30, నవంబర్ 2019, శనివారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-10



                                       ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                          (PART-10)



గందరగోళంలో పడిన ప్రతిమను ఆలొచనలు చుట్టుముట్టాయి.

మరణమే అన్ని సమస్యలకూ ముగింపు తెస్తుంది అనుకున్న ప్రతిమకు చచ్చిపోవాలనుకున్న ఆలొచనకూడా వచ్చి అది ముగింపు కాదు అని అనుకోవడంతో ఆ ఆలొచన కూడా మాయమైపోయింది. కిరణ్ చెప్పినట్లు వరుణ్ కి కూడా ద్రొహం చేస్తోందా ఆమె? అదే నిజమైతే అది పాపం కదా? అతిపెద్ద పాపం కాదా? కిరణ్ చెప్పినట్లు వరుణ్ దగ్గర అన్నీ చెప్పేస్తే? అన్నిటినీ వినేసి ‘అమ్మను కాదని నేను ఏమీ చేయలేను’...అని అతను చెప్పేస్తే?...అలాగైతే నేనేం చేయాలి?

కిరణ్ రాసిన ఒక్కొక్క అక్షరపంక్తి నిజమే. అత్తయ్య కోసం వరుణ్ తన మెడలో కట్టే తాలిని భరించవచ్చు. కానీ, మంచంలో అతన్ని భరించటం నిజంగానే ప్రతిమ వల్ల కాదు!

కిరణ్ మనసులో కాపురం చేసిన తరువాత, ఇంకొకడితో మంచం పంచుకోవటం సాధ్యం కాదు.

'కారణ మేమిటో?' అని వరుణ్ అడిగితే...ఏం సమాధానం చెబుతుంది? 'నా మనసులో నీ తమ్ముడున్నాడు...'అనా? ఇది విని తల్లడిల్లిపోడా అతను!

ఆ అమాయకుడిని గాయపరచటానికీ...అతని జీవితాన్ని నాశనం చేయటానికి ఈమెకు హక్కు ఉందా? అత్తయ్యకు కృతజ్ఞతను చూపుతున్నట్టు అనుకుని, ఇద్దరు మగవాళ్ళకు ద్రోహం చేయటం మహా పాపం కాదా?'

ప్రతిమ తల్లడిల్లిపోయింది.

రాత్రంతా ఆలొచించి ఒక నిర్ణయానికి వచ్చింది...'వరుణ్ తో అన్ని విషయాలూ చెప్పేయాలి!' అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. పెళ్ళి తరువాత చెప్పటం కంటే ...పెళ్ళికి ముందు, ఇప్పుడే చెప్పటం ఉత్తమం అని అనిపించింది.

వరుణ్ తో మాట్లాడే సంధర్భం కోసం వెతికింది. అతన్ని ఒంటరిగా పట్టుకోవడమే పెద్ద చిక్కుగా ఉన్నది. షాపులో పనివాళ్ళు ఉంటారు. ఇంట్లో అత్తయ్య. అదే సమయం అతను ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. పెళ్ళి అనే మాట అతనిలో కొంచం కూడా మార్పు తీసుకురాలేదు. ఎప్పుడూ లాగానే వెళ్ళటం, రావటం చేస్తున్నాడు. అతని ముఖ భావల నుండి కూడా ఏమీ తెలియటం లేదు.

అతని మనసులో ఏమున్నదో? అమ్మకోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా? లేకపోతే నిజంగానే ప్రతిమను సంతోషంగా పెళ్ళి చేసుకోబోతాడా? ఏమీ అర్ధం కావటంలేదు! ఏది ఏమైనా ప్రతిమ మనసులోని నిర్ణయం గొప్పది. అతనితో చెప్పే కావాలి. తుఫానే ఏర్పడినా పరవాలేదు. లేక, ఆమె వలన ఒక సుఖమూ ఉండబోదూ అని తెలుసుకున్న తరువాత కూడా అమ్మకోసం ఆమెతో పెళ్ళికి ఒప్పుకుంటే అతని జీవితం నాశనం అవటానికి అతనే కారణమవుతాడు కానీ ప్రతిమ కారణం అవదు.

"ప్రతిమా"

పిలుస్తున్న గొంతు వినబడటంతో...కిందకు దిగి వచ్చింది.

అత్తయ మొహంలో ఏదో గందరగోళం.

"ఏమిటి అత్తయ్యా?"

"నాకు ఒక ఉపకారం చేస్తావా?"

"చెప్పండి..."

"పెళ్ళి చూపులకు వెళ్ళామే, వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది.'ఎప్పుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుందాము?' అని అడుగుతున్నారు. నా ఆరొగ్యం బాగాలేదని ఒకసారి సాకు చెప్పి తప్పించుకున్నాము. ఇకమీదట తప్పించుకోలేము. మన ఇంట్లో జరిగిన తంతు వాళ్ళకు తెలియక్కర్లేదు. అదే సమయం ఈ సంబంధమూ మనం విడిచి పెట్ట కూడదు. నువ్వు వాళ్ళింటికి వెళ్ళి...ఆ అమ్మాయితో మాట్లాడు. కిరణ్ అర్జంటుగా మళ్ళీ అమెరికా వెళ్ళాడని చెప్పు.

'ఆరు నెలలు ఆగగలరా?' అని అడుగు. ఈ ఇంట్లో నా తరువాతి స్థానం నీదే కదా! ఆ బాధ్యతను ఇప్పుడే తీసుకో. కిరణ్ దగ్గర కూడా మాట్లాడు. అతని మనసును మార్చి, ఈ పెళ్ళికి వాడ్ని ఒప్పుకునేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. నాకోసం ఇది చెయ్యి! నా కంటే నువ్వు ఈ సమస్యను మంచి విధంగా పరిష్కరించగలవనే నమ్మకం నాకు ఉన్నది"

అత్తగారు చెబుతుంటే, శిలలాగా స్థంభించిపోయింది కోడలు ప్రతిమ.

"చూస్తాను అత్తయ్యా...ప్రయత్నిస్తాను..." సన్నని గొంతుకతో అత్తయ్యకు చెప్పి మేడపైకి వచ్చింది. ఒకటి మాత్రం ప్రతిమకు బాగా అర్ధమయ్యింది. ‘ఏదో ఒక కారణంతోనే అత్తయ్య కాయలను జరుపుతోంది. ఆమె సాధారణమైన మనిషి కాదు. ఆమెకు ఏదో ఒక సందేహం ఏర్పడింది. లేకపోతే కిరణ్ తో నా ప్రేమ గురించి ఖచ్చితంగానే తెలిసుంటుంది! ఆ ప్రేమ ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదని, కిరణ్ న్ని నేను పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేదని బాగానే అర్ధమయ్యింది’

'ఏందుకు ఇష్టం లేదు?' అనేది అత్తయ్యకు మాత్రమే తెలుసు. ఆమె మనసులో వేసుకున్న లాభ-నష్ట లెక్కలు ఆమెకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అత్తయ్యను ఏమీ అడగలేము. ప్రతిమకు ఆమె అత్తయ్య అయితే...కిరణ్ కి ఆమె అమ్మ. తల్లి ప్రేమ ముందు అత్తయ్య ప్రేమ నిలబడ లేదు. ఆమె వరకు కిరణ్ ఒక వెల కట్టలేని రత్నం. అది కొనాలనుకునేవారు గొప్ప అంతస్తు గలవారై ఉండాలనేది ఆమె ఆలొచనేమో?

తల్లి-తండ్రి లేక తన దగ్గర ఏమీలేని దానిగా పెరిగిన ఒకత్తికి ఎందుకు వెలకట్టలేని రత్నం? అనుకునే అత్తయ్య ఆ రత్నాన్ని బయట అమ్మటానికి ప్రయత్నిస్తోంది. అదే సమయం ఆమె లెక్క ప్రకారం ఆమెకు కొంచం మందంగా కనిపించే పెద్ద కొడుకు వరుణ్ కి బయటి నుండి సంబంధాలు రావటం కష్టం అనేది ఆమే నిర్ణయించుకుని, అనాధ అనే అంతస్తులో ఉన్న ప్రతిమను కట్టబెడితే, పెద్ద కొడుకుకు ప్రతిమను పెళ్ళి చేసిచ్చి మేనకోడలును కోడలుగా చేసుకున్నదే అని అందరి దగ్గరా పెద్ద మనసును నిరూపించుకునే అవకాశం కూడా దొరుకుతుంది.

ఒకే రాయితో రెండు కాయలు. ఎంతో చాక చక్యంతో తన పేరుకు ఎక్కడా కొంచం కూడా కళంకం రాకుండా, అనుకున్న కార్యాలను సాధించుకోగలిగిన ఆమె తెలివితేటలు ఆశ్చర్యపరుస్తుంది. వీటిని చూసి ఆమెను చెడ్డ మనిషిగా చిత్రించుకోవచ్చా? అలా చెడ్డ మనిషిగా ఉంటే వరుణ్ కంటే తెలివితక్కువ తనం కలిగిన ఒకడికి ప్రతిమను కట్టబెట్టుంటుంది. అలా కాదే, పెంచిన ప్రేమకోసం ప్రతిమను ఆ ఇంటికి మహారాణిని చేస్తోందే! ఈ విషయానికే అత్తయ్యను పొగడవచ్చు.

'ఏం చేయను?' అని ఆలొచించింది ప్రతిమ. ‘ఆ పెళ్ళి కూతురు ఇంటికి వెల్దామా...వద్దా? ఈ పెళ్ళికి ఒప్పుకోమని కిరణ్ ని ఒప్పించగలనా? నేను చెబితే అతను వింటాడా? ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకోడా? తనకు ఏమి తెలియకనే అత్తయ్య ఇలాంటి భాధ్యత అప్పగించిందా? లేకపోతే అన్నీ తెలిసుకునే నన్ను పంపించి సమస్యను తీర్చుకుందామనుకుంటోందా? ఏం చేయబోతాను నేను?’

ఎలాంటీ నిర్ణయానికీ రాలేక స్థానువులా నిలబడిపోయింది ప్రతిమ.

***************************************************************************************************                                      ఇంకా ఉంది.....Continued in: PART-11

28, నవంబర్ 2019, గురువారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-9



                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                              (PART-9)


ఇంట్లో ఎవరూలేని సమయంలో కంప్యూటర్ ముందు కూర్చుంది ప్రతిమ.

“ఈ ఉత్తరం నీకు దిగ్భ్రాంతి, విస్మయము కలిగించవచ్చు కిరణ్. నామీద విరక్తి కూడా కలుగజేయవచ్చు. అందుకని విషయాన్ని నీకు తెలియ పరచకుండా దాచనూలేను. ఎలాగైనా చెప్పే తీరాలి. ఇక్కడ చాలా విషయాలు జరిగినై. అత్తయ్యకు 'హార్ట్ అటాక్’ వచ్చింది. వెంటనే 'బై పాస్’ సర్జరీ చేయటంతో ఆవిడ మరణ కోరలను తప్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా నీమీద కోపమూ,విరక్తి తగ్గలేదు. ఆమె చెప్పిందే వేద వాక్కుగా పాఠించే అలవాటున్న ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా ఒక ఎదిరింపు గొంతు వినబడిన బాధే ఆమె గుండె తట్టుకోలేక ‘హార్ట్ అటాక్’ కు కారణమయ్యింది అని అనుకుంటున్నారు.

ఆ పరిస్థితుల్లో ఆమెను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ముఖ్యంగా నాకు! కారణం, నా తల్లి-తండ్రులు చనిపోయి నేను అనాధగా నిలబడ్డప్పుడు, నా మీద అనురాగము చూపి తనతో పాటూ తీసుకు వచ్చి, మిమ్మల్ని పెంచినట్లు నన్నూ పెంచటమే. అలాంటి ఆవిడకి నేను కృతజ్ఞత చూపవలసిన భాద్యత నాకుంది. అలా చేయకపోతే అత్తయ్యకు ద్రొహం చేసిన దానిని అవుతాను. అలా ద్రోహం చేసి ప్రేమలో గెలవాలా....లేక ప్రేమకు ద్రోహం చేసి అత్తయ్య ప్రాణం కాపాడనా? అనే పరిస్థితిలో నేనొక నిర్ణయానికి వచ్చాను.

మరణంతో పాటూ నన్నూ కూడా జయించింది అత్తయ్య. ఇంకొకరి ఆకలికి మనం తినలేము. ఇంకొకరి మురికి పోవటానికి మనం స్నానం చేయలేమనేది నిజమే! కానీ, మరొకరిని సంతోషపెట్టటం మన వల్ల అవుతుంది కాబట్టి అలా చేయటం కరెక్టే కదా? మనిషి ఇష్టపడినదంతా జరగటం లేదు. మనం ఇస్టపడ్డా తీర్మానించేది ఆ భగవంతుడే. భగవంతుడి లెక్కకు కారణం అడగటమో...ఆయన లెక్కను అర్ధం చేసుకోవటమో ఎవరివల్ల అవుతుంది? ఇది అత్తయ్య నిర్ణయం అనేది మరిచిపోయి, ఇంకా లోతుగా ఆలొచిస్తే అది దేవుడి నిర్ణయం అనేది స్పష్టమౌతుంది. అలాంటి స్పష్టత నాలో కలిగింది.

'అభిమానం' అనే పదానికి చాలా అర్ధాలు ఉన్నాయి. అర్ధం వేరవుతోందేమో కానీ పదం చెరిగిపోదు. మునుపు నీ మీద ఉన్న స్నేహం వేరే రూపంలో ఉండేది. ఇక నీ వదినగా ఉండి నా స్నెహం కొనసాగుతుంది. దీనిని స్వీకరించుకోవలసిందే. అదే సమయం ప్రేమకు నేను ద్రోహం చేశాను అని చెప్పటానికి నేను నిరాకరించటం లేదు. దీనికి కారణం ఏమైయుంటుంది అని ఆలొచించి చూస్తే, ఏది ఏమైనా నేను తల్లి-తండ్రులు లేని దానిని అనే పరిస్థితి, దాని వలన ఏర్పడిన భయము, చేతకాని తనమూ...ఇవే కారణమనిపిస్తోంది. ఏది ఏమైనా అత్తయ్య నన్ను పెంచి, పోషించిన ఆవిడే కదా! పెంచిన విశ్వాసమే లేకుండా గుండెల మీద తంతోందే అనుకోకూడదు కదా!

మొత్తానికి నేను అహల్యలా రాయినైపోయాను కిరణ్.

ఆమె తెలియక తప్పు చేసింది. నేను తెలిసే నీకు ద్రోహం చెయ్యబోతున్నాను. దానికి శిక్షగా నేను నాలోని భావాలను పోగొట్టుకుని రాయిలాగా నిలబడ్డాను. 'ఏదో ఒక జన్మలో నేనూ శాప విమోచనం పొంది నిన్ను చేరుతాను’ అని అనుకుంటున్నాను. అంతవరకు ఈ జన్మలో ఎవరికి ఏమి విధించబడిందో అది అనుభవించడమే అందరికీ ఉత్తమం.

కన్న తల్లితో వైరాగ్యం వద్దు. సమాధాన పరచి ఆమెతో మాట్లాడు. ఆమె నీకొసం చూసి ఉంచిన ఆమ్మాయి కూడా మంచి అమ్మాయే. నాకంటే అన్ని విధాలా నీకు సరిపోతుంది. కాలం మన అందరి గాయాలనూ మానిపిస్తుందని నమ్ముదాం"

ఈ-మైల్ పంపించి, కంప్యూటర్ ఆఫ్ చేసి లేచింది ప్రతిమ.

అప్పుడే ప్రతిమ అత్తయ్య లోపలకు వచ్చింది.

" ప్రతిమా, వచ్చే పదహారో తారీఖున మంచి ముహూర్తం ఉన్నదట. ఆ మూహూర్తం ఖాయం చేసుకోమని శాస్త్రిగారు చెప్పారు. సరిగ్గా ఇంకా ఇరవై రోజులే ఉన్నది. ఈ కొద్ది రోజుల్లో నేను ఎలా నీ పెళ్ళి పనులు ముగించబోతానో తెలియటం లేదే ప్రతిమా. భయంగా ఉన్నది. ఎన్ని పనులు ఉన్నయ్యో?"

అత్తయ్య తన సంతోషాన్ని భయం అంటోంది. ప్రతిమ నవ్వటానికి ప్రయత్నించింది. నవ్వు ప్రాణులలో పుట్టింది. రాయికి ఏక్కడుంది భావాలు?

పెళ్ళి పనులు చక చక జరగటం మొదలయ్యింది. కిరణ్ దగ్గర నుండి ప్రతిమకు ఈ-మైల్ వచ్చింది.

"ధన్యవాదాలు! విశ్వాశం అనే పేరుతో నువ్వు నాకు మాత్రం ద్రోహం చెయ్యటంలేదు. వరుణ్ కు కూడా ద్రోహం చేస్తున్నావు. వాడు ఏం తప్పు చేశాడని వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు! రాయి అయిపోయానని నువ్వు చెప్పటం నిజమైతే....నీవల్ల అతనితో దాంపత్య జీవితం ఎలా జరుపగలవు? నువ్వు నా ప్రేమికురాలువు అయితే వాడు నా అన్నయ్య. మంచివాడు. అమాయకుడు. మీ ఇద్దరి జీవితాలూ దీని వల్ల నాశనమవుతాయనేది నీకు తెలియదా? నిన్ను నాశనం చేసుకొవటానికి నీకు హక్కు ఉంది. నా అన్నయ్య ప్రశాంతతను పాడుచేసే హక్కు నీకు లేదు.

నువ్వు నాకు దొరకకుండా పోతున్నావనే ఈర్ష్యతో ఇలా చెప్పటం లేదు. వరుణ్ మీద నాకున్న సహోదర అభిమానంతో చెబుతున్నాను. నిన్ను రాయిగా చేసుకున్నావని నువ్వు చెప్పటం గనుక నిజమైతే...వాడ్ని వదిలేయి లేకపోతే వాడి దగ్గర అన్ని నిజాలూ చెప్పి, వాడివలనే శాప విమోచనం పొంది ఒక ఉన్నత శిఖరానికి ఎదగటానికి ప్రయత్నించు. దీని కంటే చెప్పటానికి ఏమీ లేదు. అమ్మతో నాకేమీ జన్మ విరోధం లేదు. పోను పోను ఇది ఆవిడే అర్ధం చేసుకుంటుంది"

కిరణ్ పంపిన ఈ-మైల్ చదివిన ప్రతిమ గందరగోళంలో పడింది.

*************************************************************************************************                                      ఇంకా ఉంది.....Continued in: PART-10

26, నవంబర్ 2019, మంగళవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-8



                                      ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                            (PART-8)


"ఏం తింటావ్ ప్రతిమా?" - అడిగాడు వరుణ్.

"నాకు కాఫీ మాత్రం చాలు!"

"నువ్వు తినకపోతే అమ్మ మమ్మల్నే తిడుతుంది. రెండు ఇడ్లీలైనా తిను"

వరుణ్ అందరికీ ఇడ్లీలు చెప్పాడు.

"మీ ఇద్దరూ కావాలంటే ఇంటికి వెళ్ళండి. నేను ఇక్కడ అత్తయ్య దగ్గర ఉంటాను" చెప్పింది ప్రతిమ.

"నీకేమీ భయం లేదే?"

"ఎందుకు భయం...ఇక్కడ ఇంతమంది ఉన్నారే! అన్ని వసతులూ ఉన్నాయి. ఇంకేంకావాలి? వీలైతే రేపు వచ్చేటప్పుడు నాకు ఒక సెట్టు డ్రస్స్ తీసుకు రండి"

ఆ రోజు సాయంత్రం వరకు మామయ్యా, వరుణ్ ఉండి, ప్రతిమ దగ్గర ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి, అది కాకుండా ఆసుపత్రి ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇచ్చి బయలుదేరారు.

"జాగ్రత్త ప్రతిమా...అమ్మకు ఎలాగున్నదో అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పు. ప్రొద్దున్నే వస్తాము" అని చెప్పి వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళిన తరువాత, ప్రతిమ ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి చోటులో మెల్లగా నడిచింది.

ఊరికి బయట ఉండటంతో పరిసుద్దమైన గాలి, పచ్చటి చెట్ల అందం, ప్రశాంతంగా కనబడింది ఆసుపత్రి. ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చుని చుట్టూ ఉన్న అందాన్ని మౌనంగా చూసింది ప్రతిమ. మనసు గందరగోళంగా ఉండటంతో అందాన్ని చూసి ఆనందించలేకపోయింది.

‘ప్రేమ ఓటమి’ అనే మాటలను కథలలో చదివింది. సినిమాలలో విన్నది. అప్పుడంతా అది అంత పెద్ద విషయంగా అనిపించలేదు. చెప్పాలంటే ప్రేమలో విడిపోయి ఏడుస్తున్న నటీనటులను చూసి చప్పట్లు కొట్టి ఆనందించింది.

అలాంటి పరిస్థితి తనకే వస్తుందని ఒక్క రోజు కూడా తను అనుకోలేదు. తను చేసింది కరెక్టా...తప్పా? అనేది అర్ధం కాలేదు. వరుణ్ ని పెళ్ళి చేసుకోలేను అని చెబితే అది అత్తయ తనమీద చూపించిన అభిమానానికి ద్రోహం. సరే అంటే ప్రేమకూ, కిరణ్ కి చేసే నమ్మక ద్రొహం.

ఇందులో ఏ ద్రొహం పరవలేదు? అత్తయ తన మీద చూపే అభిమానం ముందు అన్నీ తుచ్చంగా కనబడుతున్న పరిస్థితిలో ప్రేమకు ద్రోహం చేయటానికి సాహసించిందనే చెప్పాలి. ఇది తెలిస్తే కిరణ్ ఏం చేస్తాడు? కోపంగా వస్తాడా...లేక ఓటమితో క్రుంగిపోయి వస్తాడా?

ఆలొచనలు ప్రతిమ మెదడులో వేధన పెడుతుంటే తలపట్టుకుని కూర్చుంది ప్రతిమ.

వారం రోజుల తరువాత ప్రతిమ అత్తయను డిస్ చార్జ్ చేసారు. నెలరోజుల్లో అత్తయ్య పూర్తిగా కోలుకుంది. ఆరొగ్యంగా ఉన్నది.

'సమయం వచ్చింది, దేవుడు టికెట్ ఇచ్చాడు’… లాంటి మాటలు చెప్పిన అత్తయ్య, పూర్తిగా ఆరొగ్యం చేకూర్చుకుని మళ్ళీ ఆ ఇంటిని ఏలే మంత్రిగా సోఫాలో కూర్చుంది!

వరుణ్ కి, ప్రతిమకు వెంటనే వివాహం చేశేయాలని ముహూర్తం రోజులకోసం అణ్వేషించడం మొదలుపెట్టింది.

శ్వాసనాళంలో ఏదో అడ్డుపడి హింసిస్తున్నట్టు అవస్తపడుతున్నది ప్రతిమ.

ఒక్కొక్కసారి, 'అత్తయ్యకు నిజం చెబితే ఏం జరుగుతుంది?' అని అనిపించిన ఆలొచన భయంతో సగంలోనే ఆగిపోయేది. 'నీకు వరుణే!' అని అత్తయ్య బల్లగుద్ది చెబితే ఏం చేయాలి? అనే భయం. తన ప్రేమకు జయం జరగదు అనే పరిస్థితిలో ప్రేమను బయటకు చెప్పి జీవితాన్ని చిక్కుముడిగా చేసుకోవటమంత బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉందా!

ఎందుకు అందరి యొక్క సంతోషాన్నీ చెడపాలి? ఓటమో లేక మరణమో దగ్గర పడుతోంది అంటే...ఒకదాన్ని మనిషి పోరాడి గెలుస్తాడు. లేకపోతే, వేరు దారి లేదు అనేది తెలుసుకుని సకల భావాలూ వదులుకుని మౌనంగా తనని బలి ఇచ్చుకోవాలి.

ఒక్కొక్కసారి అనిపిస్తుంది, 'అత్తయ్య అభిమానానికి వెనుక ఏదో ఒక లెక్క ఉన్నది?' అని. చిన్న వయసులోనే కన్నవారిని పోగొట్టుకుని, అత్తయ్య దయా గుణంతో పెరిగిన అనాధను. ‘దీన్ని వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్ళి చేయాలంటే చాలా ఖర్చు అవుతుందే. అదే సమయం వరుణ్ కి ఒక మంచి చోటు నుండి తన గౌరవానికీ, అంతస్తుకూ తగిన అమ్మాయి దొరుకుతుందనే నమ్మకం అత్తయ్యకు లేదేమో!’

'బయట నుండి ఒక సాధారణ అమ్మాయిని తీసుకురావటం కంటే ప్రతిమే మేలు!'అని అనిపించి ఉండవచ్చు. లేకపోతే ఏమిటి, కిరణ్ కి మాత్రం చదువుకున్న, అస్తి ఉన్న అమ్మాయిని చూసిందే? ఒక వేల ప్రతిమ, కిరణ్ ఇష్టపడుతున్నారని తెలుసుకుని...అది ఇష్టం లేక, ఇలాంటి ఏర్పాటు చేసిందా? 'నీ అనాధ మొహానికి నీకు కిరణ్ కావాల్సి వచ్చిందా?' అని మనసులో అనుకుని...'దీనికి వరుణ్ చాలు అని నిర్ణయించుకుని, కిరణ్ కి అర్జెంటుగా అమ్మాయిని చూశేసి రెండు పెళ్ళిళ్ళూ ఒకేసారి జరుపుదామని అనుకున్నదో?

ఏది నిజం? అత్తయ్య మనసులో ఏమున్నదో ఎవరికి తెలుసు? ఒకవేల కిరణ్ ప్రతిమను ఇస్టపడుతున్నాడని తెలిసి, అది ఇష్టం లేక ఇలాంటి ఏర్పాటు చేసిందనేదే నిజమైన కారణమైతే, ఇక అత్తయ్యతో ఏం చెప్పి ఏమి ప్రయోజనం? కాబట్టి తన సకల భావాలనూ చెరిపేసుకుంటేనే అందరికీ మంచిది అనే నిర్ణయానికి వచ్చింది ప్రతిమ. ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు కిరణ్ కి ఒక ఈ-మైల్ పంపాలని తీర్మానించుకుంది ప్రతిమ.

****************************************************************************************************                                        ఇంకా ఉంది.....Continued in: PART-9

24, నవంబర్ 2019, ఆదివారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-7




                                       ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                            (PART-7)


వెంటనే 'బై పాస్ సర్జరీ’ చేయాలని చెప్పాడు డాక్టర్. భయంతో మామయ్యను చూసింది ప్రతిమ.

"మేము ఆమెను చూడొచ్చా?"....డాక్టర్ను అడిగాడు మామయ్య.

"చూడండి...కానీ ఎక్కువగా మాట్లాడి ఆమెను ప్రయాస పెట్టకూడదు."

ఐ.సి.యూ అద్దాల తలుపులు తెరుచుకుని మామయ్య, ప్రతిమ, వరుణ్ లోపలకు వెళ్ళారు. అత్తయ్య బాగా నీరశంగా ఉన్నది. వాళ్ళను చూసిన వెంటనే కంట తడి పెట్టుకుంది. అతి శ్రమపడుతూ వస్తున్న ఏడుపును ఆపుకుని అత్తయ్య చేతులు పుచ్చుకుంది ప్రతిమ.

"నాకు పోవలసిన టైము వచ్చేసిందే ప్రతిమా"

"అలా మాట్లాడకండి అత్తయ్యా! మీకు ఏమీ లేదు. ఇప్పుడంతా 'బై పాస్’ సర్వ సాధారణం"

“దేవుడు తారీఖు 'కన్ ఫర్మ్' చేస్తే బై పాసూ లేదు...జై పాసూ లేదు. దేవుడు నా చివరి యాత్రకు పాస్ ఇచ్చాశాడు!”

“అలా అంతా మాట్లాడకండి అత్తయ్యా! నన్ను వదిలి వెళ్ళిపోగలరా మీరు? మీరున్నారనే ధైర్యంతోనే మా అమ్మా-నాన్నలను తీసుకు వెళ్ళాడు ఆ దేవుడు. ఆయనకు తెలుసు. మిమ్మల్నీ కూడా పిలుచుకు వెడితే....నేను అనాధ అయిపోతానని. అలాగంతా ఆయన ఒకరోజూ చెయ్యడు"

"నాకు నమ్మకం లేదే ప్రతిమా. కొన్ని రోజులుగా నాలో ఏదో భయం...'చచ్చిపోతానేమో అని! అందుకనె మీ పెళ్ళి జరిపేద్దామని అవసరపడ్డాను. అంతలోపు అంతా గందరగోళంగా తయారైయ్యింది. కిరణ్ పోతే పోనీ. వాడు ఎలా పోతే నాకేమిటి. వాడిని నా కొడుకే కాదని అనుకుంటా.

నువ్వైనా నాకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటావా ప్రతిమా? నేను కోరుకున్నట్టు వరుణ్ ని పెళ్ళిచేసుకుంటావా? నువ్వు వయసుకు వచ్చిన రోజే నాకు అలాంటి ఆలొచన వచ్చింది. పోను, పోనూ అది ఆశగా మారింది. నిన్ను వాడికిచ్చి పెళ్ళి చేసి చివరి వరకు నాతోనే ఉంచుకోవాలనేది నా ఆశ! ఏమిటి...నా ఆశ నెరవేరుస్తావా?"

ప్రతిమ ఆశ్చర్యంగా అత్తయ్యను చూసింది. ‘భగవంతుడా... ఎందుకు నన్ను ఇంత ఇరకాటమైన పరిస్థితిలో ఉంచావు? అత్తయ్య ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? 'సరి’ అని చెప్పి ఆవిడ్ని సంతోషపరచాలా? 'కుదరదు’ అని చెప్పి ఆవిడ్ని చంపేయాలా? అత్తయ చావుకు నేను కారణమవటానికా ఆవిడ నన్ను పెంచింది? తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించిందే?’

"ఏమిటే ఆలొచిస్తున్నావు...కిరణ్ లాగా నువ్వూ ఎవరినైనా?"

"లేదు అత్తయ్యా! లేనే లేదు"

"నువ్వైనా నా కోరికను తీర్చి నాకు ప్రశాంతత ఇచ్చావే! ఇక నేను చచ్చిపోయినా పరవాలేదు!"

"మీరు ఎక్కువ మాట్లాడ కూడదు అత్తయ్యా"

"వరుణ్ తో కలిసి ఒకసారి నిలబడు. నేను చూడాలి"

ఎటువంటి భావన లేకుండా వరుణ్ కి దగ్గరగా వెళ్ళి నిలబడింది ప్రతిమ.

"ఏమండీ...ఈడు-జోడు ఎలా ఉందో చెప్పండి? బ్రహ్మాండంగా ఉంది కదూ? ఉండదా మరి? చేర్చిందెవరు...నేను కదా?"

“రామలక్ష్మీ ఎందుకు అంతగా ఏమోషనై మాట్లాడ్తావు? నీకు వొళ్ళు బాగుండలేదు. ఐ.సి.యు లో ఉన్నావు! చాలు...ప్రతిమా రామ్మా పోదాం. లేకపోతే ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది.

మామయ్య వాళ్ళను బయటకు తీసుకు వచ్చాడు.

వరుణ్ కి దగ్గరగా నిలబడ్డ క్షణం నుండి ప్రతిమ తనలో ఏదో విరిగి తాను శిలలాగా అయిపోయినట్లు భావించింది. ఇక ఆ రాయికి స్పర్శ ఉంటుందని అనిపించటంలేదు. మరుసటి రోజు ప్రొద్దున అత్తయ్యను 'ఆపరేషన్ ధియేటర్’ కి తీసుకు వెళ్ళారు. ఐ.సి.యు నుండి బయలుదేరి ‘ఆపరేషన్ ధియేటర్’ వరకు అత్తయ్య స్టెక్చర్ తో ప్రతిమ నడిచింది. భయమూ, బాధతో మామయ్య, వరుణ్ కొంచం వెనుకగా వెళ్ళారు.

"వరుణ్ ఇంకా ఒక చిన్న పిల్లాడే ప్రతిమా. వాడిని ఇకపై నువ్వే చూసుకోవాలి. కౌశల్యకు రాముడు ఎలాగో వీడు నాకు అలాగు. వీడ్ని చూసుకోవే ప్రతిమా...నా బంగారు తల్లీ..."

'ఆపరేషన్ ధియేటర్’ తలుపులు మూసుకోవటంతో...ప్రతిమ బయట శిలలాగా నిలబడిపోయింది.

నాలుగు గంటలు జరిగింది ఆపరేషన్. అంతవరకు బయట నిలబడిన వాళ్ళు సగం ప్రాణం కోల్పోయారు. వరుణ్ పచ్చి మంచి నీళ్ళూ కూడా తాగకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మామయ్య, 'తన శరీరంలో సగం పోతుందేమో?' అనే భయంలో కృంగిపోయి మోకాళ్ళపై తలపెట్టుకుని కూర్చున్నారు. ఎవరూ ఎవరికీ ధైర్యమో, అభయమో చెప్పలేని స్థితిలో ఉన్నారు. గడియారంలోని ముల్లులు మాత్రం వాటి భాద్యత అవి నిర్వహిస్తున్నై.

సరిగ్గా ఒంటి గంటకు 'ధియేటర్’ తలుపులు తెరుచుకున్నాయి...తలకు ఒక టోపి, ముక్కుకు ఒక మాస్క్ తో డాక్టర్ బయటకు వచ్చాడు. అందరూ గుండెలను గుప్పెట్లో పెట్టుకుని లేచారు.

"ఆపరేషన్ సక్సస్స్ మిస్టర్ వరుణ్. మీ అమ్మగారు బాగున్నారు. ఇంకో గంటలో ఐ.సి.యు లోకి సిఫ్ట్ చేస్తాము. అప్పుడు మీరు చూడొచ్చు"

'డాక్టరా....దేవుడా? దేవుడు లేడని ఎవరు చెప్పింది? ఇదిగో ఈ డాక్టర్లందరూ ఎవరట?'

వరుణ్ కన్నీటితో చేతులెత్తి డాక్టర్ కు దన్నం పెట్టాడు. డాక్టర్ చేతులు పట్టుకుని చిన్న పిల్లలాగా ఏడ్చింది ప్రతిమ.

గంట తరువాత ధియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. ఎన్నో రకాల ట్యూబులు గుచ్చబడ్డ పరిస్థితిలో చక్రాల మంచంతో తీసుకురాబడ్డది అత్తయ్య. పునర్జన్మ ఎత్తి వస్తున్న ఆమెను ఆనందంతోనూ, ఆందొళనతోనూ చూశారు.

"ప్లీజ్...కొంచం దూరంగా జరగండి. ఇన్ ఫెక్షన్ ఏర్పడొచ్చు. మేము పిలిచిన తరువాత వస్తే చాలు"....చెప్పింది నర్స్.

అత్తయ్య ఐ.సి.యు లోకి తీసుకు వెళ్ళబడింది. డాక్టర్ల పరిశోధనలు మొదలయ్యాయి. నర్సులు వెళ్ళటం, రావటం జరిగింది.

ముప్పావు గంట తరువాత డాక్టర్లు పిలిచారు. ప్రత్యేకమైన సాక్స్, కోటు వేసుకుని ముగ్గురూ లోపలకు వెళ్ళారు.

అత్తయ్యకు కొంచంగా సృహ వచ్చింది. డాక్టర్ చాలా ప్రశ్నలు వేశాడు. ముగ్గుర్నీ చూపించి పేర్లు చెప్పమన్నారు. అత్తయ నీరసమైన గొంతుతో ముగ్గురి పేర్లూ చెప్పింది. "వెరీ గుడ్"...!- డాక్టర్ జరిగి వచ్చాడు.

“షీ ఈజ్ పర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్ ! మూడు రోజులు ఐ.సి.యు లో ఉంచుతాము. నాలుగోరోజు వార్డుకు పంపిస్తాను. ఎనిమిదో రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరేనా? మీరందరూ భోజనం చేశారా...లేకపోతే భొజనం చేసి రండి. చూడటానికి బాగా టయర్డ్ గా ఉన్నారు. ఇంకేముంది? బాగా తినండి"

డాక్టర్ ఉత్సాహాంగా చెప్పేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన వెంటనే ముగ్గురూ క్యాంటీన్ కు వెళ్ళారు.

****************************************************************************************************                                   ఇంకా ఉంది.....Continued in: PART-8

22, నవంబర్ 2019, శుక్రవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-6



                                         ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                            (PART-6)


సరిగ్గా ఒక వారం రోజుల తరువాత ప్రతిమ అత్తయ్య కిరణ్ తో మళ్ళీ పెళ్ళి మాటలు మొదలుపెట్టింది.

"నువ్వు పెళ్ళి చేసుకోకపోతే పోరా. వరుణ్ పెళ్ళికైనా ఉంటావా...?"

"పెళ్ళి ఎప్పుడు?"

"ఇంకా తారీఖు నిర్ణయించలేదు!"

“కానీ, 'నాకు టికెట్టు కన్ ఫర్మ్' అయ్యింది. ఎల్లుండి విమానం. మళ్ళీ నేను తిరిగి రావటానికి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో అవొచ్చు. దాని తరువాత పెళ్ళి పెట్టుకో. పెళ్ళికి తప్పక వస్తాను"

తల్లి అతన్ని కోపంగా చూసింది. తరువాత ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుని తిరిగి వెళ్ళిపోయింది. హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుంది. తల్లి వెనుకే నడిచి వెళ్ళిన కిరణ్ సోఫాలో కూర్చున్న తల్లి ముందు నిలబడి "అమ్మా..." అని పిలిచాడు.

ఆమె తల పక్కకు తిప్పుకుంది.

“నువ్వు మాట్లాడకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేసి వెళతాను” అన్నాడు కిరణ్.

"నీకు నా మీద కోపం ఉండొచ్చమ్మా. నువ్వు చెప్పి నేను వినలేదు అనే కలత ఉండొచ్చు. ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకుని నేను నీకు మర్యాద, గౌరవం ఇవ్వటం లేదనే నిర్ణయానికి రాకు! పెళ్ళనేది ఇంకొకరికోసం చేసుకో లేము. నీకొసం నేనెలా తినలేనో, నిద్రపోలేనో, స్నానం చేయలేనో, అదేలాగానే...పెళ్ళి కూడా చేసుకోలేను. నీ అకలికి నువ్వే తినాలి. నీ శరీరం శుభ్రంగా ఉండాలంటే నువ్వే స్నానం చేయాలి. నీకు నిద్ర వస్తే నువ్వే నిద్రపోవాలి. నేను వెళ్ళిన తరువాత వీటి గురించి ఆలొచించి చూడమ్మా. నా మనసు నీకు అర్ధం అవుతుంది"

కిరణ్ వెళ్ళిపోయాడు. అత్తయ్య మొహం ఎరుపెక్కింది....అతను వెళ్ళిపోయిన వైపే చూస్తూ నిలబడింది. ఆ తరువాత భర్త వైపుకు తిరిగింది.

"మీ కొడుకు ఏం చెప్పి వెడుతున్నాడో విన్నారా? నా ఆకలికి నేనే తినాలట. నా మురికి పోవాలంటే నేనే స్నానం చేయాలట. మాతృత్వానికి ఎక్కడుంది తత్వం? మిగిలిన వాళ్ళకు కావాలంటే ఇది సరిపోవచ్చు. తల్లికి ఎలా సరిపోతుంది? నా అకలికి వాడు తినలేడు. కానీ, వాడి అకలికి వాడు తింటేనే నా కడుపు నిండిపోతుందే!

వాడి అకలికి నేను తినలేను. కానీ వాడు ఆకలితో పస్తుంటే నావల్ల తినటం కుదరదే! వాడికోసం నేను స్నానం చేయలేనట? ఎనిమిదేళ్ళప్పుడు వాడికి ఆట్లమ్మ పొసినప్పుడు ఒకరోజుకు మూడుసార్లు వాడికోసం నేను స్నానం చేసి ప్రతి గుడి మెట్టూ ఎక్కొచ్చానే. పదేళ్ళప్పుడు వాడికి ఆగకుండా విరోచనాలు అయినప్పుడు ఆసుపత్రిలో చేరిస్తే...అటూ ఇటూ కదలలేక, ఐదు రోజులు స్నానం చేయలేక వీడితోపాటూ నేనూ కంపుతో ఉండిపోయానే.

వీటన్నిటికీ ఏం తత్వం చెప్పగలడు వాడు? అమెరికా వెళ్ళి చదువుకున్నాడనే గర్వంతో మాట్లాడుతున్నాడు...పొతే పోనీ. వాడి ఆకలికి వాడే తినని. వాడికి కావాలంటే స్నానం చేసుకోనీ, నిద్రపోనీ, పెళ్ళి కూడా చేసుకోనీ...ఎలా పోయినా పరవలేదు. నేనేమీ బాధపడను.

కన్న పేగు కోసినప్పుడే అన్నీ బంధాలనూ కోసేయటం తెలిసుంటే ఈ రోజు ఇలా పిచ్చిదానిలా నాలో నేనే మాట్లాడుకునే దానిని కాదు. తెలియలేదే! భగవంతుడు దేహం మొత్తం ప్రేమను పెట్టాశాడు...ఏం చేయగలను? అభిమానం, ప్రేమ అన్నీ ఒన్ వే ట్రాఫిక్కులాగా అయిన తరువాత ఎవరిని ఎవరు కట్టడి చేయగలరు?"

ప్రతిమ అత్తయ్య శరీరం అంతా ఊగిపోయింది. మామయ్య భయపడిపోయారు.

"రామలక్ష్మీ...నువిప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు? అన్నీ సర్ధుకుంటాయి. ఎవరైనా ఒకరు విడిచిపెడితేనే జీవితం. వాడికి ఇష్టం లేకపోతే వదిలేయి"

"ఎలా వదిలి పెట్టగలను? వాడి మీద నాకు శ్రద్ద ఉండకూడదా? ఆశ ఉండకూడదా? ఎంతో కస్టపడి వెతికి వెతికి అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ఎం తక్కువని వద్దంటున్నాడు?"

"ఎవరికి తెలుసు? ఇప్పుడు దాని గురించి మాట్లాడితో మనకేమొస్తుంది? వదిలిపారేయి. ఇక మీదట జరగవలసిన దాని గురించి ఆలొచిద్దాం"

"ఇంకా ఏం జరగాలట...నా కర్మకాండలు తప్ప"

"అమ్మా...ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు?".....వరుణ్ అమ్మను చూసి గట్టిగా అడిగాడు.

"ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏది చెప్పినా వినటానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఆజ్ఞ ఇవ్వు. వాడిని వాడి దారిలో పోనివ్వు. వాడి గుణం నీకు తెలియదా? ఈ ఒక్క విషయం పట్టుకుని నువ్వు వాడ్ని తిట్టటం సరికాదు"

"వాడి గురించి ఇంక మాట్లాడకురా! భుజాలకుపైన పెరిగిన తరువాత కూడా పిల్లాడు అని అనుకున్నా చూడు...నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సరే...నువ్వైనా నా మాట వింటావా...లేకపోతే నువ్వూ...?"

"నేను ఇందాకే చెప్పను కదమ్మా. బావిలో దూకు అని చెప్పు...దూకటానికి రెడీగా ఉన్నాను"

"అలాగైతే ప్రతిమను పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా"

"ఇష్టమేనమ్మా!"

నిప్పులను తొక్కు తున్నట్టు ప్రతిమ వాళ్ళను చూసింది.

"హూ...అలా ఒక కొడుకు; ఇలా ఒక కొడుకు! ప్రతిమా ఇక్కడికి రా"

ఆమె వణుకుతూ అత్తయ్య ముందుకు వచ్చి నిలబడింది. అత్తయ్య ప్రతిమను పైకీ కిందకూ ఒకసారి చూసింది.

"జ్ఞాపకముందా ప్రతిమా...అప్పుడు నీకు ఎనిమిదేళ్ళు. నా తమ్ముడూ, అతని భార్య అంత చిన్న వయసులో చనిపోతారని ఎవరన్నా అనుకున్నారా? అమ్మా, నాన్నల శవాలను చూసి పెద్దగా ఏడుస్తున్న నిన్ను అమాంతం కౌగలించుకున్నాను.

‘నేనున్నానమ్మా నీకోసం...’ అని చెప్పి నిన్ను నా గుండెలమీద వేసుకుని, ఇక్కడికి పిలుచుకు వచ్చాను. ఇదిగో ఈ నిమిషం వరకు నా గుండెళ్ళోనే ఉంచుకున్నాను. నా పిల్లలిద్దరి కంటే నిన్నే ఎక్కువగా గమనించాను. మీ అమ్మ జ్ఞాపకం నీకు రాకుండా ఉండాలని ప్రేమంతా కుమ్మరించి ఆ జ్ఞాపకాన్ని తుడిచేశాను.

కిరణ్ కి ఆట్లమ్మ పోసి వాడికి తలకు స్నానం చేయించిన నాలుగోరోజు నీకు ఆట్లమ్మ పోసింది. విమరీతమైన జ్వరం. నాలుగు రోజులు నువ్వు కళ్ళు తెరవకుండా పడుకున్నావు. రోజూ గుడికి వెళ్ళటం, వేడుకోవటం, వచ్చి నీకు కావలసింది చూసుకోవటం...ఇదే నా పని. నిప్పుల్లో నడుస్తానని వేడుకున్నాన్ను. ఆట్లమ్మ నిన్ను విడిచిపెట్టింది. నీకు పూర్తిగా తగ్గిన తరువాత నిప్పులు తొక్కడానికి మన ఊరి గుడికి వెళ్ళాను. ‘వద్దు అత్తయ్యా....కాళ్ళు కాల్తాయి’ అంటూ నా కాళ్ళను చుట్టుకున్నావు. ‘ఇది నిప్పు కాదరా నాన్నా....పువ్వులాంటిదిరా’ అని నిన్ను సమాధాన పరిచి నేను నిప్పుల్లో నడిచాను.

నువ్వు చెప్పి నేను వినలేదని నువ్వు నాతో మూడురోజులు మాట్లాడలేదు. ఆ మూడు రోజులూ నేను వ్రతం. 'నువ్వు మాట్లాడితేనే నేను తింటాను’ అని చెప్పాను. నేను సరదాగా చెబుతున్నాను అనుకుని మొదట్లో నువ్వు మాట్లాడనే లేదు. మూడో రోజు నేను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. అది చూసి నువ్వు భయపడి నాతో మాట్లాడావు! నీ చిన్నారి చేతులతో నాకు అన్నం కలిపి పెట్టావు. ‘ఇక మీదట నీతో మాట్లాడకుండా ఉండను అత్తయ్యా’ అని ఏడ్చావు!"

ప్రతిమ కన్నీరుతో అత్తయ్యను చూసింది.

"ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానో అని నువ్వు అనుకోవచ్చు! ఇంత కష్టపడి నిన్ను పెంచానని చెప్పటానికి మాత్రం కాదు. పది నెలలు మోసి కని పెంచిన వాడే...పది నిమిషాల్లో 'నీ ఆకలికి నువ్వు తిను’ అని విదిలించుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎవరి మీద నేను అధికారం చేయగలను? ఎవరి దగ్గర నేను ఏమిటి ఎదురు చూడ....?"

ఆ మాట ముగించేలోపు రామలక్ష్మీ సడన్ గా గుండె పట్టుకుంది. నుదురు, గొంతు గబుక్కున చెమటతో నిండిపోయంది. కింద పడుతున్న ఆమెను ఒక్క గెంతుతో వరుణ్, ప్రతిమ చెరో పక్క పట్టుకున్నారు.

"ఎమైంది అత్తయ్యా"....ప్రతిమ టెన్షన్ పడి తల్లడిల్లిపోయింది.

డాక్టర్ కు అర్జెంటుగా ఫోన్ చేశారు మామయ్య!

****************************************************************************************************                   
                               ఇంకా ఉంది.....Continued in: PART-7

20, నవంబర్ 2019, బుధవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-5



                                         ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                           (PART-5)


ప్రతిమ రాత్రంతా ఏడ్చింది.

అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోనుంటుందని తను కలలో కూడా అనుకోలేదు. 'కోడలు పిల్లా...' అని మామయ్య పిలిచింది నన్ను వరుణ్ భార్యాగా నిర్ణయించుకునేనా? అనుకుంటున్నప్పుడే మంటల్లో కాలుతున్నట్లు అనిపించింది ప్రతిమకు. కిరణ్, 'పెళ్ళి’ వద్దు అని చెబితే మాత్రం ఈ సమస్య తీరిపోతుందా? అతను అతన్ని మాత్రం కాపాడుకుంటే సరిపోతుందా? ప్రతిమను కాపాడ వద్దా? అతను, ఆమె ఒకర్ని ఒకరు ఇష్టపడుతున్నారని చెప్పాలి కదా?

"ప్రతిమా..."

కిటికీ పక్క నుండి కిరణ్ గొంతు సన్నగా వినబడింది. ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూసిన తరువాత కన్నీరు అధికమయ్యింది.

"తలుపు తెరు..."

తలుపు తెరిచిన వెంటనే గబుక్కున లోపలకు వచ్చి గొళ్ళేం పెట్టాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిమా?"

"ఏడవక...నవ్వమంటావా? నువ్వు మాత్రం తప్పించుకుంటే చాలా? నన్ను కాపాడ వద్దా?"

"దాని గురించి మాట్లాడటానికే వచ్చాను. ఈ టైములో మన విషయం బయటకు తెలియటం మంచిది కాదని అనిపిస్తోంది. ఇప్పటికే అమ్మ చాలా కోపంగా ఉన్నది. ఇప్పుడు మన విషయం ఆవిడకు తెలిస్తే ఆవిడ కోపం చాలా ఎక్కువ అవుతుంది. ఆవిడ్ని గౌరవించని మనల్ని విడదీస్తేనే సంతోషం అనే విధంగా సాడిస్టుగా మార వచ్చు"

"అయితే నేను ఇప్పుడేం చేయను?"

"నువ్వు కూడా పెళ్ళి వద్దు అని మొండిగా పట్టుపట్టు, ఏడు. కారణం చెప్పకు! పై చదువులు చదవబోతానని చెప్పు. ఏది ఏమైనా 'వరుణ్ ని నచ్చలేదు’ అని పొరపాటున కూడా చెప్పకు! అలా చెబితే కనుక, వాడికి నిన్ను కట్టపెట్టిన తరువాతే ఇంకోపని చూస్తుంది మా అమ్మ. జాగ్రత్త! ఎలాగైనా తప్పుంచుకోవాటానికి ప్రయత్నించు. ఎప్పుడూ నీ పక్కన నేను ఉండలేను కాబట్టి ఇక్కడ నీ తెలివితేటలే ఉపయోగించాలి. నువ్వూ పెళ్ళికి ఒప్పుకోకపోతే వేరే దారిలేక తన గౌరవాన్ని కాపాడుకోవటానికొసం ఆ అమ్మాయిని వరుణ్ కు ఇచ్చి పెళ్ళిచేయటానికి ప్రయత్నిస్తుంది"

“అమ్మాయి వాళ్ళింట్లో వాళ్ళు వరుణ్ ను ఒప్పుకోవద్దా? మిమ్మల్నే కదా వాళ్ళు అల్లుడిగా చూశారు. వాళ్ళకు మీ జాతకమే వెళ్ళుంటుంది"

"దాని గురించి మనకెందుకు? వాళ్ళు ఒప్పుకోకపోతే వరుణ్ కి వేరే సంబంధం చూడనీ! మన సమస్య తీరిందా..దాంతో వదిలేయి"

“నాకు భయంగా ఉన్నది కిరణ్. నువ్వు మళ్ళీ అమెరికా వెళతానన్నది నిజమా?"

"నిజమే! అక్కడ నాకొక ఉద్యోగం దొరికింది. మన పెళ్ళి జరిగిన తరువాత అందులో చేరుదామని అనుకున్నా. కానీ, ఇప్పుడు ముందే చేరబోతాను. నువ్వు ఆందోళన చెందకు! ఇంకొక సంవత్సరం ఎలాగైనా కాలం గడుపు. ఈలోపు నేను అమ్మని ఎలాగైనా 'కన్ విన్స్’ చేసి మన పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేస్తాను"

ప్రతిమ మౌనంగా ఉన్నది.

“నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవటానికి వాళ్ళకు ఇష్టమే. కానీ, ఎవరి భార్యగా అనే విషయంలోనే చిన్న సమస్య. ఆ సమస్యను త్వరలోనే తీరుద్దాం...సరేనా? కళ్ళు, మొహం తుడుచుకుని ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ఏడ్చిన ఏడుపులో మొహంలోని జిడ్డంతా పోయి మొహం మెరిసిపోతోంది చూడు"

ఈ పరిస్తితులలోనూ అతను ఏడిపించగా...ఆమె ఏడుస్తూనే నవ్వింది. "చి చీ పోరా..." అంటూ అతని ఎద మీద కొట్టింది.

ఇళ్ళు నిశ్శబ్ధంగా ఉన్నది. ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడితే పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడుతున్నట్టు అందరూ మౌనం పాటిస్తున్నారు. అందులోనూ తల్లి మౌనం మరీ భయంగా ఉన్నది. ఆ మౌనానికి కింద ఎటువంటి ప్రణాళిక సిద్దం అవుతోందో అని కిరణ్ కు, ప్రతిమకు భయంగా ఉన్నది.

ఆడ పెళ్ళివారింటికి ఏదో ఒక సమాధానం చెప్పి పంపించాలి కదా! అత్తయ్య ఏం సమాధానం చెప్పి తప్పించుకోబోతోందో అనేది తెలియటం లేదు ప్రతిమకు. అత్తయ ఎదురుగా వెళ్ళటానికే శరీరం వణుకుతోంది. కిరణ్ అరిచిన తరువాత అత్తయ్య ‘పెళ్ళి’ విషయం గురించి మాట్లాడనే లేదు. ఆమె ఏదైన మాట్లాడితేనే కదా కిరణ్ చెప్పినట్టు...'పెళ్ళి వద్దు' అని మొండికేయవచ్చు?

దానికి సమయమే రాలేదు. అత్తయ్య ఎందుకు మౌనంగా ఉన్నదో అర్ధం కావటం లేదు. వరుణ్ ఎప్పటి లాగానే మామూలుగా వెళ్ళటం, రావటం చేస్తున్నాడు. అతను తన జీవితం గురించి ఆలొచించేవాడే కాదు. అమ్మ దగ్గర తన జీవితాన్ని అప్పగించినట్లు ఏటువంటి అలజడి లేకుండా ఉన్నాడు.

మనసులో ప్రేమ భారంగా ఉన్న వాళ్ళకే అలజడి, ఆందోళన. దసరధ మహారాజుకు శ్రీరాముడు ఎలాగో అత్తయ్యకు వరుణ్ అలాగు. వరుణ్ కే ప్రతిమ అని అత్తయ్య చెప్పిన తరువాత అతని ముందుకు కూడా వెళ్ళటానికి భయపడ్డది ప్రతిమ. ముందులాగా మాట్లాడలేకపోయింది.

తల్లి యొక్క నిర్ణయం గురించి వరుణ్ ముఖంలో ఎటువంటి ఉత్సాహమూ, మార్పూ లేదు. అత్తయ నిర్ణయం అతనికి ఇష్టమేనా...ఇష్టం లేదా? ఏదీ అర్ధం కాలేదు! ఎప్పుడూలాగానే భోజనం చేస్తున్నాడు..షాపుకు వెల్తున్నాడు...వస్తున్నాడు. పడుకున్న వెంటనే నిద్ర పోతాడు. ఇలా ఎలా ఉండగలుగుతున్నాడో అర్ధం కావటం లేదు!

వరుణ్ అలా ఉంటే...కిరణ్ ఏమో మళ్ళీ అమెరికా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లను దిగులుపడకుండా చేసుకుంటున్నాడు. 'అత్తయ్య మళ్ళీ ఎప్పుడు ఏ బాంబు పడేస్తుందో?' అనే భయంతో తిరగవలసిన తలరాత ప్రతిమకు మాత్రమే పట్టింది!

****************************************************************************************************

                                     ఇంకా ఉంది.....Continued in: PART-6

18, నవంబర్ 2019, సోమవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-4



                                   ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                        (PART-4)


సరిగ్గా నాలుగు గంటలకు అందరూ పెళ్ళి చూపుల ఇంటికి చేరుకున్నారు. అత్తయ్య అంతస్తుకు తగిన ఆస్తి పరుల ఇళ్ళే! అమ్మాయి చాలా అందంగా ఉన్నది. మంచి చదువు. నాగరీకంగా అందరితో గలగల మని మాట్లాడుతూ కలిసిమెలిసి పోయింది. అనవసరమైన సిగ్గును వదిలిపెట్టింది.

వరుణ్ అదృష్టవంతుడే!

"ఏరా...అమ్మాయి ఎలాగుంది?" అత్తయ్య అడిగింది.

"సూపర్!"

"అయితే ఓకే చెప్పేద్దామా?"

"అన్నయ్య దగ్గర అడిగావా?"

"వాడికేం తెలుసు?"

మంచి కుటుంబమే...ఓకే చెప్పేయి" కిరణ్ చెప్పాడు...అత్తయ్య సంప్రదాయంగా తొమలపాకులు-వక్క మార్చుకుని బయలుదేరటానికి సిద్దమయ్యింది.

సంతోషంగా ఇంటికి బయలుదేరారు.

"ఇళ్ళు చాలా బాగుంది కదూ?"

"టిఫెను కూడా చాలా బాగుంది"-వరుణ్ అమాయకంగా చెప్పటంతో...కిరణ్, ప్రతిమ 'గొల్లు మని నవ్వారు.

"పెళ్ళివారింటి టిఫెను వరకు వెళ్ళిపోయావే! అవునమ్మా...వదిన పేరేమిటో చెప్పనేలేదే?"

"వదినా....?"

తల్లి మొహం చిట్లించి కిరణ్ ను చూసింది.

"మరి...అన్నయ్య పెళ్ళాం వదినే కదా?"

"ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న ఇది? ఆ అమ్మాయిని చూసింది నీకు...వాడికి కాదు...! వదినను చూడాలని నీకు ఆశగా ఉంటే...వెనక్కి తిరిగి చూడు. ఇదిగో ఉన్నది...మీ వదిన"
అత్తయ్య ప్రతిమను చూపించగా...కిరణ్ అదిరిపడ్డాడు. ప్రతిమకు తల తిరిగింది. ఏదో పెద్ద శిఖరంపై నుండి తలకిందలుగా పడుతునట్టు అనిపించింది ప్రతిమకు.

"నా పెళ్ళి కోసం అమ్మాయిని చూడటానికి వెడుతున్నట్టు నాతో ఒక్క మాటకూడా చెప్పలేదేమ్మా? అన్నయ్య కోసం చూడటానికి వెడుతున్నామని అనుకున్నాను…..ఏం అన్నయ్యా నీకు తెలుసా ఈ అమ్మాయిని ఎవరికోసం చూడటానికి వెడుతున్నామో?"

"తెలియదురా! అమ్మ బయలుదేరు అన్నది. బయలుదేరాను"

"ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఇరకాటంలో పెడుతున్నావు?"

"ఇలా చూడరా కిరణ్. వాడికి ప్రతిమనే పెళ్ళాం అని మేము ఎప్పుడో నిర్ణయం చేశాశాం. సమయం వచ్చినప్పుడు చెపితే చాలు అనుకున్నాము. అయినా కూడా మీ నాన్న దాన్ని 'కోడలు పిల్లా...' అనే కదా పిలుస్తారు. అప్పుడే మీఇద్దరికీ ఇది అర్ధం అయ్యుంటుందని  అనుకున్నాను"

"నాకు ఇప్పుడు పెళ్ళి వద్దమ్మా"......విసుగ్గా చెప్పాడు కిరణ్.

"ఏమిట్రా చెబుతున్నావు? ఆ అమ్మాయికి ఏం తక్కువ? నీకు తగిన పిల్లనే కదా చూశాము. జల్లెడ వేసి వెతికేము తెలుసా...ఈ అమ్మయిని కనుక్కోవటానికి? ఈ అమ్మాయి కంటే నీకు సరిపోయే ఇంకో అమ్మాయి ఈ బూమ్మీదే ఉండదు...చెప్పేశాను" 

"నువ్వు ఏం చెప్పినా నాకు వద్దమ్మా?"

"ఎందుకని...అమెరికాలో ఏ అమ్మాయినైనా చూసి పెట్టుకున్నావా? 'ప్రేమా గీమా' అనే అసహ్యం ఏదైనా ఉన్నదా?"

"అలాంటిదేమీ లేదు!"

"మరైతే ఏమిటి నీ ప్రాబ్లం?"

"నా వల్ల కారణాలు చెప్పటం కుదరదు. పెళ్ళి వద్దంటే వద్దు...వదిలేయ్..."

"ఒప్పు తాంబూళాలు మార్చుకున్నాము కదరా కిరణ్. ఇప్పుడు కాదంటే...నా పరువు, మర్యాద అంతా పోతుంది"

"నా సంతోషం కంటే నీకు నీ పరువు, మర్యాదే ముఖ్యమా?"

"ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నీ సంతోషానికి భంగం వస్తుందని అనుకుంటున్నావంటే....నువ్వు ఈ పెళ్ళి వద్దూ అని చెప్పటానికి వేరే ఏదో అర్ధం ఉన్నది. ఎమిటది? నిజం చెప్పు!"

"ఒక్క పుచ్చు కారణం కూడా లేదు. మళ్ళీ అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నా. అక్కడ నాకు ఉద్యోగం రెడీగా ఉన్నది. ఆ ఉద్యోగంలో చేరుదామా...వద్దా అనే కన్ ఫ్యూషన్ లో ఉన్నాను. రెండు రోజుల క్రితమే చేరుదాం అని నిర్ణయం తీసుకున్నాను. అప్లికేషన్ ఫారం కూడా పూర్తి చేసి ఇచ్చాశాను. ఈ టైములో పెళ్ళి ఎందుకని వద్దంటున్నాను"

“సరే...వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం తరువాత పెళ్ళి పెట్టుకుందామని చెబితే సరిపోతుంది. ఆ అమ్మాయి కూడా న్యూ యార్కులో ఏదో పనికోసం ట్రై చేస్తోంది. చాలావరకు ఆ ఉద్యోగం దొరుకుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు కదా"

"ఇలా చూడమ్మా...ఆ అమ్మాయిని నా వదినగా అనుకునే చూశాను. ఇక ఆ అమ్మాయిని నా భార్యగా అనుకొలేను. అలా కాదు, నా పరువు, మర్యాదా కాపాడుకోవలసిందే అని నువ్వనుకుంటే అన్నయ్యకి ఆ అమ్మాయిని కట్టిపెట్టు. నువ్వు చెప్పే వాటన్నిటికీ తల ఊపే వ్యక్తి వాడే"

కారు ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగింది.

కిరన్ గబగబా మేడ మీదకు వెళ్ళిపోగా...అక్కడ మౌనం చోటు చేసుకుంది.

అమ్మా, నాన్నలు ఒకర్ని ఒకరు చూసుకున్నారు!   

                                                                                   (ఇంకా ఉంది)...PART-5

*********************************************************************************