1, డిసెంబర్ 2020, మంగళవారం

శతమానం భవతి…(సీరియల్)....PART-10

 

                                                                            శతమానం భవతి…(సీరియల్)                                                                                                                                                                 (PART-10)

మరుసటి రోజు.

ఎప్పుడూలాగానే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతోంది మానస.

"ఏక్కడికే బయలుదేరుతున్నావుమానసను అడిగింది మానస తల్లి.

"ఇంకెక్కడికమ్మా... కాలేజీకే" చెప్పింది మానస.

నువ్వేమీ కాలేజీకి వెళ్ళక్కర్లేదు...ఇంత జరిగాక కాలేజీకి వెళ్ళటానికి నీకు సిగ్గు అనిపించటం లేదు".

"అమ్మా...ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు. తప్పూ చేయని నేను ఎందుకమ్మా సిగ్గు పడాలి. తప్పు చేసింది వాళ్ళు. వాళ్ళు సిగ్గు పడాలి"

"నువ్వేమీ తప్పు చేయ లేదా? మరైతే నిన్న, మొన్నా మనందరికీ  జరిగిందంతా ఏమిటి?"

"ఏంటమ్మా నువ్వు...ఎందుకమ్మా నువ్వు కూడా అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు"

"అర్ధం చేసుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. ఆడ పిల్లలు ఉద్రేకంలో తప్పు చేస్తే, తల్లితండ్రులు వెంటనే దానిని సరి చేయాలి"

"అంటే నేను తప్పు చేశానని నువ్వు నిర్ధారణకు వచ్చేశావా"

కాకాపోతే... నువ్వు చేసింది ఏమిటి.? రోడ్డు మీద జరుగుతున్న తప్పులను నిలదీయటానికి నువ్వేమన్నాఈ ఊరికే రాణివా? రోడ్డు మీద నువ్వు తప్ప ఇంకెవరూ లేరా? వాళ్ళంతా ఎందుకు ముందుకు రాలేదు? నువ్వొక్క దానివే ఎందుకెళ్ళావు? సంఘటనలో బాధితురాలు ఎందుకు ఎదురు తిరగలేదు? పోలీసు కంప్లైంట్ ఇవ్వటానికి అమ్మాయి ఎందుకు పూనుకోలేదు?...మనకు జరిగిన అవమానం ఊరు ఊరంతా పాటికి తెలిసుంటుందే!...కానీ ఇంతవరకు బాధితురాలు నిన్ను పరామర్శించటానికి కూడా రాలేదేం?...ఇవే నువ్వు చేసిన తప్పులు. నువ్వు ఇంకో వారం రోజులు బయటకు వెళ్ళకూడదు" ఆవేశంగా మాట్లాడింది మానస తల్లి.  

"అమ్మా...ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నాను. ఎంత ఎత్తుకు ఎదగాలో లక్ష్యం పెట్టుకున్నాను...తెలుసా? అన్నిటినీ పాడుచేయద్దమ్మా?"

"వెళ్ళు! ఎవరు వద్దన్నది? నిన్ను ఒకరికి కట్టపెట్టిన తరువాత కోటనైనా పట్టుకో. ఇంట్లో ఉన్నంతవరకు కట్టుదిట్టంగా ఉండాల్సిందే" అని చెప్పి మానసను విసుగ్గా చూసి వెళ్ళిపోయింది మానస తల్లి. 

మట్టి కోటలు పడిపోతున్నట్లు ఒక ఫీలింగ్......గబగబా మేడపైకి వెళ్ళింది మానస.

అక్కడున్న అరుగుమీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది.

కాలేజీకి వెళ్ళకూడదు అనేది మానస జీర్ణించుకోలేకపోతోంది. 

చదువు సాగకపోతే నా లక్ష్యానికి సంకెళ్ళు పడ్డట్లే...అన్నిటినీ వదిలేసి పంజరంలో చిక్కుకున్న చిలుకలాగా పడుంటం నా వల్ల కాదు...ఆడవారు వెనుకబడిపోవటానికి కారణమే తరతరాలుగా ఇంట్లో ఉండడమే...ఏం తప్పు చేశానని అమ్మ నన్ను ఇంట్లో బంధిస్తోంది? ఎందుకు నేను ఎదురు చెప్పలేకపోతున్నాను?  సినిమాలలో, కథలలో హీరోయిన్ తనకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి పోరాడి గెలిచినట్లు చూపిస్తారే?”

కల్పిత కథలలో అన్నిటినీ సాధించగలం! నిజ జీవితంలో సాధించలేమా? తప్పు చేసిన ఒకడ్ని బయట ధైర్యంగా అడ్డుకున్న నేను...ఇంట్లో పోరాడి గెలవలేక పోతున్నానే. ఇలా  ఉన్న నేను బయట జరుగుతున్న తప్పులను అడ్డుకోవటానికి అర్హురాలిని కానే”....చాలా సేపు అలా ఆలొచనలతో సతమతమైన మానస క్రిందకు దిగి వచ్చింది.

కిందకు దిగి వచ్చిన మానసతో "అన్నం వండి ముక్కల పులుసు చెయ్యి. వంకాయలున్నాయి. కూర చెయ్యి. నేను రుక్మణి ఆంటీ ఇంటికి వెళ్ళొస్తాను. రోజు చీటీ పాట ఉంది" అని చెప్పి వెళ్ళిపోయింది మానస తల్లి. 

వంట గదిలోకి వెళ్ళిన మానస "చివరకు ఇదేనా నా చోటు...నా లక్ష్యాలన్నీ మంటల పాలేనా" అనుకుంటూ పొయ్యి వెలిగించి వంట పని మొదలు పెట్టింది.

                                        ********************************************************

కాలేజీ నుండి ఇంటికి వచ్చిన మానస చెల్లెలు సుజాత కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది.

"ఏమైందే...ఏడుస్తూ వస్తున్నావు" అప్పుడే హాలులోకి వచ్చిన మానస తల్లి సుజాతని అడిగింది.

"కళ్ళు తుడుచుకుంటే...ఏడుస్తున్నాని అర్ధమా?" తల్లి వైపు చూడకుండానే అన్నది సుజాత.

"కాకపోతే కళ్ళెందుకు తుడుచుకుంటున్నావు"

"కంట్లో ఏదో దుమ్ము పడింది"

"నన్ను చూసి చెప్పు"

"ఏమిటమ్మా నీ ప్రాబ్లం"

నెను నీ తల్లినే...దుమ్ము పడినందు వల్ల కళ్ళు తుడుచుకుంటున్నావా లేక ఏడుస్తున్నది ఎవరూ చూడకూడదని కళ్ళు తుడుచుకుంటున్నావో ఒక్క సెకెండ్లో కనిపెట్టగలను...ఏం జరిగిందో చెప్పు"

తల్లి అలా అడిగేసరికి ఏడుపు ఆపుకోలేక "కాలేజీ నుండి వస్తుంటే జులాయి వెధవ ఆడ్డుపడ్డాడు. ఎక్కడే మీ అక్క. అందరి ముందు నన్ను చెప్పుతో కొట్టి, నా మావయ్య రుద్రయ్య దగ్గర క్షమాపణ చెబుతుందా. ఆయన క్షమించుండొచ్చు. నేను ఇంకా క్షమించలేదు. నేను ఇక్కడే ఉంటాను మర్యాదగా మీ అక్కయను వచ్చి నాకు క్షమాపణ చెప్పమను...లేకపోతే నేను ఊరుకోను...మీ అక్క ఎక్కడ కనబడ్డా, ఎప్పుడు కనబడ్డా దాన్ని నలుగురి ముందు అవమాన పరుస్తాను" అని వార్నింగ్ ఇచ్చాడమ్మా. 

"చూశావా...వాడి కోపం ఇంకా తగ్గలేదు. అందుకే దాన్ని బయటకు వెళ్ళద్దు అన్నాను. నాకు తెలుసు వాడి కోపం తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. మానస కనబడితే మాత్రం అల్లరి పాలైపోతాము. నాన్న రానీ రుద్రయ్య గారితో మాట్లాడమని చెబుతాను" అన్నది తల్లి. 

'రుద్రయ్య గారు అట. అయనకెందుకో గారు. నీతిమాలిన కొడుకును వెనకేసుకొస్తున్న తండ్రికి గౌరవం ఇవ్వటం అవసరమా?....ఆయనా ఒక పెద్ద మనిషేనా... మాట నేను చెబితే వింటారా?' కోపంగా తిట్టుకుంది. 

కానీ తల్లితో....

"నాన్న వెళ్ళి మాట్లాడితే సరిపోతుందా...నిన్న నాన్నగారు అంతమందితో కలిసి వెళ్ళి రుద్రయ్య గారికి క్షమాపణ చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయిందే...మళ్ళీ నాన్నగారు వెళ్ళి రుద్రయ్య గారితో మాట్లాడితే అంతా సద్దుమనుగుతుందా?" అప్పుడే అక్కడికి వచ్చిన తల్లిని అడిగింది మానస.

"మనం రెచ్చగోట్టకుండా ఉంటే పూర్తిగా తగ్గుతుంది"

"అంటే మనం బయటకు ఎక్కడికీ వెళ్ళకుండా వాడికి భయపడుతూ బ్రతకాల్సిందేనా?"

"తప్పదు... సమస్యకు ఒక పరిష్కారం దొరికేంతవరకు మనం వొదిగి ఉండాల్సిందే"

"ఎందుకమ్మా అంత భయపడటం...ఒకసారి పోలీసు కంప్లైంట్ ఇస్తే వాడే తోక ముడుచుకుంటాడు"

"వాడ్ని రెచ్చగొట్టడం అంటే ఇదే"

"ఎందుకమ్మా వాళ్ళను చూసి అంత భయపడుతున్నావు?"

"ఏం చేయనే...మిమ్మల్ని ఆడ పిల్లలుగా కన్నందుకు నేను భయపడి తీరాలి కదా"

"అదికాదమ్మా..."

"ఇక ఆపు... సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు...నువ్వెళ్ళి నీ పనిచూసుకో" కోపంగా చెప్పి వెళ్ళిపోయింది మానస తల్లి.

"రా అక్కా" అంటూ మానస చెయ్యి పుచ్చుకుని గదిలోకి తీసుకువెళ్ళింది సుజాత.

ఒక్క సారిగా ఇంట్లో నిశ్శబ్ధ వాతావరణం కమ్ముకుంది.

రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు జగపతి. భర్తతో విషయాలన్నీ చెప్పింది మానస తల్లి.

"చూడండి...ఇక ఇద్దరమ్మాయల్నీ మనం ఊర్లో ఉంచకూడదు. ఏలూరులో మా చెల్లెలు ఇంట్లో వదిలిపెడదాం. అక్కడే ఉండనివ్వండి"

అది విన్న మానసకు షాక్ తగిలినట్లయ్యింది.

"మానసను వెంటనే ఏలూరులో ఉంచటానికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు. కానీ సుజాత చదువు సంగతి?"

"వాళ్ళు చదివింది చాలు...అంతగా దానికి చదువుకోవాలనిపిస్తే పోస్టులో చదువుకుంటుంది"

సరే

"మీరూ వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ అడగండి. దొరికితే ఊరు వదిలి అందరమూ వెళ్ళిపోదాం"

భార్య చెప్పిన ప్రతి దానికీ సరే అన్నాడు జగపతి.

మానస తల్లి వేసిన ప్లానులో మొట్టమొదటి ప్లాన్ మరునాడే అమలులోకి వచ్చింది.

మానసా, సుజాతా ఇద్దర్నీ ఏలూరులో ఉన్న పిన్ని పార్వతి వాళ్ళింటికి పంపించారు.

                                                                                                                     Continued.....PART-11

ఇవి కూడా చదవండి: 

వైరస్లను మనిషి తయారు చేయగలడా?(మిస్టరీ)

'బ్లాక్ నైట్' ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం(మిస్టరీ)

********************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి