4, జూన్ 2020, గురువారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-14



                                      గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                          (PART-14)


బయటకు వచ్చిన వాళ్ళిద్దరూ కారులో ఎక్కారు. కారును వేగంగా తీసాడు వీరబద్రం. అతను ఏదో గందరగోళంలో ఉన్నట్టు అర్ధం చేసుకున్నాడు కార్తిక్.

"ఏమిటి బద్రం...సర్పంచును చూసిన దగ్గర నుండి నీలో గందరగోళం ఎక్కువ కనబడుతోంది...?"

"నీకు లేదా?"

"గందరగోళ పడటానికి ఏముంది... నేను చూసినప్పుడు సాధారణంగా ఉండేవారు. ఇప్పుడు కొంచం దర్జాగా కనబడుతున్నాడు. ఇల్లు కూడా బాగా మారింది"

"అంతేనా?"

"అంతేనా అంటే?"

"ఆయన చాలా తప్పులు చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది..."

"తప్పులా?"

"అవును..."

"ఎలా చెబుతున్నావు?"

"పేరుకు మాత్రమే సర్పంచ్. కాంటాక్టులు తాయ్లాండ్ వరకు ఉన్నాయి. మనం జ్యూస్ తాగామే...ఆ గాజు గ్లాసు ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?"

"యాభై రూపాయలు ఉంటుందా?" అన్నాడు కార్తిక్.

అది విన్న వీరబద్రం నవ్వాడు. “వెయ్యి రూపాయలకు తక్కువ ఉండదు." అని అనగానే...గుండె గుభేలు మంది కార్తిక్ కి.

"నిజంగానా బద్రం...?"

“నేను ఐ.టీ. కంపెనీలో పెద్ద పదవిలో ఉన్నాను. చాలా రకాల పార్టీలకు వెళ్ళొస్తాను. చెబితే నమ్ము"--- వీరబద్రం చెప్పి ముగించగానే ఇంటి ముందు ఆగింది కారు.

కారు దిగారు......ఈ సారి వీధిలో ఉన్నవారు వేడుక చూసారు.

దాన్ని పట్టించుకోకుండా లోపలకు వెళ్ళారు.

"రేయ్...గాలిదేవుడ్ని మనసులో ప్రార్ధించుకుంటూ వెతుకు. లేకపోతే మళ్ళీ ఆ పాము తిరిగి వస్తుందేమో"-- హెచ్చరించాడు కార్తిక్.

"రానీ...ఈ సారి దానికి పరలోకం ఖచ్చితం"---అంటూ సెల్ ఫోనును వెతుక్కుంటూ ఇంటి మధ్య బాగం దగ్గరకు వెళ్ళాడు వీరబద్రం.

అంతకు మునుపు అక్కడ చదునుగా చూసిన కడప రాయి...ఈ సారి తిరిగి పడుంది. దాన్నే తధేకంగా చూస్తున్నాడు వీరబద్రం.

"ఏమిటి ఆ రాయినే అంత దీర్ఘంగా చూస్తున్నావు! త్వరగా నీ సెల్ ఫోనును వెతుకు. కావాలంటే నేను నీ నెంబర్ కు ఫోన్ చేస్తాను. సౌండ్ వస్తుంది కదా?"

"చెయ్యి..."

కార్తిక్, వీరబద్రం నెంబర్ కు డయల్ చేయగా, ఒక పొదలో నుండి 'రింగ్ టోన్’ వినబడింది.

వెళ్ళి తీసుకు వచ్చాడు.

"హమ్మయ్య...దొరికింది..." అంటూ రిలాక్స్ అయ్యాడు వీరబద్రం.

"సరి...సరి...బయలుదేరు. ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండ కూడదు..."--అర్జెంట్ చేశాడు కార్తిక్

"పోరా పిచ్చోడా...ఇకపైనే మనకి ఇక్కడ ఎక్కువ పని ఉంది"

"ఏం చెబుతున్నావు?"

"నువ్వొక భయస్తుడివి! ఒకే చూపుగా పయనిస్తావు..."

"నువ్వు మాట్లాడేది అర్ధం కాలేదు..."

"ఎలా అర్ధం అవుతుంది? భయం, స్వార్ధం, మూర్ఖత్వం నిండిపోయినప్పుడు...ఏదీ అర్ధం కాదు. సరే కానీ...నాతోరా..."

"ఎక్కడికి?"

"అరే రమ్మంటుంటే…"--కసురుకుంటూ ఇంటి మధ్య భాగం దగ్గరకు తీసుకు వెళ్లాడు.

"ఇక్కడేముంది?"

చూశాడు కార్తిక్. కానీ, ఏమీ కనబడలేదు

"వంగుని కడప రాయిని చూడు"

"దానికి ఏమిటిప్పుడు?"

"బాగా చూసి చెప్పరా..."

"హు...చూశాను"

"ఏం చూసావు?"

"రాయిని..."

"కర్మరా...! నువ్వు ఇంతకు ముందు ఈ రాయిని చూసినప్పుడు ఈ రాయి ఎలా ఉంది...ఇప్పుడెలా ఉంది?”

"రాయి ఎప్పుడూ రాయిలాగానే ఉంటుంది?"---కిందకు మరోసారి చూసి సన్నని స్వరంతో అన్నాడు.

"సరిగ్గా చూడరా? రాయి దిశ మారి ఉన్నట్టు లేదూ? రాయి యొక్క నున్నటి వైపు కింద వైపుకూ ఉన్నది..." అన్నాడు….."అది మాత్రమే కాదు...కూర్చుని వాసన చూడు".

వంగుని వాసన చూశడు కార్తిక్. తరువాత "వాసన వస్తోంది" అన్నాడు.

"ఏం వాసన?"

"లావెండర్"

"ఇదే వాసన ఆ సర్పంచ్ మీద కూడా వచ్చిందే! జ్ఞాపకముందా?"

"ఓ నువ్వు అలా ఆలొచిస్తున్నావా? అంటే ఆయన ఇక్కడకు వచ్చుంటాడంటావా?"

"గట్టిగా చెబుతున్నాను...వచ్చాడు...రాయి తీసాడు. తిరిగి వెడుతున్నప్పుడు రాయిని మార్చి పెట్టాడు. అంతే కాదు అతనే నీపై పాము విసిరేసింది. మీ అమ్మా-నాన్నలకు జరిగిన కారు యాక్సిడెంట్ కు కూడా కారణం ఆయనే"

"బద్రం..."

"ఏమిటీ....రుజువు కావాలా? నాకు ఒకే ఒక నమ్మకమే! దేవుడు ఎప్పుడూ ఇంత 'చీప్' గా బెదిరించడు. మీ తప్పును మీరు తెలుసుకోవాలని గాలిదేవుడు నిర్ణయించుకో నుంటే ఇలా పామును ఎగరేసి బెదిరించక్కర్లేదు. మీ నాన్న కలలో కనబడి 'వద్దు’ అని చెప్పుంటేనే చాలు. మీ నాన్న వణికిపోయేవాడు. ఇదంతా గాలిదేవుడనే దేవుడు ఉండుంటే..! ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడో...లేడో! ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం. ఈ కడప రాయి కింద ఖచ్చితంగా ఏదో ఉంది. అదేమిటో నేను చూసేస్తే ఖచ్చితంగా లేక్క వేసేస్తాను" మాట్లాడుతూ వేగంగా రాయిని తీసి పక్కన పడేసాడు. చుట్టూ చూసాడు. గోడ చివర్న ఒక పలుగు కనబడింది.

ఆ పలుగు తీసుకుని తవ్వటం మొదలుపెట్టాడు. కార్తికుకు అంతా ఒక కలలాగా ఉంది. కొన్ని అడుగుల లోతులో ఒక చెక్క పెట్టే కనబడింది. దాన్ని ముట్టుకుని తెరిచి చూస్తే, గుండె అడ్డుపడింది. లోపల తలతల మని మెరుస్తున్న బంగారు బిస్కెట్లు. అన్నిటి మీద విదేశీ ముద్ర.

"బద్రం...!"

"చూడరా...అంతా అక్రమ బంగారం! మీ సర్పంచ్ పని దొంగ వ్యాపారం. అతనింట్లో చూశామే ఒకడ్ని...వాడే ఆయన అక్రమ వ్యాపారానికి ఏజెంటై ఉంటాడు. మామూలుగా అక్రమంగా రవణా చేసిన రహస్య బంగారాన్ని చాలా చాలా సీక్రెట్ ప్రదేశంలోనే ఉంచాలి. ఈ ఊర్లో పాడుపడిన, ఎవరూ రాలేని ఈ ఇల్లు...దానికి బాగా ఉపయోగపడింది. దానికి తోడు గాలిదేవుడి ఇల్లు అనే ఆనవాలు వేరే! సర్పంచ్ పెద్ద క్రిమినల్ రా....మీ మొక్కూ...ప్రార్ధన తనకు లాభంగా ఉపయోగించుకున్నాడు. ఒక విధంగా తెలివితేటలు గలవాడే!

గాలిదేవుడు నిజంగా ఉండుంటే...ఇతన్ని ఎప్పుడో శిక్చించే వాడు. కానీ గ్రామ ప్రజల నమ్మకం వేరేలాగా ఉన్నది. అదే సర్పంచ్ బలం...పెద్ద క్రిమినల్ కదా...? గొప్ప ఆట ఆడాడురా"

వీరబద్రం చెబుతూ వెడుతుంటే కార్తికుకు సిగ్గేసింది--కోపం వచ్చింది. తాను ఎంత మోసపోయేనో అనేది అతనికి బాగా అర్ధమయ్యింది.

"ఏమిట్రా బద్రం...మౌనంగా ఉన్నావు? ఇప్పుడేం చేద్దాం?"

"ఈ విషయాలు తెలుసుకున్న మనం, ఇప్పుడు చేతులు ఊపుకుంటూ వెళ్ళలేము. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో తెలుసుకోవటానికి ఇక్కడ ఏదైనా కెమేరా పెట్టి చూస్తూ ఉండొచ్చు. ఈ నిజం నీ బామ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో ఆలొచించి చూడు..."

వీరబద్రం చెబుతుంటే కార్తిక్ కు గొంతు ఎండిపోయింది.

"మీ బామ్మకు ఎంత నమ్మకమోరా? కానీ, ఆవిడ నమ్మకాన్ని ఉపయోగించుకుని ఇక్కడ ఒకడు దొంగతనాలు చేయడానికి మీ ఇంటిని వాడుకుంటున్నాడు. ఇదేరా ఇవాల్టి లోకంలోని పరిస్థితి, లక్షణం. దీన్ని నాలాంటి వాడు ఎత్తి చూపితే...వాడు మూర్కుడు. నమ్మకం లేని బుద్ది హీనుడు అని చెప్పేస్తారు!"

"చాలు బద్రం! ఇక నేను ఓర్చుకోలేను. ఆ సర్పంచును..."

"ఏమిటి పళ్ళు కొరుకుతున్నావు? నీ వలన అతన్ని ఏమీ చేయటం కుదరదు. ఇంకమీదటే మనకు ఆపద ఎక్కువ. పారేసుకున్న సెల్ ఫోను కే నేను థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే ఇంతపెద్ద నిజం తెలిసుండేదా?"

"సరే...ఇప్పుడేం చేద్దాం?"

"చెబుతాను" అన్నాడు వీరబద్రం.

                                                                           (ఇంకా ఉంది...చివరి భాగంలో) ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి