5, డిసెంబర్ 2020, శనివారం

శతమానం భవతి…(సీరియల్)....PART-12

 

                                                                         శతమానం భవతి…(సీరియల్)                                                                                                                                                                   (PART-12)

మానసను పిన్ని దగ్గర వదిలిపెట్టినా, భయాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోయారు మానస తల్లి-తండ్రులు. రుద్రయ్య కొడుకు సమస్య మెల్లమెల్లగా తగ్గిపోయింది. మొదట్లో సమస్యతో మానస కుటుంబాన్ని హడలుగొట్టిన రుద్రయ్య తరువాత అనిగిమెనిగి పిల్లిల్లాగా మెతకగా  ఉండిపోయాడు. కొత్తగా వచిన పోలీస్ కమీషనర్ రుద్రయ్యను పిలిచి ఒక ప్రముఖ పత్రిక చూపించి, అందులో అతని కొడుకు చేసిన గొడవ గురించి ప్రచురించబడ్డ న్యూస్ చూపించి, అవసరమైతే సాక్ష్యాలు సంపాదించి కటకటాల వెనుకకు పంపిస్తానని బెదిరించాడని ఒక కధనం ప్రచారంలోకి వచ్చింది. అందువలనో ఏమో రుద్రయ్య మౌనంగా ఉండిపోయాడు.

కానీ, మానస వాళ్ళ తల్లి-తండ్రి పడుతున్న భయం మాత్రం తగ్గుముఖం పట్టలేదు. మానస తల్లి అవసర అవసరంగా మానసకు పెళ్ళికొడుకును వెతికింది. వచ్చేవాళ్ళ దగ్గర-పోయేవాళ్ళ దగ్గర చెప్పి ఉంచింది. బంధువుల దగ్గర కూడా చెప్పింది.

"మంచి సంబంధం దొరికితే, పెళ్ళి ఊర్లో జరపకు. రుద్రయ్య దెబ్బతిన్న పాము. కమీషనర్ మాటలకు భయపడే రకం కాదు. పగ బట్టి తిరుగుతూంటాడు. మీ అమ్మాయి బయట ఊర్లో ఉంది కాబట్టి వూరికే ఉన్నాడు. లేకపోతే ఏదైనా చేస్తాడు. మానస పెళ్ళి చెడగొడతాడు. మానసకు చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. పెళ్ళి చాలా సింపుల్ గా చెయ్యి. బయట ఊర్లోనే చేశేయి"

మానస తల్లి రుద్రయ్య గురించి మర్చిపోయినా, జ్ఞాపకపరిచి - అనిగిపోయున్న భయాన్ని ఎక్కువ చేశారు కొందరు. 

'రుద్రయ్య పగ తీర్చుకుంటాడో...లేదో? కూతుర్ను జాగ్రత్తగా ఒకడి చేతికి కట్టబెట్టాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నది మానస తల్లి.

ఏవరో బంధువులు చెప్పిన సంబంధమే కైలాష్.

అతను మహారాష్ట్రం లోని షోలాపూర్ లోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.

తల్లి-తండ్రులతో పెళ్ళి చూపులకు అతను మానసను చూడటానికి వచ్చినప్పుడు, మానసలో ఎటువంటి భావాలూ లేవు.

పెళ్ళి గురించి ఆమె తన మనసులో ఒక ఆశ చక్రం వేసుకోనుంది.

సాహిత్య రంగంలో తాను ఎంతోకొంత సాధించి ఉండాలి.  తాను ఎవరనేది సమాజం తెలుసుకోనుండాలి. తన రచనలను ప్రేమించే వాడు-సాహిత్యంలో అభిరుచి ఉండే ఒకతన్ని మంచి స్నేహితుడిగా చేసుకుని, తరువాత అతన్ని పెళ్ళిచేసుకోవాలి

ఇలా కలలు కన్న ఆమె ఎదురుకుండా కైలాష్ వచ్చి నిలబడప్పుడు, అమెలో ఎటువంటి సంతోషమూ కలుగలేదు.

అతనెవరో తెలియదు! అతని అభిరుచులేమిటో తెలియదు!

చదువు, ఉద్యోగం మాత్రమే అతని గురించి తెలిసిన వివరాలు.

'సాహిత్యంలో అభిరుచి ఉన్నదా?' అని అడగాలని అనిపించలేదు!

పెళ్ళి వద్దని చెప్పటానికి కూడా ఆమె వల్ల కాలేదు.

ఆమెకు కూడా ఊరిని వదిలి, భయపడే మన్యుష్యుల దగ్గర నుండి, అనవసరంగా భయపెట్టే సమాజం నుండి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని అనుకున్నది.

ఇప్పుడు అమెకు కావలసింది భర్త కాదు; ఆమెను వేరే చోటుకు తీసుకు వెళ్ళే మనిషి.

దేని గురించి అలొచించకుండా తల ఊపింది. పెళ్ళి బాగా జరిగింది.

                                                **************************************

"మానసా...మానసా" అరుచుకుంటూ లోపలకు వచ్చాడు కైలాష్.

భర్త అరుపులు విని ఆలొచనలలో నుండి బయటకు వచ్చిన మానస భర్తను చూసి భయపడ్డది.

"ఏమిటండీ అరుపులు"

"చెప్పు...నా దగ్గర ఎందుకు దాచావు"

"ఏం దాచాను?"

"ఇదిగో ఇది చూడు..." అంటూ మానస ఫోటో వేసిన మళయాల పత్రికను సోఫాలోకి ఎగరేశాడు.

పత్రికనూ, పత్రికలోని తన ఫోటోను చూసి వణికి పోయింది.

అది...అది...అందులో నా ఫోటో ఎందుకు వేశారో, నా గురించి ఏం రాశారో నాకు తెలియదు"

"అబద్ధం చెప్పకు...పెళ్ళికి ముందు జరిగిన సంఘటనను నా దగ్గర దాచి, నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావు"

"నేనేమీ తప్పు చేయలేదండి"

"తప్పు చేయకపోతే చెల్లి పెళ్ళికి వెళ్ళకుండా ఉంటావా? ఎంత మోసం, ఎంత మోసం పెళ్ళికి వెళ్ళకుండా ఉండటానికి నా దగ్గర ఎన్ని కబుర్లు చెప్పావు... పత్రికలో నీ గురించి రాసింది చదివిన తరువాత నాకు అసలు విషయం తెలిసింది...అదేదో మీ అమ్మా, నాన్నలను అడుగుతాను... తరువాత నీతో మాట్లాడుతాను.  అంతవరకు నువ్వు నాతో మాట్లాడకు. రోజు రాత్రికే మీ ఊరికి మన ప్రయాణం. రెడీ అవ్వు" అని చెప్పి లోపలకు వెళ్ళిపోయాడు.

రోజంతా మానసతో మాట్లాడలేదు. కారణం తెలియక మానస రోజంతా ఏడుస్తూనే ఉన్నది. ఇద్దరూ మానస ఊరికి బయలుదేరారు.

రైలులో భార్య పక్కన కూర్చున్న కైలాష్ మానసను మళ్ళీ అడిగాడు. "పెళ్ళికి ముందు జరింగిందేమిటో చెప్పు. నువ్వు చెప్పలేదనుకో, నీ తల్లి-తండ్రులు చెప్తారు. వాళ్ళు చెప్పి నేను వినటం కంటే, నువ్వు చెప్పి నేను వింటేనే అది నీకు గౌరవం"

"చెప్తానండి...." అంటూ అన్ని విషయాలూ భర్తతో చెప్పింది మానస.

"ఇదే నండి జరిగింది. నన్ను నమ్మండి" కళ్ళు తుడుచుకుంది మానస.

"పెళ్ళి తరువాత నువ్వు ఎందుకు రాయలేదు?" అడిగాడు కైలాష్.

 "పెళ్ళి తరువాత రాయాలనే కోరిక నన్ను విడిచి వెళ్ళిపోయింది. కానీ, కొన్ని సమయాలలో నాకే తెలియకుండా రాయాలనే ఆశ, ఉద్రేకం నాలో పుడుతుంది. రాత్రి పూట కూర్చుని రాస్తాను. తరువాత రాసిన దానిని చించి పారేస్తాను. నేను రాసిన దానిని మీకు చూపించాలని అనుకుంటా. కానీ ఏదో నన్ను అడ్డుకునేది"

నా మనసులోని ఆశలన్నిటినీ దాచేసుకున్నాను. పెళ్ళి తరువాత ఊరి పక్కకే వెళ్ళటానికి ఇష్టం లేకపోయింది. అందుకనే బయటి దేశాలకు టూర్ వెల్దామని...అవి ఇవీ చెప్పి మా ఊరికి వెళ్ళటాన్ని రెండు సంవత్సరాలు తప్పించుకున్నాను. చెల్లి పెళ్ళి అనేటప్పటికి ఊరి మీద ఆశ వచ్చింది. కానీ తల్లీ-తండ్రులు 'నువ్వు పెళ్ళికి వస్తే రుద్రయ్య మళ్ళీ గొడవకు దిగచ్చు. సర్ధుకుపోయిన విషయాన్ని మనంగా కెలెకటం ఎందుకు. నువ్వు పెళ్ళికి రావద్దు అన్నారు. తల మీద బండరాయి పడినట్లు అయ్యింది. అందుకనే ప్రెగ్ నన్సీ చాన్స్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాను"

చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది.

మానస చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"మానసా...నువ్వొక అరుదైన వజ్రం. నాకు దొరికిన అరుదైన వజ్రం యొక్క విలువను నేను మాత్రం తెలుసుకుంటే ఎలా? ప్రపంచం మొత్తం తెలుసుకొవాలి. ధైర్యమైన ఆడదాన్ని చుస్తే సమాజం ఓర్చుకోలేదు. ఆడదాన్ని అణిచివేయాలనే చూస్తుంది. నువ్వు భయపడకు. ఇంతవరకు నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేరని భయపడ్డావు.... ఇప్పుడు భయం నీకు అక్కర్లేదు.

నీకు నేనున్నాను...నా ప్రాణం ఉన్నంతవరకు నీకు తోడుంటాను. నీకొసమే పెన్ను. ఇది నీకు నా బహుమతి. ఎక్కడైతే రాయడాన్ని ఆపావో మళ్ళీ అక్కడుంచి మొదలు పెట్టు. నీ తల్లి తండ్రులు ఆశ్చర్యపోవాలి. రుద్రయ్య ఎలా ఉన్నాడు, ఇప్పుడు అతను ఎలాంటి జీవితం సాగిస్తున్నాడు...అతని కొడుకు మారేడా, లేదా? అనే వ్యాసం రాయటానికి అతన్ని మనం కలుస్తున్నాం. అతని మీద రాసే వ్యాసంతోనే నీ రచయత్రి జీవితం పునరుద్దరించ బడుతుంది"

మానస అమాంతం భర్త కాళ్ళ మీద పడింది. "శతమానం భవతి" అని భార్యను ఆశీర్వదిస్తూ  "నీ రచనా ప్రయాణానికి ఇవే నా అశీస్సులు"  అంటూ భార్యను రెండు చేతులతో పైకి లేవదీశాడు. మానస ఆనందంతో భర్తను కౌగలించుకుని అతని భుజం మీద వాలిపోయింది.

**********************************************సమాప్తం****************************************** 

ఇవి కూడా చదవండి: 

ఆలయం(పూర్తి నవల)   

మొట్ట మొదటి క్వారంటైన్ క్వార్టర్స్(ఆసక్తి)

********************************************************************************************************

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి