తొలివలపు….(సీరియల్) (PART-14) చివరికి శకుంతలాదేవి పట్టుదలే గెలిచింది!
ఐదో రోజు సంబరం అత్యంత విషేషంగా జరిగి ముగిసింది. ఆ తరువాత ఇదిగో ఈ రోజు స్కూలుకు బయలుదేరింది గాయత్రి.
లంగా-వోణి, రెండు జడలతో తన ముందుకు వచ్చి నిలబడ్డ గాయత్రిని చూసి మైమరిచి కళ్ళార్పకుండా చూసింది శకుంతలాదేవి.
'నిజమే. లోకంలోని అందం మొత్తాన్నీ ఒకటిగా చేర్చి దేవుడు గాయత్రిని మాత్రమే పుట్టించాడు. ఏడో క్లాసు చదువుతున్న గాయత్రికి వయసుకు మీరిన ఎదుగుదల. పక్వం లేని పరువము. కానీ గాయత్రి పాపం! పసిపిల్ల మనసున్న గాయత్రిని తొందరపడి పదేళ్లకే పెద్ద మనిషిని చేయడం అవసరమేనా....ఏం చేయగలం? ప్రకృతి యొక్క చేష్ట ఇది!’
"ఏమిటే...నా కూతుర్ని కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డావు?" తన గదిలో నుండి బయటకు వచ్చిన తండ్రి బాపిరాజు భార్యను అడిగాడు..
"ఏమండి...మన అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? నా దిష్టే తగిలేటట్టుంది. మీరు కావాలంటే చూడండి...మన అమ్మాయి మహారాణిలాగా జీవిస్తుంది" అన్న తల్లి శకుంతలాదేవి, గాయత్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కూతుర్ను తన చెంతకు లాక్కుని గుండెలకు హత్తుకుంది.
తల్లి శ్వాశగాలి తగిలి పులకరించిపోయింది గాయత్రి.
"మరి నీ కూతురు నీ లాగానే కదా ఉంటుంది" అంటూ ఓర చూపుతో భార్య అందాన్ని ఆరాధిస్తున్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.
గబుక్కున తల తిప్పుకుని "వెళ్దామా గాయత్రి?" అంటూ బయటకు వచ్చి తన బండిని తీస్తున్నప్పుడు, వెనుక నుండి వినబడ్డ పిలుపు విని వెనక్కి తిరిగారు బాపిరాజు గారు.
"ఏమిటి మామయ్యా. బయలుదేరారా? ఎరువు కొనడానికి నేను కూడా టౌనుకే వెలుతున్నాను. కావాలంటే గాయత్రిని నేను స్కూల్లో దింపనా?" అడుగుతూ గాయత్రి వైపే చూశాడు వెంకన్న.
వెంకన్న గాయత్రిని చూసే చూపులో ఆకలి, కసి కనబడింది. ఆ చూపులోని భావన అర్ధంకాక స్నేహంగా నవ్వింది గాయత్రి. అదే సమయం మధ్యాహ్నం లంచ్ బాక్స్ ను తీసుకుని బయటకు వచ్చిన శకుంతలాదేవిని చూసి వెంకన్న జారుకున్నాడు. ఊరి ప్రజలకు బాపిరాజు గారి మీద ఎంత మర్యాద ఉన్నదో....శకుంతలాదేవి మీద అంతకన్న ఎక్కువ భయం ఉన్నది. కానీ అందరూ అహంకారం లేని ఆమె అధికారానికి కట్టుబడి ఉంటారు.
దూరంగా వెడుతున్న వెంకన్ననే కోపంగా చూస్తూ ఉండిపోయిన శకుంతలాదేవి గాయత్రి వైపు తిరిగింది.
"ఇలా చూడు గాయత్రీ. నేను చెప్పిందంతా జ్ఞాపకముంచుకో. ఏ మగాడితోనూ నిలబడి మాట్లాడటమో- నవ్వనో కూడదు. ఇళ్లు వదిలితే స్కూలు, స్కూలు వదిలితే ఇళ్లు అనే ఉండాలి...అర్ధమైందా?"
సరి అనేలాగా తల ఊపింది గాయత్రి.
"అబ్బా! మళ్ళీ మొదలు పెట్టిందా? నువ్వు రారా...మనం వెళ్దాం" అన్న బాపిరాజు, గాయత్రిని బండిలో ఎక్కించుకుని బయకుదేరారు.
వాళ్ళిద్దరూ కళ్ళకు కనబడేంత దూరం వరకు చూసి ఇంటిలోపలకు వెళ్ళింది శకుంతలాదేవి.
క్లాస్ రూముకు గాయత్రి కొత్తగా వచ్చిందా...గాయత్రి వచ్చినందువలన క్లాస్ రూము కొత్తగా ఉన్నదా? అనే కన్ ఫ్యూజన్ లోనే ఆ రోజు గడిచిపోయింది. సహ విధ్యార్దుల ఎగతాలి, నవ్వులాటలు గాయత్రిని మరింత సిగ్గులోకి తీసుకు వెళ్ళింది. స్కూలు టైము ముగిసిందో లేదో...సీతాకోక చిలుకులాగా ఎగురుకుంటూ వచ్చి నిలబడున్న తండ్రి బండిపై ఎక్కి కూర్చుంది. బండి ఇంటివైపుకు వెళ్ళింది.
సాయంత్రం టిఫిన్ తో కూతురుకి స్వాగతం పలికి, ఆశతో ప్రేమను కురిపించి తన పనికొసం లోపలకు వెళ్ళింది శకుంతలాదేవి. తల్లి ప్రేమలో తనని తానే మరిచిపోయింది గాయత్రి. కానీ ఆ తల్లి స్పర్ష, ప్రేమ ఇక తనకు దొరకదని అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది.
హోమ్ వర్క చేయటానికని పుస్తకం తీసినప్పుడు అందులో నుండి ఒక కాగితం బయట పడటంతో...తీసి కాగితాన్ని మడత విప్పింది గాయత్రి. చదివింది. నవ్వు కుంటూ మళ్ళీ మళ్ళీ చదివింది....చివరగా ముఖమంతా చెమట పట్టగా చదివిన కాగితాన్ని మడతపెట్టి, ముఖం తుడుచుకుని తలెత్తింది. ఎదురుగా తల్లి శకుంతలాదేవి. కూతురు ముఖం చూసిన వెంటనే ఏదో తప్పు జరిగిందని అమెకు అర్ధమయ్యింది. గాయత్రి చేతిలో ఉన్న కాగితాన్ని లాక్కుని చదవటం మొదలుపెట్టింది.
‘ప్రియమైన గాయత్రికి,
రెండు వారాలు చనిపోయిన తరువాత ఈ రోజే నిన్ను కలుసుకుంటున్నా. చూసిన క్షణం నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను. కుదరలేదు. అందుకే ఈ లేఖను రాస్తున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి. మన స్నేహ వలయం దాటి నేను నిన్ను ఇష్టపడి చాలా రోజులు అయ్యింది. ఇక నాకు ఓర్పు లేదు. ప్రేమ నిండిన హృదయాన్ని మోస్తూ నీకొసం వైట్ చేసింది చాలు. 'ఐ లవ్ యూ గాయత్రీ. నా స్నేహాన్ని ఆమొదించినట్లే నా ప్రేమనూ అమొదిస్తావనే నమ్మకంతో కాచుకోనుంటాను. రేపు కలుద్దాం'
ఇట్లు
నీ మోహన్.
వెలుతురు లేక చీకటిగా ఉన్నది ఇల్లు.
'తల్లీ-కూతుర్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు?' అన్న ఆలొచనతో లోపలకు వచ్చారు బాపిరాజు. 'స్విచ్' వేసి ఇంట్లో వెలుతురును తీసుకువచ్చారు. ఇంట్లోని పరిస్థితి వెలుతురులో తెలిసిపోయింది. రూమంతా విరిగి పడిన వస్తువులు. మధ్యలో ఒక మూల పిచ్చిదానిలాగా కూర్చున్న శకుంతలాదేవి. ఆమె కాళ్ళ దగ్గర చుట్ట చుట్టుకుని పడున్న గాయత్రి.
పరిగెత్తుకెళ్ళి కూతుర్ని ఎత్తి తన ఒడిలో వేసుకున్నారు. ఆమె పరిస్థితి చూసి ఆందోళన చెందారు. వాతల లాంటి ఎర్రటి నెత్తుటి గీతల శరీరంతో, నొప్పులు భరించలేక గొణుగుతూ పడున్న గాయత్రి తండ్రిని చూసిన వెంటనే మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది.
"నాన్నా...ప్లీజ్ నాన్నా. మీరైనా అమ్మ దగ్గర చెప్పండి. మోహన్ నా స్నేహితుడు మాత్రమే. సైన్స్ పాఠాలలో ఏదైనా సందేహాలోస్తే అతనే నాన్నా నాకు చెప్పిస్తాడు. ఈ లెటర్ నా పుస్తకంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంతకంటే ఈ 'లెటర్’ కు నాకూ ఎటువంటి సంబంధమూ లేదు నాన్నా. మీరైనా నన్ను నమ్మండి"
ఏడుస్తూ బ్రతిమిలాడుతున్న కూతుర్ను లేపి తన భుజాలపై అనించుకుని నిదానంగా నడిపించుకుంటూ తీసుకు వెళ్ళి గదిలో పడుకోబెట్టిన తరువాత భార్య శకుంతలాదేవి దగ్గరకు వచ్చారు.
"ఏమే...మనిషేనా నువ్వు? గాయత్రి పాపమే. పసిపిల్ల వొళ్ళు, పసిపిల్ల మెదడు. గొడ్దును బాదినట్లు బాది దాన్ని నెత్తుటి గుల్ల చేశావు కదే! మనస్సాక్షి అనేది ఉందా...లేదా నీకు?"
ఆయన అడిగిన వెంటనే పొంగుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది శకుంతలాదేవి.
"ఏమండీ... గాయత్రి మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్ళదు కదా! ఊరులో, బయట జరుగుతున్నట్లు మనింట్లో ఏ తప్పూ జరగదు కదా? నాకు నా కూతురు కావాలి. గాయత్రి మనకు మాత్రమే సొంతం? నేను చూసే అబ్బాయినే అది పెళ్ళి చేసుకోవాలి. కాదూ కూడదు అంటూ ఇంకేదైనా చేస్తే...దాని తరువాత నేను ప్రాణాలతో ఉండను"
"ఏమిటే ఆలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గాయత్రి మన కూతురే. అది ఏ తప్పూ చేయదు. నీ అనుమానాన్ని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయ్"
సమాధాన పరచిన భర్త గుండెల మీద ఆనుకుని తన ఆవేశాన్ని తగ్గించు కుంటున్న శకుంతలాదేవి హడావిడిగా లేచింది.
"భగవంతుడా... నా కూతుర్ని గొడ్డును బాదినట్లు బాదేనే! అది నొప్పి తట్టుకోలేదే. అమ్మా తల్లీ" అంటూ గాయత్రి గదివైపు పరిగెత్తింది శకుంతలాదేవి.
ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకున్న గాయత్రిని చూసిన వెంటనే తల్లికి గుండె తరుక్కు పోయింది. గబ గబా వంట గదిలోకి వెళ్ళి పసుపు తీసుకుని, అందులో వేడి వేడి నెయ్యిని కలిపి ఉడకబెట్టి పేస్టులాగా చేసుకుని తీసుకు వచ్చింది. గాయత్రిని తన ఒడిలే పడుకోబెట్టుకుని దెబ్బల గాయాలకు రాసింది. తల్లి కళ్ల నుండి వెలువడిన కన్నీరు బొట్లు బొట్లుగా తన మీద పడ్డా తెలియకుండా పడుకుంది గాయత్రి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి