ప్రేమ సుడిగుండం (సీరియల్) (PART-5) ప్రతిమ రాత్రంతా ఏడ్చింది.
అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోనుంటుందని తను కలలో కూడా అనుకోలేదు. 'కోడలు పిల్లా...' అని మామయ్య పిలిచింది నన్ను వరుణ్ భార్యాగా నిర్ణయించుకునేనా? అనుకుంటున్నప్పుడే మంటల్లో కాలుతున్నట్లు అనిపించింది ప్రతిమకు. కిరణ్, 'పెళ్ళి’ వద్దు అని చెబితే మాత్రం ఈ సమస్య తీరిపోతుందా? అతను అతన్ని మాత్రం కాపాడుకుంటే సరిపోతుందా? ప్రతిమను కాపాడ వద్దా? అతను, ఆమె ఒకర్ని ఒకరు ఇష్టపడుతున్నారని చెప్పాలి కదా?
"ప్రతిమా..."
కిటికీ పక్క నుండి కిరణ్ గొంతు సన్నగా వినబడింది. ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూసిన తరువాత కన్నీరు అధికమయ్యింది.
"తలుపు తెరు..."
తలుపు తెరిచిన వెంటనే గబుక్కున లోపలకు వచ్చి గొళ్ళేం పెట్టాడు.
"ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిమా?"
"ఏడవక...నవ్వమంటావా? నువ్వు మాత్రం తప్పించుకుంటే చాలా? నన్ను కాపాడ వద్దా?"
"దాని గురించి మాట్లాడటానికే వచ్చాను. ఈ టైములో మన విషయం బయటకు తెలియటం మంచిది కాదని అనిపిస్తోంది. ఇప్పటికే అమ్మ చాలా కోపంగా ఉన్నది. ఇప్పుడు మన విషయం ఆవిడకు తెలిస్తే ఆవిడ కోపం చాలా ఎక్కువ అవుతుంది. ఆవిడ్ని గౌరవించని మనల్ని విడదీస్తేనే సంతోషం అనే విధంగా సాడిస్టుగా మార వచ్చు"
"అయితే నేను ఇప్పుడేం చేయను?"
"నువ్వు కూడా పెళ్ళి వద్దు అని మొండిగా పట్టుపట్టు, ఏడు. కారణం చెప్పకు! పై చదువులు చదవబోతానని చెప్పు. ఏది ఏమైనా 'వరుణ్ ని నచ్చలేదు’ అని పొరపాటున కూడా చెప్పకు! అలా చెబితే కనుక, వాడికి నిన్ను కట్టపెట్టిన తరువాతే ఇంకోపని చూస్తుంది మా అమ్మ. జాగ్రత్త! ఎలాగైనా తప్పుంచుకోవాటానికి ప్రయత్నించు. ఎప్పుడూ నీ పక్కన నేను ఉండలేను కాబట్టి ఇక్కడ నీ తెలివితేటలే ఉపయోగించాలి. నువ్వూ పెళ్ళికి ఒప్పుకోకపోతే వేరే దారిలేక తన గౌరవాన్ని కాపాడుకోవటానికొసం ఆ అమ్మాయిని వరుణ్ కు ఇచ్చి పెళ్ళిచేయటానికి ప్రయత్నిస్తుంది"
“అమ్మాయి వాళ్ళింట్లో వాళ్ళు వరుణ్ ను ఒప్పుకోవద్దా? మిమ్మల్నే కదా వాళ్ళు అల్లుడిగా చూశారు. వాళ్ళకు మీ జాతకమే వెళ్ళుంటుంది"
"దాని గురించి మనకెందుకు? వాళ్ళు ఒప్పుకోకపోతే వరుణ్ కి వేరే సంబంధం చూడనీ! మన సమస్య తీరిందా..దాంతో వదిలేయి"
“నాకు భయంగా ఉన్నది కిరణ్. నువ్వు మళ్ళీ అమెరికా వెళతానన్నది నిజమా?"
"నిజమే! అక్కడ నాకొక ఉద్యోగం దొరికింది. మన పెళ్ళి జరిగిన తరువాత అందులో చేరుదామని అనుకున్నా. కానీ, ఇప్పుడు ముందే చేరబోతాను. నువ్వు ఆందోళన చెందకు! ఇంకొక సంవత్సరం ఎలాగైనా కాలం గడుపు. ఈలోపు నేను అమ్మని ఎలాగైనా 'కన్ విన్స్’ చేసి మన పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేస్తాను"
ప్రతిమ మౌనంగా ఉన్నది.
“నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవటానికి వాళ్ళకు ఇష్టమే. కానీ, ఎవరి భార్యగా అనే విషయంలోనే చిన్న సమస్య. ఆ సమస్యను త్వరలోనే తీరుద్దాం...సరేనా? కళ్ళు, మొహం తుడుచుకుని ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ఏడ్చిన ఏడుపులో మొహంలోని జిడ్డంతా పోయి మొహం మెరిసిపోతోంది చూడు"
ఈ పరిస్తితులలోనూ అతను ఏడిపించగా...ఆమె ఏడుస్తూనే నవ్వింది. "చి చీ పోరా..." అంటూ అతని ఎద మీద కొట్టింది.
ఇళ్ళు నిశ్శబ్ధంగా ఉన్నది. ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడితే పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడుతున్నట్టు అందరూ మౌనం పాటిస్తున్నారు. అందులోనూ తల్లి మౌనం మరీ భయంగా ఉన్నది. ఆ మౌనానికి కింద ఎటువంటి ప్రణాళిక సిద్దం అవుతోందో అని కిరణ్ కు, ప్రతిమకు భయంగా ఉన్నది.
ఆడ పెళ్ళివారింటికి ఏదో ఒక సమాధానం చెప్పి పంపించాలి కదా! అత్తయ్య ఏం సమాధానం చెప్పి తప్పించుకోబోతోందో అనేది తెలియటం లేదు ప్రతిమకు. అత్తయ ఎదురుగా వెళ్ళటానికే శరీరం వణుకుతోంది. కిరణ్ అరిచిన తరువాత అత్తయ్య ‘పెళ్ళి’ విషయం గురించి మాట్లాడనే లేదు. ఆమె ఏదైన మాట్లాడితేనే కదా కిరణ్ చెప్పినట్టు...'పెళ్ళి వద్దు' అని మొండికేయవచ్చు?
దానికి సమయమే రాలేదు. అత్తయ్య ఎందుకు మౌనంగా ఉన్నదో అర్ధం కావటం లేదు. వరుణ్ ఎప్పటి లాగానే మామూలుగా వెళ్ళటం, రావటం చేస్తున్నాడు. అతను తన జీవితం గురించి ఆలొచించేవాడే కాదు. అమ్మ దగ్గర తన జీవితాన్ని అప్పగించినట్లు ఏటువంటి అలజడి లేకుండా ఉన్నాడు.
మనసులో ప్రేమ భారంగా ఉన్న వాళ్ళకే అలజడి, ఆందోళన. దసరధ మహారాజుకు శ్రీరాముడు ఎలాగో అత్తయ్యకు వరుణ్ అలాగు. వరుణ్ కే ప్రతిమ అని అత్తయ్య చెప్పిన తరువాత అతని ముందుకు కూడా వెళ్ళటానికి భయపడ్డది ప్రతిమ. ముందులాగా మాట్లాడలేకపోయింది.
తల్లి యొక్క నిర్ణయం గురించి వరుణ్ ముఖంలో ఎటువంటి ఉత్సాహమూ, మార్పూ లేదు. అత్తయ నిర్ణయం అతనికి ఇష్టమేనా...ఇష్టం లేదా? ఏదీ అర్ధం కాలేదు! ఎప్పుడూలాగానే భోజనం చేస్తున్నాడు..షాపుకు వెల్తున్నాడు...వస్తున్నాడు. పడుకున్న వెంటనే నిద్ర పోతాడు. ఇలా ఎలా ఉండగలుగుతున్నాడో అర్ధం కావటం లేదు!
వరుణ్ అలా ఉంటే...కిరణ్ ఏమో మళ్ళీ అమెరికా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లను దిగులుపడకుండా చేసుకుంటున్నాడు. 'అత్తయ్య మళ్ళీ ఎప్పుడు ఏ బాంబు పడేస్తుందో?' అనే భయంతో తిరగవలసిన తలరాత ప్రతిమకు మాత్రమే పట్టింది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి