సదా యౌవనం (కథ)
ఆదివారం మధ్యాహ్నం లాప్ టాప్ లో లీనమైపోయిన కస్తూరి కి, కాలింగ్ బెల్
శబ్దం వినబడింది.
"ఇంటికోచ్చే వాళ్ళకు ఒక వేలాపాలా తెలియదా?" అని
విసుక్కుంది.
తలుపు తెరిచిన కస్తూరి ఆశ్చర్యపోయింది.
ఎదురుగా తన విజయవాడ స్నేహితురాలు కవిత.
చూసి కొన్ని సంవత్సరాలైంది. జ్ఞాపకాలు ఒక నిమిషం ఆమెను
తికమక పెట్టినై. క్షణంలో తికమకల నుండి
బయటపడ్డది.
"రా....రా...ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. ఎలా
ఉన్నావు?"
"నేను
బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు! కొడుకు,
కోడలు, మనవడు, మనుమరాలు ఎలా
ఉన్నారు?".
"మొదట
నువ్వొచ్చి ఇలా సోఫాలో కూర్చో"
ఫ్యాన్ వేసి,
దాన్ని ఫుల్ స్పీడులో పెట్టి వంటింటి వైపు వెళ్ళింది కస్తూరి.
గాజు గ్లాసులో జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది.
"మా బంధువల అమ్మాయి పెళ్ళికి వచ్చాను. ఈ ఊరు వచ్చిన
తరువాత నీ జ్ఞాపకం వచ్చింది. అలాగే నిన్నొకసారి చూసి వెల్దామని ఇలా వచ్చాను"
"అది సరే! విజయవాడలో ఎవరితో ఉంటున్నావు? నీ కొడుకు
ఎలా ఉన్నాడు?"
"ఉన్నాను...బాగానే
ఉన్నాను?”
"ఏమిటే
నీ మాటలో బాధ కనబడుతోంది. ఏమైందే?"
"కస్తూరీ!
నీ దగ్గర చెప్పటానికి నేనెందుకు సిగ్గుపడాలి?
ఆయన ఉన్నంతవరకు నాకు ఏ లోటూ ఉండేది
కాదు. దేని గురించి బాధ పడలేదు. ప్రశాంతంగా ఉండేదాన్ని. ఆయన పోయిన తరువాత నాకు ఏదీ
నచ్చటం లేదు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. జీవం లేని మనిషిలా ఉన్నాను. కొడుకు ఇప్పుడు
నాతో లేడు"
"ఏం చేయగలం చెప్పు....జీవితంలో నష్టాలు,
దుఃఖము లేనిదేవరికి? ప్రపంచంలో పుట్టిని ప్రతి
ఒక్కరికి చావనేది ఏప్పుడో నిర్ణయించబడిన ఒక ఘటన. అన్నీ విధి ప్రకారమే జరుగుతాయి.
అందుకని అంతా అయొపోయిందనుకుని కుంగిపోతే, మిగులు జీవితం ఎలా
జీవించేది?"
కస్తూరి మాట్లాడుతూంటే, ఆ మాటలు వింటూ
ఆమె ఇంటి మొత్తాన్ని ఒకసారి చూసొచ్చింది కవిత. గోడలకు అందమైన పైంటింగ్స్
వేలాడుతుంటే, అలమరుల్లో ఉన్న బొమ్మలు ఆ రూములకే అందాలు
చేకూర్చాయి.
ఒక ప్లేట్లో జాంగ్రీ, ఇంకో ప్లేట్లో వేడి వేడి పకోడీలు, ఏలకులు వాసనతో టీ తీసుకోచ్చి పెట్టి వెళ్ళింది పనిమనిషి.
“కవితా! ఈ అమ్మయి పేరు రోహిణి. ఈ అమ్మాయే
నాతో ఇప్పుడు ఉంటున్నది. ఇంటి పనులు, తోట పనులు అన్నీ తనే
చూసుకుంటుంది. నామీద ప్రేమగా ఉంటుంది. మంచి పిల్ల"అన్నది కస్తూరి.
అది విన్న పనిమనిషి కొంచం గర్వపడుతూ అక్కడి నుంచి వెళ్ళింది.
“ఇంటిని చాలా అందంగా, శుభ్రంగా
ఉంచుకున్నావు. అవును...నీ కొడుకు, కోడలూ ఎక్కడ?"
"నీలాగానే నేనూ ఒక్కదాన్నే ఉంటున్నాను.
మేడమీద తోట వేశాను. వెళ్ళి చూసొద్దాం...రా"
రంగు రంగుల రోజా పువ్వులు, మరికొన్ని
పువ్వులు అందంగా పూసున్నాయి. ఒక పక్క ఆకు కూరలు, కూరగాయలు...అలా
ఎన్నో రకాల చెట్లు తొట్టెల్లో వరుసగా ఉన్నాయి.
"కవితా! ఈ రోజా చెట్లన్నీ లండన్లో ఉన్న
నా మనుమరాలు స్వేత కొసం ఉంచాను. దానికి రోజా పువ్వులంటే ప్రాణం. ఫోన్ లో మాట్లాడిన
ప్రతిసారి వాటి గురించి ఎంక్వయరీ చేస్తుంది. వచ్చే నెల వాళ్ళందరూ ఇక్కడికి
వస్తున్నారు" చెబుతున్నప్పుడే కస్తూరి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.
కస్తూరికి ఒకడే కొడుకు. అతనికి లండన్ లోనే నివాశం. కోడలికి
అక్కడే ఉద్యోగం. మనమురాలికి ఐదేళ్ళ. సంవత్సరానికి ఒకసారి అందరూ ఇండియా వచ్చి ఒక
నెల రోజులు ఉండి సెలవులను ఆనందంగా గడిపి వెడతారు. తమతో వచ్చేయమని కొడుకు ఒత్తిడి
చేసినప్పుడల్లా ఒక చిన్న నవ్వుతో రాలేనని చెబుతుంది కస్తూరి.
ఇద్దరూ క్రిందకు దిగి వచ్చారు. ఒక పెద్ద ఆల్బమ్ను కవిత
చేతికి ఇచ్చింది కస్తూరి.
"కవితా! దీన్నీ చూస్తూ ఉండు. ఇందులో గత ఏడాది నేను
లండన్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలు ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు నా దగ్గర డాన్స్
నేర్చుకోవడానికి వచ్చున్నారు. నేను చిన్న వయసులో నేర్చుకున్న డాన్స్ ఇప్పుడు
వీళ్ళకు నేర్పటానికి పనికొస్తోంది. ఒక గంటలో వచ్చేస్తాను"
ఆ రోజు రాత్రి డిన్నర్ పూర్తిచేసుకున్నాక ఇద్దరూ మేడపైకి
వెళ్ళి కూర్చున్నారు. సన్నని చల్లటి గాలి వాళ్ళను మైమరిపిస్తోంది.
"కస్తూరీ! నిన్ను చూస్తుంటే గర్వంగానూ ఉంది, అదే సమయం ఈర్ష్య గానూ ఉంది"
"ఏమిటి కవితా...అలా చెబుతున్నావ్?"
"ఈ వయసులో ఇంత చలాకీగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు...?"
"ఈ వేలాకోలమే వద్దనేది. నాకేమంత వయసయ్యింది? 'జస్ట్ అరవై ఒకటే' కదా?"
నవ్వింది.
"కవితా! నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి. వయసనేది శరీరానికే గానీ మన మనసుకు కాదనేది పూర్తిగా నమ్మాలి. నీకొక విషయం తెలుసా? లండన్లో ఒక కోటీశ్వరుడైన వయోవృద్దుడు ఉండేవారట. ఆయనకు వయసు వందకు పైనే! ఎలా ఇన్ని రోజులుగా 'జీవిస్తున్నారు' అని అడిగినందుకు ఏం సమాధనం చెప్పాడో తెలుసా...?
'పనిచేయడమే. ఏ రోజు పనిచేయడం ఆపేస్తామో...ఆ రోజే మన శరీరాన్ని వదిలి ఆరొగ్యం; మనసును వదిలి సంతోషమూ ఎగిరి పోతాయీ అన్నరట........ఇది అన్ని వయసుల వారికీ సరిపోతుంది. మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళను చూసుకోవటానికే మన పని సరిపోతుంది. మన ఆశలను, అవసరాలను పూర్తి చేసుకోవటానికి సమయం ఉండేది కాదు. కానీ, వాళ్ళు పెద్దైన తరువాత మనకు అంతకు ముందులాగా పని ఉండదు. ఇలాంటి సంధర్భాలలో మనకు ఇష్టమైన దార్లలో మన మనసును లగ్నం చేస్తే సంతోషం పుడుతుంది. మనం ఒంటరి చేయబడ్డమే? అన్న భావం రాదు. తరువాత ఒక ముఖ్యమైన విషయం.....
ఎన్ని పరీక్షలొచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వాటిని కేవలం అనుభవాలుగా మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా మనసులో పెట్టుకుని దాచుకుంటే...అవి మన తలమీదకు ఎక్కి 'డాన్స్’ ఆడుతాయి. మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా మూలలో కూర్చోబెడుతుంది. ఆ తరువాత ఆసుపత్రిలోనే కుటుంబాన్ని గడపాలి. అందుకని మనసును పువ్వులాగా ఉంచుకోవలి"
తిరిగ్ ల్యాప్ టాప్ ను తీసుకుని “కవితా! ఇలా వచ్చి కూర్చో" అని చెబుతూ దాన్ని ఆన్ చేసింది.
"నీకు కంప్యూటర్ లో పనిచేయడం వచ్చా?"
“మనసుంటే మార్గం ఉంది. ఏదైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. వయసు దానికి ఆడ్డు కాదు. ఈ పెట్టెలో ప్రపంచాన్నే అనిచి పెట్టేయొచ్చు. నాకు ' కంప్యూటర్’ కూడా రాదని చెబితే మనమరాలు కూడా గేలిచేస్తుంది. వాళ్లకు తగినట్లు మనం మన జీవితాన్ని మార్చుకోవాలి"
మరుసటి రోజు కవిత వెళ్ళిపోయింది.
ఇప్పుడు కవిత మనసులో కస్తూరి ఇరవై ఒక్క సంవత్సరాల సదా యౌవనం తో, ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలన్న తపనతో ఉన్న యువతి లాగ కనబడుతోంది.
******************************************************సమాప్తం**************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి