21, అక్టోబర్ 2019, సోమవారం

గురుదక్షణ....(కథ)
                                                          గురుదక్షణనేను స్కూలు చదువుకునేటప్పుడు నాకు పాఠాలు చెప్పిన రామారావు మాస్టారు, తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక చాలా కష్టపడుతున్నారని తెలిసింది.

ఆయన దగ్గర చదువు నేర్చుకుని, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి, ఇప్పుడు రైల్వేలో క్లర్కుగా పనిచేస్తున్న నేను ఆయనకు సహాయ పడలేకపోతున్నానే అన్న బాధ నన్ను వేధిస్తున్నది . చేతిలో ఉన్నది యాభైవేల రూపాయలు. అవి సరిపోవు. ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఆలొచిస్తున్న నాకు 'బిల్డింగ్ కాంట్రాక్టర్’ గా పనులు చేస్తున్న, నాతోపాటు చదువుకున్న, నా చిన్ననాటి స్నేహితుడు గణేష్ ఇంట్లోకి రావడం కనబడింది.

అతనికి ఎదురు వెళ్ళి "రా...రా...గణేష్" అంటూ అతన్ని ఆహ్వానించి లోపలకు తీసుకువచ్చి కుర్చీ చూపించి "కూర్చో" అన్నాను.

గణేష్ కుర్చీలో కూర్చున్న తరువాత "ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. నువ్వు బిల్డింగ్ కాంట్రాక్టర్ గా, సొంత పనులు చేస్తున్నావని విన్నాను. సంతోషంగా ఉందిరా. నీ పనులు ఎలా ఉన్నాయి. నువ్వు ఎలా ఉన్నావు" అని అడిగాను.

"బాగున్నానురా...ఒక ముఖ్య విషయం గురించి నీ దగ్గరకు వచ్చాను"

"చెప్పరా?"

"మన రామారావు మాస్టారు తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక కష్టపడుతున్నారని విన్నాను. ఇందా, ఇందులో రెండు లక్షలు ఉన్నాయి. మాస్టారుకి ఈ డబ్బును నీ డబ్బుగా చెప్పి ఇవ్వరా" అంటూ నాకొక కవరు అందించాడు.

"ఈ డబ్బు నేనెందుకు ఇవ్వాలి?...నీ డబ్బు...నువ్వే ఇవ్వు"

"లేదురా...స్కూల్లో చదువుకునేటప్పుడు, నేను సరిగ్గా చదివే వాడిని కాదు. మాస్టారు నాకు ప్రోగ్రస్ రిపోర్టు ఇచ్చినప్పుడల్లా 'బాగా చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం' అని చెప్పేవారు. ఎనిమిదో క్లాసుతో చదువు ఆపాశాను...కూలీగా ఒక ఇళ్ళ మేస్త్రీ దగ్గర పనికి జేరాను. కొన్నేళ్ళ తరువాత మేస్త్రీ అయ్యాను. ఐదేళ్ళ నుండి నేనే స్వయంగా కాంట్రాక్ట్ తీసుకుని బిల్డింగులు కట్టిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ డబ్బులు తీసుకు వెళ్ళి ఇస్తే ఆయన చెప్పిన మాట అబద్దం అవుతుంది"

"ఆయన చెప్పిన మాటలు అబద్దం అయినట్లే కదురా. చదువు లేకపోయినా జీవితంలో ఎదగొచ్చు. దానికి డైరెక్ట్ ఉదాహరణ నువ్వే. నువ్వు చదువుకోకపోయినా బిల్డింగ్ కాంట్రాక్టర్ అయ్యి, బాగా డబ్బు సంపాదిస్తున్నావు కదరా. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకు వెళ్ళి ఇస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు" అన్నాను.

"అలాగే బాధ కూడా పడతారు. ఎందుకంటే ‘బాగా సంపాదించుకుంటున్న వీడిని చూసి ఎన్నిసార్లు 'బాగా చదువుకోకపోతే జీవితంలో ఎదగలేవు’ అని తిట్టాను అంటూ బాధపడతారు. ఆయన బాధ పడకూడదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం రా"

"ఏమిట్రా నువ్వు చెప్పేది?"

“ఈరోజు నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ గా ఎదిగి, రెండు చేతులా సంపాదిస్తున్నాను. కానీ, ఈ ఎదుగుదల జీవితంలో నిజమైన ఎదుగుదల కాదురా. ఎప్పుడైనా ఈ ఎదుగుదల నుండి నేను మామూలు స్థితికి రావచ్చు"

"ఎందుకురా అలా మాట్లాడుతున్నావు?"

"అర్ధం కాలేదు కదూ? నీకు అర్ధమయ్యేటట్టు చెబుతా విను. మాస్టారు చెప్పిన మాట విని నేను శ్రద్దగా చదువుకోనుంటే నేను కూడా ఒక ఇంజనీర్ అయ్యుండేవాడిని. ఎవరిమీదా ఆధారపడకుండా పైగెదిగేవాడిని. ఇంజనీర్లు లాగా రేట్లు చెప్పి ఎక్కువ సంపాదించుకునేవాడిని. కానీ నేను ఇంజనీర్ల కంటే తక్కువ చార్జ్ చేస్తాను కాబట్టే కాంట్రాక్టు నాకు ఇచ్చేవారు. ఒక పక్క ఇంజనీర్ల కంటే సంపాదన తక్కువ, దానికితోడు వాళ్ల సహాయంకోసం, వాళ్లకోసం నా సంపాదనలొ కొంత ఇచ్చుకోవటం, చదువుకోనుంటే ఇవన్నీ నాకే మిగిలేవిగా?”

అర్ధం కానట్టు చూశాను.

“ఇంకా అర్ధం కాలేదా. ఇంకా బాగా అర్ధమయ్యేటట్టు చెబుతా విను. ప్రతి బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక, ఆ బిల్డింగ్ ప్లానుకు చదువుకున్న ఒక ఆర్కిటెక్ట్ ను కలుస్తున్నాను. కొన్ని పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు చదువుకున్న సివిల్ ఇంజనీరును కలిసి బిల్డింగ్ కరెక్టుగా కడుతున్నానా లేదా అని చూసి వెళ్ళమంటాను. కాంట్రాక్టుకు తీసుకున్న డబ్బుల్లో నలభై శాతం వాళ్ళకి ఇస్తున్నాను...ఈ మధ్య చిన్న చిన్న కాంట్రాక్టులు ఇచ్చే వాళ్ళు కూడా నేరుగా సివిల్ ఇంజనీర్లను వెతుక్కుంటూ వెడుతున్నారు. ఒకప్పుడు నేను స్వయంగా సంవత్సరానికి కనీసం మూడు కాంట్రాక్టులైనా తెచ్చుకో గలిగాను. ఇప్పుడు కాంట్రాక్టులు తగ్గి, సివిల్ ఇంజనీర్లు ఇచ్చే పనులు ఒప్పుకుంటున్నాను"

"ఒకప్పుడు అనుభవం ఉన్న మేస్త్రీ అనే చూపుతో ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీర్లూ పిలిచి పనులు ఇచ్చేవారు. ఇప్పుడు అవికూడా తగ్గుతున్నాయి. మనం వెళ్ళి అడిగినా ఏదో ఒక నెపం చెప్పి కొత్త వాళ్ళను పెట్టుకుంటున్నారు"

“ఇప్పుడు నా సంపాదన తక్కువగానే ఉన్నది. ఏదో ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బు దాచుకున్నాను కాబట్టి జీవితంలో గౌరవంగా బ్రతుకుతున్నాను. కానీ ఆ దాచుకున్న డబ్బు ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. అవి కరిగిపోయిన రోజు నేను మామూలు మేస్త్రీనే. అందుకే ఇందాకా ఆ మాట చెప్పాను"

"ఇందులో నా కృషి యొక్క తప్పేమీ లేదు... తప్పంతా నేను చదువుకోకపోవటమే. ఎంతో కష్టపడి ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ సంపాదించినా చదువుకున్న ఒక ఆర్కిటెక్ట్ దగ్గరకు తప్పక వెళ్ళాలి. కొన్నిసార్లు సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. అంటే చదువులేనిదే జీవితంలో ఎదగలేము అనేదే కదా నిజం. కాబట్టి మాస్టారు చెప్పింది నిజం"

“ఆ రోజు నేను శ్రద్దతో చదువుకోనుంటే నేనూ ఒక సివిల్ ఇంజనీర్ అయ్యుండేవాడిని...పెద్ద సివిల్ ఇంజనీర్ గా ఎదిగే వాడిని...పేరున్న సివిల్ ఇంజనీర్ గా బ్రతికే వాడిని...సివిల్ ఇంజనీర్ గా చనిపోయేవాడిని"

“ఎందుకురా అంత బాధ పడతావు...చదువులు లేని ఎంతో మంది వ్యక్తులుపెద్ద పెద్ద వ్యాపరస్తులుగా ఉంటూ, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా? నువ్వు ఇంకా కొంచం కష్టపడితే ఆ అంతస్తుకు ఎదిగిపోతావు. ఆ తరువాత నీ జీవితం గౌరవంగానే ఉంటుందిరా" అన్నాను.

"స్నేహితుడిని కదా అని నువ్వు నాకు పాజిటివ్ మాటలు చెబుతున్నావు...కానీ అది నిజం కాదు. చదువులేకపోయినా అదృష్టంతో పైకొచ్చినవారి సంఖ్యా శాతం ఒకట్లలో ఉంది. దీనికి కష్టపడటం మాత్రమే చాలదు. అదృష్టం వరిస్తేనే అలాంటి వారు అవుతారు. అదే చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటి వారిని అదృష్టం ఎప్పుడూ ఒక చూపు చూస్తూనే ఉంటుంది. వాళ్ళని పైకి తీసుకు వెడుతుంది. అదేరా చదువుకు ఉన్న గొప్పతనం ...అందుకేరా ఆడా మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి...చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది" అన్నాడు గణేష్.

“చదువుకోవటానికి నిర్వచనం ఎంత బాగా చెప్పావురా...ఇంతగా జీవితం గురించి ఆలొచించే నువ్వు చదువు లేకపోయినా మేధావివేరా. చాలా తెలివిగలవాడివిరా...నీ భవిష్యత్తు గురించి ఇంతగా ఆలొచిస్తున్న నువ్వు, నువ్వు దాచుకున్న డబ్బులో రెండు లక్షలు గురువుకు దానంగా ఇస్తున్నదానికంటే, ఆయన మాటను అబద్ధం చేయకూడదని తపన పడుతున్నావే...అదే నువ్వు మాస్టారుకు ఇచ్చే నిజమైన గురుదక్షణ. ఆయన కూతురు పెళ్ళికి నువ్వు చేసే డబ్బు సహాయం గురుదక్షణ కాదురా...ఆయన మాటను నిలబెట్టాలనుకొవటమే నిజమైన గురుదక్షణ రా. నీ గొప్ప మనసుకీ, తెలివితేటలకూ నువ్వు జీవితంలో ఎదుగుతావురా...ఇది ఖచ్చితంగా జరుగుతుందిరా" అంటూ గణేష్ ఇచ్చిన డబ్బును తీసుకున్నాను.

అప్పుడు గణేష్ ముఖంలో కనబడ్డ ఆనందం, తృప్తి నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి