24, నవంబర్ 2019, ఆదివారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-7
                                       ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                            (PART-7)


వెంటనే 'బై పాస్ సర్జరీ’ చేయాలని చెప్పాడు డాక్టర్. భయంతో మామయ్యను చూసింది ప్రతిమ.

"మేము ఆమెను చూడొచ్చా?"....డాక్టర్ను అడిగాడు మామయ్య.

"చూడండి...కానీ ఎక్కువగా మాట్లాడి ఆమెను ప్రయాస పెట్టకూడదు."

ఐ.సి.యూ అద్దాల తలుపులు తెరుచుకుని మామయ్య, ప్రతిమ, వరుణ్ లోపలకు వెళ్ళారు. అత్తయ్య బాగా నీరశంగా ఉన్నది. వాళ్ళను చూసిన వెంటనే కంట తడి పెట్టుకుంది. అతి శ్రమపడుతూ వస్తున్న ఏడుపును ఆపుకుని అత్తయ్య చేతులు పుచ్చుకుంది ప్రతిమ.

"నాకు పోవలసిన టైము వచ్చేసిందే ప్రతిమా"

"అలా మాట్లాడకండి అత్తయ్యా! మీకు ఏమీ లేదు. ఇప్పుడంతా 'బై పాస్’ సర్వ సాధారణం"

“దేవుడు తారీఖు 'కన్ ఫర్మ్' చేస్తే బై పాసూ లేదు...జై పాసూ లేదు. దేవుడు నా చివరి యాత్రకు పాస్ ఇచ్చాశాడు!”

“అలా అంతా మాట్లాడకండి అత్తయ్యా! నన్ను వదిలి వెళ్ళిపోగలరా మీరు? మీరున్నారనే ధైర్యంతోనే మా అమ్మా-నాన్నలను తీసుకు వెళ్ళాడు ఆ దేవుడు. ఆయనకు తెలుసు. మిమ్మల్నీ కూడా పిలుచుకు వెడితే....నేను అనాధ అయిపోతానని. అలాగంతా ఆయన ఒకరోజూ చెయ్యడు"

"నాకు నమ్మకం లేదే ప్రతిమా. కొన్ని రోజులుగా నాలో ఏదో భయం...'చచ్చిపోతానేమో అని! అందుకనె మీ పెళ్ళి జరిపేద్దామని అవసరపడ్డాను. అంతలోపు అంతా గందరగోళంగా తయారైయ్యింది. కిరణ్ పోతే పోనీ. వాడు ఎలా పోతే నాకేమిటి. వాడిని నా కొడుకే కాదని అనుకుంటా.

నువ్వైనా నాకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటావా ప్రతిమా? నేను కోరుకున్నట్టు వరుణ్ ని పెళ్ళిచేసుకుంటావా? నువ్వు వయసుకు వచ్చిన రోజే నాకు అలాంటి ఆలొచన వచ్చింది. పోను, పోనూ అది ఆశగా మారింది. నిన్ను వాడికిచ్చి పెళ్ళి చేసి చివరి వరకు నాతోనే ఉంచుకోవాలనేది నా ఆశ! ఏమిటి...నా ఆశ నెరవేరుస్తావా?"

ప్రతిమ ఆశ్చర్యంగా అత్తయ్యను చూసింది. ‘భగవంతుడా... ఎందుకు నన్ను ఇంత ఇరకాటమైన పరిస్థితిలో ఉంచావు? అత్తయ్య ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? 'సరి’ అని చెప్పి ఆవిడ్ని సంతోషపరచాలా? 'కుదరదు’ అని చెప్పి ఆవిడ్ని చంపేయాలా? అత్తయ చావుకు నేను కారణమవటానికా ఆవిడ నన్ను పెంచింది? తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించిందే?’

"ఏమిటే ఆలొచిస్తున్నావు...కిరణ్ లాగా నువ్వూ ఎవరినైనా?"

"లేదు అత్తయ్యా! లేనే లేదు"

"నువ్వైనా నా కోరికను తీర్చి నాకు ప్రశాంతత ఇచ్చావే! ఇక నేను చచ్చిపోయినా పరవాలేదు!"

"మీరు ఎక్కువ మాట్లాడ కూడదు అత్తయ్యా"

"వరుణ్ తో కలిసి ఒకసారి నిలబడు. నేను చూడాలి"

ఎటువంటి భావన లేకుండా వరుణ్ కి దగ్గరగా వెళ్ళి నిలబడింది ప్రతిమ.

"ఏమండీ...ఈడు-జోడు ఎలా ఉందో చెప్పండి? బ్రహ్మాండంగా ఉంది కదూ? ఉండదా మరి? చేర్చిందెవరు...నేను కదా?"

“రామలక్ష్మీ ఎందుకు అంతగా ఏమోషనై మాట్లాడ్తావు? నీకు వొళ్ళు బాగుండలేదు. ఐ.సి.యు లో ఉన్నావు! చాలు...ప్రతిమా రామ్మా పోదాం. లేకపోతే ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది.

మామయ్య వాళ్ళను బయటకు తీసుకు వచ్చాడు.

వరుణ్ కి దగ్గరగా నిలబడ్డ క్షణం నుండి ప్రతిమ తనలో ఏదో విరిగి తాను శిలలాగా అయిపోయినట్లు భావించింది. ఇక ఆ రాయికి స్పర్శ ఉంటుందని అనిపించటంలేదు. మరుసటి రోజు ప్రొద్దున అత్తయ్యను 'ఆపరేషన్ ధియేటర్’ కి తీసుకు వెళ్ళారు. ఐ.సి.యు నుండి బయలుదేరి ‘ఆపరేషన్ ధియేటర్’ వరకు అత్తయ్య స్టెక్చర్ తో ప్రతిమ నడిచింది. భయమూ, బాధతో మామయ్య, వరుణ్ కొంచం వెనుకగా వెళ్ళారు.

"వరుణ్ ఇంకా ఒక చిన్న పిల్లాడే ప్రతిమా. వాడిని ఇకపై నువ్వే చూసుకోవాలి. కౌశల్యకు రాముడు ఎలాగో వీడు నాకు అలాగు. వీడ్ని చూసుకోవే ప్రతిమా...నా బంగారు తల్లీ..."

'ఆపరేషన్ ధియేటర్’ తలుపులు మూసుకోవటంతో...ప్రతిమ బయట శిలలాగా నిలబడిపోయింది.

నాలుగు గంటలు జరిగింది ఆపరేషన్. అంతవరకు బయట నిలబడిన వాళ్ళు సగం ప్రాణం కోల్పోయారు. వరుణ్ పచ్చి మంచి నీళ్ళూ కూడా తాగకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మామయ్య, 'తన శరీరంలో సగం పోతుందేమో?' అనే భయంలో కృంగిపోయి మోకాళ్ళపై తలపెట్టుకుని కూర్చున్నారు. ఎవరూ ఎవరికీ ధైర్యమో, అభయమో చెప్పలేని స్థితిలో ఉన్నారు. గడియారంలోని ముల్లులు మాత్రం వాటి భాద్యత అవి నిర్వహిస్తున్నై.

సరిగ్గా ఒంటి గంటకు 'ధియేటర్’ తలుపులు తెరుచుకున్నాయి...తలకు ఒక టోపి, ముక్కుకు ఒక మాస్క్ తో డాక్టర్ బయటకు వచ్చాడు. అందరూ గుండెలను గుప్పెట్లో పెట్టుకుని లేచారు.

"ఆపరేషన్ సక్సస్స్ మిస్టర్ వరుణ్. మీ అమ్మగారు బాగున్నారు. ఇంకో గంటలో ఐ.సి.యు లోకి సిఫ్ట్ చేస్తాము. అప్పుడు మీరు చూడొచ్చు"

'డాక్టరా....దేవుడా? దేవుడు లేడని ఎవరు చెప్పింది? ఇదిగో ఈ డాక్టర్లందరూ ఎవరట?'

వరుణ్ కన్నీటితో చేతులెత్తి డాక్టర్ కు దన్నం పెట్టాడు. డాక్టర్ చేతులు పట్టుకుని చిన్న పిల్లలాగా ఏడ్చింది ప్రతిమ.

గంట తరువాత ధియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. ఎన్నో రకాల ట్యూబులు గుచ్చబడ్డ పరిస్థితిలో చక్రాల మంచంతో తీసుకురాబడ్డది అత్తయ్య. పునర్జన్మ ఎత్తి వస్తున్న ఆమెను ఆనందంతోనూ, ఆందొళనతోనూ చూశారు.

"ప్లీజ్...కొంచం దూరంగా జరగండి. ఇన్ ఫెక్షన్ ఏర్పడొచ్చు. మేము పిలిచిన తరువాత వస్తే చాలు"....చెప్పింది నర్స్.

అత్తయ్య ఐ.సి.యు లోకి తీసుకు వెళ్ళబడింది. డాక్టర్ల పరిశోధనలు మొదలయ్యాయి. నర్సులు వెళ్ళటం, రావటం జరిగింది.

ముప్పావు గంట తరువాత డాక్టర్లు పిలిచారు. ప్రత్యేకమైన సాక్స్, కోటు వేసుకుని ముగ్గురూ లోపలకు వెళ్ళారు.

అత్తయ్యకు కొంచంగా సృహ వచ్చింది. డాక్టర్ చాలా ప్రశ్నలు వేశాడు. ముగ్గుర్నీ చూపించి పేర్లు చెప్పమన్నారు. అత్తయ నీరసమైన గొంతుతో ముగ్గురి పేర్లూ చెప్పింది. "వెరీ గుడ్"...!- డాక్టర్ జరిగి వచ్చాడు.

“షీ ఈజ్ పర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్ ! మూడు రోజులు ఐ.సి.యు లో ఉంచుతాము. నాలుగోరోజు వార్డుకు పంపిస్తాను. ఎనిమిదో రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరేనా? మీరందరూ భోజనం చేశారా...లేకపోతే భొజనం చేసి రండి. చూడటానికి బాగా టయర్డ్ గా ఉన్నారు. ఇంకేముంది? బాగా తినండి"

డాక్టర్ ఉత్సాహాంగా చెప్పేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన వెంటనే ముగ్గురూ క్యాంటీన్ కు వెళ్ళారు.

****************************************************************************************************                                   ఇంకా ఉంది.....Continued in: PART-8

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి