3, అక్టోబర్ 2019, గురువారం

తొలివలపు (సీరియల్)...PART-19


                                                తొలివలపు….(సీరియల్)
                                                            (PART-19)


ఉత్సాహంతో ఈల వేసుకుంటూ ప్రమీల గదిలోకి చొరబడ్డాడు వెంకన్న. చలనం లేకుండా పడున్న ప్రమీలని ఆశగా ముట్టుకున్నాడు.

"ప్చ్... ఏం చేయగలం? నువ్వు అనుభవించాల్సింది ఇంతే నని నీ మొహాన రాసుంది! సంతోషంగా వెళ్ళి రా" అంటూ ఆమెను ఎత్తుకోవటానికి వంగినప్పుడు వెంకన్న నెత్తి మీద పడ్డదెబ్బకు "ఆ" అంటూ గిలగిలా కొట్టుకుంటూ బోర్ల పడ్డాడు. కొంచం తేరుకుని లేవటానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ ఒక దెబ్బ పడింది. "అయ్యో" అంటూ పడిపోతూ వెనక్కు తిరిగి చూశాడు. చేతిలో ఇనుప కడ్డీతో జుట్టు విరబూసుకుని నిలబడుంది గాయత్రి.

"ఏయ్..." అంటూ లేవటానికి ప్రయత్నించాడు...కుదరలేదు. మెల్ల మెల్లగా కళ్ళు బైర్లు కమ్మాయి. కంటి చూపుకు గాయత్రి సరిగ్గా కనబడలేదు. ఆ తరువాత కొంచం కొంచంగా తన స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడిపోయాడు. పూర్తిగా కోపం తగ్గించుకోలేని గాయత్రి చనిపోయిన వెంకన్నని ఇంకా కొడుతూనే ఉన్నది.

ఆవేశం తగ్గని గాయత్రి అక్కడే కూర్చుంది. తలుపు తడుతున్న శబ్ధం ఆమెను ఈలోకంలోకి తీసుకు వచ్చింది. పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తెరిచింది. బాపిరాజు గారు నిలబడున్నారు. తండ్రిని చూసిన వెంటనే "ఓ" అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కూతురి వాలకం, ఇళ్లున్న పరిస్థితి చూసి జరగ కూడనిది ఏదో జరిగిందని ఆయనకు అర్ధమయ్యింది...గబుక్కున లోపలకు దూరి గొళ్లెం పెట్టాడు.

"గాయత్రీ...ఏం జరిగిందమ్మా? చెప్పరా?" అంటూ గాబరా పడుతూ కూతురి భుజాలు పట్టుకుని ఊపాడు.

మళ్ళీ మళ్ళీ ఆయన వొత్తిడి చేస్తూ అడిగాడు.

తడబడుతూ జరిగిందంతా పూర్తిగా చెప్పి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి.

వేగంగా లోపలకు పరిగెత్తారు బాపిరాజు గారు. వెంకన్న, ప్రమీలా శవాలుగా పడుండడం చూసి అధిరిపడుతూ కొంచం వెనక్కు వెళ్ళారు. గుండెను పట్టుకుని గోడనానుకుని జారి పడిపోయారు.

పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది గాయత్రి.

“నన్ను క్షమించండి నాన్నా. ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆలొచించకుండా తప్పు చేసేశాను. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి నాన్నా"అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురితో ఏమీ మాట్లాడాలో తెలియక కన్నీటితో కూతుర్ని తన గుండెకు హత్తుకున్నారు.

"అమ్మ మనతో ఉండుంటే ఇలా జరిగేదా నాన్నా? అమ్మ ఎందుకు మనల్ని వదిలి వెళ్ళిపోయింది?"

కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శిలలాగా కూర్చున్నాడు.

'మన అమ్మాయి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? చెప్పు శకుంతలా. నీకు మాత్రమే కాదు...మన అమ్మాయికి కూడా బాధ్యత ఉన్న తండ్రిగా నడుచుకోలేకపోయానే! అయ్యో...ఎందుకు ఈ చేతగాని వాడిని నమ్మి దాన్ని వదిలి వెళ్ళావు? నేను పాపాత్ముడ్ని. నిన్ను ప్రాణాలతో చంపిన ద్రోహిని. మన కూతుర్ని కాపాడలేని దౌర్భాగ్యుడిని"

హఠాత్తుగా తలమీద కొట్టుకుంటూ ఏడుస్తున్న తండ్రి చేతులను పట్టుకుని ఆపింది గాయత్రి.

"ప్లీజ్...ఏడవకండి నాన్నా. మిమ్మల్ని ఇలా చూడటానికి నాకు కష్టంగా ఉంది" ఏడుస్తూ చెబుతున్న కూతుర్ని దగ్గరకు లాక్కుని మళ్ళీ గుండెలకు హత్తుకున్నారు బాపిరాజు గారు.

నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత, మెల్లగా కూతురు మొహాన్ని తన చేతిల్లోకి తీసుకుని చెప్పటం మొదలు పెట్టారు.

"గాయత్రీ, నాన్న ఏం చెప్పినా వింటావు కదురా?" అన్నారు మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు.

"చెప్పండి నాన్నా. నేను ఏం చేయాలి?" అన్నది కూతురు తండ్రి మొహం చూస్తూ.

తన ఒడిలో నుండి గాయత్రిని లేపి, ఆయనా లేచారు. ఆమె చేతులను గట్టిగా పుచ్చుకుని ఇంటి వాకిలి గుమ్మం వైపు నడిచారు. తరువాత గాయత్రి చేతులు విడిచిపెట్టారు.

"నువ్వు...ఈ ఇళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా"

"నాన్నా... మీరేం చెబుతున్నారు?" - అన్నది ఆశ్చర్యపోతూ.

"ఇది చెప్పటానికి నాకూ కష్టంగానే ఉందిరా. కన్న తండ్రిగా ఉంటూ నేను ఇలా చెప్పకూడదు. కానీ, నాకు వేరే దారి తెలియటంలేదే! మీ అమ్మను పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోవటానికి నేను తయారుగా లేను. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు. దయచేసి నీకు జరిగిన ఘోరాన్ని మరిచిపో. నువ్వు జీవించాల్సిన అమ్మయివిరా. డాక్టర్ అవ్వాలనేది నీ లక్ష్యం. ఇక నీ ఆలొచన అంతా నీ లక్ష్యాన్ని చేరుకునే వైపే ఉండాలి. ఆ లక్ష్యం నేరవేరాలంటే నువ్వు ఈ ఇంటి నుండే కాదు...ఊరు వదిలి వెళ్ళే కావాలి. బయలుదేరు"

"నాన్నా...నేను..."

"నువ్వు ఏమీ మాట్లాడకు గాయత్రీ. దయచేసి నాన్న చెప్పింది విను. ఈ ప్రపంచం ఒక సముద్రం. మనమే దాన్ని ఈదటం అలవాటు చేసుకోవాలి. జరిగిందంతా మరిచిపోయి ధైర్యంగా వెళ్ళు. నిన్ను కన్నవారి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నారు, కళ్ళల్లో నీళ్లతో.

'ఏం చేయాలి...ఎక్కడికి వెళ్లాలి?' అని ఏమీ తోచలేదు గాయత్రికి. కళ్ళ నిండా నీళ్ళతో నిలబడున్న గాయత్రి సడన్ గా ఏదో జ్ఞాపకం వచ్చి లోపలకు పరిగెత్తింది. బాధలే తెలియని ఆ జీవి, ఊయాలలో నిద్రపోతున్న ఆ పసిపిల్ల, కావ్యా దగ్గరకు వెళ్ళి నుదిటి మీద ముద్దుపెట్టుకుంది. తన వేళ్ళతో కావ్యా శరీరాన్ని తడిమింది. గాయత్రి స్పర్షను నిద్రలోనూ గుర్తుపట్టిన కావ్యా నవ్వింది. తరువాత గబుక్కున వెనక్కు తిరిగి వాకిటికి వచ్చింది గాయత్రి.

చివరిసారిగా కూతుర్ని కౌగలించుకుని వీడ్కోలు చెప్పారు బాపిరాజు గారు.

గట్టిగా కళ్ళు మూసుకుని తన తల్లిని ఒకసారి మనసులో తలుచుకుంది గాయత్రి. ధైర్యం తానుగా తనలో ఏర్పడుతున్న భావన కలిగింది. తరువాత దూరంగా కనబడుతున్న వెలుతురును చూసి ఆ చీకట్లో నడిచింది.

మరుసటి రోజు పేపర్లలో అలాంటి న్యూస్ రావటం గాయత్రికి తెలిసే అవకాశమే లేదు.

'భార్య - మాజీ ప్రేమికుడు హత్య: భర్త వెర్రి పని!'

ఇంకా ఉంది.....Continued in: PART-20

N.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి)

1, అక్టోబర్ 2019, మంగళవారం

తొలివలపు (సీరియల్)...PART-18


                                                తొలివలపు….(సీరియల్)
                                                            (PART-18)


భార్య మరణం బాపిరాజు గారిని నడిచే శవంలాగా తయారుచేసింది. అంచెలంచెలుగా సమస్యలు. కొలవటం వీలుకాని శోకం అంటూ ఆ ఇల్లే విధి ఆడిన ఆటవలన చిన్నాభిన్నం అయ్యింది. ఇదేమీ చాలదన్నట్లు శకుంతలాదేవి చనిపోయిన పదమూడో రోజు కార్యం ఎప్పుడు పూర్తి అవుతుందా అని కాచుకోనున్నట్లు, బాపిరాజు గారి ఇల్లు వెతుక్కుంటూ ప్రమీల పెట్టెతో వచ్చింది. ఊరి ప్రజలను పిలిచి శోకాలు పెట్టింది. బాపిరాజు గారు ప్రమీలను ఏలుకోవాలని పంచాయతి తీర్పు ఇచ్చింది. ఇష్టంలేకపోయినా ప్రమీల మెడలో తాళి కట్టారు బాపిరాజు గారు.

ఒక పక్క కూతురు మొహాన్ని చూడటానికి శక్తి లేక, మరో పక్క ప్రమీల ముఖం చూడటానికి ఇష్టంలేక రోజులో ఎక్కువ సమయం గుడిలోనే గడుపుతున్నారు బాపిరాజు గారు. ప్రెశిడెంట్ పోస్టు తానుగా ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. ఊరు వేసే నిందలను పట్టించుకోకుండా...ప్రియమైన భార్యకు తాను చేసిన ద్రోహాన్ని తలచుకుని లోలోపల ఏడుస్తూ రోజులు గడుపుతున్నారు. తండ్రిని మామూలు స్థితికి తీసుకురావటానికి తాను చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఒటమినే చవిచూసింది గాయత్రి. వీటి గురించి ఎటువంటి బాధ పడకుండా రోజులను ఆనందంగా గడుపుతోంది ప్రమీల. తాను అనుకున్నది సాధించినట్లు సంతోషంతో ఆమె గర్వంగా ఫీలవుతోంది. ఏదో ఆ ఉరికే మహారాణి అయిపోయినట్లు దర్జాగా రోజుకో పట్టుచీరతో తిరుగుతోంది.

రాత్రి-పగలు మారి మారి దోబూచులాడటంతో రోజులు ఒక్కొక్కటీ జరిగిపోతున్నదే తెలియలేదు.

అందమైన ఆడపిల్లకు తల్లి అయ్యింది ప్రమీల.

ఆ తరువాతే ఆమెలో చాలా మార్పులు కనబడ్డాయి.

శకుంతలాదేవి ఉన్నప్పుడు వాకిటి వరకే వచ్చి, అట్నుంచే తిరిగి వెళ్ళే వెంకన్న, ఇప్పుడు ఇంటిలోపలకు వచ్చేంత సన్నిహితుడయ్యాడు. పిల్ల ఏడుపును కూడా పట్టించుకోకుండా వాడితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ప్రమీల. అలాంటి సమయాలలో గాయత్రినే పరిగెత్తుకు వెళ్ళి ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుని సమాధాన పరుస్తుంది. ఒక తల్లి ప్రేమనూ, స్పర్షనూ గాయత్రి దగ్గర నుండి గ్రహించగలిగింది ఆ పసిపిల్ల. ఆ పసిపిల్ల ఆటలతో తన శోకాన్ని మరిచింది గాయత్రి. ఇంట్లో పనులు ముగించుకుని, మిగిలిన సమయాన్నంతా చెల్లితో గడిపేది గాయత్రి.

చివరగా అన్నిటికీ కలిపి ఒక ముగింపు వచ్చే విధంగా అలాంటి ఒక సంఘటన జరుగుతుందని ఎవరూ ఎదురు చూడలేదు.

ఆ తెల్లవారు జామున నిద్ర గాయత్రీని వదిలి వెళ్ళిపోయింది. లేవటం ఇష్టం లేక దుప్పట్లోనే ముడుచుకుపోయిన ఆమెకు ఎవరివో మాటలు వినబడటంతో గబుక్కున లేచి మాటలు వినబడ్డ వైపు నడవటం మొదలుపెట్టింది. పక్క గది నుండి గొళ్ళేం వేయబడ్డ తలుపుల వెనుక మాట్లాడుకుంటున్న మాటలు కొనసాగుతున్నాయి.

"చాలు...వదులు వెంకన్నా, తెల్లారబోతోంది. త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరు"

బ్రతిమిలాడుతున్న ప్రమీల గొంతు క్లియర్ గా వినబడింది.

"ఏం...నీ మొగుడు వచ్చేస్తాడని భయంగా ఉన్నదా?"

"ఛఛ...ఆయన దగ్గర నాకెందుకు భయం? ఎప్పుడూ చనిపోయిన వాళ్ళావిడ గురించే అలొచిస్తూ ఏదో ఒక మూల ముడుచుకుని పడుంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే, మన ప్లాన్ విజయవంతంగా ముగిసేంత వరకైనా కొంచం జాగ్రత్తగా ఉండొద్దా?"

"నేనుండగా నువ్వెందుకు గాబరాపడతావు? నీ భర్త ఒక చచ్చిన పాము. దాన్ని చంపడానికి నాకు ఎంత సమయం పడుతుందో చెప్పు?"

"నీకు అన్నిట్లోనూ ఆటలే వెంకన్నా. త్వరగా ఆతని కథ ముగించే దారి చూడు. మిగిలింది గాయత్రి మాత్రమే. ఈ ఊరి నుంచే దాన్ని తరిమేద్దాం. మొండికేసిందనుకో దాన్ని కూడా చంపేద్దాం. ఆస్తంతా తానుగా నా చేతికి వచ్చేస్తుంది. ఆ తరువాత అంతా మన ఇష్టం. కానీ, అంతవరకు ఎవరి కళ్ళల్లోనూ మనం పడకూడదు కదా?"

"నువ్వు చెప్పేది కరక్టే. అయితే సరి...నేను బయలుదేరుతాను"

ఆ తరువాత మాటలు ఆగిపోయి ఆ గదిలో నిశ్శబ్ధం అలుముకుంది.

వస్తున్న ఏడుపును ఆపుకోవటానికి నోరు మూసుకుని, తాను వచ్చింది ఎవరూ గమనించకూడదని మెల్లగా తిరిగి వెళ్ళింది గాయత్రి. మళ్ళీ దుప్పటిలోకి దూరింది గాయత్రి. కన్నీరు...చెవి చివర నుండి కారి దిండును తడిపింది.

తెల్లారింది.

ప్రమీల తన కళ్లల్లో పడినప్పుడంతా తనలో ఎగిసిపడుతున్న ఆవేశాన్ని కష్టపడి అనుచుకుంటోంది గాయత్రి.

ఆ రోజు రాత్రి పొద్దు తనతో పాటూ వర్షాన్ని తెచ్చుకుంది. ఆ కారణం చేత ఊరి ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండిపోయారు.

అలవాటుకు విరుద్దంగా ఆ రోజు తొందరగా నిద్ర పోయింది ప్రమీల. గాయత్రి తనలో తానే నవ్వుకుంది. ఒకటా...రెండా? పాలల్లో వేసింది పది నిద్ర మాత్రలు కదా! మెల్లగా ప్రమీల దగ్గరకు వెళ్ళి ఆమెను క్షుణ్ణంగా గమనించింది గాయత్రి. ఊహూ...చలనం లేదు. పూర్తిగా తృప్తి ఏర్పడకపోవటంతో దిండును ఆమె మొహం మీద పెట్టి బలం ఉన్నంత వరకు నొక్కింది గాయత్రి. శబ్ధమే లేకుండా చనిపోయింది ప్రమీల.

‘హమ్మయ్య’ అనుకుంటూ ఆనందంతో వెనక్కు తిరిగిన గాయత్రికి తన వెనుక నుండి "శభాష్" అంటూ ఒక గొంతు వినబడింది.

వెనక్కు తిరిగింది.

వెంకన్న నిలబడున్నాడు. వెకిలిగా నవ్వాడు.

ఐదు నిమిషాల తరువాత ఇల్లంతా చిందర వందరగా పడున్న వస్తువుల మధ్యలొ, ఆయసపడుతూ వంకర టింకరగా పరిగెత్తుతోంది గాయత్రి. పిచ్చి పట్టిన కుక్కలాగా వదలకుండా ఆమెను తరుముతున్నాడు వెంకన్న.

తన శక్తి అంతా కరిగిపోయి ఒడిపోయింది గాయత్రి.

విజయోత్సాహంతో బలవంతంగా ఆమెను పూర్తిగా అనగదొక్కాడు. వసపరుచుకున్నాడు. ఆమె యౌవనాన్ని జుర్రుకున్నాడు. కన్యత్వాన్ని దొచుకున్నాడు.

బయట వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది.

లేవటానికి కూడా ఓపిక లేక గొడను ఆనుకుని ఒక మూలలో ముడుచుకు పడుంది నందిని.

ఆమెకు మరింత చేరువకు వెళ్ళి ఆమెను ముట్టుకున్నాడు.

"వదిలేయ్... నన్ను వదిలేయ్...వెళ్ళిపో...ఇక్కడ్నుంచి వెళ్ళిపో"--అంటున్న ఆమె వొళ్ళంతా వణుకు. మరింతగా ముడుచుకుపోయింది.

"నిన్ను చూడటానికి నాకే పాపం అనిపిస్తోంది. కానీ ఏం చేయను? ఎన్నో రోజుల నా తపస్సు ఈ రోజు పూర్తి అయిపోయింది తెలుసా? నీ మీద నాకున్న ఆశ, నీ వల్ల నా అక్క కొడుకు మొహన్ చచ్చిపోయినప్పుడు వెర్రిగా మారింది. ఎక్కడ నిన్ను ముట్టుకోకుండానే వెళ్ళిపోతానో అనుకున్నాను. పరవలేదు...ఆ భగవంతుడే నా వైపు ఉన్నాడు. లేకపోతే ఇలాంటి ఒక సందర్భాన్ని నాకు ఏర్పరచి ఇస్తాడా?"--అని చెప్పి సిగిరెట్టు ఒకటి ముట్టించుకున్నాడు.

"ఇలా చూడు గాయత్రీ...ఒకవేల నాకూ, ప్రమీలకూ ఉన్న సంబంధం నీకు తెలిసిపోయి అది ఇష్టంలేకనే నువ్వు దాన్ని చంపేసేవోమో నన్న సందేహం నాకుంది. ఏది ఎలా ఉన్నా సరే...నీ భవిష్యత్తు ఇప్పుడు నా చేతుల్లో. భయపడకు. నేనే నిన్ను పెళ్ళి చేసుకుంటాను. ఇది సత్యం. కన్న తల్లీ చనిపోయింది. తండ్రి సగం పిచ్చోడిగా తిరిగుతున్నాడు. నీకు ఎవరున్నారు? నీ మంచికే చెబుతున్నాను. మీ నాన్న దగ్గర చెప్పి ఆస్తంతా నా పేరు మీద రాసిమ్మని చెప్పు. నాకు అది చాలు. నిన్ను చివరి వరకు కష్టమనేది తెలియకుండా చూసుకునే బాధ్యత నాది.

తరువాత ప్రమీల గురించి నువ్వు భయపడకు! అనాధగా ఈ ఊరికి వచ్చిందేగా? అనాధ శవంగా నది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దానికి నేను బాధ్యుడ్ని. కానీ, ఇదంతా ఇబ్బంది లేకుండా జరగాలంటే మన పెళ్ళికి నువ్వు అంగీకరించాలి. ఏమంటావ్? చెడిపోయిన దాన్ని పెళ్ళి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు బంగారం. ఆలొచించి మంచి సమాధానం చెప్పు"

వెంకన్న లేచి నిలబడ్డాడు. గాయత్రి ఆలొచనలో మునిగింది. నిమిషాల తరువాత "సరే" నని తన అంగీకారం తెలిపింది.

ఇంకా ఉంది.....Continued in: PART-19

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

తొలివలపు (సీరియల్)...PART-17



                                               తొలివలపు….(సీరియల్)
                                                           (PART-17)


రాత్రి. మామిడి తోటలో నులక మంచం మీద కుర్చోనున్నారు బాపిరాజు గారు. తాగిన మత్తు ఆయన తలకు ఎక్కింది. లాంతర్ వెలుతురులో మందు బాటిల్స్ మెరుస్తున్నాయి. ఎదురుకుండా నేల మీద ఈషారం కూర్చోనున్నాడు. వాడూ తాగుతున్నాడు.

"చాలు అయ్యగారూ. ఇదేమిటీ కొత్త అలవాటు? నన్ను తాగొద్దని నాకు బుద్ది చెప్పే మీరు , మీరే ఇలా...! మొదట మీరు ఇంటికి వెళ్ళండి. అమ్మగారు వెతుకుతారు " అన్నాడు.

"అరే పోరా. ఆవిడ పాత శకుంతల లాగా లేదురా. దానికి దయ్యం పట్టింది. అనుమానం దయ్యం. పాపంరా నా కూతురు. లోకం తెలియని పసిపిల్ల. దానికి పెళ్ళిచేయాలని మొండి పట్టుదల పడుతోంది. కన్న కూతురు మీదే అనుమాన పడుతోంది. ఆమె సందేహం వలన ఈ రోజు ఒక ప్రాణం పోయింది. ఇదంతా చూస్తుంటే నా గుండె పగిలిపోతోందిరా. మనసు నొప్పి పుడుతోంది. ఆ నొప్పి తెలియకుండా ఉండటం కోసమే తాగాను..." అంటూ ఒక బాటిల్ తీసుకుని గొంతులో పోసుకున్నారు బాపిరాజు గారు.

సమయం అర్ధరాత్రి దాటింది. ఈషారాం ను పిలిచారు. అతని దగ్గర నుండి సమాధనం లేదు. తూలుతూ లేచి నిలబడటానికి ప్రయత్నించారు....నిలబడలేక మంచం మీద పడిపోయారు.

"నీకు...ఏమైంది..శా..కూ? ఎందుకు.ఇ..లా..." అంటూ ఏదేదో గొణుగుతున్న బాపిరాజు గారి నోటిని మూసింది ఒక చేయి. ఆ చేతిని గట్టిగా పుచ్చుకుని "శకుంతలా" అన్నారు.

వీచిన గాలితో లాంతర్ వెలుగు ఆరిపోయింది. చలనం లేకుండా నిలబడున్నది రాత్రి. ఆ నిశ్శాబ్ధాన్ని చేధిస్తూ దూరంగా ఒక కుక్క ఏడుపు వినబడింది.

తెల్లారింది.

ఈశాన్య దిక్కులో ఉదయిస్తున్న సూర్యుడ్ని స్వాగతిసున్నట్టు పక్షులు హడావిడిగా అరుస్తున్నాయి. పక్షుల అరుపుల శబ్ధాన్ని విని కళ్ళు తెరిచారు బాపిరాజు గారు. గబుక్కున ఏదో గుర్తుకు వచ్చినట్లు మంచం మీద నుండి క్రిందకు దిగారు. దగ్గరగా పడుకోనున్న ప్రమీల, మంచం ఊపుకు నిద్ర నుండి మేల్కుని బాపిరాజు గారిని చూసి నవ్వింది.

మంచం మీద నుండి కిందకు దిగుతూ జారిపోయున్న పమిటను సర్ధుకుంది ప్రమీల.

"ఏమే...రాక్షసీ" - అని తల కొట్టుకుంటూ గోలచేశారు బాపిరాజు గారు.

"ఎందుకిలా చేశావే?  నీకు నేను ఏమి అపకారం చేశాను?"

ఆవేదనతో అడిగిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూసి చెరిగిపోయిన జుట్టును ఒకటిగా చేర్చి గుండ్రంగా చుట్టుకుని బాపిరాజు గారి దగ్గరగా వచ్చింది.

"నువ్వు నాకు మంచే చేసేవయ్యా! నేను కాదని చెప్పటం లేదు? కానీ, అది నీకే తెలియకుండా నీకు పాపంగా మారిపోయింది?"

అర్ధం కాక ఆమెనే చూశాడు బాపిరాజు గారు.

"అర్ధం కాలేదు కదా...దాంపత్య జీవితానికే పనికిరాని ఒకడ్ని నాకు కట్టబెట్టి నా జీవితాన్నే నాశనం చేశారే! అదేనయ్యా మీరు చేసిన పాపం. ఆ రోజే నా దారిలో నేను వెళ్ళి వుండేదాన్ని. కానీ, ‘పెళ్ళి’ అనే ఆశ చూపి మోసం చేశారు. నా భవిష్యత్తే మీ వల్ల ప్రశ్నార్ధకం అయిపోయింది. అతను తాగుబోతుగా ఉన్నా పరవలేదు. సంసారం చేయటానికి యోగ్యతే లేని ఒకడితో ఎలా జీవించగలను? జీవితం వృధా అయిపోయిందే అని అనుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఆ టైములో నన్ను ఈ స్థితికి తీసుకు వచ్చిన మీమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనిపించేది. చివరగా మీరే వచ్చి నా వలలో చిక్కుకున్నారు. నిజంగా చెబుతున్నాను. మగాడంటే నువ్వే నయ్యా. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా?" -- మెల్లగా బాపిరాజు గారి దగ్గరకు చేరి ఆయన ఛాతీ మీద చెయ్యి పెట్టింది.

"ఛీ...ఛీ. చెయ్యి తీయ్. నువ్వు ఇంత నీచమైన మనిషిగా ఉంటావని నేను కొంచం కూడా ఎదురుచూడలేదు. ఇప్పుడే ఈషారం దగ్గర చెప్పి, నిన్ను ఈ ఊరు నుంచి తరిమేసిన తరువాతే నేను ఇంకో పనిచేస్తాను"

ఆవేశంతో చెప్పిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూస్తూ గట్టిగా నవ్వింది ప్రమీల.

"అతను ఇక్కడుంటేగా?" అన్నది.

"ఏం చెబుతున్నావు...ఈషారాం ఎక్కడ? వాడ్ని ఏం చేశావు? ఇప్పుడు చెబుతావా...లేదా?"

"నిజంగా అతన్ని నేనేమీ చెయ్యలేదు. తానుగానే పారిపోయాడు. ఇంకేం చేస్తాడు, తన పెళ్ళాం ఇంకొక మగాడితో ఉండటం చూస్తే ఏ మొగుడు చూస్తూ నిలబడుతాడు? రోషం ఉన్న మనిషి....అందుకనే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు" -- చెప్పేసి గల గలమని నవ్వింది ప్రమీల.

భూమి వెనక్కు తిరిగుతున్నట్లు అనిపించింది బాపిరాజు గారికి. ఇంతకాలంగా తాను చేర్చి పెట్టుకున్న గౌరవం, మర్యాద అన్నీ ఒకే రోజు రాత్రి గాలిలో కలిసిపోయినట్లు అనుకుని లోలోపల తపించిపోయాడు. 'ఆ రోజే భార్య శకుంతల మాటలు వినుంటే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడేదా? వినకుండా పోయావే పాపాత్ముడా' తల కొట్టుకుంటూ ఏడుస్తూ తనని తానే నిందించుకున్నాడు. తరువాత, కన్నీళ్ళు చూపును అడ్డుకుంటుంటే...తూలుతూ ఇంటివైపుకు నడవటం మొదలుపెట్టారు.

ఇల్లంతా సాంబ్రాణి పొగ అలుముకుంది. శకుంతలాదేవి, పూజ గదిలో ఉన్నట్లు చెప్పకుండా చెబుతోంది అది. గాయత్రి ఇంకా లేవలేదు. ముందు రోజు తిన్న దెబ్బల వలన వొళ్లంతా వాపెక్కటంతో లేవడానికి కూడా ఓపిక లేక పడుంది.

"భగవంతుడా! ఏ సమస్య రాకుండా నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి"--ప్రార్ధించుకుని పూజ గదిలో నుండి బయటకు వచ్చిన శకుంతలాదేవి, భర్త రావటం గమనించి వంట గదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తీసుకు వచ్చింది. అది కూడా గమనించ కుండా ఎక్కడో చూసుకుంటూ కూర్చున్నారు బాపిరాజు గారు.

"కాఫీ పెట్టాను" భర్త మొహం చూడకుండా చెప్పి వెళ్ళబోయింది...కానీ, భర్త చలనం లేకుండా కూర్చోనుండటం గమనించి,

"మిమ్మల్నే" అన్నది, కొంచం గట్టిగా.....ఆప్పుడు మామూలు స్థితికి వచ్చిన బాపిరాజు గారు, తన భార్యను చూసీ చూడంగానే...గబుక్కున ఎగిరి ఆమె కాళ్ళు పట్టుకుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు.

"నన్ను క్షమించు శకుంతలా. నేను పెద్ద తప్పు చేశానే" అంటూ జరిగిందంతా చెబుతుంటే శకుంతలాదేవి మనసు లోలోపల కొంచం కొంచంగా విరిగి ముక్కలు అవుతోంది.

తండ్రి ఏడుపు విని గాయత్రి లేచి పరిగెత్తుకుని వచ్చింది. తన ముందు వచ్చి నిలబడ్డ కూతురి రెండు చేతులు పుచ్చుకుని తన చెంపల మీద మార్చి మార్చి కొట్టుకున్నారు. తండ్రి అలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాక పోయినా, గాయత్రి తండ్రిని సమాధన పరిచే పనిలో ఈడుపడింది.

చాలసేపు అయిన తరువాతే తండ్రీ, కూతుర్లు ఇద్దరూ అది గమనించారు. ఏదో కాలుతున్న వాసన. మొదట్లో బాపిరాజు గారి బుర్రకు తట్టలేదు. తరువాత బుర్రలో ఎదో ఒక రవ్వ ఏర్పడటంతో సడన్ గా లేచి పరిగెత్తారు. ఏమైందో తెలియక తండ్రి వెనుకే పరిగెత్తింది గాయత్రి. ఇంట్లోని ఏ గదిలోనూ శకుంతలాదేవి కనిపించలేదు. వెనుక గుమ్మం తెరిచి ఉండటంతో అటు వెళ్లారు...స్నానాల గది మొత్తం పొగ కమ్ముకోనుంది.

"శకుంతలా" అంటూ బాపిరాజు గారు పెద్దగా కేకలు వేయడంతో జనం గుమికూడారు. కొంతమంది కలిసి పోరాడిన తరువాత తలుపు పగలకొట్టబడింది. లోపల కనబడిన దృశ్యం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు బాపిరాజు గారు. శిలలాగా అయిపోయింది గాయత్రి.

అవును! తన భర్త...మరో పురుషుని భార్యను ముట్టుకున్నందు కోసం...ఇక అయన వేలు కూడా తన మీద పడకూడదని నిర్ణయించుకుని మంటల ఆకలికి తనని ఆహారంగా ఇచ్చుకుంది ఆ పతివ్రత శకుంతలాదేవి.

ఇంకా ఉంది.....Continued in: PART-18

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి)

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

తొలివలపు (సీరియల్)...PART-16



                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-16)


ఆ రోజు గాయత్రిని స్కూలుకు తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చిన బాపిరాజు గారికి, భార్య పెళ్ళిళ్ల బ్రోకర్ తో మాట్లాడటం వినబడగానే అలాగే అరుగు మీద కూర్చుండిపోయాడు.

"అదంతా తరువాత మాట్లాడుకుందాం! నా కూతుర్ని పెళ్ళికొడుకు వాళ్ళింట్లో అందరూ నచ్చిందని చెప్పేరా...లేదా? ఆది చెప్పండి మొదట"

"నచ్చిందా అని అడుగుతున్నారా...? భలే అడిగేరు పొండి. మీ అమ్మాయే వాళ్ళింటి కోడలని వాళ్ళింట్లో వాల్లందరూ తీర్మానమే చేసుకున్నారు. మీ సమాధానం కోసం మాత్రమే వాళ్ళు కాచుకోనున్నారు. ఒకవేల మీకు వాళ్ళ సంబంధం నచ్చింది అంటే, తాంబూళాలు మార్చుకున్న వెంటనే పెళ్ళి కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు అలా తొందరపడుతున్నందుకు ఒక కారణం ఉంది. వాళ్ళింట్లో వయసైన ఒకావిడ ఉన్నది. నాలుగు వంశాలను చూసింది. ఆవిడ తన చేతులతో తాళి తీసిచ్చే వాళ్ళింట్లో అన్ని పెళ్ళిల్లూ జరిగినైయట. ఆ వయసైన ఆవిడ ఇప్పుడు సీరియస్ గా ఉన్నదట. కళ్ళు మూసేలోపల చివరి మనవడి పెళ్ళి కూడా చూడాలని ఆశపడుతోందట. అందుకనే ఇలా ఒక ఏర్పాటు.

మీరు దేని గురించి భయపడక్కర్లేదు. చాలా మంచి మనుషులు. ఆ ఇంటి సంబంధం దొరకటానికి మీకు అదృష్టం ఉండాలి. నా కమీషన్ ఎదురు చూసి నేను ఈ మాట చెప్పటం లేదు. ఆ తరువాత మీ ఇష్టం. వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో చెప్పారంటే నేను బయలుదేరతాను" అన్నాడు పెళ్ళిళ్ళ బ్రొకర్.

"ఈ రోజే తాంబూళాలు పుచ్చుకుందామని చెప్పేయండి" అన్నది శకుంతలాదేవి.

"నిజంగానే చెబుతున్నారా?" అన్నాడు పెళ్ళి బ్రోకర్, నమ్మలేక.

"అవును...మీరు వెంటనే అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళింట్లో ఏర్పాట్లు చేయమనండి. మేము వెనకాలే వస్తాం"

"మంచిదండి. అయితే బయలుదేరతాను" అని ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు పెళ్ళిళ్ళ బ్రోకర్.

బ్రోకర్ వెళ్ళిన తరువాత లోపలకు వెడుతున్న శకుంతలాదేవిని ఆగమని చెప్పి ఆపారు బాపిరాజు గారు.

"నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రోజు ఏదో కోపంలో చెప్పావనుకున్నాను. కానీ, ఇప్పుడు నిజంగానే...! వద్దు శకుంతలా, నేను చెప్పేది కొంచం విను"

"అక్కర్లేదు! టైమవుతోంది...బయలుదేరండి"

“నేను రాను”

"అయితే సరి, నేనే అన్నీ ఖాయం చేసుకుని వస్తాను"

"వాళ్ళెవరు....ఎలాంటి కుటుంబం. ఇవన్నీ కనుక్కోకుండనే..."

"నాకు నమ్మకం ఉంది. నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా జీవిస్తుంది"

"శకుంతలా...నేను..."

"నేను నిర్ణయం తీసుకున్నది తీసుకున్నదే. దాన్ని మార్చటం ఇక ఎవరి వల్లా కాదు"

నిక్కచ్చిగా చెప్పి, బయలుదేరింది శకుంతలాదేవి.

*********************

బస్సు దిగి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది గాయత్రి. 'నాన్నకు ఏమైంది? ఎందుకు ఈరోజు నన్ను ఇంటికి తీసుకు వెళ్ళటానికి రాలేదు?-- అన్న ఆలొచనతో వస్తుంటే...ఎవరో తనను పిలవటంతో, నిలబడి వెనక్కి తిరిగింది. ఆయసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మోహన్.

'అరె భగవంతుడా! వీడు ఎందుకు ఇక్కడకు వచ్చాడు?' -- ఆమె ఆలొచించిన క్షణంలో అతను ఆమె దగ్గరకు వచ్చాడు.

"ఒక్క నిమిషం ఆగు గాయత్రీ. నేను నీతో కొంచం మాట్లాడాలి"

"నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో మోహన్. మా ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది"

"మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్ గాయత్రీ"

“ఏది మాట్లాడాలనుకున్నా రేపు స్కూల్లో మాట్లాడుకుందాం. మొదట బయలుదేరు"

"కుదరదు గాయత్రీ. నిన్ను ఒంటరిగా కలుసుకోవటం నాకు ఈ రోజే కుదిరింది"

"దేవుడా!...సరే, ఏమిటో త్వరగా చెప్పు"

"మొదట నన్ను క్షమించు గాయత్రీ. బుద్ది లేకుండా నేను ఆ రోజు చేసిన తప్పుకు. పవిత్రమైన మన స్నేహాన్ని అపవిత్రం చేసినందుకు"

"వదిలేయిరా. అదంతా నేను ఆ రోజే మరిచిపోయాను. నువ్వు ఎప్పుడూ నా స్నేహితుడివే...చాలా?"

"నువ్వు అబద్దం చెబుతున్నావు. నేను నీ స్నేహితుడనేది నిజమైతే నాతో ఎందుకు మాట్లాడనంటున్నావు?"

"............................"

"నువ్వు మౌనంగా ఉంటేనే అర్ధమవుతోంది. నువ్వు ఇంకా నన్ను క్షమించలేదని"

"నువ్వు అనుకుంటున్నది నిజం కాదురా"

"అయితే నాకు ప్రామిస్ చెయ్యి. ఇక మీదట మాట్లాడతాను, అంతకు ముందులాగానే మన స్నేహం కొనసాగుతుంది అని చెప్పు. అప్పుడే నమ్ముతాను"

తన ముందు జాపిన అతని చేతినే చూస్తూ నిలబడ్డది గాయత్రి.

'శ్రద్దగా చదువుకోవటానికి వెళ్ళామా...వచ్చామా అని ఉండాలి. ఏ మగడితో పడితే ఆ మగాడితో నిలబడి మాట్లాడటమో, నవ్వనో చెయ్యకూడదు. జ్ఞాపకమున్నదా?'---తల్లి శకుంతలాదేవి , కళ్ళ ముందు కనబడి కళ్ళు పెద్దవి చేసుకుని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది గాయత్రికి.

అప్పుడు...తాంబూళాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది శకుంతలాదేవి. దూరం నుండి వస్తున్నప్పుడే మోహన్ తో కూతురు మాట్లాడుతున్నది చూశేసింది. ఆవేశంతో వేగంగా నడిచి కూతుర్ని చేరుకుంది. పాపం...ఇద్దరూ ఇది గమనించలేదు.

"ఏం గాయత్రీ ఇంకా ఆలొచిస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదు...అంతే కదా?"--అంటున్నప్పుడే అతని కళ్ళల్లో నీళ్ళు ఉబికి వస్తున్నాయి.

"హాయ్! మోహన్. ఏమిట్రా ఇది? సరే...ప్రామిస్" అంటూ అతని చేతిలో చేయివేసిన ఆ క్షణం, హఠాత్తుగా ఎవరో వాళ్ళ చేతులను తోశేసినట్లు అనిపించి ఇద్దరూ తిరిగారు.

ఆవేశం చివరి దసలో నిలబడుంది శకుంతలాదేవి. ఆ సమయంలో తల్లిని అక్కడ ఎదురుచూడని గాయత్రిలో వణుకు మొదలైయ్యింది.

"నేను వచ్చి..." అన్న మొహను కు ఎదురుగా నిలబడి……

"నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని వెతుక్కుని ఉర్లోకే వచ్చుంటావు? నీ ప్రేమ నీ కళ్ళు కప్పి ఇక్కడి దాకా తీసుకువచ్చిందా...థూ… నువ్వొక…." అంటూ, ఇంకా ఏదేదే మాటలతో తన ఆవేశం తీరే వరకు తిట్టి ముగించింది శకుంతలాదేవి.

ఊరే గుమికూడింది. అవమానంతో కుంగి కృషించి నిలబడ్డాడు మోహన్. వాడ్ని చూడటానికే 'అయ్యో పాపం' అనిపించిది గాయత్రికి. వివరం తెలుసుకుని క్రిందా మీదా పడుతూ పరిగెత్తుకు వచ్చాడు వెంకన్న. శకుంతలాదేవి దగ్గర క్షమాపణ కోరి మేనల్లుడ్ని తీసుకుని వెళ్ళాడు. మరోపక్క గాయత్రిని చెతులు పుచ్చుకుని లాక్కుని వెడుతున్నట్టు నడిచింది శకుంతలాదేవి.

ఇంటి లోపలకు వెళ్ళటం ఆలశ్యం...తలుపులు మూసింది శకుంతలాదేవి. టేబుల్ మీదున్న పెద్ద స్కేల్ తీసుకుని కూతుర్ని పిచ్చి పిచ్చిగా కొట్టింది. నొప్పి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది గాయత్రి.

బయట తలుపును విరకొడుతున్నట్టు గట్టిగా తలుపు తడుతున్నారు బాపిరాజు గారు.

ఆవేశం తగ్గిన తరువాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది శకుంతలాదేవి. ఆమెను కోపంగా చూసుకుంటూ లోపలకు వెళ్ళి భయంతో వణుకుతున్న కూతుర్ని చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో నెత్తుటి కన్నీరు వచ్చింది.

మరో అరగంటలో ఆ వార్త ఊరు ఊరంతా పాకిపోయింది. 'వెంకన్న అక్క కొడుకు మోహన్, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు' అని!

ఇంకా ఉంది.....Continued in: PART-17

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

25, సెప్టెంబర్ 2019, బుధవారం

తొలివలపు (సీరియల్)...PART-15



                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-15)

స్కూల్ హెడ్ మాస్టర్ ముందు నిలబడున్నారు బాపిరాజు, శకుంతలాదేవి. ఎదురుగా చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడున్నాడు మోహన్.

అప్పుడే హడావిడిగా లోపలకు వచ్చాడు వెంకన్న. అతనితో పాటు అతని అక్కయ్య. బాపిరాజు గారిని అక్కడ ఎదురు చూడని వెంకన్న, బాపిరాజు గారి దగ్గరకు వెళ్ళాడు.

"మామయ్యా...మీరెందుకు ఇక్కడ ఉన్నారు?" అని అతను అడిగి ముగించేలోపు,

"అదే నేనూ అడుగుతున్నాను. ఈ అబ్బయి మీకేమవుతాడు?" వెంకన్నను అడిగాడు హెడ్ మాస్టర్.

"వీడు నా అక్కయ్య కొడుకు. ఈమే మొహన్ తల్లి. నాకు అక్కయ్య"

"ఓహో, ఏమ్మా మీ అబ్బాయి ఏం చేశాడో మీకు తెలుసా? సార్ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మాయినే! ఊహూ...మీ దగ్గర మాట్లాడి లాభం లేదు. ఇప్పుడే టి.సి ఇచ్చేస్తాను. తీసుకుని వెళ్ళిపొండి"

"సార్...దయచేసి ఈ ఒక్కసారికి వాడ్ని క్షమించండి. ఇక మీదట ఇలా జరగ కుండా చూసుకుంటాను" అంటూ కాళ్ళ మీద పడినట్లే బ్రతిమిలాడింది మొహన్ తల్లి.

"అవును మామయ్యా...మీరు కొంచం చెప్పండి. ఇక మీదట ఇలా జరగదు. దానికి నేను బాధ్యుడ్ని" అంటూ బాపిరాజు గారి దగ్గర బ్రతిమిలాడాడు వెంకన్న.

"అదంతా కుదరదు. ఈ విషయం బయటకు తెలిస్తే మా స్కూలుకే చెడ్డపేరు వస్తుంది. ఏదో సారు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా నా ముందుకు తీసుకు వచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను. అది జరిగే పనికాదు. నేను ఒకసారి డిసైడ్ చేసింది చేసిందే"

పట్టుదలతో మాట్లాడుతునే ఉన్నారు హెడ్ మాస్టర్.

బాపిరాజు గారికి జాలి గుణం ఎక్కువ. అది ఆయన్ని మౌనంగా ఉంచలేకపోయింది.

"సరే...వదిలేయండి సార్. అబ్బాయి చదువు విషయం కూడా ఇందులో పొదిగి ఉంది. చిన్న పిల్లాడు. ఖండించి, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం" అన్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.

"సరే...సార్ చెప్పినందువలన విడిచిపెడుతున్నాను. అబ్బాయికి మంచి బుద్దులు నేర్పి పంపండి" అని చివరగా దిగివచ్చారు హెడ్ మాస్టర్.

"చాలా ధ్యాంక్స్ అండి. ధ్యాంక్స్ మామయ్యా" అని చెప్పిన వెంకన్నతో,

"ఈ విషయం మన ఊర్లో ఎవరికీ తెలియకూడదు వెంకన్నా...జాగ్రత్త" అని చెప్పిన బాపిరాజు గారితో 'సరే' అంటూ తల ఊపి మోహన్ని, తన సహోదరిని పిలుచుకుని బయటకు వెళ్ళాడు వెంకన్న.

"అయితే మేము కూడా బయలుదేరతాం సార్" అని హెడ్ మాస్టర్ కి చెప్పి బయలుదేరబోయిన బాపిరాజు గారితో,

"సార్, ఇది కారణంగా తీసుకుని మీ అమ్మాయిని స్కూలుకు పంపకుండా ఉండకండి. గాయత్రి బాగా చదువుకునే పిల్ల" అన్నాడు హెడ్ మాస్టర్.

"ఛ...ఛ! మా అమ్మాయి తప్పకుండా స్కూలుకు వస్తుంది" అని చెప్పి భార్యను తీసుకుని బాపిరాజు గారు కూడా బయలుదేరారు.

మరుసటి రోజు నుండి గాయత్రి స్కూలుకు వెళ్లటం మొదలుపెట్టింది. కానీ, శకుంతలాదేవికి అది కొంచం కూడా ఇష్టం లేదు. కూతుర్ని కారణంగా పెట్టుకుని దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అది రోజు రోజుకూ పెరిగి పెద్దదవుతోంది. ప్రతి రోజూ గాయత్రి స్కూల్ నుండి వచ్చిన వెంటనే గాయత్రి పుస్తకాల సంచిని వెతికి చూడటం రోజువారి పనులలో ఒకటిగా పెట్టుకుంది శకుంతలాదేవి. దాని గురించి బాపిరాజు గారు ఏదైనా అడిగితే మళ్ళీ ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలవుతుంది. ఈ సమస్యకు మాత్రమే కాకుండా...తల్లి-తండ్రుల మధ్య గొడవలకు తానే కారణం అనే భావన గాయత్రిని పట్టి పీడించడం మొదలుపెట్టింది. తన కుటుంబం కొంచం కొంచంగా సంతోషానికి దూరమవుతుండటం గ్రహించి తట్టుకోలేక తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది.తనతో మాట్లాడమని బ్రతిమిలాడింది.

శకుంతలాదేవి ఏమో కూతుర్ను బద్రకాళి లాగా చూసింది. కావాలని కూతురుకు దూరంగా జరిగింది.

"నేను ఏం తప్పు చేశాను నాన్నా? అమ్మ నాతో మాట్లాడటమే లేదు? కొద్ది రోజుల క్రితం వరకు అమ్మ నామీద ఎంతో ప్రేమగా ఉండేది. నాకు కొంచంగా జలుబు చేసినా తట్టుకోలేదే? అలాంటి అమ్మ ఇలా మారిపోయిందే?"

తన ఒడిలో ముఖం చాటుగా పెట్టుకుని ఏడుస్తున్న కూతురి తల నిమురుతున్న బాపిరాజు మనసు లోలోపల ఏడ్చింది.

"ఏడవకురా తల్లీ. అమ్మకు నీమీద అనుమానం ఏమీ లేదమ్మా. నాకంటే మీ అమ్మకేరా నీమీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను ఆవిడ నాజూకుగా చూపలేక పోతోంది...అంతే. అదికూడ ఒక విధంగా మూర్ఖంగా చూపించే తల్లి ప్రేమే. తన కూతురుకి ఏమీ తప్పుగా జరగకూడదనే భయం...అంతే తల్లీ. నిజానికి మీ అమ్మ తన ప్రాణం అంతా నీమీదే పెట్టుకుంది తెలుసా? నువ్వు కొంచం నిదానంగా ఉండు. అంతా తానుగా సర్దుకుంటుంది"- -అని కూతుర్ని సమాధాన పరిచే ప్రయత్నంలో మునిగిపోయారు బాపిరాజు.

తండ్రి యొక్క మాటలు గాయత్రికి కొంత ఊరట కలిగించటంతో కళ్ళు తుడుచుకుని ఉత్సాహంతో తండ్రి ముఖంలోకి చూసింది.

"అమ్మకు నా మీద నమ్మకం రావాలంటే నేనేం చేయాలి నాన్నా?"

"త్వరగా పెళ్ళి చేసుకోవాలి" వెనుక నుండి వినబడ్డ మాటలు విని ఆశ్చర్యంతో వెనక్కు తిరిగారు ఇద్దరూ.

శకుంతలాదేవి నిలబడుంది.

"ఏమిటే వాగుతున్నావు? చిన్న పిల్లనే అది" భార్యను చూసి అన్నాడు బాపిరాజు.

"నేను మాత్రం కాదనా చెప్పాను! అది వయసుకు వచ్చింది కదా...ఇంకేమిటి? నాకు నా పరువు-మర్యాద ముఖ్యం"

"శకుంతలా...నువ్వు చేసేది చాలా అన్యాయం"

"ఏది న్యాయం-ఏది అన్యాయం అనేది నాకు బాగా తెలుసు. అది మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు"

"ఏమిటే వాగుతున్నావు?" -- అని భార్యను కొట్టటానికి చెయ్యి ఎత్తిని తండ్రిని అడ్డుకుని ఆపింది గాయత్రి.

"ప్లీజ్...వద్దు నాన్నా. అమ్మను కొట్టద్దు"- బ్రతిమిలాడింది.

"చూడు ఎంత అహంకారంగా మాట్లాడుతోందో...నువ్వే చూశావుగా?"

తండ్రిని సమాధాన పరిచి, తల్లి వైపు తిరిగింది గాయత్రి.

"అమ్మా...నేను పెళ్ళిచేసుకుంటేనే మీకు సంతోషం, ప్రశాంతత దొరుకుతుందంటే మీ ఇష్టం వచ్చినట్లే చేయండి" అని తల్లితో చెప్పిన గాయత్రి, కళ్ళల్లో నీరుతో లోపలకు పరిగెత్తింది.

ఇంకా ఉంది.....Continued in: PART-16

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

23, సెప్టెంబర్ 2019, సోమవారం

తొలివలపు (సీరియల్)...PART-14



                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-14)

చివరికి శకుంతలాదేవి పట్టుదలే గెలిచింది!

ఐదో రోజు సంబరం అత్యంత విషేషంగా జరిగి ముగిసింది. ఆ తరువాత ఇదిగో ఈ రోజు స్కూలుకు బయలుదేరింది గాయత్రి.

లంగా-వోణి, రెండు జడలతో తన ముందుకు వచ్చి నిలబడ్డ గాయత్రిని చూసి మైమరిచి కళ్ళార్పకుండా చూసింది శకుంతలాదేవి.

'నిజమే. లోకంలోని అందం మొత్తాన్నీ ఒకటిగా చేర్చి దేవుడు గాయత్రిని మాత్రమే పుట్టించాడు. ఏడో క్లాసు చదువుతున్న గాయత్రికి వయసుకు మీరిన ఎదుగుదల. పక్వం లేని పరువము. కానీ గాయత్రి పాపం! పసిపిల్ల మనసున్న గాయత్రిని తొందరపడి పదేళ్లకే పెద్ద మనిషిని చేయడం అవసరమేనా....ఏం చేయగలం? ప్రకృతి యొక్క చేష్ట ఇది!’

"ఏమిటే...నా కూతుర్ని కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డావు?" తన గదిలో నుండి బయటకు వచ్చిన తండ్రి బాపిరాజు భార్యను అడిగాడు..

"ఏమండి...మన అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? నా దిష్టే తగిలేటట్టుంది. మీరు కావాలంటే చూడండి...మన అమ్మాయి మహారాణిలాగా జీవిస్తుంది" అన్న తల్లి శకుంతలాదేవి, గాయత్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కూతుర్ను తన చెంతకు లాక్కుని గుండెలకు హత్తుకుంది.

తల్లి శ్వాశగాలి తగిలి పులకరించిపోయింది గాయత్రి.

"మరి నీ కూతురు నీ లాగానే కదా ఉంటుంది" అంటూ ఓర చూపుతో భార్య అందాన్ని ఆరాధిస్తున్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.

గబుక్కున తల తిప్పుకుని "వెళ్దామా గాయత్రి?" అంటూ బయటకు వచ్చి తన బండిని తీస్తున్నప్పుడు, వెనుక నుండి వినబడ్డ పిలుపు విని వెనక్కి తిరిగారు బాపిరాజు గారు.

"ఏమిటి మామయ్యా. బయలుదేరారా? ఎరువు కొనడానికి నేను కూడా టౌనుకే వెలుతున్నాను. కావాలంటే గాయత్రిని నేను స్కూల్లో దింపనా?" అడుగుతూ గాయత్రి వైపే చూశాడు వెంకన్న.

వెంకన్న గాయత్రిని చూసే చూపులో ఆకలి, కసి కనబడింది. ఆ చూపులోని భావన అర్ధంకాక స్నేహంగా నవ్వింది గాయత్రి. అదే సమయం మధ్యాహ్నం లంచ్ బాక్స్ ను తీసుకుని బయటకు వచ్చిన శకుంతలాదేవిని చూసి వెంకన్న జారుకున్నాడు. ఊరి ప్రజలకు బాపిరాజు గారి మీద ఎంత మర్యాద ఉన్నదో....శకుంతలాదేవి మీద అంతకన్న ఎక్కువ భయం ఉన్నది. కానీ అందరూ అహంకారం లేని ఆమె అధికారానికి కట్టుబడి ఉంటారు.

దూరంగా వెడుతున్న వెంకన్ననే కోపంగా చూస్తూ ఉండిపోయిన శకుంతలాదేవి గాయత్రి వైపు తిరిగింది.

"ఇలా చూడు గాయత్రీ. నేను చెప్పిందంతా జ్ఞాపకముంచుకో. ఏ మగాడితోనూ నిలబడి మాట్లాడటమో- నవ్వనో కూడదు. ఇళ్లు వదిలితే స్కూలు, స్కూలు వదిలితే ఇళ్లు అనే ఉండాలి...అర్ధమైందా?"

సరి అనేలాగా తల ఊపింది గాయత్రి.

"అబ్బా! మళ్ళీ మొదలు పెట్టిందా? నువ్వు రారా...మనం వెళ్దాం" అన్న బాపిరాజు, గాయత్రిని బండిలో ఎక్కించుకుని బయకుదేరారు.

వాళ్ళిద్దరూ కళ్ళకు కనబడేంత దూరం వరకు చూసి ఇంటిలోపలకు వెళ్ళింది శకుంతలాదేవి.

క్లాస్ రూముకు గాయత్రి కొత్తగా వచ్చిందా...గాయత్రి వచ్చినందువలన క్లాస్ రూము కొత్తగా ఉన్నదా? అనే కన్ ఫ్యూజన్ లోనే ఆ రోజు గడిచిపోయింది. సహ విధ్యార్దుల ఎగతాలి, నవ్వులాటలు గాయత్రిని మరింత సిగ్గులోకి తీసుకు వెళ్ళింది. స్కూలు టైము ముగిసిందో లేదో...సీతాకోక చిలుకులాగా ఎగురుకుంటూ వచ్చి నిలబడున్న తండ్రి బండిపై ఎక్కి కూర్చుంది. బండి ఇంటివైపుకు వెళ్ళింది.

సాయంత్రం టిఫిన్ తో కూతురుకి స్వాగతం పలికి, ఆశతో ప్రేమను కురిపించి తన పనికొసం లోపలకు వెళ్ళింది శకుంతలాదేవి. తల్లి ప్రేమలో తనని తానే మరిచిపోయింది గాయత్రి. కానీ ఆ తల్లి స్పర్ష, ప్రేమ ఇక తనకు దొరకదని అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది.

హోమ్ వర్క చేయటానికని పుస్తకం తీసినప్పుడు అందులో నుండి ఒక కాగితం బయట పడటంతో...తీసి కాగితాన్ని మడత విప్పింది గాయత్రి. చదివింది. నవ్వు కుంటూ మళ్ళీ మళ్ళీ చదివింది....చివరగా ముఖమంతా చెమట పట్టగా చదివిన కాగితాన్ని మడతపెట్టి, ముఖం తుడుచుకుని తలెత్తింది. ఎదురుగా తల్లి శకుంతలాదేవి. కూతురు ముఖం చూసిన వెంటనే ఏదో తప్పు జరిగిందని అమెకు అర్ధమయ్యింది. గాయత్రి చేతిలో ఉన్న కాగితాన్ని లాక్కుని చదవటం మొదలుపెట్టింది.

‘ప్రియమైన గాయత్రికి,

రెండు వారాలు చనిపోయిన తరువాత ఈ రోజే నిన్ను కలుసుకుంటున్నా. చూసిన క్షణం నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను. కుదరలేదు. అందుకే ఈ లేఖను రాస్తున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి. మన స్నేహ వలయం దాటి నేను నిన్ను ఇష్టపడి చాలా రోజులు అయ్యింది. ఇక నాకు ఓర్పు లేదు. ప్రేమ నిండిన హృదయాన్ని మోస్తూ నీకొసం వైట్ చేసింది చాలు. 'ఐ లవ్ యూ గాయత్రీ. నా స్నేహాన్ని ఆమొదించినట్లే నా ప్రేమనూ అమొదిస్తావనే నమ్మకంతో కాచుకోనుంటాను. రేపు కలుద్దాం'

ఇట్లు
నీ మోహన్.

వెలుతురు లేక చీకటిగా ఉన్నది ఇల్లు.

'తల్లీ-కూతుర్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు?' అన్న ఆలొచనతో లోపలకు వచ్చారు బాపిరాజు. 'స్విచ్' వేసి ఇంట్లో వెలుతురును తీసుకువచ్చారు. ఇంట్లోని పరిస్థితి వెలుతురులో తెలిసిపోయింది. రూమంతా విరిగి పడిన వస్తువులు. మధ్యలో ఒక మూల పిచ్చిదానిలాగా కూర్చున్న శకుంతలాదేవి. ఆమె కాళ్ళ దగ్గర చుట్ట చుట్టుకుని పడున్న గాయత్రి.

పరిగెత్తుకెళ్ళి కూతుర్ని ఎత్తి తన ఒడిలో వేసుకున్నారు. ఆమె పరిస్థితి చూసి ఆందోళన చెందారు. వాతల లాంటి ఎర్రటి నెత్తుటి గీతల శరీరంతో, నొప్పులు భరించలేక గొణుగుతూ పడున్న గాయత్రి తండ్రిని చూసిన వెంటనే మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది.

"నాన్నా...ప్లీజ్ నాన్నా. మీరైనా అమ్మ దగ్గర చెప్పండి. మోహన్ నా స్నేహితుడు మాత్రమే. సైన్స్ పాఠాలలో ఏదైనా సందేహాలోస్తే అతనే నాన్నా నాకు చెప్పిస్తాడు. ఈ లెటర్ నా పుస్తకంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంతకంటే ఈ 'లెటర్’ కు నాకూ ఎటువంటి సంబంధమూ లేదు నాన్నా. మీరైనా నన్ను నమ్మండి"

ఏడుస్తూ బ్రతిమిలాడుతున్న కూతుర్ను లేపి తన భుజాలపై అనించుకుని నిదానంగా నడిపించుకుంటూ తీసుకు వెళ్ళి గదిలో పడుకోబెట్టిన తరువాత భార్య శకుంతలాదేవి దగ్గరకు వచ్చారు.

"ఏమే...మనిషేనా నువ్వు? గాయత్రి పాపమే. పసిపిల్ల వొళ్ళు, పసిపిల్ల మెదడు. గొడ్దును బాదినట్లు బాది దాన్ని నెత్తుటి గుల్ల చేశావు కదే! మనస్సాక్షి అనేది ఉందా...లేదా నీకు?"

ఆయన అడిగిన వెంటనే పొంగుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది శకుంతలాదేవి.

"ఏమండీ... గాయత్రి మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్ళదు కదా! ఊరులో, బయట జరుగుతున్నట్లు మనింట్లో ఏ తప్పూ జరగదు కదా? నాకు నా కూతురు కావాలి. గాయత్రి మనకు మాత్రమే సొంతం? నేను చూసే అబ్బాయినే అది పెళ్ళి చేసుకోవాలి. కాదూ కూడదు అంటూ ఇంకేదైనా చేస్తే...దాని తరువాత నేను ప్రాణాలతో ఉండను"

"ఏమిటే ఆలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గాయత్రి మన కూతురే. అది ఏ తప్పూ చేయదు. నీ అనుమానాన్ని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయ్"

సమాధాన పరచిన భర్త గుండెల మీద ఆనుకుని తన ఆవేశాన్ని తగ్గించు కుంటున్న శకుంతలాదేవి హడావిడిగా లేచింది.

"భగవంతుడా... నా కూతుర్ని గొడ్డును బాదినట్లు బాదేనే! అది నొప్పి తట్టుకోలేదే. అమ్మా తల్లీ" అంటూ గాయత్రి గదివైపు పరిగెత్తింది శకుంతలాదేవి.

ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకున్న గాయత్రిని చూసిన వెంటనే తల్లికి గుండె తరుక్కు పోయింది. గబ గబా వంట గదిలోకి వెళ్ళి పసుపు తీసుకుని, అందులో వేడి వేడి నెయ్యిని కలిపి ఉడకబెట్టి పేస్టులాగా చేసుకుని తీసుకు వచ్చింది. గాయత్రిని తన ఒడిలే పడుకోబెట్టుకుని దెబ్బల గాయాలకు రాసింది. తల్లి కళ్ల నుండి వెలువడిన కన్నీరు బొట్లు బొట్లుగా తన మీద పడ్డా తెలియకుండా పడుకుంది గాయత్రి.

ఇంకా ఉంది.....Continued in: PART-15

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

21, సెప్టెంబర్ 2019, శనివారం

తొలివలపు (సీరియల్)...PART-13



                                           తొలివలపు….(సీరియల్)
                                                        (PART-13)

లక్ష్మీపురం గ్రామమంతా ఆ రోజు పండుగ వాతావరణం నెలకొన్నది. పంచాయితీ ప్రెశిడెంట్ బాపిరాజు గారి ఇళ్లు జన సందడితో కోలాహలంగా ఉన్నది. అందరి మొహాలలోనూ సంతోషం వెల్లివిరిసి ఆడుతూంటే, ఆ ఆనందానికి కారణమైన గాయత్రి మొహంలో మాత్రం శొక రేఖలు కనబడ్డాయి.

ఎందుకు కనబడవు.... నిన్నటి దాకా సీతాకోక చిలుక లాగా ఎగురుతున్న ఆమెను పట్టుకొచ్చి బోనులో అనగదొక్కితే ఆమెకు సంతోషం ఎలా వస్తుంది? 'అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడికి వెళ్ళద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు!' అని అమ్మ శకుంతలాదేవి ఆజ్ఞలు ఒకపక్క, ఏదో మరోలోకం నుండి వచ్చిన జీవరాసిని వినోదంకోసం చూడటానికి వచ్చే లాగా ఊరి ప్రజలందరూ ఒక్కొక్కరూ ఆమెను చూసి వెడుతుంటే అది ఆమెలో కోపాన్ని, విసుగుని, శోకాన్నీ ఎక్కువ చేసింది.

ప్రొద్దున ఇచ్చిన భోజనం, ఆమె వేళ్ళు ఇక తాకవని తెలిసి మూలగా ఉండిపోయింది. ఒంటరిగా కూర్చుని ఏవేవో ఆలొచించి చివరికి నీరసంతో సొమ్మసిల్లి నిద్రలోకి వెళ్ళిపోయింది గాయత్రి.

సాయంత్రం. ఎవరేవరో వచ్చి లేపారు. నీళ్ళు నిండిని బిందెల మధ్య నిలబెట్టి స్నానం చేయించారు. కొత్త బట్టలు వేయించారు. పూల జడ వేసి సంతోషించారు. ఆనంద పాటలు పాడారు. తాంబూళం తీసుకుని వెళ్ళిపోయారు.

'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని ఆలొచించేలోపు తిరిగి బోనులో బంధీని చేశారు గాయత్రిని. పొడవైన అరుగుకు చివరగా కొబ్బరి ఆకుల గుడార పందిరిలో కూర్చుని మళ్ళీ ఆలొచనలలో మునిగింది గాయత్రి.

అన్ని పనులూ ముగించుకుని అలసిపోయి వచ్చిన బాపిరాజు-శకుంతలాదేవి దంపతులు అరుగుకు మరో చివర కూర్చున్నారు.

"అమ్మాయ్ భొజనం చేసిందా శకుంతలా?" భార్యను అడిగాడు బాపిరాజు.

"భోజనం ఎప్పుడో ఇచ్చేము. భోజనం చేసిందా అనేది తెలియదు"

అరుగుకు చివరగా జరిగి కొబ్బరి ఆకుల గుడారం వైపు చూస్తూ "అమ్మా గాయత్రీ " అన్నాడు బాపిరాజు.

తండ్రి అలా పిలవంగానే 'ఓ' అని ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి. ఏమైందో, ఏమిటో అనుకుని గుడారం తడిక తలుపు తెరుచుకుని తొంగి చూశాడు తండ్రి బాపిరాజు.

"ఏమిట్రా...ఏమైందిరా?"

"నన్ను ఎందుకు నాన్నా ఇక్కడ కూర్చోబెట్టారు? నాకు ఇక్కడ భయంగా ఉన్నది"

"అదా విషయం" అని గట్టిగా నవ్వి, "నేనుండుంగా ఎందుకురా భయపడతావు? ఇదంతా ఒక రెండు రోజులే. ఆ తరువాత...."

"ఏం చెప్పారు?" భర్త మాటలకు అడ్డుపడింది భార్య శకుంతలాదేవి.

"ఐదో రోజు సంబరం ముగిసేంతవరకు అది ఇక్కడే ఉండాలి"

"ఏమిటి శకుంతలా...నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు! ఈ రోజుల్లో ఎవరు ఇలా చేస్తున్నారు?"

"మిగిలిన వాళ్ళ సంగతి గురించి నాకు అనవసరం. నేను మన సంప్రదాయాలను గౌరవించి నడుచుకునే దానిని. మీ చూపులకు నేను పాత పంచాంగంలాగే ఉండిపోతాను. కానీ, ఈ ఇంటి వరకు నేను చెప్పేదే వేదవాక్కు. నేను చెప్పింది వినితీరాల్సిందే. చెప్పేశాను"

"ప్లీజ్ అమ్మా. ఈ రోజు స్కూలుకు లీవు పెట్టాను. ఇంకా అన్ని రోజులు సెలవు పెడితే నా చదువు పాడైపోతుంది"

"అవును. నీది పెద్ద ఐ.ఏ ఎస్ చదువు చూడు. ఆ కాలంలో నేను వయసుకు వచ్చిన తరువాత స్కూలు పక్కకే వెళ్లలేదు తెలుసా? ఏడో క్లాసు వరకు నువ్వు చదువుకున్నది చాలు. త్వరగా నీకు పెళ్ళి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది"

"ఏయ్! శకుంతలా, కూతురు దగ్గర ఎప్పుడు, ఏం మాట్లాడాలో నీకు జ్ఞానం లేదా? పాపం...చిన్న పిల్లనే అది. ఈ వయసులోనే అది పెద్ద మనిషి అయ్యిందే నని నేను భాదపడుతూ కూర్చున్నాను. దాని దగ్గర పోయి పెళ్ళి అది,ఇదీ అని మాట్లాడుతున్నావు? నా కూతుర్ను నేను డాక్టర్ కి చదివించబోతాను. దాని తరువాతే పెళ్ళి. ఏమ్మా తల్లీ...నాన్న చెప్పేది కరెక్టే కదా?" అన్నాడు కూతురు వైపు తిరిగి.

"అవును నాన్నా. నేను డాక్టర్కు చదివి మన పేరయ్య తాతకు డబ్బులు తీసుకోకుండా సూది మందు వేయాలి"

ఆమె చెప్పింది విని తల్లితండ్రులిద్దరూ నవ్వారు. వాళ్ళ నవ్వులతో గాయత్రి నవ్వు కూడా కలిసిన సమయం, వాకిట్లో ఎవరో పిలుస్తున్న పిలుపు విని ముగ్గురూ తిరిగి చూశారు.వీళ్ళ గుమాస్తా ఈషారాం నిలబడున్నాడు. అతనితో పాటు ఒక అమ్మాయి తడబడుతూ వచ్చి నిలబడటం చూసి బాపిరాజు-శకుంతలాదేవి అరుగు మీద నుండి లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు.

"ఎవరు ఈషారాం...ఈ అమ్మాయి ఎవరు?"

"తెలియదయ్య గారూ. మన మామిడి తోటలో ఒక చివర ఏడుస్తూ ఒంటరిగా నిలబడుంది. 'ఎవరమ్మా?' అని అడిగితే నోరు తెరవటంలేదు. రాత్రి సమయం అవుతోంది...అందుకని ఇక్కడికి తీసుకు వచ్చాను"

"ఏమిటి, ఎందుకు అని విచారించి అలాగే పంపించకుండా ఎందుకురా ఇక్కడికి తీసుకు వచ్చావు?" అన్నది శకుంతలాదేవి. చూసిన వెంటనే ఆ అమ్మాయి నచ్చకపోవటంతో ఆమె మాటలలో కఠినత్వం కనబడింది.

"కాసేపు మాట్లాడకుండా ఉంటావా శకుంతలా. పాపం ఆ అమ్మాయి. రాత్రి సమయం, దారి తెలియక దారి తప్పి వచ్చుంటుంది...మనం విచారించి చూద్దాం" అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగారు బాపిరాజు.

"ఏమ్మా...నీ పేరేమిటి?"

"ప్రమీల"

"ఇక్కడికి ఎలా వచ్చావు? నీ సొంత ఊరు ఏది?"

ఆయన అడిగిన వెంటనే ఆలశ్యం చేయకుండా...గబుక్కున కాళ్ల మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చేసిన హడావిడికి బాపిరాజు గారు వెనక్కు వెళ్ళారు. "మొదట లేవమ్మా...ఏమైందో చెప్పు"

"అయ్యగారూ! మా నాన్న ఒక తాగుబోతు. మా అమ్మను వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకోని వెళ్ళిపోయారు. పొట్టకూటి కోసం నేనూ, మా అమ్మా దొరికిన పనిని చేస్తూ కాలం గడుపుతున్నాము. పోయిన నెల ఆరోగ్యం బాగుండక అమ్మ చనిపోయంది. పక్క ఉరిలో కట్టడాల కూలి పని చేసుకుంటున్న నాతో కొంతమంది తప్పుగా ప్రవర్తించారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతూ దారి తెలియక ఈ ఊరికి వచ్చి జేరాను. అయ్యాగారూ, మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా కనబడుతున్నారు. నన్ను ఇక్కడ్నుంచి పంపించకుండా ఏదైనా పని ఇచ్చి కాపాడండయ్యా. మీకు పుణ్యం వస్తుంది" అని బ్రతిమిలాడింది.

"ఇలా చూడు. ఇక్కడ పనిచేయటానికి చాలా మంది ఉన్నారు. నువ్వు మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నది శకుంతలాదేవి.

"అది కాదు...నేను" అంటూ ఏదో చెప్పబోయిన భర్తను అడ్డుకుంది శకుంతలాదేవి.

"మీరు ఏమీ చెప్పొద్దు. ఆకతాయి పిల్లలు ఏ ఊర్లో లేరు? ఈమెకు ఈ ఊర్లో ఆశ్రయం కలిపించి, ఈమెకు ఏదైనా జరిగితే మనమే ఊర్లో అందరికీ జవాబు చెప్పాలి. అదే ఈమె పెళ్ళి చేసుకుని భార్య-భర్తలుగా వచ్చి సహాయం అడిగుంటే దారాలంగా చేయచ్చు. మాట్లాడకుండా నేను చెప్పేది చెయ్యండి. ఖర్చులకు కొంచం డబ్బులిచ్చి ఈమెను పంపించి మీ పని చూసుకోండి" చెప్పింది శకుంతలాదేవి.

భార్య చెప్పేది సబబే నని అనిపించినా బాపిరాజు గారికి మనసు అంగీకరించలేదు. ఆయన ఆలొచిస్తూ నిలబడటం చూసిన ప్రమీల ఆయన డబుల్ మైండులో ఉన్నాడని అర్ధం చేసుకుంది.

"నాకు డబ్బులంతా వద్దయ్యగారు. నేను వెళ్తాను”--కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ వెనక్కు తిరిగింది ప్రమీల.

"ఈషారాం, ఈమెను తీసుకు వెళ్ళి బస్సు ఎక్కించి రారా" అన్నది శకుంతలాదేవి.

"సరేనమ్మగారు" అని చెప్పి ప్రమీలతో పాటూ బయలుదేరాడు ఈషారాం.

ఇద్దరూ ఇంటి గేటు ముట్టుకున్నప్పుడు గట్టిగా అరిచాడు బాపిరాజు.

"ఒక్క నిమిషం ఆగు ఈషారాం. ఇద్దరూ ఇక్కడికి రండి"

ఇద్దరూ వచ్చారు...అర్ధంకాక చూశారు.

"నేనొకటి చెబితే చేస్తావారా ఈషా?"

"ఏమిటయ్యగారు ఈ ప్రశ్న? మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను. ఏం చేయాలో ఆజ్ఞ వేయండి"

"అయితే సరే. ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో"

"అయ్యగారూ...నేను"

"ఆలొచించకురా. నా మాట మీద నీకు నమ్మకం లేదా?"

"సరే అయ్యగారూ. మీ ఇష్టం"

"నువేమ్మా చెబుతావు?"

ఆమె సమాధానం ఏమీ చెప్పకుండా ఈషారాం దగ్గరగా వెళ్ళి నిలబడింది.

బాపిరాజు గారి మనసులో ప్రశాంతత ఏర్పడింది. ఎందుకు ఏర్పడదు...సహాయం అని ఎవరైనా అడిగి వస్తే ఉత్త చేతులతో పంపే అలవాటులేని మనిషాయే!.

మరుసటి రోజు ఊరి జనం ముందు ఈషారం భార్య అయ్యింది ప్రమీల. బాపిరాజు గారు తన మామిడి తోటలో ఈషారం కోసం ఏర్పాటు చేసి ఇచ్చిన ఆ చిన్న గుడిసె ఇప్పుడు ఇంకొక జీవిని స్వాగతించేందుకు కాచుకోనుంది.

ఇంకా ఉంది.....Continued in: PART-14

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)