శతమానం భవతి…(సీరియల్) (PART-7)
నాగ్పూర్ ఆఫీసులో తనకు బాగా పరిచయమున్న ఆనంద్ ను కలిశాడు కైలాష్.
పుస్తకం చూపించి "ఇది మళయాలం పత్రికేనా" అడిగాడు.
"నాకు అంతగా తెలియటం లేదు. అకౌంట్స్ లో యేసుదాస్ ఉన్నాడుగా. అతన్ని అడుగుదాం"
ఇద్దరూ అకౌంట్స్ లో పనిచేస్తున్న యేసుదాస్ ను కలిశారు.
పత్రిక చూపించి కవర్ పేజి పైనున్న ఫోటో గురించి ఏమి రాసుంది అని అడిగాడు కైలాష్.
*******************************************************
మానస డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న రోజులు.
మానస తన స్నేహితులతో కలిసి కాలేజీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న దారిలో మార్కెట్ రోడ్డులో ఒక కుర్రాడు, ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు.
నడుస్తున్న మానస ఆగి వాళ్ళవైపు చూసింది. రోడ్డు మీదున్న మనుష్యులను పట్టించుకోకుండా ఆ అమ్మాయి పమిట చెంగు పట్టుకుని లాగాడు. ఆ ఆమ్మాయి ఏడుస్తూ తన గుండెలకు రెండు చేతులూ అడ్డుపెట్టుకుంది. ఆ సంఘటనను చూసిన మానస మనసు గిలగిలా కొట్టుకుంది.
వేగంగా అతని దగ్గరకు వెళ్ళింది. చెప్పు తీసుకుని అతని చెంపలపై గట్టిగా నాలుగు దెబ్బలు వేసింది.అతని చేతిలో ఉన్న పమిట చెంగును లాక్కుని ఆ ఆమ్మాయికి ఇచ్చింది.
"ఏరా, ఆడపిల్లలంటే నీకు అంత చౌక అయిపోయారా, నడిరోడ్డు మీద ఆ అమ్మాయిని వివస్త్రను చేయటానికి ప్రయత్నిస్తున్నావు. ఆ అమ్మాయికి ఎవరూ లేరనా....మేమున్నామురా. సహ ఆడపిల్లలం మేమున్నాము. ఇక ఆడపిల్లలను వక్ర బుద్దితో చూసే మగ వారి పని పడతాం" అని మానస అంటుండగా అక్కడికి ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది. విషయం తెలుసుకుంది.
ఒక కంప్లైంట్ రాసిస్తే అతన్ని ఖైదు చేస్తామని పోలీస్ ఇన్స్ పెక్టర్ చెప్పాడు మానసతో. అవమానపడ్డ ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వటానికి వెనకాడుతుంటే “సార్. ఆ అమ్మయి ఎందుకో భయపడుతోంది. మీరు వెళ్ళండి సార్. సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లి తండ్రులతో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చేటట్టు నేను చేస్తా" పోలీసులతో చెప్పింది మానస.
అక్కడితో అందరూ వెళ్ళిపోయారు. మానస తన ఇంటికి వెళ్ళింది.
కాళ్ళు చేతులు కడుక్కుని తల్లితో ఇప్పుడే వస్తానని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఇంటికి తాళం వేసుంది. పక్కంటి వాళ్ళను అడిగింది.
"ఇప్పుడే అందరూ కలిసి ఊరు వెళ్ళారు"
"ఏ ఊరు వెళ్ళారూ?”
"తెలియదు"
మొదటిసారిగా మానస మనసులో ఎదో తెలియని అలజడి చోటు చేసుకుంది.
నీరసంగా ఇంటికి తిరిగి వెళ్ళింది మానస.
*************************************
అప్పుడు ఆ గుంపు అక్కడికి వచ్చింది.
"రేయ్...జగపతీ! బయటకు రారా...బయటకు రా" అని అరిచారు.
వాళ్ళు అరిచిన అరుపులకు చుట్టు పక్కనున్న ఇళ్ళ వాళ్ళందరూ బయటకు వచ్చారు.
‘వాకిట్లో నిలబడి ఎవరు ఇంత అధికారంగా అరుస్తున్నారు? అందులోనూ నాన్న పేరు పెట్టి...’..... తన గదిలో కూర్చుని పోలీసు కంప్లైంట్ రెడీ చేస్తున్న మానస రాయటం ఆపింది.
మానస తండ్రి జగపతి అప్పుడే ఆఫీసు నుండి వచ్చి కాళ్ళు-చేతులు కడుక్కుంటున్నాడు. మానస తల్లి పొయ్యి మీద పాలు కాచుతోంది. బయట నుండి వినబడ్డ అరుపులు వాళ్లందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది.
కంగారు, కంగారుగా ముఖాన్ని తుడుచుకుంటూ బయటకు వచ్చాడు జగపతి.
తండ్రి బయటకు రావటానికి ముందే మానస కిటికీ తలుపులు తెరిచి వాకిటి వైపు చూసింది. చీకటి పడుతున్న సమయం, ఇంటి ముందున్న వీధి లైట్ వెలుతురులో నలుగురైదుగురు మనుష్యులు లుంగీలు పైకి మడిచి కట్టుకుని నిలబడున్నారు.
జగపతి ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ గుమాస్తా. ఆయన్ని అందరు చాలా మర్యాదతో 'సార్.... సార్’ అని పిలుస్తారు.
మొదటి సారిగా వాళ్ళు 'రేయ్ ...జగపతీ' అని పిలవటం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది.
గేటు తీసుకుని బయటకు వచ్చిన జగపతికి, వారిని చూసిన వెంటనే గుర్తుకు వచ్చింది, వాళ్ళు వెనక వీధి మనుష్యులని.
"ఏమిటి? ఎందుకొచ్చారు?...ఏదైనా అడగటానికి వచ్చున్నా...ఇలాగేనా మర్యాద లేకుండానా పిలిచేది" అడిగాడు మానస తండ్రి జగపతి.
అప్పుడే అక్కడకు వచ్చిన మానస తల్లి కూడా "ఎవరు మీరు...ఏం కావాలి మీకు?"
అని అడిగింది.
"రేయ్ జగపతీ...ఎమనుకుంటోందిరా మీ అమ్మాయి? తానొక జాన్సీ లక్ష్మీ బాయ్ అనో లేక ప్రతిఘటన విజయశాంతి అనో అనుకుంటోందా...?"
కడుపులో కత్తి దిగినట్లైంది అందరికి.
నలుగురైదుగురు మనుష్యులు వచ్చి, వయసుకు వచ్చిన కూతురు గురించి అలా మాట్లాడితే ఆ కుటుంబంలోని వారికి మరి ఇంకెలా ఉంటుంది?
"ఏమిటయ్యా…ఎవరి గురించి మాట్లాడుతున్నారు?"
కంగారుగా అడిగాడు జగపతి.
“ఎవరి గురించా? నీ కూతురు మానస గురించే మాట్లాడుతున్నాము....దాని మనసులో...అది పెద్ద...."
అంటూ బూతులు తిడుతూ కూతురు గురించి నానా మాటలూ మాట్లాడుతుంటే జగపతికి కళ్ళు బైర్లు కమ్మాయి.
మానస తల్లి చెవులు మూసుకుంటూ గొడకు చతికిల పడి కూర్చుంది.
కిటికీలో నుంచి ఇదంతా చూస్తున్న మానస నిలబడలేక కిటికీ చువ్వలు గట్టిగా పట్టుకుని తమాయించుకుంది.
"ఆపండయ్యా...ఆపండి. ఏక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మర్యాదగా మాట్లాడండి?"
“మర్యాదగా మాట్లాడాలా? మీ అమ్మాయి చేసిన ఘన కార్యానికి పూల మాల వేసి మర్యాద చెయ్యాలా? ఎంత ధైర్యం? మా ఇంటి అబ్బాయిని పట్టుకుని అందరి ముందూ చెప్పు తీసుకుని చెంప మీద కొట్టింది కాక పోలీసులకు కంప్లంట్ చేస్తుందా?”
మానసకు అర్ధమయ్యింది. సాయంత్రం కాలేజీ నుండి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన. తాను చేయి చేసుకున్న అబ్బాయి తాలూకు మనుష్యులు.
"ఏమిటయ్యా చెబుతున్నారు? మీ ఇంటి అబ్బాయిని...కొట్టటం...పోలీసు కంప్లైంటు అంటున్నారు?"
“అవునహే! చెబుతూంటే అర్ధం కావటం లేదా నీ మట్టి బుర్రకు…మా ఇంటి అబ్బాయినే కొట్టింది, కంప్లైంట్ కూడా రాసిస్తుందట...మా గురించి తెలిసుండి కూడా అలా చేస్తోందంటే...దానికి ఎంత ధైర్యం? మమ్మల్ని ఎదిరించి ఈ ఊర్లో బ్రతుకుదామనే?" అంటూ ఆ గుంపులోని ముగ్గురు జగపతి మీదకు వస్తుంటే అక్కడ గుమికూడిన కొంతమంది పెద్దలు వాళ్ళను అడ్డుకున్నారు.
“జగపతి గారు ఒట్టి అమాయకుడయ్యా...ఆయనకేమీ తెలిసుండదు. మేము అయనకు అన్ని విషయాలు చెప్పి తగిన చర్యలు తీసుకుంటాము. మీరు వెళ్ళండి”
"విషయం మా రుద్రయ్య అయ్యగారికి ఇంకా తెలియదు...మాతో పెట్టుకోవద్దు అని గట్టిగా చెప్పండి" అంటూ విసురుగా చెప్పి అక్కడి నుండి కదిలారు.
కమ్ముకున్న యుద్ద వాతావరణం, అలుముకున్న సారా వాసన తగ్గింది.
"జగపతి గారూ, మిమ్మల్ని చూస్తుంటేనే అర్ధమవుతోంది మీరు చాలా ఆందోళనలో ఉన్నారని. విషయం పెద్దదైనా రుద్రయ్య మనుష్యులు ఎందుకనో విపరీత ధోరణి చూపించలేదు. కాబట్టి విషయాన్ని వెంటనే చక్క బరుచుకోవచ్చు. మీరేమీ కంగారు పడకండి...మేము ఒక గంట అగి వస్తాము. అప్పుడు మాటాడదాం" అని చెప్పి వెళ్ళిపోయారు.
జగపతి లోపలకు వచ్చాడు. ఆయనలొ వణుకు ఇంకా తగ్గలేదు. ముఖమంతా చెమట. కుర్చీలో పడిపోయాడు.
"ఏమిటండి ఇది" వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ భర్తను అడిగింది.
మానసకు అర్ధమయ్యింది. కొద్ది సేపటి క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
Continued.....PART-8
ఇవి కూడా చదవండి:
అతడు కాలంలో ప్రయాణించాడా?(మిస్టరీ)
ఫేస్ మాస్కుతో భూమిని దాటబోతున్న ఉల్క!(ఆసక్తి)
********************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి