22, నవంబర్ 2019, శుక్రవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-6



                                         ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                            (PART-6)


సరిగ్గా ఒక వారం రోజుల తరువాత ప్రతిమ అత్తయ్య కిరణ్ తో మళ్ళీ పెళ్ళి మాటలు మొదలుపెట్టింది.

"నువ్వు పెళ్ళి చేసుకోకపోతే పోరా. వరుణ్ పెళ్ళికైనా ఉంటావా...?"

"పెళ్ళి ఎప్పుడు?"

"ఇంకా తారీఖు నిర్ణయించలేదు!"

“కానీ, 'నాకు టికెట్టు కన్ ఫర్మ్' అయ్యింది. ఎల్లుండి విమానం. మళ్ళీ నేను తిరిగి రావటానికి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో అవొచ్చు. దాని తరువాత పెళ్ళి పెట్టుకో. పెళ్ళికి తప్పక వస్తాను"

తల్లి అతన్ని కోపంగా చూసింది. తరువాత ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుని తిరిగి వెళ్ళిపోయింది. హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుంది. తల్లి వెనుకే నడిచి వెళ్ళిన కిరణ్ సోఫాలో కూర్చున్న తల్లి ముందు నిలబడి "అమ్మా..." అని పిలిచాడు.

ఆమె తల పక్కకు తిప్పుకుంది.

“నువ్వు మాట్లాడకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేసి వెళతాను” అన్నాడు కిరణ్.

"నీకు నా మీద కోపం ఉండొచ్చమ్మా. నువ్వు చెప్పి నేను వినలేదు అనే కలత ఉండొచ్చు. ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకుని నేను నీకు మర్యాద, గౌరవం ఇవ్వటం లేదనే నిర్ణయానికి రాకు! పెళ్ళనేది ఇంకొకరికోసం చేసుకో లేము. నీకొసం నేనెలా తినలేనో, నిద్రపోలేనో, స్నానం చేయలేనో, అదేలాగానే...పెళ్ళి కూడా చేసుకోలేను. నీ అకలికి నువ్వే తినాలి. నీ శరీరం శుభ్రంగా ఉండాలంటే నువ్వే స్నానం చేయాలి. నీకు నిద్ర వస్తే నువ్వే నిద్రపోవాలి. నేను వెళ్ళిన తరువాత వీటి గురించి ఆలొచించి చూడమ్మా. నా మనసు నీకు అర్ధం అవుతుంది"

కిరణ్ వెళ్ళిపోయాడు. అత్తయ్య మొహం ఎరుపెక్కింది....అతను వెళ్ళిపోయిన వైపే చూస్తూ నిలబడింది. ఆ తరువాత భర్త వైపుకు తిరిగింది.

"మీ కొడుకు ఏం చెప్పి వెడుతున్నాడో విన్నారా? నా ఆకలికి నేనే తినాలట. నా మురికి పోవాలంటే నేనే స్నానం చేయాలట. మాతృత్వానికి ఎక్కడుంది తత్వం? మిగిలిన వాళ్ళకు కావాలంటే ఇది సరిపోవచ్చు. తల్లికి ఎలా సరిపోతుంది? నా అకలికి వాడు తినలేడు. కానీ, వాడి అకలికి వాడు తింటేనే నా కడుపు నిండిపోతుందే!

వాడి అకలికి నేను తినలేను. కానీ వాడు ఆకలితో పస్తుంటే నావల్ల తినటం కుదరదే! వాడికోసం నేను స్నానం చేయలేనట? ఎనిమిదేళ్ళప్పుడు వాడికి ఆట్లమ్మ పొసినప్పుడు ఒకరోజుకు మూడుసార్లు వాడికోసం నేను స్నానం చేసి ప్రతి గుడి మెట్టూ ఎక్కొచ్చానే. పదేళ్ళప్పుడు వాడికి ఆగకుండా విరోచనాలు అయినప్పుడు ఆసుపత్రిలో చేరిస్తే...అటూ ఇటూ కదలలేక, ఐదు రోజులు స్నానం చేయలేక వీడితోపాటూ నేనూ కంపుతో ఉండిపోయానే.

వీటన్నిటికీ ఏం తత్వం చెప్పగలడు వాడు? అమెరికా వెళ్ళి చదువుకున్నాడనే గర్వంతో మాట్లాడుతున్నాడు...పొతే పోనీ. వాడి ఆకలికి వాడే తినని. వాడికి కావాలంటే స్నానం చేసుకోనీ, నిద్రపోనీ, పెళ్ళి కూడా చేసుకోనీ...ఎలా పోయినా పరవలేదు. నేనేమీ బాధపడను.

కన్న పేగు కోసినప్పుడే అన్నీ బంధాలనూ కోసేయటం తెలిసుంటే ఈ రోజు ఇలా పిచ్చిదానిలా నాలో నేనే మాట్లాడుకునే దానిని కాదు. తెలియలేదే! భగవంతుడు దేహం మొత్తం ప్రేమను పెట్టాశాడు...ఏం చేయగలను? అభిమానం, ప్రేమ అన్నీ ఒన్ వే ట్రాఫిక్కులాగా అయిన తరువాత ఎవరిని ఎవరు కట్టడి చేయగలరు?"

ప్రతిమ అత్తయ్య శరీరం అంతా ఊగిపోయింది. మామయ్య భయపడిపోయారు.

"రామలక్ష్మీ...నువిప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు? అన్నీ సర్ధుకుంటాయి. ఎవరైనా ఒకరు విడిచిపెడితేనే జీవితం. వాడికి ఇష్టం లేకపోతే వదిలేయి"

"ఎలా వదిలి పెట్టగలను? వాడి మీద నాకు శ్రద్ద ఉండకూడదా? ఆశ ఉండకూడదా? ఎంతో కస్టపడి వెతికి వెతికి అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ఎం తక్కువని వద్దంటున్నాడు?"

"ఎవరికి తెలుసు? ఇప్పుడు దాని గురించి మాట్లాడితో మనకేమొస్తుంది? వదిలిపారేయి. ఇక మీదట జరగవలసిన దాని గురించి ఆలొచిద్దాం"

"ఇంకా ఏం జరగాలట...నా కర్మకాండలు తప్ప"

"అమ్మా...ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు?".....వరుణ్ అమ్మను చూసి గట్టిగా అడిగాడు.

"ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏది చెప్పినా వినటానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఆజ్ఞ ఇవ్వు. వాడిని వాడి దారిలో పోనివ్వు. వాడి గుణం నీకు తెలియదా? ఈ ఒక్క విషయం పట్టుకుని నువ్వు వాడ్ని తిట్టటం సరికాదు"

"వాడి గురించి ఇంక మాట్లాడకురా! భుజాలకుపైన పెరిగిన తరువాత కూడా పిల్లాడు అని అనుకున్నా చూడు...నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సరే...నువ్వైనా నా మాట వింటావా...లేకపోతే నువ్వూ...?"

"నేను ఇందాకే చెప్పను కదమ్మా. బావిలో దూకు అని చెప్పు...దూకటానికి రెడీగా ఉన్నాను"

"అలాగైతే ప్రతిమను పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా"

"ఇష్టమేనమ్మా!"

నిప్పులను తొక్కు తున్నట్టు ప్రతిమ వాళ్ళను చూసింది.

"హూ...అలా ఒక కొడుకు; ఇలా ఒక కొడుకు! ప్రతిమా ఇక్కడికి రా"

ఆమె వణుకుతూ అత్తయ్య ముందుకు వచ్చి నిలబడింది. అత్తయ్య ప్రతిమను పైకీ కిందకూ ఒకసారి చూసింది.

"జ్ఞాపకముందా ప్రతిమా...అప్పుడు నీకు ఎనిమిదేళ్ళు. నా తమ్ముడూ, అతని భార్య అంత చిన్న వయసులో చనిపోతారని ఎవరన్నా అనుకున్నారా? అమ్మా, నాన్నల శవాలను చూసి పెద్దగా ఏడుస్తున్న నిన్ను అమాంతం కౌగలించుకున్నాను.

‘నేనున్నానమ్మా నీకోసం...’ అని చెప్పి నిన్ను నా గుండెలమీద వేసుకుని, ఇక్కడికి పిలుచుకు వచ్చాను. ఇదిగో ఈ నిమిషం వరకు నా గుండెళ్ళోనే ఉంచుకున్నాను. నా పిల్లలిద్దరి కంటే నిన్నే ఎక్కువగా గమనించాను. మీ అమ్మ జ్ఞాపకం నీకు రాకుండా ఉండాలని ప్రేమంతా కుమ్మరించి ఆ జ్ఞాపకాన్ని తుడిచేశాను.

కిరణ్ కి ఆట్లమ్మ పోసి వాడికి తలకు స్నానం చేయించిన నాలుగోరోజు నీకు ఆట్లమ్మ పోసింది. విమరీతమైన జ్వరం. నాలుగు రోజులు నువ్వు కళ్ళు తెరవకుండా పడుకున్నావు. రోజూ గుడికి వెళ్ళటం, వేడుకోవటం, వచ్చి నీకు కావలసింది చూసుకోవటం...ఇదే నా పని. నిప్పుల్లో నడుస్తానని వేడుకున్నాన్ను. ఆట్లమ్మ నిన్ను విడిచిపెట్టింది. నీకు పూర్తిగా తగ్గిన తరువాత నిప్పులు తొక్కడానికి మన ఊరి గుడికి వెళ్ళాను. ‘వద్దు అత్తయ్యా....కాళ్ళు కాల్తాయి’ అంటూ నా కాళ్ళను చుట్టుకున్నావు. ‘ఇది నిప్పు కాదరా నాన్నా....పువ్వులాంటిదిరా’ అని నిన్ను సమాధాన పరిచి నేను నిప్పుల్లో నడిచాను.

నువ్వు చెప్పి నేను వినలేదని నువ్వు నాతో మూడురోజులు మాట్లాడలేదు. ఆ మూడు రోజులూ నేను వ్రతం. 'నువ్వు మాట్లాడితేనే నేను తింటాను’ అని చెప్పాను. నేను సరదాగా చెబుతున్నాను అనుకుని మొదట్లో నువ్వు మాట్లాడనే లేదు. మూడో రోజు నేను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. అది చూసి నువ్వు భయపడి నాతో మాట్లాడావు! నీ చిన్నారి చేతులతో నాకు అన్నం కలిపి పెట్టావు. ‘ఇక మీదట నీతో మాట్లాడకుండా ఉండను అత్తయ్యా’ అని ఏడ్చావు!"

ప్రతిమ కన్నీరుతో అత్తయ్యను చూసింది.

"ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానో అని నువ్వు అనుకోవచ్చు! ఇంత కష్టపడి నిన్ను పెంచానని చెప్పటానికి మాత్రం కాదు. పది నెలలు మోసి కని పెంచిన వాడే...పది నిమిషాల్లో 'నీ ఆకలికి నువ్వు తిను’ అని విదిలించుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎవరి మీద నేను అధికారం చేయగలను? ఎవరి దగ్గర నేను ఏమిటి ఎదురు చూడ....?"

ఆ మాట ముగించేలోపు రామలక్ష్మీ సడన్ గా గుండె పట్టుకుంది. నుదురు, గొంతు గబుక్కున చెమటతో నిండిపోయంది. కింద పడుతున్న ఆమెను ఒక్క గెంతుతో వరుణ్, ప్రతిమ చెరో పక్క పట్టుకున్నారు.

"ఎమైంది అత్తయ్యా"....ప్రతిమ టెన్షన్ పడి తల్లడిల్లిపోయింది.

డాక్టర్ కు అర్జెంటుగా ఫోన్ చేశారు మామయ్య!

****************************************************************************************************                   
                               ఇంకా ఉంది.....Continued in: PART-7

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి