15, అక్టోబర్ 2019, మంగళవారం

మాయాలోక నది!...( ఆసక్తి)                                                     మాయాలోక నది


'మాయ’ అంటే సత్యాన్ని తెలుసుకొలేకపోవడం, అసత్యాన్ని అర్ధం చేసుకోలేకపోవడం అనే భావనే చాలామందిలో ఉంటుంది. మనకు తెలియకుండా మన కళ్ళెదుట జరుగుతున్నదే మాయ అంటారు పెద్దలు.

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, మర్మాలు దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ అవన్నీ మాయలో కాదో అర్ధం చేసుకోవడం మామూలు మనుషులకు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా కష్టంగానే ఉన్నది.


అలాంటి ఒక విషయాన్నే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నము.

ఫిలిప్పీన్స్ దేశంలోని వర్షారణ్యంలో ఒక వింత ప్రదేశం ఉన్నది. అదొక అందమైన నది. నది అంటేనే మంచి నీరు కలిగినదని మనందరికీ తెలుసు. కానీ ఈ నదిలో ఉన్నది ఉప్పు నీరు. ఈ నదిని అక్కడ Hinatuan Enchanted River అంటారు. ఈ అందమైన నది గురించి స్థానిక పురాణాలు ఎన్నో విషయాలు చెబుతున్నాయి. ఈ నదిలో నాగకన్యలు స్నానమాడతారని, యక్షిణులు జలకాలాడతారని చెబుతారు.


సముద్రానికి 648 మీటర్ల దూరంలో ఉండే ఈ నదిలోని నీరు నీలి రంగులో, మలినం లేకుండా స్పష్టంగా ఉంటుంది. ఫాంటసీ సినిమాలలో చూపించే నదిలాగా కనబడుతుంది. ఆ నదీ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రదేశంలా ఉంటుంది.

అక్కడి పురాణాలలోనూ, జానపద చరిత్రలోనూ ఈ నది గురించిన ప్రస్థావన ఎక్కువగా రాసుందు. అందువల్ల ఈ నదిని చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. ఈ నదికి Enchanted River(గందర్వులు సంచరించే నది) అనే పేరు స్థిరమైపోయింది.


ఇందులోని నీరు చాలా నిశ్చితమైనదిగా ఉంటుంది. ఈత కొట్టే వారికి నీటిలో కాకుండా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుందట. 80 అడుగుల లోతుకు వెళ్ళినా, ఈతగాళ్ళు పైనున్నవారికి బాగా కనబడతారట. నది క్రింద కనిపించే నేల అద్దంతో తయారుచేసిన పలకలాగా ఉంటుందట. నది మడుగు క్రింద ఆనేక ద్వారాలు ఉన్నాయి. నది నీటి చుట్టూ ఉన్న వృక్షజాలం ఆ నది నీటిలో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నది తీరంపై నది చుట్టూ ఉండే చెట్లు, పువ్వులూ అద్దంలో కనబడుతున్నట్టు కనిపిస్తాయి. నీటిలో అటూ-ఇటూ వెళుతున్న చేపలు స్పష్టంగా కనిపిస్తాయి.


నది మడుగు కింద కనిపించే ద్వారాలలో నుంచే నది నీరు వస్తున్నదేమోనని పరిశోధన చేయడానికి 1999లో Alex Santos అనే డైవర్ వెళ్ళాడు. అతను ద్వారాల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. ద్వారాలు, గుహలలోకి వెళుతున్నాయని, గుహలు చీకటిగా ఉన్నాయని, అందువలన తాను వాటిలోకి వెళ్ళలేకపోయానని తెలిపాడు. ఆ గుహలలోకి వెళ్ళి చూడాలని 2010లో ముగ్గురిని పంపించారు. 8 మీటర్లు ఎత్తు కలిగిన గుహలోకి వెళుతున్నప్పుడు ఒకరు గుండెపోటుతో మరణించారు. వేర్వేరు ద్వారాలలోకి వెళ్ళిన మిగిలిన ఇద్దరూ 200 అడుగుల దాకా ప్రయాణం చేసి గుహలు మరింత చీకటిగా ఉండడంతో తిరిగి వచ్చాసారు.

గజ ఈతగాళ్ళను అత్యధిక వెలుతురు ఇవ్వగలిగే హెడ్ లైట్లతో పంపేరు. కానీ ఎవరూ పూర్తిగా గుహలను దాటలేకపోయారు.

స్థానికుల కథనం ప్రకారం ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఈ నది ఇప్పటివరకు మలినం చెందలేదు. ఆత్మలు, జలకన్యలు, దివ్యభామలు, ఆధ్యాత్మిక జీవులు, కొన్ని సంప్రదాయాలు ఈ నదికి గార్డియన్ గా ఉంటూ మలినం కాకుండా కాపాడుతున్నాయని చెబుతున్నారు. జలకన్యలు, దివ్యభామలు ఈ నది నీటిలో రాత్రిపూట జలకాలాడటం చూశామని అంటారు.

పురాణాల ప్రకారం నది చుట్టూ ఉండే చెట్లు 'enkantos' అనే దేవ కన్యలకు నిలయం. 'enkantos' అంటే అక్కడి భాషలో ప్రకృతి యొక్క ఆత్మ అని అర్ధం. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న వారు, కొంతమంది పర్యాటకులు ఆ జలకన్యలను చూశామని చెబుతున్నారు.

రాత్రిపూట జలకన్యలు స్నానమాడతారని, అప్పుడు నదిలో ఈతకు వెళ్ళేవారిని నది నీటిలో ముంచేస్తాయని చెప్పటంతో రాత్రిపూట పర్యాటకులతో సహా స్థానికులను కూడా ఆ నదిలో ఈత కొట్టటానికి అనుమతించరు. పగటి పూట ఈత కొట్టిన వారిలో చాలామందికి వీపు మీద చురకలు, దురదలు, శరీరంలో అక్కడక్కడా గీతలు గీసుకుపోయి ఉండటం కనిపిస్తాయట. ఒక్కొక్కసారి ఈత కొడుతున్న వారిని ఆకశ్మికంగా లోపలకు లాక్కుని వెళ్ళడం జరుగుతున్నదిట.

ఈ నదిలో కనిపించే చేప జాతులు మరే చోటా లేవట. చేపల వలలో అవి చిక్కుకోవట.


ఈ నది గురించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నది ఒడ్డున ఒక చెట్టుకు ఒక గంట ఉంటుంది. ఆ గంటను మోగించినప్పుడు ఆ నదిలో ఈత కొడుతున్న వారందరూ నీటిలో నుంచి తీరానికి వచ్చేయాలి.'Hymn of Hinatuan' అనే పాటను పెద్దగా వినిపిస్తారు. ఎక్కడి నుండో వేలకొలది చేపలు అక్కడికి చేరుకుంటాయి. నది కాపలాదారులు వాటికి ఆహారం వేస్తారు. ఒక గంట తరువాత మళ్ళీ గంట మోగిస్తారు. చేపలన్నీ వెళ్ళిపోతాయి. పర్యాటకులు ఈతకు వెళ్ళొచ్చు.

తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కాపాడుతూ, నది మర్మాన్ని కనుక్కోవడానికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Images Credit: to those who took the original photos.

*********************************************************************************************

P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి