7, ఆగస్టు 2020, శుక్రవారం

వరం...(కథ)

 

                                                                                       వరం...(కథ)

"ఎవరినైనా ప్రేమించి తగలడి ఉండొచ్చుగా...." కూతురుతో చెప్పాడు తండ్రి.

భార్య అడ్డుపడింది.

"ఏమండి...మీరే ఇలా చెపుతున్నారే? కూతురితో మాట్లాడాల్సిన మాటలేనా అవి?"

"లేకపోతే ఏం చేయాలంటావు...? దాన్ని పెళ్ళి చూపులకు చూడటానికి వచ్చేవాళ్ళందరూ...అమ్మాయి బాగుంది, కానీ మూలా నక్షత్రం, మూలా నక్షత్రం అని చెప్పి వెళ్ళిపోతున్నారే...?"

"అయితే...దానికొసం? కన్న కూతురు దగ్గర తండ్రి చూపాల్సిన……ఇది?"

"దానికి పెళ్ళి చేసెస్తే పెద్ద భారం దిగినట్లు ప్రశాంతంగా ఉండొచ్చని చూస్తే, ఒక్క సంబంధం కూడా ఓకే అవటంలేదే. ఒకటి, పెళ్ళికొడుకు పట్టణంలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామం పిల్ల వద్దు అంటున్నారు. కొంతమంది ఏదో ఒక సాకు చెప్పి వద్దు అంటున్నారు. ఏదీ లేకపోతే...మూలా నక్షత్రం! అత్తగారిని మూల కూర్చొబెడుతుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు....నన్నేం చేయమంటావు చెప్పు...?"

"దానికొసం ఇకమీదటా ఎవరైనా పుట్టుకొసారు? ఎక్కడో పుట్టే ఉంటాడు. గురు బలమూ, పెళ్ళి టైము కలిసి వచ్చినప్పుడు  అంతా మంచే జరుగుతుంది. దాన్ని పది నెలలు మోసి కన్న దానిని నేను. నేనే ఓర్పుగా ఉన్నానే. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? భగవంతుడే మంచి వరుడ్ని వరంగా ఇస్తాడు. ఒక దారి చూపుతాడు. అంతవరకు మీరు ఓపిక పట్టండి."....తల్లి సమాధాన పరిచింది.

"నాన్నా...నేను మీకు భారంగా ఉన్నానా? మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా?" ఏడుస్తూ అడిగింది కూతురు.

"లేదమ్మా...అదంతా ఏమీ లేదురా బంగారం. ఏదో ఆవేదనలో ఉండి అలా మాట్లాడాను."

"అది కాదు నాన్నా...నేనేమన్నా వేస్టుగా ఉంటున్నానా...? వంట పనులలో  సహాయపడుతూ, అంట్లన్నీ తోముతున్నాను.  సాయంత్రం అయ్యిందంటే కుట్టు మిషెన్ ముందు కూర్చుని జాకెట్లు కుట్టి ఇస్తున్నాను. అలాంటప్పుడు విధంగా నేను మీకు భారం అవుతాను? చెప్పండి"

తండ్రి భుజం పటుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

"అయ్యో...దానికొసమే నమ్మా నేను తట్టుకోలేక బాధపడుతున్నాను.  పెళ్ళై దాంపత్య జీవితం గడపాల్సిన వయసులో పుట్టింటి భారాలను మోయాలా అమ్మా?"

"ఏమిటండి మీరు? ఇక్కడ ఇలా పనులు చేస్తేనే,పెళ్ళైన తరువాత మెటింట్లో పక్వంగా కుటుంబాన్ని చూసుకోవచ్చు. మెట్టినింటికి వెళ్ళి వాళ్ళలో ఒకత్తిగా ఉండు అని ఎవరైనా చెప్తారా? అలా చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుందా"

తలుపులు కొడుతున్న శబ్ధం.

"ఎవరు...?"

"నేను లోపలకు రావచ్చా...?"

"రండి...మీరు ఎవరు?...మీకేం కావాలి..?"

నేను చిన్న వీధిలోని సోమయాజులు గారి బంధువును. వాళ్ళింటికి వచ్చాము. ఈ కొత్త జాకెట్టును కుట్టాలి. అప్పుడు, వాళ్ళే మీ అమ్మాయి బాగా కుడుతుందని చెప్పారు. అందుకని నేరుగా వచ్చి ఏం చేయాలో చెప్పి కుట్టటానికి ఇవ్వడానికి వచ్చాను..."

"రండి...లోపలకు రండి....అమ్మాయ్ ఆ కుర్చీ వెయమ్మా..."

"పరవలేదండి...నేను ముందే వచ్చాను. మీరు మాట్లాడుకుంటున్నదంతా విన్నాను. మీరు తప్పుగా అనుకోకపోతే...నేనొకటి అడగనా?"

"సోమయాజులు గారి బంధువులు మీరు...ఏదైనా అడగండి"

మా నేటివ్ హైదరబాద్. షాపు, ఫ్యాక్టరీ అని వ్యాపారం చేస్తున్నాం. మాకు ఇద్దరమ్మాయలు, ఇద్దరబ్బాయలు. ఆడపిల్లలకు పెళ్ళైపోయింది. పెద్దబ్బాయికి పెళ్లై అమెరికాలో పిల్లాపాపాలతో సెటిల్ అయ్యాడు. చిన్నవాడికి సంబంధాలు వెతుకుతున్నాము. వీడుకూడా పెద్ద చదువు చదివి, మా వ్యాపారాన్ని చూసుకుంటూ మాతోపాటు ఉంటున్నాడు. సిటీ అమ్మాయలు వద్దు అంటున్నాడు"

"ఎందుకని...?"

"మా బంధువులొకరు హైదరాబాదులో ఉంటున్నారు. వాళ్ళబ్బాయికి పెళ్ళై బెంగులూరులో పనిచేస్తున్నాడు. హైదరాబాదులోనే పుట్టి-పెరిగిన అమ్మాయిని, అందంగా ఉన్నదని పెళ్ళి చేశారు. ఆమె ఇంటిని పట్టించుకోవటం లేదట"

వ్యాపారం చూసుకునే భర్తను తన వెనుక రావటంలేదని తప్పు పడుతుందట. భర్తకు గాని, మామా-అత్తగార్లకు గానీ ఒక్కరోజు కూడా గుక్కెడు కాఫీ ఇచ్చిన పాపాన పోలేదట. పని మనిషి, వంట మనిషి రాని రోజున కూడా తొమ్మిదిన్నర అయినాకూడ అత్తగారే కాఫీ కలుపుకుని తాగాలి. ఇవన్నీ చూసే సిటీ అమ్మాయి వద్దంటున్నాము. కట్నాలు, నగలూ లేకున్నా పరవాలేదు. మీరు చెప్పిన మూలా నక్షత్రం అయినా పరవాలేదు.......ఎందుకంటే, మాకు దేవుడి మీద, మా శ్రమమీద నమ్మకం. ఎవరో రాసే జాతకాల మీద నమ్మకం లేదు. అందువలన మీ అమ్మాయిని...మా అబ్బాయికి ఇస్తారా? నేను సోమయాజులు గారిని మాట్లాడమని చెప్పనా?" 

ఆవిడ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయి నిలబడ్డాడు తండ్రి.... 

కూతురును కన్న తల్లి, వచ్చిన మహాలక్ష్మి తన కూతురి యొక్క కాబోయే అత్తగారని గ్రహించి ఆమె చేతులు తీసుకుని కళ్లకు అద్దుకుంది.

కూతురు బాధను మర్చిపోయి తండ్రి భుజాలమీద వాలిపోయింది. 'ఇది నిజంగానే దేవుడిచ్చిన వరం' మనసులోనే భగవంతుడికి నమస్కరించాడు.

****************************************************** సమాప్తం*****************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి