కళ్ళు మూసుకుని అతని పక్కన కూర్చోనున్న గాయత్రి, కారు ఆగిన ఊపుతో కళ్ళు తెరిచింది.
"దిగు గాయత్రీ" అన్నాడు.
కారు డోర్ తెరుచుకుని దిగిన గాయత్రి కదలకుండా అలాగే నిలబడింది. ఆమె కళ్ల ముందు అతిపెద్ద ఇళ్లు. కాదు కాదు...కొన్ని ఎకరాలను మింగిన అతిపెద్ద ప్యాలస్ అనే చెప్పాలి. ఆ ప్యాలస్ ముందున్న స్థలం పార్కు లాగా అమర్చబడింది. ఇరువైపులా ఏడెనిమిది కార్లు చిన్నవి, పెద్దవి పలు రంగులలో వరుసగా నిలబడున్నాయి.
వెనుకే వచ్చి నిలబడ్డ కారులోంచి దిగి, ప్యాలస్ లాంటి ఆ బంగళాను చూసి నోరు వెళ్లబెట్టి చూస్తూ నిలబడిపోయారు రాజేశ్వరి, బాలజీ, జానకీ, విశాలాక్షి అనే ఆ నలుగురు.
"రా గాయత్రీ, ఇదే మన ఇళ్లు" అంటూ గాయత్రి పక్కన వచ్చి నిలబడ్డాడు రమేష్.
'నా ఆస్తంతా రాసిస్తాను, నా చెల్లెల్ను పెళ్ళి చెసుకోండి'...అప్పుడు చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది గాయత్రికి. పలుకోట్లకు అధిపతి అయిన రమేష్, హైదరాబాదులో ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో అద్దెకు...ఎందుకు? ఇదంతా దేనికోసం? భగవంతుడా!
దీనికంతా నేను అర్హత లేని దానినని ఎందుకు అతను అర్ధం చేసుకోవటానికి నిరాకరిస్తున్నాడు?'
అని గాయత్రి ఆలొచిస్తున్న సమయంలో.
"చిన్న యజమాని వచ్చేశారు, చిన్నమ్మ కూడా వచ్చేసింది"
ఎక్కడ్నుంచో వినబడ్డ కంఠధ్వని తరువాత పూర్తిగా తెరుచుకున్న తలుపుల వెనుక నుంచి ఒక పెద్ద గుంపు బయటకు వచ్చింది. రమేష్ ను కన్న తల్లి-తండ్రులు, తోడబుట్టిన వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ అంటూ వచ్చి నిలబడ్డ వాళ్ళందరి మొహాలలోనూ సంతోషం ప్రవహించటం కనబడింది.
ఎందుకనో గాయత్రి మొహంలో మాత్రం ఆవగింజంత సంతోషం కూడా కనబడలేదు.
హారతి తీశారు. పూవులు జల్లి స్వాగతం పలికారు. కుడి కాలు మోపి లోపలకు రమ్మని, గాయత్రిని లోపలకు తీసుకువెళ్లారు. ఆమె చేత పూజ గదిలో దీపం వెలిగించారు. తాగమని పాలు ఇచ్చారు. ఆమె చుట్టుతా చేరి తమ అభిమానాన్ని పంచారు. తప్పని పరిస్తితిలో రాని నవ్వును తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడింది గాయత్రి.
రమేష్ తల్లి గాయత్రి దగ్గరకు వచ్చి కూర్చుంది.
"ఎప్పుడో మా ఇంటికి రావలసిన మహాలక్ష్మివి. మేమే కొంత నిర్లక్ష్యంగా ఉండిపోయాము. ప్చ్...ఏం చేయ్యం? అంతా ఆ భగవంతుడు ఆడుతున్న ఆట. ఎలాగో నువ్వు మాకు తిరిగి దొరికావు...అది చాలు" అంటూ గాయత్రి బుగ్గలను ముద్దుపెట్టుకుంది.
"అచ్చు అసలు మీ అమ్మలాగానే ఉన్నావమ్మా" అన్నది.
'అమ్మ' అనే మాట చెవిన పడగానే గాయత్రి కళ్ళల్లో నీరు పొంగింది.
"మీ అమ్మ మొదటిసారి మా ఇంటికి వచ్చేటప్పుడు భయం భయంగా వచ్చింది. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది. కానీ..."
"అమ్మా...ప్లీజ్" -- అడ్డుపడ్డాడు రమేష్.
"సారీ...పాత విషయాలను గుర్తు చేశానో?" అన్నది రమేష్ తల్లి.
పరవాలేదు అనేలాగా తల ఊపింది గాయత్రి.
అలా పరిచయ మాటలు ముగిసినై.
"నాతో రా గాయత్రి" అంటూ గాయత్రి ని తీసుకుని మధ్యలో ఉన్న హాలులో ఉంచబడ్డ పెద్ద ఫోటో దగ్గరకు తీసుకువెళ్లాడు రమేష్.
"ఈమే నా బామ్మ. మన పెళ్ళి జరగాలని ఆశపడినామె"
ఫోటోను చూపించి నమస్కారం చేసుకున్న రమేష్ తో కలిసి గాయత్రి కూడా ఆ ఫోటోకు నమస్కరించింది. హాలుకు అవతలవైపుకు తీసుకు వెళ్ళి అక్కడ గుడ్డతో మూసున్న తెరను 'రిమోట్ కంట్రోల్’ ఒకటి ఆమె చేతికి ఇచ్చి తెరవమన్నాడు. తెర తొలగి కళ్ళల్లో పడ్డ దృశ్యం గాయత్రిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
శకుంతలాదేవి, బాపిరాజు గారూ ఫోటోలో నవ్వుతూ ఉన్నారు.
తల్లి-తండ్రుల మొహాలు కనబడగానే భోరున ఏడ్చింది గాయత్రి. తన కళ్ళకు దేవతల్లా కనబడ్డ వాళ్ళకు చేతులెత్తి నమస్కరించింది జానకి. తరువాత తన సహోదరి దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పుచ్చుకుని కళ్లకద్దుకుంది. చెల్లెల్ను తనతో కలుపుకుని చేర్చుకుంది అక్కయ్య. కన్నవాళ్ళను తలచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న అక్కాచెల్లెల్లను మామూలు స్థితికి తేవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అక్కడున్న అందరూ.
రాత్రి డిన్నర్ ముగించుకుని తమకు కేటాయించిన గదులవైపుకు వెళ్లారు...గాయత్రి చెంతకు వచ్చింది రాజేశ్వరి.
"మీ అమ్మ నీకొసం సరైన జీవితం వెతికి పట్టుకుంది గాయత్రీ. రమేష్ కుటుంబం మొత్తం నీ మీద ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. రమేష్ లాంటి ఒకతను నీకు భర్తగా దొరకటానికి నువ్వు ఎంతో పుణ్యం చేసుకోనుండాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మ స్థానంలో నిలబడి నీ పెళ్ళి జరిపించే నేను ఊరికి వెలతాను"
"మ్యాడం, అదొచ్చి..."
"ఆపు గాయత్రీ, నాకు నిన్ను బాగా తెలుసు. నీ మనసూ తెలుసు. నీ సంకోచానికి కారణం కూడా తెలుసు. నీకు జరిగింది ఒక యాక్సిడెంట్ రా! ఇంకా నువ్వు దాని గురించే ఆలొచిస్తూ కూర్చుంటే ఎలా? రమేష్ ఒక సరాసరి మొగాడు కాదని అతన్ని చూసిన వెంటనే గ్రహించాను. నీ గురించిన వివరాలన్నీ చెప్పి, 'గాయత్రి నీకు దొరకదు, తిరిగి వెళ్ళిపో' అని చెప్పినందుకు అతను ఏం చెప్పాడో తెలుసా? నిశ్శ్చయతార్ధం అనే పేరుతో ఏరోజైతే మా ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడిందో...ఆ నిమిషం నుంచే నేను, గాయత్రి భార్యా-భర్తలుగా ఈ లోకానికి పరిచయమైపోయాము. అలా చూస్తే జరిగిన ఆ యాక్సిడెంట్లో నా భార్యను కాపాడలేని దౌర్భాగ్యుడ్ని నేను అని చెప్పుకుంటూ ఏడ్చాడు. నువ్వు అదృష్టవంతురాలివి గాయత్రి. ఈ కాలంలో ఇలాంటి ఒక భర్త ఏ అమ్మాయికి దొరుకుతాడు? దయచేసి నేను చెప్పేది విను. పాత విషయాలన్నీ ఎత్తి చెత్తలో పడేయ్. రమేష్ తో కొత్త జీవితం మొదలుపెట్టు.
ఇది మీ అమ్మగారు నీకోసం ఏర్పాటు చేసి ఇచ్చింది. అది ఎందుకు నువ్వు అర్ధం చేసుకోవు? రమేష్ ను ఒప్పుకో. పోగొట్టుకున్న సంతోషం, ప్రశాంతత అన్నీ అతని ద్వారానే తిరిగి దొరుకుతాయ్. నీ మీదే తన ప్రాణం పెట్టుకున్నాడు. అంతే కాదు...నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించటానికి మీ అమ్మ-నాన్నల గుర్తుగా, వాళ్ళ పేరు మీద ఈ ఊర్లో ఆసుపత్రి కట్టించాడు. నీ చేతులతో దాన్ని తెరిపించాలని కాచుకోనున్నాడు.
ఇంకొక విషయం చెబుతున్నాను....విను. జానకికి వరుడ్ని చూశాము. ఆ వరుడు ఇంకెవరో కాదు. మన బాలజీనే. ఒకే వేదిక మీద రెండు పెళ్ళిల్లు పెట్టుకుందామని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాము. ఇదంతా రమేష్ ఏర్పాటే. నీకున్న బాధ్యతల్లో తనకూ భాగం ఉన్నదని అతను మనకు చెప్పకుండా చెబుతున్నాడు. దీని తరువాత కూడ అతన్ని అర్ధం చేసుకోలేదనుకో...ఆ తరువాత నీ ఇష్టం" అని చెప్పటం ముగించింది రాజేశ్వరి.
"మ్యాడం చెప్పేది కరక్టే" అంటూ అక్కడికి వచ్చింది జానకి. ఆమెతో పాటూ బాలాజీ కూడా వచ్చాడు.
"మీకు చెప్పేటంత అర్హత మాకు లేదు. కాని ఒకటి మాత్రం నిశ్చయం. మీరు రమేష్ బావను చేసుకోనని చెప్పినా అది ఆయన్ను పెద్దగా బాధ పెట్టదు. ఎందుకంటే, మనసారా ఆయన మీతో కాపురం చేస్తున్నారు. సమస్య ఆయన గురించి కాదు. నేను సంతోషంగా జీవించాలని మీరు ఆశపడుతున్నట్టు మీ జీవితమూ సంతోషంగా ఉండాలని మేము ఎదురుచూడకూడదా? 'మన అమ్మాయి ఈ ఇంట్లోనే జీవిస్తుందనే కలతో చచ్చిపోయిందే మీ అమ్మ...ఆమె నమ్మకంలో మట్టి పోయదలుచుకున్నారా? చెప్పండక్కా. ఏందుకని ఏమీ మాట్లాడనంటున్నారు? జవాబు చెప్పండి"
"వదిలేయ్ జానకీ, గాయత్రి మనకు మంచి శుభవార్తే చెబుతుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. రండి మనం వెలదాం" అని ఇద్దర్నీ పిలుచుకుని అక్కడ్నుంచి కదిలింది రాజేశ్వరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి