29, సెప్టెంబర్ 2019, ఆదివారం

తొలివలపు (సీరియల్)...PART-17



                                               తొలివలపు….(సీరియల్)
                                                           (PART-17)


రాత్రి. మామిడి తోటలో నులక మంచం మీద కుర్చోనున్నారు బాపిరాజు గారు. తాగిన మత్తు ఆయన తలకు ఎక్కింది. లాంతర్ వెలుతురులో మందు బాటిల్స్ మెరుస్తున్నాయి. ఎదురుకుండా నేల మీద ఈషారం కూర్చోనున్నాడు. వాడూ తాగుతున్నాడు.

"చాలు అయ్యగారూ. ఇదేమిటీ కొత్త అలవాటు? నన్ను తాగొద్దని నాకు బుద్ది చెప్పే మీరు , మీరే ఇలా...! మొదట మీరు ఇంటికి వెళ్ళండి. అమ్మగారు వెతుకుతారు " అన్నాడు.

"అరే పోరా. ఆవిడ పాత శకుంతల లాగా లేదురా. దానికి దయ్యం పట్టింది. అనుమానం దయ్యం. పాపంరా నా కూతురు. లోకం తెలియని పసిపిల్ల. దానికి పెళ్ళిచేయాలని మొండి పట్టుదల పడుతోంది. కన్న కూతురు మీదే అనుమాన పడుతోంది. ఆమె సందేహం వలన ఈ రోజు ఒక ప్రాణం పోయింది. ఇదంతా చూస్తుంటే నా గుండె పగిలిపోతోందిరా. మనసు నొప్పి పుడుతోంది. ఆ నొప్పి తెలియకుండా ఉండటం కోసమే తాగాను..." అంటూ ఒక బాటిల్ తీసుకుని గొంతులో పోసుకున్నారు బాపిరాజు గారు.

సమయం అర్ధరాత్రి దాటింది. ఈషారాం ను పిలిచారు. అతని దగ్గర నుండి సమాధనం లేదు. తూలుతూ లేచి నిలబడటానికి ప్రయత్నించారు....నిలబడలేక మంచం మీద పడిపోయారు.

"నీకు...ఏమైంది..శా..కూ? ఎందుకు.ఇ..లా..." అంటూ ఏదేదో గొణుగుతున్న బాపిరాజు గారి నోటిని మూసింది ఒక చేయి. ఆ చేతిని గట్టిగా పుచ్చుకుని "శకుంతలా" అన్నారు.

వీచిన గాలితో లాంతర్ వెలుగు ఆరిపోయింది. చలనం లేకుండా నిలబడున్నది రాత్రి. ఆ నిశ్శాబ్ధాన్ని చేధిస్తూ దూరంగా ఒక కుక్క ఏడుపు వినబడింది.

తెల్లారింది.

ఈశాన్య దిక్కులో ఉదయిస్తున్న సూర్యుడ్ని స్వాగతిసున్నట్టు పక్షులు హడావిడిగా అరుస్తున్నాయి. పక్షుల అరుపుల శబ్ధాన్ని విని కళ్ళు తెరిచారు బాపిరాజు గారు. గబుక్కున ఏదో గుర్తుకు వచ్చినట్లు మంచం మీద నుండి క్రిందకు దిగారు. దగ్గరగా పడుకోనున్న ప్రమీల, మంచం ఊపుకు నిద్ర నుండి మేల్కుని బాపిరాజు గారిని చూసి నవ్వింది.

మంచం మీద నుండి కిందకు దిగుతూ జారిపోయున్న పమిటను సర్ధుకుంది ప్రమీల.

"ఏమే...రాక్షసీ" - అని తల కొట్టుకుంటూ గోలచేశారు బాపిరాజు గారు.

"ఎందుకిలా చేశావే?  నీకు నేను ఏమి అపకారం చేశాను?"

ఆవేదనతో అడిగిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూసి చెరిగిపోయిన జుట్టును ఒకటిగా చేర్చి గుండ్రంగా చుట్టుకుని బాపిరాజు గారి దగ్గరగా వచ్చింది.

"నువ్వు నాకు మంచే చేసేవయ్యా! నేను కాదని చెప్పటం లేదు? కానీ, అది నీకే తెలియకుండా నీకు పాపంగా మారిపోయింది?"

అర్ధం కాక ఆమెనే చూశాడు బాపిరాజు గారు.

"అర్ధం కాలేదు కదా...దాంపత్య జీవితానికే పనికిరాని ఒకడ్ని నాకు కట్టబెట్టి నా జీవితాన్నే నాశనం చేశారే! అదేనయ్యా మీరు చేసిన పాపం. ఆ రోజే నా దారిలో నేను వెళ్ళి వుండేదాన్ని. కానీ, ‘పెళ్ళి’ అనే ఆశ చూపి మోసం చేశారు. నా భవిష్యత్తే మీ వల్ల ప్రశ్నార్ధకం అయిపోయింది. అతను తాగుబోతుగా ఉన్నా పరవలేదు. సంసారం చేయటానికి యోగ్యతే లేని ఒకడితో ఎలా జీవించగలను? జీవితం వృధా అయిపోయిందే అని అనుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఆ టైములో నన్ను ఈ స్థితికి తీసుకు వచ్చిన మీమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనిపించేది. చివరగా మీరే వచ్చి నా వలలో చిక్కుకున్నారు. నిజంగా చెబుతున్నాను. మగాడంటే నువ్వే నయ్యా. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా?" -- మెల్లగా బాపిరాజు గారి దగ్గరకు చేరి ఆయన ఛాతీ మీద చెయ్యి పెట్టింది.

"ఛీ...ఛీ. చెయ్యి తీయ్. నువ్వు ఇంత నీచమైన మనిషిగా ఉంటావని నేను కొంచం కూడా ఎదురుచూడలేదు. ఇప్పుడే ఈషారం దగ్గర చెప్పి, నిన్ను ఈ ఊరు నుంచి తరిమేసిన తరువాతే నేను ఇంకో పనిచేస్తాను"

ఆవేశంతో చెప్పిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూస్తూ గట్టిగా నవ్వింది ప్రమీల.

"అతను ఇక్కడుంటేగా?" అన్నది.

"ఏం చెబుతున్నావు...ఈషారాం ఎక్కడ? వాడ్ని ఏం చేశావు? ఇప్పుడు చెబుతావా...లేదా?"

"నిజంగా అతన్ని నేనేమీ చెయ్యలేదు. తానుగానే పారిపోయాడు. ఇంకేం చేస్తాడు, తన పెళ్ళాం ఇంకొక మగాడితో ఉండటం చూస్తే ఏ మొగుడు చూస్తూ నిలబడుతాడు? రోషం ఉన్న మనిషి....అందుకనే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు" -- చెప్పేసి గల గలమని నవ్వింది ప్రమీల.

భూమి వెనక్కు తిరిగుతున్నట్లు అనిపించింది బాపిరాజు గారికి. ఇంతకాలంగా తాను చేర్చి పెట్టుకున్న గౌరవం, మర్యాద అన్నీ ఒకే రోజు రాత్రి గాలిలో కలిసిపోయినట్లు అనుకుని లోలోపల తపించిపోయాడు. 'ఆ రోజే భార్య శకుంతల మాటలు వినుంటే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడేదా? వినకుండా పోయావే పాపాత్ముడా' తల కొట్టుకుంటూ ఏడుస్తూ తనని తానే నిందించుకున్నాడు. తరువాత, కన్నీళ్ళు చూపును అడ్డుకుంటుంటే...తూలుతూ ఇంటివైపుకు నడవటం మొదలుపెట్టారు.

ఇల్లంతా సాంబ్రాణి పొగ అలుముకుంది. శకుంతలాదేవి, పూజ గదిలో ఉన్నట్లు చెప్పకుండా చెబుతోంది అది. గాయత్రి ఇంకా లేవలేదు. ముందు రోజు తిన్న దెబ్బల వలన వొళ్లంతా వాపెక్కటంతో లేవడానికి కూడా ఓపిక లేక పడుంది.

"భగవంతుడా! ఏ సమస్య రాకుండా నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి"--ప్రార్ధించుకుని పూజ గదిలో నుండి బయటకు వచ్చిన శకుంతలాదేవి, భర్త రావటం గమనించి వంట గదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తీసుకు వచ్చింది. అది కూడా గమనించ కుండా ఎక్కడో చూసుకుంటూ కూర్చున్నారు బాపిరాజు గారు.

"కాఫీ పెట్టాను" భర్త మొహం చూడకుండా చెప్పి వెళ్ళబోయింది...కానీ, భర్త చలనం లేకుండా కూర్చోనుండటం గమనించి,

"మిమ్మల్నే" అన్నది, కొంచం గట్టిగా.....ఆప్పుడు మామూలు స్థితికి వచ్చిన బాపిరాజు గారు, తన భార్యను చూసీ చూడంగానే...గబుక్కున ఎగిరి ఆమె కాళ్ళు పట్టుకుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు.

"నన్ను క్షమించు శకుంతలా. నేను పెద్ద తప్పు చేశానే" అంటూ జరిగిందంతా చెబుతుంటే శకుంతలాదేవి మనసు లోలోపల కొంచం కొంచంగా విరిగి ముక్కలు అవుతోంది.

తండ్రి ఏడుపు విని గాయత్రి లేచి పరిగెత్తుకుని వచ్చింది. తన ముందు వచ్చి నిలబడ్డ కూతురి రెండు చేతులు పుచ్చుకుని తన చెంపల మీద మార్చి మార్చి కొట్టుకున్నారు. తండ్రి అలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాక పోయినా, గాయత్రి తండ్రిని సమాధన పరిచే పనిలో ఈడుపడింది.

చాలసేపు అయిన తరువాతే తండ్రీ, కూతుర్లు ఇద్దరూ అది గమనించారు. ఏదో కాలుతున్న వాసన. మొదట్లో బాపిరాజు గారి బుర్రకు తట్టలేదు. తరువాత బుర్రలో ఎదో ఒక రవ్వ ఏర్పడటంతో సడన్ గా లేచి పరిగెత్తారు. ఏమైందో తెలియక తండ్రి వెనుకే పరిగెత్తింది గాయత్రి. ఇంట్లోని ఏ గదిలోనూ శకుంతలాదేవి కనిపించలేదు. వెనుక గుమ్మం తెరిచి ఉండటంతో అటు వెళ్లారు...స్నానాల గది మొత్తం పొగ కమ్ముకోనుంది.

"శకుంతలా" అంటూ బాపిరాజు గారు పెద్దగా కేకలు వేయడంతో జనం గుమికూడారు. కొంతమంది కలిసి పోరాడిన తరువాత తలుపు పగలకొట్టబడింది. లోపల కనబడిన దృశ్యం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు బాపిరాజు గారు. శిలలాగా అయిపోయింది గాయత్రి.

అవును! తన భర్త...మరో పురుషుని భార్యను ముట్టుకున్నందు కోసం...ఇక అయన వేలు కూడా తన మీద పడకూడదని నిర్ణయించుకుని మంటల ఆకలికి తనని ఆహారంగా ఇచ్చుకుంది ఆ పతివ్రత శకుంతలాదేవి.

ఇంకా ఉంది.....Continued in: PART-18

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి