12, జూన్ 2020, శుక్రవారం

నిజాయతీ...(కథ)




                                                         నిజాయతీ
                                                              (కథ)


బట్టలు ఇస్త్రీ చేసి ఇమ్మని మూర్తీ దగ్గర ఒక జత బట్టలు (ప్యాంటూ, చొక్కా) ఇచ్చేసి వెళ్ళింది ఆ కొట్టుకు కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని మూర్తి ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. బహుశ ఆ వీధిలో కొత్తగా కట్టిన అపార్టు మెంటుకు కొత్తగా వచ్చుంటారు అనుకున్నాడు మూర్తి. ఆ బట్టలను తీసుకుని, కొంచంగా నీళ్ళు జల్లి, చుట్టినప్పుడు, 'జేబులో' ఐదు వందల రూపాయల నోటు ఉన్నది తెలిసింది. మూర్తీ ఆ నోటును తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.

ఆ సమయంలో ఒక కారు వచ్చి ఆ ఇస్త్రీ కొట్టు ముందు ఆగింది. అందులో నుండి దిగి వచ్చింది అభిరామి. మూర్తి ప్రేమికురాలు.

ఆమెకు కూల్ డ్రింక్స్ కొనిచ్చాడు మూర్తి.

బట్టలను ఇస్త్రీకి ఇవ్వటానికి వచ్చినప్పుడు, కష్టపడి జీవించాలి అనే అతని జీవిత ఆశయానికి ముగ్ధురాలైపోయి మనసు పారేసుకుంది అభిరామి.

ఆస్తులు గల తండ్రి దగ్గర మాట్లాడి పెళ్ళికి ఆయన అంగీకారం తీసుకుంది. అది చెప్పటానికే అక్కడికి వచ్చింది.

ఆతురతతో అభిరామిని చూశాడు మూర్తి.

ఇంతలో ఇంతకు ముందు ఇస్త్రీ చేయటానికి బట్టలు ఇచ్చిన ఆ యువతి అక్కడికి వచ్చింది. "అన్నా బట్టలు ఇస్త్రీ చేసారా? తొందరగా ఇవ్వండి" అన్నది.

ఇస్త్రీ చేసి ఉంచిన బట్టలను ఆమెకు ఇచ్చాడు మూర్తి.

ఇంతలో ఆ అమ్మాయి ఫోనుకు ఒక కాల్ వచ్చింది. "అలాగా సార్. నేను చూడలేదు సార్. అడుగుతా" అని చెబుతుంటే ఫోను కట్ అయ్యింది.

"అన్నా...ఇందులో డబ్బులేమైనా ఉన్నదా? మరిచిపోయి మా యజమాని డబ్బులు చొక్కా జేబులోనే ఉంచేశారట. నేనూ చూడకుండా అలాగే బట్టల్ను నీకు ఇచ్చాను"

"లేదమ్మా..." సాధించాడు.

నిరాశతో వెనుతిరిగింది ఆ అమ్మాయి.

"ఆ...చెప్పు అభిరామీ...మీ నాన్న దగ్గర మన ప్రేమ గురించి మాట్లాడావా? ఏమైంది? ఏం చెప్పారు"--ఉత్కంఠతో అడిగాడు.

ఆమె నవ్వింది.

"ఆయన ఏం చెప్పుంటారో అది మీరే చెప్పారే?"

"నువ్వేం చెబుతున్నావో అర్ధం కావటం లేదు అభిరామి?"

"మీరు ఇప్పుడు ఇస్త్రీ చేసి ఆ అమ్మాయి దగ్గర ఇచ్చిన బట్టలు మా నాన్నవి. ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి మా ఇంట్లో కొత్తగా చేరిన పనిమనిషి. చొక్కా జేబులో ఐదు వందల రూపాయి నోటును పెట్టి పంపింది నేనే!

తీసిన డబ్బుల గురించి ఎప్పుడు తీయలేదని సాధించారో...అప్పుడే మీరు నిజాయితీ లేని వారని తెలిసిపోయింది. డబ్బు ఆశతో ఇలా నిజాయతీ లేకుండా నడుచుకున్న మీరు, కష్టపడి, నిజాయతీగా నడుచుకుని పైకొచ్చిన డబ్బుగల మా నాన్నకు మీరు ఎలా అల్లుడు అవగలరు? నేను అడిగేనన్న ఒకే ఒక మాటకు తన అంతస్తున్నంతా వదులుకుని మన పెళ్ళికి అంగీకరించిన మా నాన్నకు నేనిచ్చే అల్లుడు ఒక నిజాయతీ గల మనిషేనా అని నిరూపించుకోవాలని నేనే మీకు పరీక్ష పెట్టాను. నేను ఓడిపోయినా పరవాలేదు, కష్టపడి పైకొచ్చిన మా నాన్న నా మూలంగా ఓడిపోకూడదు...గుడ్ బై!"

తిరిగి చూడకుండా నడిచి వెడుతున్న అభిరామిని ఎలా పిలవాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు మూర్తీ! *******************************************సమాప్తం*********************************************

2 కామెంట్‌లు: