28, నవంబర్ 2019, గురువారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-9



                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                              (PART-9)


ఇంట్లో ఎవరూలేని సమయంలో కంప్యూటర్ ముందు కూర్చుంది ప్రతిమ.

“ఈ ఉత్తరం నీకు దిగ్భ్రాంతి, విస్మయము కలిగించవచ్చు కిరణ్. నామీద విరక్తి కూడా కలుగజేయవచ్చు. అందుకని విషయాన్ని నీకు తెలియ పరచకుండా దాచనూలేను. ఎలాగైనా చెప్పే తీరాలి. ఇక్కడ చాలా విషయాలు జరిగినై. అత్తయ్యకు 'హార్ట్ అటాక్’ వచ్చింది. వెంటనే 'బై పాస్’ సర్జరీ చేయటంతో ఆవిడ మరణ కోరలను తప్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా నీమీద కోపమూ,విరక్తి తగ్గలేదు. ఆమె చెప్పిందే వేద వాక్కుగా పాఠించే అలవాటున్న ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా ఒక ఎదిరింపు గొంతు వినబడిన బాధే ఆమె గుండె తట్టుకోలేక ‘హార్ట్ అటాక్’ కు కారణమయ్యింది అని అనుకుంటున్నారు.

ఆ పరిస్థితుల్లో ఆమెను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ముఖ్యంగా నాకు! కారణం, నా తల్లి-తండ్రులు చనిపోయి నేను అనాధగా నిలబడ్డప్పుడు, నా మీద అనురాగము చూపి తనతో పాటూ తీసుకు వచ్చి, మిమ్మల్ని పెంచినట్లు నన్నూ పెంచటమే. అలాంటి ఆవిడకి నేను కృతజ్ఞత చూపవలసిన భాద్యత నాకుంది. అలా చేయకపోతే అత్తయ్యకు ద్రొహం చేసిన దానిని అవుతాను. అలా ద్రోహం చేసి ప్రేమలో గెలవాలా....లేక ప్రేమకు ద్రోహం చేసి అత్తయ్య ప్రాణం కాపాడనా? అనే పరిస్థితిలో నేనొక నిర్ణయానికి వచ్చాను.

మరణంతో పాటూ నన్నూ కూడా జయించింది అత్తయ్య. ఇంకొకరి ఆకలికి మనం తినలేము. ఇంకొకరి మురికి పోవటానికి మనం స్నానం చేయలేమనేది నిజమే! కానీ, మరొకరిని సంతోషపెట్టటం మన వల్ల అవుతుంది కాబట్టి అలా చేయటం కరెక్టే కదా? మనిషి ఇష్టపడినదంతా జరగటం లేదు. మనం ఇస్టపడ్డా తీర్మానించేది ఆ భగవంతుడే. భగవంతుడి లెక్కకు కారణం అడగటమో...ఆయన లెక్కను అర్ధం చేసుకోవటమో ఎవరివల్ల అవుతుంది? ఇది అత్తయ్య నిర్ణయం అనేది మరిచిపోయి, ఇంకా లోతుగా ఆలొచిస్తే అది దేవుడి నిర్ణయం అనేది స్పష్టమౌతుంది. అలాంటి స్పష్టత నాలో కలిగింది.

'అభిమానం' అనే పదానికి చాలా అర్ధాలు ఉన్నాయి. అర్ధం వేరవుతోందేమో కానీ పదం చెరిగిపోదు. మునుపు నీ మీద ఉన్న స్నేహం వేరే రూపంలో ఉండేది. ఇక నీ వదినగా ఉండి నా స్నెహం కొనసాగుతుంది. దీనిని స్వీకరించుకోవలసిందే. అదే సమయం ప్రేమకు నేను ద్రోహం చేశాను అని చెప్పటానికి నేను నిరాకరించటం లేదు. దీనికి కారణం ఏమైయుంటుంది అని ఆలొచించి చూస్తే, ఏది ఏమైనా నేను తల్లి-తండ్రులు లేని దానిని అనే పరిస్థితి, దాని వలన ఏర్పడిన భయము, చేతకాని తనమూ...ఇవే కారణమనిపిస్తోంది. ఏది ఏమైనా అత్తయ్య నన్ను పెంచి, పోషించిన ఆవిడే కదా! పెంచిన విశ్వాసమే లేకుండా గుండెల మీద తంతోందే అనుకోకూడదు కదా!

మొత్తానికి నేను అహల్యలా రాయినైపోయాను కిరణ్.

ఆమె తెలియక తప్పు చేసింది. నేను తెలిసే నీకు ద్రోహం చెయ్యబోతున్నాను. దానికి శిక్షగా నేను నాలోని భావాలను పోగొట్టుకుని రాయిలాగా నిలబడ్డాను. 'ఏదో ఒక జన్మలో నేనూ శాప విమోచనం పొంది నిన్ను చేరుతాను’ అని అనుకుంటున్నాను. అంతవరకు ఈ జన్మలో ఎవరికి ఏమి విధించబడిందో అది అనుభవించడమే అందరికీ ఉత్తమం.

కన్న తల్లితో వైరాగ్యం వద్దు. సమాధాన పరచి ఆమెతో మాట్లాడు. ఆమె నీకొసం చూసి ఉంచిన ఆమ్మాయి కూడా మంచి అమ్మాయే. నాకంటే అన్ని విధాలా నీకు సరిపోతుంది. కాలం మన అందరి గాయాలనూ మానిపిస్తుందని నమ్ముదాం"

ఈ-మైల్ పంపించి, కంప్యూటర్ ఆఫ్ చేసి లేచింది ప్రతిమ.

అప్పుడే ప్రతిమ అత్తయ్య లోపలకు వచ్చింది.

" ప్రతిమా, వచ్చే పదహారో తారీఖున మంచి ముహూర్తం ఉన్నదట. ఆ మూహూర్తం ఖాయం చేసుకోమని శాస్త్రిగారు చెప్పారు. సరిగ్గా ఇంకా ఇరవై రోజులే ఉన్నది. ఈ కొద్ది రోజుల్లో నేను ఎలా నీ పెళ్ళి పనులు ముగించబోతానో తెలియటం లేదే ప్రతిమా. భయంగా ఉన్నది. ఎన్ని పనులు ఉన్నయ్యో?"

అత్తయ్య తన సంతోషాన్ని భయం అంటోంది. ప్రతిమ నవ్వటానికి ప్రయత్నించింది. నవ్వు ప్రాణులలో పుట్టింది. రాయికి ఏక్కడుంది భావాలు?

పెళ్ళి పనులు చక చక జరగటం మొదలయ్యింది. కిరణ్ దగ్గర నుండి ప్రతిమకు ఈ-మైల్ వచ్చింది.

"ధన్యవాదాలు! విశ్వాశం అనే పేరుతో నువ్వు నాకు మాత్రం ద్రోహం చెయ్యటంలేదు. వరుణ్ కు కూడా ద్రోహం చేస్తున్నావు. వాడు ఏం తప్పు చేశాడని వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు! రాయి అయిపోయానని నువ్వు చెప్పటం నిజమైతే....నీవల్ల అతనితో దాంపత్య జీవితం ఎలా జరుపగలవు? నువ్వు నా ప్రేమికురాలువు అయితే వాడు నా అన్నయ్య. మంచివాడు. అమాయకుడు. మీ ఇద్దరి జీవితాలూ దీని వల్ల నాశనమవుతాయనేది నీకు తెలియదా? నిన్ను నాశనం చేసుకొవటానికి నీకు హక్కు ఉంది. నా అన్నయ్య ప్రశాంతతను పాడుచేసే హక్కు నీకు లేదు.

నువ్వు నాకు దొరకకుండా పోతున్నావనే ఈర్ష్యతో ఇలా చెప్పటం లేదు. వరుణ్ మీద నాకున్న సహోదర అభిమానంతో చెబుతున్నాను. నిన్ను రాయిగా చేసుకున్నావని నువ్వు చెప్పటం గనుక నిజమైతే...వాడ్ని వదిలేయి లేకపోతే వాడి దగ్గర అన్ని నిజాలూ చెప్పి, వాడివలనే శాప విమోచనం పొంది ఒక ఉన్నత శిఖరానికి ఎదగటానికి ప్రయత్నించు. దీని కంటే చెప్పటానికి ఏమీ లేదు. అమ్మతో నాకేమీ జన్మ విరోధం లేదు. పోను పోను ఇది ఆవిడే అర్ధం చేసుకుంటుంది"

కిరణ్ పంపిన ఈ-మైల్ చదివిన ప్రతిమ గందరగోళంలో పడింది.

*************************************************************************************************                                      ఇంకా ఉంది.....Continued in: PART-10

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి