5, ఆగస్టు 2020, బుధవారం

ఆడపిల్ల…(కథ)



                                                                                               ఆడపిల్ల
                                                                                          (కథ)  

"వస్తావా...రావా?"

బ్రతిమిలాడుతున్న దోరణిలో కొడుకును చూసి అడిగింది తల్లి కామాక్షి.

"వద్దు...నాకు అది వద్దు...ఉన్న ఇద్దరే చాలు. దాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు. హాస్పిటల్ వాకిట్లోనే....చెత్త కుండీలో విసిరేసి వచ్చేయమ్మా..." అన్నాడు ఏడుకొండలు, కొంచం కూడా జాలనేదే లేకుండా!

నెత్తి మీద వాత పెట్టినట్టు, చుర్రు మన్నది కామాక్షికి. మడతలుపడ్డ ముఖంలో కోపం అలలు అలలుగా ప్రవహించింది.

"ఛీ...ఛీ... మనిషేనా నువ్వు...? కన్న కూతుర్నే చెత్త కుండీలో విసిరేయమంటున్నావే...?"

"నన్ను ఇంకేం చెప్పమంటావు? ఈ సారైనా మగపిల్లాడు పుడతాడని ఎంత ఆశగా ఉన్నానో తెలుసా? అన్నిట్లోనూ మట్టి పోసిందే...? శనిలాగా దాపురించింది ..."

ఏడుకొండలకు రైసు మిల్లులో గుమాస్తా పని. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు. రెండో ఆడపిల్ల పుట్టిన తరువాత.....

"చాలురా...ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి...ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని వచ్చేయిరా..." కామాక్షి కొడొకు ఏడుకొండలకు చిలక్కి చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ చెప్పింది.

మామోయ్...మూడోది కూడా ఆడపిల్లగా పుడితే...మనం తట్టుకోలేము...” భార్య పౌర్ణమి హెచ్చరించింది.

తల్లి మాటలూ, భార్య మాటలూ ఏడుకొండలు పట్టించుకోలేదు.

మూడో బిడ్డ మొగబిడ్డగానే పుడుతుందని కంకిపాడు శ్వామీజీ చెప్పారు... ఆపరేషన్ అంతా చేయించుకోలేను. మగ బిడ్డ పుట్టనీ...ఆ తరువాత చూసుకుందాం" ఒంటికాలు మీద లేచాడు ఏడుకొండలు.

ఇలా జరుగుతుందని అతను కలలో కూడా అనుకోలేదు.

ఐదారు రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి కామాక్షమ్మ నడుస్తోంది.

మొదట పుట్టిన ఆడపిల్లలిద్దరూ కొత్తగా పుట్టిన చెల్లి పాపను విడిచి ఉండలేక ఆసుపత్రిలోనే పౌర్ణమికి పక్కనే ఉన్నారు.

"చెల్లి పాపను చూడటానికి నాన్న రాలేదా?" పెద్ద కూతురు సరళ అడిగిన ప్రశ్నకు దగ్గరున్న కామాక్షమ్మ సమాధానం చెప్పలేకపోయింది. ఏడుపు ఆపుకోలేక చీర కొంగును నోటికి అడ్డుపెట్టుకుంది.

"ఈ రోజు సాయంత్రం...నీ పెళ్ళాన్నీ, బిడ్డను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చేస్తాను...." కొడుకుతో గట్టిగా అరిచి చెప్పి ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళింది కామాక్షమ్మ.

'వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఇంట్లో ఉండకూడదు...చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోదాం. అక్కడొక చిన్న ఉద్యోగం చూసుకుని...మూడు నెలల తరువాత వద్దాం'

గుడ్డ సంచీలో బట్టలు సద్దుకున్నాడు.

బస్సు స్టేషన్ కు వెళ్ళాడు.

బస్సుకొసం కాచుకోనున్నప్పుడు ఆకలేసింది....టీ కొట్లోకి వెళ్ళాడు ఏడుకొండలు.

"సింగిల్ టీ ఇవ్వు బాబూ..."

అక్కడున్న చెక్క బల్ల మీద కూర్చున్నాడు.

అక్కడకొచ్చిన ఒక ముసలాయన అందరి దగ్గర బ్రతిమిలాడుతున్నాడు.

"ఒక టీ...ఒక బన్ను కొనివ్వండయ్యా...మీకు పుణ్యం దక్కుతుంది. రెండు రోజులుగా ఏమీ తినలేదు...ఆకలి చంపుతోంది....కళ్ళు చీకట్లు కమ్ముకుంటున్నాయి..."

మాసిపోయిన, అక్కడక్కడ చినిగిపోయిన పంచెతో వృద్దుడు ఒకాయన బ్రతిమిలాడుతున్నాడు.

మొహమంతా రోమాల అడవి. లోతుగా ఉన్న కళ్ళు. చూడటానికే  జాలేస్తొంది.

వృద్దుని బ్రతిమాలాటని ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించలేదు. పలువురు ముఖాలు చిట్లించుకున్నారు.

"ఏమయ్యా ముసలాయనా...బుద్ది,జ్ఞానమే ఉండదా నీకు? ఇటువైపు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను...నీవల్ల వ్యాపారమే దెబ్బతింటొంది...వెళ్ళవయ్యా..."

క్యాష్ కౌంటర్లో కూర్చున్న టీ కొట్టు యజమాని, ఆ వృద్దుడ్ని తిడుతూ తరిమాడు...ఇదంతా చూస్తున్న ఏడుకొండలు - పక్కన కూర్చున్న అతని దగ్గర ఆసక్తితో విచారించాడు. 

"ఆ పెద్దాయన ఎవరు...చూడటానికి బిచ్చగాడిలా కనిపించటం లేదు"

ఆ కడుపు మంటను ఎందుకండి అడుగుతారు...ఈ పెద్దాయన ఒకకాలంలో ఓహో అని జీవించిన ఆయన! ఏకరాల లెక్కల్లో పొలం, మేడ ఇళ్ళు, తోట, వనం అంటూ వసతి గల కుటుంబం!

వరుసగా నలుగురు మొగపిల్లలను కని, పెంచి...వాళ్ళను పెద్ద పెద్ద చదువులు చదివించి...మంచి స్థితికి తీసుకు వచ్చేలోపు ఆయన ఆస్తిలో చాలా వరకు తిగ్గిపోయింది. పిల్లలు నలుగురూ పెద్ద పొజిషన్ లో ఉన్నారు.

పెళ్ళి చేసుకుని పిల్లాపాపాలతో  హాయిగా  జీవితం సాగిస్తున్నారు. ఈయన్నీ, ఈయన భార్యనూ పట్టించుకోవటమే లేదు. నలుగురు మొగపిల్లలతో పాటూ ఒక ఆడపిల్లను కనుంటే ...ఇలా వదిలేసుంటుందా? గంజి నీళ్ళైనా పోసుంటుంది కదా...?”.......అతను చెపుతుండగా...

లోకం పోకడ తెలియక...మగ పిల్లాడే కావాలని మొండికేసి...నా బిడ్డను నేనే చీదరించుకున్నానే!  ఛఛ...ఏం మనిషిని నేను! ఆడపిల్ల అయినా ప్రేమతో పెంచి బాగా చదివిస్తే...అదే మనల్ని చివరిదసలో కాపాడుతుంది

బుద్ది వికసించింది, జ్ఞానోదయం కలిగింది. మద్రాసు వెళ్ళే ఆలొచనను మార్చుకుని...తన పిల్లను ముద్దాడాలని ఆశతో తృల్లి పడుతూ ఆసుపత్రి వైపుకు నడిచాడు ఏడుకొండలు.

***************************************************సమాప్తం******************************************      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి