20, జూన్ 2020, శనివారం

మొట్ట మొదటి క్వారంటైన్ క్వార్టర్స్....(ఆసక్తి)
                                     మొట్ట మొదటి క్వారంటైన్ క్వార్టర్స్
                                                              (ఆసక్తి)                   


                                     డుబ్రోవ్నిక్ నగరం క్వారంటైన్ క్వార్టర్స్

వైరస్ అంటువ్యాధి వ్యాపించినప్పుడు సామాజిక దూరం మరియు క్వారంటైన్ అనేవి కొత్త అంశాలు కాదు...మధ్య యుగాలలో, యూరప్ మరియు ఆసియా ఖండాలు ప్లేగు మరియు స్మాల్ పాక్స్ యొక్క ఘోరమైన అంటువ్యాధి వ్యాప్తితో నాశనమైనప్పుడు, వైద్యులకు వైరస్లు మరియు బ్యాక్టీరియా గురించి అంతగా తెలియదు. కానీ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి---వ్యాధి సోకిన వారిని వేరుచేయడానికి వారికి తగినంత తెలుసు.

మొట్ట మొదట క్వారంటైన్ ను ప్రవేశపెట్టినది, దానికోసం మొట్టమొదటి అధికారిక ఉత్తర్వు జారీచేసింది రిపబ్లిక్ ఆఫ్ రాగుసా. అదే ఇప్పుడు దక్షిణ క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్ నగరం. రిపబ్లిక్ ఆఫ్ రాగుసా దేశంలోని అడ్రియాటిక్ తీరంలో ఒక చురుకైన ఓడరేవు ఉంది. ఈ ఓడరేవు ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు మరియు వస్తువులు ఈ దేశంలోకి వస్తాయి. 14 వ శతాబ్దంలో మధ్యధరా మరియు బాల్కన్ దేశాలలో ప్లేగు వ్యాది సంభవించినప్పుడు, గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ రాగుసా ఒక చట్టాన్ని ఆమోదించింది, దీని ప్రకారం ప్లేగు సోకిన ప్రాంతాల నుండి వచ్చే అందరూ, వ్యాపారులు, నావికులు మరియు వస్తువులు క్వారంటైన్ లో ఒక నెల గడపవలసి ఉంటుంది. వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని రుజువైతేనే, క్వారంటైన్ కాలం ముగిసిన తరువాత, వాళ్ళను నగరంలోకి అనుమతించారు.

క్రొయేషియాలోని బాంజే బీచ్ యొక్క ఏరియల్ వ్యూ. ఎడమ వైపున ఉన్న గోడల భవనాలు క్వారంటైన్ క్వార్టర్స్.

అధికారులు మొదట డుబ్రోవ్నిక్ నగరానికి దూరంగా, అంతవరకు ప్రజలే వెళ్ళని మూడు ద్వీపాలను క్వారంటైన్ ప్రదేశాలుగా ఎన్నుకున్నారు -అవి మిర్కాన్, బొబారా మరియు సుపేతార్-ఈ మూడూ డుబ్రోవ్నిక్ గోడల నుండి కొంత దూరంలో ఉన్నాయి. క్వారంటైన్ చేయబడిన వాళ్ళు ఈ మూడు ద్వీపాలలోనే గడపాలి. ఇక్కడ నివసించే గృహాలు లేవు. ఆరుబయట గడపాల్సిందే. తలదాచుకోవటానికి ఒక చెట్టు నీడ గూడా లేదు. ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. అంటువ్యాధి ఎంత ప్రాణాంతకమో, క్వారంటైన్లో ఉన్నవారు అక్కడ ఉండటం అంతకంటే ప్రాణాంతకంగా మారింది. అధికారులు దీనిని గ్రహించి కొన్ని చెక్క నివాసాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 15 వ శతాబ్దం మధ్య నాటికి, క్వారంటైన్ క్వార్టర్స్ కఠినమైన భవనాలుగా మారి సెక్యూరిటీ గార్డులు, సమాధి తవ్వే వాళ్ళూ మరియు కట్టేవాళ్ళూ, ఒక పూజారి, ఒక మంగలి మరియు వైద్యులతో సంక్లిష్టమైన ప్రదేశాలుగా మారినై. తప్పించుకోకుండా ఉండటానికి దాని చుట్టూ ఎత్తైన గోడ కట్టారు.


1397 లో, గ్రేట్ కౌన్సిల్ ఒక కొత్త ఉత్తర్వును జారీ చేసింది, దీని ద్వారా క్వారంటైన్ విధానాలు మరింత వ్యవస్థీకృతమయ్యాయి. క్వారంటైన్ నిబంధనల అమలు మరియు సమ్మతిని పర్యవేక్షించడానికి వారు ముగ్గురు ఆరోగ్య అధికారులను నియమించారు. నిబంధనలను ఉల్లంఘించిన లేదా పాటించని వారికి జైలు శిక్ష విధించబడింది. ఈ ఉత్తర్వు "లాక్ డౌన్" ను కూడా ప్రవేశపెట్టింది-అంటువ్యాధి యొక్క మొత్తం కాలానికి రిపబ్లిక్ లోకి వస్తువులు కూడా ప్రవేశించకుండా నిషేధించారు. 'లాక్ డౌన్’ వలన నగరంలోకి ప్రజలు మరియు వస్తువుల రాక మందగించింది. ఇది నగరం యొక్క జీవనోపాధికి మూలంగా ఉన్న వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ, అంటువ్యాధి నుండి ప్రజలను రక్షించడం తమ నైతిక కర్తవ్యమని అధికారులు భావించారు.

వాస్తవానికి, వెయిటింగ్ పీరియడ్ 30 రోజులు (ట్రెంటైన్) గా నిర్ణయించబడింది. తరువాత, దీనిని 40 రోజులుగా (క్వారంటేనా) పొడిగించారు, తద్వారా “క్వారంటైన్” అనే పదానికి జన్మ వచ్చింది. కొంతమంది పండితులు ఈ కాలాన్ని పెంచాలని సూచించారు. ఎందుకంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి 30 రోజులు సరిపోవు. మరికొందరు 40 వ సంఖ్యకు మతపరమైన ప్రాముఖ్యత ఉందని నమ్మేవారు. దేవుడు భూమిని వరదలతో నింపినప్పుడు, 40 పగలు, 40 రాత్రులు వర్షం కురిసేది. యేసు బాప్టిస్మం తీసుకున్న తరువాత, అతను ఎడారికి వెళ్లి, తినకుండా నలభై రోజులు అడవిలో గడిపాడు.హేతుబద్ధత ఏమైనప్పటికీ, ప్లేగు యొక్క వ్యాప్తిని నిర్వహించడానికి నలభై రోజుల క్వారంటైన్ సమర్థవంతమైన సూత్రమని నిరూపించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం, బుబోనిక్ ప్లేగు సంక్రమణ నుండి మరణం వరకు 37 రోజుల వ్యవధిని కలిగి ఉంది.

ఎన్ని చర్యలు అమలులో ఉన్నప్పటికీ, 1526 లో, డుబ్రోవ్నిక్ నగరం ప్లేగు యొక్క కష్టతరమైన వ్యాప్తికి గురైంది. ఇది ఆరు నెలలు నగరాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. డుబ్రోవ్నిక్ నగరంలోకి ప్లేగు వ్యాపించినందువలన ప్రభత్వాన్ని గ్రజ్నుకు మార్చారు. ఆరు సంవత్సరాల తరువాత, డుబ్రోవ్నిక్ నుండి 600 మీటర్ల దూరంలో ఉన్న 'లోక్రం' అనే ద్వీపంలో పెద్దగా క్వారంటైన్ సౌకర్యాలతో భవనాల నిర్మాణం ప్రారంభమైంది. 1590 లో, డుబ్రోవ్నిక్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లోసీలో మరొక క్వారంటైన్ ప్రదేశం నిర్మించబడింది. అది 1642 లో పూర్తయింది. ఇందులో 10 మల్టీస్టోరీ భవనాలు ఉన్నాయి, వీటిని ప్రాంగణాలతో వేరు చేసి, స్వంత మురుగునీటి వ్యవస్థ, సెక్యూరిటీ గార్డులతో బద్రత పెట్టారు. నగరంలోకి ప్రవేశించిన వస్తువులన్నీ ఎండబెట్టి, ధూపం వేసి, నానబెట్టబడ్డాయి. కానీ వారి అజ్ఞానంలో, ఈ వ్యాధి యొక్క ప్రాధమిక క్యారియర్ అయిన ఈగలు మరియు ఎలుకలపై వారు దృష్టి పెట్టలేదు. నగరంలో సరికొత్త, ఉపయోగించని వస్తువులను మాత్రమే అనుమతించారు. బట్టలు వంటి వస్తువులను ఉపయోగించినప్పుడు, వాటిని వారి యజమానులతో కలిపి లాజరెట్టోలోని క్వారంటైన్ కు తీసుకు వెళ్ళారు. లాజరెట్టో క్వారంటైన్ భవనాల నిర్మాణం తరువాత, ప్లేగు యొక్క సందర్భాలు తీవ్రంగా పడిపోయాయని రగుసన్లు గర్వించారు.

ప్లోసీలోని క్వారంటైన్ భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని ఇప్పుడు వినోదం కోసం ఉపయోగిస్తున్నారు.

Image Credit: To those who took the original photos. ***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి