21, సెప్టెంబర్ 2019, శనివారం

తొలివలపు (సీరియల్)...PART-13



                                           తొలివలపు….(సీరియల్)
                                                        (PART-13)

లక్ష్మీపురం గ్రామమంతా ఆ రోజు పండుగ వాతావరణం నెలకొన్నది. పంచాయితీ ప్రెశిడెంట్ బాపిరాజు గారి ఇళ్లు జన సందడితో కోలాహలంగా ఉన్నది. అందరి మొహాలలోనూ సంతోషం వెల్లివిరిసి ఆడుతూంటే, ఆ ఆనందానికి కారణమైన గాయత్రి మొహంలో మాత్రం శొక రేఖలు కనబడ్డాయి.

ఎందుకు కనబడవు.... నిన్నటి దాకా సీతాకోక చిలుక లాగా ఎగురుతున్న ఆమెను పట్టుకొచ్చి బోనులో అనగదొక్కితే ఆమెకు సంతోషం ఎలా వస్తుంది? 'అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడికి వెళ్ళద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు!' అని అమ్మ శకుంతలాదేవి ఆజ్ఞలు ఒకపక్క, ఏదో మరోలోకం నుండి వచ్చిన జీవరాసిని వినోదంకోసం చూడటానికి వచ్చే లాగా ఊరి ప్రజలందరూ ఒక్కొక్కరూ ఆమెను చూసి వెడుతుంటే అది ఆమెలో కోపాన్ని, విసుగుని, శోకాన్నీ ఎక్కువ చేసింది.

ప్రొద్దున ఇచ్చిన భోజనం, ఆమె వేళ్ళు ఇక తాకవని తెలిసి మూలగా ఉండిపోయింది. ఒంటరిగా కూర్చుని ఏవేవో ఆలొచించి చివరికి నీరసంతో సొమ్మసిల్లి నిద్రలోకి వెళ్ళిపోయింది గాయత్రి.

సాయంత్రం. ఎవరేవరో వచ్చి లేపారు. నీళ్ళు నిండిని బిందెల మధ్య నిలబెట్టి స్నానం చేయించారు. కొత్త బట్టలు వేయించారు. పూల జడ వేసి సంతోషించారు. ఆనంద పాటలు పాడారు. తాంబూళం తీసుకుని వెళ్ళిపోయారు.

'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని ఆలొచించేలోపు తిరిగి బోనులో బంధీని చేశారు గాయత్రిని. పొడవైన అరుగుకు చివరగా కొబ్బరి ఆకుల గుడార పందిరిలో కూర్చుని మళ్ళీ ఆలొచనలలో మునిగింది గాయత్రి.

అన్ని పనులూ ముగించుకుని అలసిపోయి వచ్చిన బాపిరాజు-శకుంతలాదేవి దంపతులు అరుగుకు మరో చివర కూర్చున్నారు.

"అమ్మాయ్ భొజనం చేసిందా శకుంతలా?" భార్యను అడిగాడు బాపిరాజు.

"భోజనం ఎప్పుడో ఇచ్చేము. భోజనం చేసిందా అనేది తెలియదు"

అరుగుకు చివరగా జరిగి కొబ్బరి ఆకుల గుడారం వైపు చూస్తూ "అమ్మా గాయత్రీ " అన్నాడు బాపిరాజు.

తండ్రి అలా పిలవంగానే 'ఓ' అని ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి. ఏమైందో, ఏమిటో అనుకుని గుడారం తడిక తలుపు తెరుచుకుని తొంగి చూశాడు తండ్రి బాపిరాజు.

"ఏమిట్రా...ఏమైందిరా?"

"నన్ను ఎందుకు నాన్నా ఇక్కడ కూర్చోబెట్టారు? నాకు ఇక్కడ భయంగా ఉన్నది"

"అదా విషయం" అని గట్టిగా నవ్వి, "నేనుండుంగా ఎందుకురా భయపడతావు? ఇదంతా ఒక రెండు రోజులే. ఆ తరువాత...."

"ఏం చెప్పారు?" భర్త మాటలకు అడ్డుపడింది భార్య శకుంతలాదేవి.

"ఐదో రోజు సంబరం ముగిసేంతవరకు అది ఇక్కడే ఉండాలి"

"ఏమిటి శకుంతలా...నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు! ఈ రోజుల్లో ఎవరు ఇలా చేస్తున్నారు?"

"మిగిలిన వాళ్ళ సంగతి గురించి నాకు అనవసరం. నేను మన సంప్రదాయాలను గౌరవించి నడుచుకునే దానిని. మీ చూపులకు నేను పాత పంచాంగంలాగే ఉండిపోతాను. కానీ, ఈ ఇంటి వరకు నేను చెప్పేదే వేదవాక్కు. నేను చెప్పింది వినితీరాల్సిందే. చెప్పేశాను"

"ప్లీజ్ అమ్మా. ఈ రోజు స్కూలుకు లీవు పెట్టాను. ఇంకా అన్ని రోజులు సెలవు పెడితే నా చదువు పాడైపోతుంది"

"అవును. నీది పెద్ద ఐ.ఏ ఎస్ చదువు చూడు. ఆ కాలంలో నేను వయసుకు వచ్చిన తరువాత స్కూలు పక్కకే వెళ్లలేదు తెలుసా? ఏడో క్లాసు వరకు నువ్వు చదువుకున్నది చాలు. త్వరగా నీకు పెళ్ళి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది"

"ఏయ్! శకుంతలా, కూతురు దగ్గర ఎప్పుడు, ఏం మాట్లాడాలో నీకు జ్ఞానం లేదా? పాపం...చిన్న పిల్లనే అది. ఈ వయసులోనే అది పెద్ద మనిషి అయ్యిందే నని నేను భాదపడుతూ కూర్చున్నాను. దాని దగ్గర పోయి పెళ్ళి అది,ఇదీ అని మాట్లాడుతున్నావు? నా కూతుర్ను నేను డాక్టర్ కి చదివించబోతాను. దాని తరువాతే పెళ్ళి. ఏమ్మా తల్లీ...నాన్న చెప్పేది కరెక్టే కదా?" అన్నాడు కూతురు వైపు తిరిగి.

"అవును నాన్నా. నేను డాక్టర్కు చదివి మన పేరయ్య తాతకు డబ్బులు తీసుకోకుండా సూది మందు వేయాలి"

ఆమె చెప్పింది విని తల్లితండ్రులిద్దరూ నవ్వారు. వాళ్ళ నవ్వులతో గాయత్రి నవ్వు కూడా కలిసిన సమయం, వాకిట్లో ఎవరో పిలుస్తున్న పిలుపు విని ముగ్గురూ తిరిగి చూశారు.వీళ్ళ గుమాస్తా ఈషారాం నిలబడున్నాడు. అతనితో పాటు ఒక అమ్మాయి తడబడుతూ వచ్చి నిలబడటం చూసి బాపిరాజు-శకుంతలాదేవి అరుగు మీద నుండి లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు.

"ఎవరు ఈషారాం...ఈ అమ్మాయి ఎవరు?"

"తెలియదయ్య గారూ. మన మామిడి తోటలో ఒక చివర ఏడుస్తూ ఒంటరిగా నిలబడుంది. 'ఎవరమ్మా?' అని అడిగితే నోరు తెరవటంలేదు. రాత్రి సమయం అవుతోంది...అందుకని ఇక్కడికి తీసుకు వచ్చాను"

"ఏమిటి, ఎందుకు అని విచారించి అలాగే పంపించకుండా ఎందుకురా ఇక్కడికి తీసుకు వచ్చావు?" అన్నది శకుంతలాదేవి. చూసిన వెంటనే ఆ అమ్మాయి నచ్చకపోవటంతో ఆమె మాటలలో కఠినత్వం కనబడింది.

"కాసేపు మాట్లాడకుండా ఉంటావా శకుంతలా. పాపం ఆ అమ్మాయి. రాత్రి సమయం, దారి తెలియక దారి తప్పి వచ్చుంటుంది...మనం విచారించి చూద్దాం" అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగారు బాపిరాజు.

"ఏమ్మా...నీ పేరేమిటి?"

"ప్రమీల"

"ఇక్కడికి ఎలా వచ్చావు? నీ సొంత ఊరు ఏది?"

ఆయన అడిగిన వెంటనే ఆలశ్యం చేయకుండా...గబుక్కున కాళ్ల మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చేసిన హడావిడికి బాపిరాజు గారు వెనక్కు వెళ్ళారు. "మొదట లేవమ్మా...ఏమైందో చెప్పు"

"అయ్యగారూ! మా నాన్న ఒక తాగుబోతు. మా అమ్మను వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకోని వెళ్ళిపోయారు. పొట్టకూటి కోసం నేనూ, మా అమ్మా దొరికిన పనిని చేస్తూ కాలం గడుపుతున్నాము. పోయిన నెల ఆరోగ్యం బాగుండక అమ్మ చనిపోయంది. పక్క ఉరిలో కట్టడాల కూలి పని చేసుకుంటున్న నాతో కొంతమంది తప్పుగా ప్రవర్తించారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతూ దారి తెలియక ఈ ఊరికి వచ్చి జేరాను. అయ్యాగారూ, మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా కనబడుతున్నారు. నన్ను ఇక్కడ్నుంచి పంపించకుండా ఏదైనా పని ఇచ్చి కాపాడండయ్యా. మీకు పుణ్యం వస్తుంది" అని బ్రతిమిలాడింది.

"ఇలా చూడు. ఇక్కడ పనిచేయటానికి చాలా మంది ఉన్నారు. నువ్వు మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నది శకుంతలాదేవి.

"అది కాదు...నేను" అంటూ ఏదో చెప్పబోయిన భర్తను అడ్డుకుంది శకుంతలాదేవి.

"మీరు ఏమీ చెప్పొద్దు. ఆకతాయి పిల్లలు ఏ ఊర్లో లేరు? ఈమెకు ఈ ఊర్లో ఆశ్రయం కలిపించి, ఈమెకు ఏదైనా జరిగితే మనమే ఊర్లో అందరికీ జవాబు చెప్పాలి. అదే ఈమె పెళ్ళి చేసుకుని భార్య-భర్తలుగా వచ్చి సహాయం అడిగుంటే దారాలంగా చేయచ్చు. మాట్లాడకుండా నేను చెప్పేది చెయ్యండి. ఖర్చులకు కొంచం డబ్బులిచ్చి ఈమెను పంపించి మీ పని చూసుకోండి" చెప్పింది శకుంతలాదేవి.

భార్య చెప్పేది సబబే నని అనిపించినా బాపిరాజు గారికి మనసు అంగీకరించలేదు. ఆయన ఆలొచిస్తూ నిలబడటం చూసిన ప్రమీల ఆయన డబుల్ మైండులో ఉన్నాడని అర్ధం చేసుకుంది.

"నాకు డబ్బులంతా వద్దయ్యగారు. నేను వెళ్తాను”--కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ వెనక్కు తిరిగింది ప్రమీల.

"ఈషారాం, ఈమెను తీసుకు వెళ్ళి బస్సు ఎక్కించి రారా" అన్నది శకుంతలాదేవి.

"సరేనమ్మగారు" అని చెప్పి ప్రమీలతో పాటూ బయలుదేరాడు ఈషారాం.

ఇద్దరూ ఇంటి గేటు ముట్టుకున్నప్పుడు గట్టిగా అరిచాడు బాపిరాజు.

"ఒక్క నిమిషం ఆగు ఈషారాం. ఇద్దరూ ఇక్కడికి రండి"

ఇద్దరూ వచ్చారు...అర్ధంకాక చూశారు.

"నేనొకటి చెబితే చేస్తావారా ఈషా?"

"ఏమిటయ్యగారు ఈ ప్రశ్న? మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను. ఏం చేయాలో ఆజ్ఞ వేయండి"

"అయితే సరే. ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో"

"అయ్యగారూ...నేను"

"ఆలొచించకురా. నా మాట మీద నీకు నమ్మకం లేదా?"

"సరే అయ్యగారూ. మీ ఇష్టం"

"నువేమ్మా చెబుతావు?"

ఆమె సమాధానం ఏమీ చెప్పకుండా ఈషారాం దగ్గరగా వెళ్ళి నిలబడింది.

బాపిరాజు గారి మనసులో ప్రశాంతత ఏర్పడింది. ఎందుకు ఏర్పడదు...సహాయం అని ఎవరైనా అడిగి వస్తే ఉత్త చేతులతో పంపే అలవాటులేని మనిషాయే!.

మరుసటి రోజు ఊరి జనం ముందు ఈషారం భార్య అయ్యింది ప్రమీల. బాపిరాజు గారు తన మామిడి తోటలో ఈషారం కోసం ఏర్పాటు చేసి ఇచ్చిన ఆ చిన్న గుడిసె ఇప్పుడు ఇంకొక జీవిని స్వాగతించేందుకు కాచుకోనుంది.

ఇంకా ఉంది.....Continued in: PART-14

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి