25, సెప్టెంబర్ 2019, బుధవారం

తొలివలపు (సీరియల్)...PART-15



                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-15)

స్కూల్ హెడ్ మాస్టర్ ముందు నిలబడున్నారు బాపిరాజు, శకుంతలాదేవి. ఎదురుగా చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడున్నాడు మోహన్.

అప్పుడే హడావిడిగా లోపలకు వచ్చాడు వెంకన్న. అతనితో పాటు అతని అక్కయ్య. బాపిరాజు గారిని అక్కడ ఎదురు చూడని వెంకన్న, బాపిరాజు గారి దగ్గరకు వెళ్ళాడు.

"మామయ్యా...మీరెందుకు ఇక్కడ ఉన్నారు?" అని అతను అడిగి ముగించేలోపు,

"అదే నేనూ అడుగుతున్నాను. ఈ అబ్బయి మీకేమవుతాడు?" వెంకన్నను అడిగాడు హెడ్ మాస్టర్.

"వీడు నా అక్కయ్య కొడుకు. ఈమే మొహన్ తల్లి. నాకు అక్కయ్య"

"ఓహో, ఏమ్మా మీ అబ్బాయి ఏం చేశాడో మీకు తెలుసా? సార్ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మాయినే! ఊహూ...మీ దగ్గర మాట్లాడి లాభం లేదు. ఇప్పుడే టి.సి ఇచ్చేస్తాను. తీసుకుని వెళ్ళిపొండి"

"సార్...దయచేసి ఈ ఒక్కసారికి వాడ్ని క్షమించండి. ఇక మీదట ఇలా జరగ కుండా చూసుకుంటాను" అంటూ కాళ్ళ మీద పడినట్లే బ్రతిమిలాడింది మొహన్ తల్లి.

"అవును మామయ్యా...మీరు కొంచం చెప్పండి. ఇక మీదట ఇలా జరగదు. దానికి నేను బాధ్యుడ్ని" అంటూ బాపిరాజు గారి దగ్గర బ్రతిమిలాడాడు వెంకన్న.

"అదంతా కుదరదు. ఈ విషయం బయటకు తెలిస్తే మా స్కూలుకే చెడ్డపేరు వస్తుంది. ఏదో సారు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా నా ముందుకు తీసుకు వచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను. అది జరిగే పనికాదు. నేను ఒకసారి డిసైడ్ చేసింది చేసిందే"

పట్టుదలతో మాట్లాడుతునే ఉన్నారు హెడ్ మాస్టర్.

బాపిరాజు గారికి జాలి గుణం ఎక్కువ. అది ఆయన్ని మౌనంగా ఉంచలేకపోయింది.

"సరే...వదిలేయండి సార్. అబ్బాయి చదువు విషయం కూడా ఇందులో పొదిగి ఉంది. చిన్న పిల్లాడు. ఖండించి, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం" అన్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.

"సరే...సార్ చెప్పినందువలన విడిచిపెడుతున్నాను. అబ్బాయికి మంచి బుద్దులు నేర్పి పంపండి" అని చివరగా దిగివచ్చారు హెడ్ మాస్టర్.

"చాలా ధ్యాంక్స్ అండి. ధ్యాంక్స్ మామయ్యా" అని చెప్పిన వెంకన్నతో,

"ఈ విషయం మన ఊర్లో ఎవరికీ తెలియకూడదు వెంకన్నా...జాగ్రత్త" అని చెప్పిన బాపిరాజు గారితో 'సరే' అంటూ తల ఊపి మోహన్ని, తన సహోదరిని పిలుచుకుని బయటకు వెళ్ళాడు వెంకన్న.

"అయితే మేము కూడా బయలుదేరతాం సార్" అని హెడ్ మాస్టర్ కి చెప్పి బయలుదేరబోయిన బాపిరాజు గారితో,

"సార్, ఇది కారణంగా తీసుకుని మీ అమ్మాయిని స్కూలుకు పంపకుండా ఉండకండి. గాయత్రి బాగా చదువుకునే పిల్ల" అన్నాడు హెడ్ మాస్టర్.

"ఛ...ఛ! మా అమ్మాయి తప్పకుండా స్కూలుకు వస్తుంది" అని చెప్పి భార్యను తీసుకుని బాపిరాజు గారు కూడా బయలుదేరారు.

మరుసటి రోజు నుండి గాయత్రి స్కూలుకు వెళ్లటం మొదలుపెట్టింది. కానీ, శకుంతలాదేవికి అది కొంచం కూడా ఇష్టం లేదు. కూతుర్ని కారణంగా పెట్టుకుని దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అది రోజు రోజుకూ పెరిగి పెద్దదవుతోంది. ప్రతి రోజూ గాయత్రి స్కూల్ నుండి వచ్చిన వెంటనే గాయత్రి పుస్తకాల సంచిని వెతికి చూడటం రోజువారి పనులలో ఒకటిగా పెట్టుకుంది శకుంతలాదేవి. దాని గురించి బాపిరాజు గారు ఏదైనా అడిగితే మళ్ళీ ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలవుతుంది. ఈ సమస్యకు మాత్రమే కాకుండా...తల్లి-తండ్రుల మధ్య గొడవలకు తానే కారణం అనే భావన గాయత్రిని పట్టి పీడించడం మొదలుపెట్టింది. తన కుటుంబం కొంచం కొంచంగా సంతోషానికి దూరమవుతుండటం గ్రహించి తట్టుకోలేక తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది.తనతో మాట్లాడమని బ్రతిమిలాడింది.

శకుంతలాదేవి ఏమో కూతుర్ను బద్రకాళి లాగా చూసింది. కావాలని కూతురుకు దూరంగా జరిగింది.

"నేను ఏం తప్పు చేశాను నాన్నా? అమ్మ నాతో మాట్లాడటమే లేదు? కొద్ది రోజుల క్రితం వరకు అమ్మ నామీద ఎంతో ప్రేమగా ఉండేది. నాకు కొంచంగా జలుబు చేసినా తట్టుకోలేదే? అలాంటి అమ్మ ఇలా మారిపోయిందే?"

తన ఒడిలో ముఖం చాటుగా పెట్టుకుని ఏడుస్తున్న కూతురి తల నిమురుతున్న బాపిరాజు మనసు లోలోపల ఏడ్చింది.

"ఏడవకురా తల్లీ. అమ్మకు నీమీద అనుమానం ఏమీ లేదమ్మా. నాకంటే మీ అమ్మకేరా నీమీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను ఆవిడ నాజూకుగా చూపలేక పోతోంది...అంతే. అదికూడ ఒక విధంగా మూర్ఖంగా చూపించే తల్లి ప్రేమే. తన కూతురుకి ఏమీ తప్పుగా జరగకూడదనే భయం...అంతే తల్లీ. నిజానికి మీ అమ్మ తన ప్రాణం అంతా నీమీదే పెట్టుకుంది తెలుసా? నువ్వు కొంచం నిదానంగా ఉండు. అంతా తానుగా సర్దుకుంటుంది"- -అని కూతుర్ని సమాధాన పరిచే ప్రయత్నంలో మునిగిపోయారు బాపిరాజు.

తండ్రి యొక్క మాటలు గాయత్రికి కొంత ఊరట కలిగించటంతో కళ్ళు తుడుచుకుని ఉత్సాహంతో తండ్రి ముఖంలోకి చూసింది.

"అమ్మకు నా మీద నమ్మకం రావాలంటే నేనేం చేయాలి నాన్నా?"

"త్వరగా పెళ్ళి చేసుకోవాలి" వెనుక నుండి వినబడ్డ మాటలు విని ఆశ్చర్యంతో వెనక్కు తిరిగారు ఇద్దరూ.

శకుంతలాదేవి నిలబడుంది.

"ఏమిటే వాగుతున్నావు? చిన్న పిల్లనే అది" భార్యను చూసి అన్నాడు బాపిరాజు.

"నేను మాత్రం కాదనా చెప్పాను! అది వయసుకు వచ్చింది కదా...ఇంకేమిటి? నాకు నా పరువు-మర్యాద ముఖ్యం"

"శకుంతలా...నువ్వు చేసేది చాలా అన్యాయం"

"ఏది న్యాయం-ఏది అన్యాయం అనేది నాకు బాగా తెలుసు. అది మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు"

"ఏమిటే వాగుతున్నావు?" -- అని భార్యను కొట్టటానికి చెయ్యి ఎత్తిని తండ్రిని అడ్డుకుని ఆపింది గాయత్రి.

"ప్లీజ్...వద్దు నాన్నా. అమ్మను కొట్టద్దు"- బ్రతిమిలాడింది.

"చూడు ఎంత అహంకారంగా మాట్లాడుతోందో...నువ్వే చూశావుగా?"

తండ్రిని సమాధాన పరిచి, తల్లి వైపు తిరిగింది గాయత్రి.

"అమ్మా...నేను పెళ్ళిచేసుకుంటేనే మీకు సంతోషం, ప్రశాంతత దొరుకుతుందంటే మీ ఇష్టం వచ్చినట్లే చేయండి" అని తల్లితో చెప్పిన గాయత్రి, కళ్ళల్లో నీరుతో లోపలకు పరిగెత్తింది.

ఇంకా ఉంది.....Continued in: PART-16

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి