2, జూన్ 2020, మంగళవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-13




                                          గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                              (PART-13)


మనసు గురించి జరిగిన అన్ని పరిశోధనలూ ప్రధానంగా ఒక్క నిజాన్ని ఒప్పుకుంటున్నాయి. అదేమిటంటే, ఒక మనసు తీవ్రంగా నమ్మే విషయం నిజమైపోతుందనేదే అది! ఎందుకంటే అది అబద్దంగా ఉంటే...నమ్మకంలోని తీవ్రతలో నిజమనే ఆలొచన ఏర్పడుతుంది. దానికి అర్ధం అలా తీసుకోకూడదు.

ఒక వంద శాతం అబద్దాన్ని ఏ మనసూ నిజమని నమ్మటంలేదు. రామాయణం కూడా...రాముడు అవతార పురుషుడు అనేది కూడా...పురాణ కల్పనే! అది నిజం అయ్యో చాన్సే లేదు అని కొందరు చెప్పినా... రాముడు అవతార పురుషుడే, అందులో కొంచం కూడా అనుమానమే లేదు అని ఒప్పుకునే వాళ్ళు ఎక్కువ.

వాళ్ళళ్ళో ఒకరు బద్రాచల రామదాసు. ఆ నమ్మకం కారణంగానే ఆయన, ప్రభుత్వ పన్ను డబ్బు తీసి రాముడికి గుడి కూడా కట్టిస్తాడు. అందువలన రామదాసును రాజు దండించి జైలులో పెడతాడు. రామదాసో రాముడు తనని కాపాడతాడని నమ్ముతాడు. అదేలాగానే జరిగింది కూడా. రాముడే నేరుగా వచ్చి పన్ను డబ్బును రాజుకు చెల్లించి రామదాసును విడిపిస్తాడు.

వచ్చింది రాముడేనని రాజు తెలుసుకున్నప్పుడు రామదాసు యొక్క నమ్మకానికి ఉన్న బలం ఎటువంటిదో తెలిసింది. నమ్మకం ఇలాంటి సాహసాలను జరిపి చూపించింది!

గాలిపేట వీధిలోపలకు వీరబద్రం కారు వెళ్ళిన వెంటనే...వీధి మొత్తం మళ్ళీ ఆశ్చర్యంగా చూసింది. వెళ్ళే దోవలోనే ఉంది సర్పంచ్ ఇల్లు. ఆయన వాకిట్లో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నారు. వీరబద్రం కారును ఆశ్చర్యంగా చూశారు ఆయన.

"బద్రం! అక్కడ నిలబడి మనల్ని చూస్తున్నాడే అతనే ఈ ఉరి సర్పంచ్..." ---చెప్పాడు కార్తిక్.

"ఓ...అతనేనా? నిన్ను పాము కాటేసిందని మీ అమ్మా-నాన్నకు టెలిగ్రాం కంటే వేగంగా చెప్పింది!” అడుగుతూ వీరబద్రం కారును ఆయనకు దగ్గరగా తీసుకు వెళ్ళి ఆపాడు.

"ఎందుకురా కారాపావు?"

"దిగు...ఆయన దగ్గర రెండు నిమిషాలు మాట్లాడాలి"

"ఆయనతో మాట్లాడటానికి ఏముందిరా?"

"అది మాట్లాడేటప్పుడు విని తెలుసుకో"---- వీరబద్రం కారు దిగి నవ్వుతూ ఆయన ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఆయన కూడా సమాధానంగా ఆశ్చర్యంగా చూశారు

"మీరేనా సర్పంచ్?"

"అవును..."

"ఊర్లో ఏది జరిగినా వెంటనే అది మీకు తెలిసిపోతుందనుకుంటా?"

"బద్రం...కొంచం ఆగరా. క్షమించండి సర్పంచ్ గారూ? అతను నా స్నేహితుడు. తప్పుగా తీసుకోకండి"---మధ్యలో దూరి కార్తిక్ మాట మార్చాడు.

"లోపలకు రా తమ్ముడూ..."---సర్పంచ్ వాళ్ళిద్దర్నీ లోపలకు పిలిచాడు.

"పరవాలేదు...చలా పనుంది. ఇంకో సందర్భంలో వస్తాము"

"ఇంకో సందర్భంలోనా!?...వస్తారా...?"

"ఎందుకలా అడుగుతున్నారు?"

"మీ బామ్మ ఇంటి దస్తావేజులను గాలిదేవుడికి అప్పగించినట్లున్నారుగా"

"ఆ...అవును!"

"అరే...ఇంతలోనే ఆ విషయం మీకు తెలిసిపోయిందా?"

"బద్రం...ఆయన సర్పంచ్! ఆయనకు అన్ని విషయాలూ తెలిసుండాలి. అది తెలుసుకో"

"అది నేనూ కాదనటం లేదు. కానీ, జరిగి ఐదు నిమిషాలు కూడా కాలేదు. అంతలోపలే తెలిసిపోయిందే అని ఆశ్చర్యపడుతున్నా"

"ఈ ఊరు మీ నగరంలాగా పెద్దదా ఏమిటి? మొత్తం ఆరేడు వీధులే. అందువలనే ఏది జరిగినా నాకు తెలిసిపోతుంది"---అంటూ సర్పంచ్ సరిపుచ్చాడు.

సర్పంచ్ పెద్ద మనిషిలాగానే ఉన్నాడు. ఇకపోతే చూడటానికి నటుడు లాగా మంచి 'మేకప్' లో...శరీరమంతా సెంటు వాసనతో గుమగుమ లాడుతోంది.

మెడలో బంగారు గొలుసు. పనిమనిషి ఇల్లు తుడుస్తోంది. వయసులో ఉన్న మహిళ! తుడుస్తున్నప్పుడు సర్పంచ్ ఆమెను చూసే విధం కొంటె చూపు.

వీరబద్రం అతన్ని ఒక మదన కామరాజులాగా చూసాడు.

"కూర్చోండి! ఏం తింటారు?"---అంటూ ఉపసరణ చేయటం మొదలుపెట్టాడు సర్పంచ్.

"ఏమీ వద్దండీ...టైమవుతోంది"

"అదంతా కుదరదు...ఇక మీదట ఈ గ్రామం వైపు మీరు రాబోయేది లేదే! కాబట్టి ఈ రోజు మా ఇంట్లో ఉండి భోజనం చేసే వెళ్ళాలి" అని ఒత్తిడి చేసాడు.

"వాళ్ళు రాబోయేది లేదా?...ఎవరు చెప్పింది?"--- వీరబద్రం గబుక్కున అడిగాడు.

"గాలిదేవుడు అంతగా దండిచిన తరువాత కూడా ఎవరికి ఈ ఊరు రావాలనిపిస్తుంది? దస్తావేజులు మాత్రమే ఇవ్వ వలసి ఉంది. దాన్ని అప్పగించారు. ఇంకేమిటి పని?"

"ఇక మీదటే పని! ఇప్పుడు ఏ నేర భావమూ లేకుండా ధైర్యంగా రావచ్చు" అన్న వీరబద్రాన్ని కొంచం బెదురుగా చూసాడు సర్పంచ్.

అప్పుడు సర్పంచ్ ఎదుటికి...ఒకడు మేడ నుండి దిగి వచ్చాడు.

చూడటానికి గంభీరంగా ఉన్నాడు. జీన్స్ ప్యాంటు, టీ షర్టూ--అంటూ అత్యంత నాగరీకంగా ఉన్నాడు.

"మామయ్యా...నేను హైదరాబాద్ వెళ్ళి టికెట్టు బుక్ చేసుకుని వస్తా. విజయవాడ నుండి హైదరాబాద్ కు డైరెక్ట్ విమానం ఉన్నదా తెలియదు--ఇప్పుడే ఇంటర్ నెట్ లో చూసాను. హైదరాబాద్ నుండి తాయ్ లాండ్ కు చాలా విమానాలున్నాయి. మనం అలాగే వెళ్ళిపోదాం"

ఆ మాట విని సర్పంచ్ కొంచం కంగుతిన్న వాడిలాగా అయిపోయాడు.

"సరి...సరి...నువ్వు బయలుదేరు” ---అంటూ అతన్ని వేగంగా తరమటానికి ప్రయత్నం చేసాడు. అతనూ వెళ్ళిపోయాడు.

అతని మీద కూడా సెంటు స్ప్రే వాసన వస్తోంది. కార్తిక్ అతన్ని ఆశ్చర్యంగా చూసాడు.

"వీడు నా బావ మరిది. నా భార్య యొక్క చివరి తమ్ముడు. విదేశాల నుండి ఇప్పుడే వచ్చాడు. వీడు బయటి దేశాలకు వెళ్ళి రావటం సర్వ సాధారణం" అంటూ దొంగ నవ్వుతో సవరించాడు.

"అక్కడ ఏం పని చేస్తున్నాడు?"

"అక్కడ...అక్కడ...ఆ! ఈ ఎక్స్ పొర్ట్ - ఇం పొర్ట్.."

"ఏం ఎక్స్ పోర్టు చేస్తాడు...ఏం దిగుమతి చేస్తాడు"

"అవన్నీ నాకు తెలియదు! నేను అవన్నీ అడగను. నాకు ఈ ఊరి పనే పెద్ద తలకాయి నొప్పిగా ఉందే?"

“కానీ, ఇంత పనిలోనూ మధ్య మధ్య విదేశాలకు వెళ్ళి వస్తున్నారనుకుంటా..."

"నేనా...బయటి దేశాలకా?"

"మీరే! మీరు తాయ్ లాండుకు వెళ్ళి రావటానికి టికెట్టు బుక్ చేస్తానని మీ బావమరిది చెప్పాడు కదా"

----- వీరబద్రం అలా అడుగుతాడని సర్పంచ్ అనుకోలేదు.

"ఆ...అవును...అవును! చాలా రోజుల నుంచి నన్ను పిలుస్తున్నాడు. సరే...ఒకసారి వెళ్ళి ఊరు చూసొద్దామని అనుకుని..." ఆయన దొంగ నవ్వును కొనసాగించాడు.

మధ్యలో 'కూల్ డ్రింక్స్’ వచ్చినై. ఖరీదైన గాజు గ్లాసు కప్పుల్లో ఇచ్చింది ఇంటి పనిమనిషి.

ఒక కప్పు యొక్క ఖరీదు ఐదువేలు ఉంటుంది!

వీరబద్రం మనసులో పురుగులు ఎగరటం మొదలయ్యింది. పళ్లరసం తాగుతుంటే కొత్త రుచి.

"ఎలా ఉంది? జనీవా ద్రాక్ష రసం" అన్నాడు సర్పంచ్.

గాలిపేటలో జనీవా ద్రాక్ష!

ఎక్కడెక్కడో కొట్టుకుంది వీరబద్రానికి.

జ్యూస్ తాగి ముగించి లేచారు.

"గాలిదేవుడ్ని బాగా ప్రార్ధించుకున్నారా?"

"అవును సర్పంచ్ గారూ...!"

“కొంచం ఉగ్రమైన దైవం. మీ దగ్గర దస్తావేజులు తీసుకోవటానికే కొంచం బెదిరించింది. ఇక జాగ్రత్తగా ఉండండి"

"ఖచ్చితంగా...!"

"జాగ్రత్తగా వెళ్ళి రండి"

సాగనంపాడు సర్పంచ్.

                                                                                                            (ఇంకా ఉంది) ************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి