24, జూన్ 2020, బుధవారం

స్నేహితురాలు...(కథ)                                                   స్నేహితురాలు
                                                             (కథ)


వేకువజాము. 5 గంటలు. అది శ్రీనివాసపురం గ్రామం.

ఇంటి ముందు నీళ్ళు జల్లి, ముగ్గు వేస్తున్న భావనా, నాలుగిల్ల తరువాత ఉన్న మీనా తనను పిలవటం విని తిరిగి చూసింది.

"ఏయ్ భావనా...ఈ రోజు త్వరగా లేచినట్లున్నావు! ప్రొద్దున్నే గుడికి వెళ్ళొద్దామా?" తల జుట్టును సరి చేసుకుంటూ అడిగింది.

"ఓ...ఈ రోజు శుక్రవారం కదా! వెల్దాం..."--చెబుతూ కొంచంగా పేడ తీసుకుని ఉండలుగా చేసి వాటిపైన ఒక మందార పువ్వు గుచ్చి రంగు ముగ్గు మధ్యలో పెట్టింది.

భావనానూ, మీనానూ చిన్న వయసు నుండి స్నేహితులు. ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుకున్నారు. మీనాకి అదే గ్రామంలో వరుడ్ని చూసి పెళ్ళి చేయటంలో భావనాకు ముఖ్య పార్టు ఉంది.

ప్రాణ స్నేహితురాళ్ళు ఇద్దరికీ పిల్లలు లేరు అనేది బాధపడే సమాచరమైనా, ఇద్దరికీ సఖ్యత ఉండేది.

వేగ వేగంగా ఇంటి పనులు ముగించుకుని, భర్త రామూకి టిఫిన్ బాక్సులో భోజనం రెడీ చేసి పెట్టేసింది. ప్రొద్దుటికి టిఫిన్ చేయటం మొదలు పెట్టింది భావనా.

కాఫీ తాగుతూ ఆ రోజు పేపర్ను చదువుతున్నాడు భర్త.

అతని ప్యాంటూ, షర్టు లను ఇస్త్రీ చేసి రెడీగా ఉంచింది.

అతను హడావిడిగా ఆఫీసుకు బయలుదేరటానికి రెడీ అవుతున్నాడు.

"ఏమండీ...ఈ రోజు ప్రొద్దున మీనాతో దుర్గ గుడికి వెళ్ళొస్తాను" అంటూ అనుమతి అడిగింది.

"వెళ్ళిరా..." అంటూ తల ఊపి ఉద్యోగానికి బయలుదేరాడు.

ప్లాను ప్రకారమే మీనా, భావనా ఇద్దరూ గుడికి వెళ్ళి తిరిగి వచ్చారు. దార్లో బిచ్చగాళ్ళు.

"మీకు మగపిల్లాడు పుడాతాడమ్మా..." అన్న ఒక బిచ్చగాడికి యాభై రూపాయలు బిచ్చం వేసింది భావనా.

మీనాకి ఆశ్చర్యం వేసింది. 'భావనాకు బిచ్చగాళ్ళంటేనే నచ్చదు. మరి ఈ రోజు ఏమిటీ?' అని ఆలొచించింది.

భావనా యొక్క నిరాశ నిట్టూర్పుగా బయటకు వచ్చింది.

"ఆ బిచ్చగాడు దైవవాక్కు లాగా ఏం మాట చెప్పాడో విన్నావా మీనా" తన వివరణ ఇచ్చింది.

ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు.

భావనా తలుపులు మూసేసి ఏ.సి. ఆన్ చేసుకుంది. మంచం మీద పడుకుంది. అలాగే నిద్రలోకి జారుకుంది.

'కాలింగ్ బెల్’ శబ్ధం విని గబుక్కున కళ్ళు తెరిచింది. గోడ గడియారం వైపు చూసింది. టైము మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు.

ముఖం తుడుచుకుని, బోట్టు సరి చేసుకుని, చీర కొంగును బాగా లాగి దోపుకుని తలుపు తెరిచింది.

ఒక అబ్బాయి, ఒకమ్మాయి భుజాల మీద సంచులు తగిలించుకుని గుమ్మం బైట నిలబడున్నారు. చేతిలో కొన్ని ప్రకటన కరపత్రాలు.

భావనా చూసిన చూపులకే వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు.

"అక్కా...మేము ఒక 'స్పేషల్’ వైద్య పద్దతి గురించి ప్రచారం చేస్తున్నాం. దాని గురించి మీతో ఒక పది నిమిషాలు మాట్లాడ వచ్చా...?"

"అదంతా ఏమీ అవసరం లేదు. మీరు బయలుదేరండి. ఇక్కడ అందరూ ఆరొగ్యంగానే ఉన్నారు"---తలుపు మీద చేయి వేస్తూ చెప్పింది భావనా.

"అక్కా...ప్లీజ్! ఈ నోటీస్ అయినా తీసుకుని చదవండి" అంటూ ఒక ప్రకటన కరపత్రాన్ని ఆమెకు ఇచ్చేసి ఇద్దరూ వెనుతిరిగారు.

తలుపు వేసిన భావనా మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాలులో ఉన్న సోఫాలో కూర్చుని ఆ కరపత్రం వైపు చూసింది.

దాన్ని క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టింది భావనా.

'పిల్లల భాగ్యం లేని దంపతులకు 'స్పేషల్’ వైద్య పద్దతిలో చికిత్స’ అనే ప్రకటనను చూసింది.

గబుక్కున సోఫాలో నుండి లేచి తలుపు తీసుకుని ఆ నోటీసు ఇచ్చి వెళ్ళిన వాళ్ళకోసం, వాళ్ళు వెళ్ళిన వైపుకు పరిగెత్తింది.

రెండు వీధులు దాటిన తరువాత వాళ్ళు కనబడ్డారు. వాళ్ళను పిలుచుకుని తన ఇంటికి తీసుకు వచ్చింది.

"పిల్లల భాగ్యం దొరకటానికి చికిత్స అని రాసుందే! దానికి మేము ఏం చేయాలి?"

"చాలా సింపుల్ అక్కా. మీ చేతి నాడి, మీ ఆయన చేతి నాడి పట్టి చూసి, మేము మీకు కావలసిన మందులు ఇస్తాము. రాత్రి పూట పాలను బాగా మరగబెట్టి, అందులో మేము ఇచ్చిన మందును ఒక స్పూన్ వేసి, ఆ పాలను మీరు, మీ ఆయన రోజూ తాగుతూ రావాలి...కొద్ది రోజులకే మంచి మార్పు కనబడుతుంది. ఆ తరువాత పిల్లల భాగ్యమే. ఆ చూర్ణం ఖరీదు వెయ్యి రూపాయలక్కా"

వాళ్ళు చెబుతున్నప్పుడే ఒక పక్క సంతోషం, ఇంకో పక్క సందేహం తలెత్తింది. కానీ వాళ్ళను పూర్తిగా అపనమ్మకంతో చూడలేకపోయింది.

'గుడికి వెళ్ళోచ్చిన కొంచం సమయంలోపే వీళ్ళు వచ్చారు అంటే...అది దేవుడి కరుణే’ అని నమ్మింది. ఎందుకంటే, 12 సంవత్సరాలుగా వాళ్ళు తీసుకుంటున్న వైద్య చికిత్స వాళ్ళకు నీరసాన్నే ఇచ్చింది.

వెంటనే 'మొబైల్’ తీసుకుంది. భర్తకు ఫోను చేసింది.

వివరణ చెప్పింది. "ఒక్కసారి ఇంటికి వచ్చి వెడతారా" అన్నది.

"ఇప్పుడు రాలేను" అని తన అయిష్టాన్ని తెలిపాడు.

అయినా కానీ ఆమె విడిచిపెట్ట దలుచుకోలేదు. తన జీవితంలోని ముఖ్య సమస్యను తీర్చుకోవాలని పట్టుపట్టింది. భర్తను బలవంతం పెట్టింది.

"డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకుని వైద్యం చేస్తున్నారు. ఈ కాలంలో ఏదో చూర్ణం అంటూ అదీ,ఇదీ నమ్మి మోసపోకు. మాట్లాడకుండా ఫోను పెట్టాయి. ప్రశాంతంగా నిద్రపో. అంతా మంచే జరుగుతుంది. ఓ.కే.నా...?"----ఫోన్ కట్ చేశాడు.

ఆమె చాలా బాధ పడింది.

'ఎప్పుడు చూడూ నమ్మకంగా ఉండూ అని చెబుతారే! ఇంతకాలమూ, నమ్మకం లేకుండానా ఉన్నాను?'---మనసులోనే తన బాధను చెప్పుకుంది.

"తమ్ముడూ...మా ఇంటాయన బయట ఊరు వెళ్ళారు. ఇప్పటికి నా నాడి మాత్రం చూసి ఏదైనా మందు ఇవ్వండి" --- భావనా మాటల్లో నిరాశా నిస్పృహ తెలుస్తోంది.

"కుదరుదక్కా. ఇద్దర్నీ చెక్ చేసే మందులు ఇవ్వాలి"

"అలాగా...?" అంటూ విరక్తిగా అడిగింది. కొద్ది నిమిషాలలో ఆ ఇద్దరినీ తీసుకుని తన స్నేహితురాలు మీనా ఇంటికి వెళ్ళింది.

స్నేహితురాలిని పిలిచి చెవిలో విషయం చెప్పింది.

"ఇలా చూడవే...పిల్లల భాగ్యం కలగదా అనే ఆశ నాకూ చాలా ఉన్నది. కానీ, నా చేతిలో వెంటనే వెయ్యి రూపాయలు లేవు. ఆయనకు ఇంకా జీతం రాలేదు. నువ్వుగా నాకు పెద్ద ఖర్చు ఏదీ పెట్టకు..."

"డబ్బు గురించి నేను చూసుకుంటాను. మీరిద్దరూ మొదట చెయ్యి చూపించండి"

వాళ్ళ ముందు భార్యా, భర్తలిద్దరూ చెయ్యి చాపారు.

నాడి పరిశోధించబడింది...ఒక డబ్బాలో నుండి ఒక చూర్ణం, ఇంకో డబ్బాలో నుండి మరొక చూర్ణం తీసి రెండింటినీ కలిపి వాళ్ళకు ఇస్తూ 'ఒక చెంచాడు చూర్ణాన్ని పాలూ, తేనెలో కలిపి తినండి అని వాళ్ళకు చికిత్సా పద్దతి మార్చి చెప్పారు.

మందులకు ఇవ్వాల్సిన డబ్బులు భావనానే ఇచ్చి పంపింది.

"ఎందుకే ఇలా డబ్బును వేస్టు చేస్తున్నావు...! మనం చూడని డాక్టర్లా చెప్పు? వాళ్ళ వళ్ళే కుదరలేదే. అలాంటిది ఇలా రోడ్డు మీద వచ్చి వెడుతున్న అందర్నీ నమ్ముతున్నావు కదే?" ముద్దుగా కోపగించుకుంది మీనా.

“నమ్మకమే జీవితం అనేది కరక్టేనే. నాకు నమ్మకం ఎక్కువగా ఉంది. కరెక్టుగా వాళ్ళు ఇచ్చిన మందును తీసుకోండి. ఆల్ ది బెస్ట్!" బొటను వేలును ఎత్తి చూపింది.

కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.

"అది సరే...నా పరిస్థితే కదా నీకూనూ. అప్పుడు ఈ మందు నువ్వు కొనుక్కోలేదా...?"

"ఆయన ఊర్లో లేరు..." అని చెప్పి, వస్తున్న కన్నీటిని ఆపుకుని ఇంటికి తిరిగి వచ్చింది.

ఆ రోజు రాత్రి....

రామూకి, భావనాను సమాధానపరిచి ఆదరణగా మాట్లాడి, సహజ పరిస్థితికి తీసుకు వచ్చేలోపు నీరసం వచ్చింది.

మరుసటి రోజు తల చుట్టూ తడిగుడ్డ కట్టుకుని ముగ్గు వేస్తోంది. భావనా కొంచం మామూలు పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.

రోజులు గడిచినై. ఎప్పుడూ లాగానే పిల్లల భాగ్యం ఇమ్మని వరం అడుగుతూ గుడిలో ప్రార్ధనలు, వైద్య పరీక్షలు అనీ జరుగుతూనే ఉన్నాయి.

ఒకరోజు ప్రొద్దున 11 గంటలకు కాలింగ్ బెల్ మోగింది.

వాకిట్లో మీనా.

తలుపు తెరిచింది భావనా.

గబగబా లోపలకు దూరిన స్నేహితురాలు, తానే తలుపులు వేసింది.

భావనాని కౌగలించుకుని చెవిలో గుసగుసలాడింది.

"ఈ రోజుతో యాభైయ్యవ రోజు"

భావనా, ఆనందంతో ఏడ్చేసింది. మీనా చేతులెత్తి భావనాకు నమస్కరించింది.

"నాకు దైవమే నువ్వేనే. ఈ వార్తను మొదట నీకు చెప్పాలనే వచ్చాను..." అని చెబుతూ వెడుతుంటే భావనాకి ఆనందం ఎక్కువైయ్యింది.

వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఆ ప్రకటన కరపత్రాన్ని వెతికింది. డ్రాయర్ సొరుగులు, బీరువా అంతా వెతికింది. కానీ ఆమెకు అది దొరకలేదు.

రాత్రంతా రామూతో చెప్పి బాధపడింది.

"నమ్మకంగా ఉండు...మంచే జరుగుతుంది..." ఎప్పుడూ లాగానే సమాధానపరిచాడు.

ఆరోజు మీనా పూర్తి రెస్టులో ఉన్నది. భావనా మాత్రం ఒంటరిగా మార్కెట్టుకు వెళ్ళింది. అప్పుడు.......

"ఏమే భావనా...నీలాంటి మనసు ఎవరికీ రాదే. నీకు దొరికిన ఆ అమ్రుతాన్ని మీనాకి ఇచ్చేసి, ఈరోజు అది గర్భం దాల్చిందటగా! నువ్వు బాగుంటావే. నీకు కూడా అతి తొందరలోనే మంచి జరుగుతుందే" పక్క వీధిలోని పూలకొట్టు బామ్మా పొగడినప్పుడు, ఆమె మనసు రెక్కలు కట్టుకుని ఎగిరింది.

వొళ్ళూ జలదరించింది.

"భగవంతుడా...నా స్నేహితురాలికి మంచి ఆరొగ్యంతో బిడ్డ పుట్టాలి" ---మనసారా ప్రార్ధించింది.

ఆమె ప్రార్ధన వేస్టు అవలేదు. సరిగ్గా పది నెలల తరువాత మీనా, అందమైన మగ బిడ్డను కన్నది. ఆమె కుటుంబీకుల కంటే ఎక్కువ సంతోష పడింది భావనానే. ఊరే ఆమెను ప్రశంసించింది.

మీనా బిడ్డకు బారసాల చేయటానికి ఏర్పాట్లు చేశారు. బారసాలలో బంధువులను, స్నేహితులనూ, చుట్టాలనూ పిలిచి వాళ్ళను దంపతులుగా కూర్చోబెట్టి వాళ్ళ చేతికి బిడ్డని ఇచ్చి ఆశీర్వదించమనటం ఆ గ్రామ ఆచారం.

అదేలాగా అందర్నీ కూర్చోబెట్టారు. భావనా, రామూ దంపతులు కూడా వచ్చారు. మీనా వాళ్ళను స్వాగతించింది.

"భావనా...రా...ఇక్కడ కూర్చో" అని భావనా చెయ్యి పుచ్చుకుని లాకెల్లి కూర్చోబెట్టింది. స్నేహితురాలు సంతోషం పట్టలేకపోయింది.

బిడ్డను ఒకరి తరువాత ఒకరికి ఇస్తూ, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు మీనా దంపతులు.

ఆ కొత్త పువ్వు తన చేతికి ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తోంది భావనా.

సరిగ్గా భావనా దంపతులకు బిడ్డను ఇవ్వటానికి ముందు, ఇంకో దంపతుల దగ్గరున్నప్పుడు....,

"అయ్యయ్యో...బిడ్డ ప్యాసు పోసేసాడు!" అని చెప్పేసి లోపలకు తీసుకు వెళ్ళారు.

భావనా, రామూ వేరే దారి లేక లేచేశారు.

"మంచి కాలం మీనా...తెలివితేటలతో బిడ్డను ఆ భావనా చేతికి ఇవ్వకుండా ఎత్తుకు వచ్చాశావు! పిల్లా పాపలతో ఉన్న దంపతులు ఆశీర్వదిస్తే సుధీర్ఘ ఆయుష్షుతో ఉంటుంది" అని మీనా తల్లి వంటింట్లో మాట్లాడేది బాగా వినబడింది.

భావనా విరిగి పోయింది.

"నా బిడ్డ ఆయుష్షు మీద నాకు అక్కర లేదా? అదే ఎలాగో ఒక నాటకం ఆడి బిడ్డను ఎత్తుకు వచ్చాశాను" అంటూ మీనా జవాబు వాదనను విన్నప్పుడు, స్నేహితురాలికి నాడి ఆగిపోయినట్లు అనిపించింది.

గుంపుగా ఉన్నవారికి తెలియకుండా జారుకుని వచ్చాశారు భావనా దంపతులు.

ఇంట్లోకి వచ్చి తలుపులు వేసింది. పరుపు మీద పడుకుంది. వెక్కి, వెక్కి ఏడ్చింది. ఆమెను సమాధాన పరచలేక రామూ అల్లల్లాడిపోయాడు.

ఆ రోజు రాత్రి భావనా ఏమీ తినలేదు. ఏడ్చి,ఏడ్చి నీరసించిపోయింది. భర్త మెల్లగా అమె తలను ఆదరణగా తనవైపుకు తిప్పుకున్నాడు.

ప్రొద్దున ఎప్పుడూ లాగా కాకుండా ఎనిమిది గంటలకు లేచింది భావనా.

రామూకు ఆశ్చర్యం వేసింది.

పళ్ళు తోముకోవటానికి వెళ్ళిన భావనాకి వాంతి వచ్చేలాగా అనిపించింది. ఎంగిలి ఉమ్మింది...మంచి నీళ్ళు తాగింది...అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది.

రామూ ఆందోళన పడ్డాడు...హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు.

డాక్టర్ పరిశోధించింది.

"నిన్నంతా ఒక పెద్ద సమస్యతో బాధ పడింది డాక్టర్. ఆమె తినకుండా పడుకుంది. అందుకనే కళ్ళు తిరిగినై అనుకుంటా" అంటూ డాక్టర్ వెనుక నిలబడి గొణిగాడు రాము. నవ్వుతూ వెనక్కి తిరిగింది డాక్టరమ్మ.

"కంగ్రాచ్యులేషన్స్...."----నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.

"మీరు నాన్న కాబోతున్నారు. ఒక బిడ్డకు కాదు. కవల పిల్లలకు"

రామూ సంతోషంతో ఎగిరి గంతులు వేయలేదంతే.

అప్పుడు కూడా స్నేహితురాలికి తాను చేసిన మంచికే ప్రతిఫలంగా తనకు మంచి జరిగింది అనుకున్నది భావనా.

“నమ్మకమే కదా జీవితం!”

*******************************************సమాప్తం*********************************************

4 కామెంట్‌లు: