18, మే 2019, శనివారం

దైవరహస్యం(నవల).....Part-3


దైవరహస్యం(నవల).....Part-3

ఊరుఊరంతా ఆ విగ్రహం గురించిన గుసగుసలే.

విగ్రహాన్ని చూడటానికి జనం వస్తున్నారు, పోతున్నారు. ఊరి జనాన్ని ఆపలేమని తెలుసుకున్న అశోక వర్మ, శేషమాంబ దంపతులు శ్వామీజిని కలవడానికి బయలుదేరారు. అప్పుడు వాళ్ళ ఎదురుగా తొంబై ఏళ్ళ వృద్దుడు ఒకాయన గడ్డాన్ని తడుముకుంటూ వచ్చాడు. ఆయన్ను చూసి అశోక వర్మ దంపతులు ఆగారు.  దగ్గరుండి ఆయన్ను విగ్రహం దగ్గరకు తీసుకు వెళ్ళారు.

ఆయన పెట్టె తెరిచి అందులో ఉన్న విగ్రహాన్ని చూశారు. చూసిన వెంటనే "అరె భగవంతుడా! ఇది ఊరు వదిలి వెళ్ళలేదా...ఇక్కడే పడుందా?" అనే ప్రశ్నలతో కొంచం పెద్దగానే  గొణుకున్నారు.

"ఆయ్యా...అయితే ఈ విగ్రహం గురించి మీకు తెలుసా?"

"ఎందుకు తెలియదు...బాగానే తెలుసు! ఇది తిష్టాదేవి విగ్రహం. అత్యంత శక్తి కలిగిన రసాయన విగ్రహం" అన్నారు.

"తిష్టాదేవి విగ్రహమా...నేను ఎప్పుడూ వినలేదే?"

"గుడిలో పెట్టి పూజిస్తూ ఉండుంటే అందరికీ తెలిసేది! కానీ  12 వ శతాబ్ధమే ఊరు వదిలి వెళ్ళిపోయింది"

"మీరేం చెబుతున్నారో అర్ధం కావటం లేదు"

"మనం అమ్మవారిని, లక్ష్మీదేవిని, సరస్వతి దేవిని కొలుస్తున్నాం! కానీ ఆ రోజుల్లో....అంటే వెయ్యి సంవత్సరాలకు ముందు తిష్టాదేవే ఊరికి మహాలక్ష్మి. ఆవిడనే అందరూ కొలిచేవారు. ఈవిడకు పూజలు చేశేవారు, ప్రార్ధనలు చేశేవారు, కోరికలు కోరుకునే వారు. స్వచ్చమైన మనసుతో ఈవిడకు ఒక పద్దతిగా పూజలు చేయాలి…..అలా కాకుండా కాలుష్య మనసుతో  ఆమె దగ్గరకు వచ్చిన వారు ఆమె కోపానికి గురి అయ్యి నాశనమైపోతారు. ఆవిడ ఎలాంటి అవినీతినీ సహించదు"

"ఏమిటేమిటో చెబుతున్నారే...?"

"నేను ఎక్కడ్రా చెబుతున్నాను? నేను విన్నది చెప్పాను. ఈ తిష్టాదేవి విగ్రహం ఊరి సరిహద్దులో ఉండేది. గుడి ఉండేది కాదు. ఎందుకంటే తిష్టాదేవికి ఆరుబైట ఉండటమే ఇష్టమట"

"ఎందుకలా?"

"నాకెలా తెలుస్తుంది? కానీ, ఒక విషయం బాగా తెలుసు. ఈమెను ప్రార్ధన చేసే మనుష్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ...కొన్ని రోజులకు ఈమెను ప్రార్ధించేవారే కరువయ్యారు. ఒక పూజారి తప్ప. అంటే ఊరిలో అవినీతి పెరిగిపోయిందన్నమాట.

ఈమెను ప్రార్ధన చేయటం మానేసినప్పుడు ఊరే నాశనం అయ్యింది. కరువు, క్షామము, అనావృష్టి, దుర్భిక్షం. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు....ఏకంగా పదమూడు సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు వర్షమే కురవకపోతే ఏలా ఉంటుంది? పదమూడు సంవత్సరాల పూజరి ప్రార్ధనకు మెచ్చి ఆయనకు దర్శన మిచ్చి "నన్ను నిద్రా బంగిమలో ఉంచితే, అంటే నన్ను కొలవకపోతే నా కోపాగ్ని నుండి మానవులు తప్పించు కుంటారు" అని చెప్పిందట. పూజారి ఆమెను నిద్రా బంగిమలో ఉంచిన తరువాతే మళ్ళీ ఊరు మామూలు స్థితికి వచ్చింది. కానీ ఏమి ప్రయోజనం ఎటుచూసినా అవినీతి, మోసం, కుట్ర నేరాలూ పెరిగిపోయేయి. ఆవిడే గనుక ఉండుంటే మన ఊరే కాదు, మన దేశమే బాగుపడేది"

ఆ పెద్దాయన చెప్పింది విన్న అశోక వర్మ, శేషమాంబ నొరెళ్ళబెట్టారు.

పెద్దాయన చెప్పినదాంట్లో నమ్మలేని కొన్ని వార్తలు!
                                   ************************************
నందిగామ ప్రభుత్వ వైద్యశాల.

పరమేశ్వర్ గారి ప్రాణం ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది.

మీనాక్షి ప్రాణం ఊగిసలాడుతోంది.

హడావిడి పడుతూ వచ్చింది తులసి.

బంధువులు కూడా వచ్చి జేరేరు.

కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని కౌగలించుకుని ఏడ్చారు.

ఇంతవరకు దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది తులసి.

తులసి పుట్టిన దగ్గర నుండి బంధువులలొ కూడా ఎవరూ మరణించలేదు. అందుకని, దాని గురించో...దాని తాపం గురించో ఆమెకు కొంచం కూడా తెలియదు. 

తులసి, తల్లి-తండ్రులను విడిచి ఉండటం, ఆమె ఉద్యోగానికని హైదరాబాద్ వచ్చినప్పుడే. నిజానికి చాలా కష్టమైన రోజులవి. తల్లి-తండ్రుల ఎడబాటును కొన్ని రోజులకే తట్టుకోలేక మధ్యరాత్రులలో లేచి  కూర్చుని ఏడుస్తున్నప్పుడు, పక్క మంచంలోని రూం మేట్ తులసిని గమనించి ఓదార్చేది. 

ఆడవారు పుట్టింటిని విడిపోవు బాధను అలవాటు చేసుకోవాలి. పెళ్ళి బంధం వాళ్ళను పూర్తిగా విడగొడుతుంది. ఆ తరువాత తల్లి-తండ్రులే మూడో మనిషి. తన భర్త, పిల్లలు, ఇల్లు అని జీవించాల్సింది వాళ్ళ జీవితమైపోతుంది. "దీన్నే మార్చాలి" అనేది తులసి!

పరమేశ్వర్ గారు ఎప్పుడు పెళ్ళి మాటలు ఎత్తినా, 'నాన్నా...మిమ్మల్ని, అమ్మనీ నేను ఏరోజూ విడిచిపెట్టను. నన్ను పెళ్ళిచేసుకోవటానికి సమ్మతించేవారితో ఇదే చెబుతాను. ఒప్పుకుంటేనే పెళ్ళికి ఓకే చెబుతాను. లేకపోతే పెళ్ళే వద్దూ’ అని చెప్పేస్తుంది. పరమేశ్వర్ గారు నవ్వుతారు.

"అమ్మా తల్లీ! ఏళ్ళతరబిడిగా వస్తున్న ఆచారాన్ని...ఒకేరోజులో మార్చేయాలని అనుకుంటున్నావ్! నీ ప్రేమను నేను అర్ధం చేసుకోగలను. ఇవన్నీ కొన్ని రోజులేనమ్మా. నువ్వు సంతోషంగా నీ భర్తతో కాపురం చేస్తుంటే నువ్వు మాతో ఉండటంకంటే, భర్తతో అత్తగారింట్లో ఉండటమే మాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందమ్మా' అన్నారు.

"ఏమిటి నాన్నా...ఎన్నో విషయాలు కాలంతో పాటూ మారలేదా? నేను మార్చి చూపిస్తాను"

“ఎప్పుడూ మగపెళ్ళి వాళ్ళే ఆడపిల్లలను చూడటానికి పెళ్ళిచూపుల పేరుతో వెళ్ళాలా? ఏం మనమెందుకు పెళ్ళికొడుకును చూడటాని పెళ్ళిచూపుల పేరుతో వెళ్ళకూడదు?  అప్పుడు అబ్బాయిని చూసి నృత్యం తెలుసా...సంగీతం తెలుసా? అని అడగకూడదా!? మనం మార్చి చూపుదాం..." అంటుంది. పరమేశ్వర్ గారు కూతురు మాటలు వింటూ ఆనందిస్తాడు.

అలా కూతురి మాటలు వింటూ సంతోషించిన పరమేశ్వర్ గారి ముఖం 'బ్యాండేజ్' వేసి చుట్టేసి మార్చురీలో శవాలతో ఒక శవంగా పడుంది. అది చూసిన తులసికి పొత్తి కడుపులో కెలుకుతున్నట్టు అనిపించింది. మానవుల జీవితంలో ఇలాంటి  కష్టాల అధ్యాయము దాగున్నదనే విషయం ఆమెకు అప్పుడే తెలిసింది.

"అయ్యో...ఇదేం కర్మ?" 

కొన్ని గంటల ముందు వరకు 'గలగల’ మని మాట్లాడిన మనిషి, ఇప్పుడు ఇలా చుట్టిన పరుపులా పడున్నారే!" ఆమె కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి.

అప్పుడు...కట్లు వేసిన వొంటిమీద 'మార్చురీ రిపార్ట్' ను చూసి ఆయన పేరు రాసి, ఆయనకని ఒక 'నెంబర్’ ను వేసి, ఆ శరీరాన్ని ఒక మూలకు తోశాడు మార్చురీ స్వీపర్.

"అత్తయ్యా...నాన్నని వాడు చెత్తని తోసినట్లు తోస్తున్నాడు...అలా చేయొద్దని చెప్పత్తయ్యా"--తులసి గిలగిలలాడింది.

అది ఆ స్వీపర్ చెవిలో పడలేదు! బయటకు వచ్చి ఆమెను చూసి "మీ బాడీ పేరు ఏమిటి?" అని అతను అడగగానే "జీవితం ఇంత నిలకడలేనిదా?" అని అడగాలనుకున్నది.

"బాడీ కాదయ్యా...నాన్న! నా నాన్న పేరు పరమేశ్వర్!"

"ఓ...! పరమేశ్వర్ బాడీనా?"

ఆ స్వీపర్ 'బాడీ' అనే మాటను వదల్లేదు. తులసికి అది మొదటి దృశ్యం. అతని వరకు అది పదివేల శవాలలో ఒకటి.

అప్పుడు డాక్టర్ వచ్చాడు. తులసి దగ్గర కొన్ని కాగితాలలో సంతకాలు తీసుకున్నాడు. మధ్య మధ్యలో దీనికి, దానికి అని ఇష్టంవచ్చినట్లు డబ్బులు గుంజారు. పోలీసులు సర్టిఫికేట్ ఇవ్వాలట. శవాన్ని అంతవరకు వాళ్ళు అలాగే ఆపేయగలరట.

యాక్సిడెంట్ లో కొన్ని విషయాలు 'క్లియర్ అవలేదు...'. ఇది ఒక హత్యగా కూడా ఉండొచ్చు అని వాళ్ళు గనుక రాగాలు తీస్తే పెద్ద తలకాయ్ నొప్పి. ఇదంతాడబ్బు కోసమే!

చనిపోయిన తరువాత మనిషి దేనికీ ఉపయోగపడడని ఎవరు చెప్పారు? ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చనిపోయినవారికి సంఘంలో ఉన్న అంతస్తు, బంధు మిత్రులు....వీటిని చూసి ఆయన ‘రేటు’ ఇష్టమొచ్చినట్టు పెరుగుతుంది.

ఆంబ్యులాన్స్ లోకి శవాన్ని ఎక్కించే వాళ్ళ నుండి ‘డ్రైవర్’ వరకు డబ్బు గుంజేవారే. ఆ దృశ్యాలన్నీ ఇక్కడ కూడా చోటుచేసుకున్నాయి. 'తండ్రే పోయిన తరువాత...డబ్బు దేముంది పెద్ద డబ్బు?' అనే భావన తులసి మనసులో చేరింది.

డాక్టర్ కూడా అరచేతిని గోకున్నాడు.

"ఇన్స్యూరన్స్ పాలసీలు ఏమన్న వేశున్నారా?" అడిగాడు డాక్టర్.

"వేసున్నారు..."

"అలాగే యాక్సిడెంట్ సర్టిఫికేట్, మార్చురీ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ చాలా ముఖ్యం. జరిగింది వంద శాతం ప్రమాదమే నని మేము రాసిస్తేనే 'క్లైమ్ అమౌంట్' పూర్తిగా దొరుకుతుంది. ఇది హత్య గా ఉండే అవకాశం ఉన్నదని రాస్తే అంతే...."

డాక్టర్  చెప్పింది విన్న తరువాత కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది తులసికి.

తులసికి బాగా అర్ధమయ్యింది.

స్కూల్లో బాగా మార్కులు తెచ్చుకుని 'మెడికల్ సీటు’ తెచ్చుకుని డాక్టర్ అవడం తెలుసుకున్నతనికి మంచి మనిషిగా ఎలా ఉండాలో తెలియటం లేదే నని బాధ పడ్డది.

"మీ లంచం ఎంత సార్?" అని గబుక్కున అడిగేసింది. ఆయనకి చెంప మీద చెల్లుమని కొట్టినట్లు అనిపించింది.

"ల...లంచం...లేదు...లేదు...ఇదంతా ఫార్మాలిటీ అమ్మా. ఇక్కడ నువ్వు పనిచేసి చూడు. నీకు కష్టం తెలుస్తుంది. శపించబడ్డ ఉద్యోగం" అంటూ తను అడిగిన దాన్ని న్యాయ పరచడం మొదలుపెట్టాడు.

తులసి హ్యాండ్ బ్యాగులో నుండి రెండు వేల రూపాయలు తీసి ఆయన ముందు చాపింది. ఇచ్చేటప్పుడే..."దీనికోసం నేను నాలుగు రోజులు ఆఫీసులో కష్టపడాలి" అని చెప్పటం మరిచిపోలేదు.

ఏలాగో శరీరం వచ్చి చేరింది.

అందరూ వ్యాన్ ఎక్కి కూర్చున్నారు.

తులసిని ‘ఐ.సి.యు’ లో ఉన్న తల్లి జ్ఞాపకము వేదిస్తోంది.

"వెళ్ళి అమ్మను ఒకసారి చూసొస్తాను..." అని వ్యాను దిగి పరిగెత్తింది.

'ఐ.సి.యు!'

లోపల...ముక్కులో ట్యూబ్ పెట్టబడి, అపస్మారకంగా పడుకొనుంది. ఆమె దగ్గరగా నిలబడి ఉన్నాడు ఆ లావుపాటి వ్యక్తి సింహాద్రి.

తులసి రావటంతో "తల్లీ! నువ్వేనా మా ప్రొఫసర్ కూతురు?" ఆప్యాయంగా అడిగాడు సింహాద్రి.

"అవును...మీరు?"

"నేను ఎవరనేది తరువాత చెప్తాను. మొదట మీ అమ్మ పరిస్థితి ఏమిటో తెలుసుకో. తలలో మెదడు దగ్గర దెబ్బ. అందువల్ల ఇప్పుడు కోమా స్టేజిలో ఉన్నారు"

"అయ్యో..." తులసికి వీపు వెనుక భాగంలో ఎవరో కత్తితో పొడిచిన ఫీలింగ్.

"తల్లీ...మనసును దృడపరుచుకో! అన్నీ ఏప్పుడో చేసుకున్న పాపాలు. విధి ఎవరిని వదిలిపెట్టింది?"

"మీరు ఎవరు సార్?"

"చెప్తానమ్మా...నా పేరు సింహాద్రి. నా గురించి మీ అమ్మ...నీదగ్గర ఏమీ చెప్పలేదా?"

"లేదే...!"

"అరె...నిన్న కూడా నీతో మాట్లాడబోతున్నట్టు చెప్పారే"

"పరవలేదు...ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరు?"

"తల్లీ! నేను 'రియల్ ఎస్టేట్ బిజినస్ చేస్తున్న వ్యక్తిని. ఊర్లో మీకు సొంతంగా మూడెకరాల స్థలం ఉందిగా?"

"దానికేమిటి?"

"ఆ స్థలాన్ని నేనేనమ్మా కొనుకున్నాను"

"ఏమిటీ...మీరు కొనుక్కున్నారా?"

"అవునమ్మా...నా దగ్గర అగ్రీమెంటులో సంతకం పెట్టి, యాభై వేల రూపాయలు 'అడ్వాన్స్’   తీసుకుని నిన్ను చూడటానికి మీ అమ్మ, నాన్న బయలుదేరారు"

"దీన్ని నమ్మలేకపోతున్నాను! నాన్న గారు ఆ స్థలాన్ని అమ్మరు. అది అమ్మితే పిత్రు దేవతలకు ద్రొహం చేసినట్లు అవుతుందని చెబుతూ ఉండేవారు"

"నా దగ్గర కూడా అలాగే చెప్పారు. కానీ మీ అమ్మే బలవంతంచేసి ఒప్పించింది”

"నిజంగానా?" 

"తల్లీ....ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడే టైము లేదు. నీ జీవితంలో నువ్వు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నావు. మొదట నాన్న గారి అంత్యక్రియలు పూర్తి చేద్దాం. తరువాత మిగిలిన విషయాలు గురించి మాట్లాడుకుందాం. రామ్మా..." అంటూ తులసిని తీసుకుని బయట ఉన్న వ్యాన్ దగ్గరకు వెళ్లారు.

తులసికి అంతా అయోమయంగానూ...గజిబిజిగానూ ఉన్నది!
                ***************************************************************************
అశోక వర్మ- శేషమాంబల తో ఆ తొంబై ఏళ్ళ వృద్దుడు, తిష్టాదేవి విగ్రహాన్ని చూస్తూ, ఆ విగ్రహం గురించి తనకు తెలిసిన మరికొన్ని విషయాలను  చెప్పటం మొదలుపెట్టాడు.

ఎవరో వృద్దుడు వచ్చినట్లు గ్రామ ప్రజలకు తెలియటంతో అక్కడ చిన్న గుంపు గుమికూడింది.
 
"నాకు బాగా జ్ఞాపకము ఉంది...అప్పుడు నాకు ఏడు, ఎనిమిది ఏళ్ళు ఉంటాయి. ఈ విగ్రహం అప్పుడు కూడా భూమి క్రిందే ఉండేది. అప్పుడు ఈ ఇల్లు సోమయాజులు అనే ఆయనకు సొంతమైనది. ఇదేలాగానే ఏదో ఇంటి మరమత్తులకొసం భూమిని తవ్వుతుంటే విగ్రహం...కంట్లో పడింది.  దేవుని విగ్రహాన్ని భూమి క్రింద ఎవరో పాతి పెట్టారు...ఎందుకో తెలియటంలేదూ అంటూ ఊరు ఊరంతా గోల గోలగా మాట్లాడుకున్నారు.

అప్పుడు కూడా ఈ విగ్రహం భూమి క్రింద పడుకోబెట్ట బడే ఉన్నది.ఆ తరువాత పడుకోబెట్టున్న ఈ విగ్రహాన్ని నిలబెట్టి ప్రతిష్టించారు. కానీ సక్రమంగా నియమ నిష్టలతో విగ్రహ ప్రతిష్ట, పూజలూ జరగలేదు. ఆరోజు మొదలైంది ఊరి కష్టాలు... సంవత్సరాలు గడుస్తున్నా కష్టాలు తీరలేదు. వర్షాలు లేవు. కొలనులో కూడా నీరు ఎండిపోయింది. ప్రజలలో సగం మంది ఆకలి చావుకు బలైపోయారు. సోమయాజులు గారి కుటుంబంలోని వారు  కలరా వ్యాధి సోకి చచ్చిపోయారు. దానికి ముందు వరకు ఏప్పుడూ పచ్చగా ఉన్న విశాలపురం ఏండిపోయిన ఎడారిలా అయిపోయింది.

ఈ ఊర్లో బ్రతికి బట్టకట్టిన కొంతమంది ఇల్లు,వాకిలి, పొలాలను అతి తక్కువ ధరకు అమ్ముకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు. అలా ఊరు వదిలి వెళ్ళిన వాళ్ళల్లో మా కుటుంబం కూడా ఉన్నది. నేను నా యాభైయ్యవ ఏట మళ్ళీ తిరిగి ఈ ఊరికి వచ్చాను. గ్రామంలోని అందరూ కొత్తవారే. ఎవరికీ ఈ విగ్రహం గురించి ఏమీ తెలియలేదు. నేను వెంటనే తిరిగి వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు ఊరిని చూడటానికీ, విగ్రహం గురించి తెలుసుకోవటానికీ ఈ ఊరు వస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు కూడా వచ్చాను. ఈ సారి విగ్రహాన్నే చూశాను"

ఆ వయసైన వృద్దుడి నోటి నుండి కాలంతోపాటూ కనుమరుగైన ఎన్నో రహస్యాలు బయటకు వచ్చినై.

అక్కడ గుమి కూడిన జనమంతా నొరెళ్ళబెట్టారు.

"సరే...ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఏం చేద్దాం?" అడిగాడు అశోక వర్మ.

"నీ స్థలంలో దొరికింది. ఏంచేయాలనేది నువ్వే చెప్పాలి"

"నా దగ్గరుండటం నాకు ఇష్టం లేదు! ఈ విగ్రహాన్ని బయట పెట్టేసి ఇక్కడ అమ్మవారి గుడి కట్టించుకుంటాను”

"నీ ఇష్టం" చెప్పాడు వృద్దుడు.

విగ్రహాన్ని తీసి బయట నిలబెట్టారు.

ఆ సమయంలో ఆకాశం మబ్బులతో నిండి ఉన్నది. విగ్రహాన్ని నిలబెట్టిన అరగంట తరువాత అన్ని మబ్బులూ తొలగిపోయి.....'చుర్రు’ మని ఎండ పడింది.

అక్కడున్న అందరూ ఆశ్చర్య పోయారు.

"చూసారా ఈ విగ్రహం లేచి కూర్చున్న వెంటనే తన పని చూపించింది. రాబోయిన వర్షం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మొదట ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెట్టి రండి..." ఆ ఉరి పెద్ద చెప్పాడు.

ఆ తరువాత ఒక లాగుడు బండీలో ఆ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊరి బయటకు తీసుకు వెళ్ళారు.
 అక్కడికి తీసుకువెళ్ళి చెత్తను పోసినట్లు ఆ విగ్రహాన్ని తొసేసి బండి వాడు వెనుతిరిగేడు. ఆ మరు క్షణం...ఆకాశం తిరిగి మబ్బులతో నిండి వాతావరణాన్నే మార్చేసింది. వర్షం కుండపోతగా కురిసింది.
                                                  ************************
శ్మశానం!

ప్రభుత్వ ఆసుపత్రి నుండి 'పెయింటు’ పోయిన ఒక 'స్టెచర్’ లో తీసుకురాబడ్డ పరమేశ్వర్ గారి శరీరం, శ్మశానంలోని ఒక మూల పెట్టేసి, మార్చురీ వేను వాళ్ళు ఓక ఐదువందల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు.

తులసికి ఒక పెద్దనాన్న ఉన్నారు. ఆయన కొడుకు రమేష్. తిన్నగా శ్మశానానికే వచ్చారు. అతనే పరమేశ్వర్ గారికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరపాలని బందువులందరూ చెప్పారు.

"రమేష్...నువ్వే కొడుకు వరస అవుతావు! మీ చిన్నాన్నకు జరపవలసిన అంతిమ కార్యాలన్నీ ముందుండి జరుపబ్బాయ్" అంటూ ప్యాంట్-షర్టులో ఉన్న అతన్ని పంచ కట్టులోకి మార్చారు.

గుండు చేయించుకుని కార్యాలలోకి దిగాడు రమేష్.

పరమేశ్వర్ గారి శరీరంలో ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. మిగిలిన భాగాలు కట్లలో అనిగి ఉన్నాయి. ఆ ముఖం పైన కొన్ని ఈగలు...తులసికి వాటిమీద కోపం వచ్చి, దగ్గరగా కూర్చొని వాటిని తరుముతోంది. అలాగే ముఖాన్ని తీవ్రంగా చూసి వెక్కి వెక్కి ఏడ్చింది.

అది చూస్తున్న చుట్టూ ఉన్నవారికి జాలేసింది.

ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు మరణించ వలసిందే నని అందరికీ తెలిసున్నా...ఎలాగైనా సరే జీవించటానికే ఇష్టపడతాం. ఆ జీవితం ముగిసి పోయేటప్పుడు అది ప్రకృతి న్యాయం అని ఆలొచించకుండా, ఏదో పొగొట్టుకోకూడనిది పోగొట్టుకుంటున్నామని విలపిస్తాం.

శ్మాశానంలో కొన్ని మేకలు గడ్డి మేస్తున్నాయి.

శవాలకు వేయబడ్డ పూలమాలలలో ఉన్న పువ్వులను తిని అవి తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పోరాడుతున్నట్లు ఉన్నాయి. ఒకే చోట ఎన్ని రకాల దృశ్యాలు!

ఆ సింహాద్రి కూడా అక్కడకు వచ్చాడు.

పడవలాంటి ఆయన కారు శ్మాశానం బయట నిలబడుంది. ఆయన్ను చూసిన కోటేశ్వర రావుకి , క్రిష్ణా రావుకు  ఆశ్చర్యం కలిగింది.

"ఏమిటండి...ఏమిటో చాలా కావలసిన మనిషిలాగా శ్మాశానానికే వచ్చారు?" అని క్రిష్ణారావు అతని చెవిలో గొణిగాడు.

సింహాద్రి ముఖం అదొలా మారింది.

"అవును, ప్రొఫసర్ చనిపోయారు కదా! ఆ స్థలాన్ని కొనగలవని ఏ నమ్మకంతో వచ్చావు?" అంటూ కోటేశ్వరరావు మరోవైపు నుండి గొణిగాడు.

సింహాద్రి వారిద్దరినీ తీవ్రంగా చూశాడు.  వాళ్ళిదరికీ సమాధానం చెప్పకుండా...అంత్యక్రియ కార్యాలను గమనించడం మొదలుపెట్టాడు.

తులసి ఏడుస్తూనే ఉన్నది. సింహాద్రి విషయం తులసికి చెప్పాలని మెల్లగా ఆమె పక్కకు జరిగాడానికి ప్రయత్నం చేశాడు కోటేశ్వరరావు.

అది చూసిన సింహాద్రి కి ఏదో అర్ధం అయ్యింది. వెంటనే క్రిష్ణారావును, కోటేశ్వరరావును పక్కకు పిలిచి, తనతో రమ్మని చెప్పి, వాళ్ళిదరితో కలిసి ఒక పక్కగా వెళ్ళి నిలబడ్డాడు సింహాద్రి. పక్కన ఒక సమాధి. దానిపైన చిన్న గడ్డంతో ఒక మేక. సమాధిలో ఇరవై సంవత్సరాలకు ముందు చనిపోయిన లక్ష్మీ బాయ్ ఉన్నదని ఆమె పేరు ఆ సమాధి పలకపై రాసుంది.

కోటేశ్వరరావు, సింహాద్రి ను చూసి..."కూర్చుని మాట్లాడుకుందామా?" అని అడిగాడు. సమాధి పైనే కూర్చున్నాడు సింహాద్రి.

"పరమేశ్వర్ గారు స్థలాన్ని నాకు అమ్మడానికి అంగీకరించారు. నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని తిరిగి వెల్తుండగా ప్రమాదం జరిగింది" అని మొదలెట్టాడు సింహాద్రి.

"తరువాత?"...అంటూ కోటేశ్వరరావు అనడం వెక్కిరిస్తున్నట్టు అనిపించింది సింహాద్రికి.

"ఏమిటి తరువాత...నేనేమన్నా కథ చెబుతున్నానా?" కోపంగా అడిగాడు.

"కథ కాబట్టే ఆనందిస్తున్నాము "

"అంటే నేను చెప్పేది మీరు నమ్మటం లేదా?"

"మిమ్మల్ని మెడ పట్టుకుని బయటకు తోసి ఇంట్లో నుండి తరిమింది మేము చూశామే...?"

"అది నిజమే నండి! కానీ, తరువాత ఆయన భార్య మీనాక్షి ఆయనకు ఎత్తి చూపిన తరువాత ఆయన కన్విన్స్ అయ్యాడు"

"అంటే స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాను అంటున్నావు..."

"అవును...'రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మిగిలిన డబ్బు ఇచ్చి సెటిల్ చేస్తానుగా"

"ఇప్పుడాయన చనిపోయారే...ఏం చేస్తారు?"

"భార్య ఉన్నది! కూతురు కూడా ఉన్నదిగా"

“భార్య కోమాలో ఉన్నది...ఆయన కూతురు వాళ్ళ నాన్న కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఆ అమాయి వచ్చి...స్థలాన్ని రిజిస్టర్ చేసిస్తుందని కలలు కనకండి”

"రిజిస్టర్ చేసి ఇస్తుంది! ఎందుకంటే పరమేశ్వర్ గారు 'తనకు పూర్తి అంగీకారం' అని స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు"

"సంతకమా...దాన్ని ఎవరైనా పెట్టొచ్చు. రేఖలు ఉన్నాయా. అంటే వేలి ముద్రలు?"

"సందేహంగా ఉన్నదా...? ఆ డాక్యూమెంట్ కూడా కారులోనూ ఉన్నది. చూపించనా?"

"ఏది... చూపించు"

కోటేశ్వరరావు కొంచం కూడా నమ్మకం లేకుండా చూడటంతో సింహాద్రి కారు దగ్గరకు బయలుదేరాడు.

అంతలో ఇద్దరి మధ్యా గుసగుసలు.

"కోటీ...వీడు పెద్ద అబద్దాల కొరుగా ఉన్నాడే!"

"అంతే కాదు క్రిష్ణ...ఆ స్థలాన్ని వదిలేటట్టు లేడు! నాకెందుకో వీడిమీద అనుమానంగా ఉన్నది. పరమేశ్వర్ గారి మీద లారీ ఎక్కించి ఇతనే చంపించుంటాడు అనిపిస్తోంది"

"నాకూ అలాగే అనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శవం ఉండటం... ఇతను అక్కడికి రావటం"

"అలా ఏముంది ఆ స్తలంలో? మనకు తెలిసి అది ఒక శ్మశానం. తవ్వే ప్రతిచోట ఎముకలే ఉంటాయి. నా స్థలం పక్కన శ్మశానమా? అంటూ సుబ్రమణ్య శర్మగారు 'కోర్టు కేసు వేశారు. చివరకి ప్రభుత్వం ఆ స్థలాన్ని ఆ ఊరి శ్మాశానం అని చెప్పి చాటింపు వేసింది. కానీ, అది మా వంశపారంపర్య  ఇలవేల్పు దేవత స్థలం అని పరమేశ్వర్ గారి తాతయ్య రామదాసు గారు కోర్టులో నిరూపించి స్థలాన్ని చెజిక్కించుకున్నారు. తరువాత ఆయన కొడుకు అశోక వర్మ గారు కూడా ఆ స్థలాన్ని ఖాలీగా ఉంచుకుని చూట్టూ కంచెవేశారు. అందులో పిచ్చి చెట్లూ, గడ్డీ పెరిగింది. నిన్న పరమేశ్వర్ గారు ఆ స్థలంలో కాంప్లెక్స్ కడతానన్నారు...ఇదేకాదా ఆ స్థలానికున్న చరిత్ర"

"రానివ్వు చూద్దాం...ఈ మనిషి ఏం చేస్తాడో తెలుసుకుందాం"--కారు తలుపు మూసేసి తిరిగి వస్తున్న సింహాద్రిని చూస్తూ చెప్పాడు క్రిష్ణారావు.

శ్మశానంలో పరమేశ్వర్ గారి అంత్యక్రియల కార్యకలాపాలు ఒక పక్క జరుగుతున్నాయ్. శవాన్ని చితి మీదకు ఎక్కించారు.

సింహాద్రి, కోటేశ్వరరావు దగ్గరకు వచ్చి తన దగ్గరున్న 'అగ్రీమెంట్ కాపీ' ని చూపించాడు. అందులో ముందు రోజు తారీఖు వేసి, ఆ మూడు ఎకరాల స్థలాన్ని, ఎకరానికి ఐదు లక్షల చొప్పున మొత్తం పదిహేను లక్షలకు అమ్మటానికి అంగీకరించినట్లు, అడ్వాన్స్ గా యాబై వేల రూపాయలు పుచ్చుకున్నట్టు  స్పష్టంగా రాసి పరమేశ్వర్ గారు సంతకం చేసున్నారు. సంతకం క్రింద వెలిముద్ర కూడా ఉన్నది.

ఇద్దరికీ గుండె గుభేలు మన్నది.

"ఓయ్...నువ్వు పెద్ద మాయగాడివయ్యా! కోటి రూపాయల స్థలానికి పదిహేను లక్షలా...ఎవరి దగ్గర నాటకాలాడుతున్నావు"

“అది నామనసులో అనుకున్న రేటు. కానీ పరమేశ్వర్ గారు ఐదు లక్షలకే వొప్పుకున్నారు"

"ఏమిటయ్యా.... ఆయన ప్రాణాలతో లేరనే ధైర్యంతో మా దగ్గర కధ చెబుతున్నావా?"

"ఇలా చూడండి...మీ దగ్గర నాకు మాటలు అనవసరం? ఈ స్థలానికీ, మీకూ ఏమిటి సంబంధం? ఏదో ఈ ఊరి పెద్దలు కదా...నేను అడ్రెస్సు అడిగినప్పుడు దారి చూపించేరే నని మీ దగ్గర ఇవన్నీ చూపించాను. మీరేమిటి ఈ స్థలం మీదే అన్నట్లు మాట్లాడుతున్నారు..." --సింహాద్రి కూడా గట్టిగానే మాట్లాడాడు.

"చూస్తామయ్యా...చూస్తాం! నువ్వు ఆ స్థలం ఎలా కొంటావో చూస్తాం. ఆ అమ్మాయి తులసి దగ్గర...జరిగినవన్నీ చెబుతాము. ప్రొఫసర్ దగ్గర చివరగా నేను కూడా 'ఆ స్థలం అమ్మి పారేయకూడదా?' అని చెప్పినప్పుడు కుక్క లాగా నన్ను కరవటానికి వచ్చారు. ఇవన్నీ చెబుతాను"

కోటేశ్వరరావు వేలు చూపి మాట్లాడుతుంటే 'నువ్వో...నేనో?' తేల్చుకుందాం అనే విధంగా ఉన్నది.

మరు క్షణమే సింహాద్రి నవ్వడం మొదలుపెట్టాడు.

"ఏమిటయ్యా నవ్వుతున్నావ్...మమ్మల్ని చూస్తుంటే చచ్చు వెధవలం లాగా కనబడుతున్నామా?"

"చచ...అలంటిదేమీ లేదు. మీ ధైర్యం నాకు బాగా నచ్చింది. నాకు ధైర్యమే పెద్ద ఆస్తి"

"ఇప్పుడు నువ్వు అసలు విషయానికి రా. ఆ డాక్యూమెంటు...వేలి ముద్ర...సంతకం ఇవన్నీ సెట్టప్పే కదా?"

"అవును...నాకు ఆ స్థలం కావాలి...నేను చెప్పినట్లు ఒక కోటి రూపాయలు ఇవ్వటానికి నేను ఇప్పుడు కూడా రెడీ. కానీ, ఈ 'అగ్రీమెంట్' ప్రకారం పదిహేను లక్షలను అమ్మాయి చేతిలో పెట్టేసి రిజిస్ట్రేషన్ ముగించాలి. మిగిలిన ఎనబై ఐదు లక్షలను మీ ఇద్దరికీ సరి సగం పంచేస్తాను. కానీ, నాతో పాటూ చివరిదాకా ఉండి...ఆ  అమ్మాయితోనూ మాట్లాడి మంచిగా ముగించాలి. సమ్మతమేనా...?"

సింహాద్రి అంత వేగంగా ఒక్కసారిగా డబ్బుతో కొడతాడని వాళ్ళిద్దరూ కొంచం కూడా ఎదురుచూడలేదు.

ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు.

"స్థలానికి పదిహేను లక్షలు. మాకు ఎనబై ఐదు లక్షలా? ఏమయ్యా...మేము వెర్రిబాగులోళ్ళమనుకున్నావా?"

"లేదు లేదు! కావాలంటే ఆ అమ్మాయికి ఎకరానికి పది లక్షల చొప్పున ముప్పై లక్షలు ఇచ్చేసి...మీకు డెబ్బై లక్షలు ఇవ్వనా?"

"ఏయ్...ఏమిటి నువ్వు, 'ఎక్స్ప్రెస్స్’ వేగంతో వేలం వేస్తున్నావు? మేము తెలియక అడుగుతున్నాం...అంత డబ్బు పెట్టి కొనడానికి ఆ స్థలంలో ఏముందయ్యా?"

"ఆ విషయం మీకెందుకు...? అతి త్వరలో ఈ ఊరే మారబోతోంది! పెద్ద పెద్ద ఐటి కంపెనీలు రాబోతున్నాయి. అందులో విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఊరిలోనే ఉండి ఆకాశంలో తిరుగుతున్న 'ఏలియన్ శాట్' అనే అంతరిక్ష నౌకను పట్టుకోవటం చాలా సులభమట. దీని వెనుక ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి..."

"ఓ...  కథ అలా పోతోందా? ఇప్పుడు  కథ అర్ధమమవుతోంది!"

కోటేశ్వరరావు, క్రిష్ణారావు కళ్ళు పెద్దవి చేసుకుని ఒకర్నొకరు చూసుకుంటూ...

"కోటిగా...అయితే నా పెరుమీదున్న ముప్పై సెంట్ల స్థలానికి కూడా మంచి రేటు వస్తుందని చెప్పు..." ఉత్సాహంగా చెప్పాడు క్రిష్ణారావు.

"ఓ...మీదగ్గర ముప్పై సెంట్లు ఉన్నదా? బలే! ఇంకో ముప్పై ఎకరాలున్నా నేను కొనుక్కుంటాను. మంచి రేటు కూడా ఇస్తాను. ఈ క్షణం నుండి మనమంతా ఒకటే...ఏమంటారు?"

సింహాద్రి షేక్ హాండ్ ఇవ్వటానికి చేయి చాచాడు.

కోటేశ్వరరావు, క్రిష్ణారావు మార్చి మార్చి ఒకరినొకరు చూసుకుని సింహాద్రి వైపు తిరిగారు. కానీ షేక్ హాండ్ ఇవ్వలేదు.

"ఏమిటి...అనుమానంగా ఉన్నదా?"

"ఉండదా...నువ్వేమన్నా గాంధీ గారికి మనవడివా? లేక సత్య హరిస్చంద్రుడి ఇంటి వెనుక పుట్టావా?"

"వాళ్ళందరినీ వదలండి. నేను మోసగాడినే. కానీ నా మాట స్వచ్చం. మనం కలిసుంటే ఈ ఊరే మన చేతిలోకి వస్తుంది. లేకపోతే నాకెలాంటి నష్టమూ లేదు. మీకు ఇస్తానన్న డబ్బును మన జీవానంద శ్వామికి డొనేషన్ గా ఇస్తే చాలు...ఆయనే నా పనులను పూర్తి చేసి ఇస్తారు...?"

--సింహాద్రి శ్వామీజి పేరు చెప్పగానే...ఇద్దరికీ షాక్ కొట్టినట్లు అయ్యింది. వాళ్ళిద్దరూ వేరుగా వెళ్ళి గుసగుసలు మాట్లాడుకుని, తిరిగొచ్చి 'సరే' నంటూ బొటను వేలు చూపించి నవ్వారు.

అదే సమయంలో చితిపైనున్న పరమేశ్వర్ గారి తలకు తలకొరివి పెడుతున్నాడు రమేష్.
తులసి "ఓ..." అంటూ గట్టిగా ఏడవటం...ఆ శబ్ధం శ్మశానం మొత్తం వినిపించింది.

continued in Part-4

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి