2, డిసెంబర్ 2019, సోమవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-11
                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                           (PART-11)


ఆ రోజు ఆదివారం. షాపుకు సెలవు కనుక వరుణ్ ఇంట్లోనే ఉన్నాడు. అత్తయ్య, మామయ్యా విజయవాడకు వెళ్ళారు...కనక దుర్గ అమ్మవారికి చీర ఇవ్వాలని!

‘వరుణ్ తో మాట్లాడటానికి ఇదే మంచి సంధర్భం!’… అతను ఎప్పుడు భొజనం చేయటానికి వస్తాడో నని కాచుకోనుంది ప్రతిమ. ఆమె సహనాన్ని చాలా వరకు పరీక్షించి రెండు గంటలకు తన గది నుండి బయటకు వచ్చాడు వరుణ్.

అతనికి మంచి నీళ్ళూ, కంచం పెట్టింది. పెళ్ళి మాట ఎత్తిన తరువాత ప్రతిమతో మాట్లాడటానికే సిగ్గు పడి ఆమెకు దూర దూరంగా వెళ్ళాడు వరుణ్. ఇప్పుడు కూడా ఏదో ఒక బిడియంతో కంచం ముందు కూర్చున్నాడు వరుణ్. వరుణ్ భోజనం చేసి ముగించేంత వరకు ప్రతిమ ఏమీ మాట్లాడ లేదు.

అతను చేయి కడుక్కుని వెడుతున్నప్పుడు "ఒక్క నిమిషం" అన్నది ప్రతిమ.

"ఏమిటి ప్రతిమా...ఏదైనా చెప్పావా?"

"నీ దగ్గర కొంచం మాట్లాడాలి"

"నా దగ్గర ఏం మాట్లాడాలి...?"

"చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పింది విని, మీరు తీసుకోబోయే నిర్ణయంలో ముగ్గురి జీవితాలు అధారపడి ఉన్నాయి"

'ఇదేమిటి చిక్కు ముడి మాటలు’ అనే లాగా ఆమెను చూశాడు వరుణ్.

"నేను నీతో పెళ్ళికి సంతోషంగా అంగీకరించలేదు వరుణ్. అత్తయ్యకోసమే అంగీకరించాను...వేరే దారి లేక!"

వరుణ్ దిగ్భ్రాంతితో ఆమెను చూశాడు. ప్రతిమ తనకూ-కిరణ్ కు ఉన్న ప్రేమ గురించి...ఆ తరువాత వరుసగా జరిగిన విషయాల గురించీ సంగ్రహంగా చెప్పి ముగించింది.

"నేను చేసేదంతా తప్పా...రైటా నాకే తెలియటం లేదు! పెళ్ళి ఆపాలని ఇది చెప్పటం లేదు. మనకు పెళ్ళి జరగాలని ఆ దేవుడు నిర్ణయించి ఉంటే...ఆ పెళ్ళి జరగటానికి ముందు ఈ నిజాన్ని చెప్పేస్తే ఒక భారం తగ్గించినట్లు అవుతుందని అనుకున్నాను...చెప్పేశాను. ఇక మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నాను"

చెప్పటం ఆపిన ప్రతిమ వరుణ్ ని చూసింది.

వరుణ్ కదలక మెదలక కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.

కొద్ది సమయం తరువాత కళ్ళు తెరిచి ఆమెను సుదీర్ఘంగా చూసి సన్నని కంఠముతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

"నీ మనసు విప్పి ముందుగానే అన్ని నిజాలూ చెప్పినందుకు చాల ‘ధ్యాంక్స్’ ప్రతిమా. నువ్వు చెప్పినట్లు ఇది నిజంగానే పెద్ద చిక్కు సమస్యే! నేను ఎలాంటి నిర్ణయానికి రావాలో ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. చాలా ఆలొచించాలి. నాకు రెండు రోజులైనా అవకాశం ఇవ్వు.

'ఈ పెళ్ళి జరిగితే మంచిదేనా?' అని ఆలొచించి నా నిర్ణయం చెప్తాను. అంతవరకు పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూ ఉండనీ. దేనినీ ఆపటానికి ప్రయత్నం చేయొద్దు. అమ్మ ఆరొగ్యం గురించి కూడా మనం ఆలొచించాలి. ముళ్ళ పొదల మీద పడ్డ పూలమాలను తీయాలంటే అవసరపడకూడదు. జీవితం కూడా పూలమాల లాంటిదే..."

వరుణ్ ఆలొచించి మాట్లాడుతుంటే ...ప్రతిమ అతన్నే చూస్తూ నిలబడింది.

అత్తయ్యా, మామయ్యా తిరిగి రావటానికి రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది.

"అక్కడే పెళ్ళి బట్టలు కూడా కొనేశాము. అంత దూరం వెళ్ళి పట్టు చీరలు కొనుక్కు రాకుండా ఉండటానికి మనస్కరించలేదు...చీరలన్నిటినీ చూడు ప్రతిమా".

అత్తయ్య అట్ట పెట్టెలను తీసి సోఫాలో ఉంచింది. ప్రతిమ ఏ విధమైన చలనం లేకుండా యంత్రంలాగా పెట్టెలను తెరిచింది. చీరల రంగులు, రకాలు ప్రతిమ కళ్ళను జిగేలు మనిపించింది. అత్యంత ఉన్నత, నాణ్యత, అధిక ఖరీదు! పెళ్ళి కొడుకు కిరణ్ అయ్యుంటే ఇదే చీరలను సంతోషంగా చూసుండేది.

"బాగున్నాయి అత్తయ్యా" ఒక్క మాటతో చెప్పి చీరలను మళ్ళీ పెట్టెల్లో పెట్టి మూసింది.

"నువ్వెప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెల్తావు?" ప్రతిమను అడిగింది అత్తయ్య.

"రెండు సార్లు 'ఫోన్ చేశాను అత్తయ్యా. రింగ్ అవుతూనే ఉంది. ఎవరూ తీయటం లేదు. ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. వాళ్ళకు వస్తున్నట్టు తెలియచేయకుండా ఎలా వెళ్ళను?"

"ఇప్పుడు ఫోన్ చేసి చూడు. ఉంటే గనుక...రేపొచ్చి మాట్లాడతానని చెప్పు"

ప్రతిమ టెలిఫోన్ తీసింది. అదే సమయం వరుణ్ తన గదిలో నుండి ఎక్స్ టెన్షన్ ఫోన్ లో నుండి ప్రతిమతో మాట్లాడాడు.

"ఆ అమ్మాయికి ఫోన్ చేయొద్దు ప్రతిమా. ఇప్పుడు కూడా రింగ్ అవుతూనే ఉన్నది, ఎవరూ తీయటం లేదని అమ్మకు సర్ధి చెప్పేయి. ఇంకో రెండు రోజులు అమ్మని ఎలాగో అలా నమ్మించు"

ప్రతిమ ఫోన్ పెట్టేసింది.

"ఏమిటో అర్ధం కావటం లేదు అత్తయ్యా... ఫోన్ తీయటమే లేదు"

"ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరో ఎమో? ఒక సారి నేరుగా వాళ్ళింటికే వెళ్ళు. చెప్పకుండా వచ్చావేమిటని గొంతు మీద చెయ్యి వేసి తరిమేయరు కదా?"

వరుణ్ తన గదిలో నుండి వచ్చాడు.

"ఎందుకమ్మా ప్రతిమను పంపుతున్నావు? నేనే వెళ్ళొస్తాను"

"నీకు మాట్లాడటం చేతకాదురా?"

"నాకూ మాట్లాడటం వచ్చు! రేపు నేనే వెళ్లొస్తాను "- వరుణ్ కచ్చితంగా చెప్పి వెళ్ళిపోయేటప్పటికి...వాడ్ని విచిత్రంగా చూసింది అత్తయ్య.

చెప్పినట్లే మరుసటి రోజు ప్రొద్దున్నే బయలుదేరి ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళిన వరుణ్, అటు నుంచి తిన్నగా షాపుకు వెళ్ళి మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు.

"ఏరా...వాళ్ళున్నారా? ఫోన్ రిపేరంటనా? ఏం చెప్పారు?" అత్తయ్యా ఆశగా అడిగింది.

"అందరూ ఉన్నారు...ఆ అమ్మాయి కూడా ఉన్నది!"

"నువ్వు విషయం చెప్పావా? ఆరు నెలల తరువాత పెళ్ళి పెట్టుకుందామని నువ్వు చెప్పావా...?"

"అది చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు"

"నువ్వు చెబుతున్నదేదీ అర్ధం కావటం లేదు?"

"వచ్చే వారం ఆ అమ్మాయికి నిశ్చయ తాంబూలాలుట. పెళ్ళి కొడుకు ఎం.బి.ఏ...లండన్లో ఉద్యోగమట"

వరుణ్ ను ఆశ్చర్యంగా చూసింది అత్తయ్య.

“మనం ఆ అమ్మాయిని వద్దని చెప్పనే లేదే! మరి మళ్ళీ ఎలా తాంబూలాలు?"

"నువ్వు చెప్పలేదు! కిరణ్ అమెరికా నుంచి ఫోన్ చేసి 'వద్దు’ అని చెప్పాడట. వాడు అలా చెప్పటంతో రోషం పెరిగి వెంటనే ఇంకో పెళ్ళికొడుకును చూసి సంబంధం ఖాయం చేసుకున్నారట"

మోసమూ, అవమానమూ 'కిరణ్ ఇలా చేశాడే?' అనే బాధ ఒకటిగా చేరటంతో...శిలలాగా కూర్చుండిపోయింది అత్తయ్య.

"నువ్వు చేసింది తప్పమ్మా! వాడికి ఇష్టం లేని అమ్మాయిని ఎందుకు నిశ్చయం చేయటానికి తొందర పడుతున్నావు?"

"కన్న తల్లికి ఆ అధికారం కూడా లేదంటావా? నేను చెబితే నువ్వు వినటం లేదా? అదే లాగా వాడూ నేను చెప్పేది వింటాడు అనుకున్నాను"

"ఐదు వేళ్ళూ ఒకేలాగ ఉన్నాయా? అయ్యిందేదో అయ్యింది...వదిలేయ్. నేను ఫోన్ చేస్తాను. సమాధానంగా మాట్లాడి వాడ్ని పెళ్ళికి పిలుస్తాను. 'నీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్ళి చేసుకో. అది నీ ఇష్టం' అని చెప్పు. వాడు రాకుండా నాకు పెళ్ళి వద్దు. ఉన్నది ఒక తమ్ముడు. వాడు లేకుండా ఎలా? వాడు పెళ్ళికి రావాలమ్మా. నేను చెప్పేది ఒకటేనమ్మా , ఒకటి వాడు పెళ్ళికి రావాలి. లేకపోతే...వాడు ఎప్పుడొస్తాడో అప్పుడే నా పెళ్ళి"

వరుణ్ ఇంత ఉద్రేకంగా, గట్టిగా, నిర్ణయం తీసుకుని మాట్లాడటం ఇంతవరకు ఎవరూ చూడలేదు! ఇల్లే అతన్ని ఆశ్చర్యంగా చూసింది. 'మాట్లాడేది వరుణేనా?' అనే భ్రమలో పడిపోయింది ప్రతిమ. అదే సమయం కిరణ్ వస్తేనే నా పెళ్ళి జరుగుతుంది అని అతను చెప్పటానికి అర్ధమేమిటో అర్ధంకాక తికమకపడింది ప్రతిమ.

****************************************************************************************************                                    ఇంకా ఉంది.....Continued in: PART-12

3 కామెంట్‌లు:

  1. మీ పోస్ట్లు అప్పుడప్పుడు చూస్తాను మీరు బాగా రాస్తారు మీ కు తెలుగు సాహిత్యం లిరిక్స్ కావాలంటే Telugu Lyrics ఈ వెబ్సైటు ను ఒక సారి చూడండి Visit Aarde Lyrics

    రిప్లయితొలగించండి