3, అక్టోబర్ 2019, గురువారం

తొలివలపు (సీరియల్)...PART-19


                                                తొలివలపు….(సీరియల్)
                                                            (PART-19)


ఉత్సాహంతో ఈల వేసుకుంటూ ప్రమీల గదిలోకి చొరబడ్డాడు వెంకన్న. చలనం లేకుండా పడున్న ప్రమీలని ఆశగా ముట్టుకున్నాడు.

"ప్చ్... ఏం చేయగలం? నువ్వు అనుభవించాల్సింది ఇంతే నని నీ మొహాన రాసుంది! సంతోషంగా వెళ్ళి రా" అంటూ ఆమెను ఎత్తుకోవటానికి వంగినప్పుడు వెంకన్న నెత్తి మీద పడ్డదెబ్బకు "ఆ" అంటూ గిలగిలా కొట్టుకుంటూ బోర్ల పడ్డాడు. కొంచం తేరుకుని లేవటానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ ఒక దెబ్బ పడింది. "అయ్యో" అంటూ పడిపోతూ వెనక్కు తిరిగి చూశాడు. చేతిలో ఇనుప కడ్డీతో జుట్టు విరబూసుకుని నిలబడుంది గాయత్రి.

"ఏయ్..." అంటూ లేవటానికి ప్రయత్నించాడు...కుదరలేదు. మెల్ల మెల్లగా కళ్ళు బైర్లు కమ్మాయి. కంటి చూపుకు గాయత్రి సరిగ్గా కనబడలేదు. ఆ తరువాత కొంచం కొంచంగా తన స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడిపోయాడు. పూర్తిగా కోపం తగ్గించుకోలేని గాయత్రి చనిపోయిన వెంకన్నని ఇంకా కొడుతూనే ఉన్నది.

ఆవేశం తగ్గని గాయత్రి అక్కడే కూర్చుంది. తలుపు తడుతున్న శబ్ధం ఆమెను ఈలోకంలోకి తీసుకు వచ్చింది. పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తెరిచింది. బాపిరాజు గారు నిలబడున్నారు. తండ్రిని చూసిన వెంటనే "ఓ" అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కూతురి వాలకం, ఇళ్లున్న పరిస్థితి చూసి జరగ కూడనిది ఏదో జరిగిందని ఆయనకు అర్ధమయ్యింది...గబుక్కున లోపలకు దూరి గొళ్లెం పెట్టాడు.

"గాయత్రీ...ఏం జరిగిందమ్మా? చెప్పరా?" అంటూ గాబరా పడుతూ కూతురి భుజాలు పట్టుకుని ఊపాడు.

మళ్ళీ మళ్ళీ ఆయన వొత్తిడి చేస్తూ అడిగాడు.

తడబడుతూ జరిగిందంతా పూర్తిగా చెప్పి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి.

వేగంగా లోపలకు పరిగెత్తారు బాపిరాజు గారు. వెంకన్న, ప్రమీలా శవాలుగా పడుండడం చూసి అధిరిపడుతూ కొంచం వెనక్కు వెళ్ళారు. గుండెను పట్టుకుని గోడనానుకుని జారి పడిపోయారు.

పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది గాయత్రి.

“నన్ను క్షమించండి నాన్నా. ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆలొచించకుండా తప్పు చేసేశాను. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి నాన్నా"అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురితో ఏమీ మాట్లాడాలో తెలియక కన్నీటితో కూతుర్ని తన గుండెకు హత్తుకున్నారు.

"అమ్మ మనతో ఉండుంటే ఇలా జరిగేదా నాన్నా? అమ్మ ఎందుకు మనల్ని వదిలి వెళ్ళిపోయింది?"

కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శిలలాగా కూర్చున్నాడు.

'మన అమ్మాయి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? చెప్పు శకుంతలా. నీకు మాత్రమే కాదు...మన అమ్మాయికి కూడా బాధ్యత ఉన్న తండ్రిగా నడుచుకోలేకపోయానే! అయ్యో...ఎందుకు ఈ చేతగాని వాడిని నమ్మి దాన్ని వదిలి వెళ్ళావు? నేను పాపాత్ముడ్ని. నిన్ను ప్రాణాలతో చంపిన ద్రోహిని. మన కూతుర్ని కాపాడలేని దౌర్భాగ్యుడిని"

హఠాత్తుగా తలమీద కొట్టుకుంటూ ఏడుస్తున్న తండ్రి చేతులను పట్టుకుని ఆపింది గాయత్రి.

"ప్లీజ్...ఏడవకండి నాన్నా. మిమ్మల్ని ఇలా చూడటానికి నాకు కష్టంగా ఉంది" ఏడుస్తూ చెబుతున్న కూతుర్ని దగ్గరకు లాక్కుని మళ్ళీ గుండెలకు హత్తుకున్నారు బాపిరాజు గారు.

నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత, మెల్లగా కూతురు మొహాన్ని తన చేతిల్లోకి తీసుకుని చెప్పటం మొదలు పెట్టారు.

"గాయత్రీ, నాన్న ఏం చెప్పినా వింటావు కదురా?" అన్నారు మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు.

"చెప్పండి నాన్నా. నేను ఏం చేయాలి?" అన్నది కూతురు తండ్రి మొహం చూస్తూ.

తన ఒడిలో నుండి గాయత్రిని లేపి, ఆయనా లేచారు. ఆమె చేతులను గట్టిగా పుచ్చుకుని ఇంటి వాకిలి గుమ్మం వైపు నడిచారు. తరువాత గాయత్రి చేతులు విడిచిపెట్టారు.

"నువ్వు...ఈ ఇళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా"

"నాన్నా... మీరేం చెబుతున్నారు?" - అన్నది ఆశ్చర్యపోతూ.

"ఇది చెప్పటానికి నాకూ కష్టంగానే ఉందిరా. కన్న తండ్రిగా ఉంటూ నేను ఇలా చెప్పకూడదు. కానీ, నాకు వేరే దారి తెలియటంలేదే! మీ అమ్మను పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోవటానికి నేను తయారుగా లేను. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు. దయచేసి నీకు జరిగిన ఘోరాన్ని మరిచిపో. నువ్వు జీవించాల్సిన అమ్మయివిరా. డాక్టర్ అవ్వాలనేది నీ లక్ష్యం. ఇక నీ ఆలొచన అంతా నీ లక్ష్యాన్ని చేరుకునే వైపే ఉండాలి. ఆ లక్ష్యం నేరవేరాలంటే నువ్వు ఈ ఇంటి నుండే కాదు...ఊరు వదిలి వెళ్ళే కావాలి. బయలుదేరు"

"నాన్నా...నేను..."

"నువ్వు ఏమీ మాట్లాడకు గాయత్రీ. దయచేసి నాన్న చెప్పింది విను. ఈ ప్రపంచం ఒక సముద్రం. మనమే దాన్ని ఈదటం అలవాటు చేసుకోవాలి. జరిగిందంతా మరిచిపోయి ధైర్యంగా వెళ్ళు. నిన్ను కన్నవారి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నారు, కళ్ళల్లో నీళ్లతో.

'ఏం చేయాలి...ఎక్కడికి వెళ్లాలి?' అని ఏమీ తోచలేదు గాయత్రికి. కళ్ళ నిండా నీళ్ళతో నిలబడున్న గాయత్రి సడన్ గా ఏదో జ్ఞాపకం వచ్చి లోపలకు పరిగెత్తింది. బాధలే తెలియని ఆ జీవి, ఊయాలలో నిద్రపోతున్న ఆ పసిపిల్ల, కావ్యా దగ్గరకు వెళ్ళి నుదిటి మీద ముద్దుపెట్టుకుంది. తన వేళ్ళతో కావ్యా శరీరాన్ని తడిమింది. గాయత్రి స్పర్షను నిద్రలోనూ గుర్తుపట్టిన కావ్యా నవ్వింది. తరువాత గబుక్కున వెనక్కు తిరిగి వాకిటికి వచ్చింది గాయత్రి.

చివరిసారిగా కూతుర్ని కౌగలించుకుని వీడ్కోలు చెప్పారు బాపిరాజు గారు.

గట్టిగా కళ్ళు మూసుకుని తన తల్లిని ఒకసారి మనసులో తలుచుకుంది గాయత్రి. ధైర్యం తానుగా తనలో ఏర్పడుతున్న భావన కలిగింది. తరువాత దూరంగా కనబడుతున్న వెలుతురును చూసి ఆ చీకట్లో నడిచింది.

మరుసటి రోజు పేపర్లలో అలాంటి న్యూస్ రావటం గాయత్రికి తెలిసే అవకాశమే లేదు.

'భార్య - మాజీ ప్రేమికుడు హత్య: భర్త వెర్రి పని!'

ఇంకా ఉంది.....Continued in: PART-20

N.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి