2, జులై 2020, గురువారం

వాక్చాతుర్యం పెంచే రాయి...(మిస్టరీ)



                                           వాక్చాతుర్యం పెంచే రాయి
                                                            (మిస్టరీ)


   వాక్చాతుర్యం ఉంటే ఎవరు ఎక్కడున్నా జీవించగలరు. ఏమైనా చేయగలరు.

వాక్చాతుర్యం ఉన్న వాళ్ళైతే అన్నిటిలోనూ గెలుస్తారు. వాక్చాతుర్యం లేని వాళ్ళైతే అన్నింటిలోనూ ఓడిపోతారు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో గెలవాలంటే తన వాక్చాతుర్యాన్ని పెంచుకోవాలి. వాక్చాతుర్యం పెంచుకోలేక జీవితంలో ఎంతోమంది కష్టపడుతున్నారు. వాక్చాతుర్యాన్ని పెంచగలిగే వరాన్ని ఇచ్చే దేవుడు ఎక్కడైనా ఉంటే అక్కడకు వెళ్ళి తమకు కూడా వాక్చాతుర్యాన్ని ప్రసాదించమని చాలా మంది వేడుకుంటారు.

                                                           బ్లార్ణే కోట

సరిగ్గా అలాంటి దేవుడే రాయి రూపంలో ఉన్నాడని తెలుసుకుని, ప్రపంచ రాజనీతిగ్నులు, సాహిత్య, విద్యా సంబంధిత దిగ్గజాలూ, సినిమాలకు సంబంధించిన వారు ఈ రాయిని సందర్శించి వాక్చాతుర్యాన్ని పొందగలిగారట. మరి అదెక్కడుందో, ఎప్పటి నుండి ఉందో, దాని చరిత్రేమిటో తెలుసుకుందాం.

            నేలమీద నుంచి కనిపించే ముద్దు పెట్టుకునే వాక్చాతుర్యం రాయి

ఐర్లాండ్ దేశంలోని బ్లార్ణే గ్రామానికి 8 కిలో మీటర్లో దూరంలో కార్క్ అనే చిన్న టౌన్లో బ్లార్ణే కోట ఉంది. ఆ కోటపైన ఉన్నది ఆ వాక్చాతుర్యం ప్రసాదించే రాయి. ఎవరైనా సరే ఆ కోట ఎక్కి ఆ రాయిని ముద్దు పెట్టుకుంటే చాలు, వారికి ఆ రాయి అనంతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతున్నారు. ఈ రాయినే వాక్చాతుర్యం పెంచే రాయి లేక బ్లార్ణే రాయి అంటారు. సరిగ్గా ఎప్పుడు, ఎలా పుట్టిందోగానీ ఈ సంప్రదాయం 18 వ శతాబ్ధపు చివర్లో మొదలైందని మాత్రం చెబుతారు. ఈ రాయికి సంబంధించిన చరిత్రకు ఎన్నో పురాణ కథలున్నా వాటిలో రెండు మాత్రం నిజమైనవిగా భావిస్తున్నారు.

                    1897లో కోట మీద రాయిని ముద్దు పెట్టుకునే దృశ్యం

మొదటి కథ: బ్లార్ణే కోటను కట్టిన 'కార్మాక్ లైడర్ మెక్కార్తీ' అనే ఆయన ఒక అడ్వకేట్. ఒక కోర్టు దావాలో ఇరుక్కున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆ కోర్టు కేసు పీకులాడుతున్నది. ఎలాగైనా మరుసటి రోజు వాదనతో ఆ కేసు గెలవాలని ప్రేమకూ అందానికీ పేరు పొందిన ఐర్లాండ్ దేవత క్లియాద్నా దేవత గుడికి వెళ్ళి తన కోర్టు దావాలో తనకు సహాయ పడవలసినదిగా ఆమెను ప్రార్ధించాడు. ఆమె అతడికి ప్రత్యక్షమై 'రేపు ప్రొద్దున కోర్టుకు వెళ్ళడానికి ముందు నువ్వు చూసే మొదటి రాయిని ముద్దు పెట్టుకుని వెళ్ళు. విజయం నిన్ను వరిస్తుంది’ అని చెప్పి మాయమైందట. ఆ దేవత చెప్పినట్టే ఆయన మర్నాడు కోర్టుకు వెళ్ళటానికి సిద్దమై వెళుతున్నప్పుడు ఒక రాయి వంక చూసి ఆ రాతిని ముద్దు పెట్టుకుని కోర్టుకు వెళ్ళాడట. కోర్టులో తన వాక్చాతుర్యంతో దావాను వాదించి దావాను గెలిచాడట. దాంతో మెక్కార్తీ తను చూసిన ఆ రాతికి వాక్చాతుర్యం పెంచే శక్తులున్నాయని గట్టిగా నమ్మకం కలిగింది. వెంటనే ఆ రాతిని తీసి తన కోట శిఖరంపై పొందు పరిచాడు. ఈ విషయం ఊరి ప్రజలకు తెలిసింది. ఆ తరువాత అది చాలా ఊర్లకు పాకింది. ఆ రాయిని చూడటానికి, ముద్దు పెట్టుకోవడానికీ చాలా మంది పర్యాటకులు ఇప్పటికీ వస్తున్నారట.

       ఒక వ్యక్తిని మోకాళ్ళ దగ్గర పట్టుకుని రాయిని ముద్దు పెట్టిస్తున్న దృశ్యం

రెండవ కథ: మొదటి ఎలిజిబెత్ మహారాణి కాలంలో బ్లార్ణే కోటను పరిపాలిస్తున్న 'డెర్మాట్ మెక్కార్తీ' మహారాణికి తన రాజభక్తిని నిరూపించుకోవటానికి తన కోటని ఆమెకు అర్పించాలనుకున్నాడు. కోటను ఆమెకు అర్పించడంలో తనకు చాలా సంతోషం కలుగుతుందని తెలియపరుస్తూ కోటను ఆమెకు సమర్పిస్తునప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతోందట. ఆటంకాలు ఏర్పడుతున్నందుకు తనను క్షమించవలసిందిగా డెర్మాట్ మెక్కార్తీ మహారాణిని వేడుకుంటున్నప్పుడు మహారాణి 'నీ కోటలో ఏదో ముఖ్యమైన శక్తి ఉంది. అది చెప్పటం ఇష్టంలేక ఎప్పటిలాగా వింతైన కారణాలు చెప్పటం బ్లార్ణేకి సొంతమైన అలవాటేగా' అని అన్నదట. అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలు బ్లార్ణే అంటే భ్రమ కల్పించే పిచ్చికూతలు అనే అర్ధం చెప్పారట. ఇప్పటికీ ఆంగ్ల నిఘంటువులో బ్లార్ణే కి ఇదే అర్ధం అని చెబుతుంది. మహారాణి ఆ కోట తనకు వద్దని చెప్పిందట. కానీ ఆ కోటలోని 'వాక్చాతుర్యం పెంచే రాయి' భ్రమ కాదని అక్కడి ప్రజలు నమ్మారు. 'వాక్చాతుర్యం పెంచే రాయి'కి మాత్రం ఏమాత్రం కీర్తి తగ్గలేదట.

                       రాయిని ముద్దు పెట్టుకుంటున్న సందర్శకుడు

కోటపై పొందు పరచిన బ్లార్ణే రాతినిముద్దు పెట్టుకోవటం కష్టమైన పని. ఎందుకంటే ఆ రాయిని ముద్దు పెట్టుకోవాలంటే కోట శిఖరం పైకి వెళ్ళి అక్కడి నుంచి వంగి(తలకిందులుగా)ముద్దు పెట్టుకోవాలి. అలా ముద్దు పెట్టుకోవలసిన వ్యక్తిని ఒకరు మోకాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకోవాలి. కొద్ది సంవత్సరాల క్రితం కోట శిఖరంపైన ఇనుపకడ్డీతో మనుషులు పడిపోకుండా ఉండడానికి వసతులు చేసేరు. ఆయినా చాలామందికి కోట శిఖరంపై నుంచి రాయిని ముద్దు పెట్టుకుంటుంటే భయం కలుగుతుందట.

Image Credit: To those who took the original photos. ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి