శతమానం భవతి...(సీరియల్) (PART-9)
అప్పుడు అక్కడికి మానస చెల్లి సుజాత వచ్చింది.
"నాన్నా....ఎదురింటి సుబ్బారావు గారు వచ్చారు"
మానస తండ్రి ఈజీ చైర్లో నుండి లేచి హాలులోకి వెళ్ళాడు.
"ఏమిటి సార్ ఇది...ఆ తాగుబోతు వెధవలు నోటికి వచ్చినట్లు ఎంతెంత మాటలు అన్నారు. వాళ్ళను ఊరికే వదలకూడదు సార్. రాత్రే వెళ్ళి మీరు పోలీసు కంప్లైంట్ ఇచ్చుండాలి...మీరిలా ప్రశాంతంగా కూర్చుంటే వాళ్ళు మరింత రెచ్చిపోతారు"
"నన్ను ఏం చేయమంటారు చెప్పండి"
“ఏం చేయమంటారు అని అడుగుతారేమిటి? వాళ్ళలాగా మాటకు మాట మనం మాట్లాడగలమా? కంప్లైంట్ ఇవ్వాలి. ఒక ఆడపిల్లను అంత నీచంగానా మాట్లాడేది? ఎన్ని బూతులు?"
మానస తండ్రి కళ్లళ్ళో నుండి బోటబొటా నీళ్ళు కారినై.
"నాలుగు రోజులు వాళ్ళను లోపల పెడితే అప్పుడు వాళ్ళకు బుద్దొస్తుంది"
"అదేమిటి సుబ్బారావ్ గారూ...అన్నీ తెలిసుండి మీరే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద పోలీసు కంప్లైంట్ ఇస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. నేనొక ప్రభుత్వ ఉద్యోగి. పోలీసు, కేసు అని వెడితే నా ఉద్యోగానికే ఎసరు పెడతారు. వాళెవరో మీకు తెలుసుగా...రుద్రయ్య మనుషులండి. అతని మీద కేసుపెట్టి మనం బ్రతకగలమా. మనం ఎంత, మన బ్రతుకెంత. పెళ్ళీడుకోచ్చిన ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని అలా మూర్ఖంగా ఎలా అలొచించగలం. వాళ్ళు రాజకీయ బలం కలిగిన వారు. ఎలాగైనా తప్పించుకుంటారు. మనం...మనకేం బలం ఉంది. మనమెలా తప్పించుకోగలం... రుద్రయ్య తో పెట్టుకుంటే నా సహాయనికి ఎవరొస్తారు చెప్పండి....అన్ని తెలిసుండి మీరే పొలీసు కంప్లైంట్, కేసు అంటే ఎలాగండి"
"అంటే...మీరు వాళ్ళని ఏమీ చేయరన్న మాట"
“ఏది చేసినా అది మనకే ఎదురు తిరుగుతుంది...సమస్యను పరిష్కరించటానికి బదులు ఆ సమస్యను మనం ఇంకా పెద్దది చేసిన వాళ్ళమౌతాం"
తండ్రి మాటలు మానసకు నచ్చలేదు.
"ఏ కాలంలో ఉన్నారీయన? ఎందుకింత పిరికితనం?" మానసలోని కోపం అగ్నిపర్వతమయ్యింది.
కానీ...దేనినీ బయట పెట్టలేకపోయింది. ఇంతవరకు తండ్రిని ఎదిరించి మాట్లాడలేదు. ఆయనంటే గౌరవంతో కూడిన భయం. ఇప్పుడు మాట్లాడిందే చాలా ఎక్కువ. ఇంతకు ముందు తండ్రితో ఇలా మాట్లాడిందే లేదు.
తండ్రిలోని భయం, సర్దుకుపోవాలనే గుణం చూసిన సుబ్బారావు గారు లేచి వెళ్ళిపోయారు.
పక్కింటి జగన్నాధం, చివరింటి సురేష్ గారు కలిసి వచ్చారు.
"ఏంతైనా నీ కూతురు అలా చేసుండకూడదు. ఎవరి అండ చూసుకుని అతన్ని కొట్టింది? నీ కూతురు తన మనసులో ఒక విప్లవ వనిత అనుకుంటోందా...ఇప్పుడు చూడండి ఎంత అవమానపడాల్సి వచ్చిందో"
"మీ ఇంటి ఆడపిల్లలను ఎవరైనా తప్పు పట్ట గలిగేవారా? ఎంత అణుకువగా ఉండేవారు. ఇప్పుడు చూడండి అణుకువ తగ్గిన వెంటనే ఎలా బురద జల్లి వెడుతున్నారో"
"చివరగా ఏం చెప్పారో విన్నారుగా...విషయం ‘మా రుద్రయ్య అయ్యగారికి ఇంకా తెలియదు’...తెలిస్తే ఊరుకుంటాడా? ఇంకా అవమాన పరుస్తాడు"
జగన్నాధం చెప్పింది విని ఖంగు తిన్నాడు జగపతి.
తలుపు చాటుగా నిలబడి వీళ్ళ సంభాషణ వింటున్న మానస తల్లికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది.
ఇప్పటికే చీకటిని చూసి బయపడ్డ ఆమెకు దేనినో చూపించి భూతం అని చెప్పినట్లు ఉన్నది.
మానసకు మాత్రం ఇంటికొచ్చిన ఆ పెద్ద మనుషులను చెంప దెబ్బలు కొట్టాలనిపించింది.
“ఈ పెద్ద మనుషులా నాన్నకు సలహా లివ్వబోయేది! ఎటువంటి సలహ ఇస్తారో?”
“ఆ అమ్మాయిని చెయ్యి పట్టిలాగినట్లు నా చెయ్యి లాగి నన్ను అవమాన పరుస్తారా? అలా చెయ్యగలరా వాళ్ళు? మగ వారిగా పుట్టేమనే ఒకే కారణంతో ఆడవారిని ఏదైనా చేయగలరా? సంఘం చూస్తూ ఊరుకుంటుందా?" మానస రక్తం ఉడికిపోయింది.
తండ్రి భయాన్ని మరింత పెంచే విధంగా మాట్లాడుతున్న ఆ ఇద్దరు పెద్ద మనుషులనూ చూసి "లేచి బయటకు వెళ్లండి" అని గట్టిగా అరవాలనిపించింది మానసకు...కానీ అలా అరిచినా ఏమీ ప్రయోజనం లేదని మానసకు తెలుసు.
"సరే జగపతి గారు...అయ్యిందేదో అయిపోయింది. మేము రుద్రయ్య గారితో మాట్లాడే ఇక్కడికి వస్తున్నాం. మీరు ఆఫీసుకు వెళ్ళే ముందు మీ అమ్మాయి మానసను తీసుకుని రుద్రయ్య గారి ఇంటికి వెళ్ళి, ఆయనకు క్షమాపణ చెప్పి, పోలీసు కంప్లైంట్ ఇవ్వటం లేదని చెబితే చాలు. అక్కడితో మీ భయానికి తెర పడుతుంది. మీరు నిశ్చింతగా, హాయిగా, మామూలుగా ఉండొచ్చు....మేము కూడా మీతో వస్తాం" అని చెప్పి లేచారు ఆ ఇద్దరు పెద్ద మనుషులు.
ఆ ఇద్దరు పెద్ద మనుషుల చేతులు పుచ్చుకుని "మా కుటుంబాన్ని కాపాడిన మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు" అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు మానస తండ్రి జగపతి.
జగపతి భుజం తట్టి మేమున్నామనే అభయం ఇచ్చి వెళ్ళిపోయారు జగన్నాధం, సురేష్.
అనంద పడింది మానస తల్లి.
కుప్పలా కూర్చుండిపోయింది మానస.
**********************************
తాను ఏమీ చేయలేని పరిస్థితిలో తండ్రితో కలిసి రుద్రయ్య ఇంటికి వెళ్ళింది మానస.
తండ్రి చెప్పమన్నట్టు రుద్రయ్య కి క్షమాపణ చెప్పింది మానస.
పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోమని అభయమిచ్చాడు మానస తండ్రి.
అందరూ తిరిగి వచ్చాశారు.
ఆ రోజు జగపతి ఆఫీసుకు వెళ్ళలేదు. మానస తల్లి వంట గదివైపు వెళ్ళలేదు. తండ్రి హాలులోనూ, తల్లి వంట గది వాకిలిలోనూ పడుకుండిపోయారు.
మానస బెడ్ రూములోకి వెళ్ళి వాలిపోయింది. మనసు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి ముడుచుకు పోయింది. కాలేజీకి వెళ్ళలేదు. మానస చెల్లెలు సుజాత కూడా కాలేజీ మానేసి ఆ రోజు వంట కార్యక్రమం తన చేతిలోకి తీసుకుంది.
వాళ్ళందరికి ఆ రోజు ఎంతో భారంగా గడిచింది.
Continued.......PART-10
ఇవి కూడా చదవండి:
విమానం కనుగొన్నది భారతీయుడా?(మిస్టరీ)
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి