3, డిసెంబర్ 2020, గురువారం

శతమానం భవతి…(సీరియల్)....PART-11

 

                                                                      శతమానం భవతి…(సీరియల్)                                                                                                                                                                     (PART-11)

ఏలూరు వచ్చిన రోజు నుండి మానస ఎదో కోల్పోయినట్లు మౌనంగా ఉంటోంది. పిన్ని ఎంత మాట్లాడించినా అన్నింటికీ మౌనమే సమాధానంగా తెలిపేది. పిన్ని ఏదైన పని చేయమంటే మాత్రం పనిని వెంటనే చేసేది.

అక్కను చూస్తుంటే సుజాతకి బాధ, భయం ఏర్పడింది. తల్లితండ్రులతో ఫోనులో మాట్లాడిన ప్రతిసారీ మానస గురించి చెప్పేది.

"కొన్ని రోజులు పోతే అంతా బాగానే ఉంటుంది...నువ్వేమీ దిగులు పడకు" అని చెప్పారు.

ఎప్పుడు తెల్లవార్తోందో, ఎప్పుడు చీకటి పడుతోందో తెలియకుండానే రోజులను గడుపుతున్నది మానస.

మానస పరిస్థితి చూస్తుంటే అమె పిన్నికి కూడా భయం వేసింది.

"ఏదో ఒకటి చెప్పి మానసలో ఉత్సాహం తీసుకురావాలి" అని నిర్ణయించుకుంది.

రోజు సాయంత్రం మేడమీద ఒంటరిగా కూర్చున్న మానస దగ్గరకు వెళ్ళింది ఆమె.

"మానసా" అంటూ పిలిచింది.

మానసలో కొంచం కూడా కదలిక లేదు.

"మానసా..." అంటూ గట్టిగా పిలుస్తూ మానస భుజం పట్టుకుని ఊపింది. 

అప్పుడు లోకంలోకి వచ్చిన మానస "ఏమిటి పిన్ని?" అని అడిగింది.

"ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇలా ఉన్నావు? ఎవరి కొంపలు అంటుకుపోయాయని అంతలా శోకంలో మునిగి తేలుతున్నావు? ప్రేమలో ఓడిపోయిన ఆడపిల్లాలా అలా గింజు కుంటున్నావు? సరిగ్గా తిండి తినడం లేదు, సరిగ్గా నిద్ర పోవడం లేదు. ఎక్కడికి పిలిచినా రానంటూ ఇంట్లోనే ఒదిగి కూర్చుంటున్నావు?.....నడి రోడ్డు మీద ఒక మగ మృగాన్ని చెప్పుతో కొట్టి నిలదీసేవని నాకు తెలిసినప్పుడు నువ్వు చాలా ధైర్యస్తురాలివని ఎంతో సంతోషపడ్డాను...ఇప్పుడు తెలిసింది నువ్వు నిజంగా పిరికిదానివని. నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తోంది"

"పిన్నీ" అన్నది మానస.

మానసలో వచ్చిన కదలికను చూసి "మరేమిటే...ఇప్పుడు ఏం జరిగిందని అలా డీలా పడిపోయావు?"

"ఇంట్లో వాళ్ళే నేనేదో తప్పు చేసినట్లు నన్ను తప్పు పడుతూ సగంలోనే నా చదువు మానిపించి నన్ను ఊరు పంపించటం నన్ను వేదిస్తోంది"

"చూడు మానసా...ఆడపిల్లను కన్న తల్లి తండ్రులైనా అలాగే బిహేవ్ చేస్తారు. దీన్ని నువ్వు అర్ధం చేసుకోవాలి. తల్లితండ్రులను తప్పు పట్టకూడదు. రౌడీ వెధవ ఎదురు తిరగలేదు కాబట్టి అక్కడ వాతావరణం తుఫానగా మారలేదు. మారుంటే నువ్వు ఒక్క దానివే కాదు, నీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తుఫానలో కొట్టుకుని అమితంగా నష్టపోయేవారు....అలాంటి ఒక తుఫాన మీ కుటుంబాన్నీ, ముఖ్యంగా నిన్ను తాక కూడదని నీ తల్లి నీతో కొంచం కఠినంగా ప్రవర్తించింది...అంతే తప్ప, తప్పంతా నువ్వే చేశావని అర్ధం కాదు"

" రౌడీ వెధవ మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వక పోవటం వలనే కదా వాడు సుజాతని బెదిరించాడు"

"అక్కడే పొరపాటు పడుతున్నావు నువ్వు. పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు కనుకే ఉత్త బెదిరింపుతో వదిలిపెట్టాడు వాడు. ఇచ్చుంటే వాడి రాజకీయ బలంతో విడుదల అయ్యి మీకు రోజూ ఇబ్బందులు కలిగేటట్లు చేశేవాడు"

"అందుకని మనం వాడికి అనిగి మనిగి ఉండాల్సిందేనా?"

అలా అని నేను అనడం లేదు...ఇక్కడే నువ్వు బాగా ఆలోచించాలి. రౌడి వెధవ డైరెక్టుగా నీ జోలికి రాలేదు. నువ్వే జోక్యం చేసుకున్నావు. ఇది నీ గొడవకాదు. అందుకని నువ్వు కంప్లైంట్ ఇస్తే, అది వాడిని నువ్వు రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఎందుకంటే వాడి వలన అవమాన పడ్డ అమ్మాయి నువ్వు కాదుగా"

"అంటే...మన కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా మనం కళ్ళు మూసుకుని వెళ్ళాల్సిందేనా?" 

"అలా అని నేను అనడంలేదు. అన్యాయాన్ని ఎదిరించటానికి మరొక మార్గం ఎంచుకోవాలి. అంతేగాని డైరెక్టుగా రంగంలోకి దిగకూడదు"

" ఇంకొక మార్గమే పోలీసు కంప్లైంట్"

" మార్గం నీకు కాదు...నేరుగా అన్యాయానికి గురి అయిన అమ్మాయికి"

"ఎవరిస్తే ఏమిటి?"

" రౌడీ వెధవకి భయపడి తనకు అన్యాయమే జరగలేదని ఆమ్మాయే చెపితే"

తలెత్తి పిన్ని వైపు చూసింది మానస.

అలా చూడకు మానస! అదే జరిగింది...సంఘటన జరిగిన రాత్రి రుద్రయ్య మనుషులు మీ ఇంటిపైకి గొడవకు వచ్చారు గానీ అమ్మాయి ఇంటికి వెళ్ళి గొడవ చేసినట్లు ఎవరూ చెప్పలేదు...పోనీ అమ్మాయి మరుసటి రోజు పోలీసు కంప్లైంట్ ఇచ్చిందా అంటే..అదీ లేదే?... అలాంటప్పుడు నీకు సంఘటనతో సంబంధం ఏమిటి?”

మాటలు మానసను ఆలొచనలో పడేసినై.

చూడు మానసా...నువ్విలా నీ తల్లితండ్రుల గురించి అలొచిస్తూ కూర్చుంటే ఏమీ చెయ్యలేవు...వాళ్ళ గురించి ఆలొచించటం మానేసి రౌడీ వెధవ గురించి, వాడు నడిరోడ్డు మీద చేసిన అన్యాయం గురించి, విషయాన్ని నలుగురికీ తెలియజేయటం గురించి ఏంచేయాలో ఆలొచించు".

కూర్చున్న మానస లేచి నిలబడింది.

"ఏం చేయాలి పిన్నీ?"

"తరువాత తీరికగా ఆలొచిద్దాం...ముందు స్నానం గట్రా ముగించుకునిరా...కడుపు నిండా వేడి, వేడి భోజనం చేద్దాం, తరువత మంచి, మంచి ఆలొచనలు వాటంతట అవే వస్తాయి"

"అలాగే పిన్నీ" అని చెప్పి క్రిందకు వెళ్ళింది మానస.

"హమ్మయ్య...మానసలో మార్పు వచ్చింది" అనుకుని సంతోష పడింది మానస పిన్ని. 

                                 **********************************************************

మరునాడు.

మానస చేతికి ఒక కలం ఇచ్చి "మానసా నీకు ఎలాంటి ఆలొచనలు వచ్చాయే నాకు తెలియదు.....నాకు మాత్రం ఆలొచన వచ్చింది"

పిన్ని వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది మానస.

"రాయడం….మహిళల మీద సమాజంలో విచ్చలవిడిగా జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ వ్యాసాలు రాయి. వాటిని పత్రికలకు పంపించు. అన్యాయాలను ఎలా ఎదుర్కోవాలో నీకు తెలిసిన పద్దతి వివరించు. వాటిని చూసి కొంతమందైనా ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాలను బయటపెడెతారు. ఇదే నువ్వు అన్యాయాలను ఎదుర్కొనే పద్దతి. కర్రలు, కత్తులు, తుపాకులు, ముష్టి యుద్దాలు చేసినా అడ్డుకోలేని అన్యాయాలను కలంతో అడ్డుకోవచ్చు. దారే ఇప్పుడు నేను నీకు చెప్పింది. ఈదారిలో వెళ్ళి నీ లక్ష్యాన్ని చేరుకో "

"ఇది జరుగుతుందా పిన్నీ?"

"జరగాలని ఆసిద్దాం. మన పని మనం చేసుకుపోదాం...ఫలితం తానంతట అదే వస్తుంది. ముందు నీ మనసులో ఉన్నదంతా కాగితం మీద పెట్టు. అప్పుడు నీ మనసు తేలిక పడుతుంది. అప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో నీకే అర్ధమౌతుంది"

"అలాగే పిన్నీ" అని చెప్పి ఉత్సాహంగా గదిలోకి వెళ్ళింది మానస.

తెలికైన మనసుతో వంటగదిలోకి వెళ్ళింది మానస పిన్ని.

                              ******************************************

మానస రోజు కలం పట్టుకుంది.

'మగువా! కలమే నీకు ఆయుధం' అనే శీర్షికతో వ్యాసాలు రాయడం మొదలు పెట్టింది. రాసిన వ్యాసాలను దిన పత్రికలకు, వారపత్రికలకు పంపింది.

వ్యాసాలు ప్రచురితమవుతున్నాయో లేదో తెలుసుకునే లోపే మానసకు పెళ్ళి ఏర్పాట్లు మొదలుపెట్టారు.

"ఏమిటి పిన్నీ ఇది... అప్పుడే నాకు పెళ్ళేమిటి?" అమాయకంగా అడిగింది మానస.

"నీకు పెళ్ళీడు వచ్చిందిగా"

"అందుకని నాకు పెళ్ళి చేసేయాలా?"

"ఇదేమీ తప్పు కాదే...ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లోనూ జరిగే తంతేగా ఇది"

"అందుకని ఇంత హడావిడిగానా?....మధ్యలో ఆగిపోయిన నా డిగ్రీ చదువును ఎలా ముగించాలో తెలియక నేను కష్టపడుతుంటే...ఇప్పుడు నాకు పెళ్ళి అవసరమా?"

"నీకు పెళ్ళి అవసరం లేకపోవచ్చు. నీకు పెళ్ళి చేసి తమ భాధ్యత తీర్చుకోవాలనుకోవడం తల్లితండ్రలకు అవసరం

"ఏమిటి పిన్నీ, నా గురించి అన్నీ తెలిసున్న నువ్వూ కూడా అమ్మానాన్నలకు సపోర్ట్ చేస్తున్నావే"

"నీ సమస్య వేరు...నీ పెళ్ళి వేరు. నీ సమస్యకు, దాని పరిష్కారానికీ నీకు సపొర్ట్ చేస్తాను....నీ పెళ్ళి విషయంలో మీ అమ్మానాన్నలకే  సపొర్ట్ చేస్తాను. ఎందుకంటే  నీ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది.... కానీ నీ పెళ్ళికి మంచి సంబంధం వచ్చి, అది వదులుకుంటే...మళ్ళీ త్వరగా మరో మంచి సంబంధం దొరకటం కష్టం" 

"కొన్ని రోజుల ముందు వరకు నాకు పిచ్చి పట్టినట్లు మెదడు పూర్తిగా బ్లాంక్ అయ్యింది పిన్నీ. కానీ నీ సలహా నాలో కొత్త ఉత్సాహాన్ని  నింపింది. ఇంతలోనే  పెళ్ళి....అదిసరే పిన్నీ పెళ్ళి చేసుకున్నాక నేను రాయటం కొనసాగించొచ్చా?"

"ఏమో...అది నీ భర్త ఆమోదం మీద ఆధార పడి ఉంటుంది"

"ఏమిటి పిన్నీ కన్ ఫ్యూజన్?"

"కన్ ఫ్యూజన్ ఏమీ లేదే. జరుగుతై అనుకుంటే జరుపగలవు. లేను అనుకుంటే జరపలేవు" చెప్పేసి వెళ్ళిపోయింది మానస పిన్ని.

మానస మౌనంగా ఉండిపోయింది.

                                                                              Continued.......PART-12(Last Part)

ఇవి కూడా చదవండి:

నిజాయతీ(కథ)

ఘోరమైన ఎడారిలో రమ్యమైన ప్రదేశము(ఆసక్తి)

***********************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి