31, ఆగస్టు 2020, సోమవారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-6

 

                                                                        జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                   (PART-6)

(ఒక కార్యం చేయటానికి ఒక పద్దతి, అది చేయటానికి సరైన పరికరం, దాన్ని చేయటానికి తగిన సమయము...చోటును సరిగ్గా ఎన్నుకుని మంచిగా చెయ్య గలిగినవాడే గొప్పవాడు అవుతాడు)

తాను ఊరికి తిరిగి వస్తున్నట్టు రాజరాజేశ్వరికి ఫోన్ చేసి చెప్పాడు పరంధామయ్య. అప్పుడు కూడా ఆమె భర్తను కార్లోనే ఊరికి రమ్మని బలవంతం చేసింది.

మంగమ్మతో కారులో వెళ్ళటం మంచిదే. బస్సులో వెడితే బస్సు స్టాండ్ నుండి ఇంటికి నడిచి వెడుతుంటే పలువురు పలురకాలుగా చూస్తారు. కానీ, కారులోనే రమ్మని రాజరాజేశ్వరి ఎందుకు బలవంతం చేస్తోంది? గందరగోళంగా ఉంది ఆయనకి. అయినా కానీ దాని కారణం ఏమిటని గట్టిగా అడగలేదు. ఊరికి వెళ్ళిన తరువాత అడగొచ్చులే అనుకుని వదిలేశారు.

గుడివాడలో బస్సు దిగినప్పుడు పరంధామయ్యకు తెలిసిన ఒకాయన అడిగారు: "మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది?"

పరంధామయ్యకు ఏం చెప్పాలో తెలియలేదు. "ఏం...మా ఊరికేమిటి?" అని తిరిగి  అడిగారు.

"బయట ఊరు నుండి వస్తున్నారా?... మీకు  విషయమే తెలియదా? ఊర్లో కులం గొడవలు వచ్చి ఇద్దర్ని చంపేసారు. ఊరు మొత్తం పోలీసులు ఉన్నారు. అయినా కానీ గొడవులు తగ్గటం లేదు. రాత్రి అయితే చాలు జనం ప్రాణాలకు భయపడి ఇంట్లోనే ఒదిగి ఉంటున్నారు. 'ఎవరైనా బయటకు వస్తే కాల్చేస్తాం' అని పోలీసులు భయపెట్టి ఉంచారు. అయినా గొడవలు తగ్గటం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ మీకు విషయం చెప్పలేదా?"

నాతో మాట్లాడినప్పుడు రాజరాజేశ్వరి ఎందుకు ఆందొళనగా మాట్లాడింది...ఉరికి కార్లోనే రమ్మని ఎందుకు చెప్పిందో అనేది ఆయనకు ఇప్పుడు అర్ధమయ్యింది.

టాక్సీ డ్రైవర్ కు ఐదు వందలు ఎక్కువ ఇస్తానని చెప్పి గుడివాడ నుండి కారులో తన ఊరికి మంగమ్మను తీసుకుని బయలుదేరాడు పరంధామయ్య.

ఊరి సరిహద్దులోనే పోలీసులు కారును ఆపి, పూర్తిగా పరిశీలించారు. ఆయన ఎవరనేది పూర్తిగా తెలుసుకుని ఆయన్ని ఊరిలోకి అనుమతించారు.

వీధి మొత్తం పోలీసులు తిరుగుతున్నారు. ఎక్కువమంది జనం కనిపించలేదుఇంటికి వచ్చిన వెంటనే పరిగెత్తుకు వచ్చి స్వాగతం పలికింది రాజరాజేశ్వరి .

"హమ్మయ్య...ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది" అంటూ శ్వాస వదుల్తూ నడుస్తూ చెప్పిన ఆమె వెనక్కి తిరిగి మంగమ్మను చూసింది.

"ఈమె పేరు మంగమ్మ. కలకత్తాలో ఈమె భర్త ఈమెను చాలా చిత్రవధ చేసాడట. అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చిన ఈమెను రైల్లో చూశాను. పాపం, ఇప్పుడు అనాధ. ఎక్కడికీ వెళ్ల లేదు. అందువలన మనింట్లోనే పనిలో పెట్టుకుందామని పిలుచుకు వచ్చాశాను. నువ్వేమంటావ్ రాజేశ్వరి?"

"ఏమిటండి, మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడు ఎదురు చెప్పాను? వీళ్ళకని మనమేమీ ప్రత్యేకంగా వంట చేయం కదాఇంకో ఇద్దరు ఎక్కువ తిన్నందువలన మనమేమీ తరిగిపోము?"

రాజరాజేశ్వరిని ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ. పేరుకు తగినట్లు పెద్ద మనసు, మానవత్వం నిండి ఉన్న ఆమెను చూసి నిర్ఘాంతపోయింది.

వల్లీ, ఈమెను తీసుకు వెళ్ళి నీతో ఉంచుకో. ఇంటి పనులను ఆమెను కూడా చేయ్యమని చెప్పు"....గబగబ ఆదేశాలిచ్చింది.

ఆమెకు చేతులెత్తి నమస్కరించి, "మీకు చాలా ధన్యవాదాలమ్మా" అన్నది మంగమ్మ.

వల్లీ అమెను ఇంట్లోకి తీసుకు వెళ్ళింది.

ఇంటి శుభ్రతను, ప్రశాంతతను చూసి మంగమ్మ బాగా ఇష్టపడింది. కలకత్తాలో అశుభ్రత,  ఎప్పుడూ హడావిడిగా ఉండే వీధులలో నుండి మళ్ళీ గ్రామ ప్రశాంతత-శుభ్రత  పరిస్థితుల్లోకి తిరిగి వచ్చినందు వలన మంగమ్మ మనసు హాయిగా ఉన్నది.

పరంధామయ్య కొంత సమయం రెస్టు తీసుకున్న తరువాత భార్య రాజరాజేశ్వరిని పిలిచి గ్రామ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకయ్య చెప్పిన వివరాలు విన్న తరువాత ఆవేశంగా లేచారు.

"వాళ్ళను ఏం చేస్తానో చూడు?" అని కోపంగా అరిచారు.

"తొందరపడకండి! కోపగించుకుని ఏది చేసినా నష్టం వాళ్లకు మాత్రం కాదు...మనకీ ఏర్పడుతుంది. అందుకని..."

"అందుకని...?"

"ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి"

"దానికి మనం ఏం చేయాలి?"

"వారసులు లేరనే కారణం వలనే కదా వాళ్ళు ఇంత కుట్ర చేశారు. మనకు ఒక వారసుడు వస్తే?"

"ఏమిటి రాజేశ్వరీ...వేళాకోళమా?

"వేళాకోళం కాదండి.'సీరియస్' గానే చెబుతున్నాను. ఎవరికీ తెలియకుండా చట్టపూర్వంగా ఒక పిల్లాడ్ని దత్తతు తీసుకుంటే ఏం?"

పరంధామయ్యకు కూడా అలాంటి ఆలొచన ఉండేది. ఇప్పుడు రాజరాజేశ్వరి కూడా చెప్పేసింది...ఇక దానికి కావలసిన ఏర్పాట్లు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

"విజయవాడలో నా స్నేహితుడొకడు అడ్వకేట్ గా ఉంటున్నాడు.  వాడిని కలిసి ఆలొచన అడగాలి"

"ఫోనులోనే అడగొచ్చుగా?"

"లేదమ్మా. వీటన్నిటినీ నేరుగా కలుసుకుని మాట్లాడాలి"

మన ఊర్లోనూ, బయట ఊర్లలనూ కొంచం జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఎప్పుడూ వెంకయ్యను మీతో ఉంచుకోండి. చీకటి పడటానికి ముందే ఇంటికి వచ్చేయండి"

"సరే మంత్రి గారూ!--నవ్వుతూ కొంటె మర్యాదను చూపించేరు పరంధామయ్య. ఆయన మనసును అంతవరకు వేధిస్తున్న 'నేరం' చేశేమే నన్న ఆవేదన కొంచంగా తగ్గటంతో ఆయన మామూలు స్థితికి వచ్చారు.

గలగలమని నవ్వింది రాజరాజేశ్వరి.

భార్య కూడా ఒక విధంగా భర్తకు మంత్రే కదా!

విజయవాడ వెళ్ళిన పరంధామయ్య, అక్కడ అడ్వకేట్ చెప్పిన ఆలోచన ప్రకారం అక్కడున్న ఒక పిల్లలను దత్తతు ఇచ్చే నిర్వాహంలో రిజిస్టర్ చేసి వచ్చారు. కొన్ని రోజులు పడుతుందని వాళ్ళు చెప్పటంతో అంతవరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు.

రోజులు వారాలైయ్యి, వారాలు నెలలైనై.

మంగమ్మ తప్ప మిగిలిన పనివాళ్ళందరూ సాయంత్రం వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోవటంతో ఆమె ఒంటరి అయిపోతుంది. అందువలన రాజరాజేశ్వరి అప్పుడప్పుడు మంగమ్మను పిలిచి తనకు కొన్ని సహాయాలు చేయమని చెబుతుంది. తరువాత మంగమ్మ రాజరాజేశ్వరికి మాట తోడు అయ్యింది. మంగమ్మ యొక్క గుణం కొద్ది కొద్దిగా రాజరాజేశ్వరికి నచ్చడంతో ఆమెను ఎప్పుడూ తన పక్కనే ఉంచుకుంది.

మంగమ్మ పిల్లాడు సత్యపాల్ మీద రాజరాజేశ్వరి ఎక్కువ ప్రేమ చూపించింది.  వాడుకూడా ఆమెకు బాగా దగ్గరయ్యాడు. అది చూసి మంగమ్మ చాలా సంతోషపడింది.  

అప్పుడప్పుడు మంగమ్మ దగ్గర మాట్లాడి ఆమె కుటుంబం గురించి, పెళ్ళి గురించి, కలకత్తాలో జీవించిన జీవితం గురించి, భర్త పెట్టిన చిత్రవధల గురించి, అతని దగ్గర  నుండి తప్పించుకోవడం గురించి అడిగి తెలుసుకుంది. కానీ విజయవాడ సంఘటన గురించి మాత్రం మంగమ్మ చెప్పకుండా దాచేసింది.  

సత్యపాల్ బాగా దగ్గరవటంతో మిక్కిలి ఆనందించిన రాజరాజేశ్వరి యొక్క మనసులో  వేరొక  ప్లాన్ పుట్టింది. దత్తతు పిల్లాడికోసం కాచుకోనవసరం లేకుండా వీడినే దత్తతు తీసుకుంటే ఏం? అనేదే అది!

భర్తతో తన ఇష్టాన్ని చెప్పింది. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. కానీ, మొదట మంగమ్మ దగ్గర మాట్లాడమని సలహా ఇచ్చారు.

మంగమ్మ కూడా దానికి మనస్స్పూర్తిగా అంగీకరించింది. అది ఎలా పద్దతిగా చేయాలో అలాగే చేయండి" అన్నది.

వారసుడు లేని వాళ్ళకు ఒక వారసడు దొరుకుతాడు. సత్యపాల్ భవిష్యత్తు బాగుంటుంది.  చేసిన పాపానికి నేను పరిహారం చేసినట్లు అవుతుంది అని ఆలొచించింది.

ఆ రోజు నుండి సత్యపాల్ ని తన కొడుకులాగా భావించి ప్రేమంతా ఒలకబోసింది రాజరాజేశ్వరి. వాడు కూడా ఆమె దగ్గరే, ఆమె కొంగు పుచ్చుకునే కాలం వెళ్లబుచ్చాడు.

'నన్ను పట్టుకున్న పీడ నాతోటే పోనీ. సత్యపాల్ జీవితమైనా బాగుండనీఅని శాంత పడింది మంగమ్మ.

కాని విధి వాళ్ళకు వేరొక పధకం తయారుగా ఉంచింది.

ఒక రోజు మంగమ్మ విడిగా వెళ్ళి డోక్కున్నది రాజరాజేశ్వరి గమనించేసింది. ఆమెను తన గదికి పిలిచుకు వెళ్ళి గుచ్చి గుచ్చి అడగటంతో ఆమె గర్భంగా ఉన్న విషయం  ఖాయపరచుకుంది.

కలకత్తాలో చివరి కొన్ని నెలలుగా మంగమ్మ దాంపత్య జీవితం గడపలేదు. భర్తకు దూరంగా ఉన్నది. ఈమెను తన భర్త రైల్లో కలుసుకున్నాడు. విజయవాడలో ఒక రోజు రాత్రి ఆమె, ఈయన ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆమెను ఈయన ఇంటికే తీసుకు వచ్చారు. ఇవన్నీ కలిపి ఆలొచిస్తే రాజరాజేశ్వరికి  ఒక సమాధానమే దొరికింది.  

"అలాగైతే...అలాగైతే?"

తాను ఈ ఇంట్లో ఉండబోయేది ఈరోజే చివరి రోజు అనేది మంగమ్మకు బాగానే అర్ధమయ్యింది. కాబట్టి, రాజరాజేశ్వరి కాళ్ళ మీద పడి ఆ రోజు విజయవాడలో జరిగిందంతా మర్చిపోకుండా మొత్తం చెప్పి ముగించింది.......

"అమ్మా...ఆ రోజు జరిగిన దానికి నేను మాత్రమే కారణం. అయ్యగారు ఒక సత్య హరిశ్చంద్రుడు. ఆయన్ని సందేహించకండి. నాకు ఎటువంటి శిక్చ అయినా విధించాడు...మనస్పూర్తిగా అనుభవిస్తాను. ఆయన్ని ఏమీ అనకండి. రేపు తెల్లవారు జామున ఎవరికీ తెలియకుండా ఊరు వదిలి వెళ్ళిపోతాను"---వెక్కి వెక్కి ఏడ్చింది.

మంగమ్మ మాట్లాడుతూ వెడుతుంటే రాజరాజేశ్వరి మనసులో వేరొక పధకం రూపు దిద్దుకుంటోంది.

"నువ్వు ఇళ్ళు వదిలి వెళ్ళిపోతే సమస్యలు సరైపోతాయా?"  

"వేరే ఏం చేయాలో నాకు తోచటం లేదమ్మా. మీరు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా"

"ఏం చెప్పినా చేస్తావా?"

"తప్పకుండా చేస్తానమ్మా. నన్ను నమ్మండమ్మా"

"సరే, కళ్ళు తుడుచుకుని నా దగ్గరకు రా...చెబుతాను"

భయపడుతూ దగ్గరకు వెళ్ళింది.

గుసగుసమనే స్వరంలో ఆమె చెబుతూ వెడుతుంటే మంగమ్మ కళ్ళు ఆశ్చర్యంతో వికసించినై.  ఆమె చెవులను ఆమే నమ్మలేకపోయింది!

                                                                                                             Continued...PART-7

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి