22, జులై 2020, బుధవారం

నిజమైన అభిమానం...(కథ)



                                                     నిజమైన అభిమానం
                                                                   (కథ)

రఘురాం కన్ ఫ్యూజన్లో ఉన్నాడు. ఆఫీసులో అతనికి పై అధికారిగా ఉన్న గోపాలరావు గారి భార్య కొద్ది సేపటి క్రితం ఫోన్ చేసింది.

గోపాలరావు రెండు సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ తో చనిపోవడంతో బ్యాంకులో పనిచేస్తున్న అతని భార్యను గుంటూరుకు ట్రాన్స్ ఫర్ చేస్తే, ఒప్పేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది.

భార్యా, భర్తలిద్దరూ రఘురాం తో బాగా చనువుగా, ప్రేమాభిమానాంతో స్నేహంగా ఉంటారు. రఘురాం కూడా వాళ్ళిదరితో అంతే చనువుగా ఉంటాడు. ఆ భార్య భర్తల దగ్గర నుండి అనారోగ్యంతో ఉన్న తన కూతురు కోసం ఎంతో సహాయం పొందాడు. రఘురాం ఐదేళ్ళ కూతురు అంటే ఆ భార్యా-భర్తలకు చచ్చేంత ప్రేమ.

పిల్లలు లేని ఆ దంపతుల ఇంటికి, సెలవు రోజుల్లో రఘురాం కూతురుతో కలిసి హాజరవుతూ ఉంటాడు...!

మధ్యలో జరిగిన ఆ విషాద సంఘటన తరువాత కూడా గోపాలరావు భార్య అప్పుడప్పుడు ఫోన్ చేసి రఘురాం తో మాట్లాడూతూ ఉండేది. కుశల ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకునేది.

ఈ రోజు కూడా అలాగే ఫోన్ చేసి విషయాలు అడిగిన తరువాత " రఘురాం గారూ...ఒక వారం ట్రైనింగ్ కోసం నేను విజయవాడ వస్తున్నాను. కానీ అక్కడ ఆఫీసు గెస్ట్ హౌస్ లేదు. బయట ఏదైనా హోటల్లో ఉండాలి. భోజనాల సౌకర్యం, ట్రాన్స్ పోర్ట్ వసతి లాంటివి బ్యాంకు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.

హోటల్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక వారం ఇంకెక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేయగలారా? విజయవాడలో మీరు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను. కాస్త ఏర్పాటు చేయండి" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

'వారం రోజులు మాత్రమే అంటే హోటల్ తప్ప ఇంకెక్కడ ఉంచటం. ఎవరూ వారం రోజులుకు ఇల్లు ఇవ్వరు. ఆ దంపతులులిద్దరూ నాకు, నా కుటుంబానికీ ఎంతో సహాయం చేశేరే. ఆవిడ్ని ఒక వారం రోజులు మనింట్లోని ఉండమని ఈ రకంగానైనా నేనూ, నా భార్యా వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం పొందవచ్చు’ అనే ఆలొచనతో ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు.

ఇంటికి వెళ్ళిన రఘురాం "మనింట్లో ఆవిడ ఉండాటానికి నీకేమీ అభ్యంతరం లేదుగా" అని భార్యను అడిగిన మరు క్షణం.

"ఏం మాట్లాడుతున్నారు...నేను కూడా ఉండను. ఒక వారం రోజులు మా ఊరు వెలుతున్నాను. ఆ టైములో ఆవిడ ఇక్కడకు మనింటికి వచ్చి ఉంటే చుట్టు పక్కలున్న వాళ్ళు కోడై కూస్తారు...?" అంటూ తన అయిష్టాన్ని వెలుపరచింది రఘురాం భార్య.

“సంస్క్రుతి, సంప్రదాయం, ప్రేమాభిమానాలు స్త్రీలకు పుట్టుకతో ఉండే గుణం అంటారు. గోపాలరావ్ భార్య అది నిజమేనని నిరూపించింది. ఇది నీకు కూడా తెలుసు. నీపైన, మన కూతురుపైన వాళ్ళకు ప్రత్యేకమైన అభిమానం ఉందని నీకు బాగా తెలుసు. మన కూతుర్ని హైదరాబాద్ స్పేషాలిటీ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళటానికి ఎన్నిసార్లు ఆయన తన కారు తీసుకుని హైదరాబాద్ వరకు మనకు తోడుగా వచ్చారు”

గోపాలరావు భార్యా భర్తలిద్దరూ తమకు ఎంత సహాయం చేశారో భార్యకు గుర్తు చేశాడు రఘురాం. తమ కూతురి ఆరొగ్య వ్యవహారంలో వాళ్ళు అందించిన మోరల్ సప్పోర్ట్, ప్రతిసారీ కూతుర్ని తీసుకుని డాక్టర్ను చూడటానికి వెళ్ళేటప్పుడు గోపాలరావు తన కారులో తీసుకు వెళ్ళింది, ఎప్పటికప్పుడు తమ కూతురు ఆరొగ్యం గురించి ఎంక్వయరీ చేసి తెలుసుకుంటూ ఉండటాన్ని… అలా చాలా వాటిని గుర్తు చేశాడు.

అలాంటి సన్నిహితుడైన గోపాలరావు హటాత్తుగా చనిపోవడం రఘురాం కు పెద్ద నష్టమే! కానీ స్నేహితుని నష్టాన్ని పూర్తి చేస్తున్నట్టు గోపాలరావు భార్య రోజుకు ఒకసారైనా అతని కూతురి ఆరొగ్యం గురించి అడిగి తెలుసు కుంటుంది. ఆలాంటావిడ ఒక చిన్న సహాయం అడిగితే చేయకపోవటం స్నేహానికి చేసే పెద్ద ద్రోహం అని భార్యకు వివరించాడు. నాకేమీ సంబంధం లేదు ఊల్లో వాళ్ళు తప్పు పడతారు అనే వాదన పెట్టుకుని, భర్తతో గొడవపడి ఆవిడ్ని ఇంటికి రానివ్వకుండా అంగీకరింపజేసింది.

“నీ అయిష్టాన్ని ఊరి ప్రజల మీద తోయకు. నీకు ఊరికి వెళ్ళే ప్రొగ్రాం లేదని నాకు తెలుసు. ఆవిడ మనింటికి రావటం నీకిష్టంలేదు. సరే...ఆవిడకు నేను వేరే ఏదైనా ఏర్పాటు చేస్తాను” అంటూ పెద్ద నిట్టూర్పు విడిచాడు.

ఏం చేయాలో తెలియని రఘురాం వెంటనే పక్క పేటలో నివసిస్తున్న తన తల్లితండ్రుల ఇంటికి వెళ్ళాడు.

"ఏరా...నేనూ, మీ అమ్మా క్రిందా మీదా పడుతూ ఏదో వండుకు తింటున్నాము. అది నీకు ఇష్టంలేదా? నీకు కావలసిన వాళ్ళైతే మీ ఇంట్లోనే అట్టేపెట్టుకోవచ్చుగా ?" అని తండ్రి ఖచ్చితంగా మాట్లాడేసరికి రఘురాం ఇంటిదోవ పట్టాడు.

'ఛీ...అమ్మ చెప్పింది, భార్య చెప్పింది, ఉరు కూస్తుంది అనే మాటలకు భయపడకుండా, మా ఇంట్లోనే వచ్చి ఉండండి అని చెప్పటానికి నాకు ధైర్యం లేదు..." తనని తానే తిట్టుకున్నాడు.

మళ్ళీ ఆవిడ దగ్గర నుండి ఫోన్ వచ్చేలోపు ఏదో ఒకటి చెప్పాలి!...ఏం చెప్పాలి? అనే ఆలొచనతో సతమతమవుతున్న రఘురాం కు మొదటి ఆలొచనగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

ఈసారి ల్యాండ్ లైన్ మోగింది. చాలా సేపు ఫోన్ మోగిన తరువాత రఘురాం భార్య ఫోన్ ఎత్తింది.

"హలో...మిసస్ రఘురాం...? ఏమిటి రఘురాం గారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా?"

"అలా ఏప్పుడూ చెయ్యరే...చార్జ్ అయిపోయుంటుంది" అబద్దం చెప్పింది.

"మ్యాడం...నన్ను సడన్ గా హైదరాబాద్ కు మార్చినట్టు ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. అందువల్ల మీ ఇంటికొచ్చే...ఐ మీన్ నా విజయవాడ ప్రోగ్రాం క్యాన్సల్ అయ్యింది. ఇది చెప్పటానికే రఘురాం గారికి చాలా సేపటి నుండి ఫోన్ చేస్తున్నాను...ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నదని చెబుతోంది.

మిమ్మల్ని బాగా శ్రమ పెట్టేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. తరువాత...మీ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నదని, దాని గురించి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలని రఘురాం గారు మా ఆయనతో చెబుతూ ఉండేవారు. నాకు హైదరాబాద్ లో సొంత ఇళ్లు ఉంది. అక్కడే సెటిల్ అవబోతున్నాను.

ఇంకా నాలుగేళ్ళు సర్వీస్ ఉన్నది. మా ఇంటి దగ్గరే రఘురాం గారు చెప్పిన స్పెషాలటీ హాస్పిటల్ ఉంది. మా ఇంటి నుండి మీరు హాస్పిటల్ కు వెళ్ళటానికి మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

మీరు కుటుంబ సమేతంగా ఎన్ని రోజులైనా మా ఇంట్లో ఉండవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు...ఈ విషయం రఘురాం గారితో కూడా చెప్పండి" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రఘురాం భార్య ఫోన్ లో మాట్లాడుతూ ఉండటం గమనించి "ఫోన్ లో ఎవరు...?" అని రఘురాం భార్యను అడిగినప్పుడు.....

సమాధానం చెప్పటానికి మాటలు రాక తల దించుకుని నిలబడింది రఘురాం భార్య్...! *******************************************సమాప్తం*********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి