7, అక్టోబర్ 2019, సోమవారం

తొలివలపు (సీరియల్)...PART-21



                                            తొలివలపు….(సీరియల్)
                                                         (PART-21)

"సారీ గాయత్రీ. అది నా దురదృష్టం అనే చెప్పాలి. ఒక కేసు విషయంగా రాజమండ్రి వెళ్ళినప్పుడు...మీ నాన్న యొక్క కేసు ఫైలు అనుకోకుండా నా కళ్ళల్లో పడ్డది. విచారణ చేసినప్పుడు...తెల్లారితే ఆయనకు ఉరి శిక్ష అమలు. నేరుగా వెళ్ళి ఆయన్ని కలిసి వివరాలు చెప్పాను. నా చేతులు పుచ్చుకుని ఏడ్చారు. దయా బిక్ష పెట్టమని అర్జీ పెడదామని చెప్పాను. వద్దని చెప్పేశారు.

కానీ ఎందుకో తెలియదు. మిమ్మల్ని గురించి అన్ని వివరాలూ చెప్పిన ఆయన జానకి గురించి ఒక మాట కూడా చెప్పలేదు. మీ గురించే ఎక్కువ బాధపడ్డారు. 'ఈ ఉరి శిక్ష...నా భార్యకు నేను చేసిన ద్రోహానికి పరిహారం. దీన్ని సంతోషంగా అంగీకరిస్తున్నాను. నా బాధ అంతా నా కూతురు గాయత్రి గురించే. అది ఎక్కడుంది... ఏం చేస్తోంది అనేది తెలుసుకోలేని పాపిని అయ్యాను’ అని చెప్పి ఏడ్చారు.

నా నా భార్య శకుంతల తీసుకున్న నిర్ణయం సరిగ్గానే ఉంటుంది. గాయత్రి మీకొసమే పుట్టింది. మీ ఇంటి కోడలు...కచ్చితంగా మీకొసమే కాచుకోనుంటుంది. ఆమెను వెతికి పట్టుకునే బాధ్యతను మీ దగ్గర అప్పజెప్పి వెడుతున్నాను. దేవుడు మనిద్దరినీ కలుసుకునేటట్టు చేసినట్లే, మీ ఇద్దర్నీ కూడా కచ్చితంగా ఏదో ఒకరోజు కలుసుకునేటట్టు చేస్తాడని చెప్పారు.

ఒక కొడుకుగా ఉండి మీ నాన్నకు చేయాల్సిన చివరి కార్యాలన్నీ ముగించిన తరువాత, అస్తికలు తీసుకు వెళ్ళి గొదావరి నదిలో కలిపి...పరిపూర్ణ మనసుతో మిమ్మల్ని వెతకటం మొదలు పెట్టాను"

చివరిగా అతను చెప్పింది విని సోఫాలో జారి పడిన గాయత్రి "నాన్నా" అంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఆమె బాగా ఏడ్చి ముగించని అని మౌనంగా నిలబడున్న రమేష్, కొంతసేపు అయిన తరువాత ఆమె పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ ఆమెను ఓదార్చాడు. ఆ సమయంలో అతని ఓదార్పును అంగీకరించిన దానికి మల్లే తనని తాను మరిచిపోయి అతని భుజం మీద వాలిపోయి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి.

"రమేష్, నేను చేసిన తప్పుకు మా నాన్న"

"ఏడవుకు గాయత్రీ. నీ భవిష్యత్తు గురించి ఆలొచించే, తప్పును తన మీద వేసుకుని ఉండుంటారు. కన్న కూతూర్ను కాపాడే బాధ్యత ఆయనకు ఉండటం న్యాయమే కదా? వదిలేయ్. నీకు నేను ఉన్నాను. ఇకమీదట అన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను గాయత్రి "

అతని మాటలు చెవులలో నుండి వెళ్ళి లోపల ఉన్న భావాలను ముట్టుకున్న సమయం ఆమె మామూలు స్థితికి వచ్చింది. వెంటనే రమేష్ కు దూరంగా జరిగి లేచి నిలబడింది.

"ప్లీజ్ రమేష్...నా మనసును మార్చటానికి ప్రయత్నించకండి. కొంచం కొంచంగా నన్ను బలహీనం చేయకండి. దయచేసి ఇలాగే వదిలేయండి. ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి" - చేతులతో మొహాన్ని దాచుకుని ఏడుస్తున్న గాయత్రికి దగ్గరగా వచ్చాడు రమేష్.

"నీ తడబాటుకు కారణం ఏమిటో నాకు బాగా తెలుసు గాయత్రీ. అదే సమయం, ఇక నీ ఇష్టం లేకుండా నీ నీడను కూడా తాకను. గుడ్ బై" అని చెప్పి అతను బయలుదేరబోతుంటే.

"నేను లోపలకు రావచ్చా?" అనే మాట వినబడటంతో ముగ్గురూ ఒక్కసారిగా తిరిగి చూశారు. జానకి నిలబడుంది. ఆమె పక్కనే నిలబడుంది పద్మా నర్స్.

'భగవంతుడా...ఈమె ఎలా ఇక్కడకు వచ్చింది?' అనే ఆందోళనతో గాయత్రి జానకికి ఎదురుగా వెళ్ళింది. కానీ జానకి తిన్నగా వెళ్ళి రమేష్ కాళ్ళ మీద పడింది.

"నన్ను క్షమించండి...మీరు ఎవరని తెలియక"

"హాయ్ జానకీ...ఇదేమిటి? లే మొదట"

"ఊహూ. మొదట నన్ను క్షమించాను అని చెప్పండి"

"సరే...సరే...క్షమించాను. చాలా?"

"ధ్యాంక్స్ బావా"-- అన్నది జానకి. లేచి నిలబడి.

"ఏమిటి...బావ అంటున్నావు?"

"అవును...అక్క భర్తను అలాగే పిలుస్తారు కదా...?"

ఆమె మాటలతో నివ్వరపోయి నిలబడ్డారు రమేష్, బాలాజీ ఇద్దరూ. గాయత్రియో ఆశ్చర్య శిఖరం అంచులకే వెళ్ళిపోయింది.

"మీరు నాకొక సహాయం చేయాలి" బాలాజీ దగ్గరగా వెళ్ళి అడిగింది జానకి.

"చెప్పండి జానకీ" అన్నాడు బాలాజి.

"ఇంకో అరగంటలో రాజేశ్వరి మ్యాడమ్, మా అమ్మా ఇద్దరూ ఇక్కడ ఉండాలి"

"అర్ధమైయ్యింది" అని చెప్పి బయలుదేరి వెళ్లాడు బాలాజి.

ఆ తరువాతే, గాయత్రిని చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడింది జానకి.

"జానకీ...నేను..." అంటూ గాయత్రి ఏదో చెప్పబోతుంటే, గబుక్కున చేయి పైకెత్తి మాట్లాడవద్దని గాయత్రికి సైగ చేసింది.

"నేను ఎవరు అనే విషయం నాకు తెలిసిపోయింది. జరిగిపోయిన దానిని గురించి మళ్ళీ మాట్లాడి, ఏడ్చి, పెడబొబ్బులు పెట్టి 'సీను క్రియేట్' చేద్దామని నేను ఇక్కడకు రాలేదు. తిన్నగా విషయానికే వస్తా. మీ చెల్లెలు మీతో ఉండాలని మీకు ఆశగా ఉందా...లేదా?"

"ఏంటమ్మా ఈ ప్రశ్న? నువ్వెవరో తెలిసిన ఆ నిమిషం నుండి అలాంటి ఒక భాగ్యం నాకు దొరకదా అని ఎంత ఆశపడుతున్నానో తెలుసా?"

"అయితే సరి. మీకు నేను కావాలని ఆశపడితే...రమెష్ ను మీరు పెళ్ళిచేసుకోవటానికి అంగీకరించాలి"

"ఇష్టం వచ్చినట్లు వాగకు జానకి" కోపంగా అరిచింది గాయత్రి.

"క్షమించాలి మ్యాడమ్. మీరు సరే నని చెబితే....మిగతా విషయాలు మాట్లాడదాం. లేదంటే...నన్ను వదిలేయండి. మీ కంటికి కనబడనంత దూరం వెళ్ళిపోతాను. ఇది తప్ప నాకు ఇంకో దారి తెలియటం లేదు"--చెప్పి వెనక్కి తిరిగింది.

"ఆగు జానకీ. నన్ను వదిలి వెళ్ళిపోకు. మళ్ళీ నిన్ను పోగొట్టుకుని బ్రతికే శక్తి నాకు లేదు"

తన ముందుకు వచ్చి నిలబడి, తన చేతులు పుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న గాయత్రిని చూసి జానకి కళ్ళు కన్నీటితో నిండింది. ఆ కన్నీరు కనబడకుండా తల పక్కకు తిప్పుకుని, "అప్పుడు సరేనని చెప్పండి"

"నువ్వైనా అర్ధం చేసుకో జానకీ. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఎవరూ బలవంతం చేయకండి. ప్లీజ్...అది మాత్రం నావల్ల కాదు"

"గాయత్రి చెప్పటం కూడా కరక్టే జానకీ. ఆమెను బలవంత పెట్టే మేము ఒకటవ్వాలంటే, అలా మేమిద్దరం ఒకటవ్వటం నాకు ఇష్టం లేదు. ఆలాంటి పెళ్ళి నాకు అవసరం లేదు. గాయత్రి ఇష్టానికే ఆమెను వదిలేద్దాం" అన్నాడు మధ్యలో అడ్డుపలికిన రమేష్.

"అంటే నిర్ణయంతీసుకునే అధికారం వాళ్ళవాళ్ళ చేతుల్లోనే కదా ఉంది...? అయితే ఇక ఇక్కడ నాకు ఏం పనుంది? గుడ్ బై మ్యాడమ్..." -- అని చెప్పి గుమ్మం వైపు అడుగులు వేసింది జానకీ.

"ఆగు జానకీ. నేను చెప్పేది కొంచం విను. నన్ను వదిలి వెళ్ళిపోకు. రమేష్, జానకిని వెళ్ళొద్దని చెప్పండి. నాకు జానకి కావలి. నా జీవితాంతం జానకి నాతోనే ఉండాలి. మీరైనా చెప్పండి రమేష్. కావాలంటే ఆమె ఇష్టపడినట్టే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటానికి వొప్పుకుంటున్నాను. దయచేసి ఆమెను నన్ను వదిలి వెళ్ళొద్దని మాత్రం చెప్పండి. ప్లీజ్..."--అంటూ ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది గాయత్రి.

విజయం సాధించిన సంతోషం జానకి మొహంలో కనబడింది. వెంటనే పరిగెత్తుకు వచ్చి గాయత్రి ముందు కూర్చుంది.

"మీ మనసును గాయపరిచినందుకు దయచేసి నన్ను క్షమించండి. పెళ్ళికి మీరు వొప్పుకోవాలనే అలా బిహేవ్ చేశాను. నాకు వేరే దారి తోచలేదు. మీ ముందు నిలబడే తాహతో, అర్హతో నాకు కొంచం కూడా లేదు" అంటూ గాయత్రిని చూసి చేతులెత్తి నమస్కరించింది.

"ఏం మాట్లాడుతున్నావు జానకీ...? నువ్వు నా ప్రాణం. ఇంకోసారి ఇలా మాట్లాడకు. నిజం చెప్పాలంటే నేనే నీ దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే మీ అమ్మను నీ నుండి..."

"వద్దు...ఆ మోసగత్తెను నా అమ్మ అని చెప్పకండి. నేను శకుంతలాదేవి అమ్మగారి కడుపున పుట్టకపోయినా...ఆవిడే నా తల్లి. మీరే నా తోడ బుట్టిన అక్కయ్య. నేను మిమ్మల్ని 'అక్కా' అని పిలవచ్చు కదా? నాకు ఆ హక్కు ఇస్తారు కదా?"

జాలితో తన మొహం వైపి చూసి అడిగిన జానకిని ప్రేమగా చూసింది గాయత్రి.

"ఏమిట్రా అలా అడుగుతున్నావు? నీ నోటితో నన్ను 'అక్కా' అని ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రావే తల్లీ" అంటూ కన్నీటితో రెండు చేతులూ జాపింది

"అక్కా..." అంటూ పిలుస్తూ బిడ్డ తల్లిని కౌగలించుకున్నట్లు జానకి గాయత్రిని తన కౌగిలిలో బంధించింది.

అక్కా-చెల్లెల్ల ప్రేమ వర్షంలో మునిగిపోయిన ఇద్దర్నీ చూస్తూ నిలబడిపోయాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in: PART-22

P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి