస్తున్నారు.
ఈ గ్రామం కింద పారుతున్నాయని చెబుతున్న కనిపించని భూగర్భ నదులను సైన్స్ పరంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే ఉంటుంది.
Images Credit: to those who took the original photos.
******************************************
సమాప్తం******************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి