ప్రేమ సుడిగుండం (సీరియల్) (PART-10) గందరగోళంలో పడిన ప్రతిమను ఆలొచనలు చుట్టుముట్టాయి.
మరణమే అన్ని సమస్యలకూ ముగింపు తెస్తుంది అనుకున్న ప్రతిమకు చచ్చిపోవాలనుకున్న ఆలొచనకూడా వచ్చి అది ముగింపు కాదు అని అనుకోవడంతో ఆ ఆలొచన కూడా మాయమైపోయింది. కిరణ్ చెప్పినట్లు వరుణ్ కి కూడా ద్రొహం చేస్తోందా ఆమె? అదే నిజమైతే అది పాపం కదా? అతిపెద్ద పాపం కాదా? కిరణ్ చెప్పినట్లు వరుణ్ దగ్గర అన్నీ చెప్పేస్తే? అన్నిటినీ వినేసి ‘అమ్మను కాదని నేను ఏమీ చేయలేను’...అని అతను చెప్పేస్తే?...అలాగైతే నేనేం చేయాలి?
కిరణ్ రాసిన ఒక్కొక్క అక్షరపంక్తి నిజమే. అత్తయ్య కోసం వరుణ్ తన మెడలో కట్టే తాలిని భరించవచ్చు. కానీ, మంచంలో అతన్ని భరించటం నిజంగానే ప్రతిమ వల్ల కాదు!
కిరణ్ మనసులో కాపురం చేసిన తరువాత, ఇంకొకడితో మంచం పంచుకోవటం సాధ్యం కాదు.
'కారణ మేమిటో?' అని వరుణ్ అడిగితే...ఏం సమాధానం చెబుతుంది? 'నా మనసులో నీ తమ్ముడున్నాడు...'అనా? ఇది విని తల్లడిల్లిపోడా అతను!
ఆ అమాయకుడిని గాయపరచటానికీ...అతని జీవితాన్ని నాశనం చేయటానికి ఈమెకు హక్కు ఉందా? అత్తయ్యకు కృతజ్ఞతను చూపుతున్నట్టు అనుకుని, ఇద్దరు మగవాళ్ళకు ద్రోహం చేయటం మహా పాపం కాదా?'
ప్రతిమ తల్లడిల్లిపోయింది.
రాత్రంతా ఆలొచించి ఒక నిర్ణయానికి వచ్చింది...'వరుణ్ తో అన్ని విషయాలూ చెప్పేయాలి!' అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. పెళ్ళి తరువాత చెప్పటం కంటే ...పెళ్ళికి ముందు, ఇప్పుడే చెప్పటం ఉత్తమం అని అనిపించింది.
వరుణ్ తో మాట్లాడే సంధర్భం కోసం వెతికింది. అతన్ని ఒంటరిగా పట్టుకోవడమే పెద్ద చిక్కుగా ఉన్నది. షాపులో పనివాళ్ళు ఉంటారు. ఇంట్లో అత్తయ్య. అదే సమయం అతను ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. పెళ్ళి అనే మాట అతనిలో కొంచం కూడా మార్పు తీసుకురాలేదు. ఎప్పుడూ లాగానే వెళ్ళటం, రావటం చేస్తున్నాడు. అతని ముఖ భావల నుండి కూడా ఏమీ తెలియటం లేదు.
అతని మనసులో ఏమున్నదో? అమ్మకోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా? లేకపోతే నిజంగానే ప్రతిమను సంతోషంగా పెళ్ళి చేసుకోబోతాడా? ఏమీ అర్ధం కావటంలేదు! ఏది ఏమైనా ప్రతిమ మనసులోని నిర్ణయం గొప్పది. అతనితో చెప్పే కావాలి. తుఫానే ఏర్పడినా పరవాలేదు. లేక, ఆమె వలన ఒక సుఖమూ ఉండబోదూ అని తెలుసుకున్న తరువాత కూడా అమ్మకోసం ఆమెతో పెళ్ళికి ఒప్పుకుంటే అతని జీవితం నాశనం అవటానికి అతనే కారణమవుతాడు కానీ ప్రతిమ కారణం అవదు.
"ప్రతిమా"
పిలుస్తున్న గొంతు వినబడటంతో...కిందకు దిగి వచ్చింది.
అత్తయ మొహంలో ఏదో గందరగోళం.
"ఏమిటి అత్తయ్యా?"
"నాకు ఒక ఉపకారం చేస్తావా?"
"చెప్పండి..."
"పెళ్ళి చూపులకు వెళ్ళామే, వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది.'ఎప్పుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుందాము?' అని అడుగుతున్నారు. నా ఆరొగ్యం బాగాలేదని ఒకసారి సాకు చెప్పి తప్పించుకున్నాము. ఇకమీదట తప్పించుకోలేము. మన ఇంట్లో జరిగిన తంతు వాళ్ళకు తెలియక్కర్లేదు. అదే సమయం ఈ సంబంధమూ మనం విడిచి పెట్ట కూడదు. నువ్వు వాళ్ళింటికి వెళ్ళి...ఆ అమ్మాయితో మాట్లాడు. కిరణ్ అర్జంటుగా మళ్ళీ అమెరికా వెళ్ళాడని చెప్పు.
'ఆరు నెలలు ఆగగలరా?' అని అడుగు. ఈ ఇంట్లో నా తరువాతి స్థానం నీదే కదా! ఆ బాధ్యతను ఇప్పుడే తీసుకో. కిరణ్ దగ్గర కూడా మాట్లాడు. అతని మనసును మార్చి, ఈ పెళ్ళికి వాడ్ని ఒప్పుకునేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. నాకోసం ఇది చెయ్యి! నా కంటే నువ్వు ఈ సమస్యను మంచి విధంగా పరిష్కరించగలవనే నమ్మకం నాకు ఉన్నది"
"చూస్తాను అత్తయ్యా...ప్రయత్నిస్తాను..." సన్నని గొంతుకతో అత్తయ్యకు చెప్పి మేడపైకి వచ్చింది. ఒకటి మాత్రం ప్రతిమకు బాగా అర్ధమయ్యింది. ‘ఏదో ఒక కారణంతోనే అత్తయ్య కాయలను జరుపుతోంది. ఆమె సాధారణమైన మనిషి కాదు. ఆమెకు ఏదో ఒక సందేహం ఏర్పడింది. లేకపోతే కిరణ్ తో నా ప్రేమ గురించి ఖచ్చితంగానే తెలిసుంటుంది! ఆ ప్రేమ ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదని, కిరణ్ న్ని నేను పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేదని బాగానే అర్ధమయ్యింది’
'ఏందుకు ఇష్టం లేదు?' అనేది అత్తయ్యకు మాత్రమే తెలుసు. ఆమె మనసులో వేసుకున్న లాభ-నష్ట లెక్కలు ఆమెకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అత్తయ్యను ఏమీ అడగలేము. ప్రతిమకు ఆమె అత్తయ్య అయితే...కిరణ్ కి ఆమె అమ్మ. తల్లి ప్రేమ ముందు అత్తయ్య ప్రేమ నిలబడ లేదు. ఆమె వరకు కిరణ్ ఒక వెల కట్టలేని రత్నం. అది కొనాలనుకునేవారు గొప్ప అంతస్తు గలవారై ఉండాలనేది ఆమె ఆలొచనేమో?
తల్లి-తండ్రి లేక తన దగ్గర ఏమీలేని దానిగా పెరిగిన ఒకత్తికి ఎందుకు వెలకట్టలేని రత్నం? అనుకునే అత్తయ్య ఆ రత్నాన్ని బయట అమ్మటానికి ప్రయత్నిస్తోంది. అదే సమయం ఆమె లెక్క ప్రకారం ఆమెకు కొంచం మందంగా కనిపించే పెద్ద కొడుకు వరుణ్ కి బయటి నుండి సంబంధాలు రావటం కష్టం అనేది ఆమే నిర్ణయించుకుని, అనాధ అనే అంతస్తులో ఉన్న ప్రతిమను కట్టబెడితే, పెద్ద కొడుకుకు ప్రతిమను పెళ్ళి చేసిచ్చి మేనకోడలును కోడలుగా చేసుకున్నదే అని అందరి దగ్గరా పెద్ద మనసును నిరూపించుకునే అవకాశం కూడా దొరుకుతుంది.
ఒకే రాయితో రెండు కాయలు. ఎంతో చాక చక్యంతో తన పేరుకు ఎక్కడా కొంచం కూడా కళంకం రాకుండా, అనుకున్న కార్యాలను సాధించుకోగలిగిన ఆమె తెలివితేటలు ఆశ్చర్యపరుస్తుంది. వీటిని చూసి ఆమెను చెడ్డ మనిషిగా చిత్రించుకోవచ్చా? అలా చెడ్డ మనిషిగా ఉంటే వరుణ్ కంటే తెలివితక్కువ తనం కలిగిన ఒకడికి ప్రతిమను కట్టబెట్టుంటుంది. అలా కాదే, పెంచిన ప్రేమకోసం ప్రతిమను ఆ ఇంటికి మహారాణిని చేస్తోందే! ఈ విషయానికే అత్తయ్యను పొగడవచ్చు.
'ఏం చేయను?' అని ఆలొచించింది ప్రతిమ. ‘ఆ పెళ్ళి కూతురు ఇంటికి వెల్దామా...వద్దా? ఈ పెళ్ళికి ఒప్పుకోమని కిరణ్ ని ఒప్పించగలనా? నేను చెబితే అతను వింటాడా? ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకోడా? తనకు ఏమి తెలియకనే అత్తయ్య ఇలాంటి భాధ్యత అప్పగించిందా? లేకపోతే అన్నీ తెలిసుకునే నన్ను పంపించి సమస్యను తీర్చుకుందామనుకుంటోందా? ఏం చేయబోతాను నేను?’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి