25, డిసెంబర్ 2019, బుధవారం

శపించబడ్డ గ్రామం...(మిస్టరీ)



                                                     శపించబడ్డ గ్రామం

రాజస్తాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని కుల్ధర. ఇది జైపూర్ పట్టణానికి పడమటి దిక్కులో సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని చుట్టుపక్కల మరో 83 గ్రామాలు ఉండేవిట. ఒకప్పటి సుభిక్షమైన, కళకళలాడే ఈ గ్రామం ఇప్పుడు పరిత్యజించిన ప్రదేశంగా, ఎడారిగా మారిందట.

ఒకప్పుడు, అంటే 1825 వరకు కుల్ధర గ్రామం అత్యంత సంపన్న గ్రామంగా ఉండేది. అక్కడ 1500 పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఎడారిగా ఉన్నా, తమ గ్రామంలోనూ కొత్త సాంకేతికంతో ఎక్కువ నీరు కావల్సిన గోధుమ పంటను పండించేవారు. ఎడారిలో, అందులోనూ నీరు ఎక్కువ కావలసిన పంటైన గోధుమను ఎలా పండిస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఆ పంట వలనే వారంతా సంపన్నులయ్యేరట.

500 సంవత్సరాలుగా నివాసముంటున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు 1825 వ సంవత్సరం ఒక రోజు రాత్రి నుండి కనిపించకుండా పోయారట. కుల్ధర గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా ఆ గ్రామానికి చుట్టూ ఉన్న 83 గ్రామ ప్రజలూ మాయమయ్యారట. వారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏమైపోయారు అనేది ఈనాటికీ మిస్టరీగానే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎటువంటి భూకంపమూ రాలేదు. అగ్నిపర్వతమూ బద్దలవలేదు.

అక్కడి ప్రజలు మాయమవటానికి కారణాన్ని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. కానీ వారు మాయమవటానికి కొన్ని కథలు చెప్పుకుంటారు. అందులో చాలామంది చెప్పేది ఒకే కథ. అప్పట్లో జైసల్మేర్ జిల్లాను పరిపాలిస్తున్న ప్రభుత్వ మంత్రి సలీం సింగ్ ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఆ గ్రామ పెద్ద యొక్క అందమైన కుమార్తెను చూసి ఆమెను పెళ్ళాడ దలచి, ఆ మాటను ఆమె తండ్రి, అప్పటి గ్రామ పెద్దకు చెప్పి, ఒకవేళ పెళ్ళికి అంగీకరించని పక్షంలో ఆ గ్రామ ప్రజలందరూ ప్రభుత్వానికి అత్యధిక పన్ను కట్టాలని ఆజ్ఞ వేసేడట. వారు అధిక పన్ను కట్టక, పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఆ గ్రామ ప్రజలను కృరమైన పద్దతులతో బాధలు పెట్టాడట. అనైతికంగా ప్రవర్తించాడట. అందువలన అక్కడి ప్రజలు కోపంతో ఆ గ్రామాలు వదిలి వెళ్ళారట.


అసలు కథ.

గ్రామాన్ని విడిచి వెడుతున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు శపించి వెళ్ళారట. 'మేము శుభిక్షం చేసిన ఈ గ్రామంలో మేము తప్ప ఇంకెవరూ నివశించకూడదు అని. ఈ శాపాన్ని ఖాతరుచేయని కొందరు ఆ గ్రామానికి వచ్చి పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు వదిలిపెట్టిన ఇళ్ళను స్వాధీనం చేసుకుని అక్కడ నివశించడానికి ప్రయత్నించారట. కానీ అలా చేసిన వారెవరూ కొన్ని రోజుల కంటే బ్రతకలేదట. కొద్ది సంవత్సరాల తరువాత ఈ శాపం గురించి తెలిసిన కొంతమంది ధైర్యం చేసి ఈ గ్రామానికి వచ్చారట. వారందరూ కూడా కొద్ది రోజులలోనే మరణించారట. అప్పటి నుండి ఈ గ్రామానికి రావడానికి అందరూ భయపడ్డారు. ఎవరూ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఆ గ్రామంలో చనిపోయిన వారందరూ ఇంకా అక్కడే సంచరిస్తున్నారట.


ఆ గ్రామానికి వచ్చి నివసిద్దామనుకునే వారు కొన్ని రోజులకే చనిపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

విషయం తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్తలు ఆ గ్రామానికి వచ్చి పరిశోధనలు నిర్వహించారు. అందరూ అక్కడ రకరకాల శబ్ధాలు వినబడుతున్నాయని, ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుందని తెలిపారు గానీ అవేమిటో చెప్పలేకపోయారు. ఒక్క రాత్రి అక్కడ ఉండటం మంచిది కాదని, ప్రాణాంతకమని మాత్రం తెలిపారు. 2013లో ఢిల్లీకి చెందిన పారానార్మల్ సొసైటీ వారు ఆ గ్రామంలో ఏదో అసాధారణమైన శక్తి ఉన్నదని చెబుతూ అదేమిటో పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గౌరవ్ తివారీ నాయకత్వంలో 18 మంది కలిగిన రీసెర్చ్ గ్రూప్, ధైర్యమున్న 12 మంది సాధారణ మనుషులను తీసుకుని కుల్ధర గ్రామానికి వెళ్ళి ఒక రాత్రంతా గడిపి నిజమేమిటో తెలుసుకురావాలని ఆ గ్రామానికి వెళ్ళారు.


ఆ రాత్రంతా వింత చర్యల అనుభవంతో భయానక గంటలు గడిపారు. అత్యంత ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో వెళ్ళిన వారికి ఆ గ్రామంలో ఏవో కదులుతున్న నీడలూ, మాటలూ, అరుపులు, నవ్వులూ, ఏడుపులూ వినిపించడమే కాకుండా వారి కార్ల మీద చేతి ముద్రలు కనిపించాయట. వెళ్ళిన కొంత మందికి తమల్ని ఎవరో తాకిన అనుభవం కలిగిందట. వారి దగ్గరున్న పరికరాలలోని కె-2 మీటర్ మూలం అక్కడి వాతావరణ ఉష్ణొగ్రతని రికార్డు చేశారు. కొన్నిచోట్ల 41-C గానూ, కొన్ని చోట్ల 31-C గానూ చూపించిందట. వాడిన లేజర్ పరికరంతో కదిలే నీడలను చూశారట. అక్కడ నుండి తిరిగి వచ్చిన రీసెర్చ్ గ్రూపులోని కొందరు "ఇంత భయానకమైన రాత్రిని మేము ఎప్పుడూ గడపలేదు" అని తెలిపారట.


1826 నుండి ఇప్పటి వరకూ ఆ 85 గ్రామాలూ ఖాళీగానే ఉన్నాయి. ఆనాతి ఇళ్లు శిధిలాలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. పల్వాలీ కుటుంబాలు రక్షాబంధన్ రోజున గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళినందువలన దేశంలో పలుచోట్ల నివశిస్తున్న కొన్ని పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు రక్షాబంధన్ పండుగను జరుపుకోరట.

Images Credit: To those who has taken the original photos. ***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి