23, డిసెంబర్ 2019, సోమవారం

చదివింపు...(కథ)




                                                       చదివింపు...(కథ)

అఫీసులోని స్నేహితులందరికీ పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానించిన సురేందర్ కళ్ళు ఆఫీసు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి.

"మీకు తెలియదా?...అతను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు, పెళ్ళిల్లకూ రాడు. ఎందుకు అనవసరంగా ఒక పత్రికను 'వేస్టు చేయాలి?" అన్నాడు కొలీగ్ గంగాధరం.

అప్పుడే ప్యూన్ ఆంజినేయులు అక్కడికి వచ్చి నిలబడ్డాడు.

సురేందర్ ఒక పెళ్ళి పత్రిక తీసి, దాని మీద అతని పేరు రాసి అతనికి ఇచ్చాడు.

"కచ్చితంగా ఫ్యామిలీతో రావాలి. నా పెళ్ళికి రాలేదంటే...తరువాత మీతో మాట్లాడటం మానేస్తా!"

"వద్దు సార్...మీ పెళ్ళికి కచ్చితంగా వస్తాను" చెప్పాడు ఆంజినేయులు. కానీ అతని మాటల్లో ఉత్సాహం లేదు.

కల్యాణ మండపం ముందు ….ఫ్లెక్సీ బ్యానర్ పై తలతల లాడుతున్నారు కొత్త దంపతులు.

వాళ్ళ కంపెనీ ఏం.డి, జి.ఏం., ప్రొద్దున్నే వచ్చి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారు.

కల్యాణమండపం నిండిపోయింది. ఇంతమంది పెళ్ళికి వస్తారని సురేందర్ అనుకోలేదు. అంతమంది జనం ఉన్నా సురేందర్ కళ్ళు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి.

అదిగో...అతను వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే సురేందర్ కి సంతోషం కలిగింది. తిన్నగా సురేందర్ దగ్గరకు వచ్చిన ప్యూన్ ఆంజినేయులు, సురేందర్ కి ష్యేక్ హాండ్ ఇచ్చి,శుభాకాంక్షలు తెలిపి, చదివింపు కవరును జాపాడు.

“భోజనం చేసిన వెంటనే మీరు వెళ్ళిపోకూడదు. కొంచంసేపు ఉండండి..." అన్నాడు సురేందర్.

రెండు గంటల తరువాత సురేందర్ కి కొంచం రెస్టు దొరికింది. తిన్నగా ప్యూన్ ఆంజినేయులు ఉన్న చోటుకు వచ్చాడు.

"మీరు వచ్చినందకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ, మీ ముఖం వాడిపోయి ఉందేమిటి...ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా?" అడిగాడు.

"అయ్యయ్యో...అదంతా ఏమీ లేదు సార్. నేను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు, పెళ్ళిల్లకూ లేక ఇంకేదైనా పార్టీలకూ వెళ్లను. ‘ఎందుకని?’ అని చాలాసార్లు మీరు నన్ను అడిగారే...? ఇప్పుడు చెబుతాను. ఆఫీసులో పనిచేస్తున్న అందరూ నాకంటే జీతం ఎక్కువ తీసుకునే వారే. వాళ్ళ తాహతకు వాళ్లు పెద్ద పెద్ద చదివింపులు, ఖరీదైన బహుమతులు ఇస్తారు. నేను ఎక్కువగా ఇవ్వగలనా? మహా ఎక్కువగా ఇస్తే ఐదు వందలు. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను.

అలా అంత తక్కువ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో నేను సహజంగా ఉండలేక పోతున్నాను. నేను పెద్ద బహుమతులు ఇవ్వలేకపోతున్నానే అన్న ఇన్ ఫీరియర్ కాంప్లెక్స్ నన్ను సిగ్గున పడేస్తోంది. నన్ను ఫంక్షన్ కు పిలిచిన వాళ్ళు అలా అనుకోరని నాకు తెలుసు. కానీ నాలో అలా ఒక మనోభావం. మిగిలిన వాళ్ళలాగా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. అందుకనే ఎక్కడికీ వెళ్ళకుండా ఉండిపోతాను. ఈ పెళ్ళికి కూడా మీకొసమే వచ్చాను. మీ మనసు కష్టపడకూడదని వచ్చాను"

అతను చెప్పింది విని నవ్వాడు సురేందర్.

"ఇదే కారణమా? …..మీ ఆలొచన చాలా తప్పు. పెళ్ళికి స్నేహితులనూ, బంధువులనూ, తెలిసిన వాళ్లనూ ఎందుకు పిలుస్తున్నాం? అందరూ వచ్చి నోరారా- మనసారా దీవిస్తే మనం బాగుంటాం...మన జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతాం. కల్యాణ వేదిక అనేది అభిమానాన్ని, ప్రేమను బయటకు చూపాల్సిన చోటు. ఆస్తి, అంతస్తులను చూపించే చోటు కాదు"

అతను చెబుతుంటే అతన్నే చూశాడు ఆంజినేయులు.

"ఇదిగో నా పెళ్ళికి ఇంతమంది వచ్చారే, వాళ్ళందరూ నిజంగా నా కోసమే వచ్చారా? లేదు...నా పదవి చూసి వచ్చారు! కానీ నాకోసం వచ్చింది మీరు మాత్రమే...ఏదీ ఆశించకుండా...నేను బాగుండాలని, సంతోషంగా జీవించాలని ప్రేమతో ఆశీర్వదించటానికి వచ్చారు. ఈ విషష్, ఆశీర్వాదం డబ్బు కంటే చాలా గొప్పవి. వెలకట్టలేని బహుమతి, అతిపెద్ద చదివింపు. ఇదే నాకు కావాలి. నేను మాత్రం కాదు...ఇంటి విషేషాలకు పిలిచే అందరూ ఇలాగే ఆలొచిస్తారు.. ఇలాగే ఎదురు చూస్తారు...." ఆ మాటలు విన్న ప్యూన్ ఆంజినేయులు సిగ్గుతో తలవంచుకున్నాడు. అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు.

"మీరూ, మీ భార్య ఎటువంటి సమస్యలూ లేకుండా వందేళ్ళు సంతోషంగా జీవించాలి" ఎమోషనల్ అయిన ప్యూన్ ఆంజినేయులు రెండో మారు అతన్ని విష్ చేశాడు.

“వచ్చే వారం సేల్స్ డివిజన్లో పనిచేస్తున్న ప్రభాకర్ ఇంటి విషేషం ఉంది...దానికి వెళ్ళాలి" అనుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు ప్యూన్ ఆంజినేయులు.

*******************************************సమాప్తం**********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి